నా జీవిత యాత్ర-2/శాసన సభా ప్రవేశ సమస్య: గాంధీవాదులు, స్వరాజ్యవాదులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

9

శాసన సభా ప్రవేశ సమస్య:

గాంధీ వాదులు, స్వరాజ్య వాదులు

గాంధీగారికి జైలు ప్రాప్తించిన తరవాత, కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం *[1] లో కాంగ్రెసు పేరిట రాజ్యాంగ చట్టాన్ని చేపట్టి ఎందుకు పరిపాలన సాగించకూడదు అన్న ప్రశ్న వచ్చింది. ఆ విషయమై తర్జన భర్జనలు చేసి, నిర్ణయం తరవాత జరుగనున్న గయా కాంగ్రెసుకి వదిలివేశారు. గాంధీగారు నాయకత్వం వహిస్తున్నంతకాలం రాజ్యాంగ చట్టాన్ని చేపట్టడం అన్న ప్రసక్తే రాలేదు.

ఉద్యమనాయకుణ్ణి నిర్బంధించిన కొద్ది దినాలలోనే, సి.ఆర్.దాస్, మోతీలాల్‌నెహ్రూ గార్లను జైలునుంచి విడుదల చేశారు. వా రిరువురికీ గాంధీగారి పద్దతులపట్ల విముఖత ఏర్పడింది. లార్డ్ రీడింగ్ అందజేసిన రాజీ ప్రతిపాదనలకు గాంధీగారు ఒప్పుకోకపోవడమూ, చౌరీచౌరా ఉదంతం జరిగిన వెనువెంటనే గాంధీగారు ఉద్యమాన్ని విరమించడమూ అన్నవి ఈ విముఖతకు కారణాలు. సాధ్యమయినంత త్వరలో ఈ సహకార నిరాకరణ పద్దతికి స్వస్తి చెప్పాలని వారి తహతహ.

మన నాయకుడు అరెస్టయిన వెంటనే కార్యక్రమంలో మార్పు తేవడమన్నది నాకు ఎంతమాత్రమూ ఇష్టంలేదు. ఎల్లాగయినా దాస్ గారిని ఒప్పించి, రాజ్యాంగాన్ని చేపట్టడం అనే పద్దతికి వారిని విముఖులుగా చేసితీరాలనే దృఢసంకల్పంతో, వారిని కలుసుకోడానికని నేను కలకత్తా వెళ్ళాను. ఆయన దాపరికం లేకుండా తమ మనస్సులో ఉన్నదంతా నాతో చెప్పారు. "నీవు సహకార నిరాకరణ పద్దతికే అంటిపెట్టుకుని ఉంటాననడం శుద్ధ మూర్ఖత. ఆయనకేమో ఆరేళ్ళు శిక్ష విధించారు. ఈ ఆరు సంవత్సరాలలోనూ ఏమి జరుగనుందో ఆ భగవంతునికే తెలి

యాలి. ఈ ఆరు సంవత్సరాలు నేను బ్రతికి ఉంటాననే నమ్మకం యేమిటి?" అన్నారు. నన్ను తమ పద్ధతికి త్రిప్పుకోవాలని చాలా తంటాలు పడ్డారు. కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులో కూడా ఎన్ని విధాలో ప్రయత్నించారు.

గాంధీగారికి శిక్ష విధింపబడడమూ, *దాస్, మోతిలాల్ గారలు కౌన్సిల్ ఎంట్రీకి అనుకూలంగా ప్రచారం ఆరంభం చేయడమూ గమనించిన లేటు ఎస్.శ్రీనివాసయ్యంగారు కాంగ్రెసులో చేరారు. గాంధీగారి సహాయ నిరాకరణ పద్దతి నచ్చక ఆయన అంతవరకూ కాంగ్రెసులో చేరలేదు. అప్పట్లో ఆయన చెన్న రాజధానికి అడ్వకేటు జనరలు. కాగా సి.ఐ.యి. బిరుదు పొందినవారు. ఆయన తన బిరుదును విసర్జించి, పదవికి రాజినామా చేసి, దాస్, మోతిలాల్ ప్రభృతుల కౌన్సిల్ ఎంట్రీ పదకానికి కావలసిన చేయూతనిచ్చి తీరాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసులో చేరాడు.

