నా జీవిత యాత్ర-2/నాగపూరు జెండా సత్యాగ్రహం: ఆంధ్రదేశం నుంచి వాలంటీర్లు

వికీసోర్స్ నుండి

10

నాగపూరు జెండా సత్యాగ్రహం:

ఆంధ్రదేశం నుంచి వాలంటీర్లు

లోగడ అలవాటయిన విధానంగా నాగపూరు వీథులలో తిరుగుతూన్న స్వచ్చంద సేవకుల్ని, కొన్ని కొన్ని వీథులగుండా యికముందు తిరుగ రాదంటూ 1923 మే మాసంలో 144 సెక్షను క్రింద ఆంక్ష విధించారు. జమన్ లాల్ బజాజ్ మున్నగు నాయకులు ఈ ఆంక్షను ఉల్లంఘించాలనే నిశ్చయంతో సత్యాగ్రహం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి నాగపూరు జెండా సత్యాగ్రహం అన్నపేరు సార్థకం అయింది.

నిరుత్సాహ పరిస్థితులు

గాంధీగారి జైలుశిక్షా, దేశంలో స్వాతంత్ర్య సమరాన్ని అణగ ద్రొక్కడానికి ప్రభుత్వంవారు అవలంబిస్తూన్న పద్ధతులూ గమనించిన మధ్య పరగణా వాసులలో ఉత్సాహం నశించిన కారణంగా, కాంగ్రెసు వారు విచారగ్రస్తు లయ్యారు. దేశనాయకులలో చీలికలు బయలుదేరి, గాంధీగారి సహకార నిరాకరణ విధానం సాగించాలా వద్దా అన్న మీమాంసతోవారు తగవులాడుకుంటూ ఉంటే గమనించిన కాంగ్రెసు వారెవరయినా నిజంగా మానసిక వేదనకు లోనయారంటే ఆశ్చర్యంలేదు.

జమన్‌లాల్ బజాజ్‌లాంటి ఉత్తమ నాయకుల నాయకత్వంలో నడుస్తూన్న మధ్య పరగణాలలో ఉత్సాహం చచ్చిపోయిందంటె, నాకు నిజంగా చాలా బాధనిపించింది.

నాగపురంలో జెండా సత్యాగ్రహ విషయం గమనిద్దామని మేము నాగపూరు వెళ్ళేసరికే 81 మంది అరెస్టయ్యారు. బజాజ్‌లాంటి ఉత్తమ నాయకుడు అరెస్టయి శిక్షింపబడిన సందర్భంలో, అరెస్టుకు సిద్ధమయిన 82 వ వ్యక్తి లభింపలేదనే విషయం మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది.

ఇలా అన్నానని మధ్య పరగణా మనుష్యులు ఇతర ప్రాంతీయులకంటె దేశభక్తిలోనూ, ఉత్సాహంలోనూ, తీసికట్టనిగాదు నా ఉద్దేశం. గత 20 సంవత్సరాలుగా నడుస్తూన్న స్వాతంత్ర్య సమరం సందర్భంలో వెనుకంజ వేసిన వారెవరూ లేరు. అన్నిప్రాంతాల భారతీయులలోనూ వున్నవి ఒకేరకపు రక్తమాంసాలే. వారి ఉత్సాహాతిశయాలలోనూ తేడాపాడాలు లేవు.

కాని దేశీయులలో ఆ ఉత్సాహం సన్నగిల్లినప్పుడు, క్లిష్ట పరిస్థితులలోనూ ప్రజలలో ఉత్సాహోద్రేకాలను రేకెత్తించగలవి నాయకుల ధైర్య స్థెర్యాలూ, వారి ఉద్బోధనా పద్ధతులూ మాత్రమే. సరిఅయిన నాయకులు ముందడుగువేసి జనులలో ఉత్సాహాన్ని రేకెత్తించవలసి ఉంది. నాగపూరులో అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులకు హాజరయి, పరిస్థితులను గమనించిన మా కందరికీ ఒకటే అనిపించింది. ఈ నిరుత్సాహానికి కారణం నాయకులమధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలూ, కుమ్ములాటివే అని.

