నారాయణీయము/దశమ స్కంధము/64వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
64వ దశకము - గోవిందాభిషేకము- గోపాలకుల పరమ పద దర్సనము
64-1
ఆలోక్య శైలోద్దరణాదిరూపం ప్రభావముచ్చైస్తవ గోపలోకాః।
విశ్వేశ్వరం త్వామభిమత్య విశ్వే నందం భవజ్జాతకమన్వపృచ్ఛన్॥
1వ భావము, :-
భగవాన్! నీవట్లు గోవర్ధనపర్వతమును ఎత్తుటను మరియు ఇంతకుమునుపు నీవలన జరిగిన మహత్యములను చూచియుండిన గోపాలురు - నీవు విశ్వనాథుడగు శ్రీవిష్ణువు అవతారమే అయి ఉండవచ్చునని భావించసాగిరి. ఈ విషయమును నిర్ధారించుకొనవలెనని - వారందరూ నీ తండ్రియగు నందగోపుని చెంతకు యేగి - నీ జాతకవిషయమును ప్రస్తావించిరి.
64-2
గర్గోదితో నిర్గదితో నిజాయ వర్గాయ తాతేన తవ ప్రభావః।
పూర్వాధికస్త్వయ్యనురాగ ఏషామైధిష్ట తావద్ బహుమానభారః॥
2వ భావము, :-
భగవాన్! అప్పుడు నందగోపాలుడు - తాను గర్గమునిని నీగురించి అడుగుట; ఆ మునీశ్వరుడు నీ జాతకమును చూచుట; నీవు మహిమాన్విత శక్తిసంపన్నుడవని ఆముని తెలుపుట మొదలగు విషయములను - ఆ గోపాలురకు తెలిపెను. అది వినిన ఆ గోకులవాసులు, ప్రభూ! నిన్ను మునుపటికంటెను అధికముగా అభిమానించి గౌరవించసాగిరి.
64-3
తతో౾వమానోదితతత్త్వబోధః సురాధిరాజః సహదివ్యగవ్యా।
ఉపేత్య తుష్టావ స నష్టగర్వః స్పృష్ట్వాపదాబ్జం మణిమౌళినా తే॥
3వ భావము, :-
భగవాన్! గోవర్ధనోద్ధరణము జరిగిన పిమ్మట - దేవతలకు రాజగు దేవేంద్రుడు- వాస్తవమెరిగి, గర్వము నశించినవాడై- తత్వజ్ఞానమును పొందెను. నీ ప్రసన్నతనుకోరి - తన వద్దగల (సురభి) కామధేనువును తీసుకొని నీ వద్దకు వచ్చెను; తన మణిమయకిరీటమును నీ పాదపద్మములచెంత ఉంచి - ప్రభూ! నీకు నమస్కరించి నిన్ను ప్రశంసించెను.
64-4
స్నేహస్నుతైస్త్వాం సురభిః పయోభిర్గోవిందనామాంకితమభ్యషించత్।
ఐరావతోపాహృతదివ్యగంగాపాథోభిరంద్రో౾పి చ జాతహర్షః॥
4వ భావము, :-
భగవాన్! అప్పుడు దేవేంద్రుడు నిన్ను "గోవిందా" (గోవులను పాలించువాడా!) అని స్తుతించెను. కామధేనువగు - 'సురభి ' పాలతో నిన్ను అభిషేకించెను. తన వాహనము - గజరాజు అగు 'ఐరావతమ' తెచ్చి ఇచ్చిన గంగాజలముతో - ఆ దేవరాజు నీకు అభిషేకము చేసెను.
64-5
జగత్రయేశేత్వయి గోకులేశే తథాభిషిక్తే సతి గోపవాటః।
నాకే౾పి వైకుంఠపదే ౾ప్యలభ్యామ్ శ్రియం ప్రపేదే భవతః ప్రభావాత్॥
5 వ భావము, :-
భగవాన్! దేవేంద్రుడు నిన్ను అట్లు గోవిందనామముతో కీర్తించి అభిషేకించగా - నీ ప్రభావముతో ఆ గోపాలురు నివసించుచున్న ఆ వ్రజము - దేవలోకము మరియు వైకుంఠములలో గొప్ప గౌరవమును, ఖ్యాతిని పొందెను.
