నారాయణీయము/దశమ స్కంధము/89వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

89- వ దశకము - వృకాసురవధ-భృగుపరీక్షణము


89-1
రమాజానే।జానే యదిహ తవ భక్తేషు విభవో
న సంపద్యస్లద్యస్తదిహ మదకృత్త్వా దశమినామ్।
ప్రశాంతిం కృత్వైవ ప్రదిశసి తతః కామమఖిలం
ప్రశాంతేషు క్షిప్రం న ఖలు భవదీయే చ్యుతికథా॥
1వ భావము :-
భగవాన్! లక్ష్మీపతీ! నీ భక్తులకు వెనువెంటనే సంపదలను అనుగ్రహించవు అనునది నేనెరిగిన సత్యము. ఏలయనగా సంపద మదమును పెంచును. మనోనిగ్రహము,ప్రశాంత చిత్తము సాధించిన భక్తులకు మాత్రమే వారి అభీష్టములను నీవు శ్రీఘ్రముగా నెరవేర్చెదవు; నీ అనుగ్రహముతో ఆ తమ స్థితినుండి వారు వెనుకకు మరలరు.

89-2
సద్యః ప్రసాదరుషితాన్ విధిశంకరాదీన్
కేచిద్విభో।నిజగుణానుగుణం భజంతః।
భ్రష్టా భవంతి బత కష్టమదీర్ఘదృష్ట్వా
స్పష్టం వృకాసుర ఉదాహరణం కిలాస్మిన్॥
2వ భావము :-
భగవాన్! లక్మీపతీ! జనులు కొందరు బ్రహ్మ, రుద్రాది దేవతలును ఆరాధించి, మెప్పించి శ్రీఘ్రముగా వారి అనుగ్రహమును పొందుచుందురు. మరికొందరు అతి శ్రీఘ్రముగా ఆ ఆదేవతల ఆగ్రహమునకు గురి అగుచుందురు. దూర దృష్టిలేనివారు కష్టముల పాలగుదురు; భ్రష్టులగుదురు. అది ఎంత దయానీయమో వృకాసురుని వృత్తాంతము వలన అవగతమగుచున్నది.

89-3
శకునిజస్స తు నారదమేకదా త్వరితతోషమపృచ్ఛదధీశ్వరమ్।
స చ దిదేశ గిరీశముపాసితుం న తు భవంతమబంధుమసాధుషు॥
3వ భావము :-
లక్ష్మీపతీ! వృకాసురుడు శకుని అను ఒక దానవుని కుమారుడు. ఇతడు ఒకనాడు నారదమునిని, త్వరితముగా అనుగ్రహించి వరములిచ్చు దైవము ఎవరు? అని అడిగెను. దానికి నారదముని , భగవాన్! దుర్జనులయెడ ప్రీతిలేనివాడివి, సజ్జనులను మాత్రమే అనుగ్రహించువాడవు అగు నిన్ను విడిచిపెట్టి, శివుని ఉపాసించమని ఆ వృకాసురునికి సూచించెను.

89-4
తపస్తప్త్వా ఘోరం స ఖలు కుపితస్సప్తమదినే
శిరశ్ఛిత్త్వా సద్యః పురహారముపస్థాప్య పురతః।
అతిక్షుద్రం రౌద్రం శరసి కరదానేన నిధనం
జగన్నాథాద్వవ్రే భవతి విముఖానాం క్వ శుభధీః॥
4వ భావము :-
భగవాన్! వృకాసురుడు పరమశివుని ఉపాసించి ఆరుదినములు ఘోరతపస్సుచేసెను. అయినను శివుడు సాక్షాత్కరించలేదు. కుపితుడై ఏడవదినమున, వృకాసురుడు తన శిరస్సును ఖండించు కొనుటకు సిద్ధమయ్యెను. పరమశివుడప్పుడు ఆ దానవుని ఎదుట ప్రత్యక్షమై వరము కోరుకొనమనెను. వృకాసురడప్పుడు అతిక్రూరము దుర్మార్గము అయిన కోరిక కోరెను; ఎవని శిరస్సుపై తాను తనహస్తమును ఉంచునో ఆ వ్యక్తి మరణించు వరమును ఆ జగదీశ్వరునినుండి పొందెను. ప్రభూ! లక్మీపతీ! నీ ఎడల విముఖుడగువానికి శుభకరమగు బుద్ధులు ఎట్లుపుట్టును?

