నా జీవిత యాత్ర-2/మదరాసులో ఏర్పడిన "బినామీ" మంత్రివర్గం

వికీసోర్స్ నుండి

18

మదరాసులో ఏర్పడిన "బినామీ" మంత్రివర్గం

1927 వ సంవత్సరారంభంలో 1926 నవంబరులో జరిగిన ఎన్నికలలో నెగ్గిన శాసన సభా సభ్యుల ప్రథమ సమావేశం జరిగింది. సభ్యులా సంవత్సరం ప్రజాహితార్థం కౌన్సిల్లో ప్రవేశ పెట్టదలచిన ముఖ్య విషయాలను గురించి చర్చించి-

1. కాంగ్రెసు వివిధ కక్షుల క్రింద ఏర్పడి, కేంద్ర, రాష్ట్రీయ శాసన సభా సమావేశాలకు హాజరయి తీరాలనీ;

2. మద్రాసులో కాంగ్రెసు పార్టీ పెద్దగా డాక్టర్ సి. సుబ్బరాయన్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించి, ఒక "బినామి" మంత్రివర్గం ఏర్పడాలనీ;

3. పార్లమెంట్ మెంబర్‌గా షౌకతాలీగారి రాక సందర్భంలో వారి ప్రాత:కాల ఫలహారం, శాసన సభా భవనంలోనే ఏర్పాటు చేయాలనీ;

4. శాసన సభ్యుడైన ఎస్. పి. మిశ్రాగారిని అరెస్టుచేసిన సందర్భంలో, మిశ్రాగారిని వెంటనే సభా మందిరంలో హాజరు పరచాలని మోతిలాల్‌గారు శాసన సభలో ప్రతిపాదించారనీ, దానిపైన తీవ్రమైన వాగ్వివాదం దుమారం లేచిందనీ, అంత హడావిడికి కారణం మోతిలాల్ గారు ప్రవేశపెట్టిన ప్రతిపాదన చరిత్రాత్మకమయినదనీ, అది అమలునందున్న రాజనీతి స్వభావానికి విరుద్దమై ఒక నూతన సంప్రదాయ స్థాపనకు నాంది అనే కారణం వల్లనే వివాదం రేగిందనీ-..........

అందువలన, అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు, రాజ్యతంత్ర విధానంలో అవసరమైన మార్పులూ, చేర్పులు చేస్తూ, మన దేశానికి అనువైన పద్ధతిని, ఒక నూతన రాజ్యతంత్ర విధానాన్ని రూపొందించాలనీ తీర్మానించారు.

1927 అక్టోబరు 27 వ తేదీని అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు సమావేశపరచిన ఐకమత్య మహాసభవారు సాంఘిక సమస్యను గురించి చేసిన తీర్మానం మదరాసు కాంగ్రెసు (26-12-1927) మహాసభలో ప్రవేశ పెట్టబడి ఆమోదించబడింది. కాగా, ఈ దిగువ ఉదహరించిన అంశాలకు సంబంధించిన తీర్మానాలూ అంగీకరించబడ్డాయి:

1. సైమన్ కమిషన్ "బాయికాట్"కి నిర్ణయం;

2. పండిత జవహర్‌లాల్‌గారి స్వాతంత్ర్య లక్ష్యప్రతిపాదన;

3. స్కీన్ కమిటీనుంచి మోతిలాల్‌నెహ్రూగారు తప్పుకొనుట;

4. మద్రాసు శాసన సభలో కొందరి సభ్యుల అసభ్య ప్రవర్తన.