64-6
కదాచింతర్యమునం ప్రభాతే స్నాయన్ పితా వారుణ పూరుషేణ।
నీతస్తమానేతుమగాః పురీం త్వం తాం వారుణీం కారణమర్త్యరూపః॥
6వ భావము, :-
ఒకానొక దినమున వేకువజామునకు ముందుగనే నీ తండ్రియగు నందగోపుడు - నదీజలములలో స్నానము చేయుటకు వెళ్ళగా - వరుణదేముని సేవకుడొకడు అతనిని బంధించి వరుణలోకమునకు తీసుకొనిపోయెను. కారణాంతరమున మానవజన్ననెత్తిన ఓ! భగవాన్! నీవు అప్పుడు నీ తండ్రిని రక్షించుటకొఱకు వరుణ లోకమునకు వెళ్ళితివి.
64-7
ససంభ్రమం తేన జలాధిపేన ప్రపూజితస్త్వం ప్రతిగృహ్య తాతమ్।
ఉపగతస్తతక్షణమాత్మ గేహం పితాః వదత్ తచ్చరితం నిజేభ్యః
7వ భావము, :-
భగవాన్! నిన్నుచూచిన వరుణదేముడు సంభ్రమాశ్చర్యములకు లోనయ్యెను; అత్యంత ఆదరముతో నిన్ను పూజించెను. అంతట నీవు నీతండ్రిని తోడ్కొని నీగృహమునకు చేరితివి. జరిగిన వృత్తాంతమంతటనూ నందుడు ఆ వ్రజవాసులకు తెలిపెను.
64-8
హరిం వినిశ్చిత్య భవంతమేతాన్ భవత్పదాలోకనబధ్దతృష్ణాన్।
నిరీక్ష్య విష్ణో।పరమం పదం తద్ దురాపమన్యైస్త్వమదీదృశస్తాన్॥
8వ భావము, :-
భగవాన్! నందుని ద్వారా జరిగిన వృత్తాంతము తెలుసుకొనిన ఆ వ్రజవాసులు - నీవు "శ్రీహరివియే" అని నిర్ధారించుకొనిరి. దానితో వారికి నీ నిజస్వరూపమును దర్శించవలెననెడి కోరిక గలిగెను. ఇది గమనించిన ప్రభూ! విష్ణుమూర్తీ! (భౌతిక జగత్తులో) బద్ధజీవులు చూచుటకు అనితరసాధ్యమయున నీ బ్రహ్మాత్మకరూపమును ఆ బృందావనవాసులకు సాక్షాత్కరింపజేసితివి.
64-9
స్ఫురత్పరానందరసప్రవాహప్రపూర్ణకైవల్యమహాపయోధౌ।
చిరం నిమగ్నాః ఖలు గోపసంఘస్త్వయైవ భూమన్।పునరుద్దృతాస్తే॥
9వ భావము, :-
ప్రభూ! అదిచూచిన బృందావనవాసులు పరమానందస్థితి అను రసప్రవాహములో ఓలలాడి మోక్షము అను సముద్రమును చేరి - చాలాసమయము అచ్చటనే నిలిచిపోయిరి. శ్రీహరీ! ఆ వ్రజవాసులను నీవే తిరిగి భౌతికజగత్తునకు తీసుకొనివచ్చితివి
64-10
కరబదరవదేవం దేవ కుత్రావతారే
పరమపదమనవాప్యం దర్శితం భక్తిభాజామ్।
తదిహ పశుపరూపీ త్వం హి సాక్షాత్ పరాత్మా।
పవనపురనివాసిన్ పాహి మామామయేభ్యః॥
10వ భావము, :-
భగవాన్! శ్రీకృష్ణా! ఇతర అవతారములలో భక్తులకు దుర్లభమగు పరమపదమును - నీవీ అవతారములో - నీ భక్తజనులకు అరచేతిలో నిలిచిన రేగిపండుచందముగా సాక్షాత్కరింపజేసితివి. గోపబాలకుని రూపము ధరించిన పరమాత్మా! శ్రీహరీ! నీదయవలననే వారు బ్రహ్మలోకమును దర్శించగలిగిరి. అట్టి గురవాయూరు పురాధీశా! నావ్యాధులనుండి నన్ను రక్షింపుము.
దశమ స్కంధము
64వ దశకము సమాప్తము.
-x-