నా జీవిత యాత్ర-2/ప్రథమ ఖండ ప్రసక్తి

వికీసోర్స్ నుండి

నా జీవిత యాత్ర

ద్వితీయ ఖండం

ప్రథమ ఖండ ప్రసక్తి


"నా జీవిత యాత్ర" ప్రథమ ఖండంలో, బాల్యం మొదలు పంచాశద్వర్షాల వరకూ నడచిన నా జీవితాన్ని గురించి చెపుతూ, 1921-22 సంవత్సరాలలో నేనూ, రాజగోపాలాచారిగారూ ఐకమత్యంతో నిర్మాణ కార్యక్రమం ఉత్సాహంగా నడపిస్తూ ఉండేవారమని, కాంగ్రెసు విధానానికి అంకితం అయిన నేను ఆ విధానాన్ని ప్రజలలో బాగా ప్రచారం చెయ్యడానికి "స్వరాజ్య" పత్రికను ఆంగ్లంలో స్థాపించానని, అనతికాలంలోనే రాజగోపాలాచారి ప్రోత్సాహంతోనే అరవంలో కూడా దైనిక పత్రికగా "స్వరాజ్య" ని రూపొందింప జేశానని, అదే ప్రకారం తెలుగులో కూడా పత్రిక ప్రారంభించి జేగీయమానంగా కాంగ్రెసు ప్రబోధం సాగించామని వ్రాసి ఉన్నాను. అందు అహమ్మదాబాదు కాంగ్రెసు జరిగిన తొలి రోజులనాటి ముచ్చటలు కూడా కొద్దిగా వ్రాసి, ఆ ప్రథమ ఖండాన్ని ముగించి ఉన్నాను.

అటుపిమ్మట ఇంకొక ఇరవై సంవత్సరాలపాటు నడచిన నా జీవితాన్నీ, ఆ రోజులనాటి కాంగ్రెసు చరిత్రా, నానిర్భంధాలూ, జైలు జీవిత విశేషాలూ, అనుభవాలు వగైరా ద్వితీయ తృతీయఖండాలలో సింహాపలోకనం చేశాను.