Jump to content

నారాయణీయము/దశమ స్కంధము/83వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

83- వ దశకము పౌండ్రకవధ-బలరామునిప్రతాపము


83-1
రామే౾థ గోకులగతే ప్రమదాప్రసక్తే
హూతానుపేతయమునాదమనే మదాంధే।
స్వైరం సమారమతి సేవకవాదమూఢో
దూతం న్యయుంక్త తవ పౌండ్రకవాసుదేవః॥
1వ భావము
ఒకనాడు బలరాముడు గోకులమునకు వెళ్ళెను. అచ్చట గోపకాంతలతో విహరించుచూ మద్యముసేవించెను. మద్యము మత్తులో యమునానదిని తాము జలక్రీడలాడుటకు తనవద్దకే రమ్మని పిలిచెను. యమున రాకపోవుటతో బలరాముడు కోపించి, ఆ యమునానదిని తనహలాయుధముతో పలుపాయలుగా చీల్చివేసి దండించెను. అదేసమయమున, కరూశ దేశాధిపతియగు 'పౌండ్రక వాసుదేవుడు' - తనసేవకుల పొగడ్తలతో మూఢుఢై, ప్రభూ! వాసుదేవా! నీ వద్దకు ఒకదూతను పంపెను.
 
83-2
నారాయణో౾హమవతీర్ణ ఇహాస్మి భూమౌ
ధత్సే కిల త్వమపి మామకలక్షణాని।
ఉత్సృజ్య తాని శరణం వ్రజ మామితి త్వాం
దూతో జగాద సకలైర్హసితస్సభాయామ్॥
2వ భావము
ఆ 'పౌండ్రక వాసుదేవుని' దూత ద్వారకాపురికి వచ్చి, ప్రభూ! వాసుదేవా! నీ సమక్షమున నిలచి తన రాజ సందేశమును ఇట్లు వినిపించెను. "నేను భూమిపై అవతరించిన నారాయణుడను. నీవు నాచిహ్నములను ధరించినట్లు వింటిని. తక్షణమే నీవు ఆగుర్తులను త్యజించి నన్ను శరణువేడుము. ఇది నాఆజ్ఞ." అని పలికెను. దూత అట్లు పలుకుచుండగా సభికులు పగలబడినవ్విరి; దూత తన రాజ్యమునకు తిరిగి వెడలెను.
 
83-3
దూత౾థ యాతవతి యాదవసైనికైస్త్వం
యాతో దదర్శిథ వపుః కిల పౌండ్రకీయమ్।
తాపేన వక్షసి కృతాంకమనల్పమూల్య-
శ్రీకౌస్తుభం మకరకుండలపీతచేలమ్॥
3వ భావము
ఆ దూత తిరిగి వెళ్ళగానే, నీవు నీ యాదవసైన్యముతో ఆ 'పౌండ్రక వాసుదేవుని' రాజ్యముపైకి దండెత్తి వెళ్ళితివి. అచ్చట ఆ కరూశాధిపతి, నీ శ్రీవత్సమును బోలిన మచ్చను తన వక్షస్థలమున కృత్రిమముగా ఏర్పరుచుకొని, నీవు ధరించు కౌస్తుభమణి వంటి విలువయిన మణిని తన కంఠమున ధరించి, చెవులకు మకరకుండలములు పెట్టుకొని, పట్టుపీతాంబరములు ధరించి, నీ వలె అలంకరించుకొని వచ్చి, ప్రభూ! వాసుదేవా నీతో తలపడెను.
 
