నా జీవిత యాత్ర-3/బ్రిటిష్ పథకానికి ప్రతి పథకం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

5

బ్రిటిష్ పథకానికి ప్రతి పథకం

సైమన్ కమిషన్ వారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పర్యటించిన ఆ 1928లోనే, మార్టిన్‌జోన్స్, పి. ష్రాప్ అనే బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు మన దేశాన్ని చూడ్డానికి వచ్చారు. వారు మమ్మల్ని కేంద్ర శాసన సభలో కలిసినప్పుడు, మేము శాసన సభా సభ్యులుగానూ, శాసన సభలోనూ చేస్తూన్న పనిని గురించి అడిగారు. వారికి మేము ఎల్లా నిరంకుశంగా శాసన సభా వ్యవహారాలు నడిపించబడుతున్నదీ, భారతీయుల దనం ఏ విధంగా నిరంకుశంగా దుర్వినియోగం అవుతూ ఉన్నదీ వివరించి చెప్పాము. వారు మాకు సన్నిహితులయిన మిత్రులుగానే వ్యవహరించారు. మా పరిస్థితికి విచారాన్ని వెలిబుచ్చారు. జబర్దస్తీగా వారి పెద్దలు, మా కోరికలకు విరుద్ధంగా, ఎల్లా ఆ సైమన్ కమిషన్ వారిని మా నెత్తి కెక్కించారో చెప్పి వాపోయారు.

ఇండియాకి సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఉంటూన్న సర్ శామ్యూల్ హోర్ ఇంగ్లాండునుంచి డిల్లీకి విమానంలో వచ్చిన సందర్భంలో ఆయన శాసన సభని చూడడానికి వచ్చాడు. ఆయన "మూర్తి" గాని, "శక్తి" గాని మమ్మల్ని యే విధంగానూ ఆకర్షించలేదు. ఆయనది తీవ్రమయిన క్రూరదృష్టి. ఆయన మాటాడిన ఆ రెండూ ముక్కలూ, ఆయన ఈ దేశానికి ఉపకారికాడు అన్న విషయం మాకు స్పష్టం చేశాయి.

నూతన పథకాన్వేషణ

సైమన్ కమిషన్‌ని బహిష్కరించవలసిందని ప్రబోధం చేస్తూ, మేమందరమూ కలిసి యోచించి బ్రిటిషువారికి, వారి రాజ్యాంగ పథకానికి ప్రతిగా, మా పథకాన్ని అందచెయ్య దలచాం. బహిష్కరణ కార్యక్రమం నడుస్తూ ఉండగానే, బ్రిటన్‌కీ, ప్రపంచానికీ కూడా విస్మయం గొలిపేదిగా ఉండే పథకాన్ని అఖిల పక్షాల వారికీ ఆమోదయోగ్యంగా తయారుచేసి అందచేద్దా మనుకున్నాం.

అసలు కాంగ్రెసు నాయకులు యావత్తు భారతజాతికి అంగీకారయోగ్యంగా ఉండే విధంగా అడపా తడపా ఒక రాజ్యాంగ పథకాన్నో, పద్ధతినో రూపొందిస్తూ ఉండవలసింది. నేను కేంద్ర శాసన సభలో పని లేనప్పుడల్లా హిందూ మహమ్మదీయ కలహాలు జరిగిన తావులకు వెళ్ళివస్తూ, అఖిలపక్ష సమావేశాలకీ, అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులకీ హాజరవుతూ, ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తూ నా కాలాన్నీ, ధనాన్ని వినియోగపరచే వాడిని. ఆ అఖిలపక్ష సమావేశాలలోనూ, కాంగ్రెసు కమిటీ మీటింగులలోనూ సుదీర్ఘమయిన చర్చలు జరుగుతూ ఉండేవి.

