నా జీవిత యాత్ర-3/జెయిల్లో గ్రూపు రాజకీయాలు

వికీసోర్స్ నుండి

16

జెయిల్లో గ్రూపు రాజకీయాలు

1940 నవంబరు 26 న నేను వెల్లూరు జెయిల్లో ప్రవేశించేసరికి, అక్కడ 'ఎ' క్లాసులో, మంత్రిగా పనిచేసిన డా॥ టి. ఎస్. ఎస్. రాజన్, తిరుచీ మ్యునిసిపల్ చెయిర్మనూ - ఎం. ఎల్. ఏ. అయిన పి. టి. తేవరూ వున్నారు. వారు ఉభయులూ తిరుచీ ప్రాంతానికి చెందినవారే. ఇరువురూ అక్కడే సత్యాగ్రహం చేశారు. ఆ ఇరువురిలో శ్రీ తేవరు మొదటివాడు. డా॥ రాజన్ మాత్రం గాంధీగారి సూచనలకు వ్యతిరేకంగా రాజగోపాలాచారిగారి పదకం ప్రకారం వ్రాయ బడిన ఉత్తరాలను "వార్ కమిటీ" మెంబర్లకు అందచేయడంద్వారా సత్యా గ్రహులయ్యారు. 1930 ఉప్పుసత్యాగ్రహ దినాలలో లాగే ఇప్పుడూ డా॥ రాజన్ రాజగోపాలాచారిగారి ఆజ్ఞలనే పాటించారు. 1930 లో రాజగోపాలాచారిగారు తంజావూరు జిల్లా వేదారణ్యంలో ఉప్పుసత్యాగ్రహ సమరం ప్రారంభించారన్న సంగతి చదువరు లెరిగివున్నదే. శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి కూడా అదే ప్రకారంగా రాజాజీగారి సూచనలను అనుసరించి, యుద్ధ సంఘ సభ్యులకు ఉత్తరాలు అందజేసి జెయిలుకు వచ్చింది. అదేప్రకారం రాజాజీగారి ఉత్తరువులనే పాటిస్తూ జెయిలుకు వచ్చిన తమిళులు చాలామంది వున్నారు. వారు, గాంధీగారి నినాదాల సంగతి ఎరిగో ఎరగకో తెలియదు గాని, రాజాజీగారి ఆజ్ఞలను పాలించారు.

రాజాజీ పట్టు

లోగడ చెప్పినట్లు, బాపినీడుగారు నవంబరు 23, 24 తేదీలలో బందరుకు తీసుకువచ్చిన ఉత్తరాలకు నకళ్లద్వారా రాజగోపాలాచారిగారి లేఖలు ఆంధ్రుల చేతులలోకి రహస్యంగా వెళ్ళాయి. డా॥ రాజన్, శ్రీమతి రుక్మిణీలక్ష్మీపతి గాక ఇంకా చాలామంది తమిళులు రాజాజీ ఆజ్ఞలనే పాలించడమూ, గిరిగారిని ఎల్లాగయినా తనవైపు తిప్పుకోవాలని రాజాజీ చేసిన ప్రయత్నమూ మున్నగునవి చూస్తే, గాంధీగారు తన కార్యక్రమాన్ని అంగీకరించక పోయినా, గాంధీగారి సూచనలకు వ్యతిరేకంగా రాజాజీ గారు ఏ విధంగానయినా తన పద్ధతి ప్రజలలో ప్రచారం కావాలనీ, తన పద్ధతే అందరూ అంగీకరించాలనీ అనేక విధాల ప్రయత్నం చేస్తూన్నట్లు కనబడింది.

ఆ సంగతి రాజాజీ స్వయంగా 1940 డిసెంబరులో సత్యాగ్రహం చేసినప్పుడు పూర్తిగా తేలిపోయింది. ఆయన తన ఉత్తరాలనే యుద్ధ సంఘ సభ్యులకు స్వయంగా యిచ్చి, తన్మూలకంగానే సత్యాగ్రహి అయ్యారు. రాజాజీ గిరిగారిని అధమం గాంధీగారి నినాదంలోని ఆఖరు పంక్తినయినా వదలమని మరీ మరీ బలవంతం చేయడం గమనిస్తే, వారికి అహింసాత్మక విధానంలో విశ్వాసం లేదనీ అర్థం అవుతోంది. అహింసాత్మక విధానంలో రాజాజీకి ఎంత నమ్మిక లేదో, గాంధీగారికి అంత ఎక్కువగా నమ్మకం వుంది. రాజాజీ, గాంధీగారి అహింసా విధానానికి అనుగుణంగా నడుచుకోలేకే, గాంధీగారి నినాదాన్ని ఉచ్చరించ నిరాకరించడమూ, దానిని ఉచ్చరించవలదని ఇతరులను బలవంతం చెయ్యడమూ జరిగింది.

