నా జీవిత యాత్ర-2/గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణ

వికీసోర్స్ నుండి

5

గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణ

1922 వ సంవత్సరం చరిత్రాత్మక మయినదని చెప్పక తప్పదు. అది మనవారి కందరికీ చాలా ముఖ్యమయిన సంవత్సరం. నాగపూరు కాంగ్రెసులో [1]ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీని ప్రత్యేకంగా గుర్తించారు. అప్పటికే చాలాకాలం క్రిందట అంధ్రరాష్ట్ర ఉద్యమం దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారూ, గొల్లపూడి సీతారామశాస్త్రిగారూ స్థాపించారు. వా రుభయులూ కలిసి 1922లో గుంటూరులో పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభించడంతో కాంగ్రెసు ఉద్యమం నూతన స్థాయిని అందుకుంది. వెంకటప్పయ్య పంతులగారు మంచి కీర్తి కెక్కిన హైకోర్టు న్యాయవాదిగా గుంటూరులో ప్రాక్టీసు చేస్తూ ఉండేవారు. ప్రజాసేవ చేద్దామనే సదుద్దేశంతో, గాంధీగారీ సత్యాగ్రహోద్యమానికి ఎంతో ముందుగానే ప్రాక్టీసు విరమించుకున్న పెద్దలువారు. వెనుకటి రోజులలో అ పాతకాలపు లెజిస్లేటివు కౌన్సిల్ లో సభ్యులుగా కూడా పనిచేశారు.

గాంధీగారి కాంగ్రెసు ఉధ్యమ ప్రారంభ దినాలలో నేనూ, వెంకటప్పయ్య పంతులుగారూ బెజవాడనుంచి గుంటూరు వరకూ కలసి రైల్లో ప్రయాణం చేయడం సంభవించింది, అ అవకాశాన్ని పురస్కరించుకొని వారిని కౌన్సిల్ సభ్యత్వానికి రాజీ యివ్వవలసినదని కోరాను. వారు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. నేను చాలా దూరం చెప్పాను. 1921 లోనూ, దరిమిలానూ కూడా వృత్తులను విరమించి ఉద్యమంలో జేరిన న్యాయవాదులను గురించీ ఉద్యమ ప్రాశస్తాన్ని గురించీ, ఎంతో వివరంగా చెప్పాను. నాప్రోద్బలం వల్ల ఆయన మనస్సు మార్చుకుని గాంధీగారి ఉద్యమంలో జేరడమే గాకుండా ఆయనకు ఎంతో సన్నిహిత శిష్యులయ్యారు. అంతేకాదు. కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గ సభ్యులుగా ఎన్నికయిన ప్రథమ ఆంధ్ర సభ్యుడు ఆయనే. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షస్థానంకూడా మొదటిసారి ఆయన్నే వరించింది

ఉద్యమ నాయకులు

గొల్లపూడి సీతారామశాస్త్రిగారు కూడా గుంటూరులో మంచి పలుకుబడీ, ప్రాక్టీసూ ఉన్న హైకోర్టు న్యాయవాదే. ఆయనా, నేనూ కలసి కొన్ని జమీందారీ లావాదేవీలలో ఆ జిల్లాలోని సబార్డినేట్ కోర్టులలో పని చేశాము. వృత్తిలో ఆయన చాలా ఘనుడు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘం ఏర్పడిన నాటినుంచీ ఆయనే దానికి ప్రముఖ కార్యదర్శి. గాంధీగారి "పిలుపు" ను మన్నించి, ఆయన న్యాయవాదవృత్తిని విరమించినవారే, ఆయన వేలాది జనులముందు నిలబడి ఉపన్యసిస్తూన్న సమయంలో, వరుమానాలూ, ఖర్చులూ, ఆర్ధిక అవసరాలు మున్నగు విషయాల ప్రసక్తి వస్తే, కాగితాలతోటీ, కలాలతోటీ నిమిత్తం లేకుండానే పెద్ద పెద్ద ఆర్థిక వేత్తలను మించి మాట్లాడగలశక్తి ఆయనకుంది. వారూ, వెంకటప్పయ్య పంతులుగారూ కలసి దేశస్వాతంత్ర్యానికి అవసరమయిన యే త్యాగానికయినా సంసిద్దు లయ్యారు.

