నా జీవిత యాత్ర-3/విఠల్‌భాయ్ పటేల్ విజ్ఞత

వికీసోర్స్ నుండి

3

విఠల్‌భాయ్ పటేల్ విజ్ఞత

కేంద్ర శాసన సభలో ఉన్న కాంగ్రెసు సభ్యులందరమూ కలిసి, మాకు సంబంధించినంత వరకూ ఒక కార్యనిర్వాహక సంఘాన్ని పండిత మోతీలాల్ నెహ్రూగారి అధ్యక్షతను ఏర్పరచుకున్నాము. కొత్తగా ఎన్నికయిన కేంద్ర శాసన సభ్యులుగా మా జీవితం 1927 లో ప్రారంభం అయింది.

నిజానికి మా పార్టీ మంచి పకడ్‌బందీగానే ఎర్పడింది. మంచి క్రమశిక్షణ కలదే. కాని పెద్దలలో కొద్దిగా మనస్పర్థలుండేవి. మోతీలాల్ నెహ్రూగారికి, శ్రీనివాసయ్యంగారికీ ఒక పక్కా, నెహ్రూగారికి లాలా లజపతిరాయ్‌గారికీ ఇంకొక పక్కా కాస్త స్పర్థలుండేవి. ఈ స్పర్థలకు రాజకీయకారణాలే ఉండేవి.

డిన్నర్ పార్టీలు - రంగయ్యర్ సవాలు

కాని కేవలం వ్యక్తిగతమయిన స్పర్థ నెహ్రూగారికీ, సి. ఎస్. రంగయ్యరుగారికీ మధ్య ఉండేది. వీరిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులుగానే ఉండేవారు. అప్పట్లో రంగయ్యరు నాభా మహారాజు కార్యదర్శిగానూ, హితుడుగానూ ఉండేవాడు. గవర్నమెంట్ వారినుంచి తన రాజ్యాన్ని రాబట్టు కోడానికి మహారాజు నెహ్రూగారిని న్యాయవాదిగా పెట్టుకున్నాడు. ఈ కేసు వ్యక్తిగతంగా తేబడిన బాపతే. ఈ సందర్భంలో నాన్పుడు, అభిప్రాయ భేదాలూ ఉండేవి. అల్లా వారిరువురి మధ్యా ఏర్పడిన స్పర్థ శాసన సభలోకి, రాజకీయాల లోకీ ప్రవేశించింది.

ఒకప్పుడు మేము, మా కార్యనిర్వాహక వర్గంలో - వైస్రాయ్‌తోను, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతోను సంబంధించిన సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనకూడదు, వాటిని పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం. మోతీలాల్ నెహ్రూగారికి మాత్రం, మొదటి నుంచీ అలవాటయిన కారణంగా, అటువంటి డిన్నర్లకీ, పార్టీలకూ వెళ్ళకుండా ఉండడమంటే అదోలా ఉండేది. వెళ్ళాలనే కోరికే పీకు తూండేదన్నమాట! నేను గ్రామాంతరంలో ఉన్న సందర్భాలలో ఒకసారి ఆ బహిష్కరణ తీర్మానం రద్దవడమూ, వెళ్ళదలచినవారు పార్టీలకు వెళ్ళవచ్చును అన్న తీర్మానం ఆమోదించబడ్డమూ జరిగింది. తర్వాత ఆ ప్రశ్న తిరిగీ చర్చనీయాంశం అయింది. ఆ విషయాన్ని తర్కించడంలో, పార్టీ లీడరుగా ఆయన ఒక్కరికీ ఆయా పార్టీలకు వెళ్ళడానికి అనుమతి ఇస్తే సరిపోతుందన్నాను. వెంటనే సి. ఎస్. రంగయ్యరు - "నిన్నే ఎందుకు వెళ్ళనివ్వాలి ఆ పార్టీలకు? నాకంటే నీవు ఎక్కువగా త్రాగగలవా?" అని సవాలు చేశాడు.

