నా జీవిత యాత్ర-2/కొన్ని ముఖ్య ఘట్టాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

15

కొన్ని ముఖ్య ఘట్టాలు

నేను 23-2-1923 వ తేదీని వర్కింగు కమిటీ సభ్యత్వానికి అలహాబాదులో రాజీనామా ఇచ్చిన సందర్భంలో, వర్కింగు కమిటీవారి మినిట్సు బుక్కులో, ఇల్లా వ్రాశాను: "చిత్తరంజందాస్, పండిత మోతిలాల్ నెహ్రూగార్ల ప్రోద్బలంతో, త్రివిధ బహిష్కార సూత్రాన్ని రెండు మాసాలపాటు విరమించ దలుచుకున్నారు. మంచిదే. కాని వారు కట్టెను చీల్చడానికి నాటిన గొడ్డలి మొన ఆ కట్టెను చీల్చడానికే ఉపయోగపడేటట్లు ఈ విరమణ అన్నది నిర్విరామంగా సాగుతుంది." సరిగా ఆ ప్రకారమే జరిగింది. దాస్-మోతిలాల్ గారలు రెండు మాసాలపాటూ ప్రజల్నీ, ప్రజాహృదయాన్నీ "కౌన్సిల్ ఎంట్రీ" విధానానికి అనుకూలంగా ఉండేటట్లు, త్రిప్పుకోవడానికిగాను, దేశమంతటా పర్యటించారు. త్రివిద బహిష్కార విధానానికి విరమణ అన్నది జరగడంతోనే, ప్రజల్లో ఆ విధానంపట్ల ఉన్న గౌరవ భావం సన్నగిల్లింది. ఎప్పుడయితే దాస్-మోతిలాల్ గార్లు ఆ విషయంలో ప్రజాభిప్రాయాన్ని తమ వైపు త్రిప్పుకోగలమనే ఆశతో యాత్రకు బయల్దేరారో, అప్పుడే మిగిలిన కాస్త గౌరవమూ పూర్తిగా దెబ్బతింది. "సర్వెంట్ ఆప్ కలకత్తా" పత్రికా సంపాదకులు శ్యామసుందర చక్రవర్తిగారు ఈ విషయాలన్నీ చక్కగా వివరిస్తూ తమ పత్రికా ముఖంగా ప్రచురించేవారు.

ఆయన అన్నారు. "దాస్, నెహ్రూగార్లు బహిరంగ సభలో విరాళాల కోసం విజ్ఞప్తి చేసినప్పుడు, దాతలు తాము ఇచ్చే విరాళంలో సగం వారు తీసుకుని, మిగతా సగం గాంధీగారి నో ఛేంజి పార్టీవారికి అందచేయాలంటూ వచ్చారు. తర్వాత కొంత కాలానికి నేను బొంబాయిలో ఎస్. పి. బొమ్మంజీ ఇంటిలో దాస్-మోతిలాల్‌గార్లను కలుసుకున్నప్పట్టి ఉదంతం వినండి. వారు తాము తమ పార్టీకి విరాళాలకోసం వచ్చామని చెప్పారు. "నేను మీపార్టీవారికి రు 500/-లు నిరభ్యంతరంగా ఇస్తాను. కాని కాంగ్రెసు పార్టీవారికికూడా, వారు అడక్కపోయినా, అదేప్రకారం రు 500/-లు ఇవ్వ నిశ్చయించుకున్నా" నన్నారు బొమ్మంజీ.

కాకినాడలో 1923 డిసెంబరు మాసంలో, కాంగ్రెసు సమావేశం అయ్యేలోపల, గయా కాంగ్రెసు తీర్మానం దాస్-మోతిలాల్‌గార్లు చిన్నాభిన్నం చేయగలిగారు. గయా కాంగ్రెసు తీర్మానానికి డిల్లీ స్పెషల్ కాంగ్రెసువారు తిరుక్షవరం చేశారన్న సంగతి మరువరానిదే. స్వరాజ్య పార్టీవారికి నవంబరు 23 న జరుగనున్న ఎన్నికలలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వడం, గయా తీర్మానానికి తిరుక్షవరమే కదా!

స్వరాజ్యవాదుల విధానంలో మార్పు

కాకినాడలో డిసెంబరు మాసంలో జరిగిన కాంగ్రెసులో ఢిల్లీ తీర్మానాన్ని ఒక షరతుమీద బలపరిచారు. స్వరాజ్య పార్టీ వారు కౌన్సిల్ ఎంట్రీ పోగ్రాంను అన్ని విధాల అమలు పరచుకోవచ్చు. ఎన్నికలలో నెగ్గి, కౌన్సిల్‌లో ప్రవేశించ వచ్చును. కాని, వారు ఒక్క విషయాన్ని మాత్రం విస్మరించరాదు. ఎన్నోవిధాల అడ్డంకులమీద అడ్డంకులు కల్పిస్తూ పరిపాలన సాగకుండా, కౌన్సిల్లో కూర్చునికూడా సహకార నిరాకరణ అస్త్రాన్ని ప్రయోగించాలి.

