Jump to content

నా జీవిత యాత్ర-2/శాసన సభ్యుని నిర్బంధంపై కేంద్రసభలో సవాలు

వికీసోర్స్ నుండి

19

శాసన సభ్యుని నిర్బంధంపై

కేంద్రసభలో సవాలు

1928-29 బడ్జెటు మీటింగులో కాంగ్రెసువారు మంత్రుల జీతాలకు వ్యతిరిక్తంగా ఓటు చేయలేదు. అల్లా అల్లా కాంగ్రెసుపార్టీవారి సహకారంతో సాగిన ఆ మంత్రివర్గం యావత్తు భారతదేశంలోనూ అసంతృప్తి కలిగించింది.

కేంద్ర శాసన సభ సంగతులు

కేంద్ర శాసన సభా సమాచారాలు కూడా కొంతవరకూ తెలుసుకోడం న్యాయం కదా! యు. పి. లో. జరిగిన ఎన్నికలలో పూర్తి అపజయం కలిగినా, మేము ఆ కేంద్ర శాసన సభలో మొత్తం నలభై యిద్దరం ఉన్నాము. కేంద్రప్రభుత్వం ఛాయామాత్రంగానైనా మంత్రులను ఏర్పరచడం వగైరా కార్యకలాపాలలోకి దిగకుండా విధినిర్వహణను విస్మరించింది. దేశ సౌభాగ్యానికి భిన్నమయిన ప్రతిపాదనలు ఏవి వచ్చినా వాటిని చిత్తు చెయ్యాలన్నదే మా ఆశయం.

కపటపు పార్లమెంటు

మాదొక కపటపు పార్లమెంట్ కదా! ముందుముందు నిజంగా రాజ్యాంగం చేపట్టవలసిన పరిస్థితులలో నడచుకోవలసిన తీరులకు ఈ రోజులలో నడుస్తున్న పార్లమెంటు విధానం కొంత అనుభవాన్ని సమకూర్చింది. సభ్యులూ, నాయకులూ కూడా వాదోపవాదాల లోనూ, పార్లమెంటరీ విధానంలోనూ నేర్పరులయిన కలహప్రియులుగా రూపొందారు. ఆంగ్లదేశపు ప్రైంమినిష్టర్ల కంటే మోతిలాల్‌నెహ్రూ గారు చాకచక్యంగా వ్యవహరింపగల నేర్పరులని పేరుబడ్డారు. ఆంగ్లదేశపు పార్లమెంటు మెంబర్లకంటె మన సభ్యులకు సమస్త సమాచారములూ అందజేయబడడాన్ని మనవారి హోదా ఎంతో మెరుగ్గా ఉండేది. ఏ విషయయినా క్షుణ్ణంగా తర్జన భర్జన చేయగలశక్తి మనవారికుంది.

మనవారి తెలివితేటలూ వగైరా ఎంత అఖండంగా ఉన్నా ప్రజల బాధ్యత ప్రభుత్వం వారిది కానప్పుడు లాభమేమిటి? కేంద్రంలో ఉన్న కాంగ్రెసువారు ఇదివరకంటె ఎంతో ఎక్కువగా ప్రభుత్వంవారి "నటనలను" బైటపెట్టగలిగారు. వాదోపవాదాలు చాలా పటుత్వంతోనూ, ప్రజాహృదయాన్ని చూరాగొనేవిగానూ, రాజ్య తంత్రాన్ని నడపగలిగేవిగానూ ఉండేవి. కేంద్ర శాసన సభలోని కాంగ్రెసు పార్టీవారు ప్రభుత్వంవారి "నటనా" విధానాన్ని వెనకటికంటె ఎంతో శక్తియుక్తులతో బైటపెట్టగలిగారు. వాదోపవాదాలు చాలా ఉన్నతస్థాయిలో నడిచేవి. ఎల్లప్పుడూ గవర్నమెంటు విధానాన్ని కించపరిచేవిగానే ఉండేవి. ప్రభుత్వం వారికి ఎప్పుడో ఒకప్పుడు పరిపాలన ప్రజల హస్తగతం చెయ్యకతప్పదని అర్థమయింది.

