నారాయణీయము/దశమ స్కంధము/85వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

85- వ దశకము - యుధిష్ఠురుని రాజసూయయాగము-శిశుపాలవధ


85-1
తతో మగధభూభృతాచిరనిరోధసంక్లేశితం
శతాష్టకయుతాయుతద్వితయమీశ భూమీభృతామ్।
అనాథశరణాయతే కమపి పూరుషం ప్రాహిణోత్
అయాచత స మాగధక్షపణమేవ కిం భూయసా॥
1వ భావము :-
మగధరాజగు జరాసంధుడు, ఇరువదివేల ఎనిమిది వందలమంది భూపాలకులగు రాజులను బంధించితెచ్చి, చెరపట్టి వారిని చిరకాలముగా బాధించుచుండెను. దయనీయ స్థితిలో ఉన్న ఆ రాజులు, ప్రభూ! కృష్ణా! ఆ మగధరాజును సంహరించి తమను కాపాడమని ఒక దూతను పంపి నీకు విన్నవించుకొనిరి.
 
85-2
యియాసురభిమాగధం తదను నారదోదీరితాత్
యుధిష్ఠిరమఖోద్యమాదుభయకార్యపర్యాకులః।
శశంసుషి నిజైః సమం పురమియేథ యౌధిష్ఠిరీమ్॥
2వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! నీవు అప్పుడు మగధపై దండెత్త తలచితివి. ధర్మరాజు రాజసూయయాగము చేయనున్నాడని అప్పుడే వచ్చిన నారదుడు చెప్పెను. "జరాసంధ వధ మరియు రాజసూయ యాగమునకు వెళ్ళుట ఏకకాలమున ఎట్లు?" అని నీవు యోచించుచుండగా, శత్రువులపై విజయము సాధించిన పిదపనే రాజసూయయాగము చేయుదురనియు,ఆ విధముగా జరాసంధుని వధించుటకు అవకాశము కాగలదని, ఉద్ధవుడు నీకు సూచించెను. యుదిష్టరుని కోరికపై నీవు నీ ప్రజలతో కలిసి ఆ రాజసూయ యాగము చూచుటకు ఇంద్రప్రస్థమునకు బయలదేరి వెళ్ళితివి.

85-3
అశేషదయితాయుతే త్వయి సమాగతే ధర్మజో
విజిత్య సహజైర్మహీం భవదపాంగసంవర్ధితైః।
శ్రియం నిరుపమాం వహన్నహహ భక్తదాసాయితం
భవంతమయి। మాగధే ప్రహితవాన్ సభీమార్జునమ్॥
3వ భావము :-
భగవాన్! కృష్ణా! నీ కటాక్షవీక్షణ శక్తితో ఆ ధర్మజుని సోదరులు శత్రురాజులను జయించి తెచ్చిన నిరుపమాన సంపదతో ఇంద్రప్రస్థము వెలుగొందుచుండెను. నీ పత్నులతో నీవు ఆ నగరమును ప్రవేశించితివి. ధర్మరాజు పరమానందభరితుడై మిమ్ములను ఆహ్వానించెను. జరాసంధుని నుండి కప్పము తెచ్చుటకు, భీమార్జునలతో నిన్ను వెళ్ళమని కోరగా, భక్తులకు దాసుడవగు ప్రభూ! నీవు వారితో వెళ్ళితివి.
 
85-4
గిరివ్రజపురం గతాస్తదను దేవ।యూయాం త్రయో
యయాచ సమరోత్సవం ద్విజమిషేణ తమ్మాగధమ్।
అపూర్ణసుకృతం త్వముం పవనజేన సంగ్రామయన్
నిరీక్ష్య సహ జిష్ణునా త్వమపి రాజయుద్ధ్వా స్థితః॥
4వ భావము :-
భగవాన్! మీరు ముగ్గురూ విప్రుల వేషముతో మగధరాజధానియగు గిరివ్రజమును చేరి జరాసంధుని కలిసిరి. జరాసంధుడు మిమ్ము దక్షిణ కోరుకొనమనగా మీరు అతనితో మల్లయుద్ధమును కోరిరి. అప్పుడు నీ చేతిలో మరణించు పుణ్యశాలికాని జరాసంధుడు, ప్రభూ! కృష్ణా! భీముని ఎంచుకొనెను. ఆ ఇరువురి రాజయోధుల ద్వంద్వయుద్ధమును నీవు అర్జునునితో కలిసి ప్రేక్షకునివలె చూచుచుంటివి.
 