తమ రాష్ట్రంలో ప్రభుత్వ విధానం కొనసాగకుండా కొంత వరకూ దాస్‌గారు మాత్రమే తంటాలు పడగలిగారు. ఒకమాటు దాస్‌గారు సుస్తీగా ఉండి అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆయన పార్టీవారు సందిగ్దంలో పడి, కింకర్తవ్యతా మూడులయి ఊగిసలాడారు. సంగతులు ఇలా పరిణమిస్తాయనో, పరిణమించాయనో కనిపెట్టిన దాస్‌గార్ని స్ట్రెచ్చర్‌మీద అసెంబ్లీకి తీసుకురావడంతో పరిస్థితి చక్కబడి, సహకార నిరాకరణం చక్కగా సాగింది. ఆ రోజులలో కూడా సహకారాభిలాష ఉండేది.

ఈ విధంగా, లోపల ఉండి అడ్డంకులు తీసుకురావాలనే స్వరాజ్యవాదుల అభిలాష, క్రమేపీ 1924-25 సంవత్సరాల నాటికి, తమ ఉద్దేశాలకు, ఆదర్శాలకూ అనుగుణంగా, దేశసౌభాగ్యానికి దోహదం చేసే తీర్మానాల విషయంలో సహకరించాలనే పద్ధతికి మారిపోయింది.

లార్డ్ బర్కెన్ హెడ్ అప్పట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఉండేవాడు. తియ్యటి మాటలతో స్వరాజ్య పార్టీవారిని మెల్లి మెల్లిగా తనవైపు త్రిప్పుకోగలిగాడు. "భారతీయులు మాకు హృదయపూర్వక సహకారం ఇచ్చిననాడు, మేము పిసినిగొట్లలా బేరాలాడం" అన్నాడాయన. ఇల్లాంటి కబుర్లతో మానవ హృదయాలను ఆకట్టుకోగల శక్తి ఆయనకుంది. 1926 ప్రారంభ దినాలలో, దక్షిణ ఆఫ్రికా భారతీయుల తరపున వైస్రాయితో ప్రసంగించడానికి, పండిత మోతిలాల్ నెహ్రూగారూ, లాలా లజపతిరాయిగారూ కలసి వైస్రాయి మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మాటలు మళ్ళీ విన్నారు. అప్పటికి సహకార నిరాకరణ ఉద్యమం ఆరంభమయి అయిదు సంవత్సరాలయింది.

1922 లో గాంధీగారి నిర్భంధంతో పాలకులు కాంగ్రెసులో విభేదాలు తీసుకు రాగలిగారు. గాంధీగారికి దేశంలో పలుకుబడి తగ్గిందనీ వారికి గ్రాహ్యం అయింది. దాస్-మోతిలాల్‌గార్లు ఎప్పుడయితే తాము నిర్భంధంలో ఉంటూ కూడా, గాంధీగారిని విమర్శింప సాగారో, అప్పుడే గాంధీగారి పలుకుబడి దేశంలో సన్నగిల్లుతోందని నిర్ధారణ అయింది. కాగా ఆ పరిస్థితుల్ని గమనించే, జైళ్ళల్లో ఉన్న దాస్-మోతిలాల్‌గార్లకు, గాంధీగారిని కాదని, రాజీ ప్రతిపాదనలు సూచిం చారు. అప్పుడే, ఆ రాజీ సూచనల కారణంగానే, దాస్-మోతిలాల్ గార్లకూ, గాంధీగారికీ మధ్య విభేధాలకి అంకురార్పణ అయింది. స్వరాజ్యవాద నాయకులకు నిరవధికంగా ఆశలు కల్పిస్తూ, వైస్రాయి తన బుద్ధి చాతుర్యం ఉపయోగించి దేశ నాయకులలో చీలికలు తీసుకురాగలిగా డన్నమాట. ఈ ప్రకారంగా దేశీయుల ఐకమత్యాన్నీ, కాంగ్రెసు బలాన్నీ క్షీణింపజేయడం పాలకుల విధానం అయింది. బర్కెన్ హెడ్ సెంట్రల్ అసెంబ్లీ ప్రాంగణంలో చేసిన (7-7-1925) ప్రసంగంలోని ఆశాజనక వాక్యాలు 20-1-1926 న భారత శాసన సభను ప్రారంభిస్తూ రీడింగ్ ప్రభువు పునశ్చరణ చేశాడు.