మదరాసు శాసన సభలో కాంగ్రెసుబలం

ఆంధ్ర, తమిళనాడు, మళయాళ, కన్నడ కాంగ్రెసు శాసన సభ్యులు శాసన సభలో "కాంగ్రెసుపార్టీ"ని స్థాపించడము, అందులో ఆంధ్ర, తమిళనాడు సభ్యులనే ఎక్కువగా కాంగ్రెసు పార్టీ సభ్యులుగా ఎన్నుకోవడమూ జరిగింది. అప్పటి ఎన్నికలలో మదరాసు రాష్ట్ర శాసన సభకు కాంగ్రెసు తరపున 45 గురు ఎన్నిక అయారు. మొత్తం 104 గురు సభ్యులు మాత్రమే కల మద్రాసు అసెంబ్లీలో పెద్దపార్టీ కాంగ్రెసువారిదే. ద్వంద్వ ప్రభుత్వ విధానంలో మంత్రులు ప్రజలకు పూచీదారులన్న విషయం ఒప్పుకోకపోయినా, బాహ్యాడంబరాలూ, ఆనమాయితీలు మాత్రం అమలు పరచారు. గవర్నరుగారు కాంగ్రెసు పార్టీనాయకుణ్ణి పిలిచి, మంత్రివర్గాన్ని ఏర్పరచవలసిందని కోరవలసి ఉంది. అయితే కాంగ్రెసువారు పదవులు స్వీకరింపరన్నది బాహాటంగా అందరూ ఎరిగిన విషయమే. కాంగ్రెసు మెజారిటీ వచ్చిన అన్ని రాష్ట్రాలలోనూ (మద్రాసుతో సహా) సహకార నిరాకరణమే వారి ఆశయం అయినా మంత్రిపదవులను స్వీకరిస్తే ప్రజలకు ఉపకరించే సందర్భాలలో సహకరిస్తూ, గోడమీద పిల్లి వాటంగా సహకారమో, సహకార నిరాకరణమో సందర్భానుసారంగా అవలంబిస్తూ ఆ నాలుగు రాష్ట్రీయ కాంగ్రెసు కమిటీల ఆజ్ఞలు పాటించవలసి ఉంది.

మామూలు పరిస్థితులలో దక్షిణ హిందూదేశానికి సంబందించినంతవరకూ, ఆ నాలుగు రాష్ట్రాలవారికీ, కాంగ్రెసు మెజారిటీ వచ్చిన ఇతర రాష్ట్రాల వారితోపాటు పదవీ స్వీకార విషయంలో చికాకులూ, చిక్కులూ లేనేలేవు. అస్సాం (గౌహతీ) కాంగ్రెసు "మంత్రి పదవులు స్వీకరింపరాదు" అని ఆదేశం ఇచ్చే ఉంది. కాంగ్రెసుపార్టీ లీడరును పిలిచి, మంత్రులను ఎన్నుకుని, రాజ్యాంగాన్ని చేపట్టమని గవర్నరు ఆహ్వానిస్తాడన్న సంగతి అందరూ ఎరిగి ఉన్నదే. విశాఖపట్నవాసి, కీర్తిశేషులైన సి.వి.ఎస్. నరసింహరాజుగారు ఆనాడు కాంగ్రెసు పార్టీ లీడరయిన కారణంగా, ఆయన్ని గవర్నరుగారు పిలిచి మంత్రులను ఎన్నుకుని, రాజ్యాంగాన్ని చేపట్టమని కోరినప్పుడు, తాను గవర్నరుగారి కోరికను మన్నించరాదని అప్పటికే ఆయనకు కాంగ్రెసు వారిచే హుకుం జారీ చేయబడింది.

