నారాయణీయము/దశమ స్కంధము/88వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
88- వ దశకము - అర్జునగర్వభంగము
88-1
ప్రాగేవాచార్యపుత్రాహృతినిశమనయా స్వీయషట్సూనువీక్షాం
కాంక్షంత్యా మాతురుక్త్యా సుతలభువి బలిం ప్రాప్య తేనార్చితస్త్వమ్।
ధాతుశ్శాపాద్దిరణ్యాన్వితకశిపుభవాన్ శౌరిజాన్ కంసభగ్నాన్
ఆనీయైనాన్ ప్రదర్శ్య స్వపదమనయథాః పూర్వపుత్రాన్మరీచేః॥
1వ భావము:-
ప్రభూ! కృష్ణా! ఒకప్పుడు 'సాందీపని మునికి' గురుదక్షిణగా మృతడయిన అతని కుమారునిని యమలోకమునుండి తెచ్చి అతనికి ఇచ్చి ఉంటివి. ఆ విషయము వినియుండిన నీ తల్లి దేవకీదేవి, కంసుని చేతిలో మృతులయిన తన అరుగురు పుత్రులను చూపమని నిన్నొకనాడు కోరెను. వారిని వెదుకుచూ సుతలలోకమునకేగి నీవచ్చట బలిచక్రవర్తిని కలిసితివి. బలిచక్రవర్తి నిన్ను అర్చించి వారి వివరములను నీకిట్లు చెప్పెను. 'ప్రప్రధమముగా వారు మరీచి అను ప్రజాపతి పుత్రులు. పిదప బ్రహ్మదేవుని శాపముతో హిరణ్యకశిపునికి జన్మించిరి. వారే దేవకీ వసుదేవులకు జన్మించి కంసుని చేతిలో వధించబడి సుతలలోకము చేరిరి'. ప్రభూ! నీవు వారిని తెచ్చి దేవకీదేవికి చూపించితివి; మోక్షము అనుగ్రహించి వారిని విష్ణులోకమునకు పంపితివి.
88-2
శ్రుతదేవ ఇతి శ్రుతం ద్విజేంద్రం బహులాశ్వం నృపతిం చ భక్తిపూర్ణమ్।
యుగపత్ త్వమనుగ్రహీతుకామో మిథిలాం ప్రాపిథ తాపసైస్సమేతః॥
2వ భావము:-
ప్రభూ!కృష్ణా! 'శ్రుతదేవుడు' అను పేరుగల బ్రాహ్మణోత్తముడొకడు నీ భక్తుడు. 'బహుళాశ్వుడు' అను మహారాజుకూడా నీకు పరమ భక్తుడు. వారు మిథిలానగర వాసులు. వారిరువురినీ ఏకకాలమున అనుగ్రహించదలచి, ప్రభూ! నీవు మునీశ్వరులతో కలిసి మిధిలానగరమునకు వెళ్ళితివి.
88-3
గచ్ఛన్ ద్విమూర్తిరుభయోర్యుగపన్నికేతం
ఏ కేన భూరివిభవైర్విహితోపచారః।
అన్యేన తద్దినభృతైశ్చ పలౌదనాద్యైః
తుల్యం ప్రసేదిథ దదాథ చ ముక్తిమాభ్యామ్॥
3వ భావము:-
ప్రభూ!కృష్ణా! నీవు ఆ మునీశ్వరులతో కలిసి, బ్రాహ్మణుని గృహమునకును ఆ మహారాజ రాజప్రాసాదమునకును ఒకే సమయమున వెళ్ళితివి. 'బహూళాశ్వుడు' రాజరికమునకు తగిన విధముగా ఆదరించగా, 'శ్రుతదేవుడు' తనకు ఆ దినము లభించిన పండ్లు, అన్న ఆహారమును సమర్పించి మీకు ఉపచర్యలుచేసి సేవించెను. వారి అతిధి సత్కార్యములకు ప్రభూ! మీరు సమముగా ఆనందించిరి; ప్రసన్నుడవై వారికి నీవు మోక్షమును ప్రసాదించితివి.