కాని దాస్, మోతిలాల్ గార్లకు మనస్సులో ఒక చిన్న బెదురు ఉండిపోయింది. సత్యాగ్రహం, సహకార నిరాకరణం అన్న వాటిని ఆరంభమయిన కొద్ది రోజులలోనే విరమించినట్లయితే, దేశంలోనూ, ప్రజలలోనూ తమపట్ల ఏం దురభిప్రాయం యేర్పడుతుందో నన్న భయంతో, సహకార నిరాకరణ అంటూనే తమ పదకాన్ని కొంత మార్పుతోనూ, మెలికతోనూ అమలు జరపాలని తలచారు. ఆ ఇరువురూ మేధావులు, లాయర్లు. అట్టి వారికి పదకాలకూ, మెలికలకూ, మార్గమే దొరకదా? కౌన్సిల్ ప్రవేశ మన్నది మంత్రిపదవుల కోసమూ, వారు ప్రవేశపెడతా మన్న సంస్కరణలు అమలు జరపడానికి కాదు అనీ, మేము లోపల ప్రవేశించి వారి కార్యక్రమాలు స్తంభింప జేస్తామనీ, దాంతో వారి పరిపాలనా విధానాన్ని సాగకుండా చేస్తామనీ చెప్పసాగారు. నిర్బంధానికి ముందు గాంధీగారు వారి పదకానికి ఒప్పుకోలేదు. ఆయన జైలులో ఉన్న కారణాన్ని కాంగ్రెసులో తమ పదకం అంగీకరింప బడుతుందని వారు బావించారు.

వీరు వేసిన పదకానికి శ్రీనివాసయ్యంగారు కొద్ది మార్పులను సూచించారు. లోగడ ఐర్లెండులో ఐరిషు రిపబ్లికన్ పార్టీవారు అవలంబించిన విధంగా కౌన్సిల్‌లో ప్రవేశించి, దాని కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉంటే ప్రభుత్వ విధానాలు స్తంభిస్తాయన్నారు. కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశం ఈ విషయాలన్నీ రాబోవు గయా కాంగ్రెసు నిర్ణయానికి వదిలెయ్యడానికి నిశ్చయించారు.

1923 లో కార్యనిర్వాహక వర్గ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చే వరకూ నేను రాజగోపాలాచారిగారితో బాటుగా "నో-చేంజరు" గానే ఉండేవాడిని. 1922 లో జరిగిన ముఖ్య కార్యక్రమం యేమిటని యీనాడు విలియా వేసుకుంటే, కాంగ్రెసులోని ఉభయపక్షాల వారమూ (నోచేంజ్, ప్రోచేంజ్) మా మా పక్షాలకు బలం చేకూర్చుకోవడానికి జరిపిన ప్రచారమేనని ఒప్పుకోక తప్పదు.

దాస్-మోతిలాల్‌గార్లకు తమ విధానంపట్ల ప్రజలలో ఆచరణ అధికమవుతుందనే విశ్వాసం ఉంది. ఎందుకంటే-తమవిధాన ప్రకారం, చేయవలసిన త్యాగాలు అట్టే ఉండవు గనుక. నేనూ, రాజగోపాలాచారిగారూ మాత్రం వారి పదకానికి అంగీకరించలేక పోయాము. అందువల్ల గయా కాంగ్రెసు నాటికి ఉభయపక్షాలవారమూ రెడీ అంటే రెడీ, డీ అంటే డీ అనేటట్లుగానే ఉన్నాము.

గయా కాంగ్రెసులొ మా విజయం

గయా కాంగ్రెసులో మాకే విజయం లభించింది, దాస్-మోతిలాల్‌గార్ల ప్రతిపాదనలు వీగిపోయాయి. వా రుభయులూ బహిరంగ సమావేశంలోనే ఆగ్రహావేశులయ్యారు. కార్యనిర్వాహక వర్గంనుండి వెంటనే వైదొలగుతామనీ, మొత్తం దేశం అంతా తిరిగి విశేష ప్రచారంజేసి, రాబోవు కాంగ్రెసునాటికి తమ భావలే ప్రజలంతా బల పరచే లాగున ప్రబోదం చేస్తామనీ వ్యక్తం చేశారు.[2]

గయా కాంగ్రెసు ముగిశాక 1-1-1923 న జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశంలో ఏప్రిల్ 30 వ తేదీనాటికి 25 లక్షల రూపాయలు విరాళాలుగా ప్రోగుజేసి, గాంధీగారు జైలులో ఉన్నంతకాలం, యాబైవేల స్వచ్చంద సేవకులద్వారా, ఆయన విధానానుసారం సహకార నిరాకరణ ఉధ్యమ ప్రచారం ముమ్మరంగా సాగించడానికి నిశ్చయించుకున్నాము. ఈ సహకార నిరాకరణ ఉద్యమం సవ్యంగా సాగించడానికి కార్యనిర్వాహకవర్గం వారికి అధికారం కూడా ఇవ్వబడింది.[3] గయా కాంగ్రెసువారి తీర్మానాలకు అనుగుణంగా ముమ్మరంగా ప్రచారం చేయడానికి నిశ్చయించుకుని, రంగంలోకి దిగడానికి సిద్దం అవుతున్నాం.

