నా జీవిత యాత్ర-2/సైమన్ కమిషన్ నియామకం సద్బుద్ధితో కానేకాదు

వికీసోర్స్ నుండి

21

సైమన్ కమిషన్ నియామకం

సద్బుద్ధితో కానేకాదు

1927 లో వచ్చిన రెండవ పెద్ద సమస్య సైమస్ కమిషన్ నియామకం. భారత దేశానికి అనువైన రాజ్యాంగ చట్ట సవరణలూ, సంస్కరణలూ సూచించడానికని బ్రిటిష్ ప్రభుత్వం వారు సైమన్ కమిష నొకటి వెయ్యడమూ, ఈ నాటకం సాగకుండా చూడాలని కాంగ్రెసు వారు తలచడంతో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం ఆరంభం కావడమూ జరిగాయి. అది ఈ రోజులలోనే ఎందు కొచ్చింది? అసలు కమిషన్ని వెయ్యమని ఎవరు కోరారు? ఇలాంటి ప్రశ్నలు ఈ సందర్భంలో చాలామంది వెయ్యడమూ, వారికి తోచిన సమాధానం చెప్పడమూ జరిగింది.

గత యాబై-అరవై సంవత్సరాల కాలంలో అనేక దేశాలు సాధించిన విజయాలూ, సంపాదించిన సంస్కరణాదులతో పోల్చి చూస్తే- మన స్వాతంత్ర్య సమరం అనవసరంగా ఏండ్లూ పూండ్లూ పట్టి ఏమీ సాధించకుండా నడుస్తోందేమో ననిపిస్తుంది. మన జ్ఞాపక శక్తులు కుశలమే అవడాన్ని సైమన్ కమిషన్ విషయంలో ఉత్పన్నమయిన రెండు ప్రశ్నలకూ రకరకాల సమాధానాలు వచ్చాయి.

కొంతమంది ఈ సైమన్ కమిషన్ అన్నది మనకి అనవసరమయినదీ, నిరుపయుక్తమయినదీ అన్నారు. 1920 లో ఇంగ్లండులో జనరల్ ఎన్నికలు జరుగనై ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని విరమిస్తూన్న ప్రభుత్వం తాము భారత దేశాన్ని గురించి ఎంతగానో శ్రద్ధ వహించి, దాని పురోభివృద్ధికి ఎంతో చేశామని అనిపించుకోవడానికే ఈ కమిషన్ని వేశారని మరి కొంద రన్నారు.

కన్సర్ వేటివ్‌ల ఎత్తు

దేశంలో అప్పట్లో నడుస్తూన్న కన్సర్వేటివ్ [1] ప్రభుత్వం జనరంజకంగా లేకపోవడాన్ని ఎన్నికలలో లేబర్ పార్టీ వారిదే పై చెయ్యి అయి, వారే రాజ్యపాలనలోకి వచ్చి, ఆ వెంటనే హిందూ దేశానికి నేరుగా పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చేస్తారేమోననే భీతి కన్సర్వేటివ్‌లకి కలిగింది. లోగడ ఉపన్యాసాలలో రామ్సేమేక్డ్‌నాల్డ్ లాంటి లేబర్‌పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను ఆ ప్రకారంగా వ్యక్తపరిచారు కూడాను. కన్సర్వేటివ్‌లకు భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చేసి చేతులు దులుపుకుని కూచోవడం ఇష్టం లేదు. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి కన్సర్వేటివ్ ప్రభుత్వంవారు ఈ కమిషనును ఏర్పరిచారు. ఈ కమిషనువారు తొందర తొందరగా తమ విచారణ ముగించి, చేసే సిఫార్సుల ప్రకారం ఇండియాకి పూర్తిగా డొమినియన్ స్టేటస్ ఇవ్వకుండా తంటాలు పడవచ్చు కదా అన్నదే వారి ఊహ. కన్సర్వేటివ్ గవర్నమెంట్ వారికి కూడా "భావి" మీద దృష్టి లేకపోలేదు. కాని ఇండియా లేకపోతే ఇంగ్లండే లేదనే నమ్మకంతో ఉన్నవారు వారు.

