Jump to content

నా జీవిత యాత్ర-2/కాంగ్రెసువారి తొలి ఎన్నికలు: ఆంధ్రదేశం

వికీసోర్స్ నుండి

17

కాంగ్రెసువారి తొలి ఎన్నికలు: ఆంధ్రదేశం

ద్వంద్వ ప్రభుత్వం ఎలా పరిణమిస్తుందో కూడా స్వరాజ్యపార్టీ వారికి అనుభవం అయింది. గాంధీగారి విడుదల అనంతరం రెండు సంవత్సరాల కాలంలోనూ కాంగ్రెసు కార్యక్రమ సాఫల్యానికి ఎంత మాత్రమూ కృషి చేయలేక పోయారు. అయినప్పటీకి 1924 లో బెల్గాంలో తమకు గాంధీగారి ద్వారా హస్తగతమయిన కాంగ్రెసు నాయకత్వాన్ని వదులుకుని, దానిని తిరిగి గాంధీగారి హస్తగతం చేయడానికి వారికి మనస్సు రాలేదు.

శాసనసభా ప్రవేశ కార్యక్రమం

"మా కోర్కెలను మన్నించకపోతే మంత్రి పదవులను కూడా చేపట్టి తీరుతాం, సఫలీకృతుల మవుతాం" అనే స్వరాజ్య పార్టీ వారి విశ్వాసాన్ని అనుసరించి 21-9-1925 న పాట్నాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులో స్వరాజ్య పార్టీవారి శాసన సభా ప్రవేశ కార్యక్రమం అంగీకరించబడింది. [1] కాని దురదృష్టవశాత్తూ వారు తీసుకున్న నిర్ణయం అఖిల భారత కాంగ్రెసు కమిటీవారి పూర్తి అనుమతిలేనిదే అమలుపరచడానికి అవకాశం లేకుండా పోయింది.[2]

నిజానికి అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు మెత్తబడి ఉంటే మంత్రిపదవులు చేపట్టడానికి అనుమతి చిక్కి ఉండేది. ఈ మంత్రులు శాసన సభా నియమావళిని మన్నించాలా, దిక్కరించాలా అన్నది తేలనే లేదు.

1926 లో గాంధీగారు కాంగ్రెసునుండి తాత్కాలికంగా విరమించిన సందర్భంలో ఈ స్వరాజ్య పార్టీవారు తమ యిష్టం వచ్చినట్లు కాంగ్రెసును మలచగలిగేవారే. కాని శ్రీనివాసయ్యంగారూ, మద్రాసు శాసన సభా సభ్యులయిన స్వరాజ్యపార్టీ వారు సబర్మతిలో కుదిరిన సమాధానమునకు ఎప్పుడూ విముఖులే కదా! మోతీలాల్ నెహ్రూగారు వారిలో వారికి ఉన్న కలహాలను విస్మరించి కొంతకాలమయినా శాంతంగా విశ్రాంతీ తీసుకోవడం కోసమని ఇంగ్లాండు వెళ్ళిన సందర్భంలో శ్రీనివాసయ్యంగారు వారి అడుగు జాడలలోనే నడవాలని నిశ్చయించు కున్నారన్న విషయం గమనార్హం.

అట్టి పరిస్థితులలోనే 1926 లో గౌహతీ కాంగ్రెస్ అధ్యక్షపీఠాన్ని శ్రీనివాసయ్యంగారు అలంకరించారు.

కాంగ్రెసు పార్టీ అయిన స్వరాజ్య పార్టీ

స్వరాజ్య పార్టీ నాయకుల తమ ఆశయం విఫలం అవడానికి కారణం కాంగ్రెసేననీ, కాంగ్రెసే కనుక తమతో ఏకీభవించి తమ ఆశయమే తనదిగా, తన ఆశయమే తమదిగా ఎంచి అవసరమైన సహకారం ఇచ్చి ఉంటే తాము తమ ఆశయ సిద్దిని సాధించేవారమని అనడం ఆరంభించారు. కాగా, వారు కాంగ్రెసులో విలీనమవడానికి అవకాశం లభ్యమయి, వారి పార్టీ పేరును "కాంగ్రెసుపార్టీ"గా మార్చుటకు అంగీకరిస్తే, తాము అద్భుత ఫలితాలు చూపించగలమన్నారు.

గాంధీగారు విశ్రాంతిగా ఉండడమూ, కాంగ్రెసు స్వరాజ్యపార్టీ వారి అధీనంలో నడవడమూ జరుగుతున్నప్పుడు, "స్వరాజ్యపార్టీ"పేరు కాంగ్రెసు పార్టీగా మారడం సులభమే కదా! అందువలన గౌహతీ కాంగ్రెసుకు పూర్వమే స్వరాజ్యపార్టీ కాంగ్రెసుపార్టీ అయిపోయింది. ఈ మార్పు, 1926 నవంబరులో జరుగనున్న ఎన్నికలకు ముందుగానే, (పాట్నాలో జరిగిన) అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులో అంగీకరించబడింది.

1885లో కాంగ్రెసు సంస్థ ఏర్పడ్డాక అది ఎన్నికలలో పాల్గొనడం అన్నది అంతవరకు జరగని కారణంగా, ఈ 1926 నాటి ఎన్నికల సంరంభమే కాంగ్రెసు జీవితంలో మొట్టమొదటి దయింది. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ జరగడమూ, వాటిలో మొదటిసారిగా కాంగ్రెసు పాల్గొనడమూ అన్నది భారత చరిత్రలలో ఒక అపూర్వ ఘట్టం అయింది.

ఆంధ్రుల రాజకీయ చైతన్యం

ఆంధ్రులూ, ఆంధ్రదేశమూ కూడా 1920 నుంచీ, ఎటువంటి పరిస్థితికయినా తట్టుకుని నిలబడి, సరిఅయిన సూటి మార్గంలో నడవడానికి కావలసిన క్రమశిక్షణకు అలవాటుపడే ఉన్నారు. ఆంధ్రరాష్ట్రంలో జిల్లాలవారీగానూ, రాష్ట్రం మొత్తంమీదా కూడా పేరుపడ్డ సుప్రసిద్ధనాయకు లున్నారు. నాయకుల మాటకేం-ఉంటూనే ఉంటారు. ఏ దేశంలోనయినా రాజకీయంగా వచ్చిన విప్లవం జయప్రదం కాకావాలంటే ప్రజలలోనూ చైతన్యం రావాలి. ఉన్నత రాజకీయ చైతన్యం ప్రజలలోనూ, ప్రజాసేవకులలోనూ కూడా బాగా పాదుకోవాలి. అప్పుడే నాయకుల నాయకత్వం బాగా రాణిస్తుంది. అదృష్టవశాత్తూ అటువంటి చైతన్యం ఆంధ్ర ప్రజా హృదయాలలో బాగా నాటుకుంది. ఆంధ్రదేశం అంటే నేనే, నేనంటే ఆంధ్రదేశమే అన్నంత ఇదిగా దేశానికీ నాకూ అవినాభావ సంబంధం ఏర్పడి ఉంది. అంతేకాదు-ఆంధ్రులు 1907 నుంచీ దేశంకోసం త్యాగాలు చెయ్యడానికి ఎప్పుడూ సంసిద్దులే. అందువల్లనే ఆంధ్రులకు ఏనాడో భారతరాజకీయ చరిత్రలో సుస్థిర స్థానం లభించింది.

