నారాయణీయము/దశమ స్కంధము/81వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

81- వ దశకము - నరకాసురుని వధ


81-1
స్నిగ్ధాం ముగ్ధాం సతతమపి తాం లాలయన్ సత్యభామాం
యాతో భూయస్సహ ఖలు తయా యాజ్ఞసేనీవివాహమ్।
పార్ధప్రీత్యై పునరపి మనాగాస్థితో హస్తిపుర్యాం
శక్రప్రస్థం పురమపి విభో। సంవిధాయాగతో౾భూః
1వ భావము :-
భగవాన్! నీకు ప్రియమైనది, సౌందర్యవతి అగు సత్యభామ సన్నిధిలో ఆమెను మురిపించుచూ ఆనందముగా గడపుచుంటివి. ఒకనాడు ఆమెతో కలిసి నీవు ద్రౌపది పాండవుల వివాహమునకు వెళ్ళి, అర్జునుని కోరికమేరకు కొంతకాలము హస్తినాపురములో గడిపితివి; పాండవుల నివాసముకొరకు ఇంద్రప్రస్థపురమును నిర్మింపజేసి, విభో! నీ నగరమగు ద్వారకకు తిరిగి వచ్చితివి.
 
81-2
భద్రాం భద్రాం భవదవరజాం కౌరవేణార్థ్యమానాం
త్వద్వాచా తామహృతకుహనామస్కరీ శక్రసూనుః।
తత్ర క్రుద్ధం బలమనునయన్ ప్రత్యగాస్తేన సార్ధం
2వ భావము :-
భగవాన్! సుగుణములతో, శుభలక్షణములతో ఒప్పారు నీ సోదరి సుభద్రను, కౌరవ తనయుడగు దుర్యోధనుడు వివాహమాడదలచెను. అప్పుడు నీ మాటననుసరించి ఇంద్రకుమారుడగు అర్జునుడు కపటి సన్యాసి వేషముతో వచ్చి ఆమెను అపహరించుకొని పోయెను. అదితెలిసి బలరాముడు అర్జునునిపై కోపించెను. నీవు నీ అన్న బలరాముని అనునయుంచి సత్యభమతోను, బలరామునితోను కలిసి ఇంద్రప్రస్థమునకు వెళ్ళితివి.
 
81-3
తత్ర క్రీడన్నపి చ యమునాకూలదృష్టాం గృహీత్వా
తాం కాళిందీం నగరమగమః ఖాండవప్రీణితాగ్నిః।
భ్రాతృత్రస్తాం ప్రణయవివశాం దేవ। పైతృష్వసేయీం
రాజ్ఞాం మధ్యే సపది జహృషే మిత్రవిందామవంతీమ్॥
3వ భావము :-
భగవాన్! ఒకనాడు నీవు యమునానదీతీరమున విహరించుచూ 'కాళిందీ'నదీదేవతను చూచితివి. ఆమె విష్ణువును పతిగా పొందగోరి అచ్చట తపస్సు చేయుచుండెను. ఆమెను నీవు తీసుకొనివచ్చి భార్యగా స్వీకరించితివి. పిదప ఖాండవవనమును దహింపజేసి అగ్నిదేముడికి ప్రీతికలిగించితివి. ప్రభూ! నీమేనత్తకూతురు అవంతీ రాజకుమారి అయిన 'మిత్రవింద' నిన్ను తనమనసులో నిలుపుకొని ఆరాధించుచుండెను. ఆమె ఆ విషయమున తనసోదరునికి భయపడుచుండెను. ఆమెసోదరుడు ప్రకటించిన స్వయంవరమునకు నీవు వెళ్ళి ఆమెను తీసుకొనివచ్చి వివాహమాడితివి.
 