ఒకరివెంట ఒకరు

ఇటువంటి మన:ప్రవృత్తితోనే రాజగోపాలాచారిగారు సత్యాగ్రహ కాండ జరిపి, 1940 డిసెంబరులో వెల్లూరు జెయిలుకు వచ్చారు. మేము వెల్లూరు జెయిలులో ఒక నెల మాత్రమే కలసివున్నాము. ఉభయ శాసన సభల తాలూకు కాంగ్రెసు సభ్యులు అనుదినం ఒకరివెంట ఇంకొకరు అల్లా జెయిలుకు వస్తూన్న పరిస్థితిని గ్రహించిన రాజాజీ, గాంధిగారి శాసన ధిక్కార పదక ప్రభావాన్ని గ్రహించి ఆశ్చర్యపోయాడు.

ఒకరోజు నాతో ఆయన, ఎం. ఎల్. ఏ. లు కొందరు జెయిలుకు రావడం గమనించిన కారణంగా, "నీవు అన్ని రకాలవాళ్ల నీ తీసుకువస్తున్నా" వన్నారు. హరిజన ఎం. ఎల్. ఏ. లు ఏ ఒక్కరూ మినహాయింపు లేకుండా అంతా జెయిలుకు వచ్చారు. ఇది కేవలం ఆంధ్రుల విషయంలోనే గాదు నేను అంటున్నది - తమిళులు, మలయాళీలు, కన్నడిగులు ఎందరెందరో జెయిళ్ళకు వచ్చారు. వారూ అధిక సంఖ్యాకులుగానే వచ్చారు.

తమ శారీరక, ఆర్థిక, మానసిక స్థితులను గమనించ కుండా, తమ తమ ఇక్కట్లను లెక్క చేయకుండా ఎం. ఎల్. ఏ. లూ, అఖిల భారత కాంగ్రెసు కమిటీ మెంబర్లూ, ఏ ఒకరిద్దరో మినహాగా అంతా, సత్యాగ్రహ సమరంలో పాల్గొని, జెయిళ్లకు రావడం చూసిన నాకు, వారి అఖండిత దేశభక్తినీ, వారి రకరకాల త్యాగాలనూ తలచి, మనస్సు ఉప్పొంగి పోయింది. శ్రీ వెంకటప్ప నాయుడు, శ్రీ పి. వీరభద్రస్వామి, కందుల వీర రాఘవస్వామి (బారెట్ లా), అనంతపురం హరిజన ఎం. ఎల్. ఏ. వేదారప్ప, మలబారుకు చెందిన చందూ, ఇంకా వందలూ వేలూను. ఎన్ని పేర్లని వ్రాయగలను? అందులో చందూ చెయ్యి గూడుతప్పి వుంది. తనకి లభించిన సేవతో, మేము ఇప్పించగల వైద్యసహాయంతో, తాను తీసుకున్న వ్యాయామాది నియమాలతో అతడు తన శిక్షాకాలం కులాసాగానే గడిపాడు.