తిరిగిపోయిన అచారిగారు

ఆ సమయంలో రాజగోపాలాచారిగారు తమ మనోదౌర్సల్యం కారణంగా మారిపోతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ మరుసటి నెలలోనే ఆయన పదకంలో మార్పు వస్తుందని అనుకోలేదు. ఎప్పుడు, ఏ విధంగా రాజగోపాలాచారిగారికి, దాస్-మోతిలాల్‌గార్లు రాజీ ప్రతిపాదనలు అందజేశారో నాకెంత మాత్రమూ తెలియదు. నేనూ, దాసూ ఎప్పుడూ చాలా సన్నిహితంగానే ఉండేవారము. రాజకీయ విధానాలలో మాకు భేదాబిప్రాయాలున్నా, మాలో మేము ఎప్పుడూ హృదయాలు విప్పే మాట్లాడుకునేవారం. తాము రాజగోపాలాచారిగారికి అందించిన రాజీ ప్రతిపాదనలను గురించి దాస్‌గారు నాతో ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి దాస్-మోతిలాల్‌గార్లు చాలా ప్రజ్ఞావంతులు గనుకనే, మరుసటి నెల తిరక్కుండానే రాజగోపాలాచారిగారిని తమ ప్రక్కకు త్రిప్పి వేసుకుని, రెండు మాసాలపాటు త్రివిధ బహిష్కార ప్రచార విరమణకు, రెండవ కంటివానికి తెలియకుండా, సుముఖుణ్ణి చేసుకోగలిగారు. ఈ లోపున తాము దేశాన్నిచుట్టి, తమ ప్రచారాన్ని సాగించి దేశీయులను తమ ఉద్దేశాల కనుగుణంగా త్రిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని వారు ఆశించారు. రెండు మాసముల వ్యవధిలో తమ ప్రచార బలంతో ప్రజలను తమ పక్షానికి త్రిప్పుకుని తమ వాదనలో ఉండేశక్తినీ, సత్యాన్నీ ప్రజల ముందు పెట్టలేకపోతే, తాము మనస్ఫూర్తిగా సహకార నిరాకరణ ఉద్యమానికే తమ శక్తిని ధారపోసి, గయా కాంగ్రెసువారు పున:పరిశీలనానంతరం అమలుపరచ నిశ్చయించుకున్న త్రివిధ బహిష్కార కార్యక్రమంతోటీ, గాంధీగారి రాజకీయ విధానం తోటీ సహకరించగలమని వారు ఒప్పందానికి రాగా, ఆచారిగారు 1-1-1923 నాటి తమ సుముఖ భావాన్ని 27-2-1923 నాటికి సులభంగా మార్చుకో గలిగారు. ఈ పెద్దమనిషి రెండు మాసాలలో మునిగిపోయేదేముందనే ధీమాతో, ఆ నాయకులకు ఆ అవకాశం కలిగించారు. పిబ్రవరి 27 వ తేదీని అలహాబాదులో అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగు జరిగే ముందు, కార్యనిర్వాహకవర్గం సమావేశమైంది. ఆ మీటింగుకు రాజగోపాలాచారిగారు ఆలస్యంగా వచ్చారు. ప్రవేశపెట్టబోయే తీర్మానం విషయంలో అభిప్రాయభేదాలు లేకుండా ఉండడానికి, పున:పరిశీలనార్థం దాస్-మోతిలాల్‌గార్లతో రాజగోపాలాచారిగారిని జతపరచడాన్ని పురస్కరించుకుని దాస్‌గారు, మోతీలాల్ గారు తమ పొగడ్తల ద్వారా త్రివిధ బహిష్కార కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించాలనే తీర్మానాన్ని రాజగోపాలాచారిగారే ప్రతిపాదించేటట్లుగా చేయగలిగారు. ఈ తెరవెనుక భాగవతం నా కేమాత్రము తెలియనివ్వలేదు. రాజగోపాలాచారిగారు వచ్చి సభలో పాల్గొంటూ, తమకూ ప్రత్యర్థులకూ ఒక విధంగా రాజీ కుదిరందనీ, దానిమీదట రెండు మాసాలుపాటు త్రివిధ బహిష్కార కార్యక్రమాన్ని వాయిదా వేయాలనే ప్రతిపాదన తానే మహాసభలో తీర్మాన రూపంగా ప్రవేశ పెట్టనున్నాననీ చెప్పేవరకూ తెరవెనుక ఎంత గ్రంథం నడిచిందో అవగాహన చేసుకోలేకపోయాను.

