నా జీవిత యాత్ర-2/కాంగ్రెసు అధిష్ఠానవర్గ సభ్యత్వం:నిర్మాణ కార్యక్రమ ప్రచారం
1
కాంగ్రెసు అధిష్ఠానవర్గ సభ్యత్వం:
నిర్మాణ కార్యక్రమ ప్రచారం
అహమ్మదాబాదులో కాంగ్రెసు జరిగిన కొద్దిరోజులలోనే దేశబంధు చిత్తరంజన్ దాస్‌గారిని నిర్బంధించడమూ, ఆయనకి మూడుమాసాలు జైలుశిక్ష విధించడమూ జరిగింది. ఆ కారణంగా నేను అఖిల భారత కాంగ్రెసు సంఘానికి సర్వసాధారణ సహాయ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. అప్పట్లో విఠల్‌భాయ్ పటేల్‌గారు జనరలు సెక్రటరీగా అన్ని కార్యకలాపలు చూస్తూ ఉండేవారు. సహాయకార్యదర్శిగా నన్ను నియమించడం సబబుకాదని కే.సంతానంగారు ఒక చిన్న అభ్యంతరాని వెలిబుచ్చారు. ఈ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చుతూ, విఠల్‌భాయ్ పటేల్‌గారే, సమాధానంగా, నెలకు ఏడెనిమిదివేల రూపాయలు ఆర్జించగల శక్తిమంతుడు సహాయకార్యదర్శి పదవికి పనికిరాడా అని ప్రశ్నించారు. గాంధీగారు కూడా ఆ కార్యనిర్వాహకసంఘ సభలో ఆసీనులయ్యే ఉన్నారు. సంతానంగారి అభ్యంతరాన్ని త్రోసిపుచ్చుతూ, నన్ను సహాయకార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది.
అంతేకాదు. దరిమిలా, [1]దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారి నిర్బంధంతో, నేను కార్యనిర్వాహక సంఘ సభ్యుడనూ అయ్యాను. చిత్తరంజన్ దాస్‌గారి ముఖ్య స్నేహితునిగానూ, పత్రికా సంపాదకునిగానూ, కాంగ్రెసు కమిటీ సహాయ కార్యదర్శిగానూ, కార్యనిర్వాహకవర్గ సభ్యునిగానూ, భారతదేశమందలి అన్ని రాష్ట్రాలకూ తరుచు వెడుతూ ఉండేవాడిని. అవసరాన్నిబట్టి కార్యనిర్వాహక సంఘ సభలూ, అఖిలభారత కాంగ్రెసుసంఘ సభలూ, దేశంలో నలుమూలలా జరిపేవారం. ఆ కారణంగా దేశం నలుమూలలా తిరక్క తప్పేది కాదు. అంతేకాదు. ఆంధ్రరాష్ట్రీయ కాంగ్రెసు సంఘ అధ్యక్షునిగా నిర్మాణకార్యక్రమం ఉత్సాహవంతంగా కొనసాగించడానికిగాను ఆంధ్రప్రాంతాలన్నీ జిల్లాలవారీగా అనేకసార్లు తిరగవలసిన అవసరమూఉండేది. కార్యనిర్వాహకవర్గ సభ్యునిగాగాని, సహాయకార్యదర్శి హోదాలోగాని, ఏ ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినా, ఆ ప్రయాణాలకు దారి ఖర్చులయినా ఇచ్చే సంప్రదాయం అప్పటి కింకా ఆచరణలోనికి రాలేదు. దేశం నలుమూలలా తిరగడానికీ, ఆంధ్ర ప్రాంతం అంతా చుట్టడానికి ధారాళంగానే ధనం వ్యయ మయ్యేది. కాంగ్రెసు ఆదేశానుసారంగానూ, గాంధీగారి ప్రోద్బలంతోనూ నేను ప్రాక్టీసు విరమించే నాటికి[2] చాలాబాగా సంపాదించి ఉన్నకారణంగా ఈ ప్రయాణాల కన్నింటికి విచ్చల విడిగా నా సొంత డబ్బే ఖర్చు పెట్టేవాడిని.