మేజస్ట్రేట్ల చిత్తం, మా భాగ్యం

ఈ సమర సందర్భంలో శిక్షాధికారం పూర్తిగా మేజస్ట్రేట్ల వశం అవడాన్ని, వారి చిత్తం వచ్చినట్లు వ్యవహరించారు. శాసన సభా సభ్యుల విషయంలో, మేజస్ట్రేట్ల చిత్తమే వారి భాగ్యమయింది. ఒక తీరూ, ఒక తెన్నూ లేకుండా కొందరికి 'ఏ', కొందరికి 'బి', మరి కొందరికి 'సి' మేజస్ట్రేట్లు తమ ఇష్టానుసారం ఇవ్వడం జరిగింది. అనంతపురం ఎం. ఎల్. ఏ. కల్లూరు సుబ్బారావు, తంజావూరు హరిజన ఎం. ఎల్. ఏ. నాయనారు, తూర్పుగోదావరి జిల్లావాసి లక్ష్మణస్వామి, విశాఖపట్నం హరిజన ఎం. ఎల్. ఏ. సాకేటి గురువులు మున్నగు వారంతా 'బి' క్లాసుకు మార్చబడే దాకా 'సి' క్లాసులో ఉండేవారు. దర్మిలా, వారిని 'బి' నుంచి 'ఎ' కి గూడా మార్చడం జరిగింది.

ఏ క్లాసు ఆయనకు ఇచ్చారో తెలియని కారణంగా, మంత్రిగా ఉండిన బెజవాడ గోపాలరెడ్డిని మూడవ తరగతి రైలు పెట్టెలో ఎక్కించారు. సేలం జిల్లా బోర్డు అధ్యక్షుడుగా ఉంటూన్న ఎం. ఎల్. ఏ. మాచియప్ప గౌండరు కూడా వెల్లూరు జయిలుకు 'క్లాసు' నిర్ణయం లేకుండానే వచ్చాడు. కల్లూరు సుబ్బారావుని 'బి' క్లాసుకు మార్చినా ఆయన్ని మళ్ళీ ఎందుకో 'సి' కి మార్చడముతో, 'సి' క్లాసు ఖైదీగా రెండు వారాలు గడచిన తర్వాతగాని తిరిగి ఆయన్ని 'బి' క్లాసుకు మార్చక పోవడమూ జరిగింది. శ్రీ నాయనారూ, లక్ష్మణ స్వామీ మూడు వారాలపాటు 'సి' క్లాసులో ఉన్నా, 'బి' క్లాసుకు మార్చబడ్డారు.

చాలా మంది రాష్ట్ర శాసన సభ్యులనూ, అనంతశయనం అయ్యంగారూ, తిరుమలరావూ వంటి కేంద్ర శాసన సభ్యులనూ 'బి' క్లాసులో ఉంచారు. గ్రంథి వెంకటరెడ్డి నాయుడూ, ఎమ్. సుబ్బారావూ, కందుల వీర రాఘవస్వామి, కె. వెంకటస్వామి నాయుడు (మాజీ మదరాసు మేయరు), రాఘవమేనోన్ వగైరాలకు ప్రారంభంలో 'ఎ' క్లాసు ఇచ్చినా, వారిని 'బి' క్లాసులోకి మార్చారు. ఆ రోజులలో వెల్లూరు జెయిలుకు సంబంధించినంతవరకూ మిగిలిన 'ఎ' క్లాసు ఖైదీలను 'సి' క్లాసులోకి ఎప్పుడయినా వెళ్ళమంటారేమోననే అనుమానం మాకందరికీ ఉండేది.

మామూలు ప్రపంచక జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా, ప్రభుత్వపు తీరు తెన్నులనూ, పద్ధతులనూ గ్రహించి ఉంటే, చట్టనిర్మాణం చేయగల వ్యక్తులను ఏ ప్రకారంగా చూడాలో అర్థమయి ఉండేది. కాని కాంగ్రెసు ప్రభుత్వంలో పనిచేసి ఉన్నా, మేజిస్ట్రేట్లలో కొంతమందికి ఆ మాత్రపు ప్రపంచ జ్ఞానం కూడా లేకుండాపోయింది. గవర్నరుగారికి గాని, వారి సలహాదారులకు గాని ఖైదీలకు ఎ, బి, సి, క్లాసుల నిర్ణయించబడుతూన్న విధానంపట్ల గాని, శాసన సభ్యులనేకాదు మాజీ మంత్రులను కూడా జెయిలు అధికారులు చూస్తున్న విధం పట్లగాని ఏ విధమయిన శ్రద్ధా, పట్టింపూ లేకుండా పోయాయి. మాజీ మంత్రులూ, శాసన సభ్యులూ, అఖిల భారత కాంగ్రెసు కమిటీ మెంబర్లూ మున్నగు సత్యాగ్రహుల గతి ఏమయినా ఈ గవర్నర్లకూ, వారి అడ్వయిజర్లకూ చీమ కుట్టదు. అవును, ఎందుకు కుట్టాలి? జెయిల్లో మళ్ళీ జెయిలు అన్నట్లు మాజీ మంత్రులను కూడా రాత్రి ఆరు గంటలూ, ఉదయం ఆరు గంటలా మధ్య లాకపులో ఉంచినా వారికి పోయిందేమీ లేదు. అటువంటప్పుడు మామూలు ఎం. ఎల్. ఎ.లు, ఏ. ఐ. సి. సి. మెంబర్లూ అల్లా రాత్రి తెల్ల వార్లూ, సాయంత్రం ఆరునుంచి ఉదయం ఆరువరకూ లాకప్పులోని లాకప్పుతో సతమత మవుతేనేం? ఇది వారి రాజ్యాంగ విధానమేగా!