నా రాజీనామా

కార్యనిర్వాహకవర్గ సభ్యులను ఎవ్వరినీ ముందుగా కలుసుకోకుండా, రాజగోపాలాచారిగారు అటువంటి ప్రతిపాదన ప్రవేశ పెట్టడానికి అంగీకరించడం నాకు చాలా విచార హేతువే అయింది. త్రివిధ బహిష్కార కార్యక్రమం వాయిదా వెయ్యాలన్న ప్రతిపాదనలో గర్భితమై ఉన్న అపాయాన్ని సూచించాను. కీడు మేళ్ళు బేరీజులేస్తూ విషయాన్ని వివరించిన నా శ్రమ అంతా రాజగోపాలాచారిగారి విషయంలో బూడిదలో పోసిన పన్నీరే అయింది. దాస్-మోతిలాల్‌గార్లు పన్నిన వలలో ఇరుక్కున్నారన్నాను. ఎంతో తెలివిగా వారు త్రవ్విన గోతిలోకి అనుకోకుండా నవ్వుతూ వెడుతున్నారన్నాను. దిగగొట్టడానికి వీలుగా మలచబడిన సీలయొక్క మొన-వారి వాదన, అన్నాను. రెండు మాసాల విరమణ అన్నది శాశ్వత విరమణకే ప్రాతిపదికా, నాందీ అన్నాను. నా వాదన అంతా కంఠశోషే అయింది. ఆయన చాలా మొండిగా తయారయాడు. జరిగే ప్రతి సమావేశ సారాంశం, తీర్మానాలు వ్రాసే రికార్డు పుస్తకం (మినిట్స్ బుక్)లో ఈ మాటే వ్రాసి, నా సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాను.

తరువాత, అ.భా.కాం.సం. సమావేశంలో ప్రత్యర్థుల ప్రతపాదనను ప్రవేశపెట్టే గౌరవం రాజగోపాలాచారిగారు దక్కించుకున్నారు. దాస్-మోతిలాల్ గారలు ఆ ప్రతిపాదనను బలపరిచారు. కొన్ని నిమిషాలలో అది సభవారి ఆమోదాన్ని పొంది, తీర్మానమే అయిపోయింది. నిజానికి అది గాంధీగారి కార్యక్రమ నాశనానికి నాందే అయింది.[4] దాస్-మోతిలాల్‌గార్లు అంతకు పూర్వం దేశం నలుమూలలా పర్యటించి, తమ భావాలను ప్రజలతో చాటి చెప్పారు. దాన్తో దేశంలో చీలికలు ఏర్పడ్డాయి.

శాసనోల్లంఘన ఉద్యమ విచారణ

అంతేకాదు. అదే కాలంలో శాసనోల్లంఘన ఉద్యమ విచారణ సంఘం[5] అంటూ ఒక ఉపసంఘాన్ని వారు నియోగింపజేశారు. దేశంలో గాంధీగారి సహకార నిరాకరణ ఉద్యమం విజయవంత మయిందా లేదా అన్న సంగతి పరిశీలించి, దేశక్షేమం దృష్ట్యా ఆ ఉద్యమాన్ని సాగించడం మంచిదా లేక దానికి స్వస్తి చెప్పడం అవసరమా అన్న విషయాన్ని సమగ్రంగా తేల్చుకోవడానికి కావలసిన సమాచారాన్ని సేకరించవలసిందిగా ఆ సంఘానికి ఆదేశించారు.

అప్పటికే దేశీయు లందరికీ దాస్-మోతిలాల్ ప్రభృతులు గాంధీగారి విధానానికి విముఖులనీ, గాంధీగారు విడుదల అయ్యేలోపల, ఎల్లా గయినా ఆ విధానానికి స్వస్తిచెప్పడానికే నిశ్చయించుకున్నారనీ, విశదం అయింది. శాసనోల్లంఘన ఉద్యమ విచారణ సంఘాన్ని నియోగింప జెయ్యడం, గయా కాంగ్రెసు తీర్మానాన్ని వెనక్కి నెట్టించడం, అఖిల భారత కాంగ్రెసు సంఘంవారు 1-1-1923 న ప్యాసుచేసిన తీర్మానాన్ని రద్దు చేయించడం-ఒక దాని కొకటి తోడయి దేశీయుల హృదయాలలో కల్లోలాన్ని రేపాయి.

