నా జీవిత యాత్ర-2/మాప్లా తిరుగుబాటు: నా రిపోర్టు

వికీసోర్స్ నుండి

7

మాప్లా తిరుగుబాటు:నా రిపోర్టు

మలబారుకు సంబంధించిన ఇంకో ముఖ్యమయిన ఉదంతం 1921 నాటి మాప్లా తిరుగుబాటు. ఒట్ట పాలియం సమావేశ సందర్భంలో హిచ్‌కాక్‌ను గురించీ, ఆయన విధానాలను గురించీ ఉద్ఘాటించి ఉన్నాను. నిజానికి ఒట్టపాలియం సమావేశం జరిగిన రోజులలోనే మాప్లా తిరుగుబాటు జరిగి ఉండవలసింది. కాని అప్పట్లో మేమందరమూ కలిసి కట్టుగా అవలంబించిన పద్దతులూ, తీసుకున్న అవశ్యక చర్యలూ, జాగ్రత్తలూ మున్నగునవన్నీ ఆనాటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడ్డాయి. అ కారణంచేత అప్పట్లో ఏవిధమయిన అల్లర్లూ ఉత్పన్నం కాకుండా చూడగలిగాము.

కొంతకాలం తర్వాత కాంగ్రెస్, ఖిలాఫత్ ఉద్యమ ప్రచారాలు ముమ్మరమయి హిందువుల, మహమ్మదీయుల దృష్టిని ఆకట్టే సమయంలో, ఎల్లాగయినా ఈ ఉద్యమాలను త్రోసి రాజనాలనే ఉద్దేశం హిచ్ కాక్ బుర్రలో ప్రవేశించింది. ఈ ఆలోచనలో హిచ్ కాక్ తీసుకున్న ప్రప్రథమ సత్వర చర్య 144 వ సెక్షను ప్రకారం ఆంక్షలు విధించడం. కీర్తిశేషులయిన మౌలానా యాకుబ్ హుస్సేన్, కె.మాధవన్‌నాయర్ల కూ, ఇంకొక ప్రఖ్యాత న్యాయవాది గోపాలన్ మేనోన్‌కూ, మొహిద్దీన్ కోయాకు ఆ 144 వ సెక్షన్ కింద విధింపబడ్డ ఆంక్ష ప్రకారం, వారు మలయాళ దేశమందలి ఇతర ప్రాంతాలకు వెళ్ళరాదంటూ ఆర్డర్లు జారీచేశాడు. వారు నలుగురూ కూడా ఆ ఆంక్షను ఉల్లంఘించి, తలో ఆరుమాసాల జైలు శిక్షకు లోనవడమూ జరిగింది. ఈ నిర్బంధాలూ, శిక్షలూ అన్నవి మలబారులోని కాంగ్రెస్ ఉద్యమానికి దోహదాన్ని ఇచ్చాయి.

నాకూ, మలబారుకూ ఉన్న సంబంధాలు కాలం గడచిన కొద్దీ ఇంకా ఇంకా సన్నిహితం అయ్యాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ 1921-22 సంవత్సరాలలో నేను మలబారులో ఏ ఏతావులలో, ఏయే సభలలో పాల్గొని ఉపన్యసించానో చెప్పడం దుర్లభమే,

డిక్షను లేదంటూ వాదించిన నా విధానమూ, తన్ను తాను డిపెండ్ చేసుకుంటూ క్రింది కోర్టులో సుబ్బరామయ్య తీసుకువచ్చిన తికమకలూ, హైకోర్టులో తీసుకురాబడ్డ అబద్ధపు అడ్డంకులూ, మున్నగువన్నీ హిచ్‌కాక్‌కు బాగా అవగాహన అయిఉండాలి. క్రిందికోర్టులోనూ, హైకోర్టులోనూ తన పక్షాన్నే ఇవ్వబడిన తీర్పూ, నాజ్యూరిస్ డీక్షన్ అభ్యంతరమూ గమనించకుండా, నాపైన డిక్రి అమలుపరచడానికి హిచ్‌కాక్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. డిక్రీ హోల్డరు తన చేతులతోనే డిక్రీని చంపుకున్నాడన్నమాట. సుబ్బరామయ్యమీద డిక్రీ అమలు జరిగిందో లేదో, దాని గతి యేమయిందో తెలుసుకోవడానికి నేనెప్పుడూ ప్రయత్నించలేదు. ఏదో అయిఉంటుంది, ఏమయితే మన కెందుకు అనే భావమే ఆ డిక్రీ విషయంలో నాకు కలిగింది. ఏది ఏమయినా జీవితంలో ఇది ఒక మంచి అనుభవం