ఆందోళన ప్రాముఖ్యం

నాగపూరు జెండా సత్యాగ్రహ ఉధ్యమం ఘనవిజయానికై జనులను ఉత్తేజపరచి, వారిలో నవచైతన్యం కలుగజేయాలనే ఉద్దేశంతో నేనూ, విఠల్‌భాయ్ పటేలూ, సరోజినీదేవి కలిసి నాగపురంలో బహిరంగ సభలలో ఉపన్యసించాము మన జాతీయ పతాక గౌరవం కాపాడడానికి ఆరంభం అయిన ఈ ఆందోళన అన్నది, సరిగా ఆలోచించి చూస్తే, మానవుడు మానుషంగల మనిషిగా బ్రతకడానికి అవసరమైన జీవన్మరణ సమరమే అవుతుంది. అప్పట్లో నాగపూరులో జాతీయ పతాకం అణగద్రొక్కబడిఉంటే, అది కాంగ్రెసు జీవితానికే గొడ్డలి పెట్టయి స్వతంత్రోద్యమం అధ:పాతాళానికి దిగిపోయి ఉండేది.

ఆ రాష్ట్రంలో జమన్‌లాల్ బజాజ్ లాంటి ఉత్తమనాయకునివెంట 80 మంది కంటె ఎక్కువగా జైళ్ళకు వెళ్ళలేకపోయిన పరిస్థితులు ఉత్పన్నమయినప్పుడు, అట్టి జనాన్ని ఉద్రేకపరచి, జాతి గౌరవ మర్యాదలు నిలుపుకోవడానికి ఏ పద్ధతుల మీద, ఏయే విషయాలు చర్చిస్తూ, ఎలాంటి ఉపన్యాసాలు, ఎవరెవరిచేత ఇప్పించడ మన్నది సమస్యే అయింది.

మే మిచ్చిన హామీ

ఆ విషమ పరిస్థితులను గ్రహించి, నేనూ, ఇతర మిత్రులమూ కలసి ఆ రాష్ట్ర ప్రజలతో యేమన్నామో తెలుసా? "ఇటువంటి జాతీయ సమరంలో ఇలాంటి విషమ ఘట్టాలలో మీ రాష్ట్రంలో 81 వ వాడిని అనుసరించడానికి మనుష్యులు దొరక్కపోతే, ఇతర రాష్ట్రాల నుంచి తండోప తండాలుగా జనాన్ని ఇక్కడికి పంపించి, మీ మా గౌరవాలు కాపాడుతాము" అన్నాము. "నా మట్టుకు నేను మా ఆంధ్రరాష్ట్రంనుంచి జెండాలతో సహా వేలాది వాలంటీర్లను పంపించగలనని హామీ ఇస్తున్నాను. ఈ హామీ నేను వ్యక్తిగతంగానే గాక, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా కూడా ఇస్తున్నాను," అని నమ్మబలికాను. నాగపూరు నివాసి అయిన ఒక పెద్దమనిషి మేమంతా మధ్య రాష్ట్రాల సెంట్రల్ (ప్రావిన్సెస్) లోని ముఖ్య నగరాల నన్నింటినీ చుట్టి ప్రచారం చేయడానికి వలసిన యేర్పాట్లన్నీ చేయించాడు. అనుకున్న ప్రచారం అన్ని కేంద్రాలనూ చట్టిన ముఖ్యులలో నేనూ ఉన్నాను. వెళ్ళిన చోటల్లా మనుష్యులు కరువయిన కారణంగా ఉద్యమం కుంటుపడిందంటే అది మీ రాష్ట్రీయుల కందరికీ సిగ్గుచేటని నొక్కి వక్కాణించాను. చాలాదూరంలో ఉన్న మా ఆంధ్రదేశంనుంచి మీ గౌరవం కాపాడడానికి మా మనుష్యులు రానై ఉన్నారనీ చెప్పాను. మా దేశంనుంచి వచ్చేవారు రాకుండా రైళ్ళలో ఇబ్బందులు కలుగజేస్తే మా వాళ్ళు కష్ట నష్టాలకు ఓర్చి అంతదూరంనుంచీ నడిచి అయినా సరే వచ్చి మీ గౌరవాలు కాపాడుతారని చెప్పాను. మా నాగపూరు యాత్ర ప్రబోధాత్మకంగా విజయాన్ని సాధించిందనే చెప్పాలి.