రాజగోపాలాచారిగారి బలహీనతవల్లనే ఇలాంటి పరిస్థితి ఉత్పన్న మయిందని అందరూ గ్రహించారు. గాంధీగారు బైటలేని కారణంగా, దేశానికి నో ఛేంజి, ప్రో ఛేంజి విధానాలలో ఏది ఉపయోగకరమయిన విధానమో తేలదని కాంగ్రెసు సేవకులు భావించారు. దాస్-మోతిలాల్ గార్లు తమ పార్టీ గురించి ప్రచారం చేస్తూ ఊరూరా తిరిగి ఉపన్యాసా లిస్తూ ఉంటే, చాలాచోట్ల ప్రజలు, ఏ పార్టీకి విరాళలిస్తే దేశానికి క్షేమం కలుగుతుందో నిర్ణయించుకోలేక, తాము యివ్వదలచిన విరాళాన్ని ఆ రెండు పార్టీలవారికీ సమంగా పంచి యిచ్చేవారు.

సహకార నిరాకరణ విధానం దేశానికి ఎంతవరకూ ఉపకరించింది అన్న విషయాన్ని తేల్చడానికి నియోగింపబడిన "శాసనోల్లంఘన ఉధ్యమ విచారణ సంఘం" సత్యాగ్రహ విధానాన్ని విరమింపజేయడానికే ప్రాతిపదికగా ఏర్పాటయిందన్న నమ్మకం జనంలో బాగా నాటుకు పోయింది. ఆ సంఘ సభ్యుడుగా తనను కూడా ఎన్నుకున్నారని, రాజగోపాలాచారిగారు చాలా సంతోషించారు. సహాయ నిరాకరణ విధానానికి స్వస్తిచెప్పాలనే ఉద్దేశాన్ని కడుపులో పెట్టుకునే, రాష్ట్రాలవారిగా, ప్రజాభిప్రాయ సేకరణ కంటూ, ప్రయాణాలు సాగించారు. దాస్-మోతిలాల్ గారలు తమ పన్నుగడ మనస్సులో పెట్టుకునే, కార్యక్రమం సాగిస్తున్నారన్న సంగతి నేను గ్రహించాను. ఈ విషయంలో ప్రజాభిప్రాయం అవిచ్ఛిన్నంగానూ, ఏకగ్రీవంగానే ఉంది; వచ్చిన చిక్కల్లా నాయకుల మధ్య ఏర్పడిన స్వల్పమైన తగాదాలేనన్న విషయాన్ని రుజువు చెయ్యాలనే తలంపు నాకు గట్టిగా కలిగింది.

గుంటూరులో దర్యాప్తు

ఆ సంఘంవారు, విచారణ నిమిత్తం ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంలో, నాకు ఒక అవకాశాన్ని కల్పించారు. [6] గత సంవత్సరమే పన్నుల నిరాకరణ ఉధ్యమాన్ని ముమ్మరంగా సాగించ గలిగిన ఆ గుంటూరు గ్రామాన్నే ఆంధ్రదేశ కేంద్రంగా భావించి విచారణ జరిపిస్తాం అన్నారు. నిజానికి, గాంధీగారు బైట ఉన్నప్పటి కంటే, నిర్భంధింపబడిన తర్వాతనే దేశంలో అలజడీ, ఉత్సాహమూ, ఎక్కువయ్యాయన్న సంగతి అక్కడ రుజువయింది.

గుంటూరుజిల్లా పోలీసు సూపరింటెండెంటు ప్రదేశ కాంగ్రెసు కమిటీ ప్రెసిడెంటుగారికీ, జిల్లా కాంగ్రెసు అధ్యక్షులయిన ఉన్నవ లక్ష్మీనారాయణగారికీ, విచారణ సంఘం వచ్చిన సందర్భంలో, (వాలంటీర్ల చేత) ఊరేగింపులూ, సభలూ జరిపించరాదని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశాడు. మీ నోటీసును, పాటించమనీ, మా వాలంటీర్లు కార్యక్రమాలలో పాల్గొంటారనీ ఆ జిల్లా పోలీసు సూపరింటెండెంటుగారికి నేను సమాధానం ఇచ్చాను.

