నారాయణీయము/దశమ స్కంధము/86వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
86 వ దశకము - సాల్వాదులవధ-భారతయుద్ధము
86-1
సాల్వోభైష్మీవివాహే యదుబలవిజితశ్చంద్రచూడాద్విమానం
విందన్ సౌభం స మాయీ త్వయి వసతి కూరూంస్త్వత్పురీమభ్యభాంక్షీత్।
ప్రద్యుమ్నస్తం నిరుంధన్ నిఖిలయదుభటైర్న్యగ్రహీదుగ్రవీర్యం
తస్యామాత్యం ద్యుమంతం వ్యజని చ సమరస్సప్తవింశత్యహాంతమ్॥
1వ భావము :-
భగవాన్! రుక్మిణీదేవిని నీవు 'కుండిన' నగరమునుండి తీసుకొని వచ్చుచుండగా నిన్ను అడ్డగించి యాదవ సైన్యముచేతిలో పరాజితులయిన రాజులలో 'సాల్వుడు' ఒకడు. అతడు నీమీద కక్షపెట్టుకొనెను. తపస్సుచేసి శివునిమెప్పించి, 'సౌభము' అను విమానమును పొందెను. ధర్మజుని రాజసూయ యాగమునకు నీవు ఇంద్రప్రస్థము వెళ్ళిన సమయములో ఆ సాల్వుడు ద్వారకను ముట్టడించెను. అప్పుడు నీ కుమారుడగు ప్రద్యుమ్నుడు యాదవసైన్యముతో ఆ సాల్వుని ఎదుర్కొని ఇరువదియేడు దినములు యుద్థము చేసెను. ఆ యుద్ధములో పరాక్రమవంతుడయిన సాల్వుని మంత్రియగు 'ద్యుమంతుని' ప్రద్యుమ్నుడు బందీగా పట్టుకొనెను.
86-2
తావత్త్వం రామశాలీ త్వరితముపగతః ఖండితప్రాయసైన్యం
సౌభేశం తం న్యరుంధాః స చ కిల గదయా శార్ జ్గమభ్రంశయత్ తే।
మాయాతాతం వ్యహింసీదపి తవ పురతస్తత్త్వయాపి క్షణార్థం
నాజ్ఞాయీత్యాహురేకే తదిదమవమతం వ్యాస ఏవ న్యషేధీత్॥
2వ భావము :-
భగవాన్! కృష్ణా! ఆ యుద్ధము ముగింపు దశకు చేరుసమయమునకు నీవు బలరామునితో కలిసి ఇంద్రప్రస్థమునుండి తిరిగి వచ్చితివి; 'సౌభక'విమాన పతియగు ఆ సాల్వుని ఎదుర్కొంటివి. మాయావియగు సాల్వుడు తన ఆయుధముతో 'శార్జ్గ'మను నీ ధనుస్సును నీచేతినుండి పడగొట్టి, నీ తండ్రి మాయా వసుదేవుని రూపమును సృష్టించి శిరస్సును ఖండించెను. అది నిజమని తలచి నీవు క్షణకాలము దుఃఖితుడవయితివి అని చెప్పబడెను. ప్రభూ! వ్యాసమహర్షి తన భాగవతమున ఈ అభిప్రాయముతో విభేదించెను; చింతాక్రాంతుడవయినట్లు కనిపించితివే కాని వాస్తవమునకు నీవు ఏ భ్రాంతికి లోనవలేదని పలికెను.
86-3
క్షిప్త్వాసౌభం గదాచూర్ణితముదకనిధౌ మంక్షు సాల్వే౾పి చక్రే-
ణోత్కృత్తే దంతవక్త్రః ప్రసభమభిపతన్నభ్యముంచద్గదాంతే।
కౌమోదక్యాహాతో౾సావపి సుకృతనిధిశ్చైద్యవత్ ప్రాపదైక్యం
సర్వేషామేష పూర్వం త్వయి ధృతమనసాం మోక్షణార్థో౾వతారః॥
3వ భావము :-
భగవాన్! కృష్ణా! అప్పుడు నీవు 'సాల్వుని' విమానమును నీ గదతో కొట్టి ధ్వంసముచేసి సముద్రమున పడవేసితివి; నీ చక్రముతో అతని శిరస్సును ఖండించితివి. అదిచూచిన సాల్వుని మిత్రుడు శిశుపాలుని సోదరుడు అగు 'దంతవక్త్రుడు' తన గదతో నిన్ను ఎదుర్కొనెను. నీ 'కౌమోదకి' గదతో అతనిని వధించితివి; పుణ్యశాలి అయిన అతనికి నీ సాయుజ్యమును ప్రసాదించితివి. ద్వేషముతోనయిననూ తమ మనస్సులలో నిరంతరము నిన్ను తలచువారికి మోక్షము ప్రసాదించుటయే కదా ప్రభూ! నీ అవతార లక్ష్యము.