మహాసభలు 1885 నుంచీ జరుగుతూనే ఉన్నాయి. సహకార నిరాకరణ ఉద్యమం ధర్మమా అని దేశం అంతా క్రమశిక్షణతో కూడిన విధానానికి అలవాటుపడుతూ ఉంది. గాంధీగారి కాంగ్రెసూ, స్వరాజ్య పార్టీ, రాష్ట్ర శాసన సభలలోని కాంగ్రెసు పార్టీలూ సరిఅయిన క్రమ శిక్షణకు అలవాటు పడ్డవి. ఈ విషయాలన్నీ అసెంబ్లీలో ఉన్న కాంగ్రెసేతర పార్టీలన్నీ గుర్తించే ఉన్నవి. ఆంగ్లేయ రాజ్యతంత్రజ్ఞులూ, ప్రపంచ రాజకీయవేత్తలూ ఈ దేశంలో జరుగుతూన్న మార్పులూ, కాంగ్రెసు సాధిస్తూన్న ఘనవిజయాలు గమనిస్తూ ఉన్నారు.కాంగ్రెసువారినీ, వారి శక్రి సామర్థ్యాలనూ, భారతీయుల రాజకీయ చైతన్యాన్నీ యావత్తు ప్రపంచమూ గుర్తించి ఉంది. అయినప్పటికీ, కాంగ్రెసు నాయకులూ, తక్కిన పెద్దలూ కూడా - కాలాన్ని అనవసర తర్క వితర్కాలతో వృథా పుచ్చుతూ కార్యసాధనకు పూనుకోకుండా, దేశంలో ఏ పథకమూ ఆమోదింప జేయలేని స్థితిలో ఉన్నారు. నాయకులలో పరస్పర సహకారం లోపించే ఉంది. బ్రిటిషు పార్లమెంటరీ విధానమూ, వారిలో వారికి (పార్టీ విభేధా లుంటూ ఉన్నా) గల సహనభావమూ మనకింకా అవగాహన కాలేదు.

అఖిల పక్ష సమావేశాలు

కొన్ని కొన్ని అఖిల పక్ష సమావేశాలు ఆరంభమయిన వెంటనే అవతరించే హంసపాదులతోనే అంతమయ్యేవి. ఒకసారి ఆ సమావేశం అధ్యక్షుడుగా ఎవరు ఎన్నుకోబడాలి అన్న విషయం తేలక అది ఆగే పోయింది. ఏది ఎల్లా ఉన్నా, ఆ ఒక్క సంగతి మాత్రం ఒప్పుకుతీరాలి. కాంగ్రెసు నాయకులూ, కార్య నిర్వాహకులూ, ఎట్టి విభేదాలు వచ్చినా, చివరికి ఒక నిర్ణయానికి రావడమూ, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడమూ జరిగేది.

1928 ఫిబ్రవరి - మార్చి నెలలలో జరిగిన అఖిల పక్ష సమావేశాలన్నీ ముక్కాలు మువ్వీసం డిల్లీలోనే జరిగాయి. అప్పట్లో అసెంబ్లీ నడుస్తూన్న కారణంగా ఈ సమావేశాలు చులాగ్గా జరగడానికి డిల్లీలోనే అనుకూల వాతావరణం ఉండేది. అందువల్ల కౌన్సిల్ ఆఫ్ స్టేట్ వారికీ, కేంద్ర శాసన సభ్యులకూ ఏ విధమయిన చిక్కులూ, చికాకులూ ఉండేవికావు. దినాలకొద్దీ సమావేశాలూ సాగినా, అందరూ అక్కడే ఉంటూ ఉండడాన్ని ఆర్థికంగా కూడా అధిక వ్యయాలు అయ్యేవికాదు. ఒక్క సమావేశం వరసగా ముప్పయిసార్లు జరిగిందంటే, అందులో ఎవరికీ విపరీతం ఏమీ కనిపించలేదు; అధిక వ్యయ ప్రయాసలనీ అనిపించలేదు.