ఇండియాలో కూడా, వివిధ రాజకీయ సంఘాలవారు, రకరకాలుగా ఆశాభంగాలు పొంది, ఏదో ఒక రకంగా మనకు ఉపకరించే ఏ కొద్దపాటి సూచనలయినా ఇంగ్లీషువారి నుంచి పిండి రాబట్టుకోవాలనీ, వారేమి ఇచ్చినా మహభాగేననీ అనుకుంటూన్న స్థితిలో ఉన్నారు.

పూర్వ రంగం

గత పది సంవత్సరాలలోనూ రాజకీయ సమరంలో సంక్షోభాన్ని కలుగజేసే ఎన్నో నూతన విషయాలూ, పోకడలూ తలయెత్తాయి. వెనక 1917 లో రాష్ట్రాలలో ద్వంద ప్రభుత్వపు టేర్పాట్లంటూ బ్రటిషు వారు తయారు చేసిన పదకాలు చాలా అసంతృప్తికరంగా ఉన్నా, వాటిని 1921 లో ప్రవేశపెట్ట నారంభించారు. అదే రోజులలో సహకార నిరాకరణ, శాసన ధిక్కారాది ఉద్యమాలు ఆరంభించబడ్డాయి.

1921 కి పూర్వం, జనరల్ డయ్యర్ కారణంగా జలియన్ వాలాబాగ్ దురంతంలో వేలాది జనం క్రూరంగా హింసింప బడ్డారు. కాని ఆ ఉదంతం ఆంగ్లేయుల దృష్టిలో న్యాయ సమ్మతమే అయింది. అ దుష్కృత్యాన్ని "సాహసోపేతంగా" చేశాడని గౌరవ సూచకంగా ఆంగ్లేయులు జనరల్ డయ్యర్‌కు ఖడ్గ ప్రదానం కూడా చేశారు. దేశంలో ఎంత తీవ్రమైన అసమ్మతి ప్రకటించబడ్డా "రౌలట్" చట్టం ప్యాసయింది. ఆ చట్టం అంతం అయ్యేదాకా ధిక్కారాలూ, సవాళ్ళూ జరుగుతూనే వచ్చాయి.

1918-20 సంవత్సరాలలో కాంగ్రెసు నాయకత్వం క్రమేణా గాంధీగారి హస్తగతం అయింది. కాంగ్రెసు, భాషను ప్రాతిపదికగా తీసుకుని, 21 భాషా రాష్ట్రాలుగా దేశాన్ని విభాగించింది. కాంగ్రెసు కమిటీవారు అతి సులభమైన, అతి విస్తీర్ణమైన పదకంతో, నాలుగు అణాల చందాతో తమ సభ్యుల సంఖ్యను వృద్ధి పొందించు కున్నారు. నిర్మాణ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు జరిగింది. పన్నెండు మాసాలలోనే ఉద్ద్రుతంగానూ, నిర్దుష్టంగానూ అమలు జరిగిపోయింది. ఆ నిర్మాణ కార్యక్రమం, సహకార నిరాకరణ ఉద్యమం హిందూ మహమ్మదీయ సంఘీభావంమీద ఆధారపడి అభివృద్ధి గాంచాయి.

స్వాతంత్ర్యం కోసం నోరు తెరుచుకుని కూచున్న జన బాహుళ్యాన్ని సక్రమ మార్గాన్ని నడపించడం కోసం, నిర్మాణ కార్యక్రమం సవ్యంగా అమలు పరచడం కోసం ఒక కోటి రూపాయలు నిమిషాల మీద వసూలయ్యాయి. "ఒక్క సంవత్సరంపాటు శ్రమపడితే దేశంలో స్వాతంత్ర్యం స్థాపించ గలుగుతాం. స్వాతంత్ర్యం ఒక్క ఏడాదిలోపల్నే వచ్చేస్తుంది" అని అందరం నమ్మాం. ఈ ఆశతోనే, ఎన్నో కుల మతాలకు చెందిన జనం అంతా, కాంగ్రెసు పిలుపును మన్నించి, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాకపట్ల దేశవ్యాప్తంగా నిరసన చూపిస్తూ, ప్రజలు ఆయన రాకను అనుకున్న దానికంటే ఎంతో విజయవంతంగా బహిష్కరించారు.