1921-22 సంవత్సరాలలో ప్రప్రథమంగా ప్రారంభించబడిన సహకార నిరాకరణ ఉద్యమంలో అనేక ప్రాంతాలవారు జైలుకు పోవడానికి సంసిద్దులయ్యారు. 1922 లో గుంటూరులో ప్రారంభించబడిన పన్నుల నిరాకరణ ఉద్యమం పట్టుదలతో సాగింది. వందలాది గ్రామాధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా లిచ్చారు. ప్రభుత్వం సాగించిన హింసాకాండను, కాంగ్రెసునూ-దాని విధానాలనూ అణగద్రొక్కడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలనూ ఎదుర్కొనడంలో ఆంధ్రులు కనబరచిన ఐకమత్యం, పట్టుదల, త్యాగశీలం మెచ్చి భారతీయులందరూ ఐక్యకంఠంతో "సెహబాస్ ఆంధ్ర్రా!" అన్నారు.

అదే ఉత్సాహంతో 1926 నాటి ఎన్నికల సంరంభంలో కూడా ఆంధ్రులు ఎల్లా పాల్గొన్నారో ఇక్కడ చెప్పాలి. మామూలు ఎన్నికల ప్రచారం కంటె, మన పది పదిహేను తెలుగు జిల్లాలోనూ త్యాగం, సహనం, వ్యక్తి సత్యాగ్రహం అంటూ ఉపన్యాసాలనిచ్చి ప్రజలను ఉత్తేజితుల్ని చేయడం ఎంతో తేలిక.

దేశం మొత్తంమీద తమ తమ ప్రాంతాలకు ప్రతినిధులను ఎన్నుకోవాలి కదా! అలా ప్రతినిధులను ఎన్నుకోవలసిన నియోజక వర్గాలు బహు విస్తీర్ణం కలవి వేలాది ఓటర్లను కలిగి ఉండేవి. ఎన్నికల విషయంలో కాంగ్రెసు వారికి అనుభవం లేదు. దేశవ్యాప్తమైన ఈ ఎన్నికల సంరంభంలో ఏ విధంగా పాల్గొనాలో, వోట్లంటే ఏమిటో, వాటిని వేసే విధానాలేమిటో, అవలంబించ వలసిన పద్ధతు లేమిటో ప్రజలకు తెలియదు.

ఇంగ్లండు మొదలైన ప్రజాప్రభుత్వ దేశాలలో వలెనే అభ్యర్థు లందరూ ప్రచారం నిమిత్తం, ఏజంట్లకనీ, పనివారికనీ అపరిమితంగా తమ జేబుల్లోనుంచి వందలూ, వేలూ ఖర్చుపెట్టవలసి ఉంటుందని ఆఫీసర్ల భావన. ప్రభుత్వంవారూ, కాంగ్రెసు వారికీ వ్యతిరేకంగా నిలబడ దలచిన అభ్యర్థులు కూడా కాంగ్రెసువారు చాలా బీదవారనీ, తమకున్న ఆర్థిక స్తోమతా , పలుకుబడీ, ఎప్పటికీ వారికి కలుగజాలవనీ తలచారు. నిజానికి వారిలో పెద్ద పెద్ద భూస్వాములూ, లక్షాధికారులూ కూడా ఉన్నారు. అంతేకాదు. ఈ ఎన్నికల విషయంలో వారికి కావలసినంత పూర్వానుభవం ఉంది.

కేంద్రసభకు నా అభ్యర్ధిత్వం

నన్ను కృష్ణా గోదావరీ మండలాల నుంచి కేంద్ర శాసన సభకు అభ్యర్థిగా నిర్ణయించారు. నాకు ప్రత్యర్థి దివాన్ బహదూర్ మోచెర్ల రామచంద్రరావు పంతులుగారు. ఆయనకు మంచిపేరూ, పలుకుబడి ఉన్నాయి. అప్పటికి చాలా సంవత్సరాలుగా ఆయన కేంద్ర శాసన సభాసభ్యులుగా ఉంటున్నారు. ఆయన అజేయులనే కీర్తి వుంది. నా బాల్యమిత్రుడు, శ్రేయోభిలాషీ అయిన లేట్ సి. వి. ఎస్. నరసింహరాజుగారు అటు మోచర్లవారికీ ముఖ్య స్నేహితుడే. "రామచంద్రరావు పంతులుగారికున్న స్తోమతూ, పలుకుబడీ నీకు తెలియదు, ఆయనతో పోటీ యేమిటి నీవు? కట్టిన ధరావతు సొమ్ముకూడా నీవు కంటచూడజాల"వని నన్ను హెచ్చరించారు. నరసింహరాజూ, రామచంద్రరావుగారూ మితవాద కక్షకు చెందిన రాజకీయవేత్తలు. వారు ప్రజలలో ఈ సహకార నిరాకరణ ఉధ్యమం ఎటువంటి చైతన్యాన్ని కలిగించిందో, దేశంలో ప్రజా హృదయాన్ని కాంగ్రెసు ఏ విధంగా చూరగొందో గ్రహించలేదు. దేశీయులలో ఇటువంటి మహత్తరమైన మార్పు రావడానికి మొదటినుంచీ కాంగ్రెసువారు (నాయకులూ, సేవకులూ, అభిమానులూ) ఎటువంటి ప్రబోధంచేసి ప్రజాహృదయాన్ని ఆకర్షించి ఆకట్టుకో గలిగారో కదా! అక్షరాస్యులూ, నిరక్షరకుక్షులూ-ప్రజలందరూ విచక్షణ జ్ఞానంతో వ్యవహరించారు. దీర్ఘ కాలం పట్టినా, న్యాయమైన, సుస్థిరమయిన క్షేమాన్నే వారు కాంక్షించారు గాని, రోజులమీద లభ్యమయ్యే అశాశ్వత లాభాల మీదికి వారి దృష్టి మళ్ళలేదు

నేను, ఆంధ్ర రాష్ట్రీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షడనైన కారణంగా, నా నియోజకవర్గంలోనేగాక, ఆంధ్ర దేశం మొత్తంమీద ఉన్న నియోజకవర్గాలన్నింటిలోనూ, తిరిగి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగించవలసిన విధి యేర్పడింది. చేయవలసిన పని బ్రహ్మాండమంత ఉంది.

