నా జీవిత యాత్ర-2/గాంధీగారి విచారణ, నిర్బంధం
3
గాంధీగారి విచారణ, నిర్బంధం
అహమ్మదాబాదు కాంగ్రెసు అనంతరం ఢిల్లీలో డాక్టర్ అన్సారీ గారి ఇంటిలో అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం జరిగినప్పుడు సి.ఆర్. దాస్‌గారికి అందజేయబడిన "రాజీ" ప్రతి పాదనలు చర్చించబడ్డాయి. ఆ రాజీ ప్రతి పాదనలలో లార్డ్, క్రిమినల్ లా ఎమెండ్ మెంట్ చట్టం క్రింద నిర్బంధింపబడిన వారి నందరినీ విడుదల చేస్తామనీ, లండన్‌లో జరుపదలచిన రౌండ్ టేబిల్ కాన్పరెన్స్‌లో భారత దేశానికి అధినివేశ ప్రతిపత్తి (Dominion status)యిచ్చే విషయాన్ని గురించి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ రీడింగ్ ప్రభువు తెలియజేశాడు. దాస్‌గారూ, మోతిలాల్ నెహ్రూగారూ కూడా ఈ ప్రతిపాదనలకు సుముఖంగానే ఉన్నారు. కానీ కరాచీ ఖైదీలనూ, ఫత్వా ఖైదీలనూ కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం వారు అంగీకరింపకపోతే, కొన్ని క్లిష్ట పరిస్థితులకు కాంగ్రెసు లోనవుతుందని మహాత్మా గాంధీగారు సూచించారు. ఈ సూచన చిత్తరంజన్ దాస్, మోతిలాల్ నెహ్రూగార్లను ఆగ్రహా వేశుల్ని చేసింది.
నాయకులలో అభిప్రాయ భేదాలు
ఈ సమయంలోనే హింసాత్మకమైన "చౌరీ చౌరా" సంఘటన జరిగింది. దాన్తో గాంధీగారు తమ సత్యాగ్రహ కార్యక్రమాన్ని హఠాత్తుగా ఆపివేశారు. ఇది జరిగిన అనతికాలంలోనే తిరిగి డిల్లీలో డా|| అన్సారీగారి గృహంలోనే అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం జరిగింది. దేశంలో ఎక్కడో మారుమూల జరిగిన యేదో సంఘటనను సాకుగా తీసుకొని గాంధీగారు తమ ఉద్యమాన్ని విరమించడం శుద్ద తప్పని వివరిస్తూ కొన్ని ఠావుల సుదీర్ఘ నిరసన లేఖను దాసుగారు వ్రాశారు. ఈ టైపు చేయబడిన ఉత్తరాన్ని దాసుగారి అల్లుళ్లలో ఒకరయిన "రాయ్"గారు స్వయంగా తీసుకువచ్చి గాంధీగారికి అందజేశారు. ఉద్యమ విరమణ విషయంలో గాంధీగారు గొప్ప తప్పిదాన్నే చేశా రంటూ దాసుగారి స్వదస్తూరీతో వ్రాయబడిన నోటు బుక్కుకూడా ఈ సమయంలోనే గాంధీగారికి అందించబడింది. ఎన్నో పేజీలలో స్వయంగా మోతీలాల్ గారే వ్రాసిన నిరసనపు టుత్తరం మోతిలాల్ గారి ప్రయివేటు సెక్రటరీ ఒకాయన జైలునుంచి తీసుకువచ్చి స్వయంగా గాంధీగారికి అందజేశాడు.
సి.ఐ.డి.లు
ఈ అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశంలో చాలమంది ప్రతినిధులు పాల్గొన్నారు. మఫ్టీలో ఉన్న సి.ఐ.డి వారు కూడా చాల మంది వచ్చారు. మీటింగులో సి.ఐ.డీ. లున్నారన్న వార్త ఒక చిన్న హెచ్చరిక రూపంగా గాంధీగారికి అందజేయబడింది. గాంధీగారి తత్వంలో భీతి, భయం, రహస్యం అన్నవి ఎప్పుడూ లేక పోవడంచేత సభలో ఉన్న సి.ఐ.డీ. లను వేటాడి తరిమి వేయడమన్నది జరుగలేదు. తమకు జేరిన హెచ్చరికకు గాంధీగారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఈ సభలో ప్రతినిధులు కాని వారు ఎవరయినా ఉంటే వారు మర్యాదగా తప్పుకోవడం న్యాయమనే సూచనను మాత్రం జేసి ఆయన తన పనిలో తాను నిమగ్నుడయ్యాడు. సంగతి సందర్భాలన్నీ ప్రతినిధులకు బాగా ఆకళింపు అవడానికి గాను దాస్, మోతిలాల్ గారలు వ్రాసిన ఉత్తరాలు సభలో ఆమూలాగ్రంగా చదువబడ్డాయి. సభలో గాంధీగారి భావాలకు వ్యతిరేక అభిప్రాయాలుగల వ్యక్తులు కొందరున్నారనీ, అట్టివారు గాంధీగారి సన్నిహిత అనుచరులలోనే ఉన్నారనీ సభికుల కందరికీ సువ్యక్తం అయింది.