"చౌరీ చౌరా" దురాగతం కారణంగా గాంధీగారు ఉద్యమాన్నీ నిలుపు చెయ్యకుండా ఉండి ఉంటేనూ, లోలోపల స్వయంపాకాల వల్ల కాంగ్రెసులో చీలికలు రాకుండా ఉండి ఉంటేనూ, దొమినియన్ స్టేటస్ అన్నమాటేమిటి-ఆ 1921లో సంపూర్ణ స్వరాజ్యమే మనకు లభించి ఉండేది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాక సందర్భంలో దేశవ్యాప్తంగా జరిగిన హర్తాలు, ఆయన రాకను నిరసిస్తూ మనం చేసిన బహిష్కారమూ, వైస్రాయ్ అంతటి వానికే రైలునుంచి బయటికి సామాను మోయడానికి రైల్వే పోర్టర్లు దొరక్కపోయిన తీరూ గమనించిన ఆంగ్లేయులకు-ఇక్కడి వారికి, ఇంగ్లండ్‌లో వారికి కూడా-కనువిప్పయింది. భారత దేశానికి, జాతికి విమోచనకాలం సమీపించింది, వారు స్వాతంత్ర్యానికి అర్హులు అనే నమ్మిక పుట్టుకొచ్చింది. ఆనాటి భారతీయ సమైక్య శక్తి యావత్తు ప్రపంచాన్నీ ఊచి "భేష్-సెహబాస్", అనిపించింది.

భేదోపాయం

జైలునుంచే దాస్-మోతిలాల్ గారలు గాంధీగారిపై తిరుగుబాటు చేసి ఉండకపోతే, మనం కొద్దికాలమైనా ఐకమత్యం ప్రదర్శించగలిగి ఉంటే-పూర్ణ స్వరాజ్య గమ్యం కాకపోయినా, దాని దరిదాపుల్లోకి ఆ 1921-22 సంవత్సరాలలోనే చేరి ఉండేవారం. ఆ నాటి వైస్రాయ్ రీడింగ్ ప్రభువు దేశీయులలోని సంఘీభావానికి విస్తుపోయి, విభ్రాంతుడయి, రాజీ సూచనలనే రొట్టి ముక్కని మాటువేసి, జైలు గోడల మీదుగా విసిరాడు. నిజానికి గాంధీగారి ప్రమేయం లేకుండా ఆ ఇరువురూ ఏమీ చెయ్యరేమో, అసలు చెయ్యలేరేమో అనుకుంటూనే ఆ పన్నుగడ పన్నాడు. అలా అనుకోకుండా విసిరిన ఊహా చాతుర్యపు ఉచ్చుతో, కాంగ్రెసులో చీలికలు తేవడానికీ, గాంధీగారిని అరెస్టు చెయ్యడానికీ ఆంగ్లేయులకు వీలిచ్చింది.

పైన చెప్పిన ప్రకారం వైస్రాయి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాపిన చేతి నుంచి ఆశామృతపు చుక్కలు రాల్చకుండానే కాంగ్రెసులోని స్వరాజ్యపార్టీ నాయకులను ఆశాపాశ బద్దుల్ని చేయగలిగారు. ఈ ప్రకారంగా ఆ రెండు కాంగ్రెసు విభాగాల మధ్య పొత్తు అన్నది కుదరకుండా 1924 నుంచి 1926 వరకూ అన్న మాటేమిటి, సుమారు 1930 వరకూ కూడా, ఆపు చేయగలిగారు. ఈ తంత్రం అంతా, ఇంగ్లండులో ఉన్న కన్సర్వేటివ్ గవర్నమెంట్ వారు చాకచక్యంతో, 1921 నుంచి 1927 వరకూ, వెనకనుంచీ చక్కగా నడిపించగలిగారు.

