నా జీవిత యాత్ర-2/కేరళ రాష్ట్రీయ కాంగ్రెసు తొలి సమావేశానికి అధ్యక్షత

వికీసోర్స్ నుండి

6

కేరళ రాష్ట్రీయ కాంగ్రెసు

తొలి సమావేశానికి అధ్యక్షత

నాగపూరు కాంగ్రెసులో ఆమోదింపబడిన ప్రతిపాదనల కారణంగానే కేరళ రాష్ట్రీయ కాంగ్రెసు సంఘంకూడా ఉద్భవించింది. ఆ కాంగ్రెసుచే ఆమోదింపబడిన మొదటి కాంగ్రెసు సంఘం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన దన్న సంగతి చదువరులకు తెలిసినదే. కేరళ రాష్ట్రీయ ప్రథమ కాంగ్రెసు సమావేశం ఒట్టపాలియంలో జరిగింది. మలయాళ మిత్రులు నన్ను అ సమావేశానికి అధ్యక్షత వహించవలసినదని కోరారు. జార్జి జోసాఫ్ ఇంకొకచోట అధ్యక్షత వహించవలసి వచ్చింది. అప్పటికి మలయాళదేశం కూడా చాలా ఉత్తేజపూరితంగానే తయారయింది. గాంధీగారి ముందడుగులో కేరళ రాష్ట్రీయ నాయకుల, సేవకుల శక్తి బాగా పుంజుకుంది. ఖిలాఫత్ ఉధ్యమానికి, స్వరాజ్యోద్యమానికి సన్నిహిత సంబంధం సమకూరడాన్ని, ఆ రోజులలో హిందూ-మహమ్మదీయ మైత్రి తారస్థాయి నందుకుంది. మలయాళ దేశపు అన్ని ప్రాంతాలనుండి ఆ సమావేశానికి ప్రతినిధులు వచ్చారు. ఈ రాజకీయ సమరంలో మలయాళ స్త్రీలు బాగా ముందంజ వేశారు. ఏ దృక్పథంనుంచి చూసినా యీ సమావేశం విజయవంతమయిందనే చెప్పాలి. హిందూ-మహమ్మదీయ సఖ్య సాధనకు సంబంధించిన ఫలితాలు మిన్నుముట్టాయి.

1921-22 సంవత్సరాలలో ఖాదీ ఉద్యమం బాగా సాగించగలిగిన జిల్లాలో మలబారు ఒకటి. అప్పట్లో హిచ్‌కాక్ అనే ఆయన అక్కడ జిల్లా పోలీసు సూపరింటెండెంటుగా వుండేవాడు. తాను ఆ జిల్లాలో ఉన్నంత కాలమూ అక్కడ రాజకీయ చైతన్యం తల ఎత్త కూడదనేదే ఆయన వాంఛ. మాప్లాల పరిస్థితి కదిపితే రాజుకునేటట్లుగా ఉండడాన్నే ఎక్కడ ఏవిధంగా కొంపలంటుకుంటాయో అన్న భీతికూడా ఆయనకు ఉండేది. మలయాళదేశంలో ముప్పయి సంవత్సరాల కొకసారి విప్లవ జ్వాలలు ప్రజ్వరిల్లడం పరిపాటి అయింది. ఏదెల్లా ఉన్నా మలబారు జిల్లాలో జరిగిన మొట్టమొదటి కాంగ్రెసు సమావేశం ఫలప్రదంకావడం ఆయన సహించలేక పోయాడు.

నేను ఒట్ట పాలియం జేరేసరికి, ఏదో విధంగా పోలీసువారు ఆ సమావేశం జరక్కుండా అడ్డగిస్తారనే భావం నా మనస్సులో నాటుకుంది. కాని అటువంటిదేమీ జరుగలేదు. సమావేశం ముగిసే లోపల ఏదో విధంగా శాంతిని భగ్నం చెయ్యడానికి కొందరు వ్యక్తులు నియమింపబడ్డారు. "స్వరాజ్య" పత్రికా సంపాదకీయవర్గానికి చెందిన అబ్దుల్ హమీద్‌ఖాన్ నాతోపాటు పై సమావేశంలో పాల్గొన్నాడు. హమీద్ ఖాన్ దరిమిలా చెన్నపట్టణంలో ముస్లింలీగు నాయకుడు కూడా అయ్యాడు. అ సమావేశం సాంతం అయ్యే లోపల మేము తలచినట్లుగా ఏ సంఘటనా జరక్కపోవడం మా కందరికీ ఆనందం కలిగించింది.

