నా జీవిత యాత్ర-2/గాంధీగారు, స్వరాజ్యపత్రిక

వికీసోర్స్ నుండి

13

గాంధీగారు, స్వరాజ్య పత్రిక

నేను కాంగ్రెసు మీటింగులన్నిటికీ హాజరయి, చేయగలిగిన యథోచిత సేవచేస్తూ ఉండేవాణ్ణి. కాగా "స్వరాజ్య" పత్రికలో విషయాలన్నీ వివరిస్తూ, కాంగ్రెసు అభివృద్ధికీ, దేశక్షేమానికి పాటుబడేవాణ్ణి. అంతేకాదు-మోతిలాల్ నెహ్రూలాంటి నాయకుణ్ణి కూడా, తప్పుదారిని పట్టారని తోచినప్పుడు, చాలా తీవ్రంగా విమర్శించేవాణ్ణి. నేను బర్మాదేశంనుంచి తిరిగి వచ్చిన తర్వాత, మోతిలాల్ నెహ్రూగారు స్వయంగా యీ సంగతే చెప్పుకున్నారు. "స్వరాజ్య" చాలా తీవ్రంగా విమర్శిస్తోందని వాపోయారు.

మోతిలాల్ మంచి వ్యవహర్త, లోకజ్ఞాని అవడాన్ని స్వరాజ్య పేపరుకు విరాళం యిస్తానని కూడా అన్నారు. అంతే కాదు, ఆయన తన సెక్రటరీ రామస్వామి అయ్యంగారిని పిలిచి, నాకు రు 5000/- లకు ఒక చెక్కు ఇవ్వవలసిందని చెప్పారు. ఆయన ఇచ్చిన డబ్బు పేపరు కాతాకు జమ కట్టకపోతే లంచం క్రింద జమ అవుతుంది గనుక, ఆయన్ని ఆ అయిదువేల రూపాయల విలువగల వాటాలు తీసికోవలసిందని కోరాను. వాటాలు కొన్నట్లు ఆయనకు సర్టిపికేటు ఇచ్చాను. ఆమరణాంతం ఆయన వాటాదారుగానే ఉన్నారు.

మూసివెయ్యమని సలహా

గాంధీగారి విడుదల అనంతరం, ఆయన్ని నేను హాస్పిటల్‌లో కలుసుకున్నప్పుడు, ఆయనా నేనూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఆ సందర్భంలో "స్వరాజ్య" పేపరు ప్రస్తావన వచ్చింది. తాను జైలులో ఉన్న రోజులలో, "స్వరాజ్య" చేసిన సేవను గురించి అడిగారు. తాను జైలుకు వెళ్ళిన తర్వాత దేశం పరిస్థితుల గురించి నన్ను ఏమి అడుగ లేదు. "పాలసీ"లో ఏమయినా మార్పు వచ్చిందా, వచ్చి ఉంటే యెందువల్ల వచ్చిందని కూడా నన్ను అడుగలేదు. ఎటువంటి ప్రశ్నలు వేయకుండానే, "స్వరాజ్య పత్రిక మూసేస్తే మంచి"దని సూచించారు. ఆ పలుకు నిజంగా నాలో సంచలనాన్ని కలిగించింది.

దేశం మొత్తంమీద కాంగ్రెసు "పాలసీ"కి కట్టుబడి కాంగ్రెసు కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూన్న పత్రిక అది ఒక్కటే. గాంధీగారి కార్యక్రమ విజయానికి కూడా ఆ పత్రిక, ప్రారంభింపబడినది లగాయితు, ఎంతగానో సేవ చేసింది. పైగా ఆయన కార్యక్రమాదులనూ, విధానాలనూ ఖండించడంగాని, అ. భా. కాంగ్రెసు కమిటీ వారిచే అంగీకరింపబడక పూర్వమే ప్రచురించడానికిగాని మా పత్రిక యెప్పుడూ పూనుకోలేదు.

ఆయన "పాలసీ" లను బైటపెట్టి, ఆయన కార్యక్రమాదులకు అడ్డంకులు కలుగజేసి, ఆయన్ని చికాకు పెట్టింది "స్వరాజ్య" కాదు; ఇవన్నీ ఆయన ముఖ్య స్నేహితుడూ, నమ్మినబంటూ, సన్నిహిత శిష్యుడూ అయిన రాజగోపాలాచారి గారూ, అయనచే ఏర్పరుపబడిన వర్కింగు కమిటీని, వారే అటువంటి పనులను చేసినవారు. నిజానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రెండు మాసాలపాటు విరమిస్తామన్న తీర్మానాన్ని నిరసించిన వాడిని నేను ఒక్కడినే. ఆ భేదాభిప్రాయాల మూలకంగా, "సెంట్రలు పార్టీ" అంటూ లేవతీసి, ఆ రెండుపార్టీలవారి మధ్యా సామరస్యం తీసుకు రావాలని తంటాలు పడింది నేను. కాకినాడ కాంగ్రెస్‌లో దాస్‌గారిని "సపోర్టు" చేయడం కూడా, లోగడ ఢిల్లీ కాంగ్రెసువారు అవలంబించిన విధానం సమర్థించడమే.