సహాయనిరాకరణ ఉధ్యమ ప్రారంభదశలో గాంధీగా రిచ్చిన ఒక ఉపన్యాసంలో, పై ఉదంతాన్ని పేర్కొంటూ, అ సందర్భంలో ఆయన, నాకు, సలహారూపంగా సివిలు కోర్టులలో పెట్ట తగ్గ వాదనావిధానాన్ని సూచించానని చెప్పారు. అంటే ఈ కోర్టులలో నాకు నమ్మకం లేదు. ఈ కేసు విచారించడానికి ఈ కోర్టువారికి హక్కు లేదు మున్నగు నినాదాలన్నమాట! ఆ సందర్భంలో ఆయన త్రివిధ బహిష్కరణ అంటే యేమిటో చెబుతూ, సహాయ నిరాకరణ వాదులపై ఏవేని కేసులు కోర్టులలో మోపబడినప్పుడు, కాంగ్రెసువారు అవలంబింప వలసిన విధానానికి ఉదాహరణగా, ఆనాటి కేసూ, తానిచ్చిన సలహా ఆ సందర్భంలో ఉటకించారన్నమాట! ఈ ఉదంతాన్ని గాంధీగారు తమ ఉపన్యాసంలో చెపుతూన్న సందర్భంలో నా ప్రక్కనే నిలిచిఉన్న వల్లభాయ్ పటేల్‌గారు, "ఏమిటి నిన్నుగురించి అంటున్నారు" అంటూ అతి మెల్లిగా, రహస్యంగా అడిగారు. ఇట్టి ఉదంతాల కారణంగానే గాంధీగారికి సన్నిహితుడ నవడమూ, 1922 లో ఆయన అరెస్టయి నిర్బంధింపబడే వరకూ ఆయన్ని వెన్నంటి ఉండడమూ సంభవించాయి. (ఈ పేజీ వ్రాయబడి ఉన్నది) కాని ఆ సమావేశాలలో వందలూ వేలుగా మాప్లాలు పాల్గొనేవారని మాత్రం కచ్చితంగా చెప్పగలరు. ఆ రోజులలో కాంగ్రెసు-ఖిలాఫత్ ఉద్యమాల మూలంగా, దినదినాభివృద్ది గాంచుతూన్న హిందూ-మహమ్మదీయ సామరస్యం వలన అత్యల్పకాలంలోనే మనకు స్వరాజ్యం సిద్దిస్తుందని మాత్రం మనస్ఫూర్తిగానూ, త్రికరణ శుద్ధిగానూ నమ్మాను.

దక్షిణ హిందూ దేశానికి సంబంధించి నంతవరకూ మలబారే ముఖ్యమయిన మహమ్మదీయ కేంద్రం. అక్కడ అతి విస్తారంగా మహమ్మదీయులున్నారు. హిందూ-మహమ్మదీయ సామరస్య సాధన కృషికి 1921-22 లో ఉత్తర హిందూస్థానంలో గట్టి దెబ్బ తగలకుండా ఉండి ఉంటేనూ, 1917 లో మాంటేగారికి సమర్పించిన, కాంగ్రెస్-లీగ్ ప్రతిపాదనలతో మహమ్మదీయులు సంతుష్టి చెంది ఉంటేనూ, ఈ దేశం డొమినియన్ స్టేటస్‌గాని, పూర్ణస్వాతంత్ర్యాన్నిగాని యేనాడో పొంది ఉండేది. ఈ సందర్బంలో మలబారులో హిందూ-మహమ్మదీయ సామరస్య సాధన యత్నాలు ఏలా విచ్చిన్నం అయ్యాయో కాస్తంత విస్తరిస్తాను.

ప్రాణాలకు తెగించిన పర్యటన

మలయాళ దేశంతోటీ, దేశీయులతోటీ నాకు మొదటినుంచీ సన్నిహిత సంబంధం ఉండడంచేత, ఈ మాప్లా తిరుగుబాటుకు సంబంధించిన కారణాలన్నీ సమగ్రంగా పరిశీలించాలనే ఉద్దేశంతో నే నా ప్రాంతం అంతా ఆ రోజులలో పర్యటించి ఉన్నాను. ఆ పర్యటించిన ప్రాంతాలలో మిలిటరీ హయాంలో ఉన్న ప్రాంతం కూడా ఉంది. మాప్లా తిరుగుబాటు ఇంకా అప్పటికి ఆరంభ దశలోనే ఉంది. ఆరంభం అయిందనే తొలి వార్త అందగానే తిన్నగా కాలికట్ పట్టణానికి వెళ్ళాలనే ఉద్దేశం కలిగింది. "స్వరాజ్య" పత్రికా స్థాపనలో నాకు చాలా సన్నిహితుడుగా ఉన్న టి.వి.వెంకట్రామయ్యర్ నాతోపాటు యీ పర్యటనలో పాల్గొనడానికి నన్ను అనుసరించాడు. అప్పట్లో తంజావూరులో మౌలానా యాకుబ్ హుస్సేన్‌గారి ఆధిపత్యాన, తమిళనాడు ప్రాంతానికి చెందిన రాష్ట్రీయ కాంగ్రెసు సమావేశం జరుగుతోంది. వెంక ట్రామయ్యరూ, నేనూ తిన్నగా తంజావూరువెళ్ళి, యాకుబ్ హుస్సేన్‌ని కలుసుకొని, మలబారులో ప్రారంభం అయిన మాప్లా తిరుగుబాటును గురించి చర్చించాము. వారూ మాతోబాటు ఉంటే మంచిదని సూచించాము. తాను యీ కాంగ్రెస్ సమావేశంలో ఇరుక్కున్న కారణంగా మాతో కలిసి ఆ ప్రాంతాలకు రాలేననీ, మమ్మల్నిద్దరనీ తప్పకుండా వెళ్ళి సంగతి సందర్భాలు గమనించమని ఆయన ప్రోత్సహించారు.