89-5
మోక్తారం బంధముక్తో హరిణపతిరివ ప్రాద్రవత్ సో౾థ రుద్రం
దైత్యాద్భీత్యా స్మ దేవో దిశిదిశి వలతే పృష్ఠతో దత్తదృష్టిః।
తూష్ణీకే సర్వలోకే తవ పదమధిరోక్ష్యంతముద్వీక్ష్య శర్వం
దూరాదేవాగ్రతస్త్వం పటువటువపుషా తస్థిషే దానవాయ॥
5వ భావము :-
భగవాన్! బంధమునుండి విడిపించబడిన సింహము ఆ విడిపించినవాని మీదకే లంఘించినట్లు, ఆ వృకాసురుడు రుద్రుడొసగిన వరమును ఆ దేముడి మీదనే ప్రయోగించదలచెను. అదిచూచి శివుడు వెనుకుకు ముందుకూ చూచుకొనుచు నలుదెసల పరిగెత్తసాగెను. ఇది చూచిన సకలలోకవాసులు భయముతో నిరుత్తురులై నిలిచిపోయిరి. తిరిగి తిరిగి ఆ పరమశివుడు వైకుంఠమును అధిరోహించు చుండెను. ప్రభూ! లక్మీనారాయణా! నీవప్పుడు బ్రహ్మచారిరూపముతో, శివుని వెన్నంటి వచ్చుచున్న వృకాసురుని ముందు నిలిచి ఆ దానవునితో ఇట్లంటివి.

89-6
భద్రం తే శాకునేయ। భ్రమసి కిమధునా త్వం పిశాచస్య వాచా
సందేహశ్చేన్మదుక్తౌ తవ కిము న కరోష్యంగుళీమంగ।మౌళౌ।
ఇత్థం త్వద్వాక్యమూఢశ్శిరసి కృతకరస్సో౾పతచ్ఛిన్నపాతం
భ్రంశో హ్యేవం పరోపాసితురపి చ గతిః శూలినో౾పి త్వమేవ॥
6వ భావము :-
"శకుని పుత్రుడా! నీకు శుభమగుగాక", అని పలికి, నీ పలుకులు వినుచున్న ఆ వృకాసురునితో భగవాన్! నీవింకను ఇట్లంటివి. "ఈ భూతగణనాధుని మాటలు సత్యములగునని భ్రమించుచుంటివా! ఏమి? ఈ శివుని వరము నమ్మదగినది కాదు. కావలసినచో నీచేతివేలును నీ శిరమున పెట్టుకొని చూచుకొనుము", అని పలికితివి. నీ మాటలకు మోహితుడై ఆ వృకాసురుడు తనతలపై తన హస్తమునే పెట్టుకుని భస్మమయ్యెను; ఖండించబడిన వృక్షమువలె నేలకొరిగెను. ఆశ్రయించిన వారిని రక్షించుటలో ప్రభూ! లక్మీనారాయణా! నిన్నుమించిన దేవతలు మరిఎవ్వరూలేరు; శివునికికూడా నీవే ఆశ్రయమయితివి.

