నా జీవిత యాత్ర-2/మారకపురేటు పెంచరాదని హోరాహోరీ పోరాటం

వికీసోర్స్ నుండి

20

మారకపురేటు పెంచరాదని

హోరాహోరీ పోరాటం

1927 నాటి శాసన సభా కార్యకలాపాలవైపు మళ్ళీ ఒకసారి దృష్టి సారిద్దాం. ఆ రోజులలో మాకు కరెన్సీమీదా, రూపాయి మారకపు విలువలమీదా, రిజర్వుబ్యాంకి బిల్లుమీదా ప్రభుత్వంవారు ప్రవేశపెట్టిన ప్రతిపాదనలమీద తర్జన భర్జన చెయ్యడం తప్పనిసరి అయింది. తర్జనభర్జన తప్పనిసరి అయిందనడంకంటె, మంచి హుషారుగా సాగిందనడమే న్యాయమేమో.

రూపాయి మారకపు విలువలను గురించీ, ఎక్సేంజిని గురించీ, ఇండియా ప్రభుత్వంవారిచ్చే ఆదేశాలను ఆ నాటి శాసన సభవారుగాని, రాజకీయ నాయకులుగాని అంతగా పట్టించుకోవలసిన అవసరం ఉండేది కాదు. ఆ విషయాలను కఠినమయిన చిక్కు సమస్యలుగా, కొరకరాని కొయ్యలుగా ఎంచి విస్మరించేవారు. ఎంతో అనుభవమూ, లోకజ్ఞానమూ ఉన్నవారికేగాని అర్థంగాని సమస్యలవి. ఆ జటిలమైన ఆర్థిక విషయాలను గురించి ఎంత చదివినా, ఇంకా ఎంతో ఉంటుంది తెలుసుకోవలసింది. లేకుంటే తబ్బిబ్బే. ఆ సమస్యలు సరిగా అర్థంచేసుకుని వాటిమీద తర్జనభర్జనలు వస్తే నిలిచి మాట్లాడగలిగేవారు ఆ రోజుల్లో చాలా కొద్దిమందే ఉండేవారు. అ అల్ప సంఖ్యాకులలో ఘనులు, ప్రముఖులు అనదగినవారు సర్ పురుషోత్తమదాస్ ఠాకూర్‌దాస్‌గారు. వారి తర్వాత అనండి, వారికి ముందే అనండి-జమ్నదాస్ మెహతా గారొకరున్నారు. ఆ యిరువురూ పెద్ద వ్యాపార సంస్థల కధిపతులు. వాణిజ్యం వారి చేతులలో ఉండేది. అందువల్ల, తమకు సంబంధించినంతవరకు, అంటే ఆ మారకపు విలువలు మార్పులవల్ల తమ వ్యాపారానికి ఏవయినా కష్టనష్టాలు వస్తాయని అనుకున్నప్పుడు ఆ సమస్యలమీద వారు తర్జన భర్జనలు చేసేవారు. అంటేవారి లాభనష్టాలమేరకే నన్నమాట! ఆ ఇండియన్ కరెన్సీని చట్టబద్ధం చేయడం, ఆ చట్టంలోని విషయాలపైన, దానినుంచి ఉత్పన్నమయ్యే విషయాలపైన తర్జనభర్జనలు రావడం అన్నది 1908 నుంచీ ఉంది. దాని చరిత్ర అంత వెనక్కి వెళ్ళాలన్నమాట. నేను వ్రాసిన "హిందూదేశపు ఆర్థిక విధానము" (Indian Monetary System), "ప్రపంచ ఆర్థిక విధానము" (World Monetary System) అన్న పుస్తకాలలో ఈ విషయాలు బాగా లోతుగా చర్చించి ఉన్నాను.

