నారాయణీయము/దశమ స్కంధము/62వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

62వ దశకము - ఇంద్రయాగనివారణము


62-1
కదాచిద్గోపాలాన్ విహితమఖ సంభారవిభవాన్
నిరీక్ష్య త్వం శౌరే। మఘవమదముద్ద్వంసితుమనాః।
విజానన్నప్యేతాన్ వినయమృదు నందాదిపశుపాన్
అపృచ్ఛః కో వాయం జనక।భవతాముద్యమ ఇతి॥
1వ భావము. :-
శౌరీ! ఒకసమయమున - గోపాలకులు - యజ్ఞసంభారములను సమకూర్చుకొని యజ్ఞము చేయుటకు సన్నాహములు చేసుకొను చుండిరి. వారు దేవేంద్రుని కొరకు ఆ యజ్ఞప్రయత్నములు చేయుచున్నారని ఎరిగియూ - వాని (దేవేంద్రుని) మదమణచివేయవలెననెడి తలంపుతో - ప్రభూ! ఏమీ తెలియనివానివలె - నీవు నందునిని, ఆ గోపాలురను "ఈ సన్నాహములు దేనికొఱకు?" అని వినయముగా ప్రశ్నించితివి.

62-2
బభాషే నందస్త్వాం సుత। నను విధేయో మఘవతో
మఖో వర్షే వర్షే సుఖయతి స వర్షేణ పృథివీమ్।
నృణాం వర్షాయత్తం నిఖిలముపజీవ్యం మహితలే
విశేషాదస్మాకం తృణసలిలజీవ్యా హి పశవః॥
2వ భావము. :-
భగవాన్! అప్పుడు నందుడు నీతో ఇట్లనెను. " పుత్రా! ప్రతివర్షము మనము ఇంద్రని కొఱకు యాగము చేయవలెను. (అందుకు ప్రతిగా) ఇంద్రుడు జీవుల - ప్రాణాధారమగు వర్షమును ప్రసాదించి - భూమిపై జీవించు జీవుల జీవనమును సుఖమయము చేయును. గడ్డి, నీరు ఆధారమగా చేసుకొని జీవించు పశువులపై ఆధారపడి మనము జీవించుచున్నాము. అందులకే మనము - విశేషించి ఇంద్రుని (ప్రీతి) కొఱకు యాగము చేయుట - అతనిని ఆరాధించుట అవసరము."

62-3
ఇతి శ్రుత్వావాచం పితురయి భవానాహ సరసం
ధిగేతన్నో సత్యం మఘవజనితా వృష్టిరితి యత్।
అదృష్టం జీవానాం సృజతి ఖలు వృష్టిం సముచితాం
మహారణ్యే వృక్షాః కిమివ బలిమింద్రాయ దదతే॥
3వ భావము. :-
ప్రభూ! ఆ నందుని మాటలను విని - నీవు మధురముగా - వివేకవంతముగా ఇట్లంటివి. "వర్షము ఇంద్రుని వలన కురుయుచున్నది అనునది నిజమే అయినచో - కనిపించని కర్మఫలితమును - ఇంద్రునికి ఆపాదించినట్లు అగును. ఇది సత్యమే అయినచో - మహారణ్యములోని వృక్షములు ఇంద్రనికి ఏమి క్రతువులు చేయుచున్నవి? అయిననూ అచ్చట వర్షము కురుయుచున్నది కదా!" అని పలికితివి.
 
62-4
ఇదం తావత్ సత్యం యదిహ పశవో నః కులధనం
తదాజీవ్యాయాసౌ బ లిరచలభర్త్రే సముచితః।
సురేభ్యో౾ప్యుత్కృష్టా నను ధరణిదేవాః క్షితితలే
తతస్తే౾ప్యారాధ్యా ఇతి జగదిథ త్వం నిజజాన్॥
4వ భావము. :-
ప్రభూ! వారితో ఇంకనూ నీవిట్లంటివి. "పశుసంపద మన ధనము అనునది పరమ సత్యము. మన పశువుల మేతకు - గడ్డిని, త్రాగుటకు నీరును - ఇచ్చుచున్న 'గోవర్ధనగిరి' పర్వతమును ఆరాధించుట - ఇంద్రుని కొఱకు యాగము చేయుటకంటెను సముచితమయినది; భూమి పై వేద ధర్మములను పాటించు విప్రులను పూజించుట ఇంద్రయాగముకంటెను ఉత్తమము" అని పలికితివి.
 
62-5
భవద్వాచం శ్రుత్వా బహుమతియుతాసే ౾పి పశుపాః।
ద్విజేంద్రానర్చంతో బలిమదదురుచ్చైః క్షితిభృతే।
వ్యధుః ప్రాదక్షిణ్యం సుభృశమనమన్నాదరయుతాః
త్వమాదః శైలాత్మా బలిమఖిలమాభీరపురతః॥
5వ భావము. :-
ప్రభూ! నీవాక్కులను ఆలకించిన ఆ గోపాలురు (యజ్ఞ ప్రయత్నములను ఆపివేసి) ముందుగా విప్రులను పూజించిరి. పిదప, గోవర్ధన పర్వతమును పూజించిరి; నైవేద్యములను సమర్పించిరి; ప్రదక్షిణలు చేసిరి. ఆ గోవర్ధన పర్వతరూపములో భగవాన్! నీవే ఆ నైవేద్యములను స్వీకరించితివి.
 
