నా జీవిత యాత్ర-3/పెద్దల మధ్య రగడలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4

పెద్దల మధ్య రగడలు

మోతీలాల్‌నెహ్రూగారికీ, శ్రీనివాసయ్యంగారికీ మధ్యను ఉన్న అభిప్రాయ భేదాలను గురించి కొద్దిగా ప్రస్తావిస్తాను. నెహ్రూగారితోగాని, శ్రీనివాసయ్యంగారితోగాని నా కెప్పుడూ ఎటువంటి వ్యక్తిగత అభిప్రాయభేదాలూ లేవు. ఆ ఉభయులయందూ నాకు సమాన గౌరవ ప్రతిపత్తు లుండేవి. వారిరువురూ కూడా హృదయం విప్పి వారి కష్ట సుఖాలు నాతో చెప్పుకునేవారు. అసలు వారిరువురి మధ్యా అభిప్రాయ బేదాలకుగాని, పరస్పర విరోధనికి అవకాశమే లేదు.

మహాత్మా గాంధీగారిలాగే మోతీలాల్‌గారూ మితవాదే. అవసరం అయితే కజ్జాకు కాలు దువ్వే రకమే. రాజీ ప్రతిపాదనలకూ అంత సుముఖులే. మోతీలాల్‌గారు 1921 లో ఆ శాసన ధిక్కార ఉద్యమపు ఆరంభ దినాలలో స్వయంగా జెయిలుకువెళ్ళి ఆ ఉద్యమానికి ఖ్యాతి సంపాదించాడు. ఆయనలో ఉన్న బలహీనతల్లా, లార్డ్ రీడింగ్ సూచించిన రాజీ ప్రతిపాదనలను పట్టుకుని గాంధీగారితో తగవులాటకు దిగడమూ, కాంగెసును రెండుగా చీల్చి, గాంధీగారు జెయిలులో ఉన్న రోజులలో స్వరాజ్యపార్టీని స్థాపించడము. ఆయన గాంధీ తర్వాత గాంధీ అంతటివాడు. గాంధీ తర్వాత నాయకుడుగా ఆయనే దేశాన్ని నడిపించవలసి ఉంది.

శాసన ధిక్కారం అంటే ఇష్టంలేని శ్రీనివాసయ్యంగారికి మోతీలాల్‌గారు స్థాపించిన స్వరాజ్యపార్టీ నచ్చిన కారణంగానే ఆయన కాంగ్రెసులో జేరాడు. మితవాదిగానే చెలామణీ అవుతూన్న శ్రీనివాసయ్యంగారు, ఆ అసెంబ్లీ పార్టీలో మోతిలాల్‌గారితో సాన్నిహిత్యం సంపాదించి హాయిగా వారితో సాయిలా సాయిలాగా ఉండవలసింది. అటువంటి పరిస్థితులలో వారి మధ్య అభిప్రాయభేదా లుండేవంటే, ఆ తేడా పాడాలకు కారణం భగవంతుని సృష్టిలోనే ఉన్నటువంటి 'తమాషా' అని అనవలసి ఉంటుంది. పుష్పంలా వికసిస్తూన్న ఆయన తెలివి తేటలతో ఆయన, ఆచరణలో గాకపోయినా, ఊహాలో మాత్రం అందర్ని అతిక్రమించగల నేర్పరి. అంటే, కత్తిపోటుకంటే కలం పోటులో మాంచి దిట్ట అవడాన్ని, అందర్నీ తన విజ్ఞానంతో మించి రాణించవలసిన వ్యక్తి.

స్వాతంత్ర్యం కోసం పార్టీ

"స్వాతంత్ర్యం" విషయంలో మోతీలాల్‌గారితో అభిప్రాయ భేదం ఆరంభం అయింది. ఇదివరలోనే చెప్పాను - రణ రంగంలో తప్ప మోతీలాల్ మితవాదులలోకల్లా మితవాది అని. కాని, ఆయన కుమారుడే అయిన జవహర్ మాత్రం, దేశానికి స్వాతంత్ర్యం కోరడంలో, తండ్రిని మించిన కొడుకయ్యాడు. శ్రీనివాసయ్యంగారు జవహర్‌లాల్‌తో చేతులు కలిపి, సాంబమూర్తి సహకారంతో కేంద్ర శాసన సభలోని కాంగ్రెసుపార్టీలో అంతర్గతంగా ఒక చిన్న 'స్వతంత్రపార్టీ'ని సృష్టించాడు.

