నా జీవిత యాత్ర-2/గురుకాబాగ్ సత్యాగ్రహ సందర్శనం

వికీసోర్స్ నుండి

14

గురుకాబాగ్ సత్యాగ్రహ సందర్శనం

ఈ సత్యాగ్రహం [1]అకాలీలచే ప్రారంభింపబడింది. వారిని ఒక సిక్కుల ఆలయంలోకి రానివ్వని కారణంగా, తమ హక్కులను సుస్థిర పరచుకోవడంకోసం అకాలీలు ఈ సత్యాగ్రహ సమరం ఆరంభించారు. ఆ ఆలయాధికార్లు ఈ అకాలీలకు అందులో ప్రవేశించే అర్హత లేదని నిర్ణయించారు. అకాలీలు ఆ తీర్పు సవ్యమయినదీ, న్యాయమయినదీ కాదనిన్నీ, అందువలన తాము ఆలయంలో ప్రవేశించి తీరుతామనీ చెప్పి ఆలయ ప్రవేశానికి సిద్ధపడ్డారు.

అకాలీల మీద ఆంక్ష

అ ఆలయ పాలకులు ప్రభుత్వంవారి సహాయం కోరారు. అకాలీల ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వంవారు సి.ఆర్.పి.పి.,144 వ సెక్షను క్రింద ఆర్డరు వేశారు. ఆ ఆంక్షను పాటించకుండా ఆలయ ప్రవేశం చేసితీరాలని అకాలీలు నిశ్చయించుకున్నారు. కాగా వారు గాంధీగారి అహింసాత్మక సత్యాగ్రహ పద్దతులను అనుసరించారు. కేవలం అనుసరించడమే కాదు, ఆ పద్ధతులకు మెరుగు దిద్ది, వాటిని ఎంతో పకడ్ బందీగా తయారుచేశారు. సత్యాగ్రహ విధానాలకూ, మిలిటరీ పద్దతులకూ జత కలిపారు చాలామంది అకాలీలు పించను పుచ్చుకున్న సిపాయిలు, మిలిటరీ వారు. తీవ్రమైన పోరాటాలలో ప్రాణాలు తృణప్రాయంగా అర్పించడానికి వెనుకాడిన బాపతు కానేకారు. అనేక యుద్ధాలలో ఆంగ్లేయల తరపున పాల్గొన్నవారే వారు. కాని వారికి ఆంగ్ల పరిపాలకులతోనూ, వారి ఉద్యోగస్థులతోనూ తగాయిదా ప్రారంభం అయిన కారణంగా, వారు తీవ్ర యుద్ధ విధానాలకంటె గాంధీగారి అహింసాత్మక సత్యాగ్రహ విధానమే ఉత్తమమయినదని భావించారు.

వైద్యశాల-వంటసాల

వారిపై ఆంక్ష విధింపబడిన వెంటనే వారు దానిని ఉల్లంఘించి తీరుతామని తెలియజేశారు. తమపై ఆంగ్లేయులు హింసాకాండ సాగిస్తారని, దానిని ఒక యుద్ధంలాగే భావించాలనీ వారికి తెలుసు. ఆ పరిస్థితులలో తీవ్రంగా గాయపడడానికి బాగా అవకాశం ఉన్నదని తెలుసు. అందువలన వారు ఆ పోరాటం జరుగుతున్న స్థానానికి సమీపంగా పెద్ద ఆస్పత్రిని ఏర్పరచుకున్నారు. అవసరమైన వైద్యం చేయడానికి నర్సులూ, డాక్టర్లూ కూడా కాణీ ఇవ్వనవసరం లేకుండానే తయారయ్యారు. ఆస్పత్రికి సమీపంగానే ఒక "లంగర్ ఖానా" (వంటసాల) ఏర్పాటు చేసుకున్నారు. ఆ లంగర్ ఖానాలోని యేర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి.

దాస్‌గారూ, నేనూ, బాబూ రాజేంద్రప్రసాదూ, మరికొంత మంది కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గ సభ్యులు వెంటరాగా, ఆ లంగర్ ఖానా, ఆస్పత్రి, వగైరా యేర్పాట్లన్నీ చూశాము.

ప్రభుత్వంవారు చేసిన యేర్పాట్ల ప్రకారం అకాలీలు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టడానికి ఆస్కారంలేదు. ఆలయం చుట్టూ పోలీసు నిఘా వేశారు. పోలీసుల చేతులలో దిట్టమయిన లాఠీలున్నాయి. అకాలీలు ఎవరయిన ఆలయ సమీపానికి వచ్చినా, ఆలయ ప్రవేశానికి ప్రయత్నించినా, వారి యెముకలు చితగ్గొట్టడానికి ప్రభుత్వంవారు సర్వసన్నద్ధు లయ్యారన్నమాట. అక్కడ అకాలీలు సత్యాగ్రహ పద్ధతులమీద చేసుకున్న యేర్పాట్లన్నీ మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి.