అంతేకాదు- 1926 లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు సాధించిన విజయాలనూ గమనించారు. ఎనిమిది సంవత్సరాలపాటు కాంగ్రెసులోని స్వరాజ్యపార్టీ వారిని ఆశాపాశబుద్ధుల్ని చేసి విడిగా ఆడించినా ఉభయపక్షాలవారూ సన్నిహితంగా వచ్చి జాయింటుగా ఆంగ్ల పరిపాలనా విధానంమీద విరుచుకుపడబోతున్నారన్న సంగతీ గ్రహించారు. రాష్ట్ర కేంద్ర శాసన సభలలో కాంగ్రెసువారు చేస్తూన్న గడబిడలూ, చూపిస్తూన్న రాజకీయ తంత్రజ్ఞతా, అవలంబిస్తూన్న విధానమూ గమనించి, మనం సందిగ్ధ స్థితిలో వస్తున్నాం, ఒక పెద్ద గండాన్ని ఎదుర్కోక తప్పదు అని గుర్తించారు. ఒక వేళ ఏ కారణంచేతనైనా 1929 తర్వాత ఇంగ్లండులో జరగబోయే ఎన్నికలలో లేబర్‌పార్టీవారే అధికారాన్ని చేపట్టగలిగి, భారత దేశానికి ఏదయినా ఇచ్చిపోతారేమో నన్న బాధ పట్టుకుంది వారికి. తద్బాధా నివారణార్థం, ఇల్లాగయినా, ఒక అడ్డుపుల్ల వెయ్యలేక పోతామా అనే ధీమాతో వారు సైమన్ కమిషన్ని ఏర్పరచి మన నెత్తిని రుద్దడం సంభవించింది. ఇటువంటి కమిషన్ని వేసి, వారి అభిప్రాయాన్ని ఆంగ్లప్రభుత్వం మన్నించక తప్పనిసరి అయ్యే ఏర్పాట్లు చేసి, తద్వారా, హిందూదేశానికి ఎవరైనా ఏదైనా ఇవ్వడానికి పూనుకునే రోజును ఎంత ఎక్కువ వెనక్కి నెట్ట కలిగితే అంత మంచిదని వారి ఆలోచన.

"చావు తెలివి" సమాచారం

ఈ మాదిరి కమిషన్ని ఏర్పాటు చేద్దాం అన్న ఊహ, "చావు తెలివి"లా, హఠాత్తుగా పుట్టిన కారణంచేత మన దేశానికి న్యాయంగా ఇవ్వవలసిన గడువు ఇవ్వకుండానే ఆ కమిషన్ని మన నెత్తిని రుద్దారు. భారతీయులు తమని ఏ విధంగా అర్థం చేసుకుని ఎటువంటి విమర్శలకు గురిచేస్తారో అని కూడా యోచించినట్లు లేదు. దేశంలో కలిగిన ఉద్రిక్త పరిస్థితులను శాంతపరచాలనే ఉద్దేశంతో ఏర్పరచే ఏ రాయల్ కమిషన్నయినా, ఆ కమిషన్ ఆశయమూ, దానికిచ్చే అవకాశమూ అది అవలంభించబోయే పద్దతి మొదలైనవేగానీ, ఆ కమిషన్‌లో పలానా పలానా వారుంటారన్న విషయం కూడా ముందుగా తెలియ చెయ్యందే ఏర్పరచడం సాధారణంగా జరగదు. ఉభయ దేశాలలోనూ లభ్యమైన సాక్ష్యాలవలన ఈ కమిషన్ని ఏర్పరచిన యోధులు (Constitution Commission) పై విషయా లన్నింటిలోను తప్పటడుగులు వేస్తూనే దీనిని నియమించినట్లు కనబడుతుంది. వేసే కమిషన్లకు ప్రాతిపదికగా పాటించవలసిన ప్రధాన సూత్రంగా ఆ కమిషన్‌లో భారతీయులపేర్లు కూడా కొన్ని ఉండాలి అన్న దృష్టే వారికి లేకపోయింది. ఈ దేశీయుల నామాలు కొన్ని అ కమిషన్‌లో ఉండి ఉంటే, ద్వంద ప్రభుత్వపు టేర్పాట్లు ఏ విధంగా పరిణయమించాయో సరిగా అంచనా వేసుకోవడానికైనా వారికి వీలుండేది. ఈ చిన్న పొరపాటే దేశంలోని అన్ని వర్గాలవారు ఒక్క తాటిమీదకు వచ్చి, కమిషన్‌వారి రాకను బహిష్కరించాలనే నిర్ణయానికి రావడానికి సహాయం చేసింది.

