నా జీవిత యాత్ర-2/చరిత్రాత్మకమైన కాకినాడ కాంగ్రెస్

వికీసోర్స్ నుండి

11

చరిత్రాత్మకమైన కాకినాడ కాంగ్రెస్

1923 డిసెంబరులో కాకినాడలో కాంగ్రెసు జరుప దలచాము, దురదృష్టవశాత్తూ ఆ సంవత్సరం గోదావరినదిలో ముమ్మరంగా వరదలు రావడమూ, అక్కడి ప్రాంతాలన్నీ చాలా వరకూ తుపాను దెబ్బతినడమూ సంభవించింది. తిరిగీ 1937-38 లలో కూడా ఆంధ్రదేశపు పలు ప్రాంతాలూ అలాంటి ఇక్కట్లే ఎదుర్కోవలసి వచ్చింది. కాని అప్పటి పరిస్థితులు వేరు. ఆ సంవత్సరాలలో మేము రాజ్యాంగాన్ని కాంగ్రెసు పేరిట నిర్వహిస్తూన్న కారణంగా నేను రివెన్యూ మంత్రిగా ఉంటూ కరువులూ, వరదలూ మొదలైన అరిష్టాల వలన కలిగిన పరిస్థితులను కూడా సరిదిద్దవలసిన బాధ్యతను వహించాను.

వరద బాధితులకు సహాయ్యం

నిజానికి 1923 లో కాంగ్రెసు కమిటీవారు ఇవ్వగలిగిన సహాయం అత్యల్పం అయింది. కాని నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రజలచేయూతతో ఎంతో సహాయం చేయకలిగాను. జిల్లా అధికార్లూ డివిజన్ అధికార్లూ కూడా మాతో చేతులు కలిపి చేయగలిగినంత సహాయం చేయడానికి సంసిద్దు లయ్యారు. నేరుగా గవర్నమెంటు బొక్కసంలోంచి కాకపోయినా, అక్కడ ధనాన్ని విరివిగానే ఖర్చు పెట్టగలిగాము. జమీందార్లూ, భూస్వాములూ, సామాన్య ప్రజలూ కూడా తమ శక్తివంచన లేకుండా ఇచ్చిన ధన కనక వస్తు వాహన సంపత్తితో, నిలువనీడలేని వేలాది జనానికి లక్షలాది వెదుళ్ళూ, కోట్లాదిగా తాటాకులూ సప్లయి చేయ గలిగాము.

ఆనాడు మేము ఎంత సేవ చేయగలిగినా, 1937-38 సంవత్సరాలలో తుపాను బాధితులకు యివ్వగలిగిన సహాయంతో పోల్చిచూస్తే 1923 లో మేము చేసిన సహాయం అత్యల్పం అని ఒప్పుకోకతప్పదు. ఒక్కటిమాత్రం నిజం. 1923 లో జనం అంతగా బాధపడడానికి కారణం, ఆనాటి ప్రభుత్వం, జాతీయమైన ప్రజాప్రభుత్వం కాక పోవడమేనని నొక్కి వక్కాణించగలను, అందువల్లనే, అవకాశం చిక్కి రాజ్యాంగాన్ని కాంగ్రెసు పేరిట 1937-38 లో స్వీకరించ గలిగిన సందర్భంలో, కరువులూ, వరదలూ, తుపానులూ లాంటివి నా పోర్టుపోలియోలోకి తీసుకుని, అవసరం అయినప్పుడల్లా బాధితులకు కావలసిన సహాయం అవిచ్చిన్నంగా చేయగలిగాను. అంతేకాదు-అవసరాలకు ఆర్థిక శాఖవారు ధానాన్ని మంజూరుచేసి యిచ్చేలోపలే నేను ఆయాప్రాంతాలకు వెళ్ళి ప్రజల సహాయ్య సహకారాలతో, శక్తివంచన లేకుండా చేయగలిగిన సేవ చేస్తూండేవాడిని.