తెరవెనుక నాయకులు

తమిళరాష్ట్ర నాయకులైన శ్రీనివాసయ్యంగారు, రాజగోపాలాచారిగారు పైకేమీ తేలలేదు. మంత్రిపదవులు స్వీకరించి, రాజ్యాంగాన్ని చేపట్టాలనే ఆశ తమకు లేదని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చెప్పవలసిన విధి వారిపై ఉంది. కాంగ్రెసుపార్టీ పేరుమీద మంత్రిపదవులను స్వీకరించడానికి వీలులేకపోయినా, తమ సొంతపేరుమీద కాని పక్షంలో, ఏదో ఒక పేరుమీద, ఏదో ఒకవిధంగా "బినామీ" మంత్రిపదవులనైనా స్వీకరించి తమ వాంఛలను తీర్చుకోవాలనే కోరిక ఆ యిరువురి నాయకులకూ మిక్కుటంగా ఉంది. చక్రవర్తుల రాజగోపాలాచారిగారికీ, ఎస్. శ్రీనివాసయ్యంగారికి వారి హృదయాలలో మంత్రిపదవులను చేపట్టాలనే వాంఛ ఉన్నా, ఆంధ్రరాష్ట్ర శాసన సభ్యులను సంప్రదించకుండా వారంతట వారే తుది నిర్ణయం తీసుకోలేక పోయారు. అందువలన ఆంధ్రరాష్ట్రీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా నాతో వారు సంప్రతించవలసి ఉంది. 1927 జనవరిలో శ్రీనివాసయ్యంగారు నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు. వారింటివద్దనే రెండు మూడు రోజులపాటు ఈ సంప్రతింపులు జరిగాయి. ఆఖరి రోజున జరిగిన తర్జన భర్జనలు తెల్లవారగట్ల 2, 3 గంటల వరకూ నడిచాయి. నిజానికి అంతగా తర్జన భర్జనలు చేయవలసిన అవసరం ఉందని నేననుకోను. కాని నన్ను వారి ఉద్దేశానికి అనుకూలంగా త్రిప్పుకోవాలనే తాపత్రయంతోటే వారికి కాలం అంతా గడచిపోయింది. ప్రతీసారీ, "కాంగ్రెసువారి ఆశయం అదికాదు"-అన్న వక్క ముక్కతోనే నా అభిప్రాయం తెలిపేవాడిని. లాయరుగా ఆయనకి ఉన్న ప్రతిభా, చాకచక్యమూ వగైరాలన్నీ, పాపం, ఆయన నాపై ప్రయోగించారు. వారిపట్ల నేను కొరకరాని కొయ్యనే అయి ఆఖరు సారిగా మంత్రిపదవులు స్వీకరించడానికి నా సహకారం ఎంత మాత్రం ఉండదని స్పష్టపరిచాను.

వారికి మాత్రం ఎలాగయినా "బినామీ" మంత్రివర్గం యేర్పరచాలనీ, ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని ఎన్నుకోవాలనీ చాలా ఉబలాటంగా ఉంది. కాంగ్రెసు వారికి గర్భ విరోధి అనీ, ఆ ఎన్నికలలో కాంగ్రెసువారిని గెలవనీయరాదని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడనీ ఎరిగిఉన్న వారికి ఆ డాక్టర్ సుబ్బరాయన్ వారికెల్లా నచ్చాడో నా కర్థం కాలేదు. డా. సుబ్బరాయన్ కాంగ్రెసుకు ఎంతగానో ఉపకరిస్తాడు. అందువల్లనే స్వతంత్రపార్టీ అని ఒకదానిని సృష్టించి, దానికి ఆయన్ని నాయకునిగా స్థిరపరచామని శ్రీనివాసయ్యంగారు నాతో చెప్పారు.

నేను తీవ్రంగా ప్రతిఘటించి, నా అసమ్మతిని స్పష్టంచెయ్యడం చేత, అలాంటి చర్య కాంగ్రెసుకు విద్రోహచర్యే అవుతుందని హెచ్చ రించడంచేత వారు తమ ప్రయత్నంనుంచి విరమించుకుంటారనే నేను భావించాను.

డా. సుబ్బరాయన్ "స్వతంత్రపార్టీ"

డాక్టర్ సుబ్బరాయన్‌కు "స్వతంత్రపార్టీ" అనే సొంతపార్టీ యేదీ లేదు. ఆయన వెనకాల ఉన్న అ నలుగురూ, అధికారంలో ఎవరు ఉంటే వారి పార్టీవారిగానే చెలామణీ అవుతూ, వారి వెనుకనే చేతులు నలుపుకుంటూ తిరిగేరకం. కాని రాజగోపాలాచారిగారూ, శ్రీనివాసయ్యంగారూ కూడా కాంగ్రెసుపార్టీ యావత్తు సహకారమూ ఉంటుం దని హామీ ఇచ్చారు. ఆ మద్దతు చూసుకుని, ఈ వార్త ఆయన మెల్లిగా గవర్నర్ గారి చెవినివేసి, తనకు కాంగ్రెసు వారి సహకారం ఉంటుందనీ, తన సహచరులను తాను ఎంచుకుంటాననీ విశదపరచాడు. "స్వతంత్రపార్టీ మంత్రివర్గం" అన్న పేరుమీద ఆయన, మంత్రులను ఎంచుకుని, రాజ్యాంగాన్ని చేపట్టారు.