ఇర్విన్ ప్రకటన

ఈ కమిషనుకు సంబంధించిన ఉద్దేశాలూ, ఆదేశాలూ, స్థాయీలాంటివి కాస్త విచారిద్దాం. ఇర్విన్ ప్రభువు విడుదల చేసిన ఒక ప్రకట వలో సైమస్ కమిషన్ వారవలంబింపవలసిన విధానమూ, పద్ధతీ, మొదలైనవి ఏవీ రాయల్ కమిషన్ వారు నిర్ణయించలేదని ఒప్పుకున్నారు. అంతేకాదు, ఎలక్టయిన కేంద్ర శాసన సభ్యులూ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ వారూ కలసి ఒక జాయింట్ కమిటీగా ఏర్పడి, ఆ రాయల్ కమిషన్ వారితోపాటు ప్రయాణం చేసి సాక్ష్యాన్ని సేకరించి, సైమన్ కమిషన్ వారి పరిశీలన నిమిత్తమో, సూచన ప్రాయమైన సలహాగానో, వారు యే దృష్టితో స్వీకరించినా తమ అభిప్రాయాన్ని మాత్రం అందజేయడానికి తావుందని వైస్రాయిగారు ఒప్పుకున్నారు.

లార్డ్ ఇర్వినూ, ఆంగ్ల రాజ్య తంత్రజ్ఞులూ కూడా తాము తప్పేచేశామని ఒప్పుకున్నారు. కాని ఇవి యేవీ కూడా భారత నాయకులకు సంతృప్తిని కలుగచేయలేదు. వేయబోయే ఇండియన్ సబ్ కమిటీ వారు కేవలం ఎసెస్సర్లయి, బొమ్మలలాగ జరుగుతూన్న కర్మకాండను వీక్షిస్తూ ఉంటారన్న మాట. వీరి అభిప్రాయంతో వారికి ఎటువంటి సంబంధమూ ఉండకపోవచ్చునంటే పరిస్థితి ఎల్లా ఉంటుందో ఆలోచించండి. విషమించకుండా ఏలా ఉంటుంది?

భారతదేశంలో అడుగు పెట్టిన మూడవనాడు సర్ జాన్ సైమన్ (దరిమిలా లార్డ్ అయ్యాడు) వైస్రాయ్ ఇర్విన్ పేర వ్రాసిన ఒక లేఖ ఆధారంగా, ఇర్విన్ ప్రభువు ఈ సూచన చేశాడు. ఆ ఉత్తరంలో సైమన్‌గారు ఏమని వ్రాశారంటే, సెంట్రల్ అసెంబ్లీ లోనూ, కౌన్సిల్‌ లోనూ ఉండే సభ్యులనుంచి, ఏడ్గురు సభ్యులు ఒక ఉప సంఘంగా ఏర్పడవచ్చుననీ, తమ సంఖ్య ఆరు నొక్కటవడాన్ని వారూ ఏడ్గురు ఉండడం న్యాయమనీ, వారు తమతో సమానస్థాయిలోనే పర్యటిస్తూ సాక్ష్యసేకరణ చెయ్యవచ్చుననీ, రాష్ట్రాలలో ఉండే శాసన సభ్యులు కూడా అదే ప్రకారం ఉప సంఘాలను ఏర్పరచుకుని రాయల్ కమిషన్ వారికి సహకారులుగా ఉండ వచ్చుననీ.