కాంగ్రెసుకు ఖాదీడేరా

నాటి వరదలూ, తుపానులూ కూడా కాకినాడ కాంగ్రెసుకు కావలసిన యేర్పాట్లు సవ్యంగా చేయడానికి వీలులేకుండా చికాకులూ, ఇబ్బందులూ కలుగ జేశాయి. కాంగ్రెసుకు అవసరం అయ్యే ఖర్చుల కోసం, కాంగ్రెసువారు ధనాన్ని సేకరించడంలో నిమగ్నులయ్యారు. ఈ కారణం వల్ల కూడా వరద బాధితుల సాహాయ్యానికి కావలసినంత జోరుగా ధనాదులను సంపాదించలేక పోయాము. కాని ఆంధ్ర ప్రజానీకంలో వెనకాడే గుణం లేకపోవడాన్ని, వారికున్న ఆర్థికపు టిబ్బందులను విస్మరించి, వలసిన ఆర్థిక సహాయాన్ని ఆనందంగా జేశారు.

ఇటు "రిలీప్" పనులూ, అటు కాంగ్రెసు కార్యకలాపాలూ చాలా విజయవంతమే అయ్యాయి. అంతేకాదు-కాంగ్రెసు అనంతరం కాంగ్రెసు ఎక్కడ జరిగినా వేసుకోవడానికి సువిశాలమయిన పెద్ద డేరా, ఆ డేరాకు కావలసిన హంగులూ శాశ్వతంగా సమకూర్చి సమర్పించ గలిగింది ఆంధ్ర దేశమే. ఆరోజులలో అ ఖాదీడేరా ఖరీదు లక్షా యాభై వేలపై చిలుకు ఉంటుందని అంచనా వేశారు. దురదృష్టవశాత్తూ, ఈ డేరా వగైరాలు, అయిదారు సంవత్సరాలు వాడుకున్నాక, అనుకోకుండా పరశురామ ప్రీతి అయ్యాయన్నది వేరే విషయం.

శాసన సభా ప్రవేశ వివాదం

సత్యాగ్రహ సమర ప్రారంభ కాలంనుంచీ దాస్‌గారూ, నేనూ సన్నిహితులంగానూ, ముఖ్య స్నేహితులంగానూ ఉంటూ ఉన్నా, ఇంతవరకూ ఆయా సందర్భాలలో చెప్పినట్లు, గాంధీగారి పద్ధతులకు భిన్నంగా ఆయనా, మోతిలాల్ నెహ్రూగారు కలసి పన్నిన కుట్రలో నేను యిరుక్కోలేదు. కాగా వారు ప్రారంభించిన స్వరాజ్యపార్టీ అన్న దాంట్లోనూ నేను కలుగ చేసుకోలేదు. ఆ స్వరాజ్యపార్టీయే కాలక్రమేణా కాంగ్రెసు కౌన్సిల్ పార్టీగా మార్పు చెందింది.

గాంధీగారు ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని దాస్-మోతిలాల్‌గార్ల సలహా సంప్రతింపులతో ప్రారంభించి ఉండడంచేత వారికి తన విధానాలపట్ల విముఖత గలుగుతూన్నట్లు విశదం అవుతూ ఉన్నా, వారి మానాన్ని వారిని వదిలి, తన మానాన్ని తాను, తను నమ్మిన పద్ధతిలో, ప్రజల సహాయంతో, ఉద్యమాన్ని నడుపుకుంటూ ముందుకు పోలేక పోయారు. రాజగోపాలాచారి మొదలైన కార్యనిర్వాహకవర్గ సభ్యులందరూ కలిసి, త్రివిధ బహిష్కార విధానానికి రెండు మాసాలపాటు విరామం ఇవ్వడమూ, శాసన సభల విషయంలో ఉన్నటువంటి బహిష్కరణను పూర్తిగా ఎత్తివేయడమూ, తరవాత శాసన సభా ప్రవేశ కౌన్సిల్ ఎంట్రీ విధానానికి అంగీకరించడమూ ఇత్యాదులన్నీ, ఏదో విధంగా జైలులో ఉన్న గాంధీగారితో సంప్రతించే చేస్తున్నారని చాలా మంది నమ్ముతున్నా, నిజానికి రెండు సంవత్సరాలకు పైగా నిర్భంధంలో ఉన్న మహాత్మునికి బైట ఏం జరుగుతూందో ఈషణ్మాత్రమూ తెలియదు.