కంటనీరు తెప్పించిన వాజ్మూలం
గాంధీగారి ఒంటిమీద చెయ్యివేస్తే యేమవుతుందోనన్న భీతితో పరిస్థితులను గమనిస్తూ అవకాశం కొరకు వేచివున్న ప్రభుత్వం వారు ఈ సమావేశం అనంతరం గాంధీగారిని నిర్భయంగా నిర్భంధింపగలిగారు. కార్యనిర్వాహకవర్గ సభ్యునిగానూ, సహాయ కార్యదర్శిగానూ కూడా నేను యీ సమావేశాలన్నింటిలోను మొదటి నుంచీ పాల్గొంటూనే ఉన్నాను. కాగా గాంధీగారిని నిర్బంధించి విచారణ నిమిత్తం అహమ్మదాబాదు సెషన్సు కోర్టులో హాజరు పరచినప్పుడు నేను స్వయంగా హాజరయి ఆ విచారణ కాండనంతా పరిశీలించాను. ఆ విచారణ అన్నది ప్రపంచ చరిత్రనే తారుమారుచేసే విధంగా జరిగింది.
ఆ కోర్టులో గాంధీగారిచ్చిన వాఙ్మూలం వినేవరకూ వారి ఘనత వారి ఆత్మీయులకు కూడా అర్థం కాలేదనే అనుకోవలసివుంది. లిఖిత పూర్వకంగా దాఖలు చేయబడిన ఆ వాఙ్మూలంలో గాంధీగారు తమ్ము నిర్బంధించినతీరూ, కేసు విచారణచేసిన విధమూ అన్నీ పేర్కొంటూ నిరసనగా తాను చెప్పదలచిన సంగతుల నన్నింటినీ అందు పొందు పరిచారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిచే దరిమిలా రచియింపబడిన "కాంగ్రెసు చరిత్ర"లో ఆ వాఙ్మూలంప్రముఖ స్థానాన్నే అక్రమించింది.
ఆ వాజ్మూలాన్ని గాంధీగారు చదువుతూ వుంటే ఆయన నోటి నుంచి వచ్చిన ఆనాటి వాక్కులు యీనాడు కూడా నా చెవులలో మార్మ్రోగుతూనే ఉన్నాయి. ఆ వాఙ్మూల సారాంశం ఇది: "ఈ భారత దేశపు నలుమూలల్లోనూ యీ మద్య జరిగిన అల్లర్లకూ, చావులకూ, హత్యలకూ నేను స్వయంగా బాధ్యత వహిస్తున్నాను. ఈ సహకార నిరాకరణ ఉద్యమాన్నీ, శాసన ధిక్కార ప్రణాళికనూ నడుపు తున్నది నేనే. నా ఉద్యమాల కారణంగా జరిగిన, జరుగుతూన్న కర్మకాండ కంతటికి నేనే కర్తను, నేనే భర్తను. అందువల్ల నేను పూర్తిగా శిక్షార్హుణ్ణి. మరణ శిక్ష విధించినా ఆనందంగా స్వీకరిస్తాను. మీకు యధోచితమని తోచిన శిక్షను మీరు విధించవచ్చును."