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పర్యటన సందర్భంలో 1921 లో దేశీయులు అవలంబించి, నడిపించ గలిగిన బహిష్కరణ విధానం, లార్డ్ రీడింగ్‌నీ, ఆయన పరిపాలనా యంత్రాంగాన్నీ ఊపి పారేసింది. అప్పటి నుంచీ ఆలోచనా సాగరంలో ములిగిన ఆ రాజకీయ వేత్తలు, మెల్లి మెల్లిగా స్వరాజ్యపార్టీ నాయకుల హృదయాలలో దౌర్బల్య బీజాలునాటి, వారికి లేనిపోని ఆశలు కల్పించి, మొత్తంమీద మూడు సంవత్సరాలలో, వారిని మెత్త పడేటట్టు చేశారు. వారి ఉద్యమాన్ని త్రొక్కిపారేశారు. వారి ఆటలు 13-3-1922 లో గాంధీగారి నిర్బంధంతో ఆరంభమయి, అయన్ని 5-4-1924 న విడుదల చేసిందాకా, అవిచ్ఛిన్నంగా సాగాయి.

మోతిలాల్‌నెహ్రూ నాయకత్వం

1926 వ సంవత్సరం మార్చి 6,7 తేదీలలో అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగు ఢిల్లీలో జరిగింది. నేనా మీటింగుకు హాజరయ్యాను. అంతక్రితం సరోజనీదేవీ అధ్యక్షతను కాన్పూరులో జరిగిన కాంగ్రెస్‌లో తీర్మానింపబడిన ప్రతిపాదనలన్నీ ఈ మీటింగులో బలపరుప బడ్డాయి. అంతేకాదు, స్వరాజ్య సంపానకై తాము చేస్తున్న కృషికి అవరోధంగా, పాలకులు అవలంబిస్తున్న విధానాల నన్నింటినీ ఖండించి, వాటిని శాంతియుతంగా ఎదుర్కోవాలని నిశ్చయించబడింది. ఇంకొక స్పెషల్ తీర్మానంలో కాంగ్రెసు కార్యక్రమానికి నిరోథకమైన ఉద్యోగాలను వేటినయినా ప్రభుత్వంవారు ఇస్తామని సూచించి నప్పుడు, వాటిని స్వీకరించడానికి ఏ కాంగ్రెసువాదీ ముందుకు రాకూడదనే ప్రత్యేక తీర్మానమున్నూ ఆమోదింపబడింది. పైగా, ఆ కాంగ్రెసు జరుగుతూన్న రోజులలోనే హిందూస్థాన్ సేవాదళ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. సేవా దళాన్ని గురించి వివరంగా తర్వాత తర్వాత విస్తరిస్తాను.

స్వరాజ్యపార్టీ లీడరుగా రాజకీయ రంగంలో పేరుగన్న మోతిలాల్ నెహ్రూగారి దుర్బలత్వం, ఆయన స్కీన్ (SKEIN) కమిటీ [1]మెంబరుగా ఉండడానికి అంగీకరించడంతో బయల్పడింది. వారి పార్టీ సభ్యులు పార్టీ మూలసూత్రాలనే ఉల్లంఘించే సందర్బంలో, మోతిలాల్‌గారే స్కీన్ కమిటీ సభ్యత్వం అంగీకరించగా లేనిది, మేము చేసింది ఏ విధంగా తప్పవుతుందో చెప్పమనడానికి అది వీలిచ్చింది. నిజంగా స్వరాజ్య పార్టీవారే గనుక సంపూర్ణ సహకార విధానాన్ని చేపట్టి ఉంటే వారు ఇతోధికంగా జయాన్ని సాధించి ఉండేవారు.

కొన్ని కొత్త స్కీములను ప్రవేశ పెట్టాలనే సదభిప్రాయంతో, సెంట్రల్ అసెంబ్లీ స్వరాజ్య పార్టీవారు చేసిన ప్రతిపాదనానుసారంగా ఏర్పడిన మడ్డిమన్ (MUDDIMAN) [2]కమిటీ సభ్యత్వం కూడా వారిని వరించి ఉండేది.

పూర్తి సహకార విధానానికి గనుక, దాస్-మోతిలాల్‌గారలు అనుమతించి ఉండి ఉంటే, వారినీ, వారి విధానాన్నీ, సహకార నిరాకరణ ఉద్యమ మూలసూత్రాలకే మోసం కలుగుతుందనే మిషమీద, కాంగ్రెసువారు త్రోసిపుచ్చేవారు. వారుభయులూ బాగా తెలివి గల లాయర్లు. పైన ఉండి సహకార నిరాకరణ చెయ్యవలసిందని చెప్పిన గాంధీగారూ, లోన జొరబడి సత్యాగ్రహం సాగించమని ప్రబోధించిన దాస్-మోతిలాల్‌గార్లూ ఉద్యమాలు సాగించి ఉండి ఉంటే, కౌన్సిల్ లోపల ఉండిన వారి సహకారం కాంగ్రెసును ఛిన్నాభిన్నం చేయడానికి మాత్రమే ఉపకరించి, బైటనుంచి గాంధీగారు నడిపించే సహకార నిరాకరణ విధానానికి పెద్ద దెబ్బగా ఉండేది.