సత్యాగ్రహ క్రమం

మున్ముందుగా వారు ఆలయ ప్రాంతానికి వెళ్ళే తీరు గమనిద్దాం. భజన కీర్తనలతో, పాటలతో ఉత్సాహంగా ఆలయ ద్వారం దగ్గరకు బయల్దేరేవారు. ప్రతిసారి, నలుగు రైదుగురు వ్యక్తులు మాత్రమే ఒక చిన్న బాచ్‌గా వెళ్ళేవారు. వారి మెడలో పూలమాల లుండేవి. "దెబ్బలు తగలనీ, ప్రాణాలు పోనీ-భగవదాలయంలోకి వెళ్ళి తీరుతాం" అన్న భావం వ్యక్తంచేసే కీర్తనలు అందరూ ఏకగ్రీవంగా పాడుకుంటూ వెళ్ళేవారు. "మీరు ఈ భౌతిక దేహాన్ని కించపెట్టగలరు. హింసింపగలరు. చంపగలరు. కాని మా ఆత్మలు మాత్రం ఏవిధమయిన అడ్డంకులూ లేకుండా ఆ భగవత్సాన్నిథ్యాన్ని చేరుకుంటాయి. ఆ ఆత్మలు భగవంతుని జేరకుండా మీరు ఆపలేరు," అని ఆ పాటల ఆఖరు చరణాల అర్థం.

మేము పైన ఉండి చూస్తున్నాం. బాచ్ తర్వాత బాచ్‌గా వస్తూన్న ఆ అకాలీలను నిర్ధాక్షిణ్యంగా బాదేవారు. శరీరమంతా కుళ్ళబొడిచేవారు. చివరికి స్మృతి తప్పి పడిపోయే వరకూ వారికి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉండేది. దెబ్బలు తగిలిన వారిని తమ ఆస్పత్రికి తీసుకు వెళ్ళడానికి వారి సొంత యాంబ్యులెన్సుకారు సిద్ధంగానే ఉండేది. పోలీసువారి యాంబ్యులెన్సు కార్లూ ఉండేవి. ఆ ప్రభుత్వపు యాంబ్యులెన్సు కారులో ఎక్కించడానికి మోసుకునివచ్చే లోపల, ఏసత్యాగ్రహికైనా కర్మంచాలక అనండి, అదృష్టవశాత్తూ అనండి, తెలివిగనుక వస్తే, అతను ఆ ప్రభుత్వపు కార్లలో ఎక్కడానికి నిరాకరించేవాడు. "మమ్మల్ని మా కారులోనే పడేయవయ్యా" అని అరిచేవారు ఆ క్షతగ్రాతులు. ఆ ప్రకారమే జరిగేది.

అహింసా వ్రతం

అక్కడనుంచి వారి ఆస్పత్రి చూడ్డానికి వెళ్ళాం. మేము లోపలికి వెళ్ళేసరికి దెబ్బలు తిన్న ప్రతి వ్యక్తి మంచంమీద వెల్ల కిత్తలా, మిలిటరీ పద్ధతిగా పడుకుని ఉండేవాడు. ఆ దెబ్బలు తిన్న వ్యక్తులలో ముగ్గురు వయోవృద్దుల్ని, "మీ పటకాలలో కృపాణ్ ఉండగా మీకు ఇన్ని దెబ్బ లెల్లా తగిలాయి?" అని అడుగుతే, ఆ ముగ్గురూ కూడా ఒకే విధంగా సమాధానమిచ్చారు. "మేము శాంతంగా ఉండడానికి కారణం మమ్మల్ని అహింసాత్మకంగా మెలగ వలసిందని మాకు ఇవ్వబడ్డ ఆజ్ఞా" అని. అడిగిన దాస్‌గారికీ, సమాధానాలు విన్న మాకూ విస్మయమే కలిగింది. సురక్షితమైన ఈ పద్ధతిలో ఆ అహింసాత్మక సమరం చాలా రోజులే నడిచింది.

అక్కడనుండి మేము లంగర్‌ఖానా చూడ్డానికి వెళ్ళాము. నేను అంతవరకూ అంత భారీఎత్తున ఏర్పాటయిన వంటసాలలను చూడలేదు. ప్రతీ పావుగంటకీ గుర్రాలమీదనో, గాడిదల మీదనో కావలసిన వస్తు సముదాయం సప్లయి అయ్యే యేర్పాట్లు చేయబడ్డాయి. వంటసాలలోనూ, సామగ్రిని శుభ్రపరిచే జాగాలోనూ కూడా ఘరానా కుటుంబాలకు చెందిన స్త్రీలు ఆహ్లాదంతో సేవ చేయడం గమనించాము. నిజంగా అది ఒక ఆదర్శప్రాయమైన యేర్పాటు. లంగర్‌ఖానాలో తయారైన ఆహారము మాకు వడ్డించి భోజనం పెట్టారు.