సైనిక శాసనం

మా కెవ్వరికీ మలబారులో ఉన్న పరిస్థితులుగాని, మార్షల్ లా అమలు పరచబడిన ప్రాంతం ఎల్లా ఉంటుందనిగాని యేమాత్రమూ తెలియదు. సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతం ఎల్లా వుంటుందో ఊహించడానికయినా నాకు పూర్వానుభవం ఏమీలేదు. తంజావూరు నుండి తిన్నగా కాలికట్టుకు టిక్కట్లు తీసుకున్నాము. షోరనూరు చేరే వరకూ మాకు ఏ విధమయిన అడ్డంకులూ లేకుండా ప్రయాణం చాలా సాఫీగానే సాగింది. మేము కాంగ్రెసుకు సంబంధించిన వ్యక్తులమన్న కారణంగా ఆ ప్రాంతంలలో అడుగు పెట్టడానికి వీలులేదనీ, వెంటనే వెనక్కు వెళ్ళమనీ మమ్మల్ని ఒక మిలిటరీ అధికారి ఆజ్ఞాపించాడు. మా కష్టాలకు ఆ ఆజ్ఞ నాంది అయిందన్నమాట.

షోరనూరు స్టేషనులోని మొదటి తరగతి విశ్రాంతి గదిలో కూడా మమ్మల్ని కూర్చోనివ్వలేదు. మిత్రులు కొందరు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. మేము స్టేషన్ ఆవరణ దాటి ఊళ్ళో ఉన్న ఒక ధర్మశాలలో ప్రవేశించాము. ఆ రాత్రికి అక్కడ ఉండి, పరిస్థితులు గమనించి, అవలంబించ వలసిన విధానం నిర్ణయించుకోవాలని మాకోరిక. కాని మిలిటరీ అధికారులు మమ్మల్ని వెన్నంటే ఉన్నారు. మేమొక సత్రంలో మకాం చేశామన్న సంగతి గ్రహించి, వారు ఆ సత్రం అధికార్ల దగ్గరకు వెళ్ళి, ఆ సత్రపు పరిసరాలలో కూడా మేము ఉండటానికి వీలులేదనీ, వెంటనే ఖాళీచేసి బయటికి వెళ్ళిపోవాలనీ మాకు నోటీసు ఇవ్వవలసిందిగా వారికి ఆజ్ఞాపించారు. ఆ వూళ్ళో మాకు కావలసిన కాంగ్రెసు మిత్రులూ, అభిమానులూ ఉన్నా, మార్షల్ లా పేరుమీద మిలటరీవారు అమలు పరుస్తూ ఉన్న ఉద్ధత విధానాలకు జడిసి, వారు మాకు నిలవనీడకూడా యివ్వడానికి నిరాకరించారు.

షోరనూరులో కాంగ్రెసువారికి ప్రత్యేక స్థావర మనేది ఏదీ లేదు. కాస్త సమీపంలో ఉన్న ఒట్టపాలియంలో మాత్రం కాంగ్రెసు వారు తమ కార్యాక్రమాలు సాగించడానికి వారి అధీనంలో ఒక యిల్లు ఉంది. మేము ఇరువురమూ ఎల్లాగో తంటాలుపడి పరిచయస్థుల సహాయంతో ఒట్టపాలియంజేరి, అక్కడవున్న "కాంగ్రెస్ హౌస్"లో విశ్రమించాము.

అగంతకునితో గడిపిన రాత్రి

అదే సమయంలో పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం సివారు మత్సపురి నివాసి, గుడిమెట్ల ఆచారి అనే యువకుడు ఏలాగో తంటాలు పడి ఒట్టపాలియంలోని యీ ప్రాంతానికి రాగలిగాడు. మిలిటరీ ప్రాంతంగా నిర్ణయింపబడకపోయినా ఒట్ట పాలియంలో కూడా కాంగ్రెసువారిని అనేక బాధలకు గురిజేశారు. పోలీసువారి చేతులలో బాగా దెబ్బలుతిని ఎల్లాగో తప్పించుకు వచ్చి అతడు ఆత్మరక్షణ కోసం ఈ "కాంగ్రెస్ హౌస్"లో దూరాడు, మేము ఉభయులమూ, అచ్చటి కాంగ్రెసువారూ కూడా ఆ యువకుడు సి.ఐ.డి.పెద్దలలో ఒకడయి ఉండవచ్చుననీ పోలీసువారు చితిగ్గొట్టారనే సాకుతో కాంగ్రెసు ఆఫీసులో దూరాడనీ అనుకున్నాము. నన్ను నమ్మించాలని అతడు ఎంతగా ప్రయత్నించినా, అతని పలుకులు విశ్వసించలేకపోయాను. కాని అదే రోజున మిలిటరీవారి చేతులలో మేము అనుభవించిన ఇక్కట్ల దృష్ట్యా అతణ్ణి వెళ్ళగొట్టలేకపోయాము.