ప్రతికూల కక్షల దుష్ఫలితాలు

నిజానికి కాంగ్రెసుపార్టీవారే గనుక తమ విధానంలో నిబ్బరమూ నేర్పూ కనబరుస్తూ, గ్రామాలలో నిర్మాణ కార్యక్రమం సరిగా కొనసాగించి ఉండిఉంటే, కొద్ది సంవత్సరాలలోనే అది బాగా బలాన్ని పుంజుకుని ప్రభుత్వంవారి ముక్కు నలిపి మరీ, అధికారం చేపట్టగలిగి ఉండేది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ, అధిక సంఖ్యాకులుగా ఎన్నిక అయిన కాంగ్రెసువారు, గట్టిగా తలపెడితే దేశంలో ఉన్న జన బాహుళ్యాన్ని సరిఅయిన త్రోవను నడపి, వారికి మంచి చెడ్డలు తెలిపి, గ్రామాలను పునర్నిర్మించడానికి వారు శాసన సభ్యులుగా చేస్తూన్న సేవకు భంగం రాకుండానే, ఎన్నో విధాల దేశాన్ని పునరుద్ధరించగలిగి ఉండేవారు.

కాని గాంధీగారి నాయకత్వాన నడుస్తూన్న నోఛేంజర్లూ, మోతిలాల్‌నెహ్రూగారిని అంటిపెట్టుకుని ఉన్న ప్రోఛేంజర్లూ భిన్నాభిప్రాయులై ఉండడాన్ని, ఒకరి దృష్టికి ఆనింది రెండవవారికి ఆనకుండా పోయింది. నోఛేంజర్లు శాసన సభల మూలంగా నూలు వడకడమూ, నేయించడములాంటి నిర్మాణ కార్యకలాపాలుగాని, హిందూ మహమ్మదీయ ఐకమత్య సాధనకు కృషిగాని చేయలేని స్థితిలోకి దిగజారారు. ప్రోఛేంజర్లెప్పుడూ నో ఛేంజర్లను అనుమాన దృష్టితోనే చూసేవారు. కాగా ఖాదీ కార్యక్రమం అంటే వారికి ఒకవిధమయిన అలసభావం ఉండేది. ఈ రెండు రకాల కాంగ్రెసు వారి మధ్యా నలుగుతూన్న జనం తాము ఏం చెయ్యాలో అర్థంకాని స్థితిలో ఉన్నారంటే ఆశ్చర్యపడనవసరం లేదు. శాసన సభ్యులు ప్రజలతో సంబంధ బాంధవ్యాలు లేనివారిలా, తటస్థ విధానంగా బ్రతకజొచ్చారు. ఈ పరిస్థితులలో నో ఛేంజర్లు కౌన్సిల్ కార్యక్రమం ఎప్పుడు ఛిన్నాభిన్నం అవుతుందా, ఎప్పుడు సహకార నిరాకరణోద్యమం సాగిద్దామా అన్న ఆలోచనలో పడ్డారు. ఉప్పు సత్యాగ్రహం కారణంగా శాసన సభ్యులను బైటకు వచ్చివెయ్యండని ఆదేశం ఇచ్చే పర్యంతమూ ఇలాగే నడిచింది.