ప్రజల ఉత్సాహం

ఆంధ్ర రాష్ట్రీయ కాంగ్రెసు సంఘంవారు ఆయా నియోజకవర్గాలకు ఎన్నిక చేసిన అభ్యర్థులందరూ సామాన్య కుటుంబాలవారే, వారికి సొంతడబ్బు ఖర్చుచేసుకోగల స్తోమతు లేదు. మేము ఎన్నికచేసిన అభ్యర్థులలో చాలామంది ముందుగానే ఒక షరతుపెట్టి మరీ నిలుచున్నారు. ఎన్నికలు సాంతం అయ్యేలోగా ఏ సందర్భంలోనూ, ఎప్పుడూ వారిని కించిత్తు కూడా స్వంత ధనాన్ని వినియోగించుకోమని కోరకూడదన్నదే వారి షరతు. కాంగ్రెసు వారికీ ఖర్చుపెట్టడానికి కావలసిన ఆర్థిక స్తోమతు లేదు.

నేనా-"స్వరాజ్య" పత్రిక ప్రచురణాది బాధ్యతలలో చిక్కుకునే ఉన్నాను గదా! ప్రజలే తగు సహాయం చేసి, ప్రోత్సాహం ఇచ్చి కాంగ్రెసువారి విజయానికి తోడ్పడాలని నేనూ, ఇతర నాయకులూ, కాంగ్రెసు సేవకులూ అన్ని ప్రాంతాలలోనూ మేము ఇచ్చే ఉపన్యాసాలలో విన్నపాలమీద విన్నపాలు చేసుకుంటూ వచ్చాం. మేమంతా ఎంతో ఉత్సాహంగా, వాయువేగ మనోవేగాలతో అన్ని ప్రాంతాలూ చుట్టబెట్టాం. రోజూ సాధారణంగా ఇరవై ప్రాంతాలలోనైనా ఉపన్యాసా లిచ్చేవారం. ప్రజలు ఈ ఉద్యమాన్ని వారి "స్వంతం"గానే భావించి, కాంగ్రెసు విజయమే తమ విజయం అని తలచి, కావలసిన ఆర్థికాది సహాయాలు చేస్తారన్న దృడవిశ్వాసం నాకు ఉంది. ఎన్నికలలో కలిగే జయాపజయాల పైన దేశపు భావి అంతా ఆధారపడి ఉన్నదన్న విషయం వారికి ఎప్పటి కప్పుడు మా ఉపన్యాసాలలో తెలియచెపుతూ, అవసరమైన ప్రోత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలుగజేస్తూనే వచ్చాం. ఈ సంరంభం అంతా తమ కోసమేననీ, దీని జయాపజయాలన్నీ వారివేననీ స్పష్టీకరించాము. ఏ మాత్రమైనా స్తోమత ఉన్నవారు తమ స్వంత ఖర్చుమీద, తమకు అందుబాటులో ఉన్న కార్లూ, బస్సులూ మొదలైన వాహనాలలో వెళ్ళి, ఆయా జిల్లాలకు చెందిన వివిధ నియోజక వర్గాలలో ఉత్సాహంగా పనిచేశారు. ఈ ప్రకారంగా ప్రజలే నడుములు బిగించుకుని, ముందుకొచ్చి, తమ ఖర్చులు తామే పెట్టుకుంటూ ఎన్నికల తతంగం అంతా నడిపించు కొచ్చారు.

కాంగ్రెసు ఘన విజయం

సుమారు అన్నిస్థానాలలోనూ కాంగ్రెసు పేరిట జయం సాధించ గలిగాం. మా గెలుపు ఆంధ్ర రాష్ట్రానికే ఎంతో కీర్తినీ, ఘనతనీ చేకూర్చింది. నా నియోజకవర్గంలో సుమారు ఉన్న ఓటర్లందరూ ఓటు చేశారు. మోచర్ల వారు పదివేల వోట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన అనుచరులకుగాని, ఆయనకుగాని, ఇతర నియోజక వర్గాలలో కాంగ్రెసు వారికి ప్రత్యర్థులుగా నిలచిన అభ్యర్థులకుగాని, అంతవరకూ దేశంలోనూ, ప్రజలలోనూ కాంగ్రెసు ఎంత పరివర్తన తీసుకు రాగలిగిందో, కాంగ్రెసువారు ఎంత గౌరవమూ, పలుకుబడీ సంపాదించ గలిగారో అర్థం కాలేదు.

సహకార నిరాకరణ పేరిట గత ఆరు సంవత్సరాలుగా జరిగిన ప్రచారం పలితంగా, ఆంధ్ర రాష్ట్రంలో వలెనే, మద్రాసు, దక్షిణ కన్నడ, మలయాళ ప్రాంతాలలో కూడా అఖండ విజయం సాధించింది. ఫలితాలు ప్రచురిస్తూన్న కొద్దీ, పరిపాలకులకూ, బ్రిటిషు వారికీ, ప్రపంచం అంతటికీ కూడా కాంగ్రెసుకు భారత దేశంలో ఉన్న స్థానం, బలిమి, కలిమి మొదలైనవన్నీ తెలియవచ్చాయి.

1926 లోనే ఇంత ఘన విజయం సాధించిన కాంగ్రెసు, తన నాయకులలో భేదాభిప్రాయాలు లేకుండా అంతా ఒకే త్రాటిమీద నడవ గలిగి ఉంటె తన ఆశయం ఏనాడో సిద్ధింప చేసుకోగలిగేది. 1921 నుంచి 1927 వరకూ ఆరు సంవత్సరాలపాటు మా కార్యక్రమం ఏమిటో ప్రచారం చేస్తూ ప్రజలను కూడగట్టుకుని రాగలిగిన మేమూ-మామోజు సహకార నిరాకరణం మీదనా, సహకారం మీదనా, అంటే సరిగా చెప్పలేని "త్రిశంకు స్వర్గం" లోనే ఉన్నామేమో అనిపించ సాగింది.

కేంద్ర సభలో 42 గాంధీ టోపీలు

ఎన్నికల అనంతరం క్రొత్తగా ఏర్పడిన కేంద్ర శాసన సభలో మాసంఖ్య 42. మద్రాసు మొదలైన వివిధ రాష్ట్రాలలో కాంగ్రెసువారు అత్యధిక సంఖ్యాకులుగానే ఎన్నికయ్యారు. కేంద్ర శాసన సభలో ఒక్క సారిగా నలభై రెండు గాంధీ టోపీలు కనబడ్డం ఆశ్చర్యకరమైన విషయం. కాంగ్రెసుపార్టీవారి ధాటికి తట్టుకోలేక, అప్పటివరకూ నిరంకుశంగా పరిపాలించిన పెద్దల కందరికీ కాళ్ళలో వణుకు పుట్టింది.

ఈ దిగువ అంశాలమీద చరిత్రాత్మకమైన వాదోపవాదాలు జరిగాయి: ప్రజాక్షేమం-రిజర్వు బ్యాంకి స్థాపన-మారకపు విలువ 1 షి 4 పెన్నీల నుండి, 1 షి 6 పెన్నీలకు హెచ్చించే విషయం.