గాంధీగారూ, సర్దార్ వల్లబాయ్ పటేలుగారూ బార్డోలీలోనే పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభించాలని నిశ్చయించుకున్న సందర్భంలో సీతారామశాస్త్రిగారూ, వెంకటప్పయ్య పంతులుగారూ కలిసి అట్టి పన్నుల నిరాకరణ గుంటూరులోనే గాక, ఆంధ్రరాష్ట్రపు టన్ని జిల్లాలలోనూ ఆరంభించడానికి కుతూహలం చూపించారు.కాని వారి ఉత్సాహంలో, అటువంటి ఉద్యమాన్ని అణగద్రొక్కడానికి ప్రభుత్వం తీసుకునే తీవ్ర చర్యలకు కృషీవలు లందరూ తట్టుకుని నిలబడగలరా అన్న విషయాన్ని బాగుగా ఆలోచించి ఉండిఉండరు. పన్నుల నిరాకరణ ఉధ్యమపు పర్యవసానాలన్నీ క్షుణ్ణంగా ఎరిగివున్న మహాత్ముడుమాత్రం, తమశక్తినీ బలాన్నీ పూర్తిగా అవగాహన చేసుకోకుండా ఉద్యమంలోనికి దిగవద్దని హెచ్చరిస్తూ, ప్రజలలో ఉండే విశ్వాసాన్నీ శక్తినీ కూడా గమనించవలసిందని ఆదేశించారు.

పెదనందిపాడులో మిలిటరీ మార్చ్

అప్పట్లో నేనూ కార్యనిర్వాహక వర్గ సభ్యుడనే అయి ఉన్నా నాతోకూడా సంప్రతించకుండా, వా రుభయులూ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇట్టి పరిస్థితులలో ఆరంభమయిన ఉద్యమం విద్యుత్‌వేగంతో జిల్లా అంతటా ప్రాకిపోయింది. ఉన్నవ లక్ష్మీనారాయణగారు పల్నాడు ప్రాంతపు అటవికశాఖ పన్నుల నిరాకరణ ఉద్యమంగా తమ స్వంత పర్యవేక్షణ క్రింద ప్రారంభించారు. రైతులందరూ ఈ పన్నుల నిరాకరణ ఉద్యమానికి శతవిధాల స్వాగతం చెప్పారు. స్వరాజ్యం వచ్చేస్తోంది, పన్నులు చెల్లించకుండానే హాయిగా మనం జీవించగలం అనే వా రూహించారు. రివెన్యూ అధికారులు ప్రజల వద్దనుంచీ, రైతుల వద్దనుంచీ

ఏవిధమైన పన్నులూ వసూలు చేయలేని స్థితికి వచ్చేసరికి పరిస్థితులు విషమించాయి. గుంటూరు నాయకులంతా బాపట్ల తాలూకా పెదనందిపాడు ఫిర్కాకు చెందిన సుమారు నూరు గ్రామాలలో ఈ పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ముమ్మరంగా సాగించే కృషిలో నిమగ్నులయ్యారు. గుంటూరు జిల్లాలోని అనేక గ్రామాలకు చెందిన గ్రామోద్యోగులందరూ (మునసబు, కరణం, వెట్టివాళ్ళు వగైరా) రాజినామాలిచ్చి ఈ ఉధ్యమంలో సహకరించారు. ఉధ్యమం ఘనవిజయం సాధించింది. రివెన్యూ డిపార్టుమెంటు ఉద్యోగుల జీతాలకు సరిపడినంత ధనం కూడా పన్నుల రూపంగా వసూలు కాలేదు. కలక్టరుగారి ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.

ఇప్పుడు[2]ప్రభుత్వం వారికి సలహాదారుగా పనిచేస్తూన్న రూథర్‌ఫర్డ్ అప్పుడు స్పెషల్ డ్యూటీమీద, పన్నుల వసూలు నిమిత్తం ఆ జిల్లాకు ప్రత్యేకంగా పోస్టు అయ్యాడు. ఆయన చాలా ప్రతిభావంతుడే. అయితేనేం. పన్నుల వసూళ్ళ విషయంలో ఆయన చాకచక్యం అంతా బూడిదలో పోసిన పన్నీరులా నిరుపయోగమయింది, ఆయన ఒక పెద్ద మెషన్‌గన్ తీసుకవచ్చి పెదనందిపాడు ఫిర్కా మధ్యగా స్థాపించాడు. పన్నులు యివ్వకపోతే ఆ ప్రాంతం అంతా భస్మీపటలం అవుతుందనే భీతికొద్దీ ప్రజలు పన్నులు యిస్తారని ఆయన భావించాడు. ప్రభుత్వం వారి శక్తి సామర్థ్యాలను ప్రజలు గ్రహించగలరనే దృష్టితో, మిలటరీని పిలిపించి ఆ గ్రామాలలో మార్చి చేయించాడు. ఎరెస్టు, లాఠీ ఛార్జీలూ విరివిగా జరిపించి, ఆ రీతిగా ప్రజాహింస సాగించాడు.