ఇటువంటి పరిస్థితులలో నాచే ప్రారంభింపబడి, నడుపబడుతూన్న పత్రికను వెంటనే ఆపివేయవలసిందని గాంధీగారు అనడానికి కారణం, బహుశ:నాపైనా, నాపత్రికపైనా ఎవరో స్వార్థపరులు నిందలు మోపి, నాపత్రిక మూలంగానే వారి కార్యక్రమం భంగమయిందనీ, నా పత్రికే అందుకు కావలసిన దోహదం చేసిందనీ, చెప్పి ఉంటారని నేను విశ్వసించాను.

నిజానికి యీ పరిస్థితుల కన్నింటికీ మూలకారణం వారి అనుచరులలో యేర్పడిన అలసతా, దుర్బలత్వమేనని. ఆ దుర్బలత్వ కారణంగానే వారు దాస్-మోతిలాల్ గార్లతో వివాదపడి రచ్చకెక్కకుండా, వారికి అనుగుణంగా ప్రవర్తించి ఉన్నారనీ ఆయనకు తెలియక పోవచ్చు ననే నేను భావించాను. అప్పట్లో ఆయన అనారోగ్య పరిస్థితినీ, శరీర దౌర్బాల్యాన్నీ గమనించి నేను ఆయనతో వాదనకు దిగలేదు.

నా సమాధానం

కాని, పూర్తిగా స్థిరపడిన పత్రికను మూసివేయడమన్నది అంత చులాగ్గా జరిగే పని కాదనీ, గత మూడు సంవత్సరాలనుంచీ అవిచ్చిన్న సేవచేస్తూ, నిర్దేశింపబడిన మూడు లక్షల మూలధనాన్నీ సేకరించి, దారిలో పడిన పత్రికను మూసివేయడం మాటలతో పని కాదనిన్నీ మాత్రం చెప్పాను. అది నా ఒక్కడికీ చెందిన స్వంత వ్యవహారమే అయి ఉంటే, నిమిషాలమీద ఆయన ఆజ్ఞను పాలించే వాడిననీ వ్యక్తం చేశాను. ఈ పత్రిక ప్రజలచే స్థాపింపబడినదనిన్నీ, నేను ప్రజలపట్ల విశ్వాసంతో దీనిని నడుపుతున్నాననీ చెప్పాను.

ఇన్ని సవ్యమయిన సంగతులు చెప్పినా, ఆయనకు సంతుష్టి కలిగినట్లు లేదు. ఈ విషయంలో మిత్రులతో సంప్రతించి వారి పేర వ్రాస్తానని చెప్పి, సెలవు తీసుకుని వచ్చేశాను.

ఆయన ఇచ్చిన ఆదేశం విషయం సుదీర్ఘంగానే ఆలోచించాను. ఆ రోజున ఆయన సలహా పాటించి ఉండి యుంటే, ఈ రోజున చాలా లాభాలు పొంది ఉండేవాణ్ణి. నా సొంత పూచీ పైన బ్యాంకులలో అప్పులు తెచ్చి, పేపరులో పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. ఆనాడు ఆయన నా కిచ్చింది, ఆత్మీయులైన అన్నదమ్ముల సలహాలాంటిది. సుమారు అయిదు లక్షలవరకూ ఉన్న బ్యాంకి నిలవలూ, రాజమండ్రీ నుంచి నీలగిరులవరకూ ఉన్న స్థిరాస్తులూ చెక్కు చెదర కుండా ఉండేవి. 1924 తర్వాత నేనూ, నా కుటుంబీకులూ ఇక్కట్ల పాలయేవారమే కాదు.

గాంధీగారి సూచనను గురించి, చాలామంది స్నేహితులతో సంప్రతించాను. కొంతమంది వారి సలహా పాటించమనీ, ఇతరులు ఆ సలహా పాటించినట్లయితే చెన్న రాజధానిలో కాంగ్రెసు మనుగడకే మోసం వస్తుందనీ సూచించారు. ఒకప్పుడు గాంధీగారు దక్షిణ ఆప్రికాలో వారు నడుపుతూన్న వారపత్రిక మూసివేయవలసిన సందర్బంలో, మూయడం మంచిది కాదు అంటూ, వెలువరించిన కారణాలన్నీ నాకు స్ఫురణకు వచ్చాయి, వారపత్రిక మూయడం విషయంలో వారు సూచించిన కారణాలన్ని, ఇప్పుడు స్వరాజ్య పత్రిక మూసివేయడం విషయంలో నా హృదయంలో భారంగా నాటుకున్నాయి.