ఆ రాత్రి అతను అక్కడే పడుకుంటానని కోరితే కాదనలేక పోయాము. అవలంభించ తగ్గ విధానానికి మేము ఆ రాత్రి ఒక పంథా వేసుకోవాలని అనుకున్నాము కాని అతడు సి.ఐ.డి. యేమోననే కారణంగా, మా సంప్రతింపులూ, తర్జన భర్జనలూ మరునాటి ఉదయానికి వాయిదా వేసుకున్నాము. మే ఒట్ట పాలియం చేరేసరికి, వెంకట్రామయ్యర్ని వెంటనే పట్నం రావలసినదని కోరుతూ, అతని భార్య

దగ్గరనుంచీ, కుమారుని వద్దనుంచీ కూడా మూడు టెలిగ్రాములు వచ్చాయి. కాని ఇంకా కొంతకాలం నాతో ఉండి, పరస్పరం సహకరించుకుందామనే అభిప్రాయం వెంకట్రామయ్యరు వెళ్ళడించాడు.

తిరుగుబాటు పరిస్థినీ, మిలిటరీ చర్యలనూ బాగా ఆకళించుకుని ఉన్న ఆ ప్రాంతీయులు, మోటార్లు మున్నగునవి యేవీ రోడ్లమీద నడవడానికి వీలుకాని పరిస్థితిని కలుగజేయడానికి అవలంబించిన విధానాన్ని గ్రహించి, మేము ఒట్ట పాలియంనుంచి కాలికట్టుకు కాలినడకనే జేరాలని నిశ్చయించుకున్నాము. ఆ రోడ్డుదారిని కాలికట్టూ, ఒట్టపాలియం గ్రామాల మధ్య దూరం అరవై మైళ్లు.

మేము ఉభయులమూ మరుసటి ఉదయాన్నే బయల్దేరాము. మాకు అచ్చటి విషమ పరిస్థితులు తెలియవు. కాలి నడకనే ఆ అరవది మైళ్ళు ప్రయాణం చెయాలంటే కలిగే ఇబ్బందులూ, ఆటంకా లేవీ మాకు తెలియవు.

అల్లా బయల్దేరి ఒక అయిదు మైళ్ళు వెళ్ళేసరికి మాకు ఆ దారిని నడచి వెళ్ళడంలో ఎంత కష్టమున్నదో బోధపడింది. మాప్లాలలో చాలమంది మిలిటరీలో పనిచేసి రిటైరయినవా రున్నారు. వారు లోగడ యుద్ధాలలో విదేశాలలో కూడా పనిచేసి ఉండడంవల్ల వారికి మిలిటరీ విధానాలు కొన్ని తెలుసు. అందువల్ల వారు మున్ముందుగా రోడ్డు కిరుప్రక్కలా వుండే బాగా ఎదిగిన చెట్లనన్నింటినీ నరికి, వాటిని దారికి అడ్డంగా, అడ్డదిడ్డంగా పడేశారు. ఆ అరవై మైళ్ళ పొడుగునా చెట్లన్ని నరకబడి దారికి అల్లా అడ్డంగా పడవేయబడే ఉన్నాయి. ఆ దార్లన్నీ యే విధమయిన బళ్ళూ నడవడానికి వీలులేని పరిస్థితిలో ఉన్నాయి. అట్టి పరిస్థితులలో సాయంత్రం దాకా నడచినా ఇరవై మైళ్ళయినా వెళ్ళలేకపోయాం

చెర్పల్ చేరీలో

మేము "చెర్పల్‌చేరీ" గ్రామం చేరేసరికి సూర్యాస్తమయం అయింది. ఉభయులమూ ఖద్దరు దుస్తులలోనే ఉన్నాము. దారిలో తటస్థ పడిన వారందరూ మమ్మల్ని ముందుకు వెళ్ళకుండా ఆ రాత్రికి అక్కడే

విశ్రాంతి తీసుకోమని సలహా యిచ్చారు. గస్తీలోవున్న మిలిటరీ వారికీ మాకూ సంఘర్షణ జరుగవచ్చునని కూడా మమ్మల్ని హెచ్చరించారు.