తలకి చమురు ప్రశ్న

మొదట్లో మేము జెయిళ్ళకు వెళ్ళగానే, మా సంఖ్య చాలా తక్కువగా ఉంటూన్నంత కాలమూ, మమ్మల్ని మా గదులలో మూసిపెట్టేవారు. జెయిలులో మావి ఒకే వరుసలో ఉన్న గుహలలాంటి గదులు. మెదలడానికి జాగాగాని, పీల్చుకోవడానికి పరిశుభ్రమయిన గాలిగాని మాకు లభ్యం అయ్యేదికాదు. మేము అల్లా ఆ మూసిపెట్టే సెల్సులో ఉంటూన్న రోజులలోనే, ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కాంట్రాక్టర్ (Mr. Contractor) జెయిలు పరిశీలించడానికి వచ్చాడు. కొంతమంది 'బి' క్లాసు ఖైదీలు తలకు రాసుకోవడానికి నూనె సప్లయి చేయించవలసిందని కోరారు. ఆయన, పెడీలున "నేను మీ కాంగ్రెసు ప్రభుత్వపు ఉత్తరువులనే అనుసరిస్తున్నా" నన్నారు. ఆ దెబ్బ వచ్చి తిన్నగా మా ముఖాలకే తగిలింది. రాయికంటె కూడా ఘనంగా దెబ్బతీసే వేళాకోళం లాంటి వెక్కిరింత అది. డా॥ రాజన్ మాజీ జెయిళ్ళ మంత్రి. ఈ సత్యాగ్రహం సందర్భంగా జెయిలుకు వచ్చినప్పుడు, మన కంటిని మన వేలుతోనే పొడుస్తున్నాడు. చూశావా అన్నాను. మేమక్కడికి స్వయంకృతాపరాధఫలం అనుభవించడానికి వెళ్ళాం (We have gone there to stew in our own Juice).

మా కాంగ్రెసు గవర్నమెంటు కూడా కొన్నికొన్ని సందర్భాలలో జస్టిస్ పార్టీ వారి విధానాల కంటె అధమంగా వర్తించిన సందర్భాలున్నాయి. జెయిళ్ళ పరిపాలనా విధానాలలో మా పద్ధతి చాలా అనుచితంగానే ఉండేది. కొంతకాలం జెయిలు అనుభవాలను పొందిన మీదటనే మేము రాజ్యాంగాన్ని చేపట్టాం. అందువల్ల జెయిళ్ళల్లో రాజకీయ ఖైదీలుగా మేము అనుభవించిన కష్టసుఖాలన్నీ మాకు తెలుసు. నిజానికి ఖైదీలు కూడా జీవించవలసిందే గనుక, మేము కొన్ని క్రొత్త నిబంధనావళులనూ, మార్పులనూ ఖైదీల విషయంలో న్యాయంగా తీసుకు రావలసి ఉంది.

మాజీ మంత్రిపై విసురు

రాజకీయ ఖైదీలకు తలకు చమురు ఇవ్వడం విషయంలో కాంగ్రెసు ప్రభుత్వంవారు ఏమని ఆర్డరు వేశారో నాకు తెలియదు. కాని ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కాంట్రాక్టర్ చమురు సప్లయికి కాంగ్రెసు ప్రభుత్వం వారిని కోరినప్పుడు, 'మానవుడు బ్రతకడానికి చమురు అక్కరలేదు' అనే మిషతో వారి కోరిక తిరస్కరించబడిందని తెలిసింది.