నేను పడ్డ మథన

చెన్నపట్నంనుంచి వారి పేర సుదీర్ఘమైన లేఖ వ్రాస్తూ అందులో, పెద్ద యెత్తున నడుస్తూన్న ఒక సంస్థను అకస్మాత్తుగా మూయడంలో ఉండే కష్టనష్టాలను గురించి సూచించాను. ఏ విధంగా, ఎన్ని తంటాలుపడి, యీ దేశీయుల నుంచే గాక, విదేశీయుల నుంచి కూడా ధనం ఎల్లా సేకరించబడిందో వివరించాను. అంతేగాక, ఆరోజు వరకూ ఆయన ఆరంభించిన కాంగ్రెసు ఉధ్యమం చెన్నరాష్ట్రంలో బాగా నాటుకు పోవడానికి నా పత్రిక ఎల్లా ఉపకరించిందో కూడా వివరించాను.

అది ఒక "ట్రస్టు ప్రాపర్టీ"లాంటిదనీ, దానినే గనుక యిప్పట్లో మూసువేస్తే, తన చర స్థిర ఆస్తుల నన్నింటిని జాగ్రత్తగా కాపాడు కుంటూ, స్వలాభం కోసం ఈ సంస్థను మూసేశాడనే చెడ్డ పేరు కూడా నాకు వస్తుందని తెలియబరిచాను. నన్ను బాగా బాధపెట్టిన విషయం నిజంగా అదే. ఆ ప్రజాభిప్రాయమే. అదాటుగా పత్రికను ఆపుచేస్తే ప్రజలలో నా కీర్తి ప్రతిష్టలు ఎల్లా ధగ్నమయి పోతాయోననే చింతే నన్ను బాధించింది. ప్రాక్టీసు విరమించడమూ, ప్రపంచ చరిత్రకే వినూత్నమయిన విధంగా ఈ దేశంలో ప్రజా రాజ్యం సంపాదించాలనే వాంఛతో కాంగ్రెసులో చేరి నేను చేసిన సేవా, అన్ని యీ పత్రిక మూసివేసిన కారణంగా మట్టమవుతాయనే బాధే నన్ను బాగా పీడించ సాగింది.

అ నాటి సంకల్పం

ప్రజాక్షేమంకోసం దక్షిణ ఆఫ్రికాలో ప్రారంభింపబడిన వార పత్రికను మూసివేయడం విషయంలో సరిగా ఇటువంటి ఆలోచనలే వచ్చి, గాంధీగారిని చికాకు పరిచాయి. ఆనాడు ప్రాక్టీసు విరమించి నేను ఉద్యమంలో దిగినప్పుడు, నా జీవితంలో వెనక్కి అడుగు వేయకూడదన్నదే, నాసర్వస్వం, నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ సమూలంగా నాశనం అయినా, చేపట్టిన దేశసేవ విరమించరాదన్నదే నా సంకల్పం. నేను సంపాదించినదంతా ప్రజల డబ్బే. అ ప్రజల కొరకే అ ధనాన్ని వ్యయపరచ గలగడం అన్నది ఒక ఘన కార్యమే ననే ఊహా నన్ను బాగా ఊపింది. అవసరాలనుబట్టి, అనుకున్న విధంగా, ప్రజాసేవలోనే ఉన్నదంతా వ్యయపరచ గలిగాననే సంతుష్టి నాకుంది.

ఉద్యమంలో చేరే రోజున, సత్యాహింసల పునాదితో ప్రారంభింపబడిన సహకార నిరాకరణ ఉద్యమాన్ని గురించి గాంధీగారు చెప్పినప్పుడు, అ ఉద్యమంలో ఉండే సావకాశాలూ, దాని విస్తీర్ణాది ఘన పరిణామాలూ నాకు నిజంగా తెలియవు. అప్పటికి నేను భగద్గీతగాని, హైందవ వేదాంతాది గ్రంథాలుగాని చదివి ఉండలేదు. ఆ ఉపనిషత్తులూ, భగవద్గీతా మున్నగునవి చదివి ఉండి ఉంటే, మన మతమునకూ, సాంఘిక జీవనానికీ ఉన్న లంకె, పుట్టిన ప్రతి వ్యక్తీ తన పొట్టనింపుకోవడానికి మాత్రమే పుట్టలేదనీ, సంఘసేవా, మానవసేవా, దేశసేవా అన్నవి ప్రతి వ్యక్తీ అవలంబింపవలసిన విధులనీ గ్రహించగలిగి ఉండేవాణ్ణి

గాంధీగారు ఈ కాంగ్రెసు ఉద్యమ స్థాపన, కేవలమూ ఆర్థిక రాజకీయ స్వాతంత్య్ర సంపాదన కోసమే కాదనీ, మతానికి బానిసలమై, మరచిన మానవత్వం ఉద్ధరింపబడాలన్నది కూడా గాంధీగారి ముఖ్య సూత్రమేననీ అర్థముయి ఉండేది. భగవద్గీతలోనూ, పురాణ ఇతిహాసాది ఉత్తమ మత గ్రంథాలలోనూ, అంతర్గతంగానూ, సూత్రప్రాయంగానూ నిర్దేశింపబడిన కర్తవ్యాదులూ, అనాసక్తాది యోగాలూ గ్రహించ గలిగిన రాజాధి రాజులు కూడా, ఎలా మానవ సేవ, దేశ సేవ, సంఘ సేవా చేస్తూ, సత్యాహింసల కోసం ప్రాకులాడుతూ, తమ యావత్తు ధన, కనక, వస్తు, వాహనాదులనే గాక, ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి కీర్తి గాంచారో అర్థమయి ఉండేది.

