నా జీవిత యాత్ర-3/నినాదం గురించి వివాదం

వికీసోర్స్ నుండి

15

నినాదం గురించి వివాదం

ఎ. ఐ. సి. సి. అంటే భారతదేశపు ఉద్యోగేతర కాంగ్రెసు ప్రజాప్రతినిధి సభ (Un official congress parliament) అన్నమాట!

వివిధ రాష్ట్ర కాంగ్రెసు కమిటీలవారు పంపించిన జాబితాలను జాగ్రత్తగా పరిశీలించి, ఆ జాబితాల నుండి సరి అయిన, తనకు కావలసిన వ్యక్తులను ఎన్నుకుని గాంధీగారు ఉద్యమం సాగించాడు.

మేము 1941 నవంబరు 24 న బందరులో రాష్ట్ర కాంగ్రెసు కమిటీ మీటింగు జరిపాము. ఆ మీటింగులో మన ఆంధ్రరాష్ట్రానికి సంబంధించినంతవరకూ, దినానికి నలుగురయిదుగురి కంటె ఎక్కువగాని పద్ధతిగా ఈ సత్యాగ్రహం సాగించడానికి పదకం వేసుకున్నాము. ఆ అయిదుగురూ తలో జిల్లా, తలో తాలూకాకీ చెందేవారుగా ఉండేవారు. మేము బందరులో కలిసే లోపల, అయ్యదేవర కాళేశ్వరరావు గాంధీ గారిని కలుసుకుని, మేము నడపబోయే ఉద్యమ విషయాలు ఆయనతో సంప్రదించి అవసరమగు సలహాలు తీసుకున్నారు.

అప్పటికే గాంధీగారు జాగ్రత్తగా ఆలోచించి, ఈ ఉద్యమంలో పాల్గొని జెయిళ్ళకు వెళ్ళదలచే సత్యాగ్రహులు ఉచ్చరించవలసిన నినాదాలు నిర్ణయించి, సర్వ సన్నద్ధంగా తన పదకాన్ని రూపొందించి ఉంచాడు. గాంధీగారు ఎంచిన నినాదాలు చిన్నవిగానూ, బోధనాత్మకంగానూ, సార్థకమై పనికివచ్చేవిగానూ ఉన్నాయి. గాంధీగారి వినూత్నాభిప్రాయం ప్రకారం, ఏ వ్యక్తి తనకు ఇచ్చవచ్చిన రీతిని ఏవేవో వాగుతూ ఆషామాషీగా వ్యవహరించకూడదనీ, అందరూ అచ్చున బోసినట్లు ఒకే విధమయిన మాటలూ, పాటలూ, నినాదాలూ చేస్తూ ముందుకు నడవాలనీ, ఐడియాలకు వ్యక్తినీ, వ్యక్తికి ఐడియాలనూ పిన్నుచేసి పారేశాడు. ఈ దెబ్బతో ఆయన ఆంగ్లేయులకే కాదు, ప్రపంచవాసులందరికీ తనకు కాంగ్రెసులో ఉన్న పలుకు బడిని, తనయందు ప్రజలకున్న అఖండిత విశ్వాసాన్నీ, ప్రజలలో ఉండే కట్టుబాట్లనీ, క్రమశిక్షణనూ చవి చూపించాడు.

అంత పెద్ద ఉద్యమంలో అంత చిన్న చిన్న నినాదాలా ఉచ్చరించడం అని కూడా ఎందరెందరో తలచారు. కాని గడచిన ఇరవై సంవత్సరాలుగా దేశీయులూ, కాంగ్రెసువారు కూడా తమ ఏకైక నాయకుని ఆజ్ఞలను తు. చ. తప్పకుండా నడచుకునే విధానాన్ని బాగా అలవరచుకున్నారు. అటువంటి పరిస్థితులలో గాంధీగారు తప్ప అన్యులెవ్వరూ దేశాన్ని ఒక్క మాటమీదా, ఒకే త్రాటిమీదా నడపలేరనీ, గాంధీగారిని కాదని ఏ వ్యక్తీ కూడా, ఇంకోరకంగా కార్యక్రమం నిశ్చయించ గలిగినా, ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేడని దేశీయులందరూ మనస్ఫూర్తిగా నమ్మేవారు.