86-4
త్వయ్యాయాతే౾థ జాతే కిల కురుసదసి ద్యూతకే సంయతాయాః
క్రందంత్యా యాజ్ఞసేన్యాస్స కరుణమకృథాశ్చేలమాలామనంతామ్।
అన్నాంతప్రాప్తశర్వాంశజమునిచకితద్రౌపదీచింతితో౾థ
ప్రాప్తశ్శాకాన్నమశ్నన్ మునిగణమకృథాస్తృప్తిమంతం వనాంతే॥
4వ భావము :-
భగవాన్! ధర్మజుని రాజసూయయాగము అయిన పిదప నీవు ద్వారకకు తిరిగి వచ్చితివి. ఆ తరువాత కౌరవ పాండవుల మధ్య ద్యూతక్రీడ జరిగి, ఆ మాయా ద్యూతములో ద్రౌపది కౌరవుల ఆధీనమయ్యెను. ఆమె ఆక్రందనను విని, అనంతమగు వస్త్రములను ప్రసాదించి ఆమెను నీవప్పుడు కాపాడితివి. పాండవులు అరణ్యవాసములోనుండగా ఒక అపరాహ్ణము దాటినవేళ శంకర అంశజుడగు దూర్వాసుడు శిష్యగణముతో అతిథిగా వచ్చెను. పాండవుల అన్నపాత్ర అప్పటికే ఖాళీఅయియుండెను. ద్రౌపది భయపడి దిక్కుతోచనిస్థితిలో, ప్రభూ! నిన్ను ప్రార్థించెను; నీవు తక్షణమే ప్రత్యక్షమై ఆ పాత్రలో లేశమాత్రముగా మిగిలి ఉన్న ఆకుకూరను భుజించితివి; ఆ మునిగణములు నిండిన కుక్షితో తృప్తిపడి వెడలిపోయిరి.
86-5
యుద్ధోద్యోగే౾థ మంత్రే మిలతి సతి వృతః ఫల్గునేన త్వమేకః
కౌరవ్యే దత్తసైన్యః కరిపురమగమో దౌత్యకృత్ పాండవార్థమ్।
భీష్మద్రోణాదిమాన్యే తవ ఖలు వచనే ధిక్కృతే కౌరవేణ
వ్యావృణ్వన్ విశ్వరూపం మునిసదసి పురీం క్షోభయిత్వాగతో౾భూః॥
5వ భావము :-
భగవాన్! కురుక్షేత్రయుద్ధమునకు సన్నాహములు జరుగుచుండెను. యుద్ధతంత్ర భాగముగా అర్జునుడు నిన్ను కోరుకొనెను; నీ సైన్యమును దుర్యోధనుడు పొందెను. పాండవుల పక్షమున హస్తినాపురమునకు రాయబారిగా వెళ్ళితివి. కౌరవసభలో మునులు, భీష్మ ద్రోణాది పెద్దలు నీ మాటను సమర్థించినను దుర్యోధనుడు మాత్రము పెడచెవినిపెట్టి నిన్ను నిరోధించ యత్నించెను. అంతట ప్రభూ! ఆ కౌరవసభలో నీవు నీ విశ్వరూపమును ప్రదర్శించితివి; కౌరవులను, హస్తినాపురప్రజలను భయభ్రాంతులు గావించితివి.
86-6
జిష్ణోస్త్వం కృష్ణసూతః ఖలు సమరముఖే బంధుఘాతే దయాలుం
ఖిన్నం తం వీక్ష్య వీరం కిమిదమయి సఖే।నిత్యఏకో౾యమాత్మా।
కో వధ్యః కో౾త్ర హంతా తదిహ వధభియం ప్రోజయ్యి మయ్యర్పితాత్మా
ధర్మ్యం యుద్ధం చరేతి ప్రకృతిమనయథా దర్శయన్ విశ్వరూపమ్॥
6వ భావము :-
భగవాన్! ఆ కౌరవ పాండవ యుద్ధములో నీవు అర్జునుని రధసారధ్యము వహించితివి. బంధుమిత్రులను చూచి యుద్ధములో వారిని వధించుట ఎట్లు అని వ్యధచెందుచున్న అర్జునునితో, ప్రభూ! కృష్ణా! నీవిట్లంటివి. " మిత్రమా! ఏమి ఇది? ఇట్లు కలత చెందుచుంటివేల? వధించునది ఎవరు? వధించబడువాడు ఎవరు? నిత్యమయునది సత్యమయినది ఆత్మ ఒక్కటే! ఆ ఆత్మే పరమాత్మ! ఆ పరమాత్మను నేనే! చింతించకుము; నన్ను శరణుజొచ్చుము. నీ ఆత్మను నాకు అర్పించి యుద్ధము కొనసాగించుము", అని పలుకుచూ అర్జునునకు నీ విశ్వరూపమును దర్శింపజేసితివి; అంతట అర్జునుడు స్వాంతనపొంది తన సువ్యవస్థిత స్థితికి (యథాస్థితికి) వచ్చెను.