రాజ్యాంగ సంస్కరణల వాయిదా

బ్రిటిషువారు బహు నేర్పరులు. మామూలుగా అవసరాన్నిబట్టి రాజ్యాంగంలో తీసుకు రావలసిన చిన్న చిన్న మార్పులను కూడా వాయిదాలు వేయడమూ, ప్రజలలో లేనిపోని ఆశలు కల్పించడమూ, హిందూ మహమ్మదీయ స్పర్థలూ, బ్రాహ్మణ బ్రాహ్మణేతర వివాదాలూ తలలెత్తకుండా సహకరించి వాటిని రూపు మాపుతాం అంటూ, వాటికి ద్రోహం చెయ్యడమూ జరిగేవి. చురుక్కుమనిపించే మింటో-మార్లే సంస్కరణలు 1909లో అమలు పరచి, మతావేశాలనూ, మత కలహాలనూ తీవ్రతరం చేశారు. ఈ మత కలహాలు మాన్‌ఫర్డ్ సంస్కరణల కాలం (1916-17)లో మరీ ఉద్ద్రుతంగా జరిగాయి. అవి 1935 దాకా అల్లా అల్లా వేళ్ళు నాటుకుంటూనే ఉన్నాయి. అప్పుడు కళ్ల తుడుపుగా "గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్" అని ఒక చట్టాన్ని అమలుపరచి, దాని క్రింద "ప్రొవిన్షియల్ అటానమీ" అనే విధానాన్ని అమలు పరిచారు.

1926-30 ల మధ్య హిందూ మహమ్మదీయ కలహాలు ఏటేటా జరుగుతూ ఉండడమూ, పట్టపగలే వందలాది అమాయక ప్రజలు హత్యలకు గురి అవుతూండడమూ జరిగేది. అందు 1927 లో అట్టి హత్యాకాండ మరీ ముమ్మరంగా సాగింది. లాహోరులో మే మాసంలో తీవ్రమయిన హిందూ మహమ్మదీయ సంఘర్షణలు జరిగాయి. 1926-30 ల మధ్య ఏటేటా ఉత్తర హిందూస్థానంలో అఖిల పక్ష సమావేశాలు జరగడమూ, అందు మత కలహాలు అంతం అవడానికి సూచనలు చేయబడడమూ, భారత దేశానికి అనువయిన కట్టుబాట్లతో "కాన్ట్సిట్యూష" నొకటి తయారు చెయ్యడానికి ప్రయత్నాలు జరగడమూ మామూలయింది.

బ్రిటిషువారి పన్నాగం

1926-27లో భారత దేశపు రాజకీయ అవసరాలను గుర్తించి, వలసిన సలహా లివ్వడానికి, సూచనలు చెయ్యడానికి "సైమన్ కమి షన్" ఇండియాకు రాగలదనే నాన్పుడు మాటలతో భారతీయులను సంతుష్టి పరచాలని ఆంగ్లేయులు ఒక పన్నాగం పన్నారు. మౌంట్ ఫర్డు సంస్కరణలను నిరాకరించి త్రోసివేసిన కాంగ్రెసువారు, రాజకీయంగా ముందడుగు వేయడానికి సన్నాహాలు చేయజొచ్చారు. బ్రిటిషువారికి కాంగ్రెసువారి సూచనలు ఎప్పుడూ ఏకోశాన కూడా నచ్చలేదు. స్వరాజ్య పార్టీ నాయకులు సూచించిన ద్వంద్వ ప్రభుత్వ విధాన ప్రతిపాదనలనయినా పరిశీలించాలనే వివేకం కూడా వారికున్నట్లు కనిపించలేదు. ఈ పరిస్థితులను గ్రహించి కాంగ్రెసువారు 1926లో గౌహతీ కాంగ్రెసులో పదవీ స్వీకారం చేయరాదనీ, మదరాసు కాంగ్రెసులో సైమన్ కమిషనును బహిష్కరించాలనీ నిశ్చయించుకోవలసివచ్చింది. 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బహిష్కరణ ఉద్యమం తర్వాత 1928-29 లలో సైమన్ కమిషన్ బహిష్కరణ అన్నదే బ్రహ్మాండమయిన ఉద్యమంగా రూపొందింది. మదరాసు కాంగ్రెసు, సైమన్ కమిషన్ భారత దేశంలో అడుగుపెట్టింది మొదలు బ్రహ్మాండమయిన బహిష్కరణ ఉద్యమం సాగించాలని ఆదేశం ఇచ్చింది. వారు భారత దేశంలో అడుగుపెట్టిన నాడు దేశవ్యాప్తంగా హర్తాలు జరపాలనీ, వారు ఏ రాష్ట్రంలో, ఏ ప్రదేశానికి వెళ్ళినా వారిని బహిష్కరించవలసిందే అని కాంగ్రెసు మహాసభ నిశ్చయించింది.