రంగయ్యరుగారి మాట తీరూ, వారి హాస్యం, అంత అపహాస్యం గానూ, మోటుగానూ ఉండేది. మోతీలాల్ గారయినా తిప్పికొట్టాలంటే గట్టిదెబ్బే కొట్టగలరు. ఇతరుల మీద తాను విసిరే విసుర్ల లాంటివి తన మీదనే కేంద్రీకరించబడి నప్పుడు, వాటికి నవ్వుతూ ఆనందంగా తట్టుకోనూ గలడు. అదీ ఆయన తత్వం.

చరిత్ర సృష్టించిన చతురుడు

మా మిత్రుడు విఠల్‌భాయ్ పటేల్ శాసన సభాధ్యక్షుడుగా ఉండేవాడు. ఆయన మాంచి నేర్పరి. ప్రపంచకంలో ఏ దేశపు పార్లమెంటరీ స్పీకర్‌గానయినా ఆయన బాగా రాణించగలడు. అటువంటివ్యక్తి కేంద్ర శాసన సభలో, అప్పటికి అమలు లోనున్న ఆచార ప్రకారం, జీతంగాని, పూచీగాని ఎంతమాత్రమూ లేని ఒక అపహాస్యపు, అవకతవక పార్లమెంట్‌కు నిష్కపటమయిన నాయకుడుగా ఉండవలసి వచ్చింది. కాని ఆయన నేర్పులో నిర్జీవమయిన ఆ పార్లమెంట్‌కు జీవంపోసి, పూచీ అన్నదిలేని సందర్భాలలోకూడా దానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నట్లు కల్పనజేసి, అందరికీ ఉత్తేజాన్ని కలిగించేవాడు. ఈ సందర్భంలో ఆ మేధావిని గురించి కాస్త విపులీకరించకుండా ఉండలేకపోతున్నాను.

అసెంబ్లీ అధ్యక్షుడుగా విఠల్‌భాయ్‌గారు సభ్యుల ప్రవర్తనాదుల విషయంలో చాలా నిక్కచ్చిగానూ, స్వతంత్రంగానూ వ్యవహరిస్తూ, ఆ జీవంలేని కేంద్ర సభలో చిన్న చరిత్రనే సృష్టించగలిగాడు. దేశ దేశాల ఆనవాయితీలను పాటిస్తూ, ప్రెసిడెంట్‌గా తనకున్న హక్కులను సవ్యంగా చెలాయిస్తూ, చాకచక్యంగా వ్యవహరిస్తూ, వైస్రాయ్‌గారూ, కౌన్సిల్‌ వారూ జారీచేసిన ఆర్డర్లనుకూడా అవసరమయితే ధిక్కరించి సభా గౌరవాన్ని కాపాడేవాడు.

శాసన సభలో పోలీసుగార్డ్ ప్రవేశించకుండా అటకాయించిన ధీరుడాయన. దేశంలో అమలులో ఉన్న రాజకీయసూత్రాల ప్రకారం అధ్యక్షుడికి ఎట్టి హక్కులూ ఉన్నట్లులేదు. ఒక నిష్పూచీ ప్రభుత్వమూ, ఏ పూచీలేని సభ్యులూ కలసి వారికి తోచిన విధంగా అధ్యక్షుని ఆడించగల స్థితిలో ఉన్నారన్నమాట! జెయిలులో ఉండగానే అసెంబ్లీకి ఎన్నికయిన ఎస్. ఎన్.మిత్రాగారికి శాసన సభా కార్యక్రమాల్లో పాల్గొనేటందుకు సౌకర్యాలు కలిగించాలని కోరినప్పుడు, సర్ అలెగ్జాండర్ మడ్డిమన్ పార్లమెంట్ నాయకుడుగా ఉంటూ, సభ్యుల హక్కులపై నడిచిన తీవ్రమయిన వాగ్వివాదంలో కల్పించుకుని, సభవారికిగాని సభ్యులకుగాని ఎట్టి హక్కులూ లేవన్నాడు. విఠల్‌భాయ్ పటేల్‌గాక మరొక రెవరయినా అయితే, పోలీసువారు కౌన్సిల్‌లోకి రాకుండా అరికట్టగలిగి ఉండేవాడుకాడు. ఆ ప్రశ్నపైన ఆయన ఒక నూతన పద్ధతికి దారి చూపాడు.