85-5
అశాంతసమరోద్ధతం విటపపాటనాసంజ్ఞయా
నిపాత్య జరసస్సుతం పవనజేన నిష్పాటితమ్।
విముచ్య నృపతీన్ ముదా సమనుగృహ్య భక్తిం పరాం
దిదేశిథ గతస్పృహానపి చ ధర్మగుప్త్యై భువః॥
5వ భావము :-
భగవాన్! కృష్ణా! ఆ మల్లయోధులిరువురు విజృంభించి భీకరముగా పోరాడసాగిరి. అవిరామముగా జరుగుచున్న ఆ మల్లయుద్ధములో జరాసంధుని శక్తి విజృంభించుట చూచి, ఒక చెట్టురెమ్మను రెండుగా చీల్చి, జరాసంధుని అట్లుచేయమని, నీవు భీమునికి సౌంజ్ఞ జేసితివి. భీముడట్లు చేయగనే 'జర' పుత్రుడగు జరాసంధుడు మరణించెను. ప్రభూ! నీవు చెరసాలనుంచి క్షత్రియులను విడిపించి వారికి దృఢభక్తిని అనుగ్రహించితివి; వైరాగ్య చింతనతో ధర్మరక్షణకు పరిపాలనచేయమని పలికితివి.
(జరాసంధుడు రెండు అర్థశరీములుగా ఇద్దరు తల్లులకు జన్మించి మృతుడని వారిచే విడవబడెను. 'జర' అను రాక్షస స్త్రీ, ఆ శరీర పార్శములు రెంటిని జతచేయగా పునర్జీవుతుడగుటచే జరాసంధుడని ప్రసిద్ధిచెందెను. భీముడు అతని శరీరమును చీల్చి రెండు భాగములు చేయగా జరాసంధుడు విగతుజీవుడయ్యెను).
 
85-6
ప్రచక్రుషి యుధిష్ఠిరే తదను రాజసూయాధ్వరం
ప్రసన్నభృతకీ భవత్ సకలరాజకవ్యాకులమ్।
త్వమప్యయి జగత్పతే।ద్విజపదావనేజాదికం
చకర్థ కిము కథ్యతే నృపవరస్య భాగ్యోన్నతిః॥
6వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! ధర్మరాజు చేయుచున్న ఆ రాజసూయయాగము చూచుటకు వచ్చిన రాజులు ఆనందముగా ఆ యాగములో పాల్గొనిరి; వారికి నిర్దేశించిన సేవలను సంతోషముగా నిర్వర్తించిరి. ఆ ధర్మరాజు భాగ్యము ఏమని పొగుడుదుము! ప్రభూ! నీవే స్వయముగా ఆ యాగమునకు వచ్చిన ద్విజోత్తముల పాదములను కడిగితివి.
 
85-7
తతస్సవనకర్మణి ప్రవరమగ్ర్యపూజావిధిం
విచార్య సహదేవవాగనుగతస్స ధర్మాత్మజః।
వ్యధత్త భవతే ముదా సదసి విశ్వభూతాత్మనే
తదా ససురమానుషం భువనమేవ తృప్తిం దధౌ॥
7వ భావము :-
యుదిష్ఠిరుని రాజసూయయాగము ముగింపుదశకు చేరుకొనెను. ఆఖరి ఘట్టమగు 'ఉత్తమ పురుషునికి సన్మానము' చేయుట అను ప్రధాన కార్యక్రమమునకు సమయమాసన్నమయ్యెను. అప్పుడు ధర్మరాజు తన తమ్ముడగు 'సహదేవుని' సూచనతో, ప్రభూ! శ్రీకృష్ణా! ఆ యజ్ఞసభలో జగత్తుకే పరమాత్మవగు నీకు పాదపూజచేసెను. అది చూచి సభకు వచ్చిన దేవతలు ఇతర సభికులు మిక్కిలి ఆనందించిరి; సంతుష్టులయిరి.
 