ఆంధ్రరాష్ట్రీయ కాంగ్రెసు కమిటీవారూ, మలబారువారూ, ఈ ఏర్పాట్లకు మొదటినుంచీ వ్యతిరేకులే. బ్రిటిషు గవర్న్‌మెంట్ వారి దృష్టిలోనూ, వారి ప్రత్యర్థుల దృష్టిలోనూ, దేశీయులలోను కూడా కాంగ్రెసు ఎంత చులకనై పోతుందోనన్న విచారంగాని, ఆలోచనగాని ఆ అరవనాయకుల కిరువురుకూ లేక పోయింది. సూక్ష్మబుద్ధి, దూరదృష్టి గలవారని పేరున్న ఆ నాయకులు ప్రజలదృష్టిలో కాంగ్రెసు ఎంత హీనమై పోతుందో తెలుసుకోలేక పోయారనలేము. పర్యవసానాల ప్రసక్తే వారికి పట్టలేదని మాత్రం అనవలసివస్తుంది. వారి హృదయాంతరాళాలలో పదవీవ్యామోహం బాగా నాటుకుపోయిన కారణంగా గత్యంతరంలేక వారు పైనాటకం అంతా ఆడవలసి వచ్చింది.

కాంగ్రెసు బురఖారాయళ్ళు

రాజగోపాలాచారి ప్రభృతులు ఆడిన ఈ నాటకంవల్ల వారికి గాంధీగారియందుగాని, వారి కార్యక్రమమందుగాని, వారి సహకార నిరాకరణాదీ ఉద్యమాలయందుగాని ఏ విధమయిన విశ్వాసమూ ఉండి ఉండదనీ, విరోధ భావమే ఉండి ఉండాలనీ అనుకోక తప్పదు. స్వరాజ్య పార్టీపేరుతో వ్యవహరించిన సి. ఆర్. దాస్-మోతిలాల్ నెహ్రూ, శ్రీనివాసయ్యంగారు మొదలైన వారు గాంధీగారి ఉద్యమానికీ, వారి కార్యక్రమానికీ, మొత్తానికి వారి విధానానికే గొడ్డలిపెట్టుగా తమ "కౌన్సిల్ ఎంట్రీ" ప్రోగ్రాం రూపొందగలదన్న విషయం విస్మరించినట్లు గ్రాహ్యం అయింది. కాగా, రాజగోపాలాచారిగారు శాసన సభా బహిష్కార ప్రచారం రెండుమాసాలపాటు విరమించాలంటూ 1923 ఫిబ్రవరిలో తెచ్చిన ప్రతిపాదన, స్వరాజ్యపార్టీ వారివిధానానికే సహకరించింది. న్యాయానికి, అత్యధిక సంఖ్యాకులయిన కాంగ్రెసువారు అనుసరించ దలచిన విధానానికి వ్యతిరేకభావాలు ఉండిఉంటే, వీరు కాంగ్రెసు నుంచి తప్పుకుని తమకు ఇష్టమయిన ఏదో ఒక పేరుతో తమ కార్యక్రమాలు కొనసాగించుకుని ఉండవలసింది. కాని రెండు సంవత్సరాలపాటు వారు పడిన తంటాలలో కాంగ్రెసు సహకరించందే ముందడుగు వేయజాలమనే సంగతి వారికి విశదమైంది. అంతే కాదు, కాంగ్రెసులోనే గనుక వారు ఉండదలిస్తే, వారికి కలిగిన పదవీ వ్యామోహం వారు వదలుకుని ఉండవలసింది. ఇటూ అటూ గాకుండా, హృదయాంతరాళంలో కాంగ్రెసు విధానాలయందు నమ్మికలేకపోయినా, అవసరానికి తప్పని సరిగా కాంగ్రెసు బురఖా తగిలించుకుని నాటకమాడడమే స్వరాజ్యపార్టీ వారి మనోభావం అని తేలిపోయింది.