ఉద్యమ విజయం

అకాలీలకు తమ ఉద్యమాన్ని విరమించి దేవాలయాధికార్లతోనూ, ప్రభుత్వంవారితోనూ రాజీ పడవలసిందని చాలామంది సూచించారు. కాని వారు విరమించడానికి ఎంతమాత్రమూ అంగీకరించ లేదు. ఉద్యమం చాలా తీవ్రతరం అయింది. అక్కడ పోలీసులు సాగిస్తూన్న హింసాకాండని పెద్దలు సహించలేకపోయారు. చూసిన పెద్దలూ, రాజకీయ వేత్తలూ కూడా ఆ హింసా కాండ సహించలేక భారత ప్రభుత్వంవారికీ, పంజాబు ప్రభుత్వంవారికీ కూడా దానిని వెంటనే ఆపవలసిందని టెలిగ్రాము లిచ్చారు. పెద్దలయొక్క, ప్రజలయొక్క ఒత్తిడి అంతకంత కధికమయింది. దాన్తో ప్రభుత్వం వారూ, దేవాలయాధికారులూ కూడా లొంగక తప్పలేదు. అకాలీలకు దేవాలయ ప్రవేశానికి అర్హత లున్నాయని ఒప్పుకున్నారు

సిక్కులలో అకాలీలది ఒక శాఖ. వారు నల్లటి తలపాగాలు ధరిస్తారు. సిక్కుమతస్థులకు మత సాంఘికాది విషయాలలో బోధచేయడమే వారి విధి. అట్లు బోధలు చేస్తూ జీవితాలు సాగిస్తామని వారు ప్రమాణ స్వీకారం చేస్తారు.

మేము అమృతసర్ వెళ్ళినప్పుడు బంగారు దేవాలయం చూశాం. అది సిక్కుల ప్రఖ్యాత దేవాలయం. ఆ రోజులలో కొందరు సిక్కు నాయకులకూ, నాకూ మంచి పరిచయమూ, స్నేహము ఉండేది.

ప్రభుత్వంవారు వారిపై తీసుకుంటూండే చర్యలు చాలా తీవ్రంగా ఉండేవి. పంజాబులోని ఏ అచ్చాపీసులోనయినా సరే వారి గ్రంథాలు అచ్చువేయకుండా నిషేదాజ్ఞ జారీచేశారు. కాని, వారు ఎట్టి పరిస్థితులలో నైనా సరే, ఎట్టి అడ్డంకులు వచ్చినా సరే పట్టినపట్టు విడువని ధీరులు

'స్వరాజ్య' పలుకుబడి

పంజాబులోని అచ్చాపీసులో తమ గ్రంథాలు అచ్చువేయుటకు వీలులేని కారణంగా, కొంతమంది అకాలీలు దూరాభారాన్ని లెక్క చెయ్యకుండా, చెన్నపట్నం వచ్చి వారి పుస్తకాల నన్నింటీనీ "స్వరాజ్య" ప్రెస్‌లో అచ్చువేయించుకునేవారు. ఒకమాట, వచ్చినవారు అరడజను మంది అకాలీలే అయినా, వారు చెన్నపట్నం జార్జి టవున్ లో ముకరు నల్లముత్తు వీథిలో ఒక యిల్లు అద్దెకి తీసుకుని, వారికి కావలసిన రీతిగా డాబా కూడా వేసుకుని, అచ్చు పనులన్ని పూర్తయ్యేవరకూ, కొన్ని నెలలపాటు అక్కడే ఉండిపోయారు. పట్నంనుంచి అచ్చయిన పుస్తకాలను వేలకొద్దీ ఇంగ్లాడు, అమెరికా మొదలైన దేశాలకూ, పార్లమెంటు మెంబర్లకూ, బ్రిటిషు కాబినెట్ వారికీ పంపించారు. ఆ రోజులలో స్వరాజ్య ప్రెస్ ఎంత పలుకుబడి సంపాదించిందో, ఎలాంటి స్వాతంత్య్రాభిలాష కనబరచిందో ఈ ఉదంతంవల్ల తెలుస్తూంది కదా!

ఆ అకాలీ పద్దతులు బాగా ఆకర్షించడాన్ని తర్వాత కొంత కాలానికి చెన్నపట్నంలో ఉప్పు సత్యాగ్రహం ఆరంభించిన సందర్భంలో నేను గురుకాబాగ్ పద్ధతులను, భారీ యెత్తున కాకపోయినా, అమలు పరచడానికి పూనుకున్నాను.

ఆ ఉప్పు సత్యాగ్రహపు రోజులలో, చెన్నపట్నంలో ఆ అకాలీల పద్ధతులమీద ఆరంభింపబడిన "ఉదయవనం" కాంప్ కొన్ని నెలల పాటు మద్రాసు వాస్తవ్యులు ఉచితంగా ఇచ్చిన విరాళాలతో మేమందరం అరెస్టు అయ్యేదాకా చాలా బాగా నడిచింది. దీనిని గురించి ముందు ముందు చెపుతాను.

  1. 1923 లో