నా జీవిత యాత్ర-2/అహమ్మదాబాదు కాంగ్రెస్:వింతలు విశేషాలు
2
అహమ్మదాబాదు కాంగ్రెస్: వింతలు విశేషాలు
అహమ్మదాబాదు (గుజరాతు) లో కాంగ్రెసు [1] పేరిట మేము కలిసే ముందు గాంధీగారు ఆ కాంగ్రెసు చాలా నిరాడంబరంగా జరుగుతుందనీ, గత సంవత్సరాలలో జరిగినట్లు దుబారా ఖర్చులుగాని, అధిక వ్యయాలుగాని ఉండవనీ, ఏటేటా ప్రతినిధులు కూర్చోడానికే బెంచీలకూ కుర్చీలకూ అయ్యే ఖర్చుల క్రిందే కొన్ని వేలు వ్యయం అయ్యేదనీ, అట్టి దుబారాలేవీ లేకుండా ప్రతినిధులందరూ నేలమీదే సుఖాసీనులయి కార్యకలాపాలలో పాల్గొంటారని వ్యక్తపరిచారు. అధిక వ్యయం తగ్గించి, ఆడంబరం విడిచిపెట్టి, నిరాడంబరంగా జీవించే విధానానికి అహమ్మదాబాదు కాంగ్రెసు నాంది అవుతుందని మేమంతా విశ్వసించాం.
కాని తీరా అక్కడికి వెళ్ళేసరికి మాకు కనబడ్డ దృశ్యం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. కూర్చోడానికి కుర్చీలూ, బెంచీలూ లేని మాట వాస్తవమే అయినా, అలంకరణాది విధానంలోనూ, ఇతరత్రానూ ఆ పెండాలంతా అతి నూతనంగా కనిపించి వింతసోయగాన్ని వెదజల్లింది. కూర్చోవడం అన్నది నేలమీదనే అయినా, కూర్చోడానికిగాను నేలమీద విలువయిన ఖద్దరు తివాసీలు పరచబడ్డాయి. ఏ విధంగా పరిశీలించినా గత సంవత్సారలకంటె ఖర్చులు తగ్గాయని తలంచడానికి తావేలేదు. గాంధీగారు నిరాడంబరంగా కాంగ్రెసు సమావేశం జరిపించాలనే కోరిక వ్యక్తపరచి ఉండవచ్చు. కాని నిర్వాహకులు మాత్రం, ఏనాడూ ఏ కాంగ్రెసులోనూ జరగని విధంగా, అతి ఆడంబరంగా అలంకరణాదులు జరిపించి ఆ పెండాలును చూడ ముచ్చటగా రూపొందింపజేశారు. ఈ యేర్పాట్ల కన్నింటికీ సుమారు రెండు లక్షల రూపాయలకు పైగానే వ్యయం అయింది.
సర్దార్ వల్లబాయ్ పటేలూ, గాంధీగారూ, వచ్చిన ప్రతినిధుల సుఖసౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. తరతమ భేదాలూ, వ్యత్యాసాలూ లేకుండా పరిశీలించారు. కుల మత తారతమ్యాలు తలయెత్తకుండాను, పారిశుద్ధ్యాది నియమాలు కూడా తర తమ భేదాలకు తావియ్యకుండానూ, అందరూ ఆనందంగా ఒకే కుండలో నీళ్ళు ఒకేగ్లాసుతో త్రాగారంటే అందులో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదని ఒప్పుకు తీరాలి.
ఆహ్వాన సంఘాధ్యక్షుని ఉపన్యాసమే కాదు, అందరి ఉపన్యాసాలూ చాలా క్లుప్తంగానూ, సూటిగానూ ఉన్నాయి. నిజమే, ప్రత్యక్ష చర్యలు, అవలంబించడానికి సిద్ధమవుతూ ఉన్న పరిస్థితులలో ఉపన్యాసాలతో కాలం విలంబనం చేయడం అన్యాయం కదూ? చేతలకు సిద్ధపడుతూన్న పరిస్థితులలో మాటలకు తావేది? అప్పటినుంచీ కాంగ్రెసు అన్నది ఉత్తమమయిన వ్యాపార కేంద్రంగా తయారయింది. ఉపన్యాసాలతో ఆడంబరమూ, ధీమా, ఉత్ప్రేక్షాది అలంకారాలూ, అనవసర సమాసాల దొర్లింపులూ లేవు. ఉన్నదంతా ఇల్లా ఇల్లా చెయ్యి, కార్యంసాధించుకురా అన్న ఆదేశమూ, ప్రోత్సాహమూ, మాత్రమే.
నాయకుల నిర్భంధాలు
అప్పటికే, ఈ దేశాన్ని చూడడానికి రానున్న ప్రిన్స్ ఆప్ వేల్స్‌ను (Prince of wales) బహిష్కరించాలి, ఆయన పర్యటన సరిగా సాగనివ్వకూడదు అన్న ప్రతిపాదనలు ఆమోదింప బడడం చేత దేశంలో నలుమూలలా ఉన్న ముఖ్య కాంగ్రెసు నాయకుల నందరినీ నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. నిర్మాణ కార్యక్రమం విషయంలో అవలంబించతగ్గ మార్గాలన్నీ నిర్ణీతమయ్యే ఉన్నాయి. నిర్ణీతమయి ఉండడం యేమిటి, అమల్లోకే వచ్చేశాయి.