టామీలకి మిరప పళ్ళ విందు

రాబోవు విషమ పరిణామాలను ఊహించి, ప్రభుత్వంవారు పెట్టబొయ్యే బాధలను ప్రజలు తట్టుకోలేరేమోననే భావనతో, పరిస్థితులను పరిశీలించి, రిపోర్టు చేయవలసినదిగా కోరుతూ ప్రదేశ కాంగ్రెసు కమిటీవారు ఒక ఉపసంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘ సభ్యునిగా నేనూ, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, దాట్ల నారాయణరాజుగార్లతో కలసి జిల్లా అంతా పర్యటించి ఉద్యమం సాగించడం విషయమై మా అభిప్రాయాన్ని వెల్లడించాము.

ప్రభుత్వపు ఒత్తిడితో ప్రజలలో నైతిక పతనం ఆరంభం అయింది. మిలటరీవారు ప్రజలను పలువిధ హింసా కాండలకు లోనుజేశారు అని వ్రాస్తూ మన ప్రాంతం గురించి, మన మిర్చి పంట గురించి, మా జీవితంలో మొట్టమొదటిసారిగా జూచిన "టామీ"లో వింత ప్రవర్తన గురించికూడా వ్రాయకుండా ఉండలేకపోయాము. అధికారులుగా వచ్చిన ఆంగ్లేయులకు మిరప పండ్లన్నవి మామూలుగా తినే పండ్లు కావన్న సంగతి కూడా తెలియదు. ఒకసారి వారంతా ఒక పండిన మిరపచేలోపడి, మనోహరంగా ఎర్రగా పండిన ఆ మిరప పండ్లను తినాలనే ఆతురతకొద్దీ, ఒకచేలోపడి చేతుల నిండుగా మిరప పళ్ళను కోసుకుని గబగబా నోళ్ళల్లో క్రుక్కుకున్నారు. కొద్ది క్షణాలలోనే నాలుకలు పీక్కుంటూ బాధా నివారణార్థం మురికి గుంటలలోని నీళ్లని కూడా త్రాగడానికి సిద్ధపడ్డారు. ఇటువంటి ముక్కూ మొహమూ ఎరుగని బ్రిటిషు సోల్జర్ల చేతులలో మన దేశీయుల మంచీ, మర్యాదలు ఎల్లా నిలవగలుగుతాయి? ఈ సందర్బంలో మిలటరీవారు, పోలీసువారు చేసిన దుండగాలు వివరంగా వర్ణించడం అననసరం. కర్షకుల స్థితి అధోగతి పాలయిందన్న ఒక్కముక్క చాలు. వారు యీ పరిస్థితిని తట్టుకోలేకపోయారు.

విరమణకు మా సలహా

ఉద్యమం ఒక్క వంద గ్రామాలలోనే ప్రారంభింపబడ్డా జిల్లా మొత్తం అంతా సానుభూతితో పెద్ద యెత్తున హర్తాల్ ఆరంభం అయింది. నాలుగు మాసాలు దాటినా జిల్లా మొత్తంమీద నాలుగు పైసాలయినా పన్నుల రూపంగా వసూలు కాలేదు. ఉద్యమం ఇంకా సాగిస్తే ప్రజలు ఈ పరిస్థితులకు తట్టుకోవడం దుస్సహం అవుతుందనే భావనతో జిల్లా అంతా పర్యటించిన నేనూ, నాగేశ్వరరావు పంతులుగారూ కూడా ఉద్యమాన్ని విరమించడమే మంచిదని సూచించాము. క్లిష్ట సమయంలో గుంటూరులో ప్రారంభింపబడిన యీ పన్నుల నిరాకరణ ఉద్యమం గాంధీగారి అభిప్రాయానికి భిన్నంగా ఆరంభింప బడ్డది అంటూ డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిచే వ్రాయబడిన ఉత్తరం ఒకటి "జన్మభూమి" పత్రిక ప్రచురించింది. దరిమిలా "సర్" కూడా అయిన థామస్ రూథర్ ఫర్డ్ యీ "జన్మభూమి" ప్రతులను విరివిగా కొని, జిల్లా కేంద్ర స్థానాలలో పెక్కుచోట్ల తానే స్వయంగా ఆ కాపీలను పంచిపెట్టడం ఆరంభించాడు.

ఈ పరిస్థితుల నన్నింటిని గమనించే మేము ఉద్యమ విరమణకి సలహా యిచ్చాం. మా ఉపసంఘపు రిపోర్టు ఆధారంగా, ప్రదేశ కాంగ్రెసువారు ఉద్యమాన్ని విరమించి పన్నులను ఇచ్చివేయవలసిన దంటూ ఆదేశించారు. అంతే, వారం రోజులు తిరక్కుండానే కొన్ని లక్షల రూపాయలు పన్నుల రూపేణా పూర్తిగా ట్రజరీలలో జమ కట్ట బడింది.