దేశీయుల నిరసన భావం

ఈ ఉత్తరమూ, వైస్రాయిగారి ప్రకటనా పరిస్థితిని మెరుగు పరచడానికి బదులు దేశంలో నాటుకున్న అనుమాన బీజానికి మరింత దోహదం చేశాయి. ఎన్ని విధాలుగా ఆశ చూపించి పురికొల్పాలనుకున్నా, అసెంబ్లీలో ఉన్న కాంగ్రెసు పార్టీ వారు ఎంతమాత్రం చలించలేదు. సహకరించడానికి ముందడుగు వెయ్యలేదు. ఇంత అనుభవం ఉన్న వైస్రాయిగారూ, ఆంగ్ల కాబినెట్ మంత్రులూ కూడా ఏదో ఇంత 'ఎర' చూపి బారతీయుల నోరు కట్టుపడుతుందని ఎల్లా తలచారో అర్థం కాలేదు.

చెన్నపట్నంలోని జస్టిస్ పార్టీవారు మినహా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీల వారందరూ, పేరు బడ్డ యావన్మంది నాయకులూ బ్రిటిషు ప్రభుత్వంవారి భావాన్నీ, హృదయాన్నీ కూడా శంకించారు. అందులో జనరల్ ఎన్నికల ముందు పెట్టుకుని, ఇలాంటి కమిషన్ని ఆంగ్లేయులు ఏర్పరచడాన్ని ప్రతివారూ గర్వించారు. పెద్దలు చాలామంది కమిషన్‌ పట్ల నిరసన తెలిపారు.

దేశం యావత్తూ ఒకే విధంగా వ్యతిరేకంగా ఉన్నా, ఎలాగో ఒకలాగు ఆ (చేదు) మాత్రని భారతదేశీయులచేత మింగించి తీరతాం అన్న పట్టుదలమీదనే ఆంగ్లేయులున్నారు. వైస్రాయికి దేశం ఎంత బిగిమీద ఉన్నదీ పూర్తిగా తెలుసు. 1927 డిసెంబర్‌లో ఈ కమిషన్ బాయ్‌కాట్ ప్రధాన ఉద్దేశంగా, చెన్నపట్నంలో కాంగ్రెస్ జరుగనున్నదన్న సంగతి తెలుసును. వెనుకటి వైస్రాయ్ రీడింగ్ కాలంలో ఎంత బిర్రుమీద, ఏకగ్రీవంగా యావత్తు దేశమూ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాకను బహిష్కరించిందో ఇర్విన్ ఎరగనిది కాదు. తన ఏలుబడి కాలంలో ఈ సైమన్ కమిషన్ బహిష్కరణ అన్నది ఎంత తీవ్రంగా ఉంటుందో కూడా ఇర్విను ప్రభువు ఊహించుకునే ఉన్నాడు.