ప్రెసిడెంట్ కార్యాలయ వివాదం

తర్వాత, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ నుంచి తన ఆపీసును ప్రత్యేకించి వేరుగా ఉంచి తీరా లన్నాడు. అవి కలిసి ఉండదాన్ని కొన్ని చిక్కు లున్నా యనీ, వాటిని విడిగానే ఉంచాలనీ, ఆయన వాదించాడు. దర్మిలా సర్ బిరుదాంకితు డయిన లాంసెట్‌గ్రాహం అప్పట్లో లెజిస్లేటివ్ డిపార్టుమెంట్‌కు కార్యదర్శిగా ఉండేవారు (ఆయన సింధురాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసి పించను పుచ్చు కున్నారు). పబ్లిక్ ఇన్పర్మేషన్ డైరెక్టర్ హోదాలో అపరాధ పరిశోధక డిపార్టుమెంట్‌కు ముఖ్యుడుగా కోట్‌మాస్ వ్యవహరించేవాడు. కాగా ఆయన గవర్నమెంట్ వారి చీఫ్ విప్‌కూడాను. ఓటింగుకాలంలో తన విధిని అతి జాగర్తగా నిర్వహిస్తూ, ప్రభుత్వ పక్షానికి కాన్వాస్ చేయడం లోనూ, ఆ పోలింగు బూత్ గుమ్మంవద్ద నిలిచి గవర్నమెంట్‌కు అనుకూలు రయినవారికి లోపలికి దారిచూపడంలోనూ బహు సమర్థుడు.

విఠల్‌భాయ్ పటేల్, వ్యక్తిగతంగా తన స్వభావాన్నిబట్టీ, తన హోదాను కాపాడు కుంటూ, తనకి ఉత్తమమని తోచిన రీతిగా న్యాయంగాను వ్యవహరిస్తూ, తన ఆఫీసుకు ప్రత్యేకస్థానం ఉండి తీరాలనీ, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్‌కూ, తనకూ సంబంధం ఉండకూడదనీ కోరడం సబబే అయినా, ప్రభుత్వరంగంలో మాత్రం ఆ కోరిక బాగా అలజడిని కలుగజేసింది.

హోం మెంబర్ క్షమాపణ

నిందాపూర్వకమయిన పోసుకోలు కబుర్లు లాబీ వర్గాలలోని అఫిషియల్ సభ్యులే ఆరంభించి, విఠల్‌భాయ్ పటేల్‌కు ఒక నిందను ఆపాదింపజేశారు. ఇల్లా చేసినందువల్ల తమ్ముతామే కించపరచుకుంటూ, సభ్యుల కోపతాపాలకు గురయాం. వారిమీద అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికికూడా సావకాశం ఉందన్న సంగతి పాపం, వారు తలచలేదు.

అసెంబ్లీ అధ్యక్షుడంటే సభ్యుల హక్కులను, అధికారాలను రక్షించే దాత అన్నమాట. విఠల్‌భాయ్, కాంగ్రెసువారు - కాంగ్రెసేతరులు, వారు - వీరు అన్న విభేదంలేకుండా అన్ని వర్గాలవారికీ అవసరమైన రక్షణ ఎప్పుడూ ఇచ్చేవాడు. ప్రభుత్వంవారి ట్రెజరీబెంచెస్ వారికికూడా రక్షణ ఇచ్చేవా డాయన. కాంగ్రెసు వారు అసెంబ్లీలో సుస్థిర స్థానం యేర్పాటు చేసుకున్నప్పటికీ, వారు ఎంతో దీమాగానూ, యుక్తియుక్తంగానూ పోట్లు పొడుస్తూన్నా ట్రెజరీబెంచి సభ్యులకు మాత్రం గర్వమూ, అహంభావమూ తగ్గలేదు.