ఈ పలుకులు గాంధీగారి నోటినుంచి వెలువడుతూంటే నాతోపాటు కోర్టుహాలులో కూర్చుని ఆ కర్మకాండను తిలకిస్తూన్న యావత్తు జనానికి, స్త్రీ పురుష వివక్షత లేకుండా, కళ్ళంట నీళ్ళుకారాయి. ఆనాడు అక్కడ అల్లా కూర్చుని కన్నీరు కార్చిన జనంలో ఆంగ్లేయ స్త్రీ, పురుషులు కూడా ఉన్నారు. మానవా తీతులయిన దైవాంశ సంభూతులు తప్ప సామాన్యులెవ్వరూ అట్టి వాఙ్మూలం యివ్వలేరు. అనుయాయులకు అదేశం
రాజీ ప్రతి పాదనల రూపేణా అతిచాకచక్యంగా నాయకుల మధ్య భేదాభిప్రాయాలు కలుగజేసి కలతలు రేపాలని రీడింగ్ ప్రభువు వేసిన ఎత్తులకూ, గాంధీగారి వాఙ్మూల రూపేణా దేశవ్యాప్తంగా మానవ హృదయాంతరాళాలలో స్థిరపడిన భావాలకూ ఎంత వత్యాసం ఉంది! అయితేనేం ఒక విధంగా రీడింగ్ ఆశయాలు సిద్ధించాయనే అనుకోవచ్చు. ప్రతి పాదింపబడిన రాజీ సూచనలుచూసి, దాస్, మోతిలాల్ గార్లు కూడా ఉల్టా సీదా అయ్యారనే అనవలసి ఉంటుంది. సెషన్స్ జడ్జీ విధించిన ఆరు సంవత్సరాల కారాగార శిక్షానుసారంగా యరవాడ జైలులో గాంధీగారిని నిర్బంధించేవరకూ నేను గాంధీగారిని అనుసరిస్తూనే ఉన్నాను.
ఆఖరు సారిగా, జైలు ముఖ ద్వారాన్నిదాటి లోపల ప్రవేశిస్తూ, వారు నా ద్వారా దేశానికి అందజేసిన సందేశంలో కోరిన దేమిటో తెలుసా? దేశవ్యాప్తంగా ఖద్దరును వృద్ధిచేయమనీ, నిర్మాణ కార్యక్రమం బాగా కొనసాగించమనీని. అంతేకాదు. ఆ ఆదేశంలో తన్ను ఎవ్వరూ అనుసరించవద్దనీ ఉంది. అనగా వారి తర్వాత ఇంకొకరెవ్వరూ జైలుకు పోకుండా నిర్మాణాత్మక కార్యక్రమంలోనే నిమగ్నులవ్వాలన్నదే వారి ఆశయం అన్నమాట. దాన్తో ఆయన్ని అనుసరించి జైలుకు పోవాలి అన్న నా కోరిక విఫలం అయింది. అంతవరకూ అనేకసార్లు నేను ఆంగ్ల రాజ్యాంగ యంత్రాంగాన్ని ధిక్కరిస్తూ వచ్చినా, ఎందుచేతనో గాని పరిపాలకుల కబంధ హస్తం నాపై ప్రయోగింపబడలేదు. కాగా గాంధీగారి పరిస్థితి ఎల్లా పరిణమిస్తుందో గమనించాలనే ఉద్దేశంతో మాలో కొంతమందిమి బైటే ఉండి పోవాలనిన్నీ నిశ్చయించుకున్నాము.
గాంధీగారిని 1922, మార్చి 13 వ తేదీనాడు నిర్బంధించారు. విచారణా, నేరారోపణా 18 వ తేదీన జరిగాయి. శిక్షకూడా వెనువెంటనే ఆనాడే విధింపబడింది.
ఆంధ్రలో ఖద్దరు ఉద్యమం
ప్రప్రథమంగా నిర్మాణ కార్యక్రమం జయప్రదంగా కొనసాగిన కారణంగా పరిపాలకుల హృదయాలలో రేగిన కలకలమూ, త్రివిధ బహిష్కరణ ఉద్యమం సాధించిన జయ పరంపరలూ కాస్త గమనిద్దాం.