సర్వసాధారణంగా, ప్రపంచం మొత్తంమీద, "అధికారం" మీద లంచగొండితనపు ఛాయాప్రభావం పడక మానదని ఒప్పుకోక తప్పదు కదా! అందులో మాన్‌ఫర్డ్ రాజ్యాంగ సంస్కరణలను అనుసరించి పదవులు చేపట్టిన నిరంకుశ మంత్రుల చేతులలో లాభాలు పొందాలనీ, హోదాలు సంపాదించాలనీ వాంఛించే కాంగ్రెసే తరులందరూ కాంగ్రెసులో జేరడం సంభవించింది. పాపం, అలా బురఖాలు తగిలించుకున్నవారిలో ఇద్దరో, ముగ్గురో మాత్రమే మంత్రులవడానికి అవకాశం ఉంటుందని వారు తలచారో లేదో గదా! ఎప్పుడయితే స్వరాజ్యపార్టీ వారు తమ పార్టీ పేరును "కాంగ్రెసు"పార్టీగా మార్చుకుని ఎన్నికలలోకి దిగారో, ఆనాడే చాలామంది కాంగ్రెసేతరులకు తాము కాంగ్రెసుపార్టీలో చేరినట్లయితే చులాగ్గా జయాన్ని సాధించవచ్చుననే నమ్మకం కుదిరింది. కాంగ్రెసు సిద్ధాంతాలలో విశ్వాసంలేని ఎందరో మహానుభావులు సభ్యులుగా ఎన్నికయి, కాంగ్రెసు ఆదేశానుసారం శాసన సభలలో అవలంబించవలసిన విధానాలయందూ కార్యక్రమాలయందూ ఎంతమాత్రమూ నమ్మకం లేకుండానే, కాంగ్రెసుపార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కారణాలవల్ల పార్టీలో సభ్యులు పెరిగారుగాని వారి గుణగుణాదులు, విధానాలూ ఎంతమాత్రమూ మారలేదు.

కాంగ్రెసువారి పిలుపును మన్నించి వృత్తులను విసర్జించి, సహకార నిరాకరణ ఉద్యమంలో చేరి, అనేక కష్టనష్టాలకు గురి అయి, త్యాగాలుచేసీ, నాయకులైన పెద్దలే స్వరాజ్యపార్టీ స్థాపించి, ఆ పార్టీలో ఉత్తమనాయకులుగా పరిగణింపబడిన ఆ పెద్దలే అధికార వ్యామోహంతో ఏడాదితిరక్కుండానే కాంగ్రెసుకార్యక్రమాదులలో మార్పులు తీసుకువచ్చి బురఖారాయళ్ళ పొత్తుతో ఎలా దిగజారిపోయి, తమ పార్టీకి ఇంకాబలం చేకూర్చుకోవాలనే వాంఛతో అడ్డమయినవారినీ పార్టీలో చేర్చుకుని ఎలా పతనం అయ్యారో గ్రహించడం న్యాయం. నా సలహాను పాటించకుండా, వివిధ కాంగ్రెసు కమిటీల వారికి సకాలంలో సమాచారం అందజేయకుండా, ఆఖరికి సవ్యంగా ఏర్పడిన కాంగ్రెసుపార్టీవారికైనా తెలియజేయకుండా ఒక "బినామీ" మంత్రివర్గాన్ని చెన్నపట్నంలో నిలబెట్టారు.

శాసన సభలో కాంగ్రెసు పక్షం

1927లో ఇంకా కాంగ్రెసు ప్రెసిడెంటుగానే చెలామణీ అవుతూన్న శ్రీనివాసయ్యంగారి ఇంటిలో, ఎన్నికలలో విజయాన్ని చేపట్ట గలిగిన కాంగ్రెసు సభ్యులందరూ హాజరయ్యారు. వారు విశాఖపట్నవాసి సి. వి. ఎస్. నరసింహరాజుగారిని పార్టీనాయకునిగా, ఎస్. సత్యమూర్తిగారిని ఉపనాయకునిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత శాసనసభా ధ్యక్షుడుగా ఎవరుంటే బాగుంటుందని మీమాంస వచ్చింది. కాంగ్రెసే గనుక రాజ్యాంగాన్ని చేపట్టడానికి అంగీకరించిఉంటే, ఎన్నుకోబడిన నాయకుడే ఎకబిగిని ముఖ్యమంత్రి అయ్యేవాడు. కాని ఇటువంటి పద్దతులకు కాంగ్రెసు కార్యనిర్వహణ విధానంలో తావే లేదుకదా! అందువలననే తాను అధ్యక్షస్థానం వహిస్తానని నరసింహరాజుగారు ముందు కొచ్చారు.