ఈ అప్రతిష్ఠ పరిస్థితికి మార్గాంతరం మాకు కనబడక, ఆ ప్రకారం అధ్యక్షుని కించపరుస్తూన్న వారివద్దనుంచి క్షమార్పణ పుచ్చుకుతీరాలనే భావం మాకు ఏర్పడి, మా అధ్యక్షుని గౌరవ మర్యాదలు కాపాడవలసిన అవసరం మాదే గనుక, ఆ పార్టీ లీడర్ని తగు చర్య తీసుకోవలసిందని కోరాం. ఈ సమాచారం విషమ పరిస్థితులకు దారితియ్యకుండానే వైస్రాయ్‌గారికి జేరింది. వెంటనే ఆయన కలుగజేసుకుని, హోం మెంబర్ని జరిగిన పొరపాట్లను సరిదిద్దుకో వలసిందని బలవంతం చేశాడు. హోం మెంబరు వెంటనే తగురీతిని అవసరమయిన పదజాలంతో క్షమార్పణ కోరడమూ, పార్లమెంట్ సభ్యులందరి తరపున మోతీలాల్ నెహ్రూగారు ఆ క్షమార్పణను అంగీకరించడమూ జరిగింది. ఆ తర్వాత ఉద్రిక్తత తగ్గి, శాంతి నెలకొంది. అది మా అధ్యక్షునకు ఒక విజయమైంది. ఆ విధంగా పార్లమెంట్‌లో ఒక నూతన మర్యాద (Convention) ఏర్పడ్డం జరిగింది.

పబ్లిక్ సేఫ్టీ బిల్లు

1928, 1929 సంవత్సరాల పరిపాలనా విధానంలో భయాందోళనలదే పైచెయ్యి అయింది. వైస్రాయ్‌గారు తమ పరిపాలనంతా ఆర్డినెన్సులమీదనే నడిపించారు.

సెప్టెంబరు 17 న శాండ్‌హర్‌స్ట్ (Sandhurst) అనే ఒక పోలీసు ఆఫీసర్ని ఖూనీ జేశారు. దాన్తో ఆర్డినెన్సులూ, కుట్ర కేసులూ బనాయింపబడ్డాయి. పైగా పబ్లిక్‌సేఫ్టీ (ప్రజారక్షణ) బిల్లు అంటూ ఒకటి మన నెత్తిని రుద్దడానికి ప్రయత్నాలు జరిగాయి. అందుమీదట కుట్రకేసు ప్రాముఖ్యాన్ని వహించింది. ఈ ప్రజారక్షణకంటూ ప్రవేశబెట్టబడిన బిల్లు, ఆ మీరట్ కుట్రకేసును తారుమారుచేసి, అధ్వాన్న పరిస్థితులలో పడుతుందేమో ననిపించింది.

పరిస్థితులను గమనించిన శాసన సభాధ్యక్షుడు విఠల్‌భాయ్, ఒక ప్రకటన చేశాడు. అందులో అతి జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం తాను ఒక నిశ్చయానికి వచ్చాననీ, ఆ నిశ్చయం ప్రకారం అటు మీరట్ కుట్రకేసు నడుస్తూండగా ఇటు ఈ పబ్లిక్ సేఫ్టీ బిల్లు ప్రతిపాదించడం చాలా ఆక్షేపణీయం, అందువల్ల ప్రభుత్వంవారు ఈ రెంటిలో ఒక దానిని వదులుకోక తప్పదని సూచించబడింది.

ప్రభుత్వంవారు అదేం కుదర దన్నారు. దాన్తో 1928 ఏప్రియల్ 11 వ తేదీని అధ్యక్షుడు, తాను సూచించిన ఆ ప్రాథమిక సూత్రాల మీదే, ఆ బిల్లును త్రోసివేశాడు. అప్పుడు వైస్రాయ్‌గారు శాసన సభనీ, స్టేటు కౌన్సిల్నీ ఉమ్మడి సమావేశానికి పిలిచి, ఆ సమావేశంలో ఆ ప్రజారక్షణ బిల్లును ఆమోదింపజేశాడు. ప్రభుత్వంవారి నిరంకుశ పరిపాలనకీ, వైస్రాయ్‌గారి నికృష్ట విధానానికీ ఇంతకంటె ప్రబలమయిన నిదర్శనం ఇంకోటి కావాలా?