ఆ పార్టీలో నన్నూ సభ్యత్వం స్వీకరించమని ఆహ్వానించాడు. శ్రీనివాసయ్యంగారి కోరిక నేను అంతగా పట్టించుకోలేదు. "స్వాతంత్ర్యం అంటే మీ అభిప్రాయం ఏమిటి? అవసరమయిన ఏర్పాట్లుచేసి, మీరు స్వాతంత్ర్యం కోసం యుద్ధంచేసి, దానిని సాధించడానికి సన్నిద్దులవుతున్నారా?" అని అడిగాను. ఆయన తన "స్వాతంత్ర్యం" అన్న పదం జాతీయత అన్న పదానికి సన్నిహితమనీ (Independence was National), దానిని ఆదర్శంగా పెట్టుకొని వ్యవహరిస్తామనీ అన్నాడు. వారు కోరే "స్వాతంత్ర్యం"లో కొత్తదనం ఏమీలేదనీ, పశుపక్ష్యాదులు కూడా స్వతంత్రంగా హాయిగా ఏ నిర్భంధమూ లేనివిధంగా బ్రతకాలని వాంఛిస్తాయనీ, అటువంటప్పుడు మానవుడు స్వతంత్రంగా బ్రతకాలని వాంఛిచడంలో తప్పులేదనీ చెప్పి, నేను మాత్రం మీ పార్టీ సభ్యత్వాన్ని వాంఛించడం లేదన్నాను.

పార్టీలో ఇంకో చిన్నపార్టీ ఉత్పన్నమయిందని విని, మోతీలాల్‌నెహ్రూగారు బాధపడ్డారు. పార్టీ నాయకునిగా శ్రీనివాసయ్యంగారినీ, వారి 'స్వాతంత్ర్యాన్నీ' పట్టించుకోకుండా ఉండవలసిందే. కాని అ పార్టీలో ఉన్నది ఒక్క శ్రీనివాసయ్యంగారు మాత్రమే కాదుగా! ఆయన తన కుమారుడు జవహర్‌లాల్‌తో కలిసి, మా ఉభయుల వాంఛితార్థమూ ఒకటే నంటున్నాడు. శ్రీనివాసయ్యంగారు ఒక్కడే అయివుంటే, తాను నిరంకుశంగా వ్యవహరించి ఆయన్ని త్రోసి రాజనేవాడే. కాని అందులో తన కొడుకు జవహర్‌లాల్ ఇరుక్కున్నాడు.

ఈ ప్రకారంగా, ఆ ఇరువురి మధ్యా ఆరంభం అయిన ఆ విభేదం, ఆ మూడు సంవత్సరాల సభా కార్యక్రమంలో మిళితమై, నిత్యమూ ఏదో ఉపద్రవానికీ, కోపతాపాలకీ కారణ భూతం అవుతూ వచ్చింది. సుభాష్ చంద్రబోసూ, జవహర్‌లాల్‌నెహ్రూ 'ఎవరు నాయకులుగా ఉండాలి?' అని తమలో తాము కీచులాడుకున్నా, ఉభయులూ స్వాతంత్ర్య ప్రియులే. ఇరువురూ అతివాద నాయకులే. గాంధీగారి దన్ను చూసుకుని మోతీలాల్‌గారు తన్ను తాను సంబాళించు కోవలసిన స్థితిలోనే ఉన్నారు. కాని శ్రీనివాసయ్యంగారు తాను 1926 లో గౌహతి కాంగ్రెస్ అధ్యక్షుడు కావడంతో, జవహర్‌లాల్ నెహ్రూగారినీ, సుభాస్ చంద్ర బోసుగారినీ అసరాగా తీసుకుని ముందడుగు వెయ్యసాగాడు. పరిస్థితులు ఇల్లా ఉంటూండగా, 1927 నాటికి కాంగ్రెస్ మదరాసులో సమావేశం కావడానికి పిలుపు వచ్చింది. ఆ పిలుపును మన్నించి అంగీకరించడమూ జరిగింది. కాగా 'స్వాతంత్ర్య' తీర్మానం ఆమోదించబడింది. ఈ తీర్మానం అటు గాంధీగారికి, ఇటు మోతీలాల్‌గారికి కూడా అయిష్టమయిందే. దాన్తో మోతీలాల్, శ్రీనివాసయ్యంగార్ల మధ్య రేగుతూన్న అభిప్రాయభేదాలు కాస్త తీవ్రరూపం దాల్చాయి.