రాజాజీ అపహస్యం, పోటీ నినాదాలు

దక్షిణ భారతదేశం ఎప్పుడూ సందిగ్ధ పరిస్థితిలో పడిపోవడం మామూలయింది. ఏ కారణాలవల్ల నయితేనేం, అది ఒక సందిగ్ధ పరిస్థితికే లోనయ్యింది. రాజగోపాలాచారి గారి కారణంగానే ఎప్పుడూ ఆంధ్రదేశం అల్లా సందిగ్ధ పరిస్థితులలోకి జారిపోయేది. రాజగోపాలాచారిగారు గాంధీగారి అహింసా విధానంమీద పూనా సభలో చేసిన స్వారీ విషయం చెప్పేఉన్నాను. దర్మిలా గాంధీగారి నినాదాలను అపహాస్యం చేశారు. రాజగోపాలాచారిగారి దృష్టిలో గాంధీగారు నిర్దేశించిన నినాదాలు అర్థరహితమయినవి.

అందువల్ల వాటికి బదులుగా ప్రతీప్రాంతంలోనూ ఉన్న యుద్ధ కమిటీ సభ్యులకు, ఉత్తరాల పూర్వకంగా, యుద్ధ నిధులను సేకరించవలదనీ, యుద్ధానికి జనాన్ని ప్రోత్సహించి జవాన్లను ఎంచుకో వద్దనీ, తాము ఆ కమిటీనుంచి విరమించడం ఉత్తమమనీ సలహా సూచకంగా ఉత్తరాలు వ్రాయమన్నాడు. గాంధీగారి నినాదాలకు బదులుగా వ్రాయవలసిన ఉత్తరాలు ఎల్లా ఉండాలో ముసాయిదా తయారు చేశాడు.

మా కార్యదర్శి అయ్యదేవర కాళేశ్వరరావు వార్ధానుంచి తిరిగివచ్చి సంగతి సందర్భాలు చెప్పేదాకా, నవంబరు 23 న వార్ధాలో ఏం జరిగిందీ మాకు తెలియదు. గాంధీగారి నినాదాలకు బదులు, రాజగోపాలాచారిగారు తయారుచేసిన ముసాయిదా ఉత్తరమూ, అందులో వ్రాయబడిన విషయాలన్నీ మాగంటి బాపినీడుగారు సంపాదించిన నకలువల్ల మాకు తెలియ వచ్చాయి. ఆ ఉత్తరం చాలా పెద్దది. హేతువాదాత్మకంగా ఉంది. విసుగు పుట్టించేదిగా కూడా ఉంది. జరిగిన గ్రంథమంతా తెలియకపూర్వం బాపినీడుగారు తీసుకు వచ్చిన ఉత్తరాన్ని చూసి, రాజగోపాలాచారిగారు గాంధీగారికి వ్యతిరేకంగా, ఆయన్ని కాదని ఈ ఉత్తరాన్ని వ్రాసి ఉండడనే తలుస్తూ ఉండడాన్ని, సత్యాగ్రహం చేసే వారందరూ ఆ ఉత్తరానికి నకళ్లు వ్రాసుకోవడంలో నిమగ్నులయి పోయారు. మర్నాడు నేను గాంధీగారి నినాదాల నకళ్ళు చూశాను.

గాంధీగారి మందలింపు

కళా వెంకట్రావు వార్దాలో గాంధీగారిని, రాజగోపాలాచారిగారి ముసాయిదా ఉత్తరాన్ని గురించి అడిగాడట. ఆ ఉత్తరానికీ, గాంధీ గారి నినాదాలకీ పొంతనం కుదరక పోవడాన్ని, ఆయనకు అల్లా అడగాలని బుద్ధి పుట్టిందట. రాజగోపాలాచారి తెలివయిన వాడయితే అయి ఉండవచ్చుగాని, నా సూచనలను ఇల్లా తయ్యారు చెయ్యడం మాత్రం తగని పనేనని గాంధీగా రన్నారట! ఈ విషయంలో రాజగోపాలాచారి గారికి తాను వ్రాసిన ఉత్తరం గాంధీగారు వెంకట్రావుకు చూపించారట. కాగా, గాంధీగారు తన నినాదలనే ప్రతి సత్యాగ్రహి ఉచ్చరించాలనీ, అల్లా జరిగేటట్లుగా చూడమనీ వెంకట్రావుతో చెప్పారట. ఈ సంగతులన్నీ బందరులో వెంకట్రావు నవంబరు 24 న చెప్పినప్పుడు, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మేము నిజంగా రాజగోపాలాచారి గారి ఉత్తరాన్నే పట్టుకుని కూర్చుంటే చాలా పెద్ద తప్పే చేసినవారమై ఉండేవారం. వెంకట్రావే గనుక గాంధీగారి దగ్గరకు వెళ్ళి సంగతి సందర్భాలు గ్రహించి ఉండకపోతే, కథ అడ్డంతిరిగి, ఆచారి గారు మా చేత ఆడకూడని నాటకం ఆడించి ఉండేవాడు. వెంకట్రావు నిజంగా చాలా శక్తిసామర్థ్యాలు గల వ్యక్తి. ఆయన మొదటి నుంచీ మేము చేస్తూన్న పనులనన్నింటినీ క్షుణ్ణంగా గ్రహించిన వ్యక్తి.