మితవాద పథకం

అల్లా జరిగిన ఒక అఖిల పక్ష సమావేశానికి (1928, మే 19) డా॥ అన్సారీ అధ్యక్షత వహించాడు. అప్పుడు అఖిల పక్షాలవారికీ అంగీకార యోగ్యమయిన రాజ్యాంగ పథకాన్ని రచించడానికి (పండిత మోతీలాల్ అధ్యక్షతను) ఒక ఉప సంఘం యేర్పరచబడింది. ఆ కాన్ఫరెన్సులో ఈ దిగువ అంశాలు అంగీకరించబడ్డాయి: 1. బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపించబడాలి; 2. హిందూ మహమ్మదీయ ఐక్యం సుస్థిరం కావాలి; 3. జాతి మతాల రీత్యా ఎవరెవరికి ఎన్నెన్ని స్థానాలు ఉండాలో నిర్ణయం జరగాలి.

పై విషయాలను గమనిస్తూ వాటికి అనుగుణంగా రాజ్య తంత్రం రచించడానికి కేంద్రీకరించబడిన నాయకుల శక్తులన్నీ ఫలోన్ముఖం కాకుండా ఉంటాయా? ఈ ఉప సంఘంవారు తయారుచేసిన ఆ మోతీలాల్ నెహ్రూ రిపోర్టు అన్నది అన్ని కమిటీలవారూ దాని మంచిచెడ్డలు విచారించి అంగీకరించాలనే నిబంధనే గనుక లేకుండా ఉంటే చాలా దివ్యంగా ఉండేది.

ఈ రోజులలో శ్రీనివాసయ్యంగారు యూరపులో పర్యటిస్తున్నారు. ఆయన దేశ పర్యటన ఒక దుర్ముహూర్తాన ఆరంభించారన వలసి ఉంటుంది. ఆ ఫిబ్రవరి, మార్చి రోజులలోనే సైమన్ కమిషన్ వారు బహిష్కరణ భాగ్యాలనందుకుంటూ దేశంలో పర్యటిస్తున్నారు. అదే సమయంలోనే మేము నూతన రాజ్యాంగ పథకాన్ని రచించాలని పూనుకున్నాము.

అలా తయారయిన ఆ పథకం, హిందూ మహమ్మదీయు లుభయుల చేతనూ ఆమోదింపబడిన కారణంగా, ఆంగ్లేయులచేత తిరస్కరించబడడానికి అవకాశం లేనిదిగా రూపొందించబడింది. ఇది మా ఆశయం అంటూ మదరాసు కాంగ్రెస్ బహిరంగ సమావేశం (1927 డిసెంబరు)లో ఆమోదించబడిన "స్వాతంత్ర్య" తీర్మానం మాట ఎత్తుకోకుండా, ఆంగ్లేయులను ఒప్పించగలమనే ఆశతో ఒక నూతన పథకాన్ని మితవాద రాజకీయ పద్దతిగా రూపొందించారు.

చేవ చెడిన కలకత్తా తీర్మానం

మదరాసు కాంగ్రెస్, భారతీయుల పేరుమీద - భారతదేశ ప్రజల కోసం ఆ 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని అంగీకరించి ఉంది. న్యాయానికి మన నాయకులు ఆ తీర్మానానికి భిన్నంగా, దాని శక్తిని సన్నగిల్లచేస్తూ, దానిని కొంతవరకూ నిర్వీర్యంచేస్తూ, 1928 డిసెంబరులో కలకత్తా కాంగ్రెస్‌లో చేసిన మార్పే చాలా నికృష్టమయింది.

ఇటువంటి క్లిష్ట సమయంలో నాయకుల మన: ప్రవృత్తిని అర్థంచేసుకోవడం కష్టమే. ఇదివరలోనే చెప్పానుగా, ఆంగ్లేయులకు వియ్యానికీ కయ్యానికీ కూడా ఒకే ఫాయ వారు కావాలనీ, వారికి బలహీనులయిన మనుష్యులను చూస్తే చికాకనీను?