కాంగ్రెస్ - లీగ్ స్కీము

సుభాస్ చంద్రబోసు 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని కాంక్షించిన వాడైనా, బెంగాల్ రాష్ట్రంవారు మాత్రం ఆ మదరాసు తీర్మానంతో అనుకోని విధంగా తబ్బిబ్బయారు. అందుచేత ఆ తీర్మానాన్ని కలకత్తా కాంగ్రెస్‌లో, అంటే 1928 లో, తిరగతోడాలని పదకం వేసుకున్నారు. వారివి తెలివయిన ఘటాలు. ఆ తీర్మానాన్ని తిరగ తోడడానికిగాని, నిర్వీర్యం చేయడానికిగాని మోతీలాల్‌నెహ్రూకి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదని వారుగ్రహించారు. కలకత్తా కాంగ్రెస్ అధ్యక్షుడు మోతీలాలే గనుక, ఆయనే ఆ పని చెయ్యడానికి అర్హుడని వారు తలచారు. గాంధీగారు ఒప్పుకోడంతో మోతీలాల్ అధ్యక్షుడయ్యాడు.

గాంధీగారూ, మోతీలాల్ కలసి మధ్యే మార్గంగా 'కాంగ్రెస్ - లీగ్ స్కీమ్‌' అంటూ ఒక దానిని లేవతీశారు. అదే అప్పట్లో కాంగ్రెసు వారి ధ్యేయం అన్నారు. "స్వాతంత్ర్య సముపార్జన విషయమై మాకెట్టి అభ్యంతరమూ లేదు.. దానిని గురించి అప్రమత్తతతో ప్రచారం చేసుకోండి" అన్నారు. సబ్జెక్ట్స్ కమిటీలో సుభాస్, జవహర్‌లాల్‌కూడా ఈ రాజీ సూచనకి ఒప్పుకున్నారు. కాని తరవాత అ ఒప్పందాన్ని త్రోసి రాజని, బహిరంగ సమావేశంలో దాని కొక సవరణ ప్రతిపాదించారు. దానికి శ్రీనివాసయ్యంగారి మద్దతు లభించింది. ఇది గాంధీ - నెహ్రూ గార్లకు విషాద విస్మయ కారణం అయింది.

ఆ ప్రకారంగా అసెంబ్లీ పార్టీలోని నాయకునికీ, ఉప నాయకునికీ మధ్య ఒక రగడ బయల్దేరి, 1928 డిసెంబరు ఆఖరు దాకా అది సాగింది. మోతీలాల్‌నెహ్రూ గారికీ, శ్రీనివాసయ్యం గారికీ మధ్య ఇల్లా కాంగ్రెసు కార్యక్రమం నడిపే విషయంలో రగడ సాగుతూన్న రోజులలోనే, తన నిత్య విమర్శనలతో సి. ఎస్. రంగయ్యరు, మోతీలాల్‌నెహ్రూ గారిని విసిగిస్తూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా మోతీలాల్‌గారికీ, లజపతిరాయిగారికీ మధ్యను కూడా రగడ బయల్దేరింది.

కాకలు తేరిన లజపతిరాయ్

అసెంబ్లీ మెంబర్లుగా ఉంటూ, విధానాలలో స్వల్ప భేదాలతో ఏవో కారాణాలవల్ల మోతీలాల్‌ గారికీ, అయ్యంగారికీ మధ్య అభిప్రాయ భేదాలొచ్చా యనుకోవచ్చుగాని, మోతీలాల్‌గారికి లజపతిరాయ్‌గారికీ మధ్య ఉత్పన్నమయిన విభేదాలకి కారణాలు దురూహం అనవలసి ఉంటుంది. లజపతిరాయ్‌గారు మోతీలాల్‌గారికి వ్యతిరేకంగా ఏ "స్వతంత్ర" పార్టీనీ స్థాపించ లేదు సరికదా, అధమం శ్రీనివాసయ్యంగారి 'స్వతంత్రపార్టీ'లో సభ్యత్వమయినా లేదు వారికి. మోతీలాల్‌గారితోగాని, మహాత్మా గాంధీగారితోగాని కలిసి పనిచెయ్యడానికి అనువయిందే లజపతిరాయ్‌గారి తత్వం. దేశస్వాతంత్ర్య సమరంలో పాల్గొనడంలోనూ, దానివల్ల బాధలకు గురి కావడంలోనూ ఆయన మోతీలాల్‌గారికన్నా, గాంధీగారికన్నా కూడా ఎక్కువ అనుభవం గడించినవాడు. ఆయన దేశ సేవా కార్యక్రమంలో జెయిలు శిక్షా, దేశ బహిష్కరణా కూడా అనుభవించిన దిట్ట. ఆ తర్వాతే గాంధీగారు 1921 లో శాసన ధిక్కారం వగైరాలు ప్రబోధించారు.

కాంగ్రెసు నూతన విదానాన్ని అవలంభించిన తర్వాతనే ఆయన కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గంలో మొదటి సభ్యుడయ్యాడు. ఆయన తర్వాతనే నేనూ, చిత్తరంజన్‌దాస్‌గారూ కార్యనిర్వాహక సభ్యులమయ్యాము. దాస్‌గారిలాగే లజపతిరాయ్ కూడ స్వాతంత్ర్య వాయువులను పీల్చి, స్వాతంత్ర్యాన్ని కాంక్షించి, తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించ కోరినవాడు. అ మొట్ట మొదటి కార్యనిర్వాహక వర్గంలోని సభ్యులందరూ మేధావులే. మేధావులే కాదు - ధీశాలురూ, విజ్ఞానవంతులూ కూడా.