ఏ విధమయిన మార్పు లేకుండా ప్రతి సత్యాగ్రహీ గాంధీగారి నినాదాల్నే వాడాలని మా కార్యనిర్వాహకవర్గంలో నిశ్చయించు కున్నాము. అప్పుడే, ఆ సభలోనే నేనూ మొదటి జట్టుతోనే నవంబరు 26 న సత్యాగ్రహంలో పాల్గొనాలని నిశ్చయించాను. నేను డిసెంబరు ఆఖరువరకూ బయటే ఉండాలను కుంటున్నానని వెంకట్రావు గాంధీగారితో చెప్పినప్పుడు, ఎంత త్వరగా సత్యాగ్రహంలో పాల్గొంటే అంత మంచిదని ఆయన సూచించినట్లు వెంకట్రావు ద్వారా వినడాన్ని, వెంటనే ఆ మొట్టమొదటి జట్టుతోనే సత్యాగ్రహం చేద్దామని నిశ్చయించుకున్నాను.

నేనూ, వెంకట్రావూ కలసి ఆ రాత్రే బందరునుంచి బయల్దేరి నవంబరు 25 ఉదయానికి పట్నం చేరుకున్నాము. నేను ప్రభుత్వ కార్యదర్శికి వ్రాసిన ఉత్తరం వెంకట్రావే సహాయంగా తీసుకు వెళ్ళి ఆయనకు అందజేశారు. అందు నేను ఆ మర్నాడు, అనగా నవంబరు 26 న తంబుచెట్టి వీధిలో సత్యాగ్రహం ప్రారంభించ నున్నానని తెలియజేశాను. తంబుచెట్టి వీధి హైకోర్టుకు ఎదురుగా ఉన్న వీధులలో ఒకటి.

గిరిగారికి రాజాజి అభ్యర్థన

గాంధీగారి వద్దనుంచి ఉత్తరం రాగానే రాజగోపాలాచారిగారు వార్ధా పరుగెత్తాడు. అక్కడ గాంధీగారి నినాదాల్నిగురించి, దానికి ప్రత్యామ్నాయంగా తాను వ్రాసిన ఉత్తరం గురించీ తర్జన భర్జన జరిగింది. రాజగోపాలాచారిగారు తన ఉత్తరం ఆయన నినాదాలకంటె మంచిదని, అది యావత్తు భారతదేశానికీ వర్తించే విధంగా వ్రాయబడిందనీ వాదించారు గాని, గాంధీగారిని తన అభిప్రాయాన్ని అంగీకరించేలా చేయలేక పోయాడు.

రాజగోపాలాచారిగారు వెనక్కి బయల్దేరాడు. అదే రైలులో డిల్లీ నుంచి పట్నం వస్తూన్న గిరిగారు ఉండడం తటస్థించింది. అల్లా కలిసి ప్రయాణం చేస్తూన్న సందర్భంలో గిరిగారూ, రాజగోపాలాచారిగారూ మాట్లాడుకోవడానికి అవకాశం కలిగింది. ఆ మాటలలో ఆయన గిరిగారితో తనకూ గాంధీగారికీ మధ్య నడచిన గ్రంథమంతా చెప్పాడు. తన పద్దతికి గాంధీ గారు ఎల్లా ఒప్పుకోలేదో వివరించాడు. తాను గాంధీగారితో గట్టిగా వాదిస్తే ఆయన రక్తపు పోటు ఎక్కడ అధికం అవుతుందోనన్న భీతితో ఎక్కువగా వాదించలేదని చెప్పాడు. గాంధీగారి నినాదాల కంటె తన ఉత్తరమే మేలుగా వ్రాయబడిన కారణాన్ని, తన పద్దతినే గిరిగా రంగీకరించడం న్యాయమని అభ్యర్థించాడు.

గిరిగారి సమాధానం

గిరిగా రప్పుడు, గాంధీగారి కార్యక్రమానికి వ్యతిరేకంగా తానెప్పుడూ నడవననీ, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీవారి సూచనలూ, దానికి అధ్యక్షుడయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి సూచనలూ తానెప్పుడూ వ్యతిరేకించననీ స్పష్టం చేశారు.