ఆంధ్రదేశం మొత్తంమీద అనేక ప్రాంతాలలో దేశీయ విద్యాలయాలూ, ఖాదీ ఉత్పత్తిస్థావరాలూ, పంచాయతీ కోర్టులూ స్థాపింప బడ్డాయన్న విషయం చదువరుల దృష్టికి యిదివరలోనే తీసుకువచ్చాను. భారతదేశం మొత్తంమీద ఖాదీఉద్యమం భారీఎత్తున సాగించిన రాష్ట్రాలలో ఆంధ్రరాష్ట్రానిదే అగ్రతాంబూలం. అంధ్రదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వందలాది స్త్రీలు ఖద్దరు చీరెలలోనే కనబడేవారు. ఏ విధమయిన ప్రోద్బలమూ చరఖాసంఘ సహకారమూ లేకుండానే, తమతమ స్వంత భాధ్యతలపైనే ఖాదీ కార్యక్రమాన్ని కొనసాగించిన నా అనుచరులే నాకు అనేకవిధాల గర్వకారణమయ్యారు. జిల్లాలవారీగ అనేక ప్రాంతాలలో ప్రాక్టీసు విరమించి ఉద్యమంలో జేరిన లాయర్లందరూ చాలవరకూ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలలోకంటె ఎంతో యెక్కువగా ఆంధ్ర వనితలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారని వేరే చెప్పనక్కరలేదు. రాష్ట్రం మొత్తంమీద కాలేజీలనూ, ఇతర విద్యాలయాలనూ బహిష్కరించిన విద్యార్థులంతా కాంగ్రెసు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కో అంటే కోటిమంది అన్న సామ్యంగా యువక వాలంటీర్లకు ఎప్పుడూ కొరవలేదు.
కాంగ్రెసుకున్న నిధులా అతి స్వల్పం. ఉన్న నిధులలో దేశవ్యాప్తంగా ఉద్యమం నడవడం వట్టిది, మహానడుస్తే మూనాళ్ళ పట్టపగలు: అని కాంగ్రెసేతరులూ, ప్రభుత్వంవారూ అనుకుంటూ వచ్చారు. అట్టి పరిస్థితులలో కాంగ్రెసు కమిటీవారి నుంచి సహకారమూ, చరఖా సంఘంనుంచి ధనమూ లేకపోయినా దేశవ్యాప్తంగా యీ ఉద్యమం యిల్లా కొనసాగడం ప్రభుత్వంవారినీ, కాంగ్రెసు వ్యతిరిక్తులనూ కూడా ఆశ్చర్యసాగరంలో ముంచేసింది.
అవతారపురుషు డనిపించిన గాంధీ
గాంధీగారికి, కాంగ్రెసుకూ ఏర్పడిన అవినాభవ సంబంధంతో గాంధీ అంటే కాంగ్రెస్సు, కాంగ్రెస్సంటే గాంధీ అన్న భావం ప్రబలింది. పరాయిప్రభుత్వ పరిపాలనా విధాన తో బానిస జీవనం గడుపుతూన్న లక్షలాది జనానికి గాంధీగారి మాటన్నా, కాంగ్రెసువారి ఆదేశమమన్న వేదవాక్కే అయిపోయింది. సాక్షాత్తూ భగవంతుడే గాంధీరూపంతో తమ్ము ఉద్దరించడానికి అవతరించాడనే భావం ప్రజలలో నాటు కుంది. అంటే అప్పట్లో దేశం గాంధీగారిలాంటి ఉత్తమ నాయకునికోసం ఎదురుచూస్తోందన్నమాట అటువంటి క్లిష్టసమయంలో గాంధీగారు ముందుకొచ్చి నాయకత్వం వహించేసరికి, పర్యవసానాలతో నిమిత్తం లేకుండా అగ్నిగుండంలోనికి దూకడానికిగూడా దేశవ్యాప్తంగా లక్షలాది జనం సంసిద్దులయ్యారు.
దేశాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్న ఆనాటి నాయకులు, ఏరుదాటి ముందుకువేసిన అడుగు వెనక్కి తీసుకొని తిరోముఖం పట్టడానికి వీలులేని విధంగా, తమ్ము దాటించిన తెప్పల నన్నింటినీ తగులబెట్టారన్నమాట! కళాశాలలను విసర్జించి కాంగ్రెసులో జేరి జైళ్ళకు వెళ్ళిన విద్యార్థులు, ఉద్యమాన్ని విడిచిపెట్టి తిరిగి కాలేజీలలో జేరడానికి గాని, గవర్నమెంటు నౌకరీలను ఆశించడానికి గాని అణుమాత్రపు సావకాశంకూడా వుండేదికాదు. వారి జీవితాలు తప్పనిసరిగా ప్రజాసేవకి అంకితం అయిపోయాయన్నమాట!