విచారణ సంఘంవారు వస్తూన్న రైలు రెండు గంటలాలస్యం అయింది. చాలామంది వాలంటీర్లు అరెస్టుకు సిద్ధంగా డ్యూటీమీదే ఉన్నారు. పోలీసు స్టేషను సమీపంలో వాలంటీరుగా ఉన్న డి.వి.రాజు తలమీద ఉన్న గాంధీ టోపీని పోలీసువారు బలవంతంగా ఊడలాగి, అతనిని అవమానించారు. పోలీసువారు, తాము జారీ చేసిన ఆర్డరును వాలంటీర్లు వ్యతిరేకించే లోపలే, ఏదోఒకరకంగా గిల్లికజ్జా తెచ్చి అశాంతిని కలుగ జేయాలని దృఢంగా సంకల్పించుకున్నారన్న సంగతి నిశ్చయం అయింది. నేను పోలీసు సూపరింటెండెంటుకు ఇచ్చిన సమాధానాన్ని పురస్కరించుకుని, ముందుగా నన్నూ, లక్ష్మీనారాయణగారినీ పోలీసువారు అరెస్టు చేయవలసి ఉంది. కాని మమ్మల్ని ఇద్దరినీ వదలి, బాచీల వారీగా వాలంటీర్లని అరెస్టు చేయడం ఆరంభించారు. ఆ ప్రకారంగా ఆ రైలు వచ్చేలోపల మూడువందల మంది వాలంటీర్లు అరెస్టయ్యారు.

ఈ వాలంటీర్లను అరెస్టుచేసి తీసుకు వెడుతూన్న సందర్భంలో నేను అక్కడే ఉన్నాను. ఉన్నవ లక్ష్మీనారాయణగారు, తాను అరెస్ట్ అవ్వాలనే తహతహ కనబరుస్తున్నా, పోలీసువారు అయన జోలికి పోవడము లేదు. అరెస్టు చేయబడిన ఒక వాలంటీర్ల బాచిని ఒక గుండ్రని గుంపుగా నిలబెట్టి, కొందరు పోలీసులను ఆ గుంపుకు కాపలాగా నియమించారు. లక్ష్మీనారాయణగారు, ఆ గుంపు చుట్టూరా రెండు మూడుసార్లు తిరిగి, తనను నిర్భంధిచడానికి పోలీసులు విముఖంగా ఉన్నారని గ్రహించి, బలవంతంగా ఆ వాలంటీర్ల గుంపులోనికి ప్రవేశించి, అరెస్టయిన వారిలో తాను కలిసిపోయాడు. ఏ విధమయిన అలజడీ లేకుం డానే ఆయన అరెస్టవడానికి చూపించిన ఉత్సాహాన్నిచూసి పోలీసువారు ఆశ్చర్యపోయారు.

"గార్డ్ ఆఫ్ ఆనర్"

కమిటీవారు వచ్చేసరికి మేము వారిని పూలతోటీ, మాలలతోటీ కాదు ఆహ్వానించింది. వారి రాక సందర్భంలో గౌరవ పురస్పరంగా అరెస్టయిన మూడు వందలమంది వాలంటీర్ల గుంపే వారికి "గార్డ్ ఆఫ్ ఆనర్" అయింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమింప జేయాలనే ఉద్దేశంతో వచ్చిన "సివిల్ డిసొబిడియన్స్ ఇంక్వయిరీ కమిటీ" వారికి, గాంధీగారి ఉద్యమాన్ని ప్రోత్సహించి, అనుసరించాలని దేశీయులు ఎంతగా తహతహ లాడుతున్నారో వేరే సాక్ష్యం అవసరం లేకుండానే రుజువయింది.

నాటి సాయంత్రం విచారణ సంఘ నాయకులు ఒక బహిరంగ సభలో ఉపన్యసించారు. ఆ సభకు పూర్తిగా ఖద్దరు దారులయిన జనం సుమారు లక్షమందికి పైగా హాజరయ్యారు. సభానంతరం వారి వారి మకాములకు వారు చేరుకున్నాక, ఆ సంఘ సభ్యులే అయిన రాజగోపాలాచారిగారు, ఆ స్వచ్చంద సేవకులను ఎందుకు నిర్భంధించారో, సబ్-డివిజినల్ మాజిస్ట్రేటుగారిని అడగమని అన్నారు. మాజిస్ట్రేటుగారు జారీచేసిన ఆర్డరును వ్యతిరేకించిన కారణంగా వారిని అరెస్టు చేసినప్పుడు, ఆ విషయమై ప్రశ్నించడం అనవసరమూ, అర్థంలేనిదీ అని నేను చెప్పాను. ఇంకేవిధమయిన సంజాయిషీనీ సేకరించకుండానే ఆ సంఘంవారు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. చివరకు వారి రిపోర్టులో దృక్పథాలలో తేడా లున్నాయని సూచించారు. రాజగోపాలాచారిగారూ, కస్తూరి రంగయ్యంగారూ, అందులో ఏ విధమయిన మార్పులూ చేయడానికి అంగీకరించలేదు.[7]

నా జోస్యం నిజమైంది

1923 వ సంవత్సరం మే 26-27 తేదీలలో బొంబాయిలో అఖిల భారత కాంగ్రెసు సంఘంవారు సమావేశమయ్యారు.