గాంధీగారి సూత్రాల ప్రకారం నడుపబడిన కాంగ్రెసు ఉద్యమం కారణంగా మన ఉత్తమ గ్రంథాల ఆశయాలన్నీ ఈ 20 ఏళ్ళ కాంగ్రెసు జీవితంలోనూ అర్థమయ్యాయి. కాని, దురదృష్టవశాత్తూ ఇంకా మత సాంఘిక రాజకీయ స్వాతంత్య్రాలు మనకు లభించలేదు. దానికి కారణం మనకు సరి అయిన పద్ధతులమీద శిక్షణ లేకపోవడమే. మన వాంఛలూ, కోరికలూ, మనల్ని ఇంకా పీడిస్తున్నాయి. పోటా పోటీలమీద, లాభసాటి వ్యాపారాల మీదా, ధనార్జన మీదా వ్యామోహాలు తగ్గలేదు. రాజకీయాలతో సహా, ఏ రంగంలో ప్రవేశించినా, ఏ పని చేద్దాం అన్నా, లాభాలమీద లాభాలు గణించాలనే వాంఛ చావలేదు.

ముంచుకు వచ్చిన పరిస్థితులు

"స్వరాజ్య" పత్రికను గురించి వివరించబోయే ప్రకరణమున్నూ చాలా మనోరంజకంగానే ఉంటుంది. దురదృష్ట వశాత్తూ, హైకోర్టు జడ్జీగారి తీర్పు ప్రకారం ఆ సంస్థను మూసివేసే వరకూ వ్రాసిన విషయాలు చదువరుల హృదయాలకు బాగా హత్తుకుంటాయి. హైకోర్టులో నాపైన తేబడిన ఒక "సమ్మరీ పిటీషన్" మీద ఇవ్వబడిన తీర్పు కారణంగా పత్రిక విరమింపవలసి వచ్చింది. ఆ గాథంతా వేరే ప్రకరణంలో వివరంగా తెలియజేశాను. నా శత్రువులు దుర్బుద్దితో పన్నిన కుట్ర కారణంగా పత్రిక మట్టుపెట్టబడిన వైనం పూర్తిగా ఆ ప్రకరణంలో వివరించాను. ఆ వివరణ అంతా సరిగానూ, సవ్యంగానూ చేశాననే నా భావన.

ఒక ప్రఖ్యాత నాయకునిగా, ఒక సన్నిహిత మిత్రునిగా గాంధీగారు 1922 లోనూ, 1924 లోనూ కూడా పత్రికను విరమించమని సలహా ఇచ్చి ఉన్నారు. నేను పత్రికను ఆపుచేయడానికి అంగీకరించని కారణంగా, వారికీ నాకూ మధ్య స్వల్పమయిన అభిప్రాయభేధా లేర్పడి, మాకు ఉన్న పూర్వపు సన్నిహిత్యానికి అవరోధాలు కన్పించాయి. ఈ సందర్భంలో గాంధీగారికీ, నాకూ మధ్య నడచిన ఒక ఉపాఖ్యానం చెప్పడం న్యాయము.

బాపట్ల కోర్టులో దావా కధ

ఒంగోలు తాలూకాలో ఖాదీ ఉధ్యమాన్ని సక్రమంగా నడుపుటకు అఖిల భారత చరఖా సంఘం వారిచ్చిన పెట్టుబడి పదివేలూ వారికి తిరిగి యిచ్చి వేస్తామని, నేనూ గోపాలశాస్త్రిగారూ ఉమ్మడిగా రాసి యిచ్చామనే అంశం పాఠక లోకానికి తెలుసు. మా ఉభయుల అభిప్రాయం అ పుచ్చుకున్న డబ్బు మా స్వంత ఉపయోగాలకు ఇవ్వబడింది కాదనీ, ఆ ధనాన్ని వాపసు యిచ్చే సందర్భంలో దానిని ధన రూపంగానే గాక వస్తు రూపంలో కూడా చెల్లించవచ్చుననీ, ఈ వ్యవహారమంతా, త్రివిధ బహిష్కార విధానం అమలులో నున్న రోజులలో జరిగింది. ఒక సాదా కాగితంమీద, పైన ఉదహరించిన షరతుల ప్రకారం, మేము ఒప్పందం రాసుకోవడం జరిగింది.