దీర్ఘ దర్శిత్వం

లజపతిరాయ్ నాకు ముఖ్య స్నేహితుడు. మేము ఉభయులమూ లండను నగరంలో 1903 లోనే ఎల్లా సన్నిహితులమయ్యామో చెప్పి ఉన్నాను. అప్పటికి ఆయన దేశం నుంచి బహిష్కరించబడి ఇంగ్లాడులో ఉంటున్నాడన్నమాట! ఆయన మంచి తెగువ గలిగిన రాజకీయవేత్త. త్యాగానికి ఎప్పుడూ సిద్ధమే. సాంఘిక రాజకీయ పరిజ్ఞానం కలిగీ, ఎప్పుడూ లోకజ్ఞానాన్ని ఆధారం చేసుకునే ఏ ముఖ్య సమస్యనయినా పరిష్కరించేవాడు.

కేవలం ప్రజాదరణతోనే ప్రారంభించిన దేశీయ విద్యాలయాలూ, పారిశ్రామిక సంస్థలూ ప్రభుత్వ ఆదరణ లేకుండా నిలవ లేవని నాకూ, మా మిత్రులకూ విశద పరచిన దీర్ఘ దర్శి ఆయన. మేము అతి ఉత్సాహంతో, నిర్మాణ కార్యక్రమం పేరిట, 1921 లో శాసన ధిక్కా కారానికి ప్రాతిపదికగా ప్రారంభించిన దేశీయ విద్యాలయాలూ, పరిశ్రమలూ లాంటివన్నీ రెండేళ్ళు తిరక్కుండానే నాటి ప్రభుత్వంవారు అంత మొందించగలిగారు. ప్రభుత్వం వారికీ మాకూ చుక్కెదురు కూడాను. అటువంటప్పుడు ప్రభుత్వ చర్యలను ఎదుర్కొని విద్యాలయాలనూ, గ్రామీణ పరిశ్రమలనూ నడపడం దుస్సాధం కదా! ఆయన తన ఉపన్యాసాలలో ఎప్పుడూ నన్నూ, జవహర్‌లాల్‌నెహ్రూను కలిపే మాటాడుతూ, మా దేశసేవాకృషిని ఉదహరిస్తుండే వాడు. కేంద్ర శాసన సభా సభ్యులుగా మేము మరీ సన్నిహితుల మయ్యాము.

మోతీలాల్‌తో పడని కారణం

మోతీలాల్ - లజపతిరాయ్‌గార్ల మధ్య ఆ అభిప్రాయ భేదాలకు కారణాలు తెలుసుకోడానికి నా కంటె మిన్నగా ఎవ్వరికీ సావకాశంలేదు. ఎంత ప్రయత్నించినా నాకు వారి అభిప్రాయ భేదాలకి కారణాల అంతూ పొంతూ దొరకలేదు. ఒక్కటి మాత్రం నిజం - ఇరువురూ మేధా సంపత్తిలో ఉద్ధండ పిండాలే. మోతీలాల్‌నెహ్రూగారి నిరంకుశ విధానమూ, ఆయనకున్న అహంకారమూ లజపతిరాయ్‌గారికి కిట్టకపోయి ఉండవచ్చు. ఆయన నాయకుడి చేతిమీదుగా తాను పొందుతూన్న గౌరవ మర్యాదల కంటె అధికంగా వాంఛించి ఉండవచ్చు. ఇంకాస్త ఇదిగా ఆయన చూపి ఉండి ఉంటే, వారిరువురిమధ్యా యేతగాదా ఉండేదికాదు. అసెంబ్లీ పార్టీలో ఉన్న ఇతర వ్యక్తులిచ్చిన అభిప్రాయాల కంటే, సలహాల కంటే, తానిచ్చిన సలహాలూ, వగైరా ఇంకా ఎక్కువ ఆదరణ పొంది ఉండవలసినదని ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు. ఆయన గాంధీగారి శిష్యుడు కాదుగా! ఎంత విభేదాలున్నా, మాలో మేము కీచులాడుకుంటూన్నా, నాయకుడితో అభిప్రాయ భేదా లొచ్చినా "బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామీ"గా తయారయి, మా పార్టీనే మేము అంటిపెట్టుకుని ఉండేవారం.