ఈ సభవారు గయా కాంగ్రెసులో శాసన సభా బహిష్కారానికి అనుకూలంగా ఆమోదింపబడిన తీర్మానాన్ని రద్దుచేశాం అన్నారు. అ విధంగా లోగడ నేను చెప్పిన జోస్యం, తు.చ.తప్పకుండా నిజమయింది. రెండు మాసాల విరమణ శాశ్వత విరమణకు దారితీస్తుందనీ, అలాంటి అవకాశం కలుగజేస్తున్న కారణంగానే నేను నా కార్యనిర్వాహకవర్గ సభ్యత్వానికి రాజీనామా యిస్తున్నానని చెప్పిమరీ రాజీనామా యిచ్చాను గదా! ఆ తాత్కాలిక విరమణ, నేను అన్నట్లుగానే, శాశ్వత విరమణ అయివూరుకుంది. ఈ శాశ్వత విరమణ అంగీకారం పొందిన కారణంగా, వర్కింగ్ కమిటీనుంచి ఆర్గురు సభ్యులు తప్పుకున్నారు.[8] వైదొలగిన వారందరూ నో చేంజి దృక్పథంవారే. వీరి రాజీనామాలతోపాటు చిత్తరంజన్ దాస్‌గారి రాజీనామా కూడా అంగీకరింపబడింది.

మధ్యమ వర్గావతరణ

దాన్తో డాక్టరు అన్సారీ నాయకత్వాన ఒక నూతన కార్యనిర్వాహకవర్గం అవతరించింది. దాస్-మోతిలాల్‌నెహ్రూగార్ల పార్టీలో చేరని నేనూ, డా॥అన్సారీ, సరోజనీదేవీ కలసి, యింకా ఇద్దరు ముగ్గుర్ని కూడదీసుకుని, ఇంకో క్రొత్త కక్షి లేవదీశాము. మే నెలలో "తాత్కా లిక విరమణ'కి ఒప్పందం అయ్యాక, దాస్-మోతిలాల్ గారలు, తాము ఇంకా "నో చేంజర్స్"మేనని దబాయించలేరు గదా! "నో చేంజర్స్", "ప్రోచేంజర్స్" మధ్య సామరస్యం తీసుకువచ్చి, వారి మధ్యనున్న విభేదాలు విస్తరించకుండా చూడడమే మా క్రొత్త కక్షి ఆశయం. దానికి "సెంటర్-పార్టీ" అని నామకరణం జేశాము.

పై ఉదంతాల అనంతరం జండా సత్యాగ్రహం సాగుతూన్న నాగపూరులో, అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం (1923 జూలై) జరిగింది. ఆ మీటింగులో "సెంటర్-పార్టీ" స్థాపరులమయిన మా అందరిపైనా, నో ఛేంజ్ పక్షంవారు విరుచుకు పడ్డారు. సరోజనీదేవీ డా॥ అన్సారీ విమర్శించిన వారిని భావగర్భితమూ, సునిశితమూ అయిన తన ఉపన్యాసంతో చెరిగి విడిచి పెట్టింది. డా॥అన్సారీ అంత గుండె నిబ్బరం ఉన్న మనిషి కాకపోవడంచేత తనపై వచ్చిన విమర్శలకు తట్టుకోలేక నిజంగా మూర్చపోయాడు; ఆయన్ని మేమందరమూ కలిసి బయటికి మోసుకునిపోయి ముఖంమీద నీళ్ళు చల్లి, తెలివి వచ్చేదాక తంటాలు పడ్డాము. ఈ దెబ్బతో ఆయన భయపడిపోయి, తాను కొత్త పార్టీకి అధ్యక్షుడుగా ఉండ నిరాకరించాడు.