చెన్నపట్నపు 'స్వాతంత్ర్య' తీర్మానాన్నే కలకత్తాలో మన నాయకులు బలపరచి ఉండిఉంటే, సైమన్ కమిషన్‌వారు వారి రిపోర్టులో విధిగా 'ప్రొవిన్షియల్ ఆటోనమీ'ని గురించీ, కేంద్రంలో కూడా ఇంకా ఎక్కువ భాధ్యతాయుతంగా పరిపాలనా యంత్రాన్ని నడిపించే విధానాన్ని గురించీ తప్పక ప్రస్తావించి, దేశీయుల కోర్కెను మన్నించేవారు. ఎప్పుడయితే మనలో స్థిరత్వం లేకపోయిందో, అప్పుడే వారు, ప్రపంచ చరిత్రకే విరుద్ధంగా, సంకరపు సంధి సూత్రాలతో దేశాన్ని అల్లా నగుబాటు పాలుచేశారు. వారు ఎప్పుడయితే మన నాయకుల బలహీనతను గ్రహించారో, అప్పుడే బిర్రబిగుసుకుపోయి, 1928 లో కలకత్తాలో కాంగ్రెసువారు సూచించిన ఆ మధ్యే మార్గపు సూచనను నలిపి పారేశారు.

ఈ బలహీనతే మోతీలాల్‌నెహ్రూగారి కాంగ్రెస్ అధ్యక్షోపన్యాసంలో కూడ వ్యక్తం అయింది. ఆ ఉపన్యాసంలో "మా పరమావధి స్వాతంత్ర్యమే కాని, దాని రూప రేఖలు కాలాను గుణంగానూ, పరి స్థితులనుబట్టీ మారవచ్చు"నన్నారు. అంతేకాదు - అఖిల పక్ష సమావేశం వారి ప్రతిపాదనలను వ్యక్తంచేస్తూ, "ఇవి మా కోరికలు. ప్రభుత్వం వారు మా కోరికలను మన్నించి, దేశానికి రాజ్యాంగరీత్యా యివ్వగలిగినంత సహకారమూ ఇవ్వా"లని కోరారు.

జిన్నా కప్పదాటు

ఇది కేవలం 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని పూర్తిగా తిరగ దోడుకుని క్షమార్పణ చెప్పుకున్నట్లే అయింది. అప్పట్లో ఆయనకున్న వ్యాకుల చిత్తంతో, అంతకంటే ఎక్కువగా దేశానికి ఆయన యేమీ కోరలేకపోయాడు. ఆఖరి ఘట్టాలలో తీసుకురాబడిన అభ్యంతరాలతో అధ్యక్షుడుగా ఆయన తయారుచేసిన ఆ నెహ్రూ కమిటీ రిపోర్టు గాలికి కొట్టుకుపోయింది.

అప్పటివరకూ అన్యదేశాలలో పర్యటిస్తూన్న జిన్నా సాహెబుగారు ఆ సమయానికి పర్యటన పూర్తి చేసుకుని రావడాన్ని, ఆ నెహ్రూ కమిటీ ప్రతిపాదనలకు అడ్డుపడ్డాడు. కీ॥ శే॥ మహమ్మదాలీగారు ఆ రిపోర్టులో ఎన్నో సవరణలూ, మార్పులూ, కూర్పులూ, చేర్పులూ చేశారు. కాని జిన్నాగారు మాత్రం సభలో అది నడవడానికి నిర్ణీత అవసరమైన సంఖ్యగా సభ్యులు సరిపడ్డంతమంది లేరంటూ దాటేశాడు.

ఆరంభంలో ఎంతో ధీమాగానూ, శక్తిమంతంగానూ పనిచేసిన ఆ అఖిల పక్ష సమావేశం క్రమేణ దిగజారిపోయి, భిన్నాభిప్రాయాలతో చీలికలయిపోయింది, ఆ ఆఖరు ఘడియలలో అచ్చట ఉన్న మాలో చాలా మందికి వారి వారి భావాలు, ఆ నెహ్రూ రిపోర్టును సాంతంగా 'నీట' ముంచుదామనే ఆతురతతో వున్నట్లు కనిపించాయి. ఒక్క సంవత్సరం పాటు ఆ రిపోర్టును ఇట్టి సంధిగ్ధస్థితిలో ఉంచడానికి, మౌలానా మహమ్మదాలీ, జిన్నా, ఆగాఖాను కూడా బాధ్యులేనని అనక తప్పదు.