పగటికలల పరిసమాప్తి

స్వరాజ్యవాదులు లోన ప్రవేశించి పరిపాలనా యంత్రాన్ని బలహీనం చేయడమన్న విషయంలో అపజయాన్ని పొందినా, కాంగ్రెసునూ, గాంధీగారినీ బలహీనంచేసి, కాంగ్రెసు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంలో మాత్రం జయాన్ని సాధించారు. వాదోపవాదాలు సాగించే సందర్భంలో వారు, తాము అవలంబించే విధానానికి లక్షలాది జనుల అనుమతిని పొందలేరనే విషయాన్ని గ్రహించ లేకపోయారు. పైగా అసెంబ్లీలోని తోటి వారంతా కలసినా, వారికంటె బలవంతులు కాలేరన్న సంగతి కూడా వారు గ్రహించి ఉండరు. అంతేకాదు, వారికున్న దుర్బలత్వంచేత క్రమేపీ వారి పార్టీ శక్తిహీనమయి, క్షీణించి క్షీణించి నశించేది. లార్డ్ రీడింగ్ స్వరాజ్యపార్టీ నాయకులతో ఇంకా బేరాలు పెడుతూన్న నాటికి వారి పరిస్థితి అల్లా ఉండేది.

1926 ప్రారంభ దినాలలో, సెంట్రల్ అసెంబ్లీలో జరుగుతూన్న బడ్జెట్ మీటింగులకు మోతిలాల్ నెహ్రూగారు, తమ పార్టీతో సహా వెళ్ళినప్పుడు వారి కళ్ళు పూర్తిగా తెరువబడి , అంతవరకూ వారు కంటూ ఉన్నవి పగటి కలలేనని తెలిసికో గలిగారు. ప్రభుత్వం వారు సకాలంలో సవ్యంగా సహకరించి సంచరించకపోతే దేశం అంతటా "రకరకాల సంఘాలు" ఏర్పాటవుతాయి, జాగ్రత! అని హెచ్చరిస్తూ, వారూ వారి పార్టీ వారూ అసెంబ్లీ చర్చలలో పాల్గొనకుండా బైటకు వచ్చేశారు.

మోతిలాల్ నెహ్రూగారు, తానూ తన పార్టీవారూ తిరిగీ సహకార నిరాకరణ కార్యక్రమానికి దిగుతాం అని చెప్పడానికి బదులు, రహస్య సంఘాల స్థాపన ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆయన ఆవేశపూరితు లయినప్పుడు, తాను ఉచ్చరిస్తూన్న పదాలు ఎటువంటి పరిణామాలకు తీసుకు వెడతాయోనన్న ఆలోచనలేకుండా, తొందరపాటుతో ఇల్లా కాస్త తబ్బిబ్బు అవడం మామూలే. అప్పట్లో బెంగాలులో విప్లవ వాతావరణం తల ఎత్తడమూ, దానిని ప్రభుత్వం దయాదాక్షిణ్యాలు లేకుండా ఛిన్నాభిన్నం చెయ్యడమూ జరిగాయి. చైనా, జపాను మొదలైన దేశాలలో ఉన్నట్లుగా మనదేశంలో అలాంటి రహస్య సంఘాల స్థాపనకు అనువైన వాతావరణం లేకపోయినా అలజడి మాత్రం కలిగింది. అంతేకాదు, అటువంటి విప్లవ వాద సంఘాలను గురించి మోతిలాల్ వంటివారు ప్రస్తావించారంటే వారికి అహింసా తత్వంమీద అపనమ్మకం ఉందా అనే అనుమానం కలుగుతుంది.

ఆ రోజులలో నేను విస్తారంగా విదేశాలలో పర్యటిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి రహస్య సంఘాల, సంచలనాల వార్తలు చెవిని బడుతూనే వుండేవి. నేను సింగపూరులో 1920 లో పర్యటిస్తూండగా పరిచయం ఉన్న ఒక డాక్టరుగారి కారులో, ఆయనతో కలిసి ఆ పరిసరాలలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ కారు స్వయంగా డాక్టరుగారే నడుపుతున్నాడు. ఆ రాత్రి తిరుగు ప్రయాణంలో రోడ్డు మీద మాకు ఒక శవం కనబడింది. ఆయన కారు ఆపుజేశారు. ఉభయులమూ దిగి ఆ శరీరాన్ని పరీక్ష జేశాము. శరీరంనిండా తుపాకీ తూట్లు కనబడ్డాయి. డాక్టరుగారు ఆ విషయాలన్నీ తమ నోటు బుక్కులో నోటు చేసుకున్నాకనే ముందుకు సాగాము. కొంతదూరం వెళ్ళాక మాకు దారిలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు. డాక్టరుగారు కారు ఆపుజేసి, భోగట్టా చేశారు. అంతక్రితమే రోడ్డు మీద రెండు రహస్య సంఘాలమధ్య ఘర్షణ జరిగిందనీ, ఇరుపక్షాలకు మధ్యా బాహాటంగా కాల్పులు జరిగాయనీ వారు చెప్పారు. సాధారణంగా సంఘర్షణ జరిగిన వెంటనే చనిపోయినవారి శవాలను అంతు చిక్కకుండా తొలగించేస్తారని వారు అన్నారు. ఆ దేశం మొత్తంమీద చాలా రహస్య సంఘా లున్నాయనికూడా వారు చెప్పారు. బెంగాలులో తల యెత్తిన విప్లవ సంఘాలను ఆంగ్లేయ ప్రభుత్వంవారు భారతీయ ఉద్యోగులచేతేనే వెనువెంటనే అణగద్రొక్కించారు.