మా పార్టీ వారికి నాయకుడు మోతిలాల్ నెహ్రూగారు. ఆయన మంచి నేర్పరి. విద్యాపారంగతుడు. సమర్థుడు. ఏ విషయం మీద చర్చ వచ్చినా, ఎట్టి క్లిష్టపరిస్థితి ఉత్పన్నమయినా నిలబడగల శక్తి ఆయనకుంది. ఆనాటి భారతావనిలో సాటిలేని మేటి ప్రతిభ వారిది. తలపెట్టిన కార్యం ఘనంగానూ, గౌరవ ప్రదంగానూ నిర్వహించగల శక్తి వారిది.

కాని ఆయన చాలా ఆత్మాభిమానమూ, పట్టుదలా గల మనిషి. తన పార్టీ సభ్యుల నందరనూ కూడగట్టుకుని తనవైపు ఆకర్షించుకోగల సహనమూ, ఓరిమి, నేర్పు ఆయనకి ఉన్నట్లు కనిపించలేదు. ఆయనకీ శ్రీనివాసయ్యంగారికీ మధ్య స్పర్థ ఉండేది. వ్యక్తిగతమయిన అభిప్రాయ భేదాలవల్ల మోతిలాల్ గారికీ, పి. ఎస్. రంగయ్యరుగారికీ పడుతూండేది కాదు. ఈ విషయాలు 1927-28 నాటి సంఘటనలలో రుజువయాయి.

గౌహతీ కాంగ్రెస్ విశేషాలు

1926 లో జరిగిన ఎన్నికల వేడి తగ్గకుండానే అస్సాం కాంగ్రెసు ఆరంభం అయింది. ఎన్నికల సంరంభంతో శరీరం పులిసిపోయినా నేను కొందరి మిత్రులతో కలసి గౌహతికి వెళ్ళాను. అస్సాం దేశపు పేరుబడిన లోయలలో ఈ గౌహతి అన్నది ఒక చిన్న గ్రామం.

పులులూ మొదలైన అడవి మృగాలకు ఆటపట్టని చెప్పబడే అడవి ప్రాంతానికి ఆనుకునే, కాంగ్రెసు పెండాలు నిర్మించబడింది. ఆ ప్రాంతం పులులకే గాక అడవి యేనుగులకు కూడా ఆటపట్టనీ, అవి తరుచుగా వచ్చి ఆ చుట్టుపట్ల వారికి తీరని నష్టాలు కలుగజేస్తూండం పరిపాటనీ తెలియ వచ్చింది. ఆ పెండాలు నిర్మాణానంతరం, అనుదినమూ వాటిలో భీతి కలిగించి వాటిని దూరంగా పారద్రోలాలనే ఉద్దేశంతో ప్రతీ రాత్రి, ప్రతీ ఉదయమూ డప్పులూ, దండోరాలూ వాయించేవారు.

ఆ ప్రాంతం ఎంతో ప్రఖ్యాతి వహించిన హిమాలయాలపాదాల దగ్గర ఉండడాన్ని చాలా మనోహరంగా ఉంది. ఎక్కడో దక్షిణా పథం నుంచి వచ్చిన అ కాంగ్రెసు అధ్యక్షుణ్ణి 52 ఏనుగులు లాగే బండిమీద ఎంతో ఘనంగా ఊరేగిస్తారనీ, ఆ ఊరేగింపులో పాల్గొంటూ ఆనంద పారవశ్యంలో ఓలలాడాలనీ ఉవ్విళ్ళూరాం.

ఆ తరుణంలో అక్కడ డిల్లీలో శ్రద్ధానందుని కాల్చి చంపుతారని మేమెవ్వరమూ కలలో కూడా ఊహించలేదు. దాన్తో కాంగ్రెసంతా అంధకార బంధురమైన దు:ఖ సముద్రంలో మునిగిపోయింది. అధ్యక్షుని ఊరేగింపూ ఆగిపోయింది. హృదయాలు బరువెక్కినా ఆ కార్యక్రమ మంతా నిశ్చల దీక్షతో, సంకల్పించిన ప్రకారం నడుపబడింది.

ఆప్తమిత్రుడు శ్రద్దానంద

శ్రద్దానందస్వామిది చాలా నిండయిన గంభీర విగ్రహం, నిష్కపట సరళ హృదయుడు. ధైర్య స్థైర్యాలు గల వ్యక్తి. అంతేకాదు దేశంకోసం ఏ క్షణాన్నయినా ప్రాణాలు సమర్పించడానికి వెనుదీయని వ్యక్తి. సుప్రసిద్ధ దేశభక్తుడు. నాకు ఆప్తమిత్రుడు. మేము సన్నిహితులం. ఎప్పుడు కలుసుకున్నా హృదయాలను విప్పి మాట్లాడుకునే వాళ్ళం. హిందూ మహమ్మదీయ సఖ్యం విషయంలోనూ అభిప్రాయాలు ఒకరి కొకరం చెప్పుకునేవారం. కాంగ్రెస్సులలోనూ హిందూ మహాసభా కాన్ఫరెన్సులలోనూ తరచు కలుసుకునే వారం.

1922లో జరిగిన ముల్తాన్ గొడవల్ని పురస్కరించుకుని మదనమోహన మాలవ్యాగారు లజపతిరాయిగారూ, స్వామీ శ్రద్ధానంద కలసి స్థాపించిన హిందూ మహాసభ దిన దిన ప్రవర్థమానమై, క్రమేపి దేశంలో ప్రముఖ స్థానాన్నే ఆక్రమించింది. కలకత్తాలో హిందూ-మహమ్మదీయ కలహాలు జరిగిన దరిమిలా మేము ఉభయలమూ ఒక ఉపన్యాస వేదికపై అనుకోకుండా కలుసుకున్నాము. ఈ హిందూ మహమ్మదీయ సంక్షోభాన్ని గురించి తర్కించాం.

ఆయన బెంగాలులో ఉన్న హిందువుల మహమ్మదీయుల జనాభా లెక్కలతో సమన్వయం చేస్తూ బెంగాలు చరిత్రంతా నాకు తెలియజేశాడు. ఏ పుస్తకమూ తిరగవేయవలసిన అవసరం లేకుండానే కావలసిన సమాచారమంతా ఆయన నాలిక చివరే ఉండేది. ఆధిలో అత్యధికమైన హిందూ జనాభా కలిగిఉండే ఆ బెంగాలు రాష్ట్రంలో మహమ్మదీయ ప్రాబల్యం వృద్ధి అయిన కొద్దీ, ఏటేటా ఎల్లా హిందువులు మహమ్మదీయ మతాన్ని స్వీకరించిందీ, ఇప్పుడు ఏ ప్రకారంగా ఆ హిందూ జనాభా అంతా క్షీణించిన అల్పసంఖ్యాకి వర్గంగా రూపొదిందీ వివరిస్తూంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆయన గత 70, 75 సంవత్సరాలలోనూ జరిగిన యీ మతాల మార్పిడుల చరిత్ర సమగ్రంగా వివరించి చెప్పాడు.