ఆ అఖిల భారత చరఖా సంఘ అధినేత శంకర్‌లాల్ బ్యాంకర్ గారికి ఒంగోలులోనూ, ఇంకా యితర రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ ఈ ఖాదీ ఉధ్యమం విరమించాలనే అభిప్రాయం కలిగింది. ఆయన మాకు ఇచ్చిన పదివేలూ రొక్కం రూపంగా జమ కట్టవలసిందని తాఖీదు పంపించాడు. మేము ఆ ధనమంతా, చరఖాలమీద, మగ్గాలమీద, ప్రత్తి, నూలు వగైరాలమీదనే గాక తయారయిన బట్టమీద కూడా మదుపు పెట్టి ఉన్న కారణంచేత, అప్పు తీసుకున్న రొక్కాన్ని, రొక్కంగానే జమ కట్టమనడం భావ్యం కాదు గనుక, ఈ సంస్థని యావత్తూ ఒక నడుస్తూన్న సంస్థగా స్వాధీనం చేసుకుని, వారిచ్చిన డబ్బు క్రమేణా రాబట్టు కోవడం న్యాయమనీ, వారిచ్చిన పెట్టుబడి మేరకు సరుకు ఉన్నదో లేదో విలియా వేసుకోవచ్చుననీ, నష్టం అనేది ఏదయినా ఉంటే మేము భరించడానికి సంసిద్ధుల మేననీ విన్నవించాము.

చరఖా సంఘంవారి షైలాక్ వ్యవహారం

శంకర్‌లాల్ బ్యాంకర్‌గారు "షైలాక్"లాగ "అదేం కుదరదు, అనుకున్న ప్రకారం ఇవ్వవలసిన సేరు మాంసం ఇచ్చి తీరవలసిందే" అన్నారు. నేను కుదరదన్నాను.

ఈ విషయమంతా గాంధీగారి వద్దకు వెళ్ళింది. నేను అ. భా. చ. సంఘంవారిని ఎందుకు చికాకుల పాలుచేస్తున్నావో అర్థం కావడం లేదంటూ గాంధీగారు నా పేర ఒక ఉత్తరం వ్రాశారు. నేను ఉన్న పరిస్థితులన్నీ వారికి వివరించాను. ఈ విషయంలో వారికీ, మాకూ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. దక్షిణ ఆఫ్రికాలోని ఒక లక్షాధికారి, ఒక తగాయిదా పరిష్కారానికిగాను, తాను సూచించిన ప్రకారం, కోర్టు ప్రమేయం లేకుండా, ఏలా వందలూ, వేలూ కుమ్మరించాడో ఆ సంగతి ఉదహరిస్తూ, ఈ విషయంలో ఆఖరి ఉత్తరం గాంధీగారు వ్రాశారు.

ఆ ఉదంతానికీ, ఈ ఉదంతానికీ సంబంధం లేదనీ, పుచ్చుకున్న డబ్బుతో పెట్టవలసిన పెట్టుబడులన్నీ సవ్యంగానే పెట్టబడిన కారణంగా, ఆ వస్తువులన్నీ వారు స్వాధీనం చేసుకుని, ధన రూపంలోకి మార్చుకోమని కోరడములో, మేము న్యాయంగానే ప్రవర్తిస్తున్నామనీ, నష్టం యేమయినా ఉంటే ఇవ్వడానికి సిద్దంగానే ఉన్నామనీ, తిరిగి ఇంకోసారి తెలియజేశాను. అంతేకాదు- మా అధీనంలో ఉన్న సమస్త వస్తు వాహనాదులన్నీ అ. భా. చ. సంఘంవారు ఆ పదివేల మింజుమలె జప్తుచేసి ఉన్న కారణంగా, వాటిని ఏ విధంగానూ అన్యాక్రాంతం చేయగల శక్తి మాకు ఉండదనీ సూచించాను.

గాంధీగారి సలహామీద దావా

గాంధీగారు ఈ విషయాలు నాతో ముఖస్థంగా చర్చించి ఉంటే, బహుశ:వారు కాదన లేకపోయే వారేమో! ఈ ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల నేను చికాకులు పెడుతున్నాననీ, సవ్యమయిన వ్యక్తిని కాదనీ భావించారో యేమో తెలియదుగాని, మాఉభయుల మీద దావా వేయ వలసిందిగా బ్యాంకర్‌గారికి సలహా ఇచ్చారు.

దాన్తో తీసుకున్న డబ్బు వాపసు యివ్వవలసిందంటూ, మా ఉభయులమీద బాపట్ల సబ్ కోర్ట్‌లో దావా వెయ్యబడింది. నేను మా స్టేట్ మెంట్‌లో, న్యాయబద్దమైన అన్ని సూచనలూ చేస్తూ, కాంగ్రెసువారు, త్రివిధ బహిష్కార విధానం అమలు పరుస్తూన్న రోజులలో ఈ వ్యవహార కాండ అంతా నడచిన కారణంగా, ఆ కోర్టువారికి ఇట్టి దావాలను విచారించడానికి "హక్కు" (Jurisdiction) లేదనిన్నీ వాదించాను.