ఆ విప్లవోద్యమం అంతం అవుతూన్న రోజులలోనే, నెహ్రూగారి పూర్తి సలహా సంప్రతింపులతోనే, గాంధీగారు అక్కడ ఈ అహింసాత్మక సహకార నిరాకరణ ఉధ్యమం స్థాపించడం జరిగింది. కాని, కొద్ది రోజులలోనే పుంజుకున్న గాంధీగారి సత్యాగ్రహ విధానం మోతిలాల్‌గారికి అంతగా నచ్చలేదు. నిజానికి గాంధీగారి విధానపు బలిమి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాక సందర్భంలో రుజువైనా, తాము చెప్పినా గాంధీగారు వైస్రాయి రాజీ ప్రతిపాదనలకు ఒప్పుకోక పోవడంచేత, మోతిలాల్‌గారికి గాంధీగారి విధానంపట్ల విముఖత్వం ఏర్పడింది. గయా కాంగ్రెసు తరువాత గాంధీగారి కార్యక్రమం క్రమంగా మూలబడింది.; ఆయన జైలుకు వెళ్ళిన ఏడాదిలోపలే త్రివిధ బహిష్కారోద్యమం రెండు మాసాలపాటు నిలుపు చేయబడిన సంగతి 1924 ఫిబ్రవరిలో విడుదలై వచ్చిన గాంధీగారు తెలుసుకుని తన ముఖ్య అనుచరులే తన విధానానికి అనుకూలంగా లేరనే విషయాన్ని, అప్పటి పరిస్థితిని గ్రహించి, ఆయన శాసన సభా ప్రవేశానికి ఒప్పుకున్నారు. అయినప్పటికి మోతిలాల్‌గారికి పూర్తిగా సంతుష్టి కలుగలేదు.

గాంధీగారిని 1924 లో హాస్పిటల్నుంచి విడుదల చేశాక అహమ్మదాబాదులో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశ సందర్భంలో ఆయన్ని కలిసికొని, ఆయన జైలుకు వెళ్ళినదాదిగా జరిగిన సంఘటనల నన్నింటినీ నేను ఎరుక పరిచాను. ఆయన సన్నిహితులే ఆయన మార్గానికి నిరోధకులవుతున్నారన్న విషయాన్ని సూచిస్తూ, మహమ్మదాలీ మున్నగు వారందరూ ఆయన్ని ద్రోహం చేశారని చెప్పాను. కాని నా మాటలయందు వారికి అంతగా విశ్వాసం కలిగినట్లు లేదు. సింధు దేశీయుడైన చౌత్రాంగారు ఈ సంగతే తిరిగి చెప్పిన తర్వాత సభలోనే గాంధీగారి కళ్ళనుండి నీళ్ళు కారాయి.

సన్నిహితులయిన అనుచరుల సంగతి సందర్భాలు ఎల్లా ఉన్నా, దేశం మట్టుకు ఎప్పుడూ గాంధీగారి పక్షంగానే ఉన్నదన్న సంగతి బెల్గాం కాంగ్రెసులో రుజువయింది. బెల్గాం కాంగ్రెసులో దాస్-మోతిలాల్ నెహ్రూగార్లని కాదని, వారి పార్టీని వోడించి, గాంధీగారి విధానాన్ని పున:ప్రతిష్టజేశారు. అయితేనేం, తాను తక్కువ మెజారిటీతో గెలవడంచేత గాంధీగారు, తమ పార్టీవారికి ఏదో భీతి ఉన్నదనే నిర్ధారణకు రాక తప్పదంటూ, కాంగ్రెసును దాస్-మోతిలాలుల పరం చేశారు.

పార్టీలో విభేదాలు

స్వరాజ్య పార్టీవారు శాసన సభా ప్రవేశంచేసి రెండు సంవత్సరాలు (1924-25) వ్యవహరించిన సందర్భంలో వారిలో వారికి అబిప్రాయబేదాలు వచ్చి, పేచీలు, కీచులాటలు, పిల్ల సమ్మేరీలు ఆరంభం అవడం మూలంగా ఆ పార్టీ తన పలుకుబడిని కోల్పోయింది. కౌన్సిల్ లోపల ఉంటూనే దానిని తిరగతోడుదాం, దాని కార్యక్రమం, రాజ్యాంగ విధానం సాగకుండా వ్యవహరిద్దాం అంటూ వచ్చినవారే క్రమేపీ నీళ్ళు కారిపోయి పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అనడంలో అర్థంలేదు.