88-4
భూయో౾థ ద్వారవత్యాం ద్విజతనయమృతిం తత్ప్రలాపానపి త్వం
కో వా దైవం నిరుంధ్యాదితి కిల కథయన్ విశ్వవోఢా౾ప్యసోఢాః।
జిష్ణోర్గర్వం వినేతుం త్వయి మనుజధియా కుంఠితాం చాస్య బుద్ధిం
తత్త్వారూఢాం విధాతుం పరమతమపదప్రేక్షణేనేతి మన్యే॥
4వ భావము:-
ప్రభూ! కృష్ణా! ఒకానొక సమయములో ద్వారకలో నివసించుచున్న ఒక విప్రుని పుత్రులు పుట్టీపుట్టగనే మరణించుచుండిరి. ఆ విప్రుని విలాపము నీ వరకు వచ్చిననూ "దైవ నిర్ణయమును ఎవరు ఆపగలరు?" అని పలికి, జగదీశ్వరుడివయిన నీవు అతని శోకమునకు స్పందించ లేదు. అర్జునుడు కురుక్షేత్రయుద్ధము ముగిసిన పిదప, సత్యము మరచి అజ్ఞానముతో నిన్ను సామాన్యునిగా పరిగణించు చుండెను. అర్జునునికి గర్వభంగము చేయుటకును ఆపైన నీ పరమపదమును చూపుటకును ఆ విప్రుని శోకమునకు నీవు స్పందిచగలిగియు స్పందించలేదని నేను తలచెదను.
88-5
నష్టా అష్టాస్య పుత్రాః పునరపి తవ తూపేక్షయా కష్టవాదః
స్పష్టో జాతో జనానామథ తదవసరే ద్వారకామాప పార్థః।
మైత్ర్యా తత్రోషితో౾సౌ నవమసుతమృతౌ విప్రవర్యప్రరోదం।
శ్రుత్వా చక్రే ప్రతిజ్ఞామనుపహృతసుతస్సన్నివేక్ష్యే కృశానుమ్॥
5వ భావము:-
ప్రభూ! కృష్ణా! ఆ విప్రునికి ఎనిమిదిమంది పుత్రులు జన్మించి విగతులయుననూ నీవు ఉపేక్షించితివని ద్వారకలో ప్రజలు నీగురించి మాట్లాడుకొనుచుండిరి. ఆ సమయములోనే అర్జునుడు ద్వారకాపురికి వచ్చి నీతో నివసించుచుండెను. ఆ విప్రునికి తొమ్మిదవ సంతానము కలిగి ఆ పుత్రుని మరణసంఘటన అర్జునుడు అక్కడ ఉండగా జరిగెను. అప్పుడు అర్జునుడు, ఆ విప్రునికి పుట్టబోవు శిశువును కాపాడెదననియు అట్లుచేయలేకపోయినచో అగ్ని ప్రవేశము చేయుదుననియు శపధము చేసెను.
88-6
మానీ స త్వామపృష్ట్వా ద్విజనిలయగతో బాణజాలైర్మహాస్త్రైః
రుంధానః సూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే।
యామ్యామైంద్రీం తథాన్యాస్సురవరనగరీర్విద్యయా౾౾ సాద్య సద్యో
మోఘోద్యోగః పతిష్యన్ హుతభుజి భవతా సస్మితం వారితో౾భూత్॥
6వ భావము:-
ప్రభూ! కృష్ణా! ఇప్పుడు ఆ విప్రునికి తదుపరి సంతానము కలుగు సమయమాసన్నమయ్యెను. అర్జునుడు గర్విష్టుడై తన స్వశక్తినినమ్మి, నీకు మాటమాత్రము చెప్పకనే ఆ విప్రుని గృహమునకేగెను; బాణములతో, తన మహాస్త్రములతో ఆవిప్రసతి ప్రసూతిగృహమునకు రక్షణ కలిపించెను. అయుననూ ఆ విప్రుని సంతానము జన్మించిన వెంటనే మాయమయ్యెను. అర్జునుడు తన యోగవిద్యతో యమ,ఇంద్రాది లోకములకు వెళ్ళి వెదికిననూ ఆ శిశువును కనగొనలేకపోయెను. ప్రతిజ్ఞాభంగమగుటతో అర్జునుడు అగ్నిప్రవేశముచేయుటకు ఉద్యక్తుడయ్యెను. ప్రభూ! అప్పుడు నీవు అర్జునుని వారించితివి.