మెయిన్ రోడ్డువదలి, ప్రక్కగా, రెండు మూడు పర్లాంగుల దూరంలో ఉన్న "చెర్పల్‌చేరీ" గ్రామం, నిజంగా, మేము అదృష్టవశాత్తే చేరామని భావించవలసి ఉంటుంది. మెయిన్ రోడ్డువదలి ప్రక్కనున్న బండిబాటని మేము నడక ప్రారంభించిన కొద్ది సేపట్లోనే గుర్రాలమీద వచ్చిన మిలిటరీవారు ఆప్రాంతం అంతా గాలించారనీ, నిజంగా మేమే గనుక మా ఖద్దరు దుస్తులతో వారి కంటబడి ఉంటే తక్షణమే మమ్మల్ని కాల్చేసేవారనీ, మా వెనకాలే ఆ గ్రామానికి వచ్చిన వారు చెప్పారు. ఆ రాత్రికి మేము అక్కడే విశ్రమించాం.

తెల్లవారేసరికి వెంకట్రామయ్యరు తాను మద్రాసు వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నాననీ, అందువలన నాతోబాటు యింక ముందుకు సాగలేననీ కచ్చితంగా చెప్పేశాడు. ఆయన నాకంటె వయస్సులో పెద్దవాడు. విద్రోహ చర్యలుగా దారిలో ఏర్పడిన అడ్డంకుల నన్నింటినీ అధిగమించి ఆ వయస్సులో ఆ యాత్ర ముగించలేనని ఆయన వ్యక్తపరిచాడు. ఆయన వెనక్కి వెళ్ళడానికి నేను అంగీకరించాను. ఇద్దరు మిత్రుల సాయంతో ఆ సాయంత్రానికి ఒట్ట పాలియం జేరుకుని, ఆయన రాత్రి బండికి పట్నం వెళ్ళిపోయాడు.

ఏమయినా సరే మేము మీతో వచ్చి తీర్తాము అంటూ బయల్దేరిన నలుగురు మిత్రులతో నేను చెర్పల్‌చేరీ గ్రామం నుండి కాలికట్టుకు బయల్దేరాను. దారి పొడుగునా రోడ్డంతా ఒకే మాదిరిగా ఉంది. రెండవరోజు సాయంత్రానికి యింకో యిరవై మైళ్ళు నడవ గలిగాము. మూడవనాటి సాయంత్రానికిగాని నేను కాలికట్టు చేరలేకపోయాను.

భయోత్పాత పరిస్థితులు

ఉద్రేక పూరిత పరిస్థితులలో ఉన్న కాంగ్రెసు మిత్రులు నన్ను ఆహ్వానించారు. విప్లవ ప్రాంతంలోని ముఖ్య కాంగ్రెసు నాయకులందరినీ పోలీసువారు అరెస్టు చేశారు. విప్లవ ప్రాంతంలో పర్యటించిన బార్ యట్ లా కే.పి.కేశవమేనోన్ అప్పుడే తిరిగి వచ్చాడు. ఒక ప్రక్క మాప్లాలూ, రెండవ ప్రక్క పోలీసు మిలిటరీ అధికారులు కలుగిస్తూన్న భయోత్పాతం గురించి వివరించాడు. అసలు విప్లవం అతి స్వల్పకారణం మీదనే ఆరంభం అయిందనీ, ఆరంభంలో అంత ఉద్రుతంగా లేకపోయినా, వారం రోజులలోపలే మాప్లాలు అటు ఇంగ్లీషువారినీ, ఇటు కాంగ్రెసు వారినీ కూడా తమ శత్రువులుగా బావింపడంతో విప్లవం తారాస్థాయిని అందుకుందనీ తెలియవచ్చింది.

అప్పటివరకూ అతికష్టంమీద నిర్మాణమయిన హిందూ-మహమ్మదీయ సమైక్య సౌధం తునాతునకలయింది. మాప్లాలు ఇంగ్లీషు వారినీ, హిందువులనూ హింసించి తీరాలనే దృఢసంకల్పంతో ఉన్నారు. ఆ ప్రాంతం అంతటా మార్షల్ లా అమలు పరచబడింది. వెనువెంటనే విచారణ జరపడానికి గాను మిలిటరీ కోర్టులు తెరవబడ్డాయి. సాధారణంగా మరణ శిక్షే విధించేవారు.

అలీ ముసలియార్ అనే ఒక మాప్లానాయకుడు తన స్వతంత్ర పతాకం ఎగుర వేశాడు. ఒక వారం రోజులపాటు సివిలు, క్రిమినలు వ్యవహారులలో సర్వస్వతంత్రంగా వ్యవహరించాడు, ఆయన కూడా మరణ శిక్షలూ, ఆస్తి జప్తులూ విధించేవాడు.

మార్షల్ లా ప్రకటింపబడి నప్పటికీ, బ్రిటీషు ఆఫీసర్లూ, వారి కుటుంబాలూ ఏ క్షణాన ఎటువంటి ఇక్కట్లకు లోనవుతామోననే భీతితోనే ప్రాణాలు బిగపట్టుకుని క్షణాలను యుగాలుగా గడిసే పరిస్థితిలో ఉన్నారు. ఇంగ్లీషువారు ఏ మాప్లా అయినా ఎదురయితే వెంటనే వాని కుత్తుక కత్తరించి చంపేసేవారు.