స్వామీ శ్రద్ధానంద తాను ఆర్యసమాజ సంఘ సభ్యుడననీ, తాను తన అనుచరులూ కలసి హిందూ సంఘ సముద్ధరణకోసం ఎల్లా పాట్లు పడుతున్నదీ వివరించాడు. మహమ్మదీయుల బారీ నుంచి హిందువులు తప్పించుకునే శక్తి కూడా లేక, ఆత్మరక్షణకూడా సరిగా చేసుకోలేని స్థితిలో ఉన్నారనీ, ఇస్లాంనుంచి, తిరిగీ హిందూమతంలోకి మారా లన్నా మార్గాంతరం లేక అవస్థలు పాలవుతున్నారనీ వివరించాడు" సదాచార సంపన్నులైన హిందువులు మహమ్మదీయ మతంనుంచి హిందూమతంలోకి పున:ప్రవేశానికి ఒప్పుకోని కారణంగా హిందూ మతం క్షీణీస్తోందనీ, దీని కంతటికీ హిందూ నాయకుల ఉదాసీనతే కారణమనీ అన్నాడు.

లాలా లజపతిరాయి, స్వామీ శ్రద్దానందుల ఆధిపత్యంలో పనిచేస్తూ ఉన్న ఆర్యసమాజంవారు నిర్భయంగానూ, దృఢ చిత్తంతోనూ అవసరమైన సేవ చేస్తున్నారు. అహితాగ్నులలో అహితాగ్నిగా పేరు పొందిన మదన మోహన మాలవ్యాగారు తక్కిన కార్యనిర్వాహక వర్గీయులతో కలసి ముల్తాన్‌లో జరిగిన దురంతాలూ ప్రత్యక్షంగా చూసి, అక్కడ కూల్చబడిన ఆలయాలూ, విరగగొట్టబడిన విగ్రహాలూ కలిగించిన మానసిక క్లేశంతో, మొట్టమొదటిసారిగా తన నోటమ్మట తానే హిందూ సంఘ సంరక్షణకోసం "శుద్ధి సంగతం" అవసర మన్నాడు. అప్పటి వరకూ ఆర్యసమాజీకులు చేస్తూ వచ్చిన ప్రచారం తాను అందుకున్నాడు. యావత్తు భారత దేశాన్నీ ఆవరించి ఉన్న ఆర్యసమాజం తాలూకు మతాచార్యులకు స్వామీ శ్రద్దానంద ప్రారంభించిన "గురుకులమే" దీక్ష నిచ్చి తరిఫీదు నిచ్చింది.

రాజకీయ ప్రపంచంలో కూడా స్వామీ శ్రద్దానంద పేరుబడ్డ నాయకుడే. కాంగ్రెసు అధ్యక్షులకూ, వీరికి ఎప్పుడైనా అభిప్రాయభేదాలు వస్తే, అంటే-కాంగ్రెసు అధ్యక్షులకు స్వామీ శ్రద్దానందుని దృక్పధం సరిగా అర్థంకాని పరిస్థితులలో , ఆ సంగతి గ్రహించి స్వామీజి, స్పర్థలూ వాగ్వివాదాలూ పెరక్కుండా, చల్లగా బైటకువెళ్ళి పోయేవాడు. ఆయన అటువంటి పరిస్థితులలో చల్లగా జారుకోవడం కలకత్తా కాంగ్రెసులోనూ జరిగింది. ఆ ఉదంతం మాత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది. స్వామీ శ్రద్దానంద లేని లోటుకు నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. అది ఎప్పటికీ తీరేలోటు కాదు.

సాంబమూర్తి స్వాతంత్ర్య తీర్మానం

కాన్పూర్ కాంగ్రెసులో 1925 వ సంవత్సరంలో తీర్మానించబడిన కౌన్సిల్ పోగ్రాం తిరిగి గౌహతీలో చర్చించబడి, ఆమోదం పొందింది. ఆ తీర్మానం ప్రకారం, ఎన్నికలలో నెగ్గి శాసన సభలలో సభ్యత్వం సంపాదించినా, హోదాలేవి చేపట్టకుండా వర్తిస్తూ, కాంగ్రెసు వారి కోర్కెలు సఫలం చెయ్యబడేవరకూ ప్రభుత్వంవారి కార్యక్రమానికి అడ్డు తగులుచూండడమే అనుసరించవలసిన విధానం. అంతేకాదు, బడ్జట్ ప్యాసుకాకుండా చూడాలనీ, మంత్రులు జీతాలు జీతాలుపుచ్చుకోకుండా ఉండాలనీ దేశవ్యాప్తంగా గ్రామ పునరుద్ధరణ జరగాలనీ కొన్ని తీర్మానాలు చేయబడ్డాయి.

ఈ దరిమిలాను మద్రాసు శాసన సభా స్పీకరు పదవి నధిష్టించిన బులుసు సాంబమూర్తిగారు, ఆనాడు దేశానికి స్వేఛ్చాస్వాతంత్ర్యాల విషయంలో ప్రప్రథమంగా అలజడి తీసుకువచ్చారు. ఆయన 1926 కు పూర్వమే, ఆంద్ర రాష్ట్రీయ కాంగ్రెసు సంఘ సమావేశాలలో ఈ స్వేచ్చాస్వాతంత్ర్యాలను గురించిన ఉద్భోధ ఆరంభించారు. ఈ ప్రసక్తి ఎత్తుకుంటూ కాకినాడలో జరిగిన 1921 నాటి తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెసు సమావేశంలో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టాడు. అప్పుడు ఆయన్ని నేను అడ్డుకున్నాను. కాని ఆయన ఈ అంశాన్ని అఖిల భారత కాంగ్రెసు కమిటీ వారి ముందు ఉంచారు. గౌహతీలో ఈ విషయం మీద గాంధీగారికీ, సాంబమూర్తిగారికి తీవ్రమయిన వాదోపవాదాలు జరిగాయి. గాంధీగారు ఈయన్నీ లొంగతీసుకోవాలని ప్రయత్నించారు గాని, ఈయన లొంగలేదు. దేశాన్ని త్యాగాలమీదా త్యాగాలు చెయ్యడానికి సంసిద్ధం చేయాలన్నదే ఆయన వాంఛ. నిజానికి సాంబమూర్తి మూర్తిభవించిన త్యాగం. గాంధీగారు ఈయన్నీ ఎగతాళిచేస్తూ, ఈ బ్రహ్మపుత్రానదిలో మనమంతా కట్ట కట్టుకుని దిగినా దేశానికి స్వేచ్చాస్వాతంత్ర్యాలు లభింపవన్నారు. దాన్తో సాంబమూర్తిగారు స్వాతంత్ర్య తిర్మానం త్రోసివేయబడింది. గాంధీగారికి దేశ స్వాతంత్ర్యం విషయంలో వచ్చిన తీర్మానాలని త్రోసివెయ్యడ మన్నది ఇదే మొదటిసారికాదు., అనేకసార్లు అట్టి త్రోసివేతలు జరిగాయి.