పోలీసువారి జులుం

కాని సాయంత్రపు సమావేశం ముగిసే లోపల కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. ఆ గ్రామంలో సంచరిస్తూ ఉన్న హిందూ-మహమ్మదీయ కాంగ్రెసు పక్షీయుల్ని కొందరు దుండగులు అల్లరి పెట్టడమూ, కొట్టడమూ జరిగింది. గ్రాడ్యుయేటూ, లా కాలేజీ లెక్చెరరు పి. గోవిందమేనోన్ అల్లుడూ, పెద్ద మనిషి అయిన శ్రీరామున్నీ మేనోన్ అనే ఆయన ఆ సమయంలో మెయిన్ రోడ్డు గుండా హమీద్‌ఖాన్‌తో కలిసి వెడుతున్నాడు. కాన్పరెన్స్ కాలంలో శాంతిని కాపాడడం కోసం అంటూ మల్లపురం నుంచి కొందరు పోలీసువారు ఒట్టపాలియంకు రావింపబడ్డారు. కొందరు పోలీసువారు రామున్నీ మేనోన్‌నీ, హమీద్‌ఖాన్‌నీ ఆపుజేసి, అడ్డదిడ్డపు అసభ్య ప్రశ్నలు వేశారు. అబ్దుల్ హమీద్‌ఖాన్ తాత్వికంగా చాలా గొప్పవాడు. రామున్నీ మేనోన్ మూర్తీభవించిన సాధుసజ్జనుడు. పోలీసువారు కొన్ని ప్రశ్నలు వేశాక రామున్నీ మేనోన్ రెండు దవడలమీదా లెంపకాయలు వేశారు. ఎల్లాగో దెబ్బలు తినకుండా హమీద్‌ఖాన్ తప్పించుకున్నాడు. రామున్నీ మేనోన్‌ని ఉద్రేకపరచడం కష్టం. ఆయనిది, ఒక చెంపమీద కొడితే రెండో చెంప చూపించే తత్త్వం. వారుభయులూ ఉద్రేకపడని కారణంగా అది అంతటితో ఆగింది. కాన్ఫరెన్స్ ముగిసే లోపలనే వారిద్దరూ తిరిగివచ్చి జరిగిన ఉదంతం అంతా సభలో నివేదించారు. జరిగిన ఉదంతాన్ని రామున్నీ మేనోన్ చెపుతూ ఉంటే, సభలోవారికి ఉద్రేకం జనించింది.

అదే సమయంలో కొన్ని వీథులలో పోలీసులు మాప్లాలమీద చెయ్యి చేసుకున్నారు. పొలీసుల చేతులలో దెబ్బలు తిన్న మంచి బలమూ, ఒడ్డూ పొడుగూ ఉన్న ఒక మాప్లాని కొందరు మిత్రులు సమావేశంలోనికి తీసుకు వచ్చారు. ఆయన నిజంగా మంచి బలశాలి. ఆర్గురు జనం మూక వుమ్మడిగా ఒకేసారి ఆయనమీద విరుచుక పడ్డా నిగ్రహించుకోగల బలం ఆయనకుంది. పైగా ఆయన బెల్టులో కై జారుంది. అదృష్ట వశాత్తూ ఆయన ఆ కై జారుని పోలీసువారిపై ప్రయోగించలేదు. ఆ గలటాని ఆపుచేయగలిగిన కొందరు వ్యక్తులు ఆయన్ని కాన్ఫరెన్సులోనికి తీసుకువచ్చారు. ఆయన చాలా ఉద్రేకంగా ఉన్నాడు. ఒక్క ఉదుటున వెనక్కి వెళ్ళి కక్ష సాధిద్దాం అనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. కాని కొందరు మిత్రులు ఆయన్ని బలవంతంగా నిరోధించారు. ఒక్క ఉదుటున బైటకుపోవాలని ఆయన తలచినప్పుడు వారంతా కలసి బలవంతంగా ఆయన్ని పడుకోబెట్టారు. కొన్ని సంవత్సరాలనుంచీ రాజ్యసభా సభ్యుడుగా ఉంటున్న సయ్యద్ మూర్తాజా సాహెబుగారు ఆనాటి సభలో మాతోపాటు ఉన్నారు. ఆయన తిరుచి నివాసి. బలవంతంగా పడుకోబెట్టబడిన అ ఆసామీ ఛాతీమీద మూర్తజా కూర్చుని శాంతి వచనాలు పలకడం ఆరంభించాడు. నాగపూరు కాంగ్రెసు ఆమోదాన్ని పొందిన అహింసా విధానం గురించి బోధచేస్తూ మొత్తానికి ఎల్లాగయితేనేం అయన్ని శాంత పరచారు.