కాంగ్రెసు పార్టీలకు తాకీదు

ఆ ఏడాదిలో మాకు కలిగిన అపజయాలకు ముఖ్య కారణం కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కాంగ్రెసువారిలో, తమ లోటుపాట్లు వల్ల ఏకీభావం సన్నగిల్లి పోవడం. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలలో కూడా ఒకే మాట మీదా, ఒకే త్రాటిమీదా ఉందామన్న భావం సన్నగిల్లి పోయింది. అల్లా వారిలో వారికి భేదాభిప్రాయాలు ఉత్పన్నం అవడానికి కారణం నోఛేంజర్లుగానూ, ప్రోఛేంజర్లగానూ కాంగ్రెసువారు రెండు పార్టీలుగా చీలిపోవడమే.

వారు నిజంగా కలిసేవుండి సహనభావంతో వ్యవహరించి ఉండి ఉంటే దేశంయొక్క శక్తి బాగా వృద్దయి, పల్లె పల్లెలలోను కాంగ్రెసువారి ప్రభావం పెరిగి, ఊరూరా వారికి ఉండే నిర్మాణాత్మక శక్తి వేళ్లుబారి చక్కగా నాటుకు పోయియుండేది. వారు కోరిన కోర్కెలు కాదనడాని కెవ్వరికీ తరంగాకుండా ఉండేది.

1928 అక్టోబరు మాసం నాటికి పండిత మోతీలాల్‌నెహ్రూగారి అంతరంగిక స్థితి దిగజారి పోయింది. మనస్సులో మాట పైకి చెప్పక పోయినా, అంతరంగంలో మాత్రం ఆయన ఒక నిశ్చయానికి వచ్చాడు. కౌన్సిల్ కార్యక్రమాన్ని విస్మరించి గాంధీగారినే తిరిగి ఆశ్రయించాలని నిశ్చయించుకున్నాడు. అఖిల పక్ష సమావేశం వారి ప్రతిపాదన ప్రభుత్వంవారు ముందుగా పరిశీలించి, 1929 డిసెంబరు 31 లోపల అంగీకరింపకపోతే, శాసన ధిక్కారం అమలు జరుపుతామని విశదీకరించాము.

కౌన్సిల్ పోగ్రాం విస్మరించడానికి ప్రాతిపదికగా, మదరాసు కాంగ్రెస్ వా రామోదించిన బహిష్కరణ తీర్మానాన్ని సరిగా అమలు పరచనందుకు మీపై ఎందుకు చర్య తీసుకోకూడదని వివిద రాష్ట్రాల కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలవారి నడిగాము. 1928 లో డిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సభలో ఈ ప్రసక్తి తీసుకురాబడింది. అంటే - కలకత్తా కాంగ్రెస్ ఇంకా రెండు మాసాలకు జరుగుతుందనగా ఈ ప్రశ్న వచ్చిందన్నమాట!

కలకత్తాలో కార్మిక ప్రదర్శనం

1928 లో కలకత్తాలో కాంగ్రెస్ జరుగుతూండగా కార్మికులచే బ్రహ్మాండమయిన ప్రదర్శనం జరిగింది. అ ప్రదర్శనం కలకత్తా నగరంలోనూ, కాంగ్రెస్ పెండాల్‌లోనూ కూడా జరిగింది. సుభాస్‌చంద్రబోసూ, జవహర్‌లాల్ నెహ్రూగారలు ముందు నడువగా, కార్మిక వర్గనాయకులూ, కార్మికులూ, కలకత్తా పురవీధులగుండా ఊరేగుతూ కాంగ్రెస్ పెండాల్‌కు చేరుకున్నారు. ఆ బ్రహ్మాండమైన ఊరేగింపు మనస్సును కదిలించి, కరీగించేదిగా ఉంది. నేను కొంచెం జోరుగా నడిచి ముందుకు చొచ్చుకుని వెళ్ళేసరికి - జవహర్‌లాల్‌నెహ్రూ ఒక బస్సు ఇంజన్‌మీదా, సుభాస్‌బోసు ఇంకో బస్సు ఇంజన్‌మీదా కాళ్ళు ఇటూ అటూ వేసుకుని గుర్రాలమీద స్వారీ చేస్తున్న పద్ధతిగా ఆసీనులయి ఉన్నారు. ఆ ప్రకారంగా ఆసీనులయ్యే వారు ఊరేగారు. అల్లావారు ఊరేగడాన్ని, ఆ ఊరేగింపుకే ఒక వికాసమూ, ఘనతా ఏర్పడ్డాయి.

