Jump to content

నారాయణీయము/దశమ స్కంధము/84వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

84- వ దశకము - సమంతపంచకయాత్ర


84-1
క్వచిదథ తపనోపరాగకాలే పురి నిదధత్కృతవర్మకామసూనూ।
యదుకులమహిళావృతస్సుతీర్థం సముపగతో౾పి సమంతపంచకాఖ్యమ్॥
1వ భావము :-
ప్రభూ! కృష్ణా! ఒక సూర్యగ్రహణమునాడు నదీ స్నానము చేయుటకు నీవు ఉత్తమ తీర్థమయిన కురుక్షేత్రమునగల సమంతక పంచకమునకు వెళ్ళవలెనని తలచితివి. అప్పుడు ద్వారకాపురికి రక్షణగా కృతవర్మ అనిరుద్ధులను నియమించి, నీ పత్నులు మరియు ఇతర యాదవులతోను కలిసి సమంతక పంచకమునకు వెళ్ళితివి.
 
84-2
బహుతరజనతాహితాయ తత్ర త్వమపి పునన్ వినిమజ్జ్య తీర్థతోయమ్।
ద్విజగణపరిముక్తవిత్తరాశిః సమమిలథాః కురుపాండవాదిమిత్రైః॥
2వ భావము :-
ప్రభూ! కృష్ణా! జనహితమును కోరి నీవు పుణ్యతీర్ధమగు ఆ సమంతక పంచకములో స్నానము చేసితివి; ఆ తీర్థమును మరింత పవిత్రము కావించితివి. బ్రహ్మణులకు దానమొసగితివి. ఆ సమయమునకే అక్కడకు వచ్చియున్న కౌరవ పాండవులతోను, ఇతర మిత్రులతోను ఉల్లాసముగా గడిపితివి.
 
84-3
తవ ఖలు దయితాజనైస్సమేతా ద్రుపదసుతా త్వయి గాఢభక్తిభారా।
తదుదితభవదాహృతిప్రకారైరతిముముదే సమమన్యభామినీభిః॥
3వ భావము :-
ప్రభూ! కృష్ణా! పాండవుల పత్ని, ద్రౌపదికి నీయందు ప్రగాఢమగు భక్తి కలదు. ఆమె నీ పత్నులతో మాటలాడుచూ నీవు వారిని ఎట్లు పరిణయమాడితివో తెలపమని అడిగెను. వారు చెప్పిన వివరములను ఇతర స్త్రీలతో కలిసి శ్రద్ధగావిని మిక్కిలి ఆనందించెను.
 
84-4
తదను చ భగవన్ నిరీక్ష్య గోపానతికుతుకాదుపగమ్య మానయిత్వా।
చిరతరవిరహాతురాంగరేఖాః పశుపవధూస్సరసం త్వమన్వయాసీః॥
4 వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! సూర్యగ్రహణ స్నానాదులు ముగిసిన పిదప నీవు అచ్చటనేయున్న గోపికలను కలియుటకు వెళ్ళితివి. ఆ గోపికలు ఎంతోకాలముగా నిన్ను చూడక నీ ఎడబాటుతో చాలా కృశించి యుండిరి. నిన్ను చూడగానే వారు ఆనందముతో వచ్చి నీదరిచేరిరి.
 
84-5
సపది చ భవదీక్షణోత్సవేన ప్రముషితమానహృదాం నితంబినీనామ్।
అతిరసపరిముక్త కంచులీకే పరిచయహృద్యతరే కుచే న్యలైషీః॥
5వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! ఆ గోపికలకు నిన్ను చూడగానే నీ ఎడబాటువలన కలిగిన క్లేశమంతయూ మాయమయ్యెను. ఆనందముతో వారి హృదయములు ఉప్పొంగెను. పరవశముతో వారి శరీరములు గగుర్పాటుచెందెను; వారు బాహ్యస్మృతిని కోల్పోయి మానసికముగా నీ పరిష్వంగమును పొందిరి.
 
84-6
రిపుజనకలహైః పునః పునర్మే సముపగతైరియతీ విలంబనా౾భూత్।
ఇతి కృతపరిరంభణే త్వయి ద్రాగతివివశా ఖలు రాధికా నిలిల్యే॥
6 వ భావము :-
ప్రభూ! శ్రీకృష్ణా! నీవప్పుడు రాధతో ఇట్లంటివి. "తరుచూ శత్రువులతో ఏర్పడు కలహముల వలన నేను బృందావనమునకు వచ్చి మిమ్ము (నిన్ను) కలవలేకపోయితిని." నీ ఈ మాటలు విని రాధ ఆనందముతో పరవశించెను.
 