వీరేగాక ఆనాడు అనవసరంగా పోలీసుల చేతులలో దెబ్బలు తిన్నవారు యింకా ఉన్నారు. వారూ కాన్ఫరెన్సులోనికి పరుగుపరుగున వచ్చి సంగతి సందర్భాలు విన్నవించుకున్నారు. కాన్ఫరెన్సు జరుగు తూండగా రిపోర్టయిన యీ సంఘటనలు సమావేశంలో పాల్గొంటూ వున్న చాలమంది స్త్రీ పురుషులకు ఉద్రేకపరచాయి. ఆనాటి సాయంత్రం మా సమావేశం ముగుసే లోపల ఎల్లాగయినా అల్లరిపెట్టి, ఆఖరు నిమిషంలోనయినా సమావేశం గల్లంతు కలుగజేసి సాగకుండా చెయ్యాలన్న పోలీసువారి కుతంత్రమే ఈ సంఘటనల కన్నింటికి కారణమన్నది అందరికి అర్థమయిపోయింది.

ఊరేగింపు నాయకత్వం

వేరే ఇంకో సభకు అధ్యక్షత వహించిన మిత్రుడు జార్జ్ జోసఫ్, ఆ సభ ముగించుకునివచ్చి, ఇక్కడ సమావేశమయిన స్త్రీ పురుషుల నందరినీ చిన్న చిన్న జట్లుగా దొడ్డి గుమ్మం ద్వారా బయటికి పంపడం మంచిదని నాతో అన్నాడు. నేనా అభిప్రాయాన్ని ఎగతాళి చేశాను. సమావేశం సాంతం అయ్యేవరకూ సభ్యులను శాంతగానూ, నిశ్చలంగానూ కూర్చోవలసినదిగా కోరుతూ కొంత తడవు నేను ఉపన్యసించాను. అంతేకాదు. సమావేశానంతరం ఆయా సంఘటనలు జరిగిన ముఖ్యవీథులగుండా ఊరేగింపుగా సభలోని ప్రకుఖ నాయకులంతా వెళ్ళాలనీ సూచించాను. సభను శాంతంగా తుదివరకూ సాగించమనీ, అంతవరకూ ఎవ్వరూ కదల రాదనీ కోరాను.

సభానంతరం, నేను స్వయంగా ముందుండి నాయకత్వం వహిస్తూ, సభలోని ముఖ్యుల నందరినీ ఊరేగింపుగా ఒట్ట పాలియం ముఖ్యవీథులన్నింటిలోనూ నడిపించాను. ప్రజలలో నాటుకున్న విశ్వాసాన్నీ, ఆత్మశక్తినీ అణగద్రొక్కలేమని పోలీసువారు గ్రహించారు.

సమావేశం సాంతం అయ్యేలోపల పోలీసుల కారణంగా జరిగిన యీ అల్లరులను విచారించడానికిగాను ఒక ఉపసంఘాన్ని నియమించాము. ఆ ఉప సంఘానికి నేనే అధ్యక్షుణ్ణి. కొంతమంది ఇతర ప్రముఖులతోపాటు ఎల్.ఐ. సుబ్బరామయ్య అనే పాల్‌ఘాటు న్యాయవాది కూడా యీ ఉప సంఘ సభ్యుడుగా ఎన్నుకోబడ్డాడు.

మా మీద హిచ్‌కాక్ దావా

సమావేశం పూర్తి కాగానే విచారణ ప్రారంభించాం. ఒట్ట పాలియం వదిలే లోపల సేకరించగల సాక్ష్యాన్నంతా పూర్తిగా రికార్డు చేశాము. విచారణ అనంతరం రిపోర్టు వ్రాశాము. ఆ జిల్లాలో డి.యస్.పి.గాపనిచేస్తూ ఉన్న హిచ్‌కాక్కే, ఆ రోజున కాంగ్రెసు వారిపై జరుపబడిన చర్యల కన్నింటికి పూర్తిగా బాధ్యుడనే నిర్ణయానికి వచ్చాము.

