నా జీవిత యాత్ర-2/చీరాల-పేరాల ఉదంతం: 'ఆంధ్రరత్న రామదండు'

వికీసోర్స్ నుండి

8

చీరాల పేరాల ఉదంతం:

ఆంధ్రరత్న "రామదండు"

ఆంధ్ర దేశానికి సంబంధించి నంతవరకూ 1921 లో జరిగిన బ్రహ్మాండమయిన చరిత్రాత్మక సంఘటన ఇంకొకటి ఉంది. ఇది చాలా ముఖ్యమయినదీ, మరపురానిదీ. ఇది చీరాల పేరాల ఉదంతంగా బాగా ప్రసిద్ధి కెక్కింది.

చీరాలగ్రామం గుంటూరుజిల్లా కోస్తా ప్రాంతంలోనిది. అక్కడ జననమంది పేరుగాంచిన యోధానుయోధుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన మాంచి స్పురద్రూపి, సత్యసంధుడూ, విద్వాంసుడూ కూడాను. ఆయన ఎడింబరో విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం ముగించుకుని వచ్చిన తరువాత కొంతకాలం రాజమహేంద్రవరంలోని గవర్నమెంట్ ట్రెయినింగ్ కాలేజిలో ఆచార్యుడుగా ఉండేవాడు.

ఈయన చాలా స్వతంత్ర భావాలు గల వ్యక్తి. అచ్చటి ప్రిన్సిపాల్ ఆర్.డబ్ల్యు. రాస్ దొరగారు చూపించిన నిరంకుశత్వానికి నిరసనగా తమ ఆచార్య పదవికి స్వస్తిచెప్పి, బందరు జాతీయ కళాశాలలో కొంతకాలం అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత పదవీ పరిత్యాగం చేసి దేశమాత పిలుపును ఆకర్షించి, ఆమె సేవలో నిమగ్నుడయ్యాడు. చీరాల దూరతీరాలలోని ఇసుక పర్రలలో రామనగర గ్రామ నిర్మాణానికి పూనుకున్నాడు.

విచిత్ర యుద్దం

అసలు విషయం యేమిటంటే ఆ 1921 వ సంవత్సరంలో పానగలు రాజాగారి జస్టిస్‌పార్టి వర్గానికి, చీరాల ప్రజలకూ మధ్య పెద్ద యుద్ధమే ప్రారంభం అయింది. చీరాల-పేరాల పంచాయతీ యూనియన్‌ని పురపాలక సంఘంగా మార్చాలని మంత్రివర్గంవారి పట్టుదల. గోపాల కృష్ణయ్యగారి ఆధ్వర్య వాన దానిని పురపాలక సంఘంగా రూపొందించకుండా, ఎప్పటిలా యూనియన్ గానే ఉండనియ్యమని ప్రజలకోరిక. ప్రజల కోరికను మంత్రి మండలివారు మన్నించక పోవడంతో, ప్రజలకూ మంత్రివర్గం వారికీ మధ్య ఒక రకమయిన యుద్దమే ఆరంభం అయింది.

ఇది చాలా విచిత్రమయిన యుద్దం. ఆంధ్రరత్న ప్రజలందరినీ కూడ గట్టుకొని, చీరాల ప్రాంతాన్ని మునిసిపాలిటీగా రూపొందిస్తే, ఆగ్రామాన్ని పూర్తిగా విసర్జించి, వేరే తావులకు వలసగా వెడలి పోతామని తెలియజేశాడు. ఇది నిజంగా చాలా బ్రహ్మాండమయిన ప్రయత్నం. చీరాల-పేరాల ప్రజలు పదిహేడువేల మందికి పైగా ఉన్నారు. వారందరినీ ఒకే త్రాటిమీద నిలబెట్టి, వారిచేత తరతరాలుగా వారు వుంటూ వున్న ఇళ్ళనీ, వాకిళ్ళనీ విడిచి పెట్టించి, వారిని రామనగరు పరిసర ప్రాంతాలకు తీసుకొని పోవడం అంటే మాటలా?