గిరిగారు నవంబరు 25 ఉదయానికి పట్నం వచ్చారన్న సంగతి ఆ రాత్రి చాలా పొద్దుపోయిందాకా నాకు తెలియదు. నవంబరు 26 ఉదయాన్నే నేను గిరిగారిని వారి ఇంటివద్దనే కలుసుకుని, ఆయన సత్యాగ్రహం చేసే పద్ధతిలో గాంధీగారిని నినాదాల్నే వాడవలసిందనీ, నేను ఆ నినాదాల్నే ఉచ్చరిస్తూ ఆనాడే ఉదయం 11 గంటలకు తంబుచెట్టి వీధిలో సత్యాగ్రహం చేయనున్నాననీ చెప్పాను. అప్పుడు గిరిగారు తానూ, రాజగోపాలాచారిగారూ కలిసి ప్రయాణం చేసిన సంగతీ, దారిలో ఆయనగారికీ, తనకూ మధ్య నడచిన సంభాషణంతా నాతో చెప్పారు.

గిరిగారు నేను సత్యాగ్రహం చేస్తూన్న సమయంలో అక్కడే, నా పక్కనే ఉన్నారు. తరవాత ఆయన ఇతర మిత్రులతో కలిసి మేజస్ట్రేట్ కోర్టుకూ వచ్చారు. ఆ తరవాత వెంటనే ఉన్న రైలులో నన్ను వెల్లూరు జెయిలుకు పంపడం కూడా గిరిగారూ, ఆయన మిత్రులూ పూర్తిగా గమనించారు.

ఆఖరిమాటగా ఉత్తరం

రాజగోపాలాచారిగారు గాని, డా॥ సుబ్బరాయన్ గాని - ఉభయులూ పట్నంలోనే ఉన్నా - నన్ను కలిసికోలేదు. నేను జెయిలుకు వెళ్ళాక, తిరిగీ రాజగోపాలాచారిగారు గిరిగారిని కలిసి, ఆంధ్రులు ఎంత మాత్రమూ మంచివారు కాదనీ, గిరిగా రయినా తనమాట విని, గాంధీగారి నినాదం కంటె తన ఉత్తరమే శ్రేష్ఠమని గ్రహించి, తాను సూచించిన ప్రకారం నడవడం ఉత్తమ మనీ మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగిందని తెలిసింది. రాజగోపాలాచారి గారెంత జెప్పినా గిరిగారు మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు, గాంధీగారి నినాదంలోని ఆఖరి రెండు పంక్తులయినా విడిచిపెట్టడం న్యాయమని రాజగోపాలాచారి గారు చెప్పారట. ఆఖరి వాక్యాలలో, హింసాత్మకమయిన అన్ని యుద్ధాలనూ అహింసాత్మకంగానే ఎదుర్కోవాలని ఉంది. రాజగోపాలాచారి గారి వాదన గిరిగారు ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. ఇంకా కాదూ కూడదూ అంటూ ఆయన వదలిపెట్టకుండా ఉంటే, "సరే, మీరు చెప్పిన విషయం జాగ్రత్తగా ఆలోచించి సాయంత్రం మీ కే సంగతి వ్రాస్తా"నని చెప్పి గిరిగారు అప్పటికి ఆ గొడవ తప్పించుకుని, ఆ సాయంత్రం ఆయన పేర ఉత్తరం వ్రాశారు. గిరిగారు ఆ ఉత్తరంలో తాను ఎన్నో రకాల వ్యాపార సంబంధమయిన తగాయిదాలను అహింసాత్మకంగా ఎల్లా సర్దుబాటు చేయగలిగిందీ వివరిస్తూ, గాంధీగారి నినాదాన్ని ఎందువల్ల విస్మరించాలో తనకు అర్థం గావడం లేదనీ, అందులో ముఖ్యంగా ఆ ఆఖరి వాక్యాలు అహింసా ప్రబోధకంగా ఉండగా వాటిని వదలి వేయడంలో అర్థం లేదనీ స్పష్టంగా వ్రాసేశారు.

ఆ మర్నాడే గిరిగారు సత్యాగ్రహం చేసి, శిక్షను పొంది, వెల్లూరు జెయిలుకు వచ్చి నన్ను కలుసుకున్నారు. ఆ సందర్భంలొ గిరిగారు తనకూ, రాజగోపాలాచారి గారికీ మధ్య మళ్ళీ జరిగిన గ్రంథం అంతా చెప్పారు. గిరిగారు నాతో చెప్పిన విషయాల సారాంశమే పైన వ్రాశాను. చదువరులకు ఇలాంటి విషయాలన్నీ చెప్పడంలో నాకో ఉద్దేశం వుంది. ఈ విషయాలన్నీ గ్రహించందే తిరుచురాపల్లి జెయిలులో జరిగిన ఉదంతం చదువరుల కర్థం కాదు. అందువల్లనే ఇవన్నీ చెప్పాను. మా శిక్షా కాలమంతా తిరుచీ జెయిలులోనే గడచింది. ఒక్క మొట్టమొదటి మాసంలోనే నేను వెల్లూరు జెయిలులో వున్నాను.