ఒకొక్కప్పుడు మాప్లా యువకులు జరిపిన చర్యలు చాలా ఘోరంగానూ, అమానుషంగానూ ఉండేవి. ఒక చిన్న మాప్లా కుర్రవాడు చేతిలో కత్తిపట్టుకుని నడుస్తూ ఉన్న బస్సులోకి ఉరికి ఒక ప్రయాణీకుణ్ణి అప్పటి కప్పుడు చంపివేశాడు. డ్యూటీలో ఉన్న మిలిటరీ ఆఫీసరు జాక్సన్‌ని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. అడ్వకేట్ అయిన యం.పి. నారాయణమేనోన్, దెబ్బలాట ముమ్మరంగా సాగుతూన్న ఒక సందర్భంలో, అమాయిక ప్రజల్ని రక్షించాలని చేసిన ప్రయత్నానికి ప్రతి ఫలంగా మిలిటరీ కోర్టువారు ఆయన్ని అరెస్టుచేసి, ద్వీపాంతరవాస శిక్ష విధించారు.

హైకోర్టులో నా దగ్గిర జూనియర్‌గా పనిచేసిన శ్రీ కే.సి.కేశవమేనోన్ తన ప్రాణానికి తెగించి యెంతో సేవచేశాడు. అదృష్టవశాత్తూ ఆయన్ని అరెస్టు చేయలేదు. నేను కాలికట్టు చేరిన మూడోనాటికి కేశవమేనోన్ అక్కడికి వచ్చాడు. జరుగుతూన్న సంఘటనలను గురించి ఆయన వ్రాసిన ఒక రిపోర్టు టైపు కాగితాలు నా కిచ్చాడు. నారాయణమేనోన్ అరెస్టయిన కారణంగా ఆయన్ని నేను కలుసుకోలేక పోయాను.

చాలామంది కాంగ్రెసువారు ఒక ప్రక్క మాప్లాల చేతులలోను, ఇంకొక ప్రక్క మిలిటరీవారి చేతులలోనూ ఎన్నో యిక్కట్లకు పాల్పడ్డారు. కాంగ్రెసుతో సంబంధం ఉన్నా లేకపోయినా అనేక హిందూ కుటుంబాలవారు, ఆ విప్లవ ప్రాంతంనుంచి ప్రాణాలకు తెగించి సకుటుంబంగా పలాయనం చిత్తగించారు.

అపూర్వ సంఘటన

ఈ పరిస్థితులలో కొన్ని వింత సంఘటనలు జరిగేవి. ఒక హిందువు మాప్లా వేషంతో ప్రాణాలని కాపాడుకో గలిగాడు. ఆయన ఒక లక్షాదికారి. ఒక మాప్లా గుంపు ఆయన ఇంటిమీద దాడిచేసింది. మాప్లా వేషంలో ఉన్న ఆ అసామి, యజమాను లందరూ పారిపోయారని, తాను ఆ యింటి నౌకర్ననీ, దాడి చెయ్యడానికి వచ్చిన ఆ గుంపుతో విన్నవించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. కాని ఆయన్ని మిలిటరీ కోర్టువారు పట్టుకొని అరెస్టుచేసి మరణ దండన విధించారు. ఆయన మిలిటరీ వారితో తన మాప్లా నామాన్నే చెప్పాడు. ఆయన్ని మాప్లాగానే అరెస్టు చేశారు. మాప్లాగానే విచారించారు. మాప్లాగానే ఆయనకి మరణశిక్ష విధించారు. శిక్ష విధింపబడిన వెంటనే ఆయన ఈ కోర్టులలో న్యాయం జరగడం లేదనీ, తానూ మాప్లా కాదనీ, స్వప్రాణ రక్షాణార్థం మాప్లా వేషం వేసుకోవలసి వచ్చిందని గట్టిగా అరిచాడు. జడ్జీ ఆశ్చర్య చకితుడయ్యాడు. ఆచార ప్రకారం వెంటనే అమలు జరుపబడే మరణ శిక్షను ఆపుచేశారు. ఆయన నిజంగా హిందువే అనే విషయం తేల్చుకోవడానికి విచారణ ఆరంభించారు. నిజం బయట పడ్డాక తాము విధించిన శిక్షను రద్దుపరచి ఆయన్ని విడుదల చేశారు.