మా కంటె ముందుగానే జెయిలుకు వచ్చిన శ్రీనివాసరావనే ఒక వ్యక్తి, వెల్లూరు జెయిలులో ఉన్న ఆ మొదటి వారం పదిరోజులలోనే, కాంట్రాక్టర్‌గారి విసురును డా॥ రాజన్‌గారి ముఖంమీదికి విసరగల అవకాశం లభించింది. శ్రీనివాసరావేమన్నాడంటే, "తమరు ఇన్‌స్పెక్టర్ - జనరల్ ఆఫ్ ప్రిజన్స్‌గా కాంట్రాక్టర్‌గారు చేసిన సూచనను జెయిళ్ళ మంత్రిగా తిరగతోడారు. బహుశ: మీరు, మీ జీవిత పర్యంతమూ, ఒక పాతిక సంవత్సరాలపాటు, మంత్రిగానే ఉంటామని తలచి ఉంటారు. పాపం, ఇప్పుడు తమరు ఏర్పరచిన రూల్స్ ప్రకారమే రాజఠీవితో బ్రతకడానికి వచ్చారు" అన్నాడు.

నేనూ కాంగ్రెసు గవర్నమెంటులో మంత్రినే అయినా ఈ విషయాలతో జరుగుతున్న దేమిటో నాకు తెలియదు. ఈ ప్రశ్న అందరి మంత్రుల అభిప్రాయాలూ సేకరించిన తరవాతనే తేల్చవలసి ఉంటుందని తలవబడి ఉండలేదు. అయినా, కాంగ్రెసు ప్రభుత్వం వారి ప్రతి చర్యకు మంత్రుల మందరమూ సమానంగా బాధ్యత వహించవలసి ఉందిగదా! ఈ తడవ లభించిన వెల్లూరు జెయిలు జీవితంలో మొదటి పదిరోజులలో మాకు కలిగిన అనుభవం ఇది. దర్మిలా, మమ్మల్ని మాకు అలవాటయిన ఆ పాతకొట్లలోకే మార్చారు.

బథిరశంఖ న్యాయం

తిరుచురాపల్లిలో గత పది మాసాలలోనూ మాకు కలిగిన అనుభవాలను గురించి చెప్పే ఉన్నాను. ఆరంభంలోనే డా॥ రాజన్, శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి, రాజగోపాలాచారి మున్నగువారు గాంధీగారి నినాదాలను గాక రాజాజీగారి పద్ధతిని ఉత్తరాలు ఆయా యుద్ధసంఘ సభ్యుల కందజేసి జెయిళ్లకు వచ్చారని మనవిసేసే ఉన్నాను. అనగా ఒకరి ఆజ్ఞ ప్రకారంగా గాక, వారి ఇష్టానుసారంగా, వారు కోరుకున్న విధంగా వారు జెయిళ్ళకు వచ్చారన్న మాట! వారి ప్రచారం జెయిళ్ళలో కూడా సాగింప నారంభించారు. ఈ ఉద్యమం విఫలమయిందనీ, జనులు నిష్కారణంగా, ఏ ఒక్క క్రియాసాధనకూ పూనుకోకుండా, ఊసుబోక జెయిళ్ళకు వెళ్లారనీ అన్నారు.

జెయిళ్ళలో ఎటువంటి ప్రచారం జరిగినా, బయటకు వెళ్లేవారికి, రాజాజీ గ్రూపు వారెట్టి ప్రబోధం చేసిఉన్నా, ఆ ప్రబోధమంతా చెవిటివాడిముందు శంఖమే అయింది. బయటకు వెళ్ళిన వారంతా వారు ఇచ్చే స్టేట్‌మెంట్లు ద్వారానూ, ఉపన్యాసాల ద్వారాను - గాంధీగారినే మనస్ఫూర్తిగా అనుసరించాలి, వారి విధానాలే మనకు శరణ్యాలు అని చెప్పేవారు.