కాని ప్రజలలో నిజమయిన ఉత్సాహాన్ని అనేక కారణాలవల్ల కలుగజేయలేక పోయాము. ఈ జెండా సత్యాగ్రహాన్ని అఖిల భారత సమస్యగా పరిగణించాలని 19-7-1923 న ప్రతిపాధించడమూ, దాన్తో దేశం నలుమాలల నుండీ జనం తండోపతండాలుగా రావడమూ జరిగేసరికి దేశంలో నూతనోత్సాహం, చైతన్యం, వగైరాలన్నీ కలిగాయి.

ఆంధ్రుల మందంజ

చెప్పిన పద్ధతిగా చేయడానికి మున్ముందుగా తయారయింది మేమే. మన ప్రాంతానికి మేము తిరిగి వచ్చిన వెనువెంటనే రాష్ట్రీయ కాంగ్రెసు సంఘ సమావేశాన్ని జరూరుగా ఏర్పాటుచేసి, అందులో ఈ నాగపూరు జెండా సత్యాగ్రహ పరిస్థితులను తర్జన భర్జన చేశాము. సభలో ఉద్రేక పూరితమయిన ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు, మన వాలంటీర్లని నాగపూరు పంపించిడానికి వీలులేదని ఘంటాపథంగా వక్కాణించాడు. కాని కమిటీవారు మన వాలంటీర్లను నాగపూరు పంపించాలనే నిర్ణయానికి వచ్చి, అత్యధికమైన మెజారిటీతో తీర్మానాన్ని నెగ్గించారు. రైలు ప్రయాణాలకు ఆటంకాలు కల్పించబడే పరిస్థితులలో నడిచే వెళ్ళి తీరాలనే విషయం సుస్పష్టం చేయబడింది. మన రాష్ట్రంనుండి చాలామందే వెళ్ళారు. రైలు ప్రయాణానికి చాలామందికి అడ్డంకులు కలుగజేయబడ్డాయి. అడ్డంకులు కలిగిన ప్రాంతంనుంచి కాలినడకనే మనవాళ్ళందరూ ప్రయాణాలుచేసి ఆ జెండా సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

ఒక ఉదాహరణ

నాకు భమిడిపాటి సత్యన్నారాయణగారి అవస్థ ఇంకా జ్ఞాపకం ఉండిపోయింది. పెక్కు ఉద్యమాల అనంతరం ఆయన కొంతకాలంగా[1] నరసాపురంలో ప్లీడరుగా ఉంటున్నారు. ఆయన ఆరోజులలో నాగపూరు సత్యాగ్రహంలో పాల్గొనడానికి గాను, తనకు తప్పని సరిగా కావలసిన బట్టలు వగైరాలన్నీ ఒక గంపలో నెత్తిన పెట్టుకుని, మొత్తం దూరం అంతా కాలినడకనే నడచి వెళ్ళారు.

ఇతర రాష్ట్రాలుకూడా ఈ సత్యాగ్రహ సమరానికి ఇతోధికంగానే వాలంటీర్లను పంపించాయి.

అప్పట్లో అలముకొనిఉన్న నిరుత్సాహ పరిస్థితులలో కూడా నాగపూరు జెండా సత్యాగ్రహ సమరం బ్రహ్మాండంగానే సాగింది. ప్రభుత్వం వారు తమ ఓటమిని ఒప్పుకుని, దేశీయులు తమ జెండాను నిరభ్యంతరంగా ఏ అడ్డంకులూ లేకుండా ఎగుర వేసుకో వచ్చునని అనుజ్ఞ యిచ్చే పర్యంతమూ, ఈ యుద్ధకాండంతా జోరుగానే నడిచింది.

నాయకులకు, ప్రజలకూ పరస్పరం విశ్వాసం కుదిరి, నాయకులు తమ కీచులాటలను తగ్గించుకుని నడిపించగలిగిననాడు సహకార నిరాకరణ ఉద్యమంకూడా విజయవంతం అవుతుందని 1923 నాటి నాగపూరు జెండా సత్యాగ్రహ సమరం రుజువు చేసింది.

  1. తరవాత (1967) వకీలుగా తూర్పుగోదావరిజిల్లా రాజోలు కాపురస్థులు.