కాంగ్రెస్ పెండాల్ నుంచి ప్రతినిధులనూ, ప్రేక్షకులనూ కూడా బయటకు పంపించ వలసివచ్చింది. ఆ కార్మికులు సుమారు రెండు ఘంటలసేపు ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకొని ఉండి, వారికున్న కష్టాలు సుదీర్ఘంగా విన్నవించుకున్నారు. కాంగ్రెసు నాయకులు వారిని శాంతపరచడానికి ప్రయత్నిస్తూ ఇచ్చిన ఉపన్యాసాలలో - కాంగ్రెసు వారిసహకారం వారి కెప్పుడూ ఉంటుందని వాగ్దానం చేశారు. భారతదేశంలో అప్పటికప్పుడె కార్మికోద్యమం బ్రహ్మాండంగా ప్రాకి, కేంద్ర రాష్ట్రీయ స్థాయిలలో ఎన్నుకోబడ్డ నాయకుల మార్గదర్శకత్వం తోచాలా ముమ్మరంగానే సాగుతోంది. కాంగ్రెసువారే గనుక 1921 నుంచీ గాని, అధమం 1930 నుంచీగాని ఈ కార్మికుల సంఘాలనీ, వారి కష్టసుఖాలనూ గమనిస్తూ, వారితో పొత్తు కలిగి ఉండి ఉంటే, బహుశ: మనకి రాజకీయ స్వాతంత్ర్యం ఎప్పుడో చులాగ్గానే వచ్చేసి ఉండేది.

కార్మిక సంఘాల చరిత్ర

పోయిన యుద్ధంలో కార్మిక నాయకుల సహకారంతో కార్మిక సంఘాలద్వారా ప్రభుత్వంవారు ఎల్లా లాభం పొందిందీ మనకి విశదమే. ఈ నాటి కార్మిక సంఘాలు కాంగ్రెసుతో సమైక్యమయాయనీ, కార్మిక మంత్రిగా వి. వి. గిరిగారు ఈ కార్మిక విషయాలలో మాకు 'నిధి'గా ఉంటూ, 1937 లోని కాంగ్రెసు మంత్రివర్గంలోనూ, దర్మిలా స్వాతంత్ర్యం వచ్చిన 1947 తర్వాతా ఆయన అఖండమయిన సేవ చేశాడని ఇప్పట్టున చెప్పడం న్యాయం.

1928 - 30 సంవత్సరాలలో కార్మిక సంఘాలే గనుక మా కాంగ్రెసులో చేరి ఉంటే, మా విజయం ఎంతో ఘనంగానూ, ఇంకా ఎక్కువ సమగ్రంగానూ ఉండి ఉండేది. పరిపాలకులకు భారత దేశంలోని కార్మిక సంఘాలు పెట్టని కోటలై, వారి చిత్తానికి లోబడి, వారనేక విధాల లాభాలు పొందడానికి వీలుగా సహకరిస్తూ వచ్చాయి. భారత జాతీయ కాంగ్రెసువారు కార్మిక సంఘాలకి నిన్న మొన్నటివరకూ ఎటువంటి సహకారమూ ఇవ్వలేకపోయారు.