ఆర్థిక ప్రతిపాదనల ఆంతర్యం

ఇక్కడ ఆ 1927-28 నాటి ఆర్హిక ప్రతిపాదనలను గురించి కొంచెం విపులంగా వివరిస్తాను. దేశీయులకు నష్టదాయకంగానూ, తమకు లాభకరంగాను మారకపు విలువలు మార్చాలని ప్రభుత్వం వారికి బుద్దిపుట్టినప్పుడల్లా, వారొక జిత్తులమారి నాటకం ఆడేవారు. ఆర్థిక విధానాన్ని చర్చించి, అవసరమైన సూచనలు చేయడానికంటూ "కరెన్సీ కమిషన్" అనేపేరున ఒక సంఘాన్ని నియమించి, వారి సూచనలను పాటిస్తున్నామనే వంకని, తమకు లాభదాయకమైన రీతిని (మనకు నష్టంవచ్చినా సరే) మారకపు విలువలు మారుస్తూ ఉండేవారు.

ఆ నాడు మారకపు రేటు 1షి. 4పెన్నీలు. "హిల్టన్ యంగ్ కమిటీ" వారు ఆగష్టు 20 న విడుదల చేసిన రిపోర్టులో సూచించిన మారకపు రేటును 1షి. 6 పె.లకు మార్చబోతున్నామని ప్రభుత్వంవారు శాసన సభలో వెల్లడించారు. ఆ మార్పు ఆంగ్లేయుల కెంతో లాభదాయకమైందిగానూ, హైందవ వాణిజ్య ప్రముఖులకూ, కర్షకులకూ ఎంతో నష్టాన్ని కలిగించేదిగానూ ఉంది. అ 1926లో స్వరాజ్య పార్టీవారు తమ కార్యక్రమం ప్రకారం అసెంబ్లీ వ్యవహారం నడవకుండా "వాకౌట్" ప్రదర్శనలు చేస్తున్నారు. ఆ అదనులో కరెన్సీ, రిజర్వుబ్యాంకి బిల్లును ప్రవేశపెట్టి సులువుగా ప్యాసు చేయించుకుందా మనుకున్నారు ప్రభుత్వంవారు. ఒక్క ఉదుటున వాటిని ప్రవేశపెట్టడమూ, చట్టంగా రూపొందించడమూ జరిగిపోతుందని భావించారు. స్వరాజ్య పార్టీవారు అసెంబ్లీనుంచి బైటకు వచ్చేసినప్పుడు ఈ పని జరుగుతుందని ఊహించలేదు. కాని ఎప్పుడయితే ప్రభుత్వంవారి పన్నాగం వారు పసికట్టారో అ క్షణాన్నే బిలబిల్లాడుతూ లోపలికి చక్కావచ్చారు. వీరు బిల్లును ప్రతిఘటిస్తారని వారికి గ్రాహ్యం అవడాన్ని, తెలివిగా, క్రొత్త కౌన్సిల్ ఏర్పడే పర్యంతం దీనిని చర్చించరాదంటూ, ప్రభుత్వంవారే దానిని వాయిదా వెయ్యడానికి సిద్ధపడ్డారు.

ఊహాతీతమైన కారణాలు

1926 జనరల్ ఎన్నికల అనంతరం స్వరాజ్యపార్టీ మరింత ప్రభుత్వంతోనూ, జాగరూకతతోనూ వ్యవహరించసాగింది. ఈ మారకపు రేటును పెంచడానికి ప్రభుత్వంవారు ఉటంకించిన కారణాలు చాలా వింతయినవీ, ఊహాతీతమయినవీను, ఈ బిల్లు ప్రవేశపెట్టక పూర్వం కొన్ని సంవత్సరాలుగా ఉంటూన్న మారకపురేటు రూపాయికి 1షి. 4 పెన్నీలు. సర్ బేసిల్ బాకెట్ (Sir Basil Backet) అప్పట్లో ఆర్థిక సభ్యుడు. ఆయన చాలా గట్టివాడు. మంచి వాగ్ధాటి గలవాడు. శాసనసభలో అన్న స్వరాజ్యపార్టీ వారు ఎంతలే, మనం చులాగ్గా దాటుకుపోతాం అనుకున్నాడాయన. పాపం. ఆయన మాలో ఒక డజను మందిమి, అన్ని కోణాలనుంచీ ఆ విషయాన్ని తర్జనభర్జన జేసి, ఆట కటిస్తామని కలలో కూడా అనుకోలేదు.