88-7
స్వార్ధం తేన ప్రతీచీం దిశమతిజవినా స్యందనేనాభియాతో
లోకాలోకం వ్యతీతస్తిమిరభయమథో చక్రధామ్నా నిరుంధన్।
చక్రాంశుక్లిష్టదృష్టిం స్థితమథ విజయం పశ్య పశ్యేతి వారాం
పారే త్వం ప్రాదదర్శః కిమపి హి తమసాం దూరదూరం పదం తే॥
7వ భావము:-
ప్రభూ! కృష్ణా! పిమ్మట నీవు అర్జునునితో కలిసి, అతివేగముగాపోవు రథమునెక్కి పశ్చిమ దిక్కునకు బయలుదేరితివి. దారిలో అనేక లోకములను దాటి, కడకు కటికచీకట్లుకమ్మి గాడాంధకారముగానున్న ఒక ప్రదేశమును ప్రవేశించితివి; నీ సుదర్శనచక్రమును ప్రయోగించి ఆ చీకటిని పటాపంచలు జేసితివి. మిరిమిట్లుగొలుపు ఆ చక్రకాంతిలో అర్జునుడు ఏమియూ చూడలేక కన్నులు మూసుకొనెను. నీవప్పుడు అనంతజలరాశికి అవతల అజ్ఞానాంధకారమునకు అతీతముగానున్న వైకుంఠపధమునకు అర్జునుని తీసుకొనివెళ్ళి "చూడుము.....చూడుము", అని అతనికి చూపితివి.
88-8
తత్రాసీనం భుజంగాధిపశయనతలే దివ్యభూషాయుధాద్యైః
ఆవీతం పీతచేలం ప్రతినవజలదశ్యామలం శ్రీమదంగమ్।
మూర్తీనామీశితారం పరమిహ తిసృణామేకమర్థం శ్రుతీనాం
త్వామేవ త్వం పరాత్మన్ ప్రియసఖసహితో నేమిథ క్షేమరూపమ్॥
8వ భావము:-
ఆ వైకుంఠములో భుజగశయనుడు, దివ్యాభరణములను ధరించి, ఆయుధములను చేతబట్టి, పట్టుపీతాంబరములతో, నీలమేఘచాయతో, లక్మీదేవిని వక్షస్థలమున నిలుపుకొని, త్రిమూర్తులు మరియు త్రిలోకములకు అధిపతి, వేదాత్మకుడయిన నారాయణుని, నీ మిత్రుడగు అర్జునునునితో కలిసి దర్శంచితివి. ముక్తిని ప్రసాదించు ఆ పరమేశ్వరునికి మీరిరువురు నమస్కరించిరి. భగవాన్! కృష్ణా! ఆ పరమాత్మవు నీవే!
88-9
యువాం మామేవ ద్వావధికవివృతాంతర్హితతయా
విభిన్నౌ సంద్రష్టుం స్వయమహమహార్షం ద్విజసుతాన్।
నయేతం ద్రాగేతానితి ఖలు వితీర్ణాన్ పునరమూన్
ద్విజాయాదాయాదాః ప్రణుతమహిమా పాండుజనుషా॥
9వ భావము:-
ప్రభూ! కృష్ణా! మీరు ఆ పరమాత్మకు నమస్కరించగా, నారాయణుడు మీతో ఇట్లనెను. "మీరిరువురును నా అంశావతారులే! మీలో ఒకరి (కృష్ణుని) శక్తి బహిర్గతమగు దైవశక్తి; మరియొకరిది (అర్జునుని శక్తి) అంతర్గతముగా నుండు దైవశక్తి. మీరు నరనారాయణులు. మిమ్ము చూచుటకే ఆ విప్రుని సంతానమును ఇచ్చటకు తెచ్చితిని. మీరు వీరిని తీసుకొనిపొండు" అని పలికెను. మీరు ద్వారకకు వచ్చి ఆ విప్రునకు వాని సంతానమును అప్పజెప్పిరి. అర్జునుడు నీ మహిమను స్తుతించెను.