ఒకనాడు నేను అసెంబ్లీలో ప్రవేశిస్తూ ఉండగా లజపతిరాయ్‌గారు కాంగ్రెసుపార్టీని వదలి, మదన మోహన మాలవ్యాగారి లిబరల్ పార్టీలోకి మారడం చూశాను. నాకు నిజంగా విస్మయమూ, దిగులూ కూడా జనించడంచేత, "ఏమిటిది, ఇల్లా చేశా"రని అడిగాను. ఆయన ఇచ్చిన క్లుప్తమయిన సమాధానం: "ప్రకాశంగారూ, నేనే గనుక ఆయనతో నెగ్గుకు రాగలిగితే ఇల్లాంటి పనిచేస్తానా?" అన్నాడు. ఏదయితేనేం, మోతీలాల్ నెహ్రూ మహా మేధావీ, గౌరవ మర్యాదలకోసం ప్రాకులాడే వ్యక్తే అయినా, ఆయనకి శ్రీనివాసయ్యంగారూ, లజపతిరాయ్, రంగయ్యర్‌లాంటి వ్యక్తులను కూడగట్టుకుని ముందుకు సాగడం చేతకాదనే అనవలసి ఉంటుంది.

తండ్రిపై జవహర్ ప్రభావం

అన్నింటికంటె, ఆయన తన కుమారుడు జవహర్‌లాల్ చర్యలతో ఎప్పుడూ సతమత మవుతూ వచ్చాడు. ఆయన గాంధీగారి సహకార నిరాకరణ ఉద్యమంలో చేరేలాగ, ఆయన్ని ఇంకాఇంకా ముందుకు లాక్కుపోతూ, కొత్త కోరికలతోనూ, కొత్త పదకాలతోనూ, మెల్లి మెల్లిగా ప్రత్యక్ష చర్యలకే దిగేలా చేశాడు జవహర్ - ఆయన, క్రమేణా శాసన సభలోని కాంగ్రెసుపార్టీనుంచి తప్పుకుని, దేశాన్ని స్వాతంత్ర్య సమరానికి సిద్దం చెయ్యలనే అభిలాషతో కుస్తీ పట్ట సాగా డన్నమాట!

నిజానికి యుద్ధ భూమిలో ఆయన ప్రతిభాశాలనే ఒప్పుకోవాలి. ఒక్కసారి ముందడుగువేసి దేనినయినా చేపడితే, ఆయన ముందుకు చొచ్చుకుని పోవడమే కాని, వెనుకంజవేసే బాపతు కాదు. పర్యవసానాలతో నిమిత్తం లేకుండా అల్లా ముందుకుపోతూ, దేశాన్నీ, ప్రజల్నీ కూడా ఇంకా ముందుకు లాక్కుపోయే రకం. దేశం అధైర్యంతో క్రుంగిపోతూన్న పరిస్థితిలో కూడా, దేశాన్ని ఉత్తేజ పరచి ముందుకు లాక్కుపోయే రకం ఆయన్ది. అదే ధైర్యమూ, అదే ఉత్సాహమూ ఆయన ఏకైక పుత్రుడయిన జవహర్‌లాల్‌కూ, జవహర్‌లాల్ ప్రేమాతిశయాలను చూరగొన్న ఇల్లాలు స్వర్గీయ కమలానెహ్రూకూ, జవహర్‌లాల్ సహోదరి విజయలక్ష్మీ పండిట్ కూ అలవడాయి.

ఈ కథనాన్ని కాస్త కట్టిపెట్టి, ఆ 1928 - 29 లలో మేము శాసన సభలో చేసిన, సాధించిన పనులను గురించి చర్చించడం న్యాయం. తిరిగీ సత్యాగ్రహం ఆరంభించేవరకూ మేము శాసన సభలో చేసిన పనులను గురించి చెప్పనివ్వండి.

హోదాలమీద పెద్ద నెహ్రూ మోజు

జనరల్ ఎన్నికలలో కాంగ్రెసువారు అఖండ విజయం సంపాదించి, శాసన సభలలో ప్రవేశిస్తూ, ఉత్సాహాన్ని చూపిస్తున్న ఆ రోజులలో - అంటే 1927 మార్చిలో - కాంగ్రెసు పార్టీ ప్రతినిధిగా మోతీలాల్‌గారిని ప్రభుత్వ ప్రజాప్రతినిధి సభ ఉపసంఘం (Empire Parliamentary Sub - committee)లో సభ్యునిగా ఎన్ను కున్నారు. కాగా ఆయన స్కీన్ (Skein) కమిటీ సభ్యత్వం కూడా స్వీకరించాడు. ఈ స్కీన్ కమిటీవారు సైన్యాన్ని పటిష్ఠంగా పునర్నిర్మాణంచేసే పద్ధతుల విషయమై సలహాలు చెప్పా లన్నమాట. ఆయన కాంగ్రెసు ఆశయాలకి అనుగుణంగానే ఆ పదవులను స్వీకరిస్తూన్నట్లు నటించారేగాని, నిజానికి కాంగ్రెసువారు ఇటు ఉద్యోగ స్వీకారానికిగాని, అటు ప్రభుత్వం వారితో సహకరించడానికిగాని వ్యతిరేకులే.