ప్రజాభిప్రాయాన్ని కాదని తమకు ఇష్టం వచ్చినట్లు నిరంకుశంగా ప్రవర్తించ డానికే వైస్రాయ్‌గారు సర్టిఫికేషన్ పవర్ని తమచేతిలో పెట్టుకుంట. అటువంటి బిల్లు విషయంలో జరిగే సర్టిఫికేషన్ తతంగాల్ని ఆపు చెయ్యడానికి శాసన సభవారికి అధికారం లేక పోయినా, ఉన్నత స్థాయిలో జరుగుతూన్న తర్కవితర్కాలు ప్రజా హృదయంలో ఉత్తేజాన్ని కలిగించడానికి, ముఖ్యంగా అమాయకపు బాధితుల హృదయాలు తేలిక అవడానికి ఉపకరించేవి. సహకార నిరాకరణ ఉద్యమం, 1921 లోనే ప్రారంభించబడి, ప్రత్యక్ష చర్య, నిర్మాణ కార్యక్రమాలద్వారా, ప్రజాహృదయంలో నూతన ఉత్సాహాన్నీ, శక్తినీ, కలిగించ గలిగినా, 1923 - 29 సంవత్సరాలలోకూడా శాసన సభాసభ్యులకు ఇటువంటి అన్యాయ పరిస్థితులలో కాంగ్రెసువారితో కలిసి ఓటు చేయడానికి 'కలేజా' లోటుగానే ఉండేది.

వైస్రాయికే మందలింపు

వైస్రాయిగారు శాసనసభా, రాజ్యసభా సభ్యులను ఉమ్మడిగా సమావేశపరచి, అ ఉమ్మడి సభలోని స్టేట్ కౌన్సిల్ సభ్యుల ధర్మమా అని వారి ఓట్లతో బయట బయటపడేవారు. అప్పుడుకూడా రాజ్యాంగపు కట్టుబాట్లకు లోబడి, ఉభయ సభల ఆమోదం పొందిన ఆ బిల్లుల్ని కూడా చట్టంగా ప్రకటించడానికి ఒక ఆర్డినెన్స్ కావలసి వచ్చేది.

ఇటువంటి పరిస్థితులలో లేని 'పూచీ'ని సృష్టించి, తాను సృష్టించిన ఆ 'పూచీ' ఆధారంగా, వైస్రాయినికూడా, "నీవు అనవసరంగా మా కార్యకలాపాలలో కలుగజేసుకుంటున్నా"వని మందలించగలశక్తి ఒక్క విఠల్‌భాయ్ పటేల్‌కే ఉంది. అట్టి ధీరశాలి ఆయన ఉమ్మడి సభలో వైస్రాయ్‌గారి ఉపన్యాసానికి విఠల్‌భాయ్‌గారు ఆక్షేపణ తెలిపారు. వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, ప్రెసిడెంట్‌గారి పేర ఉత్తరం వ్రాస్తూ, అందులో ప్రెసిడెంట్‌ గారి నిర్ణయాన్ని ఖండించడం గాని, దానికి ఆయనపై దోషం ఆరోపించడం గాని తన ఉద్దేశం కాదని స్పష్టం చేశాడు.

ప్రెసిడెంట్‌ మాత్రం, తాను రాజ్యాంగ రీత్యా తనకున్న హక్కులను పురస్కరించుకునే ఆ నిర్ణయాన్ని తీసుకున్నానని తిరిగీ చెప్పాడు. ఈ సందర్భంలో మనం గమనించవలసిన ముఖ్య విషయాన్ని ఒక్క ముక్కలో చెపాలంటే - ఇప్పటికి సుమారు ఇరవై సంవత్సరాలనుంచీ మనం పడూతూన్న తంటాలన్నీ వైస్రాయ్ చేతిలోంచి ఇటువంటి 'అధికారాన్ని' తప్పించాలనే.