ఇది ఒక అపూర్వ సంఘటనే అయినప్పటికీ, మార్షల్ లా ప్రాంతంలో , ధనానికి, ప్రాణానికీ ఎటువంటి రక్షణ ఉంటుందో, వాటిని కాపాడుకోవడం ఎంత కష్టమో అర్థం అవుతుంది. అవి భయోత్పాతం స్వైర విహారం చేసిన గడ్డు దినాలు

మూల కారణం

నా విచారణ సందర్బంలో అసలు ఈ విప్లవానికి మూలకారణం ఏమయి ఉంటుందని పరిశీలించాను. డి.యస్.పి. హిచ్‌కాక్‌తో ఏకీభవించిన ప్రభుత్వోద్యోగులంతా ఈ తిరుగుబాటుకు కారణం కాంగ్రెస్ ఖిలాఫత్ సంఘాలవారి చర్యలేనని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు. లోగడ ఒట్ట పాలియం సమావేశ సందర్భంలో, హిచ్ కాక్ అవలంబించిన విధానమూ, మా పై ఆయన వేసిన పరువు నష్టం దావా సంగతీ, యాకుబ్ హుస్సేన్ యం. కోయా, మాధవన్‌నాయరు, గోపాలన్ మేనోంగార్ల పై ఆయన విధించిన ఆంక్ష, ఆ 144 వ సెక్షను ఉల్లంఘించిన కారణంగా వారికి విధింపబడిన శిక్షా మున్నగు అంశాలన్ని లోగడ వివరించే ఉన్నాను.

ఇటువంటి పరిస్థితులలో ఆంగ్లేయాధికార్లు, కాంగ్రెస్, ఖిలాఫత్ సంఘాలవారి కార్యక్రమాల కారణంగానే ఈ మాప్లా సంరంభం ఆరంభం అయిందని నమ్మడంలో ఆశ్చర్యం ఏమీలేదు. 1922లో జరిగిన ముల్తాన్ విప్లవ సందర్భంలోనూ, ఇప్పుడూ కూడా సత్యానికీ, అధికార్లచే ప్రచారం చేయబడ్డ కారణాలకూ ఎక్కడా సంబంధం లేదు.

నా విచారణలో రికార్డయిన అంశాలనుబట్టి, హిందూ జమీందార్లకూ, మాప్లా రైతాంగానికి మధ్య కొన్ని తగాయిదాలు ఉత్పన్నం అయ్యాయన్న సంగతి తేలింది. మాప్లాల జీవనోపాది పొలాలమీదనే ఆధారపడి ఉంది. వారు రహితులుగానూ, పాలేర్లగానూ, బ్రతికేవారు. అప్పట్లో నేను సేకరించిన సమాచారాన్నిబట్టి తేలిన అంశం ఏమిటంటే,

నిలంబూరు ఎస్టేటు ప్రాంతంలో పాలేరుగా ఒక ఇంట పనిచేస్తున్న ఒక మాప్లా యువకుడు దొంగతనం చేశాడనే అనుమానంపై శిక్షింపబడ్డాడు. ఆ మారుమూల గ్రామంలో జరిగిన యీ చిన్న సంఘటనతో ఆరంభం అయిన గలాటా 1921 నాటి మాప్లా తిరుగుబాటుకు కారణం అని కొందరి ఊహా.

మాప్లాలకు సంబందించి నంతవరకూ ఏ చిన్ని సంఘటన అయినా రాజుకుందంటే ఖాండవ దహనమే. వారి సంఘీభావమూ, కట్టుబాట్లు, మూర్ఖత, పట్టుదలా అల్లాంటివి. సాధారణంగా ఎవ్వరూ ఇటువంటి సంఘటనలనీ, తిరుగుబాట్లనీ పట్టించుకోరు. అందులో కాంగ్రెసు వారా కలుగజేసుకునేది? అయినా ఏదో ఒక చిన్న గృహకలహం లాంటి పరిస్థితులలోనా? కాని, నేను లోగడ వివరించినట్లు, ఆ రాష్ట్రంలోని కాంగ్రెసువారి శక్తి సామర్థ్యాలు విదితమేకదా. అందువల్ల రాష్ట్రీయ కాంగ్రెసు సంఘంవారు శాంతిని నెలకొల్పడానికి సత్వర చర్యలు తీసుకోకుండా ఎల్లా ఉండగలరు? కాంగ్రెసు కార్యనిర్వాహక సంఘ సభ్యుడనైన నేను, నాప్రాణానికి తెగించయినా, ఆ ప్రాంతంలో ఉరికి చేయగలిగిన సేవకు సంసిద్ధుణ్ణి కావడం నావిదే గదా? నా విచారణ ముగిసిన తర్వాత క్లుప్తంగా రిపోర్టు వ్రాసి కలకత్తా క్యాంపులో ఉన్న మహాత్మ గాంధీగారికి పంపించాను. అదే ఆ 1921 నాటి మాప్లా తిరుగుబాటు చరిత్ర.

తర్వాత కాంగ్రెసువారు బాదితుల సహాయార్థం ఎనభయివేల రూపాయలు మంజూరు చేయడమూ, అచ్చటి పరిస్థితులు సమగ్రంగా విచారించి నివేదించడానికిగాను ఒక సంఘాన్ని నియమించడమూ జరిగింది. హిందూ-మహమ్మదీయ సమైక్య సాధనకు ఎంతో ఉత్సాహంతోనూ, ఎన్నో ఆశలతోనూ ఆరంభింపబడిన కృషి మలబారులో జరిగిన యీ విప్లవం కారణంగా దక్షణాదిని కూడా దెబ్బతింది.