85-8
తతస్సపది చేదిపో మునినృపేషు తిష్ఠత్స్వహో
సభాజయతి కో జఢః పశుపదుర్ధురూఢం వటుమ్।
ఇతి త్వయి స దుర్వచోవితతిముద్వమన్నాసనాత్
ఉదాపతదుదాయుధః సమపతన్నముం పాండవాః॥
8వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! నీకు అట్లు సన్మానము జరుగుచుండగా చేదిరాజగు 'శిశుపాలుడు' హఠాత్తుగా తన ఖడ్గమును చేతబట్టి ఆసనమునుండి లేచి నిన్ను ఇట్లు దూషించసాగెను, "పూజనీయులయిన మునులు రాజులు ఇంతమంది ఉన్న ఈ సభలో భ్రష్టవర్తనుడగు ఈ గోపాలుడిని ఏ మూర్ఖుడు పూజించును?" అని అనుచితముగా పలుకుచున్న ఆ 'శిశుపాలుని' పాండవులు శీఘ్రమే చుట్టుముట్టిరి.
 
95-9
నివార్య నిజపక్షగానభిముఖస్య విద్వేషిణః
త్వమేవ జహ్రిషే శిరో దనుజదారిణా స్వారిణా।
జనుస్త్రితయలబ్ధయా సతతచింతయా శుద్ధధీః
త్వయా స పరమేకతామధృత యోగినాం దుర్లభమ్॥
9వ భావము :-
ప్రభూ! శ్రీకృష్ణా! 'శిశుపాలుని' చుట్టుముట్టిన పాండవులను నీవు వారించితివి; దానవులను సంహరించు నీ సుదర్శనచక్రముతో ఆ శిశుపాలుని శిరస్సును ఖండించివేసితివి. 'శిశుపాలుడు' (తన మూడు జన్మలలోను హిరణ్య కశిపుడు, రావణుడు, శిశుపాలుడు వైరభక్తితో) నిన్ను ద్వేషించుచూ నిత్యమూ నిన్నే స్మరించుచుండటచే, భగవాన్! ఆ దానవుని ఆత్మ పవిత్రమై నీలో ఐక్యమయ్యెను; అట్టి ముక్తి మహాయోగులకు కూడా దుర్లభము.
 
85-10
తతస్సుమహితే త్వయా క్రతువరే నిరూఢే జనో
యయౌ జయతి ధర్మజో జయతి కృష్ణ ఇత్యాలపన్।
ఖలః స తు సుయోధనో ధుతమనాస్సపత్నశ్రియా
మయార్పితసభాముఖే స్థలజలభ్రమాదభ్రమీత్॥
10వ భావము :-
ప్రభూ! శ్రీకృష్ణా! నీ అధ్వర్యములో యుదిష్టరుడు చేసిన రాజసూయయాగము వైభవముగా ముగిసినది. వచ్చిన ప్రజలు, "ధర్మరాజుకు జయము!", "శ్రీకృష్ణునికి జయము!" అని జయజయధ్వనులు చేయుచు వారి వారి స్వస్థలములకు తిరిగి వెళ్ళిరి. సంపన్నవంతమయిన ఇంద్రప్రస్థపురమును, పాండవుల వైభవమును చూచి, దుర్యోధనుడు అసూయాగ్రస్తుడయ్యెను. మయుడు నిర్మించిన సభామంటపములో జలప్రదేశమును నేలయని, నేలప్రదేశమును జలప్రదేశమని భ్రమపడసాగెను.
 
85-11
తదా హసితముత్థితం ద్రుపద నందనా భీమయోః
అపాంగ కలయా విభో।కిమపి తావజ్జృంభయన్।
ధరాభర నిరాకృతౌ సపది నామ బీజం వపన్
జనార్ధన।మరుత్పరీ నిలయ ।పాహి మామామయాత్॥
11వ భావము :-
దుర్యోధనుడు అట్లు భ్రమపడి భంగపడుట జరిగెను. అదిచూచిన భీముడు, ద్రౌపది నవ్విరి. అట్లు నవ్వుచున్న వారిని నీ కంటిచూపుతో, ప్రభూ! శ్రీకృష్ణా! మరింత ప్రేరేపించితివి. ఇది అంతయూ భూభారము తగ్గించుటకు, మున్ముందు జరగవలసిన కురుక్షేత్రయుద్ధమునకు నీవు వేసిన బీజమే కదా! అట్టి జనార్ధనా! గురవాయూరు పురాధీశా! ఈ వ్యాధినుండి నన్ను కాపాడుము.
 
దశమ స్కంధము
85వ దశకము సమాప్తము