అనుకున్న ప్రకారం ముందు కార్యక్రమం జరిపించడానికి, అఖిల భారత కాంగ్రెసు సంఘ అధ్యక్షుడుగా కొండ వెంకటప్పయ్య పంతులుగారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సంఘంవారు శాసన సభలను బహిష్కరించడం విషయమై అభిప్రాయ సేకరణకుగాను ఒక ఉపసంఘాన్ని నియమించారు. దాస్-మోతిలాల్ గార్ల ప్రభకు తట్టుకోలేక, రాజగోపాలాచారిగారి నోచేంజ్‌పార్టీ శోభగోల్పోయిన పండుటాకులా ఎండి రాలిపోయింది. ఆచారిగారికి, ఏ విధంగా తమ శక్తుల్ని మళ్ళిస్తే, గాంధీగారి కార్యక్రమం పునరుజ్జీత మవుతుందో తెలుసు. ఆ రాజకీయ ధురంధురు లందువల్ల, గాంధీగారికి కుడి భుజం అనతగ్గ రాజగోపాలాచారిగారి మీద మొదటి బాణం విసిరారు. త్రివిధ బహిష్కార కార్యక్రమానికి రెండు మాసాలపాటు విరామం నీ వల్లనే కలిగిందన్నారు. తర్వాత, సత్యాగ్రహోద్యమాన్ని ఉద్ద్రుతం చెయ్యడానికి సహకార నిరాకరణోద్యమ సంఘం అంటూ ఒక దాన్ని లేవదీశారు. తర్వాత, శాసన సభలను బహిష్కరించడం విషయమై అభిప్రాయ సేకరణ కంటూ ఇంకో ఉప సంఘాన్ని నియమింపజేశారు. ఆ తర్వాత, అఖిల భారత కాంగ్రెసు సంఘం వారిచేత శాసన సభా బహిష్కార విధానానికే తిలోదకా లిప్పించారు.

ఈ త్రివిధ పద్ధతుల మీద వారి బలగాన్ని నడిపించి, తాము పన్నిన వలలో రాజగోపాలాచారిగారు ఇరుక్కునేటట్లుగా చేశారు. ఈ దెబ్బతో గాంధీగారి సహకార నిరాకరణ విధానానికే స్వస్తి చెప్పించి, ఆ స్థానంలో శాసన సభా ప్రవేశ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.

ఈ కథను పొడిగించే ముందు నాగపూరు జెండా సత్యాగ్రహ విషయం కాస్త చర్చించడం న్యాయం

  1. * 1922 నవంబరులో
  2. సి.ఆర్.దాస్ తన అధ్యక్షోపన్యాసంతో పాటు స్వరాజ్యపార్టీ నిబంధనావళిని, తన రాజీనామానూ కూడా తయారు చేసుకునే మహాసభకు వచ్చారుట. ఈ విధంగా కాంగ్రెసులో "స్వరాజ్య" కక్షి ఏర్పడింది.
  3. అధ్యక్షులు సి.ఆర్.దాస్ తన రాజీనామా పత్రం సమావేశం ముందు పెట్టారు. ఆ విషయం ఫిబ్రవరి సమావేశానికి వాయిదా వెయ్యడం జరిగింది.
  4. ఈ సమావేశంలో ఏప్రిల్ 30 వ తేదీవరకు ఉభయ పక్షాలవారు శాసన సభా ప్రవేశాన్ని గురించి ప్రచారం నిలిపి వేసెటట్టుగా "తాత్కాలిక సంధి" కుదిరింది. ఈ రాజీ కుదిర్చినవారు మౌలానా అబుల్ కలాం అజాద్, పండిత జవహర్ లాల్ నెహ్రూ. ఈ సభనాటికి వారు జైలునుంచి విడుదలయారు.
  5. గాంధీగారు నిర్భంధితు లయాక లక్నోలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం (1922 జూన్)లో
  6. అప్పుడు పంతులుగారే ఆంధ్ర రాష్ట్రీయ కాంగ్రెసు సంఘానికి అధ్యక్షులు.
  7. ఈ విచారణ సంఘం తమ నివేదికను అఖిల భారత కాంగ్రెసు సంఘానికి సమర్పించింది. కలకత్తాలో ఆగష్టు(1922)లో జరగవలసిన అ.భా.కాం.సం. సభ నవంబరులో జరిగింది. శాసన సభా ప్రవేశ సమస్య గయా కాంగ్రెసుకు విడిచి వేసింది-ఈ సమావేశమే.
  8. కారణం: గయా కాంగ్రెస్ ఆమోదించిన శాసన సభా బహిష్కారం గురించి ప్రచారం నిలుపు జేస్తూ ఈ సమావేశం తీర్మానించింది. కాంగ్రెసును సమైక్యంగా ఉంచాలని మధ్యమ కక్షివారు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. దానిమీద రాజీనామా ఇచ్చినవారు: సి. రాజగోపాలాచారి, రాజేంద్రప్రసాద్, జమ్నలాల్ బజాజ్, వల్లభ్ భాయ్ పటేల్, బ్రజకిశోర్ ప్రసాద్, జి.బి.దేశ్ పాండే.