చెన్నరాష్ట్ర శాసన సభ్యులూ, ఇతర రాష్ట్రాలలోని శాసన సభ్యులు కొందరూ, కాంగ్రెసు ఆశయాలనుంచి దిగజారిన కారణంగా, వారిపై అవిశ్వాస తీర్మానం ఒకటి అఖిల భారత కాంగ్రెసు కమిటీలో ప్రవేశపెట్టబడింది. మహారాష్ట్రానికి చెందిన ఎన్. సి కేల్కార్‌గారినీ, డా॥ మూంజీగారినీ సమర్థించే సందర్భంలో, మోతీలాల్‌నెహ్రూగారు స్కీన్ కమిటీలోనూ, ప్రభుత్వ ప్రజాప్రతినిధి సభలోనూ ఉద్యోగ స్వీకారం చేయలేదా అనే ప్రశ్న వచ్చింది. 1928 లో మోతీలాల్‌గారు ఆ రెండు కమిటీలలోని సభ్యత్వానికీ రాజీనామా ఇచ్చేలోపల, కాంగ్రెసుపార్టీ చాలా దిగజారిపోయింది.

మా శాసన సభానుభవం

మూడు సంవత్సరాలపాటు కాంగ్రెసువారు శాసన సభలలో అధిక సంఖ్యాకులుగా ఉంటూ, ఎన్నో విషయాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసినా, ప్రభుత్వంవారు ఏ ఒక్క విషయంలోనూ కూడా తమ పరాజయాన్ని అంగీకరించడమన్నది జరగలేదు. వారు ఇతర మార్గాలద్వారా తాము తలచినదాన్నీ, తమ పంతాన్నీ నెగ్గించుకుంటూ వచ్చారు. శాసన సభలో అనుభవాలు మాలో చాలా మందికి కనువిప్పు కలిగించి, ప్రజల్లో నిజమయిన పరిస్థితులను గురించి ప్రచారం చెయ్యడానికి బాగా ఉపకరించాయి. మా ఆశయాభివృద్ధికి మేము తగు ప్రచారం చెయ్యడానికి మాకు శాసన సభాస్థలి బాగా ఉపయోగపడింది.

మాకే గనక దేశీయ భాషా పత్రికల ద్వారానూ, కాంగ్రెసు నిర్మాణ కార్యక్రమం ద్వారాను శాసన సభలలో జరుగుతున్న భాగవతం పల్లెలలో నివసించే ప్రజానీకం దృష్టికి తేగల అవకాశం ఉంటే, నిజంగా మేము అసంతృప్తి చెందడానికి, చికాకు పడడానికీ కారణం ఉండేది కాదు. మా కపజయం కలుగుతుందేమోనన్న భీతే ఉండేదికాదు. మేము శాసన సభా ప్రవేశంచేసిన కొద్ది దినాలలోనే, బ్రిటిష్‌వారికే గాక, బాహ్య ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలన్నిటికీ మాది పకడ్‌బంద్‌గా ఏర్పడిన, మాంచి క్రమశిక్షణగల పక్షమని విశదమయింది.

ఇటువంటి మంచి పేరు సంపాదించుకోడానికి కారణం, మే మంతా కాంగ్రెసు అధినేతలలో అధిపతి అయిన వారి మాటప్రకారం ఒక్క త్రాటిమీద నడవడమే. మాకు శాసన సభలలో ప్రవేశింపమని అనుమతి - కాదు, ఆజ్ఞ యివ్వగానే ఆ సభాప్రవేశం చేశాం. ప్రపంచంలో ఏ ఇతర దేశాలలోనూ, పకడ్‌బంద్‌లోను, క్రమశిక్షణలోనూ మాతో పోటీ పడగల పార్టీ లేకపోయింది. ఇది నిజంగా గర్వింపదగిన విషయమే గదా?

దిగజారిపోయిన సందర్భాలు

ఇంత పకడ్‌బంద్‌గా వ్యవహరించ గలిగినా, మేము దిగజారిపోయి, నీరు గారిపోయిన సందర్భాలూ ఉన్నాయి. మోతీలాలు నెహ్రూగారు ఎంత మేధావి అయినా, ఎంత బలవంతుడయినా, సాధారణంగా నాయకులూ, గురువులూ అనుకోకుండా చూపించే విధంగా, కొంత మంది వ్యక్తుల మీద ఆయనకు అభిమానం జాస్తీగా ఉండేది. సామాన్యంగా అటువంటి దుర్బలత్వాన్ని మనం పట్టించుకోకూడదు. కాని, ఆ అభిమానాలు ప్రజాక్షేమానికీ, ప్రజోపయోకర కార్యాలకీ ప్రతిబంధకాలుగా పరిణమించి నప్పుడు మాత్రం విపరీత ఫలితాల నిస్తాయి.