తమ ఉద్దేశాలకు ఆదర్శాలకూ, అనుగుణంగా దేశక్షేమానికి ఉపకరించే వ్యవహారాలలో ప్రభుత్వంతో సహకరిస్తూ, అనుమానస్పదమైన విషయాలలో ప్రాతికూల్యం వహిస్తూ "ప్రతిస్పందన సహకారిత్వం" (Responsive co-operation) అనే నూతన విధానాన్ని స్వరాజ్యవాదులు చెన్నరాష్ట్రాంలోనే గాక, ఇతర రాష్ట్రాలలో కూడా చేపట్టడం జరిగింది. కాగా, కొంతమంది కాంగ్రెసు సేవకులకు ప్రభుత్వోద్యోగాలమీద మోజు కలిగింది. మొత్తానికి, ఏదో విధంగా స్వరాజ్య పార్టీవారు రాజకీయంగా దిగజారిపోయారు. లోపల ఉండి దెబ్బతీస్తాం, రాజ్యాంగ విధానాన్ని సాగనివ్వం, తిరగతోడుతాం అంటూ బీరాలు పలికిన స్వరాజ్య పార్టీవారే, వారి మధ్య ఉత్పన్నమైన భేదాభిప్రాయాలకు తట్టుకోలేక, దెబ్బతిని, పార్లమెంటరీ పద్దతికి దిగజారి, రాజ్యాంగాన్ని తామే చేపట్టి తంటాలు పడేవరకూ వచ్చారు.

సబర్మతిలో కుదిరిన రాజీ

ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ద్వంద్వ ప్రభుత్వ పద్దతిని రాజ్యాంగ విధానాన్ని నడపడానికి ముగ్గురు మంత్రులు ఏర్పడడం అంటూ జరిగాక, ఈ పెద్ద నాయకు లంతా తమలో ఏర్పడిన అభిప్రాయభేదాలనీ, చీలికలనీ సరిదిద్దుకుని తిరిగి ఒకే తాటిమీదకు రావడానికని, గాంధీగారి సబర్మతీ ఆశ్రమంలో సమావేశం అయ్యారు.

స్వరాజ్యపార్టీ మొత్తంమీద మూడు విభాగాలయింది: కొందరు అసలు అనుకున్న ప్రకారం ప్రభుత్వం సాగకుండా అడ్డంకులు తేవాలనేవారు, అవసరం అని తోచినప్పుడల్లా దేశానికి క్షేమకరమయిన ప్రతిపాదనల విషయంలో సహకరించాలనే "ప్రతిస్పంద సహకార" పద్దతివారూ, పూర్తిగా ప్రభుత్వానికి అన్నిరంగాలలోనూ సహకారాన్ని ఇవ్వాలనేవారు.

అందులో అవసరాన్నిబట్టి సహకరిద్దాం, పూర్తిగా సహకరిద్దాం అనే వర్గాలవారు తమ ప్రణాళికనుండి సహకార నిరాకరణం, సత్యాగ్రహం, శాసన దిక్కారం అనే పదాలను ఎత్తివేద్దాం అనే నిశ్చయించుకున్నారు.

దరిమిలా 21-4-1926 తేదీన సబర్మతీలోనే జరిగిన సభలో పై రెండు వర్గాల వారూ ఒక విధంగా ఒప్పందానికి వచ్చి, మంత్రులకు ప్రజాభిప్రాయాన్ని మన్నించగల శక్తి కలిగిననాడు ద్వంద ప్రభుత్వ విధానంగా సహకరించి పరిపాలన సాగిద్దాం అనే నిశ్చయానికి వచ్చారు. కాని అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు ఈ విధానానికి ఒప్పుకుంటేనేగాని నిర్ణయం అమలు పరచరాదని భావించారు. బ్రిటిషు గవర్నమెంటువారు మంత్రులు ప్రజలకే జవాబుదారీ అనే సూత్రాన్ని అంగీకరించి నట్లయితే, వారు 1924 పిబ్రవరిలో తాము వెలిబుచ్చిన కోరిక[3]ఒప్పుకున్నట్లుగా, భావిస్తామన్నారు. వారిలో రాజ్యాంగాన్ని చేపట్టాలనే కోరిక అంత ముమ్మరంగా ఉందన్నమాట.

ఈ విధానానికి లోబడిపోతూన్న స్వరాజ్యవాద నాయకులను, 1925 లో కాన్పూరు కాంగ్రెసు తీసుకున్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించి, పతనం ఎంతవరకూ వచ్చిందో గ్రహించి మరీ వ్యవహరించమని హెచ్చరించకుండా, ఉండలేకపోయాను నేను.