ఈ దేశపు ప్రజల గతి ఏమయినా, తన దేశీయుల క్షేమలాభలే చూసుకునే రకం సర్ బేసిల్. పైనాన్స్ మెంబర్‌గా కొత్తగా నిర్మాణమైన కౌన్సిల్‌లో రిజర్వు బ్యాంకి బిల్లూ, ఎక్ఛేంజి బిల్లూ ఆయన ప్రతిపా దించాడు. మారకపు విలువలు పెంచాలి అన్న కరెన్సీ కమిటీ సిఫార్సు సవ్యమయినవేనని రుజువు చెయ్యగల స్థిలో ఆయన ఉన్నట్లు తోచలేదు. అలాంటప్పుడు ఆ బిల్లు ప్రవేశ పెట్టకుండా ఉండవలసింది. కాని ప్రతిఘటన వస్తుందని తలచలేదుగా! కాగా, వారికి కావలసినదల్లా డబ్బు! దానిని న్యాయంగా సంపాదిస్తున్నట్లు కనబడేటట్లు చేయడమేగా ప్రధానం! కాస్సేపు మెంబర్ల నిద్రపోవడమో, బైటకు వెళ్ళడమో, పట్టించుకోకుండా కూచోవడమో జరగాలి. అంతే. అది చట్టం అయి ఊరుకుంటుంది. దాన్తో అంతా న్యాయం అవుతుంది అన్నదే ఆయన తలంపు, దానికోసమే ఆ తాపత్రయం. కాని కథ కాస్త అడ్డం తిరిగింది. అంతే!

అప్పటికి అమలునందున్న మారకపు రేటు, ఏవయినా కొన్ని కారణాలచేత, కొంతకాలం పాటు 1షి. 4 పె.లకు-1షి. 6 పె. లకు మధ్య ఊగీసలాడి ఉంటే, వారు చేయదలచిన పని ఛాయామాత్రంగానైనా సవ్యం అయి ఉండేది. నిజానికి ఎంత కాలంగానో ఆ మారకపు విలువ 1 షి. 4 పె. ల దగ్గర అలాగే నిలిచిపోయింది. ఆ స్వతస్సిద్ధపు విలువ మారడానికీ, రేష్యో పెరగడానికి మార్గాలేవీ కనబడని కారణంగా, ఆర్థిక సభ్యునికి స్వాభావికంగానో , అస్వాభావికంగానో-ఏదో ఒక పద్ధతిని విలువ పెంచాలని బుద్ది పుట్టింది. నేను సర్ బేసిల్ని అడిగాను: "తమరు గత 12 మాసాలలోనూ అస్వాభావికంగా ఆ విలువని 1షి. 6పె. ల దగ్గర ఉంచడానికి నిజంగా ఎంత ఖర్చు పెట్టారని?" "ముప్పయికోట్ల రూపాయలు మాత్రమే"నని చెప్పాడు. అస్వాభావికంగా పండ్రెండు మాసాలపాటు ఆ విలువను అలా ఉంచడానికి ముప్పయికోట్ల ఖర్చయి ఉంటే, ఇంతకాలంగా ఆ విలువను అల్లా నిలబెట్టడానికి ఎన్నికోట్లయిందో గదా!....తిరిగి నేను, ఆ మారకపు రేటు మార్పువల్ల దెబ్బతినే మన ఆస్తులన్నింటి మీదా, ఆ మార్పు అమలు జరిగిననాడు వచ్చే నష్టం ఏ మాత్రం ఉంటుందని అడిగినప్పుడు, సుమారు 48 కోట్ల రూపాయ లుండవచ్చునని సమాదానం ఇచ్చాడు.