ఉదాహరణకి, ఆర్. ఎన్. షణ్ముగం చెట్టిగారి సంగతే విచారిద్దాం (ఆయన దర్మిలా సర్ బిరుదాంకితు డయ్యాడు). ఆయన భారత ప్రభుత్వ అవసరాలనూ, కావలసిన ఇతర వస్తు సముదాయాన్నీ అమెరికానుంచి కొని, సప్లయిచేసే విభాగానికి పెద్దగా ఉండేవాడు. కాగా, ఆయన మోతీలాల్‌నెహ్రూగారికి సన్నిహితుడుగానూ, వారి అభిమానానికీ, విశ్వాసానికీ పాత్రుడుగానూ ఉండేవాడు; మా పార్టీకి చీఫ్ విహ్‌ప్. ఆయన చాలా నేర్పరి. ఆంగ్లేయ భాషా పరిజ్ఞానం బాగా కలవాడు. మంచి మాటకారి. ఆయన ట్రెజరీ బెంచెప్‌వారికి సన్నిహితుడు కూడాను. ఆయన్ని గురించి చెడుగా అనడానికి మాకు గాని, ఇంకొకరికిగాని కారణం కనబడదు. ఆయన మా పార్టీ తరపునే మాటలాడుతూన్నా, ఆ మాటల తీరూ, అందలి విషయాలూ ఇటు మాకూ, అటు ప్రభుత్వ బెంచీలవారికీ కూడా ఉపయోగపడేలాగున గుంభనంగా ఉండేవి. ఆయన మా పక్కనుంచి మాటాడుతూన్నా, ఆ మాటాడే తీరు "అచ్చా, సెహబాస్! వినుడు వినుడు" లాంటి ఉత్సాహపూరిత వచనాలను, అందరిచేతా పలికించేదిగా ఉండేది. ఆయన తెలివితేటలు అటువంటివి. కాని అది అంతటితో ఆగుతుందా? దుష్ఫలితాలు రావూ?

తలవంపులైన సంఘటన

ఈ సందర్భంలో బొత్తిగా దిగజారిన పోయిన సందర్భం ఒకటి చెప్పడం న్యాయం. ఒకసారి, ఆర్థిక సంబంధమయిన ఒక బిల్లును గురించి వచ్చిన చర్చలో, ఒక అనుకోని సంఘటన జరిగిపోయింది. ఆ సంఘటన జరిగిన వెనువెంటనే నాకు తెలుపబడింది. వీలయితే, కాంగ్రెసుపార్టీవారి అభిమానాన్ని సంపాదించి, ఒక బిల్లు అంగీకరింప జేద్దామని ప్రభుత్వంవారు ఉవ్విళ్ళూరుతూన్న సందర్భం అది. మా పార్టీ మీటింగులో అ బిల్లును ప్రతిఘటిద్దామనే తీర్మానించుకున్నాము. అ బిల్లు మంచి చెడ్డలూ, దానివల్ల లాభనష్టాలూ బాగా తర్జన భర్జన చేశాకే ఆ నిర్ణయం తీసుకున్నాం. కొంత మందికి అ బిల్లును ప్రతిఘటించక పోయినా వచ్చే నష్టం ఏమీ లే దనే అభిప్రాయం బాగా ఉంది. అందువల్లనే బాగా తర్జన భర్జన చేశాకే దానిని ప్రతిఘటిద్దామనే నిశ్చయానికి వచ్చాం.

కాని ఆఖరు నిమిషంలో, ఓటింగు జరిగే ముందు, మేమంతా ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు చేయాలనే ఆజ్ఞ చీఫ్ విహ్‌ప్పు దగ్గరనుంచి వచ్చింది. మాకు చాలా ఆశ్చర్యం అయింది. నేను కార్యదర్శిగారినీ, చీఫ్ విహ్‌ప్పునూ ప్రశ్నించాను. పార్టీ మీటింగ్ పెట్టి సంగతి సందర్భాలు చర్చించడానికిగాను వ్యవధి లేదు. జరిగిపోయిన కీడునూ, చెడుగునూ ఇంకే విధంగానూ సరిదిద్దుకోవడానికి మార్గం కనబడలేదు. అందుచేత కాంగ్రెసు పార్టీవారు చీఫ్ విహ్‌ప్పు ఆజ్ఞను పాలించకుండా ఉండవలసి వచ్చింది. దానివల్ల కాంగ్రెసు పార్టీవారు అటు అనుకూలంగా గాని, ఇటు ప్రతికూలంగా గాని ఓటు చేయలేని స్థితిలో తటస్థంగా ఉండడం తప్పని సరయింది. ప్రభుత్వంవారి బిల్లు ఆమోదించబడి, చట్టమయి పోయింది.