86-7
భక్తోత్తంసే౾థ భీష్మే తవ ధరణిభరక్షేపకృత్యైకసక్తే
నిత్యం నిత్యం విభిందత్యవనిభృదయుతం ప్రాప్తసాదే చ పార్థే।
నిశ్సస్త్రత్వప్రతిజ్ఞాం విజహదరివరం ధారయన్ క్రోధశాలీ
వాధావన్ ప్రాంజలిం తం నతశిరసమథో వీక్ష్య మోదాదపాగాః॥
7వ భావము :-
భగవాన్! ఆ యుద్ధరంగమున నీ ఉత్తమభక్తుడగు భీష్ముడు, భూభారము తగ్గించవలెనన్న నీ అవతార లక్ష్యమునందు ఆసక్తికలవానివల, తానొక్కడే ప్రతిదినము పదివేలమందిని వధించుచుండెను. భీష్ముని నిలువరించుటలో అర్జునుడు విఫలుడై విషాదగ్రస్తుడయ్యెను. ప్రభూ! కృష్ణా! నీవప్పుడు, యుద్ధమున అస్త్రముధరించనని చెప్పిన మాటను పక్కనపెట్టి, క్రోధముగా నీ చక్రముచేతబట్టి భీష్మునిపైకి దూసుకుపోయితివి. అదిచూచిన భీష్ముడు అంజలిఘటించి వినమ్రుడై నీ ముందు నిలచెను. అప్పుడు ఆనంద దరహాసముతో అచటనుండి తొలగి నీవు నీస్థానమును చేరితివి.
86-8
యుద్ధే ద్రోణస్య హస్తిస్థిరరణభగదత్తేరితం వైష్ణవాస్త్రం
వక్షస్యాధత్తచక్రస్థగితరవిమహాః ప్రార్ధయత్ సింధురాజమ్।
నాగాస్త్రే కర్ణముక్తే క్షితిమవనమయన్ కేవలం కృత్తమౌళిం
తత్రే తత్రా౾పి పార్థం కిమివ న హి భవాన్ పాండవానామకార్షీత్॥
8వ భావము :-
భగవాన్! భీష్ముడు అంపశయ్యపై చేరిన తరువాత, ద్రోణుడు సైన్యాధిపతి అయ్యెను. అప్పుడు నరకాసురుని పుత్రుడగు 'భగదత్తుడు' అనువాడు తన గజవాహనముపై స్థిరముగా కూర్చొని యుద్ధమునకు వచ్చెను. పాండవులపై అతడు 'వైష్ణవాస్త్రమును' ప్రయోగించగా నీవు దానిని నీ వక్షస్థలమున స్వీకరించితివి. ఇంకొక సమయమున, సూర్యకిరణములను నీ సుదర్శనచక్రముతో మరుగుపరిచి 'సింధురాజగు సైంధవునుని' అర్జునుడు వధించునట్లు చేసితివి. మరొకమారు 'కర్ణుడు' అర్జునునిపై నాగాస్త్రము ప్రయోగించగా, భూమిని క్రిందకు క్రుంగునట్లుచేసి, ఆ అస్త్రము కేవలము అర్జునుని కిరీటమును మాత్రము ఖండించునట్లుచేసి అతనిని రక్షించితివి. ప్రభూ! కృష్ణా! పాండవులకొరకు నీవు చేయని కార్యమేమున్నది?