మూడు రోజుల ఉపన్యాసం

ఆయన స్పీకరు కాకపోయినా, బిల్లుల మీద నడిచే తర్క వితర్కాలలో విఠల్‌భాయ్ పటేల్ అంతరాయాలు కలిగించేవాడు. ఆయన ఎంత కోపదారయినా, చికాకు తత్వం గలవాడయినా, మాటలాడుతూన్న వారి నెవ్వర్నీ బలవంతంగా ఆపుజేసి కూర్చోబెట్టలేదు. పూచీగల పార్లమెంటులో నయినా ప్రతి సభ్యుడికీ తనకి తోచినంత కాలం, స్పీకరునుంచి అంతరాయం లేకుండా, మాటలాడగల హక్కు ఉంది. ఇతర సందర్భాలలో క్రమ శిక్షణ అమలుపరచి, అవతలి వ్యక్తి ఎవరయినదీ లెక్కచేయకుండా, తన పరిస్థితిని గూడా గమనించకుండా, అవసరమయిన చర్య తీసుకునేవాడు. ఇంత ఇదిగా ఉన్నా, ఆయనవల్ల జరిగిన పొరపాటు ఏదయినా ఉంటే దానిని సూచించిన తక్షణం సరిదిద్దు కునేవాడు.

ఒక రోజున ఒక బిల్లుమీద చర్చ జరుగుతూ ఉండగా, సి. ఎస్. రంగయ్యగారు, మధ్యలో లేచినిలబడి, ఉపన్యసించడం ఆరంభించాడు. రంగయ్యను తన ఉపన్యాసాన్ని అనవసరంగా సాగదీస్తున్నట్లు కనబడడంచేత, విఠల్‌భాయ్‌గారు "మీ ఉపన్యాసం ఇంకా ఎంతసేపువుంటుం"దని అడిగాడు. ఆ రంగయ్యరు తడుము కోకుండా "మూడు రోజు" లన్నాడు. దాన్తో సభలోని ప్రతివ్యక్తికి ప్రాణంపోయి నంత పనయింది.

నిజానికి, సరుకుండి, అంకెలతోటీ, రుజువులతోటీ నిరూపిస్తూ మాటలాడగల యే వ్యక్తి అయినా తన ఉపన్యాసానికి మూడు రోజులు కాదు - వారంరోజులు తీసుకున్నా బాధలేదు కాని, ఏసభ్యుడయినా, తనకు తోచినంతసేపు మాటలాడ వచ్చును కాబట్టి, తన దగ్గిర సరుకున్నా లేకపోయినా, చెప్పిందే చర్విత చరణంగా చెపుతూన్నా, సందర్భాన్నీ ప్రస్తావన అంశాన్నీ తప్పించి మాట్లాడినా, అది అన్యాయమే కదా?

రంగయ్యరుకు మంచి వాగ్ధాటీ, భాషా పరిజ్ఞానమూ, వాదించగల నేర్పూ ఉండడంచేత ఎవ్వరికీ కూడా, ఎవ్వరి కేమిటి - ప్రెసిడెంటుగారికి కూడా, 'నీవు అనవసరపు ప్రస్తావన చేస్తున్నావు' అనడానికి సందు దొరకదన్నమాట! అందుచేత రంగయ్యరుకు కావలసినంత సావకాశం యిచ్చాడు. ఆంగ్లో ఇండియన్ గ్రూప్ లీడరయిన సర్ డార్సి లిండ్సే (Sir Darsy Lindsay) "ప్రెసిడెంటుగారు గమనించాలి! ఉపన్యాసం పరిధి దాటి దీర్ఘం, సుదీర్ఘం అయిపోతోంది" అని హెచ్చరిక చేసినా, రంగయ్యరు ఉపన్యాసాన్ని సాగనిచ్చాడు.

రంగయ్యరు అన్నంతపనీ చేశాడు. తన ఉపన్యాసం వినడానికి మనుష్యులు ఉన్నా, లేకపోయినా, ధోరణిలో తబ్బిబ్బు లేకుండా, ఆ మూడు రోజులపాటూ ఆ ఉపన్యాసాన్ని సాగించా డా ధీశాలి.

మేము కేంద్ర శాసన సభా సభ్యులంగా జీవితాన్ని గడపిన ఆ మూడు సంవత్సరాలలోనూ, ఈ మూడు రోజుల ఉపన్యాసకాలం చాలా సరదాగానూ, ఉత్సాహంగానూ, మరపురానిదిగానూ తయారయింది. ఆ తర్వాత ఆంగ్లో ఇండియన్ గ్రూప్ నాయకుడు ఆ చర్చ సంబంధంగా మాటలాడుతూ, రంగయ్యరు గారు తన సుదీర్ఘ - కాదుకాదు - దీర్ఘ, అతి దీర్ఘ, మహాదీర్ఘ ఉపన్యాసంతో అనవసర కాలయాపన చేశాడని వాపోయాడు.