కలిగే పరిణామాలు

స్థూలంగా ఆ కరెన్సీ ప్రతిపాడనల పరిణామాలు ఎంతవరకూ ఉంటాయో చదువరులకు కాస్త అర్థం అవడానికగాను ఈ విషయం ఇంత వివరంగా చెప్పాను. కేంధ్రలోనూ, రాష్ట్రాలలోనూ పన్నుల రూపకంగా కొంత డబ్బు వసూలు పరచి, కేవలం తమ బలగానికి జీత భత్యాల క్రింద ఖర్చు పెట్టడానికి మాత్రమే కాదు ఇంగ్లీషువారు ఇండియాని తమ చేతులలో పెట్టుకున్నది. వారికి ఈ పన్నుల వసూళ్ళ కోసం కొన్నివేలమంది జీతగాళ్ళు బ్రతకడం కంటే ఎంతో విలువయిందీ, ముఖ్యమయిందీ ఇంకొకటి ఉంది. ఎంతసేపూ వారికి కావలసింది ఇండియాతో వర్తక వాణిజ్యాల పెరుగుదల మాత్రమే. అదే అన్ని విధాల తమకి వాంఛనీయమైన విషయం. ఆ వాణిజ్యాదుల రక్షణ కోసమే మిగతా తతంగమంతా. నిజంగా వారు మనతో సమాన ఫాయలో వర్తక వాణిజ్యాలు సాగించి ఉంటే, మన పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేది. ఈ నీచమయిన బీదరికంతో దేశమూ, ప్రజలూ ఇలా ఇక్కట్లు పాలయ్యేవారు కాదు.

ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే దానిని కొంచెం లోతుగా పరిశీలించాలి. మారకపు విలువ 1 షి. 4 పె. ల చొప్పున మన రైతు ఒక బస్తా సరుక్కీ 15 రూపాయలు సంపాదిస్తూ ఉంటే. అదే సరుక్కి మారకపు రేటు 1 షి. 6 పె. లకు పెరిగిన కారణంగా మన రైతుకి ముట్టేది రూ 13-5-4 లు మాత్రమే. ఈ ఒక్క చిన్న కారణంగా 1928 నుంచీ ఏటా 40 కోట్ల మేరకు మనకు నష్టం అన్నమాట! అంటే, ఇప్పటివరకూ (1941 వరకూ) మన రైతుకి వచ్చిన నష్టం ఎంతో తెలుసా! 40x13, అంటె 520 కోట్లన్నమాట! ఈ మదింపు 1925లో మన దేశంనుంచి ఇంగ్లడుకు ఎగుమతి అయిన సరుకు రు 316 కోట్లు విలువగలదని తేల్చిన అంకెపై ఆధార పడింది.

మనకి ఈ నష్టాల సంగతి ఇల్లా ఉండగా, వారి దేశం నుంచి మన దేశానికి వచ్చే సరుకు (దిగుమతులు) సంగతి గమనిద్దాం. వారి దేశానికి, వారి సరుక్కీ "చవక బజారు"గా, వారి సరుకు అమ్మకానికి మన దేశం అమరాలి. ముఖ్యంగా, మనం సహకార నిరాకరణం కారణంగానూ, స్వదేశాభిమానంతోనూ పై దేశాలనుంచి దిగుమతులు తగ్గించేస్తూ ఉంటే, పై రీతిని ధరల తగ్గింపు బేరంతో మన నెత్తిన ఎక్కువ సరుకు రుద్దడానికి వారు తంటాలు పడుతున్నారన్నమాట. మారకపు రేటు విలువ హెచ్చింపుతో అల్లా వారు "బజార్ని" చేబడుతూ ఉంటే, మన గ్రామీణ పరిశ్రమలూ, మన ఖాదీ ఉత్పత్తీ, దాని అమ్మకమూ దెబ్బమీద దెబ్బ తింటాయన్నమాట.