1935 లో రాజ్యాంగ విధానంలో వచ్చిన మార్పులకు పూర్వం, ఈ కార్మిక విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం క్రిందనే ఉండేవి. 1935 కు పూర్వం రాష్ట్రాలలోని కార్మిక సంఘాలద్వారా ఏదో సహాయానికి అవకాశం ఉండేదట. కాని ఈ 1935 దాకా ఏ రాష్ట్రంలోనూకూడా, ఏ విధమయిన సహకారమూ కార్మికులకు ఇవ్వలేకపోయాము. కేంద్రంలో ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వ విధానం మూలంగా కార్మికులకి ఏ విధంగానూ అవసరమయిన సహాయం చేయలేకపోయాం. కార్మిక నాయకు లెంతటి దిట్టలయినా, ప్రభుత్వ విధానం కారణంగా, ఏ విధంగానూ ముందడుగు వేయలేక పోయారు. మేము ఈ విషయంలో తీసుకువచ్చిన ప్రతిపాదనలూ నడపిన చర్చలూ వృధాయే అయిపోయేవి.

దేశంలో ఉన్న కార్మికుల విషయమే ఇలా ఉంటూంటే సముద్రాలకు అవతల ఆయా ఖండాలలో నివశిస్తూ అనేక బాధలకు లోనవుతూన్న భారతీయకార్మికుల విషయంలో అసలే యేమీచేయలేక పోయాం. పశ్చిమ దేశవాసుల పద్ధతులమీద ఏర్పడిన కార్మిక సంఘాల ద్వారా ఏమయినా సహాయం చేయగలమేమోనని తలిస్తే, ఆ సంఘాల ఆశయాలలో, మన దేశీయులకూ - వారి పరిస్థితులకూ అవసరమైన మార్గాలలో, వారి అవసరాలను తీర్చే విధానంగా ఏ సేవా చెయ్యడానికి సావకాశం ఉండేదికాదు.

వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు

మాటవరసకి చూడండి - మనకి ఉన్న కార్మిక సంఘాలు వ్యవసాయ శ్రామికుల విషయంలో ఏమీ చెయ్యలేవు. మరి మన దేశంలో ఉన్న కష్టజీవులలో నూటికి 90 పాళ్ళు వ్యవసాయ శ్రామికులే కదా? ఈ వ్యవసాయ శ్రామికుడుకి చెప్పుకోతగ్గ సంఘాలు, అవసరాల విషయమై విన్నపాలూ, వేడికోళ్లూ లేని కారణంగా, కాంగ్రెసు పరిపాలనలోనే ఉన్న లేబర్ కమిషనర్‌గాని, కార్మిక మంత్రిగాని ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండిపోయారు.

అయినప్పటికీ, ఇప్పటివరకూ, ఈ శ్రమజీవుల కష్టసుఖాల విషయమై ఏ విధమయిన విచారణా జరుగలేదు. వ్యవసాయ శ్రామికుల కిచ్చే కూలీ ఎంత? అసలు వ్యవసాయపు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? ఆ ఖర్చులో శ్రామికుల కిచ్చేది ఎంత? ఇల్లాంటి ప్రశ్నలు పుట్టినా, వాటికి సరి అయిన సమాధానాలు చెప్పడానికి అంకెలు ఎవరివద్దా లేవు.

మేము రాజ్యాంగం చేపట్టిన తరుణంలో నేను మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ మంత్రిగా వ్యవహరిస్తూన్న రోజులలో ఈ వ్యవసాయ శ్రామికుల విషయం గమనించడానికి వీలు చిక్కింది. ప్రభుత్వ ప్రాంతాలలోనూ, జమీందారీ ప్రాంతాలలోనూ భూమిపై యజమానికి ఉన్న హక్కు భుక్తాలూ: యజమానులకూ, రైతులకూ, శ్రామికులకూ మధ్య ఉన్న ఒడంబడికలూ వగైరాలన్నీ విచారించవలసిన అవసరమూ కలిగింది. నిజంగా దేశంలో పూర్తి స్వాతంత్ర్యాన్ని నెలకొల్పి, దానిని సరిగా నిలబెట్టుకోవడానికి అన్నిరకాల కష్టజీవుల సహకారమూ లభించకుండా సాధ్యం కాదుగదా? ఇప్పట్టున నేను ఒక పత్రికా సంపాదకునిగానూ, కేంద్ర శాసన సభా సభ్యునిగానూ, భారత కష్టజీవికి సహాయపడడానికి చేసిన ప్రయత్నాన్ని గురించి చెప్పడం న్యాయం.