83-4
కాలాయసం నిజసుదర్శనమస్యతో౾స్య
కాలానలోత్కరకిరేణ సుదర్శనేన।
శీర్షం చకర్తిథ మమర్దిథ చాస్య సేనాం
తన్మిత్ర కాశిపశిరో౾పి చకర్థ కాశ్యామ్॥
4వ భావము
పౌండ్రక వసుదేవుడు" తన నలుపు రంగు కలిగిన ఉక్కు చక్రమును నీపై విసిరెను. ప్రభూ! వాసుదేవా! అప్పుడు, ప్రళయకాలాగ్ని జ్వాలలు చిమ్ముచున్న నీ సుదర్శనచక్రమును అతనిపై ప్రయోగించితివి. ఆ చక్రముతో అతని శిరస్సును ఖండించితివి; అతని సైన్యమును నాశనము చేసితివి. అతని మిత్రుడగు కాశీరాజు శిరమును ఖండించగా అది ఎగిరి అతని కాశీనగరముననే పడెను.
 
83-5
జాడ్యేన బాలకగిరా ౾పి కిలాహమేవ
శ్రీవాసుదేవ ఇతి రూఢమతిశ్చిరం సః।
సాయుజ్యమేన భవదైక్యధియా గతో౾భూత్
కో నామ కస్య సుకృతం కథమిత్యవేయాత్॥
5వ భావము
బుద్ధిహీనులగు సహచరుల మాటలు నమ్మి, ఆ 'పౌండ్రక వాసుదేవుడు' తానే 'వాసుదేవుడనని' బలముగా నమ్ముచు, చాలాకాలముగా భావించుచుండెను. మూర్ఖుడే అయిననూ, ఆ పౌండ్రక వాసుదేవుడు, భగవాన్! నీవే తను అను భావము సదా కలిగియుండటచేత, నీచేతిలో వధించబడి నీ సాయజ్యముక్తిని పొందెనని తలచెదను. ఏ సుకృతములు, ఏ పుణ్యఫలముల నొసగునో ఎవరికెరుక!
 
83-6
కాశీశ్వరస్య తనయో౾థ సుదక్షిణాఖ్యః
శర్వం ప్రపూజ్య భవతే విహితాభిచారః।
కృత్యానలం కమపి బాణరణాతిభీతైః
భూతైః కథంచన నృతైస్సమమభ్యముంచత్॥
6వ భావము
కాశీరాజు కుమారుడగు 'సుదక్షణుడు' గొప్ప శివభక్తుడు. తండ్రి మరణించగా, నీకు హానికలిగించవలెనని 'అభిచార' హోమమును చేసెను. ఆ హోమగుండమునుండి అగ్నివంటి 'కృత్య' పుట్టెను. అప్పుడు ఆ 'సుదక్షిణుడు', బాణాసురునితో నీవు యుద్ధము చేసినప్పుడు నీకు భయపడి పారిపోయిన ప్రమధగణములను ప్రేరేపించి, ఆ 'కృత్యని' తోడుఇచ్చి - ప్రభూ! కృష్ణా! నిన్ను వధించమని ద్వారకకు పంపెను.
 
83-7
తాలప్రమాణచరణామఖిలం దహంతీం
కృత్యాం విలోక్య చకితైః కథితో౾పి పౌరైః।
ద్యూతోత్సవే కిమపి నో చలితో విభో।త్వం
పార్శ్వస్థమాశు విససర్జిథ కాలచక్రమ్॥
7వ భావము
తాటిచెట్టు ప్రమాణముగల కాళ్ళతో, సకలమును దగ్ధము చేయుచు, ఆ 'కృత్య' ద్వారకను ప్రవేశించెను. భయపడిన ఆ పురజనులు నీవద్దకు పరుగు పరుగున వచ్చి ఆ భయంకరరూపమును గురించిచెప్పిరి. ప్రభూ! కృష్ణా! నీ వప్పుడు పాచికలాటలో నిమగ్నుడవైయుంటివి. నీవచ్చటనుండి కదలకనే నీ 'కాలచక్రమును' ఆ 'కృత్యపై' ప్రయోగించితివి.
 