కాంగ్రెసు కార్యక్రమాన్ని సవ్యంగా నడప శక్తిలేని పరిస్థితులలో వారు ఒక "బినామీ" మంత్రివర్గాన్ని యేర్పరచారు. కాంగ్రెసు ఆదేశాలకు విరుద్ధంగా, దానికి అవసర సహకారం అందిస్తామన్నారు. మంత్రుల జీతాల విషయమూ, బడ్జెట్టూ చర్చకు వచ్చిన సందర్భంలో సందిగ్ద స్థితిలో పడ్డారు. చేయగలిగింది లేక, కొంతమంది శాసనసభా ప్రాంగణం నుంచి వెలుపలకు వెళ్ళిపోయారు. ఈ ప్రకారంగా బడ్జెటు చర్చ ఆరంభదశలోనే మద్రాసు శాసనసభ కాంగ్రెసుపార్టీవారు కాంగ్రెసుకూ, దేశానికికూడా ద్రోహం చేశారు.

మూలపడిన విశ్వాసరాహిత్య తీర్మానం

ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెసువారికి పార్టీని రద్దుచేసే అధికారం ఉందిగాని అల్లా జరుగలేదు. బొంబాయిలో జరిగిన (మే 15-16) అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశంలో మద్రాసు శాసన సభా సభ్యులుగా ఉంటూన్న కాంగ్రెసు వారిమీద ఉ. గోపాలమేనోన్ విశ్వాసరాహిత్య తీర్మానం తీసుకువచ్చాడు. ఇల్లా కాంగ్రెసువారు పతనం అవడానికి మోతిలాల్‌నెహ్రూగారిదే బాధ్యత అన్నాడు. ఆయన పార్టీ నాయకుడు. పైగా "స్కీన్" కమిటీలోనూ, ఇంపీరియల్ కౌన్సిలులోనూ సభ్యత్వం స్వీకరించడానికి ఒప్పుకున్నారు. గోపాలమేనోన్ తీసుకు వచ్చిన తీర్మానానికి, శ్రీనివాసయ్యంగారు సవరణ ప్రతిపాదించారు. ఒక ఉపసంఘం మదరాసు శాసన సభలోని కాంగ్రెసు పక్ష సభ్యుల కార్యకలాపాల విషయమై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ఆ సవరణ. ఏదోరకంగా కాలయాపన చేసి, విశ్వాసరాహిత్య తీర్మా నాన్ని ప్రక్కకు నెట్టాలనే అభిలాషతో యుక్తియుక్తంగా చేయబడిన సవరణ తీర్మానం అది.

ఈ పరిస్థితులలో మెంబర్ల ఆలోచనలన్నీ "సర్ జాన్ సైమన్" ఆధిపత్యాన్ని రానున్న రాయల్ కమీషన్‌మీద కేంద్రీకరింప బడ్డాయి. నిజానికి హిందూదేశానికే "సైమన్ కమిషన్" రావడానికి ఇంకా ఏడాది గడువుంది. అయితేనేం, ప్రజాభిప్రాయాన్ని అన్యమార్గాలు పట్టించడానికి, తర్జన భర్జన చేయవలసిన విశ్వాసరాహిత్యతీర్మానాన్ని మూలకు త్రోయడానికి ఈ సైమన్ కమిషన్ ప్రస్తావనకి ప్రాముఖ్యం ఇస్తూ, మద్రాసు శాసన సభలోని కాంగ్రెసువారిపై రానున్న అభియోగాన్ని చల్లచల్లగా జారవిడిచారు.

ఎల్లాగయితేనేం, మొత్తానికి డాక్టరు సుబ్బరాయన్‌గారి మంత్రివర్గం, కాంగ్రెసువారి సహకారంతో, పూరా మూడు సంవత్సరాలపాటు ఈడ్చుకుంటూ కొనసాగింది. 1929 ఆఖరి రోజులలో, ఉప్పు సత్యాగ్రహం, పేరుమీద కాంగ్రెసువారి కందరికీ వచ్చిన "పిలుపు" కారణంగా అంతమయింది.