దర్మిలా మా నాయకుడూ, ఆయన కార్యదర్శీ కూడా ఆ ఆజ్ఞ కాలవ్యవధి లేకుండా అతి త్వరితంగా ఇచ్చామనీ, అల్లా ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదనీ, ఆ బిల్లును వ్యతిరేకించడం అనవసరం అనే అభిప్రాయంతో అల్లా తుది నిర్ణయంగా ఆ ఆజ్ఞ యిచ్చామనీ అన్నారు. ఆ బిల్లు ఆమోదించబడి, చట్టంగా ప్రకటితమయిన ఆనాటి సాయంత్రం జరిగిన సంఘటన చాలా కలవరపాటునూ, చికాకునీ, ఆశ్చార్యాన్నీ కలుగజేసింది.

నా మిత్రుడూ, చిత్తూరు నివాసీ అయిన కీ॥ శే॥ శ్రీ సి. దొరస్వామయ్యంగారు ఒక డిప్యూటీ సెక్రటరీగారికి ప్రత్యేకించబడిన గదిలోకి వెళ్ళారు. వెళ్ళి, అక్కడ ఆ గదిలో అడ్డంగా ఉంచబడిన తెరవెనుక ఆసీనుడయ్యాడు. దొరస్వామయ్యంగారు లోపలికి వెళ్ళిన కొద్ది సేపటిలో ఆ గదిలోకి మా పార్టీ విహ్‌ప్పు ఒకాయన వెళ్ళాడు. ఆయన అ గదిలో ప్రవేశిస్తూనే, ఆ స్క్రీన్ వెనుకనున్న దొరస్వామయ్యంగారిని గమనించకుండా, అయనతో కబుర్లలో పడ్డాడు. "హల్లో, చూశారా! నేను మా పార్టీవారి నెవ్వరినీ ఆ బిల్లుకు ప్రతికూలంగా వోటు వెయ్యవద్దని ఆజ్ఞాపించాను. ఆ ప్రకారంగానే ఎవ్వరూ ఓటు వెయ్యలేదు" అన్నాడు.

ఇది ఆ బిల్లుకు సంబంధించిన విషయం. మేము ఇంటికి వెళ్లాక దొరస్వామయ్యంగారు ఈ సంగతి నాతో చెప్పారు. ఆ సంఘటన మాలో తత్తరపాటునీ, చికాకునీ, అసహ్యాన్నీ కలిగించింది. మేము సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఏర్పడింది. ఆవిషయాన్ని అల్లా వదలివేయ వలసివచ్చింది. దాని విషయంలో ఇంకేమయినా విచారణ, వగైరాలు జరిపించి ఉంటే, 'అవును', 'కాదు' లాంటి పదాలతో మా స్థితి ఇంకా బాగా పలచనై పోయేది. "సహకరించవద్దు,, దానిని వ్యతిరేకించండి" అనే పార్టీ ఆజ్ఞకు భిన్నంగా జరిగిన ఈ సంఘటన సహించరానిదే గదా! నిజానికి ఆ విహ్‌ప్‌కీ, అండర్ సెక్రటరీకి మధ్య నడచిన కథ మాత్రం చాలా దారుణమయింది. ఆ మూడు సంవత్సరాల శాసన సభా అనుభవంలో చాలా వింత సంఘటనలే జరిగాయి. కాని దీనిముందు మాత్రం అవన్నీ పగటి దివ్వెలే. మామూలు చిన్న ఉద్యోగి కూడా కొన్ని సందర్భాలలో మా పార్టీ అధికారులమీద తన శక్తినీ, ప్రతిభనూ చూపగలిగాడు. ఆనాటి దొరస్వామయ్యంగారూ, రంగస్వామయ్యంగారు, ఆ కార్యదర్శీ, ఆ విహ్‌పూ, ఆ పార్టీ లీడరూ అంతా గతించిన తర్వాత చాలా కాలానికి నేను ఈ కథను ప్రస్తావించడం అన్యాయమే. కాని ఈ సంఘటన చాలా ముఖ్యమయిందీ, మా పార్టీకి సంబంధించిన ఎన్నో లోటుపాట్లకు నిదర్శన ప్రాయమైందీ అవడంచేత మీ ముందు పెట్టవలసి వచ్చింది.