చీరాల వాసులతోటీ, ఆంధ్రరత్నతోటీ నాకు మంచి ఐక్యతాభావం ఉంది. వారి కోరిక న్యాయమైనదేనన్న భావమూ నాకు ఏర్పడింది. ఆ ప్రాంతమంతా పురపాలక ప్రాంతంగా మార్చబడే పక్షంలో గ్రామీణులకు గోరంత లాభం చేకూరకపోయినా, కొండంత భారం, పన్నుల రూపేణా, నెత్తిన పడడం అన్నది ఖాయం. అటువంటి క్లిష్ట సమయం అది. అప్పట్లో చీరాల-పేరాల వాసులకూ, ఆంధ్రరత్నకూ ఇవ్వగలిగినంత చేయూత ఇచ్చాను. నేను లక్షలమీద సంపాదిస్తూన్న కారణంగానూ, బ్యాంకులలో నా ధనం మూలుగుతూన్న కారణంగానూ, నేను ఆ ఉదంత విజయానికి చాలావిరివిగా విరాళం ఇచ్చాను.

ఎర్ర చొక్కాల సేన

ఆంధ్రరత్న "రామదండు" అన్న పేరుమీద ఎర్ర చొక్కాల సేనని ప్రోగుచేశాడు. గాంధీ మహాత్ముడు యావత్తు భారత దేశాన్నీ ఉద్దరించాలని ప్రయత్నిస్తూ ఉన్న ఆ కాలంలో, ఆంధ్రరత్న చీరాల-పేరాల ప్రజల కోసం "రామదండు" స్థాపనతో ఒక విశ్వామిత్ర సృష్టే చేశాడు.

1921 లో గాంధీగారి అఖిల భారత సంచార కార్యక్రమం సందర్భంలో నేనూ వారితోపాటు చీరాల వెళ్ళాను. గాంధీగారు సహాయ నిరాకరణ ఉద్యమ ప్రథమ దినాలలో "కాంగ్రెస్ నోట్స్" అన్న పేరు మీద భారత దేశంలో కాంగ్రెసు కారణంగా జరిగిన సంఘటన లన్నింటినీ వివరించేవారు. ఆ పద్దతులమీదె ఆంధ్రరత్న "చీరాల-పేరాల నోట్స్"ను ప్రారంభించాడు.

బ్రాహ్మణత్వ ప్రదానం

ఆయన క్షుణ్ణంగా సంస్కృతం నేర్చినవాడూ, విద్యావేత్తా, పండితుడూ అవడం చేత హిందూమత సద్ధర్మాలనూ, మూల సూత్రా లనూ బాగా ఎరిగి ఉన్నవాడు. బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సామరస్యం చెడి, వారి మథ్య రాజుకుని ప్రజ్వరిల్లుతున్న భేద భావాభావాలనీ, వారి మధ్యనున్న అగాధాన్నీ అంతమొందించడానికి సులభోపాయంగా, బ్రాహ్మణేతరు లందరిచేత యజ్నోపవీతధారణ చేయించి, వారినీ బ్రాహ్మణులగానూ, వారితో సమానస్థాయిని అనుభవించే వారినిగానూ మారుస్తానని, వారి కందరికీ వలసిన జ్ఞానబోధచేసి బ్రాహ్మణత్వం ఇస్తాననీ ఒక క్రొత్త పథకాన్ని ప్రచారంలోనికి తీసుకువచ్చాడు. ఆయన కొంతకాలం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసాడు. ఆ హోదాలో భారత దేశమంతటా తిరిగే రోజులలో క్షయ రోగానికి గురి అయి, చాలా చిన్న వయస్సులోనే పరమపదించాడు.

అపూర్వ దృశ్యం

చీరాల-పేరాల ఉదంతం ఆప్రాంతానికే చెందిన సమస్యే అయినా, దాని చండ ప్రభావంవల్ల అది ముఖ్యమయిన రాష్ట్ర సమస్యగానూ, తర్వాత సాటిలేని మేటి ఉదంతంగానూ రూపొందడంచేత, అది యావత్తు భారతావని దృష్టినీ ఆకర్షించింది.