కాన్పూరు కాంగ్రెసువారి మొదటి తీర్మానానికి పండిత మాలవ్యాగారు సవరణ సూచించారు. అ సవరణను జయకర్‌గా రంగీకరించి బలపరిచారు. దాని ప్రకారం, దేశానికి అనువయిన పరిపాలనా విధానాన్ని అమలు పరిచే నిమిత్తం శాసన సభా కార్యకలాపాలు ఉత్తేజ పరచాలనీ, అప్పుడే ప్రతినిధులు ప్రభుత్వం వారితో సహకరించడమో, రాజ్యాంగాన్ని నిరసించడమో త్వరగా తేలుతుందన్నారు. ఈ సవరణ ఆమోదింపబడింది.

జయకర్, హోల్కార్, మూంజీగారలు స్వరాజ్య పక్షీయులలో వచ్చిన విభేదాలవల్ల రాజ్యాంగ సభా సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. దీనికి ముందుగా అఖిల భాతత స్వరాజ్యపార్టీ కమిటీవారి మీటింగులో స్వరాజ్యవాదుల మధ్య రాజీ ప్రతిపాదన ప్రసక్తి వచ్చింది. మోతిలాల్ నెహ్రూగారు మంత్రి పదవిని చేపట్టడం విషయంలో తానున్న పరిస్థితినీ, తన సాధక బాధకాలనీ వ్యక్తపరిచారు.

పదవీ స్వీకరణ సమస్య

ఆ తరవాత మోతిలాల్‌గారు పదవీ స్వీకరణం గురించి, స్వరాజ్య వాదుల పద్ధతి ప్రకారం ఈ దిగువ షరతులు అంగీకరింపబడా లన్నారు

1. ప్రభుత్వం వారికి మంత్రులపై ఎలాంటి ఆధిపత్యమూ ఉండ కూడదు. మంత్రులు శాసన సభా మర్యాదలను పాటిస్తూ, వాటికి అనుగుణంగా నడవాలి.

2. జాతీయ ప్రణాలికావసరాలకు కావలసిన ధనం ప్రత్యేకింప బడాలి.

3. తమ ఆధీనం చేయబడిన అంశాల నిర్వహణ సవ్యంగా సాగించుకొనడానికి మంత్రులకు వాటికి సంబంధించిన ప్రభుత్వోద్యోగులపై అధికారం ఉండాలి.

సబర్మతీలో అంగీకారం పొందిన విధానాలకు ఈ విషయం అనుగుణంగా లేదంటూ జయకర్‌గారు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితులలోనే నేను కాన్పూరు తీర్మానాలకన్నా సబర్మతీ నిర్ణయాలు హీనంగా ఉన్నాయని అనవలసి వచ్చింది.

1926 మే 5 వ తేదీన అహమ్మదాబాదులో జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశంలో ఈ తేడా పాడాల వల్లనే స్వరాజ్యపార్టీ లోని రెండు ముఖ్య విభాగాల వారికీ పొత్తు కుదరలేదనీ మోతిలాల్ నెహ్రూగారే బహిరంగపరిచారు. ఈ పరిస్థితులలో మద్రాసువారు సబర్మతీ నిర్ణయాలకు వ్యతిరేకు లయ్యారు. అప్పుడు మోతిలాల్‌గారు అనిబిసెంట్‌గారి కామన్‌వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ఆమోదంకోసం అఖిల భారత కాంగ్రెసు సంఘం వారి ముందు ప్రతిపాదించారు. దానికి మేము వ్యతిరేకించాము.

1925 లో చిత్తరంజందాస్‌గారు ఫరీద్‌పూరులో స్వరాజ్యపార్టీ పేరుమీద కొన్ని షరతులు ప్రతిపాదించి, వాటిని ప్రభుత్వం వారు అంగీకరించాలని హుంకరించే ఉన్నారు. పైగా తన ప్రతిపాదనలు అంగీకారం కాకపోతే ప్రభుత్వంవారికి తాము ఇస్తూన్న సహకారం ఆపివేయబడుతుం దన్నారు. ఆంగ్లేయ పరిపాలకులు తమ శక్తి సామర్థ్యాలను గ్రహించి గౌరవిస్తారనే యోచనతో ఆ స్వరాజ్య పార్టీ నాయకులు ఇలాంటి ద్వంద్వ విరుద్ద ప్రతిపాదనలతో చాలా తికమకలు కలుగజేశారు. ఈ ప్రకారంగా అన్ని విధాల స్వరాజ్య పార్టీ వారు దెబ్బతిన్నారు. సహకార నిరాకరణానికి వ్యతిరిక్తత ప్రకటించినంతమాత్రానగాని, దానిని గురించి ప్రబోధం చేసినంత మాత్రానగాని ఆంగ్లేయులు లొంగిపోరన్న విషయం ఆదిలో దాస్-మోతిలాల్ నెహ్రూగార్లకు అవగాహన కాలేదు.