అద్భుతమైన ఆరంభ విజయం

మద్రాసు శాసన సభా కాంగ్రెసు పక్షం ఏర్పడిన అనంతరం, అనగా ఫిబ్రవరిలో, నేనూ శ్రీనివాసయ్యంగారు కలిసి డిల్లీకి వెళ్ళాము. విఠల్‌బాయ్ పటేల్ అధ్యక్షతను ఆరంభం అయిన కేంద్ర శాసన సభ సమావేశం తొలి ఘట్టాలలోనే ఏర్పడిన ఉద్రేక పూరిత వాతావరణం భారతీయ దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. సమావేశం నడచిన విధానం, సభ్యులు కనబరచిన నేర్పరితనం, కాంగ్రెసు పార్టీలో కుదిరిన ఏకత్వం ప్రజాహృదయంలో బాగా నాటుకు పోయాయి.

బెంగాల్ నివాసి సత్యేంద్ర చంద్ర మిత్రాగారిని, ఆయన జైలులో ఉండగానే, కేంద్ర శాసన సభా సభ్యునిగా ఎన్నుకున్నారు. మిత్రాగారు జైలులో ఉన్నప్పటికీ, ఆయనకు సభా కార్యకలాపాలలో పాల్గొనే హక్కు ఉన్నదని కాంగ్రెసు పార్టీవారి వాదం. ప్రభుత్వంవారు నిర్ణయించే విధానానికి అనుగుణంగా మిత్రాగారు శాసన సభా కార్యక్రమాలలో పాల్గొన గలిగే పర్యంతం సభ వాయిదా పడాలని పార్టీనాయకుడు స్వయంగా ఒక ప్రతిపాదన తీసుకువచ్చాడు. అసెంబ్లీ కార్యక్రమ నాయకుడయిన సర్ అలెగ్జాండర్ మడ్డిమన్ ఆ తీర్మానాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. మోతిలాల్‌నెహ్రూగారి వాదం చక్కగా, మాంచి హుందాగా, తిరుగులేనిదిగా ఉండి, అలెగ్జాండర్ గారికి సమాధానం చెప్పడానికి మాటలు కరువయాయి. ఆయన తాను లేవదీసిన వాదానికి సిగ్గు చెందడానికి బదులు, ఆంగ్ల దేశంలో హౌస్ ఆఫ్ కామన్స్‌వారు శాసన సభ వారికి ప్రభుత్వాన్ని ఒత్తిడిచేసే హక్కులేదనే ఆచారాన్ని పాటిస్తారు గనుక, ఆ పద్ధతినే ఇక్కడ కూడా పాటించాలని వాదించారు. తర్వాత ఆ ప్రతిపాదన ఓటుకు పెట్టబడింది. అన్నివర్గాల నాయకులూ, ఈ విషయ నిరూపణలో ఉన్న గాంభీర్యానికీ, ఆకర్షణకీ ముగ్దులయి, అనుశ్రుతంగా వస్తూన్న ఆంగ్లేయ ఆచారానికి విరుద్ధంగానూ, తీర్మానానికి అనుకూలంగానూ ఓటు చేశారు. పద్దెనిమిది ఓట్ల ఆధిక్యంతో ఆ ప్రతిపాదన నెగ్గింది. కాని తమకు సభవారి సూచనలను అమలు పరచితీరాలనే అనుశాసనం లేదు. కనుక, ఆ తీర్మానాన్ని అమలు పరచడం తమ విధి కాదంటూ ప్రభుత్వం వారు త్రోసివేశారు.

