నా జీవిత యాత్ర-3/ఆకాంక్ష

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

17

ఆకాంక్ష

ఇల్లా నడిచింది నా చరిత్ర. ఈ 'నా జీవిత యాత్ర' ద్వితీయ, తృతీయ ఖండాలలో నేను దేశంలో రాజకీయంగా జరిగిన పోరాటాలలో ఎల్లా ఎల్లా పాల్గొని ఏయే మార్గాల దేశసేవ చేయడానికి మనోవాక్కాయాల ప్రయత్నించానో, పుట్టింది బీదల ఇళ్ళల్లోనూ - పెరిగిందీ అక్కడే అయినా, ప్రజల నుంచి లాయరుగా సంపాదించిన లక్షలాది ధనం, తిరిగీ ఆ ప్రజల సుఖసంతోషాలే వాంఛిస్తూ, దేశమాత దాస్యశృంఖలాలను ఛేదించి ఆమెను సంపూర్ణ స్వాతంత్ర్య వాయువులలో ఉయ్యాల లూగించాలనే తలంపుతో రాజకీయ సమరంలో నిస్వార్థంగా ఖర్చుపెట్టి, మళ్ళా ఎల్లా ఏమీలేనివాడినే అయ్యానో చదువరులు గ్రహించే ఉన్నారు.

నా జీవితమంతా దేశం కోసమూ దేశీయుల కోసమూ వినియోగపడడమేగాక, `ఆంధ్ర అంటే ప్రకాశం, ప్రకాశం అంటే ఆంధ్ర' అన్న నా నమ్మిక ముందు ముందు నా జీవితంలో ఎల్లా నిర్ధారణ అయ్యిందో, గాంధీగారికే నామాలు పెట్టాలని ప్రయత్నించిన రాజగోపాలాచారి ప్రభృతులు, స్వాతంత్ర్య సంపాదన అనంతరం నేను ప్రధాన మంత్రిగా ఉండే సందర్భంలో ఎల్లా అందరూ కలిసి నన్ను పదచ్యుతుణ్ణి చెయ్యాలని ప్రయత్నించారో, ఎందువల్ల నేను కర్నూలును రాజధానిగా నిర్ణయించానో, వగైరా విషయాలన్నీ టూకీగా పాయింట్లలాగే వ్రాయగలననీ, వాటిని గూడా చాలావరకూ ఈ పుస్తకంలోనే అచ్చయ్యేలా చూస్తాననీ, వాటి నన్నిటినీ, అల్లా జరుగుతూన్న సందర్భాలను జరుగుతూన్న చరిత్రగా రూపొందించడం నాకు సాధ్యంగాకపోయినా ఆ లోటు, దరిమిలాని, మిత్రులూ, అభిమానులూ, అనుచరులూ అయినవారు తీర్చి, ఈ `నా జీవిత యాత్ర'కు అనుబంధంగా ప్రచురించి తీరతారనీ నా నమ్మిక. ఈ విధంగా ఈ ఖండాన్ని ముగిస్తూ, తరువాయి గ్రంథానికి వస్తాను. [1]

తృతీయ ఖండం సమాప్తము

  1. పంతులుగారి స్వీయకథనం ఇంతటితో ముగిసింది. వారు పాయింట్లుగా ఉటంకిద్దా మనుకున్న విషయాలు గాని, ఆ `తరువాయి గ్రంథం'గాని వ్రాయడం జరగలేదు. పంతులుగా రాశించినట్లుగానే, ఆ లోటును భర్తీచేసే భాగ్యం శ్రీ తెన్నేటి విశ్వనాథముగారికి కలిగింది. వారి రచనను ప్రకాశం పంతులుగారి `నా జీవిత యాత్ర'కు అనుబంధ సంపుటిగా సంతరించడమైంది. -- సం॥