కమిటీ మెంబర్ల మందరమూ ఆ రిపోర్టుమీద సంతకాలు చేశాము. ప్రచురణార్థం దానిని చెన్నపట్న మందలి "హిందూ" పత్రిక వారికిచ్చాము. మా రిపోర్టూ, అందలి అంశాలూ దేశంలో బాగా అలజడిని కలుగజేశాయి. కాంగ్రెసువారిని కొట్టింది పోలీసులే. వారు అలా కొట్టడానికి పోలీసు డిస్ట్రిక్టు సూపరింటెండెంటు (D.S.P)గారి ప్రోద్బలమే కారణమనీ, ఆయన పరోక్ష చర్యల మూలంగానే యీ సంఘటనలూ, పోలీసు చర్యలూ జరిగాయని మా రిపోర్టులో ఉంది.

తర్వాత కొంతకాలానికి హిచ్‌కాక్ నాకూ, తదితర కమిటీ సభ్యులకూ, మారిపోర్టులో తనపై వ్రాసిన పరువు నష్టపు వాక్యాలు తొలగించవలసినదనీ, తొలగించని పక్షంలో పరువునష్టం దావా మాపై వేయబడునని ఇప్పించిన లాయరు నోటీసు మా కందింది. నోటీసు మాకందిన అనంతరమే మా రిపోర్టు కాపీ ఒక దానిని గాంధీగారికి పంపించడం జరిగింది. నోటీసు ప్రకారం మా పై తీసుకొనదలచిన చర్యకు ఎదురు చూస్తున్నామని నేను వారికి జవాబు వ్రాశాను. సత్య గోవుల లాంటి కాంగ్రెసు వారిని తన ప్రోత్సాహంతో పోలీసువారు కొట్టారంటూ మా రిపోర్టులో వ్రాసి, తనపై అనవసరంగా నిందమోపి తనకు పరువు నష్టం కలుగజేసిన కారణంగా, మేము పరువు నష్టం క్రింద ముప్పదివేల రూపాయలు యివ్వవలసి ఉంటుందని, కాలికట్ సబ్ కోర్టులో హిచ్‌కాక్ మాపై దావా వేశాడు. చట్ట రీత్యా తన దావా చెల్లదంటూ నేను వ్రాసిన లిఖిత వాజ్మూలాన్ని పరిశీలనార్థం గాంధీగారికి పంపించాను.

కోర్టుల విషయంలో గాంధీగారి సలహా

నేను వ్రాసిన స్టేటుమెంటు చాలా చిన్నదే. అందులో చట్ట బద్ధ మయిన మెలికలున్నాయి (Legal Pleas). నేను వ్రాసిన డ్రాఫ్ట్ మేద గాంధీగారు రెండు అడ్డ గీతలుగీసి "ఇది చట్టాన్ని అనుసరించి తీసుకో దలచిన రక్షణ చర్య. ఇటువంటి రక్షణ చర్యలకు నేను అంగీకరించను. ఆ కోర్టువారికి యీ కేసు విచారణ చెయ్యడానికి హక్కు ఉందో లేదో మాత్రమే చూచుకోండి" అంటూ వ్రాసి నా కాగితాలు నాకు త్రిప్పి పంపించి వేశారు. నాగపూర్ కాంగ్రెసులో నిర్ణయించుకున్న త్రివిధ బహిష్కరణ కార్యక్రమానికి అనుగుణంగానే, గాంధీగారు నా కాగితం మీద వ్రాసిన సూచన ఉంది. ఈ విషయం మొదట్లో నాకు గుర్తుకు రాలేదు. నిజానికి గాంధీగారే కదా కాంగ్రెసుకు కర్త, భర్త అన్నీను. అందుకనే ఆయన అభిప్రాయాన్ని కోరుతూ నా కాగితాలు ఆయనకు పంపించాను. గాంధీగారి అభిప్రాయంతో నేనూ ఏకీభవించాను. "నాకు సంబందించినవరకూ ఈ కేసు విచారణ చెయ్యడానికి మీకు అధికారం లే" దంటూ వ్రాయబడిన స్టేట్‌మెంట్ మాత్రమే నేను దాఖలు చేశాను. రెండవ ప్రతివాది అయిన ఎల్.ఐ.సుబ్బరామయ్య కాంగ్రెసు సభ్యుడు కాదు గదా! తాను కాంగ్రెసు నియమావళికి బద్దుడను అంటూ ఎప్పుడూ యే విధంగానూ కాంగ్రెసులో జేరని వ్యక్తి ఆయన. అందువలన లా పాయింట్లు ఆధారంగా, దావా చెల్లదంటూ ఆయన వాదన తీసుకువచ్చాడు. సుబ్బరామయ్యగారి వాదన కారణంగా ఆయనకు సంబంధించి నంతవరకూ దావా విచారణ జరిగింది. హిచ్‌కాక్ కు అనుకూలంగా దావా డిక్రీ అయింది.