ఈ విషయం మా ఇరువురి మధ్యా చాలా రగడే రేకొల్పింది. శంకర్‌లాల్ బ్యాంకర్ కూడా చింతాక్రాంతుడయ్యాడు. మధ్యవర్తి పరిష్కారానికి ఒప్పుకోవలసిందని ఆయన నన్ను కోరాడు. మధ్యవర్తి పేరడిగాను. గాంధీగా రన్నాడు. లోగడ జరిగిన ఇంకొక ఉదంతం కారణంగా గాంధీగారి మధ్యవర్తిత్వానికి నేను ఒప్పుకోలేదు. అప్పట్లో రాజగోపాలాచారి గారికీ, నాకూ వచ్చిన ఒక లావాదేవీలో గాంధీగారు, నావాదన వినకుండానే, రాజగోపాలాచారిగారికి పదివేలు ఇవ్వమని చెప్పిన చొప్పంతా వివరించాను. ఆయన చేతిలో ఒకప్పుడు నష్టపడిన కారణంగా ఇప్పుడు తిరిగీ ఆయన మధ్యవర్తిత్వానికి అంగీకరింపజాలనని తెలియబరచాను.

ఆ కేసు నడుస్తూన్న రోజులలో నేను బర్మా, మలయా మున్నగు ప్రాంతాలలో సకుటుంబంగా పర్యటిస్తూ, జరుగనున్న కాంగ్రెసు సమావేశాలకు ముందుగా పట్నం చేరుకున్నాను

నేను జామీనుదారునే

నేను స్వయంగా అ.భా.చ. సంఘం వారితోటీ, గాంధీగారితోటి తగాయిదాలోనికి దిగి, వ్యవహార కాండంతా నడిపిస్తూ ఉన్నా, గోపాలశాస్త్రిగారికి భాధగానే ఉంది. అ.భా.చ. సంఘం నుంచి స్వయంగా డబ్బు పుచ్చుకున్నది ఆయన. నేను కేవలం జామీనుదారునే. అందువల్ల ఒక ప్రక్క గాంధీగారూ, అ.భా.చ. సంఘంవారూ ఉండడమూ, రెండవ ప్రక్క మేము ఇరువురమూ ఇరుక్కోవడమూ గమనించి, ఈ కీచులాటను తప్పించాలని ఆయన తలిచారు.

దావాపడే ముందు మేము సవ్యంగా వ్యవహరించాలనే భావనతో, గోపాలశాస్త్రిగారితో ఉన్న సామానులన్నీ-రాట్నాలూ, మగ్గాలూ, దూదీ, నూలూ, వస్త్రాలు, ఏ రూపంలో ఉన్నా సరే-ఉన్నవి ఉన్నట్లుగా, సరిగా మూటలు గట్టి, అ.భా.చ. సంఘంవారి ప్రాంతీయ ప్రతినిధి కొండ వెంకటప్పయ్య పంతులుగారికి స్వాధీనం చేయమన్నాను. ఆ ప్రకారం చేస్తే అ.భా.చ. సంఘం వారికి సంబందించిన పూచికపుల్ల కూడా మావద్ద ఉండదన్నమాట.

మా వాదన సరి అయినదనీ, అ.భా.చ. సంఘంవారి క్లెయిము లా ప్రకారం చెల్ల నేరదనీ నాకు బాగా తెలుసు. అందుచేతనే వేసిన దావాను ప్రతిఘటించమని సలహా ఇచ్చాను.

ఏది యెల్లా ఉన్నా దావా కోర్టులో నడుస్తూన్నంత కాలమూ ఇది ఒక అవాంఛనీయమైన చికాకు పంచాంగంగానే మేము భావించాము. గాంధీగారి పద్దతులు ఒకొక్కప్పుడు బ్రిటిషువారు అవాంతర పరిస్థితులలో అవలంబించే పద్దతుల లాంటివే. కేంద్రంలోగాని, రాష్ట్రాలలోగాని కొన్ని కొన్ని అవాంతర పరిస్థితు లేర్పడినప్పుడు, వారొక పద్దతిని అవలంబించేవారు. ఏదయినా అవాంతరాలు వచ్చినప్పుడు లాయరు సలహా తీసుకోవడమూ, వెంటనే అ సలహాను పాటించి అవసర చర్యలు తీసికోవడము మామూలు. అంతేగాని, వారుచేస్తూన్న పని న్యాయమయిన దవునా కాదా అన్న విచారణ ఉండేది కాదు. వారట్టి పద్దతి అవలంబించడానికి కారణం వారికి లాయర్లయందుండే విశ్వాసమే. ఏదయినా గడ్డు పరిస్థితి యేర్పడినప్పుడు, తాము ఒక నిశ్చయానికివచ్చి కార్యక్రమం సాగించడమూ, అనుమానం వస్తే వెంటనే లాయరు సలహా తీసుకుని వ్యవహరించడమూ వారికి మామూలు. వారంతట వారు ఆలోచించరు. ప్లీడరు చెప్పిందే వేదవాక్కు. గాంధీగారి పద్ధతి కూడా ఒకొక్కప్పుడు అల్లాగే ఉండేది. తానే స్వయంగా లాయరయి, సంగతులు సవ్యంగా అవగాహన చేసుకుని, ఒక మార్గాన్నీ త్రొక్కితే మంచిదనే ఊహ పుట్టినప్పుడు, బాధ్యతలను విస్మరించకుండా, దర్జాగా కోర్టుకు వెళ్ళాలి. అవును. దర్జాగానే వెళ్ళాలి. కోర్టు ఖర్చులు సామాన్యమా మరి!