మోతీలాల్‌గారి పరిహాసం

అప్పటివరకూ అంతా సవ్యంగానే నడిచింది. కాంగ్రెసుపార్టీ నాయకుడుగా, మోతీలాల్ నెహ్రూగారు సమాధానం ఇవ్వడానికి లేచే సరికి మాత్రం అలజడి ఆరంభం అయింది. ఆయన లిండ్సే మాటలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండి ఉండవలసింది. ప్రెసిడెంటుగారే రంగయ్యరు ఉపన్యాసాన్ని అదుపులో పెట్టనప్పుడు, లిండ్సేగారి మార్కులకు ప్రెసిడెంటుగారు అభ్యంతరం తెలపనప్పుడు తన ఉపన్యాసాన్ని తాను చెప్పదలచిన పాయింట్లు ఆధారంగా, కొనసాగించుకుపోయి ఉండవలసింది. ముఖ్యంగా తనకూ, రంగయ్యరుకూ మధ్య ఉన్న ఆజన్మ వైరాన్ని తలుచుకుని అయినా తన ధోరణి మార్చుకోవలసింది. కాని ఆయన రంగయ్యరులాంటి ప్రత్యర్థిని క్షమించి వదిలేరకం కాదుగా! తాను కాంగ్రెసుపార్టీ నాయకుడననీ, పార్టీ మెంబర్ల హక్కులను కాపాడవలసిన బాధ్యత తనమీద ఉన్నదనయినా గ్రహించకుండా, లిండ్సే రిమార్కులకు జవాబు చెప్పే అవకాశాన్ని పురస్కరించుకుని, రంగయ్యర్ని అ సభామధ్యంలో అపహాస్యం చేయడానికి పూనుకున్నాడు.

"అయ్యా, ఆంగ్లో ఇండియన్ పార్టీ నాయకు లయిన లిండ్సేగారు సి. ఎస్. రంగయ్యరుగారి దీర్ఘ ఉపన్యాసాన్ని గురించి ఫిర్యాదు చేశారు. నిజమే, అయినా, అసలు రంగయ్యరుగారి ఉపన్యాసంలో 'సరుకు' యేమయినా ఉందా?" అంటూ ఆరంభించిన అ ఉపన్యాసాన్ని విని, మా ప్రత్యర్థులయిన శాసన సభ్యు లంతా పకపకలతోటీ, ఇకిలింతలతోటీ బాగా ఆనందించారు. తనకి జూనియర్ అయిన ఒక వ్యక్తిని పార్టీనాయకుడి హోదాలో ప్రత్యర్థులనుంచి కాపాడడం పోయి, పార్టీలీడర్‌గారే అదోలా మాటలాడితే అవతలి వారికి లోకువ కాదూ?

నా అభ్యంతర తీర్మానం

వెంటనే నేను మా పార్టీ సెక్రటరీ అయిన రంగస్వామయ్యంగారికి ఒక చీటీ పంపించాను. ఆయన లీడర్‌గారి పక్కనే కూర్చున్నాడు. అ చీటిలో లీడర్‌గా నెహ్రూగారు చేసిన పొరపాటును ఆయన దృష్టికి తీసుకువచ్చి, ఆయన ఉపన్యాసం ముగించే లోపల, చేసిన పొరపాటు దిద్దుకొనుట కవసరమయిన నాలుగు మాటలు చెప్పవలసిందని కోరాను. రంగస్వామయ్యంగారికున్న భయం కారణంగా ఈ చీటి లీడర్‌కి చూపడంగాని, తనకు తానుగానే ఒక చిన్న సర్దుబాటు చేయడంగాని జరుగుతుందని ఆశించాం.