ఇరుకున పెట్టిన సుబ్బరామయ్య అప్పీలు

క్రింది కోర్టువారి తీర్పు న్యాయమయినదీ, చట్టబద్దమయినదీ కాదంటూ సుబ్బరామయ్యగారు హైకోర్టులో అప్పీలు చేశారు. నాప్రాక్టీసు ముమ్మరంగా సాగే రోజులలో నా సహచరుడుగా ఉంటూ ఉండే కీ.శే.టి.ఆర్.రామచంద్రయ్యరు, సుబ్బరామయ్యగారి ప్లీడరు. క్రింది కోర్టులో సుబ్బరామయ్యగారు మా దర్యాప్తూ, వ్రాసిన రిపోర్టూ అంగీకరించివున్న కారణంచేత, క్రింది కోర్టు తీర్పుమీద అపీలు చేయడానికి సావకాశం లేనందువల్ల, రామచంద్రయ్యరు ఒక క్రొత్త ఎత్తు ఎత్తాడు. "విచారించాము, రిపోర్టు వ్రాశాము" అన్నంత మాత్రాన మాక్లయింటు దోషికాడు. ఆయన ఆ రిపోర్టు మీద సంతకం చేశాడా, లేదా అన్నదే ముఖ్యం అంటూ వాదన లేవదీశాడు. అంటే సుబ్బరామయ్యగారు పెట్టకపోయినా, అనుమతించకపోయినా, వారికి తెలియకుండా, వారి సంతకం నేను పోర్జరీ చేశానన్నమాట! ఆ వాదన సారాంశం అంతేగా? కేసు విచారణ జరిగిన క్రింది కోర్టులో యీవాదన రాలేదు. మొట్టమొదటిసారిగా యీ వాదన అపీలు కోర్టులోనే వచ్చిన కారణంగా, ఈ పాయింటును మేము చర్చించము అని ఖండితముగా హైకోర్టువారు చెప్పడం న్యాయం. ఈ అప్పీలు ఇరువురు జడ్జీల సమక్షంలో విచారణ కావాలని కోరివుండిన కారణంగా, ఇది ఇద్దరు జడ్జీల ముందుకు వచ్చింది. ఆ ఇద్దరు జడ్జీలలోనూ ఒకరు రామేశంగారు. ఆ రిపోర్టులో తన క్లయింటు ఎప్పుడూ సంతకం పెట్టి యుండ లేదంటూ వ్రాసిన అఫిడవిట్టును టి.ఆర్.రామచంద్రయ్యరు దాఖలు చేయడానికి ఇరువురు జడ్జీలూ అంగీకరించారు. ఈ అఫిడవిట్టు కోర్టులో చదివబడిన సందర్భంలో కోర్టులో విచారణకుగాను కూర్చున్న రామేశంగారు, తన జడ్జీ స్థానంనుంచే, అప్పటి వరకూ ఈ సహాయ నిరాకరణ ఉధ్యమ నాయకులమీద తనకు మంచి విశ్వాసం ఉండేదనిన్ని, ఈ అఫిడవిట్టు విన్నాక కాంగ్రెసు నాయకులపై తనకు ఏర్పడిన సదభిప్రాయం మార్చుకోవలసి వస్తోందనీ అన్నాడు.

సాగుతూ ఉన్న కోర్టు విచారణ ఎప్పటి కప్పుడు అన్ని పేపర్లలోనూ రిపోర్టయ్యేది. దీన్తో నా పరిస్థితి చాలా ఇరుకున పడిపోయింది. బ్రిటిషువారి కోర్టులలో ఎంతమాత్రమూ నమ్మకము లేదని అంటూ, క్రిందికోర్టులో నేను హాజరుకాని కారణంగా, ఇప్పుడు నేను హైకోర్టులో