ఎవరయినా దగా చేసినా తప్పించుకోడానికి దారి చూపించాలని కాదు నా ఉద్దేశం. న్యాయం తమదన్న నిశ్చయం ఉన్నప్పుడు ధీమాగానే కోర్టుకు వెళ్ళాలిగాని, అన్యాయాలను న్యాయాలుగా నిరూపించడానికి కాదు.

గోపాలశాస్త్రి తరహా

అవసరమైన చికాకులకు లోనుగాకుండా ఉండాలనే ఉద్దేశంతో గోపాలశాస్త్రిగారు, తమ స్వంత ఆస్తి విక్రయించి నాలుగువేల రూపాయలు పోగుచేసి, ఆ సొమ్ము కూడా లోగడ జమ కట్టిన సామగ్రులకు తోడుగా జమ కట్టడంతో, లావాదేవీ లన్నీ సక్రమంగా, ఏ విధమయిన చికాకులూ లేకుండా అంతమయ్యాయి.

నేను ఆంధ్ర దేశానికి తిరిగివచ్చి, కాంగ్రెసుకు వెళ్ళడానికి సిద్ధపడేలోపల గోపాలశాస్త్రిగారు ఈ డబ్బును సమకూర్చుకుని, గాంధీగారితో మాటలాడి తగాయిదా పరిష్కరించవలసిందని నన్ను కోరారు. నేను ఈ నాలుగువేల రూపాయలు కాంగ్రెసు పెండాలులో గాంధీగారి చేతులలోనే స్వయంగా పోశాను. దాన్తో, అంతా ఒకప్పుడు తలచి నట్లు, నేను దుష్టుణ్ణీ, దొంగనీ కానని ఆయన తలచి ఉండాలి.

అప్పటికే నా సర్వస్వం దేశానికి అర్పణ అయిపోయింది. నాదీ అనుకోతగ్గ సెంటు భూమి కూడా మిగల్లేదు. నాకు కాణీ వరుమానం వచ్చే ఆస్తిపాస్తు లేవీ మిగల్లేదు. ఏ మాత్రం ఆస్తి మిగిలి ఉన్నా ఆ నాలుగువేలూ నేనే నా సొంత డబ్బునుంచే యిచ్చేవాడిని. ఈ నాలుగు వేలు రూపాయలూ గాంధీగారి చేతిలో పెట్టిన తర్వాత, దావా ఉపసంహరించబడింది. ఆ లావా దేవీలన్నీ ఆ ప్రకారం అంతమయ్యాయి.

ఇటువంటి విషమ పరిస్థితులలో నేను ఉన్నా, ఎవరో స్వలాభపరులు "స్వరాజ్య" పత్రిక తన ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని చెప్పిన కల్పిత కథలు విని గాంధీగారు నాపై దండెత్తినా, నేనెప్పుడూ బహిరంగంగాగాని, అంతరంగికంగాగాని బాధపడలేదు. నిజం నిలకడ మీద తెలియకపోదనే నమ్మిక నా కుంది. నన్ను అనేక విధాల చికాకుల పాలుచేసి, అల్లరి పెడదామని గట్టిగా తలపెట్టిన ప్రత్యర్ధులు ఉన్నా, నేను కాంగ్రెసును వదలకుండా అంటిపెట్టుకుని ఉండగలగడం నిజంగా ఒక గొప్ప విశేషమే.

సి. ఆర్. దాస్ అతిథి మర్యాద

చిత్తరంజన్ దాస్‌గారు తన స్వంత రాష్ట్రంలోనే, రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ఎల్లా యిరుక్కుని, ఎన్ని రకాలుగా బాధలు పడ్డారో, ఆర్థికంగా ఎలాంటి చిక్కులకు లోనయ్యారో కాస్త విచారిద్దాం. న్యాయవాదిగా సంపాదించడంలో గాని, సంపాదించినదంతా చాలక అప్పులుచేసి కూడా ఖర్చు పెట్టడంలోగాని, ఆయనకు ఆయనేసాటి. ఆయనా నాకుమల్లే చాలా దుందుడుకు మనిషి. నేను "స్వరాజ్య" పత్రిక స్థాపించిన కొత్తలోనే, ఆయన దక్షిణ దేశంలో పర్యటించడానికి వచ్చాడు. నా పత్రిక విజయవంతంగా ప్రజాదరణ పొందుతూన్న సంగతి గమనించి, ఆయన కలకత్తాలో "లిబర్టీ" అనే దైనిక పత్రిక స్థాపించారు. అదే దరిమిలా "ఫార్వర్డ్" పత్రిక అయింది. ఆయన చికాకులలో ఇరుక్కున్న రాజకీయ వాదులకు ఇతోధికంగానూ, ఉచితంగానూ సహాయాలు చేసెవాడు.