వైస్రాయిగారి విన్నపాలు

కాని ఆయనా, సెక్రటరీ ఆఫ్ స్టేట్ లార్డ్ బర్కెన్ హెడ్డూ సైమన్ కమిషన్ వారి యాత్ర సుగమం చేసి తీరాలనే పట్టుదలమీద ఉన్నారు. డిసెంబరు 27 న కాంగ్రెస్‌వారు సైమన్ కమిషన్ 'బాయ్‌కాట్' తీర్మానం ప్యాసు చేయడం కోసమే మద్రాసులో కలుస్తున్నారన్న సంగతి ఎరిగిఉన్న ఇర్విన్ ప్రభువు నవంబర్ మొదటి వారంలో కొన్ని ముఖ్యమైన విషయాలమీద భారతీయ నాయకులందరితోటీ సంప్రదించడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ తెలియపరిచారు. అప్పట్లో సెంట్రల్ అసెంబ్లీలో కార్యకలాపాలు సాగుతున్నాయి. అసెంబ్లీ నడుస్తోందన్నమాట! ఈ పిలుపు సెంట్రల్ అసెంబ్లీలో ఉన్న సభ్యులందరికీ అందజేయబడింది. సైమన్ కమిషన్ విషయంలో సహకారం అర్థించడం కోసమే ఈ పిలుపు వచ్చిందన్న సంగతి అందరూ ఎరిగినదే. కాంగ్రెసువారు వైస్రాయ్‌గారి పిలుపును మన్నించి, వారితో సంప్రతించడానికి ఎప్పుడూ సన్నద్ధులుగా లేరు. కాని గాంధీగారు ఆయన్ని కలుసుకుని తన మనోగత అభిప్రాయాన్ని సువ్యక్తం చేశారు.

ఇది జరిగాక కూడా వైస్రాయ్‌గారు నాయకులనీ, ప్రజలను కూడా రాయల్ కమిషన్ వారి సంచార కార్యక్రమంతో సహకరించమని కోరుతూ ఒక విన్నపాన్ని ప్రకటించాడు. ఒక్క దేశీయుడికి కూడా అందులో సాధనం లేని ఆ కమిషన్ దేశవ్యాప్తంగా బహిష్కరించబడింది.

వైస్రాయ్‌గారు ఇంకో విన్నపాన్ని ప్రకటించాడు. ప్రజలచేత ఎన్నుకొనబడి సెంట్రల్ అసెంబ్లీలోనూ, రాష్ట్ర అసెంబ్లీలలోనూ రాష్ట్ర అసెంబ్లీలలోను ఉంటున్న నాయకులు చెప్పింది ప్రజాభిప్రాయంగా స్వీకరించి, దానిని పరిశీలించి, వారి సదభిప్రాయాలను మన్నించి, ఉభయ దేశాల మధ్యా సుహృద్భావం పెంపొందిస్తూ దేశీ యుల కోర్కెలను మన్నించే సదుద్దేశంతోనే బ్రిటిషువారు కమిషన్ని నిర్ణయించారు గావున, అ కమిషను వారిని కలుసుకుని సంప్రతించడం దేశీయుల క్షేమ లాభాలకేననీ సూచించారు. వైస్రాయిగారి విన్నపాలన్నీ బుట్టదాఖలయ్యాయి.

'విభీషణాయిలు'

కాని ప్రతి దేశంలోనూ కొంతమంది విభీషణాయి లుంటూ ఉంటారుకదా! ఆ విభీషణాయిలు తమ దేశాన్ని మట్టుపెట్టడానికి ఎప్పుడూ రెడియే. అలాంటి వారు కొందరు కమిషన్ వారిని కలిశారు. తదితరులెవ్వరూ వారి ముఖం చూడలేదు.

డా॥అన్సారీగారి అధ్యక్షతను 1927 డిసెంబర్ ఆఖరి రోజులలో మదరాసులో కాంగ్రెసు మహాసభ జరిగినప్పుడు, సైమన్ కమిషన్ని బాయ్‌కాట్ చేయవలసిందన్న తీర్మానం ఆమోదించబడింది. కమిషన్ వారికి ఎలాంటి సహకారమూ ఇవ్వరాదనీ, వారి విచారణ సందర్భంలో వారికెలాంటి సమాచారమూ అందజేయరాదనే దేశవ్యాప్తంగానూ, విశదంగానూ కాంగ్రెసు సంస్థ లన్నిటికీ, ప్రజానీకానికీ కాంగ్రెసువారు విజ్ఞప్తులు చేశారు. కమిషన్‌వారు బొంబాయిరేవులో దిగిననాడే దేశ వ్యాప్తంగా హర్తాల్ జరపాలనీ, వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా వారిరాకపట్ల అసమ్మతి సూచకంగా ఆ ప్రాంతీయులు తగు ప్రదర్శనలు జరపాలనీ, దేశవ్యాప్తంగా సూచనలు ఇవ్వబడ్డాయి. అసెంబ్లీ మెంబర్ల కందరికీ, కమీషన్‌వారికి ఏ విధమైన సహకారాన్నీ అందజేయరాదంటూ ఆదేశాలు వెళ్ళాయి. వీలయినప్పుడల్లా, వీలయిన విధంగా, వారి రాకపట్ల అసమ్మతి ప్రకటించాలని కూడా సూచనలు ఇవ్వబడ్డాయి.