86-9
యుద్ధాదౌ తీర్థగామీ స ఖలు హలధరో నైమిశక్షేత్రమృచ్ఛన్
అప్రత్యుత్థాయి సూతక్షయకృదథ సుతం తత్సదే కల్పయిత్వా
యజ్ఞఘ్నం బల్వలం పర్వణి పరిదలయన్ స్నాతతీర్థో రణాంతే
సంప్రాప్తో భీమదుర్యోధనరణమశమం వీక్ష్య యాతః పురీం తే॥
9వ భావము :-
భగవాన్! యుద్ధము ప్రారంభమయిన సమయమున నీ అన్న 'బలరాముడు' తీర్థయాత్రలకు వెళ్ళెను. అతడు నైమిశారణ్యమున సంచరించుండగా తనను 'సూత' మహాముని గౌరవించలేదని కోపించి అతనిని వధించెను; అతని పుత్రుడిని 'సూతుని' స్థానమగు గురుస్థానమున కూర్చుండబెట్టెను. పౌర్ణమి అమావాస్య దినములలో మునులు చేయు యజ్ఞములకు విఘ్నము కలిగించుచున్న 'వల్కలుడు' అను అసురుని బలరాముడు అప్పుడు వధించెను. బలరాముడు పలు తీర్ధములయందు స్నానమాచరించి తుదకు కురుక్షేత్రమును చేరుకొనెను. అక్కడ భీకరముగా జరుగుచున్న భీమ దుర్యోధనుల గదాయుద్ధమును చూచెను; వారిని నివారింప ప్రయత్నించి ద్వారకకు వెడలిపోయెను.
86-10
సంసుప్తద్రౌపదేయక్షపణహతధియం ద్రౌణిమేత్య త్వదుక్త్యా
తన్ముక్తం బ్రాహ్మమస్త్రం సమహృతవిజయో మౌళిరత్నం చ జహ్రే।
ఉచ్ఛిత్యై పాండవానాం పునరపి చ విశత్యుత్తరాగర్భమస్త్రే
రక్షన్నంగుష్ఠమాత్రః కిల జఠరమగాశ్చక్రపాణిర్విభో।త్వమ్॥
10వ భావము :-
భగవాన్! ద్రోణుని పుత్రుడగు అశ్వత్థామ క్రోదాంధుడై నిద్రించుచున్న ద్రౌపదిపుత్రులగు ఉపపాండవులను హతమార్చెను; పాండవవంశమును సమూలముగా అంతమొందిచుటకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. నీ ఆదేశముతో ప్రభూ!కృష్ణా! అప్పుడు అర్జునుడు ఆ అస్త్రమును ఉపసంహరించి అశ్వత్థామ శిరస్సున ఉన్న రత్నమును తొలగించెను. అశ్వత్థామ మరియొక అస్త్రమును ప్రయోగించగా అది అభిమన్యుని భార్యయగు ఉత్తర గర్భమును ప్రవేశించెను. ఆమె గర్భస్తశిశువును రక్షించుటకు చక్రపాణీ! నీవు అంగుష్టమాత్రపు రూపముతో చక్రధారివై ఆమె గర్భమును ప్రవేశించితివి; ఆ అస్త్రమును నిర్వీర్యముచేసితివి.
86-11
ధర్మౌఘం ధర్మసూనోరభిదధదఖిలం ఛందమృత్యుస్స భీష్మః
త్వాం పశ్యన్ భక్తిభూమ్నైవ హి సపది యయౌ నిష్కలబ్రహ్మభూయమ్।
సంయాజ్యాథాశ్వమేధైస్త్రిభిరతిమహితైర్దర్మజం పూర్ణకామం
సంప్రాప్తో ద్వారకాం త్వం పవనపురపతే ।పాహి మాం సర్వరోగాత్॥
11వ భావము :-
ప్రభూ! కృష్ణా! నీ ప్రేరణతో ధర్మజుడు కోరగా అంపశయ్యపైనున్న భీష్ముడు అతనికి ధర్మసూక్ష్మజ్ఞానమును భోధించెను. స్వచ్ఛందమరణముపొందు వరముకల అతడు ధృఢ భక్తితో నిన్ను కీర్తించి, నీ దర్శనభాగ్యముతో శ్రీఘ్రమే నిష్కలబ్రహ్మములో ఐక్యమయ్యెను. కురుక్షేత్రయుద్ధము ముగిసిన పిదప, పాండవుల సకల అభీష్టములు తీరుటకు ధర్మరాజుచేత మూడు అశ్వమేధయాగములను జరిపించితివి; అనంతరము నీవు ద్వారకను చేరుకొంటివి. అట్టి శ్రీకృష్ణుని రూపమున నిలచిన, ఓ! గురవాయూరు పురాధీశా! రోగము బారినుండి రక్షించుము.
దశమ స్కంధము
86వ దశకము సమాప్తము.