దేశీయపాఠశాలలు - చరఖాకేంద్రాలు
ఆంధ్రదేశంలో అన్నిమూలలా నా స్వంతబాధ్యతపైనా, పర్యవేక్షణక్రిందా దేశీయపాఠశాలలు నెలకొల్పాను. ముఖ్యంగా ఒంగోలులో ఆరంభింపబడిన దేశీయ విద్యాలయానికి కాంగ్రెసు నిధులనుండి కాణీకూడా తీసుకోకుండా విరివిగా నేనే ఖర్చు పెట్టాను. అదేప్రకారంగా ఒంగోలుకు ఎనిమిదిమైళ్ళ దూరంలో ఉన్న గురవారెడ్డిపాలెంలో స్థాపించబడిన చరఖా కేంద్రానికీ నేనే విరివిగా ఖర్చుపెట్టాను. ఆ కేంద్రానికి పర్యవేక్షకునిగా (ధారా) గోపాలశాస్త్రిగారిని నియమించాను. ఈ నిర్మాణ కార్యక్రమానికి పదివేలరూపాయలు అఖిల భారత చరఖా సంఘంవారు మంజూరుచేసి ఉన్నప్పటికీ, గోపాలశాస్త్రిగారిని వారు సరిగా ఎరుగని కారణంగా ఆ పత్రంమీద జామీనుదారునిగా నేనూ సంతకం చేశాను. పదివేల రూపాయలూ గోపాలశాస్త్రిగారికి ముట్టాయి, ఆ సొమ్ము సద్వినియోగంచేసి శాస్త్రిగారు అవసరమయిన చరఖాలూ, మగ్గాలూ, పత్తీ వగైరాలు కొని గురవారెడ్డిపాలెం కేంద్రాన్ని యావత్తు భారతదేశంలోనూ ఆదర్శప్రాయమైందిగా రూపొందింప జేశారు. అఖిల భారత చరఖాసంఘం వారుకూడా తమ నివేదికలో యీ విషయాన్ని గురించి ప్రస్థావనచేస్తూ భారతావనిలోకల్లా ముఖ్యమయిన కేంద్రంగా గురవారెడ్డిపాలెం కేంద్రాన్నీ, గోపాలశాస్త్రిగారి సేవనీ అభినందించారు.
ఒంగోలులో నా సొంత బంగాళాలో ప్రారంభింపబడిన దేశీయ విద్యాలయంలో బాలురకు కేవలమూ వడకడమూ, నేయడమే గాక, ఇతరవిధములైన చేతిపనులనుకూడా నేర్పేవారు. అచ్చటి పారిశ్రామిక విభాగంలో ముఖ్యంగా చెంచాలూ, చాకులూ, మంగలికత్తులూ మున్నగు సామానులేగాక తాళాలూ, తాళంకప్పలూ వగైరాకూడా తయారు చేసేవారు. పై రెండు సంస్థలూ నా సొంత బాద్యతమీదా, పర్యవేక్షణక్రిందా నడపబడుతూ ఉన్నా, గోపాలశాస్త్రిగారి ఖాదీ ఉత్పత్తి కేంద్రం దేశ మొత్తానికి ముఖ్యకేంద్రం అయింది.
పంచాయతీ కోర్టుల స్థాపన
పంచాయతీలు కోర్టులు అనేక గ్రామాలలో నెలకొల్పాము. అవన్నీ ప్రతిభావంతంగానే పనిచేశాయి. ఇట్లు ఆంధ్రప్రాంతంలో ప్రారంభింపబడిన నిర్మాణాత్మక వ్యాపంగాలన్నీ 'తిలకు స్వరాజ్యనిధి' పైనే ఆధారపడలేదు. భారతావని మొత్తంమీద అనేకప్రాంతాలలో బయలుదేరిన నిర్మాణ కార్యక్రమ కేంద్రాల స్థాపనకే వసూలయిన కోటి రూపాయలూ సముద్రంలో కాకిరెట్ట అనిపించాయి. కూర ఖర్చు కయినా చాలచేదన్నమాట. ఆ ఒక్క సంవత్సరంలోనే యావత్తు భారతావనిలోని కాంగ్రెసు అభిమానుల, సేవకుల సొంతజేబులనుండి అటువంటి కోట్లు ఎన్ని ఖర్చయ్యాయో! ఒక్క యేడాదిలోనే స్వరాజ్యం వచ్చి తీరుతుంది అనే నమ్మకంతో ప్రజలు ఎటువంటి త్యాగాలకయినా సంసిద్ధులయ్యారు. అనేక గ్రామాలలో పంచాయతీలు, దేశీయ విద్యాలయాలు, ఖాదీ ఉత్పత్తికేంద్రాలు స్థాపించాం. అంటరానితనాన్ని నిర్మూలించడానికీ, హిందూ మహమ్మదీయ సఖ్యం సాధించడానికీ వెలలేని కృషి జరిపాము.