గాంధీగారినీ, వారి తత్త్వాన్నీ ఎరిగి ఉన్న నేను, ఈ పనులన్నీ వారి ఎరుకతోటీ, అనుమతతోటీ (కాగితంమీద లేకపోయినా) జరుగుతున్నాయని ఎప్పుడూ నమ్మలేదు. 1923 ఫిబ్రవరి మాసంలో వర్కింగు కమిటీతో నాకున్న సంబంధాన్ని తెంచుకున్నాను. అప్పటికి గాంధీగారు నిర్సంధింపబడి ఏడాది అయి ఉంటుంది. వర్కింగు కమిటీనుండి వైదొలగిన తర్వాత నాకు దాస్‌గారి ప్రోగ్రాంతోగాని, రాజగోపాలా చారిగారి ప్రోగాంతోగాని సామరస్యం కుదరలేదు. లోగడ విన్నవించినట్లు, నేనున్నూ కొంతమంది మిత్రులమున్ను కలసి, నో ఛేంజి ప్రో ఛేంజ్ పార్టీల మధ్య ఏర్పడిన అగాధం విస్తరించకుండా చూడాలనే ఉద్దేశంతో "సెంటర్-పార్టీ"ని నెలకొల్పాం'

రా. కాం. అధ్యక్ష పదవికి రాజీనామా

డిల్లీలో మహమ్మదాలీగారి అధ్యక్షతను జరిగిన స్పెషల్ కాంగ్రెస్[1] ఆవరణలోకి కూడా నేను ఇన్‌ప్లూయంజా కారణంగా వెళ్ళలేక పోయాను. నేను డిల్లీ చేరిన వెంటనే పట్టుకున్న ఈ ఇన్‌ప్లూయంజా, కాంగ్రెసు పూర్తి అయిన వారం పది రోజులదాకా నన్ను వదలనే లేదు. అందువల్ల ఈ స్పెషల్ కాంగ్రెస్‌లో దాస్‌పార్టీ వారికి 1924 లో జరుగబోయే ఎన్నికలలో అభ్యర్థులుగా నిలిచి పోటీ చేయడానికి ఇవ్వబడిన అనుమతి విషయంలో నోరు విప్పి మాటలాడే సావకాశం కూడా నాకు లభించలేదు.

కాకినాడ కాంగ్రెస్‌లో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు నేను దాస్‌పార్టీ వారికి వ్యతిరేకంగా వ్యవహరించి, డిల్లీలో స్పెషల్ కాంగ్రెస్ వారు దాస్‌గారికి అనుకూలంగా చేసిన తీర్మానాన్ని కాకినాడ కాంగ్రెసు వారిచే తిరగ తోడించాలో, దాస్‌పార్టీవారితో చేతులు కలపాలో నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. డిల్లీ "స్పెషల్ కాంగ్రెస్"వారు దాస్ పార్టీవారికి "కౌన్సిల్ ఎంట్రీ"కి అనుమతి నిచ్చి, రెండు మాసాలయినా కాకుండానే, దాన్ని తిరగ తోడించడం అన్నది అవివేకం అనే కారణాన్ని, ఆంధ్ర మిత్రుల నందరినీ డిల్లీ తీర్మానాన్ని బలపరచ వలసిందని కోరాను. కాని యువక బృందం గయా తీర్మానాన్నే పట్టుకు కూర్చున్నారు. ఈ విషయంలో మేము చీలిపోయాము. ఈ విషయం చర్చకి వచ్చినప్పుడు నేను ఒక్క వోటు మెజారిటీతో ఓడిపోయిన కారణంగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్ష స్థానానికి రాజీనామా ఇచ్చాను.

వాలంటీరు పని

ఈ వ్యతిరిక్త భావాలతో వాలంటీర్లలో ఉండవలసిన క్రమశిక్షణ కుంటుపడింది. కాంగ్రెస్ సెషన్స్‌లో బాడ్జి వేసుకుని పనిచేయడానికి వాలంటీర్లు నిరాకరించారు. అప్పుడు నేను ఒక వాలంటీరు బాడ్జి తగిలించుకుని పనిచేయడం ప్రారంభించాను. దాన్తో ఇతరులు కూడా నన్ను అనుసరించారు.

ఆరోగ్యం పూర్తిగా చెడుటవలన విడుదలయిన[2] గాంధీగారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూండగా నేను సకుటుంబంగా చూడడానికి వెళ్ళినప్పుడు, గాంధీగారు యీ ఉదంతాన్ని గురించి కూడా మాట్లాడారు.