ఆ పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజులలో నేను చీరాల ప్రాంతానికి వెళ్ళాను. అచ్చట ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఆ గ్రామాలకు చెందిన యావత్తు జనమూ బీదాసాదా, ముసలీ ముక్కీ, బ్రాహ్మణ అబ్రహ్మాణాది విభేదాలు యీషణ్మాత్రమూ లేకుండా ఏకగ్రీవంగా, ఆ గ్రామాన్ని వదలి ఇతర ప్రాంతలలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆనందంగా బయల్దేరారు. బీదవారు తమకు చెందిన తట్టాబుట్టా తమ నెత్తిమీద పెట్టుకుని స్వయంగా మోస్తున్నారు. ఇంతకంటె ఆశ్చర్యకరమైన సంఘటన ఉంటుందా?

జస్టిస్ పార్టీవారి "జస్టిస్"

పదిహేడువేల ప్రజ, ఒక్కుమ్మడిగా, ఒక మాటగా కోరిన కోరికను న్యాయానికి పానుగలు మంత్రివర్గంవారు మన్నించి, వారిని ఇటువంటి ఇక్కట్లు పాలుగాకుండా చూచి ఉండవలసింది. కాని జస్టిస్ మంత్రివర్గంవారు చూపించిన జస్టిస్ అటువంటిది. వారు తమ పద్ధతి ప్రకారం చాలా క్రూరాతిక్రూరంగా ప్రవర్తించారు.

అశ్రుత పూర్వ పరిస్థితులలో, ప్రజలకూ పరిపాలకులకూ మధ్య, ఈ సంఘర్షణ ఇల్లా ఒకటి రెండు సంవత్సరాలపాటు సాగింది. ఆ తర్వాత పాలకుల పట్టుదలకే ప్రజలు తల ఒగ్గవలసి వచ్చింది. ఇది అనుశ్రుతంగా వస్తూవున్న హైందవ దుర్బలతా పరిణామం. ఇంకా కొంత కాలం యీ పోరాటం ప్రజలు సాగించగలిగి ఉంటే, ప్రభుత్వంవారు కాళ్ళబేరానికి దిగికుండా ఉండగలిగేవారు కారు. ప్రజలలో రవ్వంత ఆత్మశక్తి లోపించిన కారణంగా విజయం సాధించలేకపోయారు.

పాలకుల మొండిపట్టు

కాని చీరాల-పేరాల ఉదంతం మాత్రం గుంటూరు పన్నుల నిరాకరణ ఉద్యమంలాగే, హైందవ ఆత్మశక్తికి తార్కాణంగా నిలిచి పోయింది. జయం కనుచూపుమేర దూరంలో ఉంటూన్న సమయంలోనే, ప్రభుత్వంవారి బాధ్యతా రహితమైన మూర్ఖపు పట్టుదలవల్ల ప్రజలు ఇక్కట్ల పాలవడం తప్పలేదు. చీరాల-పేరాల యూనియన్ పరిపాలనను, స్వల్ప వ్యయంతో, ప్రజోపయోగకరంగా రూపొందిస్తామనీ, మునిసిపాలిటీగా మార్చని కారణంగా, ప్రజలకు ఏ విధమయిన కష్టనష్టములూ రానీయమనీ ఎన్ని విధాల హామీలు ఇచ్చి ఉన్నా, పరిపాలకులు వారి కోర్కెలను త్రోసిపుచ్చారన్నది పాలకుల పట్టుదలనీ, మూర్ఖతనే తెలియజేసింది.

తమకు ఉపయోగకరమైన విధంగా తమ పురపాలక విధానాన్ని సవరించుకుని, పాలన సాగిస్తామని అంటే, ఆ ఉత్తమమైన కోర్కెను మన్నించడం తమ ప్రాథమిక కర్తవ్యమైనా పానగలు ప్రభుత్వంవారు పట్టుదలే ప్రధానంగా పెట్టుకుని, ప్రజలను ఇక్కట్ల పాలుచేయడ మన్నది మరవడానికి వీలులేని విపరీత సంఘటన. ఈ విషయంలో ప్రభుత్వంవారి మూర్ఖతే బయటపడింది.