అల్లా జరగని కారణంగా పార్టీమీటింగ్‌లో "సభలో లీడర్‌గా తదితర సభ్యుల తప్పొప్పులను కాపాడవలసిన లీడరే చేసిన పొరపాటుకు చింతిస్తున్నాము" అని ఒక తీర్మానం ప్రతిపాదించాను. దాన్తో మాపార్టీ మీటింగ్‌లో అలజడి బయల్దేరింది. ప్రతి సభ్యుని హృదయమూ తహతహ లాడింది. ఒకటి రెండుసార్లు ఈ విషయం కార్య నిర్వాహక వర్గం వారి ముందుకు వచ్చింది. కాని దానిని నిరవధికంగా నెట్టివేశారు. డెప్యూటీ లీడర్ శ్రీనివాసయ్యంగారు మూగనోము పట్టడంచేతా, లీడర్ తాము చేసిన పనిని సరిదిద్దుకోడానికి ఒప్పుకోని కారణాన్నీ, దాని గతి ఇలా పట్టింది. ఈ విషయాన్ని జనరల్ బాడీ ఎదుట పెట్టవలసిందని కార్యదర్శినీ, అధ్యక్షుణ్ణీ కోరినప్పుడు అల్లాగే అంటూనే ఏడాది దాటించారు.

ఈ ఏడాదిలోనూ సభ్యులంతా విడివిడిగానూ, నలుగురూ కలిసి నా వద్దకు వచ్చి, నాయకునిమీద అటువంటి తీర్మానం తగదు, దానిని ఉపసంహరించుకోవలసిందని కోరారు. నేను ఒప్పుకోలేదు. నాకు ఆయనపై వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషమూ, దురభిప్రాయమూ లేవనీ, సభ్యులకు కావలసిన రక్షణ ఉండాలనే కాంక్షే అ ప్రతిపాదన తీసుకు రావడానికి కారణమనీ సూచించాను. అయినాగానీ, మెంబర్లందరూ అవసరమయిననాడు తామంతా నాయకుడ్నే సమర్థిస్తాం అని కూడా అంటూ, నన్ను అ ప్రతిపాదన తగ్గించుకోమని కోరారు. సి. ఎస్. రంగయ్యరు కూడా నన్ను భయపెట్టాడు. "ఇప్పటి వరకూ నాయకు డొక్కడే, చేసిన పొరపాటుతో అపహాస్యాల పాలయ్యాడు. మీరంతా ఆయన్ని సమర్థించే పక్షంలో మిమ్మల్నందర్నీ చూసి ప్రపంచకం అపహాస్యం చేస్తుం"దని విశదీకరించాను.

రాజీ ప్రతిపాదన

సంవత్సరాంతంలో ఒక రాజీ ప్రతిపాదన సూచించబడింది. ఆ కారణంగా మా ఇద్దర్నీ సంఘటన పరిచారు. వారు, మా కలయికకు కాలం నిర్ణయించుకుని, నేను అసెంబ్లీ బిల్డింగ్‌లో ఆనాటి కార్యక్రమాన్ని ముగించుకుని కూర్చున్న సమయంలో మోతీలాల్ నెహ్రూగార్ని నావద్దకు తీసుకువచ్చారు. వస్తూనే మోతీలాల్‌గారు పశ్చాత్తాపాన్ని కనబరిచారు. ఈ విషయంలో తన సానుభూతిని వెలిబుచ్చుతూ గాంధీ మహాత్ముడు తన పేర ఉత్తరం వ్రాశారని చెప్పారు. ఇటువంటి విషయాలలో ఆయన కా మూర్ఖపు పట్టూ, మొండితనమూ లేకపోతే ఆయన్ని సదా నా భుజస్కంధాలపైన మోస్తాను, ఆయన యందు నాకంత అభిమానమూ, గౌరవమూ ఉన్నా యన్నాను.

ఆ సమాచారం అంతటితో అల్లా చల్లారి పోయింది. ఈ విషయంలో ఓటమి నాదీ, గెలుపు మోతీలాల్‌గారిదీ అని ఒప్పుకోవడం న్యాయమేమో! ఆయన పార్లమెంట్‌లో అందరి సభ్యుల సమక్షంలో తన తప్పును ఒప్పుకోవలసిన పరిస్థితి తప్పిందిగా మరి! నాయకుడు తన తప్పును గ్రహించ గలిగాడు. నన్నూ ఎవ్వరూ ఎంత బలవంతం చేసినా ప్రతిపాదనకు వెనక్కు తీసుకునేలా చేయలేకపోయారని నేనూ సంతోషించాను.