కాన్పూరు కాంగ్రెసు అనంతరం ఒక సంవత్సరం విశ్రాంతి తీసుకుంటానన్న గాంధీగారు గౌహతీ కాంగ్రెసుకు హాజరయ్యారు. కాంగ్రెసును తిరిగీ చేపట్టాలనే ఆతురత ఆయన ఎంతమాత్రమూ చూపించలేదు. మోతిలాల్ నెహ్రూ-శ్రీనివాసయ్యంగార్లకు కాంగ్రెసును తిరిగి గాంధీగారి పరం చేయ్యాలన్న అభిలాష లేదు. కాగా ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థులను నిలబెట్టి, ఎన్నికల తతంగమంతా నడిపించడానికి వారికి అధికారం కూడా ఇచ్చారు.

యు. పి. లో అపజయం

దేశవ్యాప్తంగా జరిగిన యీ ఎన్నికలలో మద్రాసు రాష్ట్రంలోనే కాదు-ఇంకా ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెసు అభ్యర్థులకే విజయం పరంపరలు లభించాయి. కాని యు. పి. లో మోతిలాల్ నెహ్రూగారి నియోజకవర్గంలో తీవ్రమయిన ఆశాభంగం కలిగింది. ఆ రాష్ట్రంలో ప్రజలను ప్రబోధించి, ఒకే త్రాటి మీదకి వచ్చేలా చేయడానికి ప్రచారం సరిగా జరగలేదు. అసలు అక్కడి ప్రచారశాఖే సరిగా యేర్పాటు చేయ చేయబడలేదు. నిజానికి ఆ నియోజకవర్గం జమీందారీ ప్రాంతం. ఆ ప్రాంతీయులకు జమీందార్లను ఎదిరించి నిలబడగల శక్తి లేదు. దానికి సరిపడ్డ ప్రచారమూ లేదు.

మోతిలాల్‌గారు ఈ ఓటమికి కారణం ప్రత్యర్థులు వ్యక్తి గతంగా తన్ను గురించి చేసిన దుష్ప్రచారమే నన్నారు. తాను గ్రామాలమ్మట తిరిగి, తనపై జరుగుతూన్న దుష్ప్రచారాన్ని ఎదుర్కొనడానికి ప్రయత్నించలేదని ఒప్పుకున్నారు. అందువల్లనే ఓటమి సంభవించింది. ప్రత్యర్థుల తాలూకు ప్రచారకులు ఆయనపై మోపిన నేరాలను గురించి ఆయనే చెప్పారు. తాను గోమాంసం తింటున్నాడని, తనకు కావలసిన గోమాంసం లభ్యం కాదనే కారణంగా తాను గోవధను నిషేధించడనీ, మసీదులముందు ఊరేగింపులలోని బాజాభజంత్రీలను మ్రోగింపనీయడనీ, ఆయన హిందూ ధర్మ వినాశనకారి అనీ, ఇంగ్లీషు తిండితింటూ, ఇంగ్లీషు వారిలాగే తాను బ్రతుకుతున్నాడనీ ప్రత్యర్థులు ఆయనపై నేరారోపణ జేశారన్నారు. ఇవన్నీ తనపై తీసుకరాబడిన అబద్ధపు ఛార్జీలని తనకు తెలుసు. కాని వాటిని ఖండించడానికి తాను గ్రామాలమ్మట తిరగలేకపోయానన్నారు.

తప్పుడు అంచనా

తాను స్వయంగా ఏ గ్రామానికీ వెళ్ళకపోయినా, గ్రామీణులందరూ ఓటు చేసి తనను గెలిపిస్తారనే తప్పుడు అంచనా వేసుకున్నారాయన. బ్రిటిష్ క్యాబినెట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, రీడింగ్ ప్రభువూ మన ప్రత్యేక ఘనతలనూ, అంతస్తులనూ గ్రహించి దఫదఫాలుగా కోరుతూ ఉన్న మన కోర్కెలను మన్నించి తీరుతారని తలచడం ఎంత పొరపాటో, నియోజక వర్గంలో తిరక్కుండానే, ఓటర్లను కలుసుకోకుండానే, మన పేరు ప్రతిష్టలను గ్రహించి వారి ఓట్లు మన కిస్తారని తలంచడమూ అంత పొరపాటే. గాంధీగారితో వ్యతిరేకించి కాంగ్రెసును చేత పట్టగలిగిన ఈ మేధావులు "పాపం, వారిది బీద దేశం, అక్కడ ఉన్నవారు బలహీనులూ, అర్బకులూ" అని ఆలోచించి, వారి యందు దయాదాక్షిణ్యాలు కలిగి బ్రిటిషువారు ఏవేవో సదుపాయాలూ వగైరాలు చేస్తారని ఎల్లా తలచారో అర్థం కాదు. ప్రజాబాహుళ్యం నాయకులకు అండగా నిలవందే, నాయకులు కోరిన కోర్కెలు మన్నించబడడం జరగదని, 1885-1921 సంవత్సరాల మధ్య జరిగిన అనేక సంఘటనలను విలియా వేసుకుని సంగతి సందర్భాలు మన మితవాద నాయకులు గ్రహించి ఉంటే, కథ అడ్డం తిరిగి, ఆంగ్లేయుల ఆట కట్టయ్యేది. గాంధీగారిని ఓడించి, కాంగ్రెసును తమవశం చేయమని అడగగలిగిన ధీశాలురు, వారి కార్యక్రమ వివరాలను, శాసన సభా ప్రవేశ ఉద్దేశాలను సవ్యంగా ప్రజల ముందు పెట్టి ప్రజా హృదయాన్ని ఆకట్టుకోవలసి ఉంది.

1921 నాటి కాంగ్రెసు పటుత్వం, నిర్మాణ కార్యక్రమం, హిందూ మహమ్మదీయ మైత్రి అనే సూత్రాలమీద నెలకొల్పబడింది, మనకు ప్రతికూలమైన పరాయి ప్రభుత్వం మన ఆశయాలను సర్వనాశనం చేస్తూఉంటే, మనవాళ్ళు శాసన సభా ప్రవేశం అనే నిరపాయకరమైన మార్గమును పట్టుకుని, నవ జీవన విధానంగా నూతన నిర్మాణం సాగించి తమ స్థాయిని నిలుపుకోవడానికయినా జనులను ప్రబోధించి, ఆర్ధిక, రాజకీయ స్వాతంత్ర్య సంపాదనకు పాటుబడివుండవలసింది. ఇలా ఎత్తుపై యెత్తులు వేసుకుంటూ ప్రజలలో ప్రచారం, ప్రబోధం చేసిఉంటే, సంయుక్త రాష్ట్రాలలో పండిత మోతిలాల్ నెహ్రూగారు ఆ ఎన్నికలలో ఓడిపోయేవారేకాదు. ఈ సంగతి వారి కుటుంబీకులు నిర్మొగమాటంగా ఒప్పుకున్నారు.