1924 పిబ్రవరిలో స్వరాజ్య పార్టీవారు కేంద్ర శాసన సభలో అధికారరీత్యా తమ కోరికలు వెలిబుచ్చారు. 1925 లో జరిగిన కాన్పూరు కాంగ్రెసులో కూడా వాటిని వ్యతిరేకించారు. కాగా, వారిలో ఉన్న రెండు విభాగాల వారికీ పొత్తు కుదిరిన కారణంగా, మూడు-నాలుగు మాసాలలో తిరిగి హెచ్చరిక జేశారు.

మంత్రులు శాసనసభాసభ్యులకు పూచీదారులయితే, తాము 1924లో వ్యక్తపరచిన కోరిక ప్రభుత్వం వారికి సమ్మతమైనట్టే భావిస్తామన్నారు. తిరిగీ ఫరీదుపూర్‌లో దాస్‌గారు తమ కోర్కెలను సవ్యంగా తీర్చకపోతే సహకారం అన్నది మృగ్యం అయిపోతుందనీ బెదిరించారు. ఈ ప్రకారంగా స్వరాజ్య పార్టీవారు అనేక విధాల తబ్బిబ్బులయ్యారు.

గాంధీగారి ఆధ్వర్యవంలో ప్రారంభమైన సత్యాగ్రహోద్యమపు ఉద్రిక్త పరిస్థితులలో స్వరాజ్యవాదులు చాలా త్యాగాలు చేశారన్నది నిజమే అయినా, వీరికి, పాతకాలపు మితవాదులకూ దృఢసంకల్పం తక్కువ. దేశావసరాలను గుర్తించీ, ప్రజాక్షేమం లక్షించీ కాంగ్రెసువారు వెల్లడిస్తూ వచ్చిన కోర్కెలను మన్నించడానికి స్థిరసంకల్పంగాని ధైర్యంగాని వీరిలో లేవనే అనవలసి వస్తుంది. పాతకాలపు స్వేచ్ఛా వాదుల విషయంలోలాగే ఈ స్వరాజ్య పార్టీవారి ప్రతిపాదనలకూ, ప్రజాభిప్రాయాలకూ సంబంధం తక్కువే. వాటికి పొంతన లేదనే చెప్పాలి. కాగా, అటు ఆంగ్లేయ అధికారుల వరస చూస్తే - లార్డ్ రీడింగూ, బర్కెన్‌హెడ్డూ కూడా అఖండులు. ఈ ఆంగ్ల రాజకీయ వేత్తల కుత్సితపు వాగ్దానాలు పయోముఖ విషకుంభాలే అయినా, మనవారికి తంత్రజ్ఞత తక్కువ అవడంచేతనో యేమోగాని, లేనిపోని ఆశలు వారి హృదయాలలో రేకెత్తాయి. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాక సందర్భంలో దేశీయులలో కనిపించిన ఐకమత్యానికి కలవరపడి, క్రిందు మీదయిన రీడింగ్ ప్రభువు తన జిత్తులమారితనంతో ఎత్తుపై ఎత్తులు వేస్తూ, తాను రిటైరయ్యేనాటికి కాంగ్రెసు పార్టీలో చీలికలు కల్పించి కృతకృత్యుడయ్యాడు.

ఈ ప్రకారంగా కాంగ్రెసులో బయల్దేరిన అభిప్రాయ భేధాలూ, చీలికలూ ఒక ప్రక్కనుంచీ, హిందూ మహమ్మదీయ కలహాలూ, కల్లో లాలూ ఇంకో ప్రక్కనుంచీ జాతీయోద్యమాన్ని దిగలాగాయి. లార్డ్ రీడింగ్ వైస్రాయిగా రిటయిరై ఇర్విన్ ప్రభువునకు రాజ్యాంగాన్ని ఒప్పగించిన రోజు ఎటువంటిదోగాని, ఆనాడే, ఆ 1926 ఏప్రియల్ 6 వ తేదీనాడే, అదే ఘడియలలో హిందూ మహమ్మదీయ సంఘర్షణలు చెలరేగి, ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి.

  1. మౌంట్ ఫర్డ్ సంస్కరణలు పనిచేస్తూన్న విధానం గురించి విచారించడానికి 1924 లో ఈ కమిటీ నియమించబడింది.
  2. శాండర్ట్స్(SANDHURST) కళాశాలతో సమానమైన ఒక సైనిక కళాశాల మన దేశంలో కూడా స్థాపించాలన్న ప్రతిపాదన సాధక బాధకాలు విచారించడానికి ఈ కమిటీ నియమించ బడింది.
  3. భారత దేశంలో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వ ప్రణాళికను సిఫార్సు చేసే నిమిత్తం రౌండు టేబిలు సభను సమావేశ పరచాలని కోరారు.