నారాయణీయము/దశమ స్కంధము/63వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

63వ దశకము - గోవర్ధనోద్ధరణము


63-1
దదృశిరే కిల తత్క్షణమక్షతస్తనితస్తనితజృంభితకంపితదిక్తటాః।
సుషమయా భవదంగతులాం గతా వ్రజపదోపరి వారిధరాస్త్వయా॥
1వ భావము. :-
దేవేంద్రుడు బృందావనవాసులపై ఆగ్రహించెను; తోడనే (ఆ బృందావన ఆకాశము మేఘావృతమై) దిక్కులను పిక్కటిల్లజేయుచూ ఉరుములు నిరంతరముగా శబ్దించసాగెను. ప్రభూ! కృష్ణా! నీ శరీరకాంతినిబోలిన - దట్టముగా పరచుకొనిన - నీటిమేఘములే ఆ ఉరుములకు కారణము.

63-2
విపులకరకమిశ్రైస్తోయధారానిపాతైః
దిశిదిశి పశుపానాం మండలే దండ్యమానే।
కుపితహరికృతాన్నః పాహి పాహీతి తేషాం
వచనమజిత।శృణ్వన్ మా బిభీతేత్యభాణీః॥
2వ భావము. :-
ఇంద్రుని ఆగ్రహముతో, ఆ వ్రజముపై - వడగళ్ళవాన ధారాపాతముగా కురియసాగెను; శిలలవలెనున్న పెద్ద పెద్ద వడగళ్ళు పడి ఆ ప్రజలను బాధించసాగెను. వారప్పుడు భయముతో, "కృష్ణా! మమ్ము రక్షింపుము! రక్షింపుము!" అని ఆక్రందనలు చేయసాగిరి; అజితా! -వారి ఆక్రందనలను విని - "భయపడవలదు" - అని వారితో పలికి - వారికి అభయమొసంగితివి.
 
63-3
కుల ఇహ ఖలు గోత్రో దైవతం గోత్రశత్రోః
విహతిమిహ స రుంధ్యాత్ కో ను వః సంశయో౾స్మిన్।
ఇతి సహసితవాదీ దేవ।గోవర్ధనాద్రిం
త్వరితముదముమూలో మూలతో బాలదోర్భ్యామ్॥
3వ భావము. :-
వారితో ఇంకనూ ఇట్లంటివి. "ఈ గోవర్ధనపర్వతము మన గోకులమునకు దైవము! ఇతడు పర్వత విరోధియగు ఇంద్రుని దురాగాతమును అడ్డగించి మనలను రక్షించును; మీరు సంశయించవలదు;" అని పలుకుచూ! ప్రభూ! బాలకృష్ణా! వారు చూచుచుండగనే నీ రెండుహస్తములతో ఆ గోవర్ధనగిరిని బలముగా పెళ్ళగించితివి.
 
63-4
తదను గిరివరస్య ప్రోద్ధృతస్యాస్య తావత్
సికతిలమృదుదేశే దూరతో వారితాపే।
పరికరపరిమిశ్రాన్ ధేనుగోపానధస్తాత్
ఉపనిదధదధత్థా హస్తపద్మేన శైలమ్॥
4వ భావము. :-
భగవాన్! ఆ గోవర్ధనగిరిని మూలములతో అట్లు పెళ్ళగించి నీ (ఎడమ) హస్తపద్మముపై నిలిపితివి. ఆ పర్వతము క్రింది ప్రదేశము మెత్తని ఇసుకతో నిండియున్నది. ఇసుకతో - వర్షపునీరు ఆ ప్రదేశమునకు ప్రవహించకుండునట్లు నిలువరించితివి. అంతట గోపాలురు - వారి గృహోపకరణములతో; వారి వారి గోవులతో ఆ పర్వత క్రిందిప్రదేశమునకు వచ్చి చేరిరి.
 
63-5
భవతి విధృతశైలే బాలికాభిర్వయస్యైః
అపి విహితవిలాసం కేళిలాపాదిలోలే।
సవిధమిలితధేనూరేకహస్తేన కండూ
యతి సతి పశుపాలాస్తోషమైషంత సర్వే॥
5వ భావము. :-
భగవాన్! నీవు ఒక హస్తముతో పర్వతమును ఎత్తిపట్టుకొని మరియొక హస్తముతో నీ దరిచేరుచున్న గోవులను (ప్రేమతో) నిమురుచుంటివి; గోపబాలికలతోను, నీ సహచర మిత్రులతోను సరస-సంభాషణలు చేయుచు వారిని అలరించుచుంటివి. వారు - నీరక్షణకును, ఆదరణకు మిక్కిలి సంతసించుచుండిరి.
 