చిత్తరంజన్‌దాస్‌గారిని [2] అప్పటికే ఖైదుచేసి ఉండడంచేత అధ్యక్షుడుగా ఆయన చదవవలసిన ఉపన్యాసాన్ని శ్రీమతి సరోజనీదేవి చదివింది. దాస్‌గారి స్థానంలో వారి ప్రతినిధిగా డిల్లీ నివాసి అయిన హకీం అజ్మల్ ఖాన్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు.
త్రివిధ బహిష్కారం
కాంగ్రెసు బ్రహ్మాండంగా జరిగింది. ప్లీడర్లను తమ వృత్తిని విరమించమన్నారు. శాసన సభా సభ్యులను రాజీనామా లిచ్చి బైటికి రమ్మన్నారు. విద్యార్థులను కళాశాలల నుంచీ, పాఠశాలల నుంచీ వెలుపలికి రమ్మన్నారు. ఈ పోరాటపు దినాలలో అర్జన లేక బాధపడే ప్లీడర్ల సహాయార్థం సేట్ జమన్ లాల్ బజాజుగారు లక్షరూపాయలు విరాళంగా ఇచ్చారు. బ్రహ్మాండమయిన ఈ త్రివిధ బహిష్కరణ కార్యక్రమం సరిగా అమలు జరిగినట్టయితే సర్వాజ్యాన్ని సాధించడానికి పండ్రెండు మాసాలు చాలని నిర్దరించినా, ఈ లోపునే వచ్చి తీరుతుందనే గట్టి నమ్మకం అందరి హృదయాలలోనూ సుస్థిరం అయింది. నిజానికి స్కూళ్ళూ, కాలేజీలూ ఇంకా కొన్ని సంవత్సరాలపాటు బహిష్కరింప బడివుంటే అనుకున్న దానికంటె ముందుగానే స్వరాజ్యం వచ్చి ఉండేది.
వృత్తిని మాని జైళ్ళకువెళ్ళిన ప్లీడర్ల దీక్షను, దేశవ్యాప్తంగా జనబాహుళ్యం కనబరచిన త్యాగశీలతను నిశితంగా పరిశీలిస్తే ఈ సంఘటన లన్నీ ప్రపంచ చరిత్రలోనే నిరుపమానమయినవని, ఒప్పుకోవలసి ఉంటుంది. పోరాటంలో పాల్గొన్న జనసమూహమే కాదు, పోరాటం జరుగుతున్న విధాన్ని గమనిస్తూ ఉన్న ప్రతి వ్యక్తీ తర తమ బేదాలూ, కుల మత తారతమ్యాలూ విస్మరించి తామంతా సంపూర్ణమయిన , సమగ్రమయిన స్వరాజ్యాన్నే సాదించి తీరుతామనే నిశ్చయంతో ఉన్నారు. లక్షలాది ప్రజలలో నాటుకుపోయిన ఈ భావానికీ, వారిలో కలిగిన రాజకీయ చైతన్యానికీ ఆనాటి వైస్రాయి "లార్డ్ రీడింగ్" (Lord Reading) *[3]విస్తుపోయాడు. విస్తుపోవడ మేమిటి. చైతన్య హీనుడే అయ్యాడని అనవలసి ఉంటుంది.
ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బాయ్‌కాట్
ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పర్యటన విషయంలో ఏర్పాటయిన బహిష్కరణ ఉద్యమం చాలా ఘనంగా సాగింది. ఆఖరికి రైల్వేపోర్డర్లు కూడా వైస్రాయిగారి సామానులుగాని, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సామానులుగాని ముట్టనయినా ముట్టలేదు. వారు ఎక్కడికి వెళ్ళినా యీ ప్రకారం గానే చుక్క ఎదురయింది. ఇంతకంటే ఘనమయిన నిరసన ప్రపంచం మొత్తంమీద యే జాతీ చూపించి ఉండదు. ఇటువంటి పరిస్థితులను గమనించే లార్డ్ రీడింగ్ తాను నిజంగా విస్తుపోయాయనీ, చైతన్య హీనుణ్ణే అయ్యాననీ వెల్లడించాడు. అంతేకాదు, భారతదేశానికి నిజంగా కావలసినదేమిటో కూడా తాను నిర్ణయించలేని స్థితిలో ఉన్నానన్నాడు.