83-8
అభ్యాపతత్యమితధామ్ని భవన్మహాస్త్రే
హాహేతి విద్ర్రుతవతీ ఖలు ఘోరకృత్యా।
రోషాత్ సుదక్షిణమదక్షిణచేష్టితం తం
పుప్లోష చక్రమపి కాశిపురీమధాక్షీత్॥
8వ భావము
ఆ 'మహాచక్రాస్త్రము' అత్యంత ప్రకాశముతో వచ్చి ఆ 'కృత్య' శక్తిని పూర్తిగా నిరోధించెను. ప్రభూ! కృష్ణా! నీ 'చక్రము' వెంటాడి వచ్చుచుండగా, ఆ 'కృత్య' రోషముతో వెనుదిరిగెను; హాహాకారము చేయుచు కాశీనగరమును చేరి, అకృత్యమునకు పాల్పడిన ఆ సుదక్షిణుడునే అది భస్మముచేసెను. నీ సుదర్శన చక్రము ఆ కాశీనగరమును దహించెను.
 
83-9
స ఖలుద్వివిదో రక్షోఘాతే కృతోపకృతిః పురా
తవ తు కలయా మృత్యుం ప్రాప్తుం తదా ఖలతాం గతః।
నరకసచివో దేశక్లేశం సృజన్నగరాంతికే
ఝటితి హలినా యుధ్యన్నద్ధా పపాత తలాహతః॥
9వ భావము
'వివిదుడు' అను వానరుడు 'నరకాసురుని' మంత్రి. ప్రభూ! కృష్ణా! నీవు నరకాసురుని వధించిన తరువాత, ఈ 'వివిదుడు' నీ ద్వారకాపురిలో ప్రజలను హింసించి అశాంతి సృష్టించుచుండెను. ఇతడు రామావతారములో సుగ్రీవునికి మంత్రి; రాక్షస సంహారములో నీకు సహకరించెను. నీ చేతిలో వధించబడి ముక్తిని పొందవలెనను ఆశతో ఈదుశ్చర్యకు పాల్పడెను. బలరాముడు 'వివిదుడు'తో తలపడి తన పిడికిలితో కొట్టి అతనిని చంపివేసెను.
 
83-10
సాంబం కౌరవ్యపుత్రీహరణనియమితం సాంత్వనార్థీ కురూణాం
యాతస్తద్వాక్యరోషోద్ధృతకరినగరో మోచయామాస రామః।
తే ఘాత్యాః పాండవేయైరితి యదుపృతనాం నాముచస్త్వం తదానీం
తం త్వాం దుర్భోధలీలం పవనపురపతే। తపశాంత్యై నిషేవే॥
10వ భావము
ప్రభూ! కృష్ణా! నీ తనయుడూ జాంబవతీ పుత్రుడూ అగు 'సాంబుడు' కౌరవరాజు దుర్యోధనుని కుమార్తె యగు లక్షణను స్వయంవరం జరుగుచుండగా ఆమెను అపహరించెను. అప్పుడు కౌరవసైన్యము 'సాంబుడుని' బంధించెను. బలరాముడు వచ్చి సామరస్యముగా మాట్లాడుచుండగా కౌరవులు యాదవులను కించపరచుచు దుర్భాషలాడిరి. దానికి బలరాముడు కోపించి తన హలాయుధముతో హస్తినాపురమును పెళ్ళగించి గంగానదిలో వేయుటకు ఉపక్రమించెను. అప్పుడు వారు లక్షణ సాంబుల వివాహము జరిపించిరి. కురుక్షేత్రయుద్ధములో పాండవులచేతిలో కౌరవులు మరణించెదరని తెలిసియే నీవు యాదవ సైన్యమును ఆ యుద్ధమునకు పంపలేదు. భగవాన్! నీ లీలలను ఎరుగుట ఎవరి తరము? అట్టి గురవాయూరు పురాధీశా! తాపశాంతికి నిన్ను సేవించెదను.

 
దశమ స్కంధము
83వ దశకము సమాప్తము
-x-