63-6
అతిమహాన్ గిరిరేష తు వామకే కరసరోరుహి తం ధరతే చిరమ్।
కిమిదమద్భుతమద్రిబలం న్వితి త్వదవలోకిభిరాకథి గోపకైః॥
6వ భావము. :-
"ఈ బాలుడు ఇంత అతి పెద్ద పర్వతమును - తన తామరతూడువంటి సుతిమెత్తని హస్తముతో ఎట్లు ఎత్తి పట్టి నిలపగలిగెను? (లేక) ఈ పర్వతమే తన శక్తిచేతనో లేదా మరియే మహత్తుచేతనో ఇట్లు లేచి నిలచియున్నదా?" అని, ఇది గమనించుచున్న - ఆ గోపాలురు వారిలో వారే మాట్లాడుకొనసాగిరి.
 
63-7
అహాహా దార్ఘ్యమముష్య వటోర్గిరిం వ్యథితబాహురసావవరోపయేత్।
ఇతి హరిస్త్వయి బద్ధవిగర్హణో దివససప్తకముగ్రమవర్షయత్॥
7 వ భావము. :-
"ఆహా! ఏమి? ఈ బాలుని సాహసము? చేతికినొప్పి కలిగినచో ఇతనే కొద్దిసమయములోనే ఈ పర్వతమును వదిలివేయును," అని ఇంద్రుడు ప్రభూ! నీగురించి తలచెను; నిన్ను అలక్ష్యముచేయుచు ఏడుదినములు ఏకధాటిగా కుంభవృష్టిని కురిపించెను.

63-8
అచలతి త్వయి దేవ।పదాత్పదం గలితసర్వజలే చ ఘనోత్కరే।
అపహృతే మరుతా మరుతాంపతిస్త్వదభిశంకితధీః సముపాద్రవత్॥
8వ భావము. :-
నీవు ఆవిధముగ- నీ (ఎడమ) అరచేతిపై గోవర్ధనగిరిని ధరించి - ఒక అడుగయినను కదపకుండా - అట్లే నిలచియుంటివి. అప్పుడు ప్రభూ! ఎడతెగక కురియుటతో - మేఘములలోని నీరు ఇంకిపోయెను; గాలులు వీచుటచే - మబ్బులు మాయమయ్యెను. ఇదిచూచి - దేవతలకు అధిపతియగు ఇంద్రుడు (గర్వమణగినవాడై) తన శక్తిని తానే శంకించుచు అచ్చటనుండి వెడలిపోయెను.
 
63-9
శమముపేయుషి వర్షభరే తదా పశుపధేనుకులే చ వినిర్గతే।
భువి విభో।సముపాహితభూధరః ప్రముదితైః పశుపైః పరిరేభిషే॥
9వ భావము. :-
భగవాన్! కుంభవృష్టి వర్షము ఆగిపోవుటతో గోవులు - గోపాలురు ఆ పర్వతము క్రిందనుండి బయటకు వచ్చిరి. అనంతరము నీవా గోవర్ధన పర్వతమును భూమిపై నిలిపితివి. అదిచూచిన గోపాలురు నిన్ను అత్యంత ఆనందముతో ఆలింగనము చేసుకొనిరి.
 
63-10
ధరణిమేవ పురా ధృతవానసి క్షితిధరోద్ధరణే తవ కః శ్రమః।
ఇతి నుతస్త్రిదశైః కమలాపతే।గురుపురాలయ।పాలయ మాం గదాత్॥
10వ భావము. :-
కమలాపతీ! "చాలాకాలము క్రితమే - వరాహావతారమున భూమండలమునంతటనూ ఎత్తిన నీకు - ఈ పర్వతమును ఎత్తట ఒకలెక్కలోనిది కాదుకదా!" అని దేవతలు, నిన్ను ప్రశంసించిరి. అట్టి మహత్యము కలిగిన ఓ! గురవాయూరు పురాధీశా! నా రుగ్మతలను హరించుము అని నిన్ను నేను ప్రార్ధించుచున్నాను.
 
దశమ స్కంధము
63వ దశకము సమాప్తము.
-x-