ఈ నిర్మాణాత్మక కార్య సంరంభమూ, దేశం మొత్తంమీద సాదించిన విజయాలూ చూస్తుంటే ఎటువంటివారికయినా ఏడాది తిరిగే నాటికల్లా నూతన రాజ్యాంగ తంత్రాన్ని నెలకొల్పి, బ్రిటీషు పరపాలనా యంత్రాన్ని త్రోసిపుచ్చి, వారికి పోటీగా ఇంకో ప్రభుత్వాన్ని సాధించి, నడిపించగల శక్తి మనకుంది అనే ధీమా, విశ్వాసమూ కుదిరాయి. త్రివిధ బహిష్కరణ విధానాన్నీ, నిర్మాణ కార్యక్రమాన్నీ, నడిపిస్తూన్న తీరుచూస్తే 1921 వ సంవత్సరంలో సాధించిన ఫలితాలు ఒక్క అయిదారు సంవత్సరాలపాటు నిలబెట్టుకో గలిగిననాడు, క్రిందనుంచి పైదాకా అన్నివిధాలా ఆంగ్ల రాజ్యాంగ యంత్రాన్ని త్రోసిపుచ్చి, ఫిర్కా గ్రామీణ ప్రాంతాలలోనే గాక, తాలూకాలలోనూ జిల్లాలలోనూ కూడా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాధికారుల సలహా సంప్రతింపులతో గాని, ఆర్ధికాది సహకారాలతోగాని నిమిత్తం లేకుండా, మనమే పరిపాలించుకో గలము అనే ధైర్యమూ, దృడవిశ్వాసమూ కాంగ్రెసువారిలో కుదిరాయి.
ఆంధ్ర, కన్నడ, ద్రవిడ, మహారాష్ట్ర, మలయాళాది దక్షిణ ప్రాంతాలూ, అంగ, వంగ, కళింగ, కాశ్మీర, అంటూ ఏకరువుపెట్టె రీతిగా, పంజాబు, సంయుక్త రాష్ట్రాలు, మధ్యరాష్ట్రాలు, గుజరాతు, బెంగాలు, ఉత్కళాది ప్రాంతాలన్నీ, ఒక్క బిగిని కాంగ్రెసు వారి నిర్మాణకార్యక్రమానికి అన్ని విధాలా దోహదాన్నిచ్చి, పోటా పోటీల మీద, మా రాష్ట్రంలో అంటే, మా రాష్ట్రంలో అంటూ, ముందు కురికాయి. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇదే వరస.
అహమ్మదాబాదులో కాంగ్రెసు జరిగే నాటికి యీ నిర్మాణాత్మక కార్యక్రమం అన్నది అన్నివిధాలా, జయాన్నే సాధించింది. వేలూ, లక్షలూగా ఉన్న నిరక్షరాస్యులు కూడా ఉత్తేజపూరితులయి, నూత్న శక్తితోనూ, తేజస్సుతోనూ విరాజిల్లుతూ స్వరాజ్య సంపాదనకోసం ఎట్టి ఉత్కృష్టమయిన త్యాగాలకయినా సరే సర్వసన్నద్దు లయ్యారు. నిర్ణీతమయిన కాలంలో కాంగ్రెసు విధానానికి తలయొగ్గి నిర్మాణాత్మక కార్యక్రమం దేశం మొత్తంమీద చాల ఉద్దృతంగా నెలకొల్పబడిన పరిస్థితిని గమనిస్తే, సాలాఖరునాటికి వ్యష్టి సత్యాగ్రహానికే గాదు, సమిష్టి సత్యాగ్రహాని కయినా దేశం సర్వసన్నద్ధంగా ఉన్నదని రుజువయింది.