కేంద్ర సభలో కష్టజీవుల ప్రసక్తి

కేంద్ర శాసన సభా సభ్యుణ్ణిగా 1927 - 28 లోనూ, 1930 లోనూ నేను భారత కష్టజీవుల పరిస్థితులను గురించీ, ఇతర దేశాలలో ఉండే కష్టజీవుల పరిస్థితిగురించీ, కష్టజీవుల సంఘాల నాయకులద్వారా సేకరించగలిగాను. ఈ సమాచారం అసెంబ్లీలో కార్మిక వ్యవహారాలను గురించి ప్రశ్నించి సమాధానాలు సంపాదించడానికి ఉపయోగపడింది. నేను ఈ వ్యవహారాలు ఆమూలాగ్రంగా గ్రహించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాను.

ఆఫ్రికా ఖండాన్ని ఆ దేశవాసుల సుఖ సౌఖ్యాలకోసం సరిగా రూపొందించడానికి మన కష్టజీవులను గవర్నర్ జనరల్ ఆఫ్రికా పంపించడానికి చేసిన తొలి ప్రయత్నాల దగ్గరనుంచీ ఆ కష్టజీవుల పరిస్థితి ఎల్లా ఉండేదో సమగ్రంగా గ్రహించగలిగాను. వారు కష్టపడి చెమటోడ్చి, నివాస యోగ్యంగానూ, సకల ఫల సంపన్నంగానూ రూపొందించిన ఆ ప్రాంతాలలో వారికి ఈ నాటికీ పౌరహక్కులయినా లేవు.

నేను ఈ రాష్ట్రంలోని మలబారు, కోయంబత్తూరు, నీలగిరి తాలూకాలలోనూ, అస్సాంలోనూ కూడా మన కష్టజీవుల సహకారంతో కాఫీ, టీ, రబ్బరు వగైరా తోటలు పెంచి, వాటి ఫలసాయాన్ని అనుభవిస్తూన్న ఆంగ్లేయుల హయాంలో ఆ కష్టజీవుల పరిస్థితి ఎల్లా వుందో గ్రహించాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాలు పర్యటించాను.

దేశదేశాలలో కార్మికుల పరిస్థితులు ఎల్లా ఉన్నాయో స్వయంగా గ్రహించాలనే ఉద్దేశంతో నేను బర్మా, సిలోన్, మలయా, సయాం, ఇండో చైనా మొదలైన దేశాలన్నీ పర్యటించి, ఆ ప్రాంతాలలో ఉన్న ప్లాంటేషను లన్నింటినీ పూర్తిగా పరిశీలించాను. ఆయా ప్రాంతాలలో సంపాదించిన స్వానుభవంతో కేంద్ర శాసన సభలో కష్టజీవుల కుపయుక్తమైన నిబంధనావళిని ఏర్పరచాలన్నదే నా తహ తహ.

1929 లో మొదటి అర్ద సంవత్సరంలోనూ, కేంద్ర శాసన సభా కార్యక్రమం సాంతం కాగానే, మలయా రాష్ట్రాలు, సయాం, ఇండో చైనా పర్యటించాను. ఏడు మాసాలపాటు సమగ్రమయిన పర్యటన చేశాను. ఈ పర్యటనల అనుభవాలను గురించి ముందు ముందు సమగ్రంగా చెప్పుతాను. ఇప్పుడు 1928 - 29 సంవత్సరాలలో జరిగిన ఇతర ముఖ్య సంఘటనలను గురించి చెపుతాను.