84-7
అపగతవిరహవ్యథాస్తదా తా రహసి విధాయ దదాథ తత్త్వబోధమ్।
పరమసుఖచిదాత్మకో౾హమాత్మేత్యుదయతు వఃస్ఫుటమేవ చేతసీతి॥
7వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! ఆ గోపికల విరహవేదనను చూచి, వారిని అనునయించుచూ వారికిట్లు తత్వభోధను చేసితివి. "పరమాత్మను, జ్ఞానానందబ్రహ్మ స్వరూపమును 'నేనే' అనునట్టి జ్ఞానభక్తిని మీరు సదా కలిగియుండుడు. అదియే నన్ను చేరు మార్గము", అని పలికితివి.
 
84-8
సుఖరసపరిమిశ్రితో వియోగః కిమపి పురాభవదుద్ధవోపదేశైః।
సమభవదముతః పరం తు తాసాం పరమసుఖైక్యమయూ భవద్విచింతా॥
8వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! 'ఉద్ధవుడు' ఒకప్పుడు ఆ గోపికలతో నీవు పరమాత్మస్వరూపుడవని చెప్పియుండెను. వారప్పుడు నీ ఎడబాటుతో ఉండుటచే ఉద్ధవుడు చెప్పిన పరమాత్మజ్ఞానమును పరిపూర్ణముగా తెలుసుకొనలేకపోయిరి. ఇప్పుడు నీవు స్వయముగా చెప్పగా 'భక్తుల చిత్తములలో ప్రకాశించు సచ్చిదానందస్వరూపమే నీవు!’ అన్న సత్యమును గ్రహించిరి; స్వాంతన పొందిరి.
 
84-9
మునివరవివహైస్తవాథ పిత్రా దురితశమాయ శుభాని పృచ్ఛ్యమానైః।
త్వయి పతి కిమిదం శుభాంతరైరిత్యురుహసితైరపి యాజితస్తదాసౌ॥
9వ భావము :-
సమంతక పంచకమునకు వచ్చిన మునిగణములను నీ తండ్రి వసుదేవుడు తన పాపములు శమించుటకు చేయదగు ధర్మకార్యములను చెప్పమని అడిగెను. ప్రభూ! కృష్ణా! నీవే స్వయముగా అతనికి కుమారుడై ఉండగా ఇంకనూ చేయవలసిన ధర్మకార్యమేముండుని వారు పలికి నవ్విరి. అయినను వసుదేవుని చేత వారచ్చట ఒక యజ్ఞము చేయించిరి.
 
84-10
సుమహతి యజనే వితాయమానే ప్రముదితమిత్రజనే సహైవ గోపాః।
యదుజనమహితాస్త్రిమాసమాత్రం భవదనుషంగరసం పురేవ భేజుః॥
10వ భావము :-
ప్రభూ! కృష్ణా! నీ తండ్రి వసుదేవుడు చేయుచున్న యజ్ఞమును చూచుటకు బంధువులు, మిత్రులు, ఇతర గోపజనులు అప్పుడు వచ్చిరి. వారిని యదువంశీయులు గౌరవించి ఆదరముతో చూచిరి. ఆ యజ్ఞకాలము మూడు మాసములు ఆ గోపజనులు, భగవాన్! నీ సన్నిధిలో పూర్వమువలె ఆనందముగా గడిపిరి.
 
84-11
వ్యపగమసమయే సమేత్య రాధాం దృఢముపగూహ్య నిరీక్ష్య వీతఖేదామ్।
ప్రముదితహృదయః పురం ప్రయాతః పవనపురేశ్వర।పాహి మాం గదేభ్యః॥
11వ భావము :-
ప్రభూ! శ్రీకృష్ణా! వసుదేవునిచే జరపబడిన యజ్ఞక్రతువు ముగిసినది. దానితో ఎవరి స్థానములకు వారు వెడలిపోవు సమయము ఆసన్నమయ్యెను. అప్పుడు నీవు 'రాధను' కలిసితివి. ఆమె నీ ఉపదేశముతో దుఃఖమునకు దూరమై ఆనందముగానుండుట నీవు చూచితివి; సంతోషముగా నీవు ద్వారకకు తిరిగి వెళ్ళితివి. అట్టి చిదానందస్వరూపా ! గురవాయూరు పురవాసా! రోగబారినుండి నన్ను కాపాడుము.

 
దశమ స్కంధము
84వ దశకము సమాప్తము
-x-