ప్రభుత్వానికి కనువిప్పు

ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉద్యమం ద్రవించి స్రవించి పోయినా, పరిపాలకులకు మాత్రం అది ఒక కనువిప్పే అయింది. ఈ ఉద్యమం సాగింది నాలుగు మాసాలే అయినా, అ నాలుగు మాసాలలోనే , అనాటి గవర్నర్ విల్లింగ్‌డన్ గారికీ, వై స్రాయిగారికీ, బ్రిటిషు కాబినెట్ వారికికూడా పన్నుల నిరాకరణ అన్నది ఎటువంటి పరిణామాలను కలుగజేస్తుందో అర్థం అయింది. ఉద్యోగ విరమణ అనంతరం లార్డ్ విల్లింగ్‌డన్ రెండుమూడు సందర్భాలలో, గుంటూరు పన్నుల నిరాకరణ ఉద్యమం యేవిధంగా బ్రిటిషు రాజ్యాంగం విధానాన్ని పునాదులతో సహా కదలించి వేసిందో పబ్లిక్‌గా ఉద్ఘాటించారు.

ప్రభుత్వం వారి క్రూరాతి క్రూర విధానాలతో ప్రజానీకం నైతికంగా పతనం కాకముందే మేము తీసుకున్న చర్య సాఫల్యాన్ని సాధించినా, తిరిగి ప్రజలలో శాంతి భద్రతలు నెలకొల్పబడే పర్యంతమూ మేము ఎంతో ఆత్రుతతో సంచరించాము. ఉద్యమం అప్పట్లో విర

మింపజేయకుండా అల్లాగే సాగించిఉంటే, అధికారులు అవలంబించిన దమన విధానం ఫలితంగా ప్రజలలో నిరుత్సాహం బయలుదేరి, నైతిక పతనం జరిగిఉంటే, తిరిగి వారిని ఉత్తేజపరచి దారిలో పెట్టడానికి యుగాలే పట్టేది. సకాలంలో ఉధ్యమ విరమణజేసి ప్రజలలో ఐక్యాన్నీ, జాతీయ భావాన్నీ మంచి స్థాయిలో నిలబెట్టి గలిగిన కారణాన్నే, 1923 వ సంవత్సరంలో శాసన ధిక్కార సంఘం (Civil Disobedience) వారి రాక సందర్భంలో జారీ చేయబడిన 144 వ సెక్షన్ ఉల్లంఘన జరగడమూ, సుమారు మూడువందలమంది వరకూ నిర్బందింప బడడమూ జరిగింది.

గుణపాఠం

ఈ పన్నుల నిరాకరణ ఉద్యమ విరమణ జరిగిన పెక్కు సంవత్సరాల అనంతరం లార్డ్ విల్లింగ్‌డన్ గుంటూరు సందర్శించడం జరిగింది. గుంటూరు వాస్తవ్యులు ఉత్సాహంగానే తనను ఆహ్వానిస్తారని అనుకున్నట్లున్నాడు, పాపం! మూయబడిన తలుపులూ, ఖాళీ వీథులూ మాత్రమే ఆయన్ని ఆహ్వానించాయి. విరమణ, లొంగుపాటు అన్నవి ఓటమికి చిహ్నాలుకావు. నిజానికి సకాలంలో తీసుకున్న చర్య లొంగు బాటుకే దారితీసినా, అది ప్రజలలో నూతన చైతన్యాన్నీ, బలాన్నీ, ఉద్రేకాన్ని కలుగజెయ్యడానికి ఎంతయినా ఉపకరిస్తుంది. గుంటూరు పన్నుల నిరాకరణ ఉద్యమమూ, విరమణా పై సత్యాన్నే చాటాయి. నిర్మాణ కార్యక్రమ ఫలితంగా, ప్రత్యామ్నాయ పరిపాలనా విధానానికి ప్రజలు సిద్ధపడ గలిగిననాడు ఎటువంటి ఉద్యమం అయినా ఘనవిజయాన్ని సాధిస్తుంది. పన్నుల నిరాకరణ, ఆస్తుల జప్తులూ, వేలాలూ మున్నగు లావాదేవీలకు దారి తీస్తుంది. అందువలన శిక్షాస్మృతులను ఉల్లంఘించి జైళ్ళకు వెళ్ళడం సులభం. 1921 లో ప్రభుత్వం వారు తీసుకున్న విపరీత చర్యల ఫలితంగా నిర్మాణ కార్యక్రమం ఆగిపోయి ఉండకపోతే దేశం ఎన్నో విధాల ముందడుగువేసి ఉత్పన్నం కాబోయే పరిస్థితులకు సిద్ధపడే ఉండేది.

  1. 1920 లో
  2. 1940 - 41