తీవ్ర వాదోపవాదాలు

ఇన్ని విధాలుగా మనం నష్టపోతూ ఉంటే, రూపాయలలో జీతాలు పుచ్చుకునే ఆంగ్లేయులూ, రూపాయలలోనే లాభాలార్జిస్తూన్న ఆంగ్లేయ వర్తకులూ మునుపటివలె ఖర్చుపెట్టకుండా రూ 13-5-4 లకు రూ 15 ల విలువగల పౌనును కొని, వారి వరుమానంతో మునుపటి కంటె ఎక్కువ పౌనులు కొనకలిగి, వారి బ్యాంకి నిలువలు పౌన్లలో అభివృద్ధి చేసుకోజొచ్చారు. అంతే కదా అంటూ ఈ వాదన అంతా కేంద్ర శాసన సభా వేదికపై చేసేసరికి, అది ఒక చరిత్రాత్మక వాదన అయింది. మా మిత్రులు అన్ని వైపులనుంచీ తర్జనభర్జన చేసి చూపించారు. సర్ పురుషోత్తమ దాస్, ఘన శ్యాందాస్ బిర్లా, జమ్నదాస్ మెహతా మొదలైన వారంతా ఈ విషయాన్ని గురించి క్షుణ్ణంగా చదివారు. నేనూ, నా పరిశోధనను క్షుణ్ణంగా సాగించాను. 1908 నుంచీ వీలు చిక్కినప్పుడల్లా, స్వాభావికంగా ఉంటూ ఉన్న రేటును పెంచుతూ, ఆంగ్ల దేశవాసులు అక్రమ లాభాలు సంపాదించాలన్నప్పుడల్లా, వారు అవలంబిస్తూ వచ్చిన పద్ధతులన్నింటినీ ఎత్తి చూపించగలిగాను.

ఆ తూర్పు ఇండియా కంపెనీ పరిపాలన దినాలలో వారి అక్కౌంటు పద్దతి అంతా బంగారు నక్షత్రం మార్కు పగోడాలన్నీ వెండి రూపాయల క్రిందకు మార్చుకోవడంతో సరిపోయేది. పగోడా విలువ 2.5 రూపాయలు ఉండేది.

ఉభయపక్షాల వాదనలూ తీవ్రరూపం దాల్చి, తారస్థాయినందు కున్నాయి. సర్ బేసిల్ వాదనలన్నీ వాగ్దాటి ప్రదర్శనలేగాని సరుకున్నవి కాదని తేలిపోయింది. ఎప్పటి కప్పుడు ఆయన వాదనలలోని లోట్లు ఎత్తి చూపించి, "వాటిలో బలం లేదు, అవి నిలువవు" అని నిరూపించేశాం. ప్రజాభిప్రాయం అంతా కాంగ్రెసుపార్టీ వైపూ, ఆ పార్టీతో చేతులు కలిపిన వారివైపూ మొగ్గిపోయింది. వాదనల మధ్య సర్ బేసిల్ రాజీ సూచనలు చెయ్యడం మంచిదనుకున్నారు. రెండు ఉత్తరాలు వ్రాశాడు: ఒకటి నాకు, రెండవది మొదటినుంచీ వాదన బాగా నడిపిస్తూన్న ఇంకొక మిత్రునికీను. ఆయన రాజీ ప్రతిపాడనలు మాకు నచ్చని కారణంగా చర్చలు సాగాయి.