బ్రిటిషువారి ఆశ

సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కూ, బ్రిటిషు క్యాబినెట్ వారికీ, గవర్నర్లకూ కూడా ప్రజాహృదయం పూర్తిగా తెలిసే ఉంది. వారందరూ 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఏవిధంగా బహిష్కరించబడ్డాడో ఎరిగే ఉన్నా, ఎంత అణచి పెట్టినా, కాంగ్రెసులో చీలికలు తీసుకుని వచ్చేందుకు యత్నించడంతో ఎన్ని చేయగలిగినా, కాంగ్రెస్‌నించి పిలుపు వచ్చేసరికి ప్రజలూ, నాయకులు కలపి ఎటువంటి త్యాగాల నయినా చేయడానికీ సన్నద్ధులవుతారన్నది వారు ఎరగంది కాదు. అయినా కాంగ్రెసులో చీలికలు తేగలం అనే ధీమా వారికుంది. కాగా, ప్రజలకు కావలసిన 'బోధ' జరగలేదనీ, వారి ఐకమత్యానికి చేయవలసిన కృషి మృగ్యమేననీ, నిర్మాణ కార్యక్రమం అసలు పనే చెయ్యడం లేదనీ, ఈ పరిస్థితులలో సైమన్ కమిషన్ బాయికాట్ అన్నది నిస్సంశయంగా విఫలం అయ్యి తీరుతుందనీ వారు భావించారు.

ప్రజలు అక్షరాస్యులు కారనీ, తాము జరిపించిన దారుణకాండలన్నీ వారి మనస్సుల్లో భయోత్పాతాన్ని ఇంకా పచ్చగానే ఉంచి ఉంటాయని బ్రిటిషువారి నమ్మిక. నిజమే. నిర్మాణ కార్యక్రమాలేవీ కొనసాగని పరిస్థితులలో ప్రభుత్వంవారు అల్లా తలచడంలో ఆశ్చర్యం లేదు. కాని వారికి భారత పౌరులయొక్క అఖండ శక్తీ, నరనరాలలోనూ నాటుకుపోయిన వారి అహింసాతత్వం, అహింసామార్గాన్నే దేనినయినా సాధించగలమనే వారి అచంచల విశ్వాసం అర్థం అయి ఉండవు. అక్షరాస్యులూ, నిరక్షర కుక్షులూ అన్న పదాలకు చెప్పబడే అర్థాలు ఏవయినా, ప్రజాబాహుళ్యం మాత్రం, కమిషన్ వారు దేశంలో అడుగుపెట్టిన అ మొదటి రోజునుంచీ అవసరమయిన త్యాగాల కన్నింటికీ సంసిద్ధులయ్యే ఉన్నారు. అందుకు నిరక్షరాస్యతగాని, శిక్షణ లోపంగాని అడ్డురాలేదు.


ద్వితీయ ఖండం సమాప్తము

  1. కన్సర్వేటివ్ లంటే మార్పులు ఇష్టం లేనివారనీ, లేబర్ పార్టీ అంటే శ్రామిక సంఘీయులు కనుక సానుభూతి కలిగి ఉంటారనీ లోకంలో అభిప్రాయం.