81-4
సత్వాం గత్వా పునరుదవహో నగ్నజిన్నందనాం తాం
బద్ధ్వాసపా౾పి చ వృషవరాన్ సప్తమూర్తిర్నిమేషాత్।
భద్రాం నామ ప్రదదురథ తే దేవ। సంతర్దనాద్యాః
తత్సోదర్యాం వరద। భవతస్సాపి పైతృష్వసేయీ॥
4వ భావము :-
ప్రభూ! నీవు మరియొక వివాహముకూడా చేసుకొంటివి. 'నగ్నజిత్తు' అను రాజువద్దగల బలిష్టమగు ఏడు వృషభములను ఒకే సమయమున ఏడు రూపములతో బంధించి ఆ రాజకుమార్తెయగు 'సత్య'ను పరిణయమాడితివి. నీ ఇంకొక మేనత్త కుమార్తెయగు 'భధ్ర'ను ఆమెసోదరులగు సంతర్ధనుడు మొదలగువారు నీకు ఇచ్చి వివాహము చేసిరి.
 
81-5
పార్థాద్యైరప్యకృతలవనం తోయమాత్రాభిలక్ష్యం
లక్షం ఛిత్త్వా శఫరమవృథా లక్ష్మణాం మద్రకన్యామ్।
అష్టావేవం తవ సమభవన్ వల్లభాస్తత్ర మధ్యే
శుశ్రోథ త్వం సురపతిగిరా భౌమదుశ్చేష్టితాని॥
5వ భావము :-
ప్రభూ! అర్జునుడువంటి వీరులకు కూడా ఛేదించుటకు శక్యముగాని, జలమునందుమాత్రమే లక్ష్యము కనిపించు మత్స్యయంత్రమును ఛేదించి మద్రరాజపుత్రికయగు 'లక్ష్మణ'ను వివాహమాడితివి. ఆమెతో కలిపి నీకు ఎనిమిదిమంది భార్యలు అయిరి. దేవేంద్రుడు చెప్పగా నీవు భౌమాసురుడైన నరకాసురుని దుశ్చర్యలను విని, అతనిని సంహరించుటకు నిశ్చయించుకొంటివి.
 
81-6
స్మృతాయాతం పక్షిప్రవరమధిరూఢస్త్వమగమో
వహన్నంకే భామాముపవనమివారాతినగరమ్ ।
విభిందన్ దుర్గాణి తృటితపృతనాశోణితరసైః
పురం తావత్ ప్రాగ్జ్యోతిషమకురుథాశ్శోణితపురమ్॥
6వ భావము :-
భగవాన్! స్మరించినంతనే వచ్చిన గరుత్మంతుని సత్యభామతో కలిసి అధిరోహించితివి. ఆమెతో కలిసి విహారమునకు ఉద్యానవనమునకు వెళ్ళుచున్నట్లు ఆ నరకాసురుని ప్రాగ్జోతిషపురమునకు వెళ్ళితివి; వాని దుర్గములను ఛేదించి శత్రుమూకలను తెగటార్చితివి. వారి రక్త ధారలతో రక్తముపారుటతో శ్రోణితనగరమా అనునట్లు ఆ ప్రాగ్జోతిషపురమును మార్చివేసితివి.
 
81-7
మురస్త్వాం పంచాస్యో జలధివనమధ్యాదుదపతత్
స చక్రే చక్రేణ ప్రదళితశిరా మంక్షు భవతా।
చతుర్ధంతైర్ధంతావలపతిభిరింధానసమరం
రథాంగేన ఛిత్త్వా నరకమకరోస్తీర్ణనరకమ్॥
7వ భావము :-
భగవాన్! అప్పుడు నరకాసురుని అనుచరుడు, ఐదు తలలు గల వాడు, నీటిలో నివసించువాడు అగు 'మురుడు' అను రాక్షసుడు వేగముగా వచ్చి నిన్ను ఎదుర్కొనెను. నీవు నీ చక్రాయుధముతో ఆ రాక్షసుని శిరస్సులను ఒక్కసారిగా ఖండించితివి. పిదప, నరకాసురుడు నాలుగు దంతములుగల గజసేనతో నీతో ఘోరముగా యుద్ధముచేసెను. ప్రభూ! నీవు చక్రముతో ఆ నరకాసురుని వధించి అతనికి నరకము దాటించి ముక్తికలిగించితివి.
 