గాంధీగారు నన్ను "స్వరాజ్య" ను మూసివేయమని సలహా యిచ్చినప్పుడు, ఆయన నాతో దాస్‌గా రనుభవిస్తూన్న బాధలను గురించి కూడా వక్కాణించారు. ఏమయితేనేం, దాస్‌గారు మాంచి ఠీవితో బ్రతికి ఉన్నంతకాలమూ రాజాలాగే బ్రతికాడు. పోయిననాడూ[1]అంత ఠీవితోనే పోయాడు. ఆయన భోజనశాలలోని బల్ల (Dining Table) పెద్ద పెద్ద హోటేల్సు ఉండే బల్లలకంటే పెద్దది. డ్రెస్సులో ఉండే వెయిటర్సు కూడా ఒక పెద్ద హోటలులో ఉన్నంతమందీ ఉండేవారు.

ఆయన ప్రాక్టీసు విరమించక ముందు తరుచుగానూ, సహాయ నిరాకరణ ఉధ్యమంలో చేరాక మరీ యెక్కువగానూ ఆయనకు అతిథిగా ఉండేవాణ్ణి. ఉద్యమంలో చేరాక ఆయన తన ఖర్చులు తగ్గించుకుని, ఆ వెయిటర్లనీ వాళ్ల నీ తీసేసి, సాధారణంగా హిందువులు భుజించే పద్ధతిగా నేలమీద పీటలు వేసుకునే కూర్చునేవారు. ఆ ప్రకారంగా కూర్చో పెట్టి నాకు యెన్నోసార్లు వారింట భోజనం పెట్టారు. ఆయన కుమార్తె, మేనకోడలూ నాకు ఎదురుగా కూర్చుని, వండిన రకరకాల వంటకాలన్నీ నాచేత బలవంతంగా మొహమాట పెట్టి మరీ తినిపించేవారు.

మహానాయకుడు

ఆయన జీవించి ఉన్న రోజులలో ఆయనతో తుల్యమయిన నాయకుడు లేడు. ఆయన తర్వాతకూడా అంతటి నాయకుడు ఉండడనే ఘంటాపథంగా చెప్పవలసి ఉంటుంది. ఆయన పోయింది లగాయితు ఈ రోజువరకూ బెంగాలు రాష్ట్రం, ఏ శనిగ్రహచ్ఛాయలలోనో ఇరుక్కుని తబ్బిబ్బవుతోందని అనక తప్పదు.

నేను వర్కింగు కమిటీలో ఉంటూన్న రోజులలో, అనగా-దాసుగారు మంచి ఉచ్చస్థితిలో ఉన్న రోజులలో, ఆయనకు రాజకీయంగా చాలామంది పోటీదార్లూ, విరోధులూ ఉండేవారు. వారెప్పుడూ వర్కింగు కమిటీముందు దాస్‌గారి మీద తీవ్రమయిన ఆరోపణలూ, ఫిర్యాదులూ చేసెవారు.

ఆయన కాంగ్రెసు మెంబర్ల లిస్టును ఇష్టంవచ్చిన చేర్పులూ, మార్పులూ, కొట్టివేతలతో నింపి చాలా అయోమయంగా ఉండేవాడని, పిర్యాదు ఉండేది. ఈ విషయంలో వర్కింగు కమిటీవారు విచారణ చేయక తప్పలేదు. ఆయనా వర్కింగు కమిటి మెంబరే అయినా, ఆయన విషయంలో విచారణ జరుగనున్నదని తెలిస్తే వెంటనే బయటికి వెళ్ళి, ఆ విచారణ పూర్తయ్యాకే తిరిగివచ్చి కమిటీతో కలిసేవాడు. ఆ విచారణ కాలాన్ని బాగా సాగదీశారు. అనేక ప్రాంతలలో జరిగిన వర్కింగ్ కమిటీ మీటింగులలో దాసుగారిపై మోపబడిన పిర్యాదులు విచారణకు రావడమూ, అట్టి విచారణ సమయాలలో ఆయన మీటింగు నుంచి నిష్క్రమించడమూ, మామూలే అయింది. ఏదయిదేనేం, చివరికి ఆయనపట్ల ఆరోపించబడిన లోట్లేవీ ఆయనవద్ద లేవనీ, మోపబడిన నేరాలన్నీ గాలిమూటలే నని గౌరవ పురస్సరంగా తెలియ జేశారు. ఆయన మరణానంతరం బెంగాలు పూర్తిగా తేరుకోలేక పోవడానికి కారణం అక్కడ ఉన్న పార్టీ విబేదాలూ, చీలికలూను. మేము కొన్ని కొన్ని విషయాలలో భేదాభిప్రాయంతో ఉంటూ ఉన్నా, మా ఉభయుల మధ్యా వ్యక్తిగత గౌరవాలూ, ఆదరాభిమానాలూ కించిత్తు కూడా తగ్గలేదు.

  1. 16-6-1925.