ఓట్లకోసం డాన్స్ పార్టీలు

ప్రతిపాదనలు ఓటుకు పెట్టాలి కదా! తమ పక్షాన ఓట్లు కోసమని ప్రభుత్వం ఎన్నో ఎత్తులూ, జిత్తులూ ఉపయోగించవలసివచ్చింది. మా పక్షాన ఓటు వేస్తారనుకునే వారిలో గుండె దిటవులేనివారు ఉండ వచ్చు కదా! ప్రభుత్వంవారు అటువంటి వారినల్లా ఆశ్రయించారు. గవర్నమెంటు పార్టీవారు మా పార్టీ బలాన్ని తగ్గించడానికి ఓటింగు ముందు రాత్రిళ్ళు డిన్నర్లు, విందులూ ఏర్పాటు చేశారు. పాట కచేరీలు, డాన్స్ పార్టీలూ, బోగం మేళాలూ కూడా ఏర్పాటు చేశారు. చదువరులకు హుషార్! ఆశ్చర్యపోకుండా సంగతులు గ్రహించమని వారికి నా మనవి.

ఆంగ్లేయులలో వృద్ధులు, తామవలంబిస్తూన్న విధానాలన్నీ శాస్త్ర సమ్మతమేననీ, అటువంటి క్లిష్ట పరిస్థితులలో, వారి దేశంలో ఇరు పక్షాలవారూ ఓట్ల సంపాదనకు అవలంబించే సామాన్య పద్ధతులనే తాము అమలు జరుపుతున్నామని, ఇందులో అసాధారణ పద్ధతులేవి లేవనీ చెప్పారు. ఓటింగు జరిగే ముందు, మెంబర్లు లోపలికి వెళ్ళే ముఖద్వారం దగ్గిర వేచి ఉండి, ప్రభుత్వ సభ్యులు ఇతర సభ్యులను తమ పక్షానికి రావలసిందని ఎంతో ఒత్తిడి చేశారు. కొంతమంది ఒంటిమీద చేతులు వేసికూడా తమ బూత్‌లోకి దారి జూపారు. రాజకీయ సమాచారాధికారి (Public Information Director) గా మెంబర్లకు సలహా చెప్పి దారి చూపించవలసిన ఆసామీ (wihp గా) తనకున్న హోదాను దుర్వినియోగం చేస్తున్న సందర్భాల నన్నింటినీ, సభాధ్యక్షుని దృష్టికి నేను తీసుకు రావలసి వచ్చింది.

తటస్థుల దగా

ఈ విధంగా ప్రభుత్వంవారి కాన్వాసింగ్ తీవ్రరూపం దాల్చడంతో, మా గ్రూపునుంచి ఒకరిద్దరు మెంబర్లు జారిపోతారేమోననే భయం వేసింది. మేము భయపడినంతా జరిగింది. చివరికి గవర్నమెంటువారికి 68 ఓట్లూ, మాకు 65 ఓట్లూ వచ్చాయి. తటస్థంగా ఉంటామన్న వారు గవర్నమెంటువారి ఒత్తిడికి లోనయి, మమ్మల్ని దగా జేశారు. అది ఒక తీవ్రాతి తీవ్రమయిన పోటాపోటీ. మా కింకొక రెండు ఓట్లు వచ్చి ఉన్నా, వైస్రాయ్‌రు తన ఓట్లు వేసి గెలిపించేవారు.

అంత బలవత్తరమయిన ప్రభుత్వంకూడా, ఏ విధంగానైనా ఒక్క ఓటు మెజారిటీతోనైనా, నెగ్గాం అనిపించుకుని, ముఖం ఎత్తుకుని తిరగడానికి ఎంత తాపత్రయ పడిందో! గవర్నమెంట్ నామ మాత్రంగా తన పరువు నిలబెట్టుకో గలిగిందంతే. దేశంలో అందరికీ గవర్నమెంటు పద్ధతులూ, విధానాలూ బాగా అవగతమయాయి. ప్రభుత్వ విధానాలు ప్రజాహృదయాన్ని గాయపరచాయి. ప్రభుత్వం రాజకీయంగా గెలిచినా, నైతికంగా దెబ్బతిందన్నమాట!