81-8
స్తుతో భూమ్యా రాజ్యం సపది భగదత్తే౾స్య తనయే
గజం చైకం దత్వా ప్రజిఘయిథ నాగాన్నిజపురీమ్।
ఖలేనాబద్ధానాం స్వగతమనసాం షోడశపునః
సహస్రాణి స్త్రీణామపి చ ధనరాశిం చ విపులమ్॥
8వ భావము :-
భగవాన్! కృష్ణా! భూమికి భారమయిన నరకాసురుని నీవట్లు వధించగా, అతని తల్లి భూదేవి నిన్ను స్తుతించెను. నీవు నరకాసురుని కుమారుడగు 'భగదత్తుని' ఆ రాజ్యమునకు రాజును చేసితివి. అతనికి ఒక్క గజమును మాత్రము ఇచ్చి మిగిలిన గజసంపదను ఆ నరకాసురుని అపార ధనరాశిని ద్వారకకు తరలించితివి. నరకాసురుడు పదహారువేలమంది స్త్రీలను చెరబట్టియుండెను. వారిని విడిపించి, నీ పాదపద్మములయందు హృదయము నిలుపుకొనిఉన్న వారిని నీ నగరమునకు పంపితివి.
 
81-9
భౌమాసాహృతకుండలం తదదితేర్ధాతుం ప్రయాతో దినం
శక్రాద్యైర్మహితః సమం దయితయా ద్యుస్త్రీషు దత్తహ్రియా।
హృత్వా కల్పతరుం రుషాభిపతితం జిత్వేంద్రమభ్యాగమః
తత్తు శ్రీమదదోష ఈదృశ ఇతి వ్యాఖ్యాతుమేవాకృథాః॥
9వ భావము :-
ప్రభూ! కృష్ణా! నరకాసురుడిచే అపహరింపబడిన కుండలములను 'అదితి'కి ఇచ్చుటకు నీవు దేవలోకమునకు వెళ్ళితివి. ఇంద్రాదిదేవతలు మిమ్ము ఆదరించిరి. దేవలోక స్త్రీలు సత్యభామ సౌందర్యమును చూచి కించపడిరి. సత్యభామ కోరగా నీవు పారిజాతవృక్షమును గ్రహించితివి. అదిచూచి దేవేంద్రుడు ఆగ్రహముతో నిన్ను ఎదుర్కొనెను. ఆ యుద్ధమున నీవు ఇంద్రుని నిర్జించి పారిజాతవృక్షముతో నీ నగరమునకు వచ్చితివి. ఇంద్రునికి తన పదవివలన, ఐశ్వర్యమువలన కలిగిన అహంకార దోషముచేతనే ఓటమి కలిగెనను సత్యము అతనికి తెలియజేయుటకే భగవాన్! ఈ విధముగా చేసితివి.
 
81-10
కల్పద్రుం సత్యభామాభవనభువి సృజన్ ద్వ్యష్టసాహస్రయోషాః
స్వీకృత్య ప్రత్యగారం విహిత బహువపుర్లాలయన్ కేళిభేదైః।
ఆశ్చర్యాన్నారదాలోకితవివిధగతిస్తత్ర తత్రాపి గేహే
భూయస్సర్వాసు కుర్వన్ దశ దశ తనయాన్ పాహి వాతాలయేశ॥
10వ భావము :-
భగవాన్! కృష్ణా! దేవలోకమునుండి తెచ్చిన కల్పవృక్షమును సత్యభామ భవన ప్రాంగణమున నాటించితివి. అనంతరము నరకుని చెరనుంచి విడిపించి తెచ్చిన పదహారువేలమంది యువతులను నీవు పరిణయమాడితివి; పదహారువేలరూపములతో వారి ప్రతిగృహమున ఆనందముగా గడిపితివి. వారొక్కక్కరికి పదిమంది పుత్రులను ప్రసాదించి అనుగ్రహించితివి. నీ చర్యలతో నారదమునికి ఆశ్చర్యము కలిగించితివి. శ్రీకృష్ణుని రూపమున ధర్మరక్షకుడవై వెలసిన గురవాయూరు పురాధీశా! ఈ రోగబారినుండి నన్ను రక్షింపుము.

 
దశమ స్కంధము
81వ దశకము సమాప్తము
-x-