నా సహచరులయిన నాయక బృందం ఒక్క ఓటు మెజారిటీతో నన్ను ఓడించినంత మాత్రం చేత, ఇతర డెలిగేట్ల పైనా, ప్రజలపైనా ఉన్న నా విశ్వాసం సడలలేదు. నేను చాలాసేపు కాంగ్రెసు సమావేశంలో మాటలాడవలసి వచ్చింది. చివరికి నాతో అభిప్రాయభేదం ఉన్న డాక్టరు సుబ్రహ్మణ్యంగారు కూడా మాటలాడవలసి వచ్చింది

చివరికి జయం

చివరికి నా దృక్పథమే అధిక సంఖ్యాకుల ఆమోదాన్ని పొందింది. డిల్లీలో "స్పెషల్ కాంగ్రెస్" వారిచ్చిన అనుమతి దృఢతరం అయింది. ఈ విషయంలో ఎంతో ఆతురతతో ఉన్న దాస్‌గారూ సంతసించారు. దాస్‌గారు తమకు లభించిన ఢిల్లీ అనుమతి కాకినాడలో తిరగ తోడబడుతుందేమోననే భయంతో, అంతవరకూ చాలా ఆదుర్దాగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ బెంగాలు శాసన సభలో కాంగ్రెసు పార్టీకి నాయకుడిగా ఉంటూ ఉండిన కిరణ శంకర్‌రాయ్‌గారు, నన్ను కలుసుకుని మాటలాడి ఎల్లాగయినా ఢిల్లీ ప్రతిపాదన నిలబడేటట్లు చూడమని కోరారు. ఈయన్ని ప్రత్యేకంగా ఈ పనికోసం నియోగించి దాస్‌గారు పంపించారు. ఆయన వందలాది మైళ్ళు ప్రయాణం చేసి ఈ పనిమీదే బెజవాడ వచ్చారు.

మా వ్యక్తిగత స్నేహ బాంధవ్యాలు, వ్యక్తిగత అభిప్రాయాలతో ఎప్పుడూ ముడిపడి ఉండలేదు. మా రాజకీయాలన్నీ రాజకీయాలుగానూ, స్నేహాలు స్నేహాలుగానే ఉండేవి. అయినప్పటికీ ఆయనతో సహకరిస్తానని వాగ్దానం చేశాను. గాంధీగారు నిర్భంధంలో ఉండగా, నాయకులతో విభేదాలు కారణంగా దేశంలో పరిస్థితులు క్లిష్టతరం కావడం వాంఛనీయం కాదనే నా ఊహ.

వరదలతోనూ, తుపానులతోనూ ఆ సంవత్సరం ప్రజలను ఎటువంటి బాధలకు గురిచేసినా, 1923 రాజకీయంగా మాత్రం ఉపకరించింది. ఏ దృక్పథంతో చూసినా కాకినాడ కాంగ్రెసు బ్రహ్మాండమయిన విజయాలు సాధించిందనే చెప్పాలి. ఆంధ్రులమయిన మనకు ఆ కాంగ్రెసు నిజంగా గర్వకారణమే. ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారు, తమ అధ్యక్షోపన్యాసాన్ని హిందీలో ఇచ్చారు. ఆంధ్ర యువతీ యువకులు శక్తివంచన లేకుండా సహాయపడ్డారు. ఆంధ్ర దేశానికి జెందిన అన్ని జిల్లాలలోని వ్యాపారస్థులూ, వర్తకులూ, కృషీవలులూ లేదనకుండా వారికి తోచిన సహాయం, ఆర్ధికంగానే గాక అనేకవిధాల సహాయపడ్డారు.

మహర్షి అతిథ్యం

కాకినాడ కాంగ్రెసు చరిత్ర (మహర్షి) బులుసు సాంబమూర్తి గారిని తలపెట్టకుండా ముగించకూడదు. కాంగ్రెసు ఏర్పాట్లన్నీ ఆయన భుజస్కంధాలపైనే మోపబడ్డాయి. సాంబమూర్తిగారు కూడా నాకు మల్లేనే ప్లీడరీలో బాగా ఆర్జించిన వారే అయినా, ఉద్యమంలో చేరాక మా యిద్దరి స్థితీ ఒక్కలాగే నడిచింది. ఇద్దరమూ పకీర్లమే. ఇద్దరమూ దేశ ద్రిమ్మర్లమే. అయితేనేం, లేమితో ఎప్పుడూ మేము బాధపడలేదు. అడగడం తడవుగా డబ్బు అల్లా పుట్టేది. వారి ప్రయత్నం సఫలం అయింది.