కాంగ్రెసు సాధిస్తూన్న విజయాలు ప్రభుత్వంవారి కన్ను కుట్టాయి. దాన్తో నిర్మాణ కార్యక్రమ సాఫల్యాన్ని కూడా వారు సహించలేక పోయారు. నిర్మాణ కార్యక్రమం కారణంగా దేశమంతా ఒకే త్రాటి మీదకు వచ్చేస్తోందని నకనకలాడారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాక సందర్బంలో దేశం కనబరచిన నిరసనా, బహిష్కరణా అన్నవి మరపురానివే కదా! అందువలన ఈ నిర్మాణ కార్యక్రమం విధానాన్ని ఒక పెద్ద వెన్నుపోటు పోడవాలని గాంధీగారిని కారాగారానికి పంపించక పూర్వం నుంచీ పరిపాలకులు ఎన్నో పదకాలు వేస్తూనేవున్నారు.
ర్యాలి పంచాయతీ కోర్టు
తూర్పుగోదావరిజిల్లా సెంట్రలు డెల్టా రాజోలు తాలూకాకు చెందిన "ర్యాలి" గ్రామం యీ నిర్మాణ కార్యక్రమ సాధనలో బాగా ముందంజవేసి ఆదర్శప్రాయంగా తయారయింది. ఆ గ్రామంలో కాంగ్రెసువారు ఏర్పాటుజేసిన పంచాయతీ కోర్టు శక్తివంచన లేకుండా పనిచేస్తూ న్యాయ (సివిలు), రక్షణ (క్రిమినలు) లకు సంబందించిన ఫిర్యాదుల నన్నింటినీ న్యాయంగాను, నిష్పాక్షికంగానూ విచారించడం జరుగుతూన్న కారణంగా ఆ గ్రామంనుంచి ఒక్క కేసయినా యిటు మేజస్ట్రీటు కోర్టుకుగాని, అటు మునసబు కోర్టుకుగాని పోలేదు. గ్రామంలోని పార్టీ విభేదాలూ, అంత:కలహాలూ అంతరించాయి. కేవలం నాల్గణాలు కోర్టుపీజు క్రింద చెల్లిస్తే ఎన్నివేల రూపాయల విలువగల లావాదేవీలయినా పంచాయతీవారు పరిష్కరించేవారు. క్రిమినలు కేసులూ అంతే. ఆ గ్రామంనుంచి ఒక్క పోలీసు కంప్లయింటయినా పైకి పోలేదు. అవసరాలకు కావలసిన ఖద్దరుబట్ట యావత్తూ గ్రామంలోనే ఉత్పత్తి అయ్యేది.
ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని చుట్టుపట్ల గ్రామాలెన్నో యీ విధానాన్ని అనుకరించడం ఆరంభించాయి. దాన్తో ఏదో ఒక విధంగా ఈ విధానాలకు స్వస్తి చెప్పించి తీరాలనే దృఢనిశ్చయం ప్రభుత్వంవారికి కలిగింది.
పాలకుల దమసనీతి
ఆ గ్రామ పెద్దలనూ, నాయకులనూ ఏదో ఒక సాకుతో ఒకసారేమిటి. రెండుసార్లేమిటి - అవసరమని వారు అనుకున్నన్ని సార్లు నిర్బంధించి జైళ్ళపాలుజేసి గ్రామంలో నాటుకుపోతూన్న ఆశయాలకు అంకుశపు పోటు పొడిచి మరీ వదిలారు. దీనినిబట్టి కాంగ్రెసువారి నిర్మాణ కార్యక్రమం గ్రామీణుల హృదయాంతరాళాలలో యెంత లోతుగా నాటుకుపోయిందో అర్థం అవుతుంది. అంతేకాదు. అ జిల్లాలోనూ, ఇతర ప్రాంతాలలోనూ, రాష్ట్రాలలోనూకూడా కాంగ్రెస్సును అణగద్రొక్కడానికి ప్రభుత్వంవారు అవలంబించిన బీభత్స విధానమూ అర్థం అవుతుంది. ఈ విధంగా కాంగ్రెసు నిర్మాణాత్మక విధానాన్ని అణగద్రొక్క గలిగిన ప్రభుత్వంవారు తమ దృష్టిని హిందూ-మహమ్మదీయ మైత్రిని చేధించడానికి మళ్ళించారు. హిందూ మహమ్మదీయ సఖ్య సాధన కాంగ్రెసువారి ఆశయమూ, మూలసూత్రమూ, పునాదీ అన్న సంగతి మన విరోధులు ఎరగంది కాదు గదా!