ఇది రాజాజీకి చాలా చికాకునీ, తలవంపునూ కలుగజేసింది. ఆయన బాధపడసాగాడు. ఆయన నాతో అన్నాడు కూడా. "ఏమిటి, బయటకు వెళ్ళినవాళ్ళకి బుద్ధీ, జ్ఞానం ఉన్నాయా లేదా? అదేమిటి, వాళ్ళంతా ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నా"రని, పాపం, వాపోయాడు. వల్లభ్‌భాయ్ పటేల్ గారి ఉపన్యాసాన్ని చదివిన రాజాజీ, "ఏమిటిది? వల్లభ్‌భాయ్ పటేల్ కూడా ఇల్లా కలవరపడుతున్నాడేమి"టన్నాడు.

డా. రాజన్ స్టేట్‌మెంట్

జెయిళ్ళనుంచి బయటకు వెళ్ళిన వారంతా అనుసరిస్తూన్న పద్ధతులను గ్రహించయినా, వారంతా గాంధీగారినే ఆదర్శంగా పెట్టుకున్న పరిస్థితిని గ్రహించయినా, రాజాజీ, డా॥ రాజన్ వగైరాలు తమ అభిప్రాయాలను మార్చుకుంటా రనుకున్నాను. కాని విడుదల అయిన వెంటనే డా॥ రాజన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఈ పెద్దమనిషి జెయిలు బయటకూడా, రాజాజీకి అనుగుణంగా, కలతలూ, కలవరపాట్లు తీసుకు రాదలచాడా అని తలచాను.

డా॥ రాజన్ స్టేట్‌మెంట్‌లో మేము తిరిగి రాజ్యాంగాన్ని చేపట్టమని లేదు. పైగా ఆయన ఏదో సందిగ్దంగానూ, ఆషామాషీగానూ అన్నదేమిటో తెలుసా? "ఏది ఎల్లా జరిగినా, మనం గాంధీగారిని వ్యతిరేకించ కూడదేమో!" అన్నాడు. ఆ స్టేట్‌మెంట్‌ను పూర్తిచేస్తూ చిట్టచివర వాక్యంగా ఆయన, "అయినా ఈ ఉద్యమం కొత్త మార్గం తొక్కితే బాగుంటుంది" అన్నాడు. అంటే, ఆ వాక్యానికి ఏవిధంగా నయినా అర్థం చెప్పుకోవచ్చు నన్నమాట అంతేగాని, తిరిగి రాజ్యాంగాన్ని చేపట్టమని మాత్రం ఆ వాక్యానికి అర్థం కాజాలదు.

వ్యక్తి సత్యాగ్రహం చాలదు. సమష్టి సత్యాగ్రహాన్ని చేబట్టాలనీ అర్థం చెప్పుకోవచ్చు. కాని ఆయన అంతరంగంలో, తిరిగి అందరమూ, "మేము, మీ యుద్ధం విధానాలతో సహకరిస్తాం" అని ఆంగ్లేయులకు హామి ఇచ్చి, మళ్ళీ రాజ్యాంగాన్ని చేపట్టి, మంత్రిత్వం మొదలైన హోదాలలోకి పోవాలని ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

డా॥ రాజన్ స్టేట్‌మెంట్‌ను బాగా పరిశీలిస్తే, రాజాజీకి - గాంధీగారి దగ్గరకు వెళ్ళి, వారిని ఒప్పించడానికి శాయశక్తులా తంటాలు పడి, ప్రస్తుతం నడుస్తూన్న ఉద్యమం ఎంత "నిరర్థకంగా" తయారయిందీ తెలియపరచి, ఆయన్ని ఇంకా బలమయిన పద్ధతిని, తీవ్రమయిన శాసన ధిక్కార విధానానికి, అంటే సమష్టి సత్యాగ్రహానికీ, పూనుకునేటట్లు చేయాలని ఉన్నట్టు కనబడుతుంది. అందువల్ల, తిరిగి రాజ్యాంగాన్ని చేపట్టాలని ఉన్నట్టు అది అర్థాన్ని ఇవ్వకపోయినా, మనమంతా సర్దార్ శార్దూలసింగును అనుకరిస్తూ, గాంధీగారిని సవల్ చేయాలన్న భావం ఆ స్టేటుమెంట్‌లో పూర్తిగా ఉన్నట్టు ప్రపంచ ప్రజలకు అనిపించగలదని అనక తప్పదు.