లార్డ్ రీడింగ్
వైస్రాయ్ కాకపూర్వం లార్డ్ రీడింగ్ న్యాయవాదిగా మంచి నేర్పరితనాన్ని కనబరిచేవాడు. పంజాబుప్రాంతం తనదేననీ, దానిని తనకు ఒప్పగించి తీరాలనీ లండను హైకోర్టులో "దిలీప్‌సింగ్" ప్రభుత్వం వారిమీద తీసుకువచ్చిన దావాలో నేను లార్డ్ రీడింగ్‌తో కలిసే దిలీప్‌సింగ్ తరపున పని చేశాను. అప్పటి పరిస్థితులనుబట్టి మున్ముందు లార్డ్ రీడింగ్ హిందూదేశానికి వైస్రాయిగా వస్తాడనిగాని, చాలా చాకచక్యంగా రాజ్యాంగాన్ని నిర్వహిస్తాడనిగాని నేనెప్పుడూ కలలో కూడా తలచి వుండలేదు. జన్మత: ఆయన "యూదు" జాతికి చెందినవాడు అవడం చేతనే అట్టి క్లిష్ట పరిస్థితులలో సహజంగా ఆజాతికి చెందిన జిత్తులమారి తనంతో, నేర్పుగా ఆ పరిస్థితులను ఎదుర్కోగలిగాడు.
బెంగాలులో క్రిమినల్ లా ఎమెండ్ మెంట్ యాక్ట్ క్రింద అనేకమందిని నిర్బంధించ గలిగాడు. వారు ఇస్తూన్న ఉపన్యాసాలను గమనిస్తూ, మహమ్మదాలీ,షౌకత్ ఆలీ సోదరులనూ, డాక్టరు కిచులూనూ కూడా నిర్బందించాడు. వీరినేగాక అనేక మంది "ఫత్వా"లనూ నిర్బంధించాడు.
సత్యాగ్రహపు తొలిమెట్టుగా అమలు పరచిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బహిష్కరణ ఉద్యమం, అనుకున్న దానికంటె ఎంతో ఘనంగా కొన
సాగడంచేత గాంధీగారి కీర్తి దశదిశలా మార్మోగింది. గాంధీగారు మినహాగా తక్కిన రాజకీయవేత్త లందరునూ క్రిమినల్ ప్రొసీజర్‌కోడ్ 144, 108 సెక్షెన్ల కిందనో, క్రిమినల్ లా ఎమెండ్ మెంట్ యాక్ట్ కిందనో అరెస్టు చెయ్యడం జరిగింది.
రాజీ ప్రతిపాదనలు
ప్రముఖ రాజకీయవేత్తల మధ్య ఉన్న స్వల్ప భేదాభిప్రాయాలను గమనించిన రీడింగ్ ప్రభువు, ఆ అభిప్రాయభేదాలను ఆధారంగా తీసుకుంటూ, వాటికి అనుగుణంగా రూపొందించిన పదకాలతో యుక్తి యుక్తంగా కార్యసాధనకు ఉపక్రమించాడు.
కలకత్తా సమీపంలో అలీపూరు జైలులో నిర్బంధింపబడి వున్న చిత్తరంజన్ దాస్‌గారికి కొన్ని రాజీ ప్రతిపాదనలను సూచించి,[4] ఆప్రతిపాదనలనే వేరే ప్రాంతంలో ఇంకో జైలులో నిర్బంధింప బడిన పండిత మోతీలాల్ నెహ్రూగారికి అందజేశాడు.[5]
- ↑ 27 - 12 - 1921
- ↑ 'ప్రిన్స్ ఆప్ వేల్సు' బహిష్కారోద్యమం సందర్భంలో వంగరాష్ట్ర పభుత్వం స్వచ్చంద సైనికుల్ని చేర్చడం క్రిమినల్ లా సవరణ చట్టానికి విరుద్ధమని ప్రకటించింది. సి. ఆర్. దాస్‌గారిని భార్యాపుత్రులతో సహా నిర్బంధించారు.
- ↑ *రీడింగు ప్రభువు 1921 ఏప్రిల్ లో వైస్రాయిగా వచ్చాడు.
- ↑ 1921 డిసెంబరులో.
- ↑ కరాచీలో జరిగిన అఖిలభారత ఖిలాఫకత్ మహాసభ (1921 జూలై)లో పాల్గొన్నందున శిక్షింపబడిన వీరిని "కరాచీ ఖైదీ" లన్నారు, మహాసభ చేత వీరు, బ్రిటిషు ప్రభుత్వం క్రింద భారతీయ సైనికులు పనిచేయరాదనే తీర్మానం అంగీకరింప జేశారు. కొందరు ఉలేమాలు ఆతీర్మానాన్ని "ఫత్వా" (శ్రీముఖం)గా మహమ్మదీయులకు జారీ చేశారు. ఆ సందర్భంలో శిక్షితులైన వారిని "ఫత్యా ఖైదీ" లన్నారు. ఖలీఫా అయిన టర్కీ సుల్తానుకు యుద్ధ సమయంలో చేసిన వాగ్దానాలకు భంగకరంగా బ్రిటను, యుద్ధం ముగిశాక, ఇస్లాం మత పీఠ సామ్రాజ్య (ఖిలాఫత్) భాగాలను స్వాహా చేసింది. అది మహమ్మదీయులను కోపోద్రక్తుల్ని చేసింది. భారతీయ మహమ్మదీయులతో హిందువులు చేతులు కలిపి, వాటిని తిరిగి టర్కీకి ఇప్పించడానికి, ఖిలాఫత్ ఉద్యమం నడిపించారు.