89-7
భృగుం కిల సరస్వతీనికటవాసినస్తాపసాః
త్రిమూర్తిషు సమాదిశన్నధికసత్త్వతాం వేదితుమ్।
అయం పునరనాదరాదుదితరుద్ధరోషే విధౌ
హరే౾పి చ జిహింసిషౌ గిరిజయా ధృతే త్వామగాత్॥
7వ భావము :-
భగవాన్! భృగుమహర్షి సరస్వతీ నదీతీరములో నివసించుచున్నప్పుడు అచ్చట ఉన్న తాపసులు త్రిమూర్తులలో సత్వగుణసంపన్నుడు ఎవరో తెలుసుకొని తెలపమని ఆ భృగుమహర్షిని కోరిరి. భృగుమహర్షి బ్రహ్మదేముని వద్దకు వెళ్ళి అగౌరవముగా ప్రవర్తించెను; బ్రహ్మదేముడు రోషము వచ్చినను నిగ్రహించుకొని ఊరుకొనెను. రుద్రుని వద్దకువెళ్ళి అచటను అగౌరవముగా ప్రవర్తించెను; పరమశివుడు భృగుమహర్షిని శిక్షంచబోవగా గిరిజాదేవి వారించెను. అనంతరము ఆ భృగుమహర్షి, ప్రభూ! లక్మీనారాయణా! నీ వద్దకు వచ్చెను.

89-8
సుప్తం రమాంకభువి పంకజలోచనం త్వాం
విప్రే వినిఘ్నతి పదేన ముదోత్థితస్త్వమ్।
సర్వం క్షమస్వ మునివర్య। భవేత్ సదా మే
త్వత్పాదచిహ్నమిహ భూషణమిత్యవాదీః॥
8వ భావము :-
పంకజనేత్రా! లక్మీనారాయణా! భృగుమహర్షి నీ వద్దకు వచ్చినప్పుడు నీవు లక్మీదేవి తొడపై శిరస్సునుంచి పవళించియుంటివి. తననుచూచి లేవలేదని - కోపముతో ఆ భృగుమహర్షి, నీ వక్షస్థలమును తనపాదముతో తన్నెను. భగవాన్! నీవప్పుడు వికసితవదనముతో లేచి ఆ విప్రునితో ఇట్లంటివి. "మునివర్యా! నా తప్పును క్షమింపుము. లక్మీదేవికి నిలయమగు నా వక్షస్థలమును నీవిప్పుడు నీపాదముతో పునీతముచేసితివి. శాశ్వతముగా, నీ ఈ పాదముద్ర నా వక్షస్థలమున అలంకారముగా నిలచిపోవుగాక!", అని పలికితివి.

89-9
నిశ్చిత్య తే చ సుదృఢం త్వయి బద్ధభావాః
సారస్వతా మునివరా దధిరే విమోక్షమ్।
త్వా మేవమచ్యుత। పునశ్చ్యుతి దోషహీనం
సత్త్వోచ్చయైకతనుమేవ వయం భజామః॥
9వ భావము :-
భగవాన్! సరస్వతీ నదీ తీరమునకు తిరిగివెళ్ళి జరిగిన వృత్తాంతమునంతయూ, ఆ భృగుమహర్షి మునీశ్వరులకు చెప్పెను. విష్ణుమూర్తే సత్వగుణములో మిన్న అని వారు తెలుసుకొనిరి. ప్రభూ! నీవు అచ్యుతుడివి; సత్వగుణ సంపన్నుడివి; తమోగుణ - రజోగుణములకు అతీతుడివి. అట్టి నిన్ను మేము ఉపాసింతుము.

89-10
జగత్సృష్ట్యాదౌ త్వాం నిగమనివహైర్వందిభిరివ
స్తుతం విష్ణో। సచ్చిత్పరమరసనిర్ద్వైతవపుషమ్।
పరాత్మానం భూమన్। పశుపవనితాభాగ్యనివహం
పరీతాపశ్రాంత్యై పవనపురవాసిన్। పరిభజే॥
10వ భావము :-
భగవాన్! విష్ణుమూర్తీ! సృష్టి ప్రారంభమునుండియు సకల వేదములు నిన్ను స్తుతించుచున్నవి. నీవు భక్తుల చిత్తములలో ప్రకాశించు సచ్చిదానంద స్వరూపుడవు; అద్వైతరూపుడవు కూడా నీవే. గోపవనితల పుణ్యవశమున బృందావనములో అవతరించిన శ్రీకృష్ణా! ఓ! గురవాయూరు పురవాసా! నా పరితాపమును శాంతింపచేయమని కోరి - నిన్ను సేవింతును.

దశమ స్కంధము
89వ దశకము సమాప్తము
-x-