88-10
ఏవం నానావిహారైర్జగదభిరమయన్ వృష్ణివంశం ప్రపుష్ణన్
ఈజానో యజ్ఞభేదైరతులవిహృతిభిః ప్రీణయన్నేణనేత్రాః।
భూభారక్షేపదంభాత్ పదకమలజుషాం మోక్షణాయావతీర్ణః
పూర్ణం బ్రహ్మైవ సాక్షాద్యదుషు మనుజతారూషితస్త్వం వ్యలాసీః॥
10వ భావము:-
ఈ విధముగా నీవు అనేకరకముల విహారములతో, లీలలతో భూలోకవాసులను సంతోషింపజేయుచు, యాదవ వంశమును రక్షించుచు, వృద్ధిచేయుచు, యజ్ఞయాగాదులచే దేవతలను ఆరాధించుచు, లేడికన్నులుగలనీ పత్నులను అలరించుచు, భూభారము తగ్గించునెపముతో దుష్టులను శిక్షించుచు, నీ పాదపద్మములను ఆశ్రయించిన భక్తులకు మోక్షము ప్రసాదించుచు, శ్రీకృష్ణావతారము ధరించి యదువంశములో మానవరూపమున ప్రకాశించిన పరిపూర్ణ బ్రహ్మతత్వరూపమే ప్రభూ! కృష్ణా! నీ ఈ రూపము.
88-11
ప్రాయేణ ద్వారవత్యామవృతదయి తదా నారదస్త్వద్రసార్ధ్రః
తస్మాల్లేభే కదాచిత్ ఖలు సుకృతనిధిస్త్వత్పితా తత్త్వబోధమ్।
భక్తానామగ్రయాయి స చ ఖలు మతిమానుద్ధవస్త్వత్త ఏవ
ప్రాప్తో విజ్ఞానసారం స కిల జనహితాయాధునా౾౾స్తే బదర్యామ్॥
11వ భావము:-
ప్రభూ! కృష్ణా! ఆ దినములలో చాలా సమయము 'నారదమహాముని' నీ సాహచర్యములోని ఆర్ధ్రతను, ఆనందమును అనుభవించుచు ద్వారకలోనే గడుపుచుండెడువాడు. అప్పుడు నారదముని నీ తండ్రి వసుదేవునికి తత్వభోధ చేసెను. నీ ఉత్తమ భక్తుడు జ్ఞాని అయిన 'ఉద్ధవుడు' స్వయముగా నీ నుండి తత్వజ్ఞానమును గ్రహించెను. లోకహితమును కోరి అతడు ఇప్పటికినీ బదరికాశ్రమములో నివసించుచు ఆ తత్వజ్ఞానమును భోధించుచన్నాడన్న విషయము లోకములో వినబడుచున్నది.
88-12
సో౾యం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర సౌహార్దభీతి-
స్నేహద్వేషానురాగప్రభృతిభిరతులైరశ్రమైర్యోగబేదైః।
ఆర్తిం తీర్త్వా సమస్తామమృతపదమగుస్సర్వలోకాః
స త్వం విశ్వార్తిశాంత్యై పవనపురపతే భక్తిపూర్త్యై చ భూయాః॥
12వ భావము:-
భగవాన్ ! నీ అవతారములు అన్నింటిలోను శ్రీకృష్ణావతారము పరమోత్కృష్టమయునది. ఈ అవతారములో జనులు స్నేహము, భయము, ద్వేషము, ప్రేమ, అనురాగము ఇత్యాది భావనలతో సదా నిన్ను తలచుకొనుచు, కొలుచుచూ యుండిరి. వారి వారి బాధలను అధిగమించి, యోగసాధనచేయకనే అనాయాసముగా నీ అమృతపధమైన మోక్షమున పొందిరి. విశ్వమునకు శాంతిని ప్రసాదించు ఓ! గురవాయూరు పురవాసా! నారాయణమూర్తీ! నీ ఎడల మాకెల్లరకూ పరిపూర్ణ భక్తిని ప్రసాదించుము, అని నిన్ను ప్రార్ధించుచున్నాను.
దశమ స్కంధము
88వ దశకము సమాప్తము
-x-