ఆంధ్ర దేశపుటన్ని మూలలనుంచీ ధారాపాతంగా వచ్చిన సరుకులతో, గాదెలూ, కందా కొట్లూ కూడా నిండాయి. కాంగ్రెసు అయిపోయినా అవి పూటుగానే ఉన్నాయి. అందువలన కాంగ్రెసుకు వచ్చిన ప్రతినిధులూ, ప్రేక్షకులూ కూడా జరిగిన, జరుగుతూన్న ఏర్పాట్లకు విస్తుపోయారు. వచ్చిన వారి కందరికీ అనుకున్న దానికంటె ఎన్నోరెట్లు అధికంగానే ఆదరణ లభించింది. ఆయన చేసిన ప్రతి కార్యం అమోఘంగానే నిర్వహింపబడింది. సాంబమూర్తిగారు తమ నేర్పుతో ఆంధ్ర దేశీయుల నందరినీ ఒక "కామధేనువు"గా మార్చగలిగారు.

ఆయన ఇట్టి ఏర్పాట్లన్నీ పుట్టెడు దు:ఖంతో ఉండి కూడా చేయగలిగాడు. ఆయన ఏకైక పుత్రుడు, కాంగ్రెసు కొద్ది రోజులలో ఆరంభం అయ్యే ముందర, కన్నుమూశాడు. ఆయన ఆశలన్నీ ఆ యిరవై సంవత్సరాల యువకుని పైనే కేంద్రీకరింపబడి ఉన్నా, ఆ విచారాన్నంతటినీ దిగమ్రింగి, ఉత్సాహం తెచ్చుకుని అన్ని ప్రాంతాలూ తిరిగి, కాంగ్రెసుకు అవసరమైన రంగాలన్నింటికీ కావలసిన సహాయం పుట్టించ గలిగాడు. సాంబమూర్తిగారి తండ్రి సుబ్బావధానిగారు. ఆయన ఆంధ్రావనిలో పేరుపడ్డ మహాపండితుడు, మంచిజ్ఞాని, వేదాంతి. ఆయన, వృద్ధాప్యంలో మరణ శయ్యమీద ఉండగా, కాకినాడలో వారి స్వగృహంలో దర్శించుకోగల భాగ్యం నాకులభించింది. సాంబమూర్తి ఆ తండ్రికి తగిన బిడ్డే. అందువల్లనే ఏకైక పుత్రుని మరణంతో కృంగి పోకుండా, శోకభారాన్ని హృదయంలోనే ఇముడ్చుకుని, కార్యరంగంలో ప్రవేశించి సాధించుకు రాగలిగారు. "జాతస్య మరణం ధ్రువం" అన్న నుడే ఆయనికి శాంతినీ, శక్తినీ ఇచ్చియుంటుంది.

  1. మేలో బొంబాయిలో అ. భా. కాం .సం. చేసిన తీర్మానాన్ని కొన్ని రాష్ట్రీయ సంఘాలు ధిక్కరించిన మీదట, జూలైలో నాగపూరులో మళ్ళీ అ. భా. కాం. సం. సమావేశం జరిగింది. శాసన సభా బహిష్కార విధానాన్ని పునర్విచారణ చెయ్యడానికి ఒక ప్రత్యేక కాంగ్రెసును సమావేశ పరచాలనే తీర్మానాన్ని మధ్యమ కక్షివారు అంగీకరింపజేశారు. సెప్టెంబరులో డిల్లీలో సమావేశమైన ఆ ప్రత్యేక కాంగ్రెసు శాసన సభా ప్రవేశాన్ని అనుమతిస్తూ తీర్మానం చేసింది. ఆ విధంగా శాసన సభా ప్రవేశ వాదులు తమ పట్టు సాధించారు.
  2. 1924 పిబ్రవరిలో.