హిందూస్తాన్ సేవాదళం: సాంబమూర్తి నాయకత్వం

నాగపూరు కాంగ్రెసులో కాంగ్రెసు నియమావళితో పాటు జాతీయ స్వయం సేవక దళానికి కావలసిన నియమావళిని కూడా రూపొందించాం. కాంగ్రెసులో ప్యాసయిన తీర్మానాను సారం నిర్ణీతమయిన 21 భాషా రాష్ట్రాలలోనూ, కాంగ్రెసు ఖిలాఫత్, స్వయం సేవక దళాలు ఏర్పడడమూ, జాతీయ స్వయం సేవక దళం ఆవిర్భవించడమూ జరిగింది. అల్లా ఆరంభింపబడ్డ జాతీయ స్వయం సేవక దళం హిందూస్తాన్ సేవా దళ నామాన్ని స్వీకరించి, కొద్ది దినాలలోనే బ్రహ్మాండమయిన సంస్థగా రూపొందింది.

ఈ హిందూస్తాన్ సేవా దళం వారిచే శిక్షణ గరపబడుతూన్న వేలాది స్వయం సేవకులను చూడడం చాలా ముచ్చట గొలిపేది. ఈ సేవా దళం దేశీయ శాంతి దళ స్థాపనకి ప్రాతిపదిక అయింది. ఇది దినదినాభివృద్ది చెంది కాంగ్రెసు జరుగుతూన్న ప్రతి ప్రాంతంలోనూ ఎంతో సేవ జేసింది. కాని కొన్ని దుష్టగ్రహ కూటాలవల్ల ఈ సేవా దళం మూలపడి విచ్చిన్నం అయింది.

ఈ హిందూస్తాన్ సేవా దళానికి బులుసు సాంబమూర్తిగారు కొంతకాలం ఆధ్వర్యవం వహించారు.

ఏవో దుష్టఘడియలలో అనాలోచితంగా ఆ దళాన్ని విచ్చిన్నం చేసి ఉండకపోతే, 1922 లగాయితు నిత్య సంఘటనలుగా పరిణమించిన హిందూ-మహమ్మదీయ సంఘర్షణల సందర్భంలో అ దళంవారు అయా ప్రదేశాలలో ఉరికి, శాంతిస్థాపనాది కార్యక్రమాలలో ఎంతయినా ఉపయోగపడి ఉండేవారు.

కాగా, మిలిటరీలో చేరే సోల్జర్లూ, సిపాయీలూ, ఆఫీసర్లు వగైరా అందరూ ఏ ప్రకారంగా దేశ రక్షణాది విషయాలలో ఆత్మత్యాగానికి సర్వత్రా సిద్దం అనే ప్రమాణాన్ని తీసుకుంటారో అల్లాగే శాంతి భద్రతలను కాపాడడం కోసం శాంతియుతంగా, అహింసాత్మక పద్దతుల ప్రకారం మానవసేవ, దేశసేవా చేస్తామనే ప్రమాణాన్ని తీసుకున్న యీ హిందూస్తాన్ సేవా దళం వారికి కూడా డ్రిల్లూ, డిసిప్లినూ ఉండేవి.

అహమ్మదాబాదు కాంగ్రెసు సందర్భంలో ఈ దళం వారికి ప్రత్యేకమైన సూచనలు ఇవ్వబడ్డాయి. సత్యాహింసలకు సదాబద్దులం అనే ప్రమాణాన్ని ప్రతి స్వయం సేవకుడూ విధిగా తీసుకునేవాడు.

1921 నాటి నిర్మాణాత్మక కార్యక్రమమూ, పిన్స్ ఆప్ వేల్స్ పర్యటన సందర్భంలో చూపించిన నిరసనాత్మక బహిష్కరణ విజయవంతం అవడానికి, యీ స్వయం సేవకులూ, వారి నిస్సార్థ నిరాడంబర సేవా, ఎంతగానో ఉపకరించాయి.

అలాంటి ఉపయుక్త సంస్థని విచ్చిన్నం చెయ్యడం పొరపాటున్నది ఈనాడు మన కందరికీ అవగాహన అవుతోంది. మత సామరస్యం కొరవడిన కారణంగానూ, ప్రస్తుతం జరుగుతూన్న యుద్ధం*[1] కారణంగానూ సంప్రాప్తమైన పరిస్థితులలో హిందూస్తాన్ సేవా దళంవారు ఎంతయినా సేవచేసి ఉండేవారు. బహుశా:వారు ఆనాడు ప్రభుత్వం వారికీ, కాంగ్రెసు వారికీ మధ్య ఉత్పన్నమైన చిక్కుల మూలంగా ఏర్పడిన ఎన్నో విపరీత పరిస్థితులను సవ్యంగా ఎదుర్కోగలిగేవారేమో కూడా.

  1. *ద్వితీయ ప్రపంచ మహాయుద్ధం