పన్నుల నిరాకరణ విషయమై సంశయాలు
కాని నాకు మాత్రం పన్నుల నిరాకరణ ఉద్యమానికి దేశం యింకా సిద్ధంగా లేదేమోననే ధర్మసందేహం పీకుతూనే ఉంది. గాంధీ గారికి కూడా, వీలయితే యీ పన్నుల నిరాకరణ అన్నది ఒక్క బార్డోలీ ప్రాంతానికే పరిమితం జేయాలనే అభిప్రాయం స్థిరంగా యేర్పడింది. నేను కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా ఉంటూవున్న రోజులలోనే బార్డోలీ (గుజరాతు) లో పన్నుల నిరాకరణ ఉద్యమం నడిపించాలనే ప్రతిపాదన కార్యనిర్వాహకవర్గ సభలో ప్రవేశపెట్టబడింది. మాలో బార్డోలీ ప్రాంతాన్ని చూడనివారి కందరికీ - అక్కడి పరిస్థితులు అవగాహన కాకపోవడాన్నీ - మాలో శక్తి సంపన్నుడూ బలాధ్యుడూ అనుకున్న వ్యక్తి సహితం పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని నిర్వహించుకు రాగలదా అనే సంశయం ఉత్పన్నమైంది. నిజంగా బార్డోలీ ప్రజలు కష్టనష్టాలకు తట్టుకోగలరా అనే అనుమానం మమ్మల్ని బాధించింది. దాన్తో ఆకార్య నిర్వహకవర్గం సభలో మహాత్మగాంధీగారిని యీ పన్నుల నిరాకరణ ఉద్యమం అంటె వారికి వున్నభావమూ, అభిప్రాయమూ యేమిటనీ, బార్డోలీ ప్రాంతీయులచేత యీ పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభింపజేసి జయాన్ని చవిచూడగలరా అని ప్రశ్నించాము. అప్పుడు లాలా లజపతిరాయి గారూ కార్య నిర్వాహక సంఘ సభ్యులే. వారికీ ఈ బార్డోలీ సత్యాగ్రహ విషయంలో జయం సాధించగలం అనే నమ్మిక కుదరలేదు. ఆయన కూడా గాంధీగారిని, బార్డోవల్ ఉద్యమాన్ని ఈ విధంగా సాగించి ప్రభుత్వ విధానాన్ని మట్టుపెట్ట గలరని ప్రశ్నించారు.
అప్పట్లో గాంధీగారి హృదయంలో కూడా యీ విషయంలో ఒక నిర్నీతమయిన అభిప్రాయం ఉన్నట్లు లేదు. లజపతిరాయిగారు, సమగ్రమయిన తమ విధానాన్ని తేటతెల్లం చెయ్యమని గాంధీగారిని అడిగినప్పుడు, గాంధీగారూ కొంచెం నీళ్ళు నములుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆయన యేమన్నారో తెలుసా? దానికేముంది, మెజస్ట్రీటుగారికంటె ముందుగానే వెళ్ళి వారి కుర్చీలో కూర్చుని ఆకేసులన్నీ పరిష్కారం చేస్తానన్నారు. ఆ ముక్కలు నాకుగాని, లజపతిరాయిగారికిగాని ఎంతమాత్రమూ రుచింపలేదు.
ఇది చాలా స్వల్ప విషయమే అయినా, ఈ సంభాషణ జరిగి అప్పుడే పాతిక సంవత్సరాలు దాటినా, నాకు మాత్రం యీ సన్నివేశం అంతా బాగా జ్ఞప్తిలో ఉండిపోయింది. అప్పట్లో గాంధీగారికి ఆంగ్లరాజ్యాంగ విధానాన్ని కూలద్రోయడానికి సరియయిన పథకం అంటూ ఏదీ లేదని నిశ్చయించుకున్నాం. పన్నుల నిరాకరణ ఉద్యమం పట్ల అప్పట్లో మాకువున్న అభిప్రాయా లలాంటివి.