గాంధీగారి అనుచరులుగా ఖాదీ ఉద్యమంలో తల దూర్చినవారు, తమకున్న చిక్కులతో కొట్టు మిట్టాడుతూ, తిరిగీ కాంగ్రెసు గాంధీగారి చేతులలోకి వస్తేనే బాగుండును-ఆ శుభముహూర్తం ఎప్పుడో కదా అని ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రజలలో ఓటింగు విధానాన్ని గురించి కాని, తద్వారా కలుగగల కీడు మేళ్ళను గురించిగాని, పరిపాలనా విధానాలను గురించిగాని ప్రజలకు బోధించడంలో వారికి ఆసక్తే లేదు. నిర్మాణ కార్యక్రమవాదులు తదితరములైన రాజకీయాది కాంగ్రెసు విధానాలలో పాల్గొనడం తమకు అనవసరం అని తలచేవారన్నమాట! వారికి తెలిసినదల్లా ఒక్కటే-గాంధీగారి శక్తి సామర్థ్యాలు బహుళం అనీ, వారి సహకార నిరాకరణమూ, శాసన ధిక్కారము మొదలైన విధానాలన్నీ విజయవంతం అవుతాయనీ, ముందు ముందు ఎప్పుడో ఒకనాడు ప్రజలే రాజ్యాంగాన్ని చేపట్టి, పరిపాలనా యంత్రాన్ని నడిపించగలరనే దూరదృష్టి వారికి ఉన్నట్లు కనిపించలేదు.

పేలిన టపాకాయలు

ఈ రెండు రకాల కాంగ్రెసు కార్యక్రమాల మధ్య పడి నలిగి, నాయకులలో నెలకొన్న అలసతాభావం కారణంగా ప్రజలు చిక్కుల పాలయ్యారు. తమ నాయకులు ఎన్నికలలో నెగ్గారు నిజమే. కాని అవసరమైన రాజకీయ చైతన్యం వారు కలిగించక పోవడాన్ని ప్రజలకు తమకు ఏకం కావాలో, తమచే ఎన్నుకోబడ్డ వారిద్వారా దేశానికీ, తమకూ సమకూరవలసిన లాభా లేమిటో తెలియకపోయింది. శాసన సభ్యులు కాంగ్రెసు విధానాన్ని విస్మరించరాదనీ, తమకు కష్టనష్టాలు కలుగచేసే ఏవిధమైన కార్యక్రమాలలోనూ తల దూర్చరాదని చెప్పగల స్తోమతు వారిలో లేకపోయింది. ప్రజల దృక్పథంలో అటువంటి పరిణామమూ, వారిలో ఆ శక్తి కలిగించవలసింది నాయకులే అయినా, శాసన సభ్యులను శాసించగల శక్తి ప్రజలలో లేని కారణంగా, వారు పేలిపోయిన టపాకాయల్లా నిశ్శబ్ధంగానూ, నిర్జీవంగానూ తయారయ్యారు. ద్వంద్వ పరిపాలనపు రాపిడిలో ఇరుక్కున్న మంత్రులు కేవలం దిష్టిబొమ్మల్లా తయారయ్యారు.

ద్వంద్వ ప్రభుత్వ విధానంలోని శాసన సభ్యుల పరిస్థితికీ, 1937 లో ఏర్పడిన కాంగ్రెసు మంత్రివర్గాల పరిస్థితికీ తేడా లేదనే అనాలేమో! నాయకవర్గం నిర్మాణ కార్యక్రమపు టవసరాలనూ, లాభనష్టాలనూ గురించి, 1922 నుంచి ఈ రోజు వరకూ, ఏదో అలసత్వంతోనే వర్తించిందని అనక తప్పదు.

గాంధీగారికి నాప్రశ్న

వార్దాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగునకు అధ్యక్షులవారు అందజేసిన ప్రత్యేక ఆహ్వనంపై నేను వెళ్ళి, ఆ నాటి కార్యనిర్వాహకవర్గ సభలో పాల్గొన్న సందర్భంలో, సభ్యులందరి సమక్షమందూ, మహాత్మా గాంధీగారికి ఈ దిగువ విషయాలు స్పష్టపరిచాను.

"మీరు ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి పాటుపడుతున్నారు. కాని మీరు సఫలత పొంద లేకపోవడానికి కారణం, మీరు మీ కార్యక్రమంలోనూ, మీ యోచనా కౌశ లాదులందూ నమ్మకం లేనటువంటి, మీ నిర్మాణాత్మక విధానమందు విశ్వాసం లేనటువంటి వారితో కలసి పాటుపడడమే కదా?" అని ప్రశ్నించాను.

ఎన్నికలలో అధిక సంఖ్యాకులుగా కాంగ్రెసువారు గెలిచి, శాసన సభాస్థానాలను ఆక్రమించుకొనడం అన్నది కేవలమూ ఒక బూటకమే కదా? నాయకులలో ధీమా లేదు. అనుచరులలో శక్తిలేదు. వీలయితే ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలదే గదా ప్రతివారి తాపత్రయం? కాంగ్రెసు ఉద్యోగస్వీకారం చేయరాదనీ, బడ్జెట్ ప్రతిపాదనలను తిరస్కరించాలనీ, దేశానికి నిరుపయోగమని భావించిన విషయాలలో సహకరించ కూడదనీ ఆదేశిస్తే, శాసన సభా ప్రవేశం చేసిన కాంగ్రెసువారు సర్వసాధారణంగా క్లిష్టపరిస్థితులలో నిర్వీర్యుల్లా బలహీనతనే వ్యక్తపరచి ఉన్నారు కదా? 1927, 28. 29 సంవత్సరాలలో శాసన సభలో జరిగిన అనేక సంఘటనలు, పై విషయాలను రుజువు చేస్తున్నాయి కదా?

ఇటువంటి పరిస్థితులకు కారణం వారిని ఆదేశించిన విధానమే కదా? వారు ఆయా సంవత్సరాలలో ఏమీ సాధించలేని స్థితిలో ఉంటే, వారిని నిందించడానికి వీలులేని విధంగా, కేంధ్ర శాసన సభలలో బాధ్యత అన్నది లేకుండా వ్యవహరించడమూ, రాష్ట్ర శాసన సభలలో ప్రభుత్వాన్ని ఎదిరించమని ఆదేశించడమే కదా కారణం? మంత్రులు ప్రజాభిప్రాయానికి భిన్నంగానూ, నిష్పూచీగానూ వ్యవహరించడమూ జరిగింది కదా? పండిత మోతిలాల్ నెహ్రూగారూ, వారి పార్టీ వారూ కలిసి, వారికి ఒప్పగించబడిన ప్రతి స్వల్పవిషయంలోనూ ప్రజా హృదయానికీ, అభిప్రాయానికీ బాధ్యత వహించి వ్యవహరింపవలసిన పరిస్థితులలో, శాసన సభలో వాగ్వివాదాలతో విలువైన కాలాన్ని పైకారణాలవల్ల వృథా చేయడం అవివేకమే కదా?