ఏదో సాకుతో నెగ్గిన తీర్మానాన్ని ప్రభుత్వంవారు త్రోసిపుచ్చినా, కాంగ్రెసువారి కది ఘనమైన విజయమే కదా! అందువల్ల దేశం అంతా ఉల్లాస పూరితం అయింది. ఆరంభంలోనే, ప్రథమ ప్రయత్నంలోనే కాంగ్రెసు వారికి లభించిన ఆ ఘన విజయానికి ఆనందసాగరంలో ఓలలాడింది. కాంగ్రెసుపార్టీ వారు కనబరచిన సంఘీభావానికీ, చూపించిన క్రమశిక్షణకీ ప్రతివారూ ఆశ్చర్య చకితులయ్యారు. నిష్పూచీగానూ, నిరంకుశంగానూ వ్యవహరిస్తూన్న ప్రభుత్వంవారూ, సెక్రటరీ ఆఫ్ స్టేట్ కూడా, ఈ కాంగ్రెసు పార్టీ అన్నది మంచి క్రమ శిక్షణతోనూ, పకడ్ బందీగానూ ఏర్పడిందనీ, భారత దేశంలో ఇంత బ్రహ్మాండమయిన పార్టీ ఇంకొకటేదీ లేదనీ గ్రహించారు.

అవబోధంతక్కువైన ప్రజ

శాసన సభతో సంబంధం ఉన్న రాజకీయ కాంగ్రెసు నాయకులంతా నిర్మాణ కార్యక్రమంపట్ల చిన్నచూపు చూసి ఉండకపోతే, దేశమూ, దేశంలోనీ గ్రామాలు ఆ 1926-30 మధ్య కాలంలో, పరిస్థితులను సరిగా గ్రహించి, సక్రమమయిన మార్గంలో పొందికగా ముందడుగు వేయగలిగి ఉండేవి. నాయకత్వం నో ఛేంజర్ల చేతిలో ఉన్నా, కౌన్సిల్‌వారి చేతిలో ఉన్నా, ప్రజలకు రాజకీయ విజ్ఞానం కలిగించ గలిగి ఉన్ననాడు, ప్రజలు తమ చేతులలోనే పూర్ణమైన హక్కులున్నాయనీ, కౌన్సిల్స్‌వారూ, మంత్రులూ వారి క్షేమాన్ని కాంక్షించే పరిపాలన నిర్వహించవలసి ఉన్నదనీ, వైస్రాయిగారితో సహా యావత్తు పరిపాలనా యంత్రాంగమూ వారి చెప్పు చేతులలోనే నడవవలసి ఉంటుందనీ గ్రహింప గలిగేవారు.

కాని ఓటర్ల దురదృష్టం కొద్దీ, కాంగ్రెసులోని ఇరుపక్షాలవారూ, ఎవరికి తోచిన విధంగా వారు ఏ దూర తీరాలకో కొట్టుకునిపోతూ వచ్చారు. 1924 లో బెల్గాం కాంగ్రెసులో స్వరాజ్య పార్టీవారి చేతులలోకి కాంగ్రెసు వచ్చింది లగాయితు, ఏటేటా దిగజారడమే కనబడింది. ఎటొచ్చీ 1926, 1930 సంవత్సరాల మధ్యకాలంలోనూ, దరిమిలానూ కూడా, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటర్లకు ఏమేమో నూరిపోసేవారు. ఆ చెప్పిందైనా ఓట్లు ఎల్లా వెయ్యాలి అన్న విషయం మీదే కేంద్రీ కృతమై ఉండేది. కాని నిజానికి అది ఒక జాతి నిర్మాణానికి చాలని ప్రబోధం. సహకార నిరాకరణ ఉధ్యమం ఎప్పుడు ఆరంభమయినా అరెస్ట్‌లూ, జైళ్ళూ తప్పవు గనుక, అక్కడే ఆజైళ్ళలోనే ఆ రెండు పార్టీలవారికీ ఒకరి నొకరు ప్రేమించుకోవడానికైనా, ద్వేషించుకోవడానికైనా వీలుగా ఉండేది. ఇల్లాంటి అవకాశాలూ, సందర్భాలూ ఆ 1926-1930 సంవత్సరాల మధ్య వస్తూ ఉండేవి గనుక, పై విషయాలు ఆ నాలుగైదు సంవత్సరాలకు సంబంధించినవే అనుకోవచ్చును.