నిజానికి 1927-1930 సంవత్సరాల మధ్య ఈ శాసన సభలలో ఉన్న మన కాంగ్రెసు సభ్యులు ధీశాలురూ, శక్తిమంతులూ, రాజ్య తంత్రజ్ఞలూ, పార్లమెంటరీ పద్ధతిని పరిపాలన సాగించగల నేర్పరులూ, అధికారం హస్తగతం అయితే తమ శక్తి సామర్థ్యాలను నిరూపించగల యోధులు అని పేరుగాంచారు. రిజర్వు బ్యాంకి బిల్లును గురించీ, కరెన్సీని గురించీ, మారకపు విలువలను గురించీ కేంద్ర శాసన సభలో జరిగిన చర్చలు గమనార్హమయి, మనవారి శక్తిసామ ర్థ్యాలను ద్రువపరచాయి. అదే ప్రకారం రాష్ట్ర శాసన సభలలో కూడా మనవారు తమ విజ్ఞానాన్ని ప్రదర్శించారు.

ఈ కౌన్సిల్ ప్రోగ్రాం రోజులలో (1927-30) నిర్మాణ కార్యక్రమం దెబ్బతింది. కాంగ్రెసులో వెనుకటివలెనే కేంద్రంలోనూ, రాష్ట్రాలలోను చీలికలు ఏర్పడ్డాయి. మనం 1927 నాటి ముచ్చటలు తెలుసుకునే లోపల, గాంధీగారి వద్దకు తిరిగీ వచ్చే సందర్భంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి తెలుసుకుందాం.

ఢిల్లీ సందర్శనం

గౌహతీనుంచి తిరిగీ వచ్చేటప్పుడు, స్వామీ శ్రద్ధానంద హత్య విషయంలో సమాచార సంగ్రహణ కోసమని, అచ్చటి సంఘటనలను గురించి స్వయంగా విచారిద్దామనే వాంఛ గలిగి ఢిల్లీ చేరుకున్నాను. నేను స్వామీజీ గృహానికి వెళ్ళాను. ఆయన కుమారుడు నాతో వచ్చి, హత్యకు సంబంధించిన సంగతులు చెపుతూ, ఆయా తావులన్నీ చూపించాడు. నిజానికి వారి గృహం ఒక పవిత్రమైన యాత్రాస్థలం. అలా దానిని రూపొందించడం న్యాయమే. లాలా లజపతిరాయిగారూ, స్వామీజీ కలిసే ఆర్యసమాజ కార్యక్రమాలు నిర్వహించేవారు. లజపతిరాయిగారు గౌహతీ కాంగ్రెసులో పాల్గొనడానికి వస్తూ, దారిలో స్వామీజీ హత్యా విషయం వినడంతోనే విషాద భరిత హృదయంతో, ఆగని కన్నీటి కాల్వతో వెనక్కి మళ్ళారు. స్వామీజీని దొంగపోటు పొడిచి చంపారు.

నాభా సమాచారం

బ్రిటిష్ గవర్నమెంట్ వారితో నాభా మహారాజుగారికి వచ్చిన భేటీలో ఆయన, మోతిలాలు నెహ్రూగారిని తమ న్యాయవాదిగా నిర్ణయించుకుని, వారికి వకాలతు ఇచ్చారు. అప్పట్లో కేంద్ర శాసన సభా సభ్యుడుగా ఉంటూ ఉన్న సి. ఎస్. రంగయ్యరు మహారాజావారి ఆప్త మిత్రుడు, సలహాదారుడూను. మహారాజావారికి మోతిలాల్‌గారి కిచ్చిన వకాలతు రద్దుచేయాలనే ఊహ జనించింది. కాంగ్రెసు వేదికమీద ఈ నాభా విషయం చర్చకువచ్చి ఉంటె అది ఒక చికాకు పంచాంగంగా తయారయ్యేది. కాని ఈ విషయాన్ని కాంగ్రెసు వేదికపై చర్చనీయాంశంగా ప్రవేశపెట్ట కూడదని పట్టుపట్టిన గాంధీగారివల్ల, ఇది కాంగ్రెసులో చర్చకు రాలేదు.

ఆఖరి రోజులలో నాభా మహారాజు, తనకు ఎవరివల్లనైనా ఉపకారం జరుగుతుందేమోనన్న భ్రమతో, తోచిన వారి నందరినీ సలహా అడిగేవాడు. శాసన సభలో ఈ విషయంలో నేను కొన్ని ప్రశ్నలు వేశాను. తర్వాత యీ కేసుకు సంబంధించిన పత్రాల నన్నింటినీ తిరిగేశాను. మహారాజు చిన్నతనంలో చాలా స్వతంత్రంగా వ్యవహరించి, బ్రిటిషు వారితో తగాయిదాలు కొని తెచ్చుకున్నట్లున్నూ, ఆ స్వతంత్ర వర్తనమే ఈ తగాయిదాలకు మూలమనిన్నీ నాకు దృడ విశ్వాసం కలిగింది. వీరి ప్రత్యర్థి వీరికంటె శక్తి, పలుకుబడీ కలిగిన ఇంకొక మహారాజు.

నేను శాసన సభలో ఈ ప్రస్తావన తీసుకువచ్చి చర్చసాగిస్తూన్న రోజులలోనే, మద్రాసుకు రావలసి వచ్చింది. అప్పుడు నాభా మహారాజు కొడైకానలు కొండలలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మహారాజును నేను స్వయంగా కలుసుకుని సమాచారం అంతా గ్రహించాను. ముఖ్యంగా నేను కేంద్ర శాసన సభలో పృచ్చచేసిన అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాను. ఆయన వాదన సరి అయినదీ, న్యాయమయినదీ అయినప్పటికీ ప్రభుత్వంవారు తమ పట్టు విడువలేదు.

మహారాజావారి వైపు న్యాయం ఉన్నా, ఆయన వ్యాజ్యం వేయడానికి ఇష్టపడలేదు. పక్కమార్గాల గుండా ఒత్తిడులు తీసుకువస్తే చాలని తలచాడు. మంచి హోదా, పలుకుబడీగల పెద్దలను కలుసుకుని, వారి ద్వారా ప్రభుత్వం వారికి నచ్చచెప్పించి నట్లయితే తనకు ఉపకారం జరుగుతుందని గట్టిగా నమ్మాడు. నిజానికి పలుకుబడీ, శక్తీ తమకున్నదనుకునే వారంతా రాజావారి చుట్టూ చేరారు. ఆ పెద్దల ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఆయన నమ్మిన వారెవరూ లేశమాత్ర మైన ఉపకారమైనా చేయలేకపోయారు. భార్య, బిడ్డలూ కూడా ఆయనకు దూరమయ్యారు. ఆయన ఎన్ని తంటాలు పడినా, ఎంత ఒత్తిడిని తీసుకురాగలిగినా, చివరకు వారి అంతస్తుకు, హుందాతనానికి తగిన "శిక్షణ" కోసం వారిని ప్రభుత్వంవారు ఇంగ్లాండు పంపించేశారు. మహారాజావారు కొడైకానలు దాటి బయటికి రాకూడదన్న ఆంక్ష జారీచేశారు.

  1. ఈ తీర్మానం కాన్పూరు కాంగ్రెసు ఆమోదించింది.
  2. సబర్మతిలో కుదిరిన సమాధానం ప్రకారం.