62-6
అవోచశ్చైవం తాన్ కిమిహ వితథం మే నిగదితం
గిరీంద్రో నన్వేష స్వబలిముపభుంక్తే స్వవపుషా।
అయం గోత్రో గోత్రద్విషి చ కుపితే రక్షితుమలం
సమస్తానిత్యుక్తా జహృషురఖిలా గోకులజుషః॥
6వ భావము. :-
భగవాన్! అనంతరము - నీవు ఆ గోకులవాసులతో ఇట్లంటివి. "నా పలుకులలో అసత్యమేమి - యున్నది!? (మీరు చూచితిరి కదా!) ఈ పర్వతము మీరు తనకు సమర్పించిన బలులను స్వయముగా భక్షించెను. ఈ పర్వతమునకు - పర్వతవిరోధియగు దేవేంద్రుడు మనపై ఆగ్రహించి వచ్చిననూ మననందరినీ రక్షించు సామర్ధ్యము కలదు". అని పలికి ఆ బృందావన ప్రజలను ఆనందంపజేసితివి.
 
62-7
పరిప్రీతా యాతాః ఖలు భవదుపేతా వ్రజజుషో
వ్రజం యావత్ తావన్నిజమఖవిభంగం నిశమయన్।
భవంతం జానన్నప్యధికరజసాక్రాంతహృదయో
న సేహే దేవేంద్రస్త్వదుపరచితాత్మోన్నతిరపి॥
7వ భావము. :-
భగవాన్! వ్రజవాసులగు ఆ వ్రజ - ప్రజలు నిన్ను అనుసరించి (సాయంసమయమునకు) ఆ వ్రజమును చేరిరి. ఆ విధముగా యాగము ఆగిపోవుటతో - ఇంద్రుడు కుపితుడయ్యెను. ఆగి పోవుటకు కారణము నీవు అని తెలుసుకొని - నీగురించి తెలిసియూ - రజోగుణ ప్రభావితముగు హృదయముతో ఇంద్రుడు సహనము కోల్పోయెను; ఆగ్రహావేశుడయ్యెను.
 
62-8
మనుష్యత్వం యాతో మధుభిదపి దేవేష్వవినయం
విధత్తే చేన్నష్టస్త్రిదశసదసాం కో౾పి మహిమా।
తతశ్చ ధ్వంసిష్యే పశుపహతకస్య శ్రియమితి
ప్రవృత్తస్త్వాం జేతుం స కిల మఘవా దుర్మదనిధిః॥
8వ భావము. :-
"మధుదైత్య సంహారి, దైవము అగు శ్రీమహావిష్ణువు - మానవరూపముతో - దేవతలయెడ అవినయము చూపెను. వారి మహత్యమును కించపరచెను. ఈ గోపాలుర - పశుసంపదనంతనూ నేను నాశనము చేసెదను" అని ఇంద్రుడు తలచెను; ఆగ్రహముతో - దురహంకారియై , భగవాన్! నిన్ను జయించుటకు నిశ్చయించుకొనెను.
 
62-9
త్వదావాసం హంతుం ప్రళయ జలదానంబరభువి
ప్రహిణ్వన్ బిభ్రాణః కులిశమయమభ్రేభగమనః।
ప్రతస్థే౾న్యైరంతర్దహనమరుదాద్యైర్విహసితో
భవన్మాయా నైవ త్రిభువనపతే।మోహయతి కమ్॥
9వ భావము. :-
భగవాన్! బృందావనములోని - మీ నివాసములను ధ్వంసముచేయనెంచి, ఇంద్రుడు - ప్రళయకాల మేఘములను ప్రేరేపించెను; ఐరావతమును అధిరోహించి, వజ్రాయుధమును చేతబట్టి - అగ్ని, వాయువు మొదలగు దేవతలు వెంటరాగా, భూతలమునకు రా సాగెను. ప్రభూ! త్రిలోకాధిపతివగు నీ మాయలకు లోబడనివారు ఎవరుందురు!? ఇది చూచి - నిన్నెరిగిన ఇతర దేవతలు ఇంద్రుని మూర్ఖత్వమునకు నవ్వుకొనిరి.
 
62-10
సురేంద్రః క్రుద్ధశ్చేద్ ద్విజ కరుణయా శైలకృపయా-
ప్యనాతంకో౾స్మాకం నియత ఇతి విశ్వాస్య పశుపాన్।
అహో కిం నాయాతో గిరిభిదితి సంచింత్య నివసన్
మరుత్ గేహాధీశ। ప్రణుద మురవైరిన్।మమ గదాన్॥
10వ భావము. :-
భగవాన్! "దేవేంద్రుడు మనపై ఆగ్రహించిననూ - బ్రాహ్మణుల దయచేతను మరియు ఆ గోవర్ధన పర్వతము దయచేతను - నిశ్చయముగా మనకు భయము ఉండదు" అని పలికి (భీతావహులగు) ఆ గోపాలురను నమ్మించితివి. ఇంద్రుడు ఇంకనూ రాలేదేమి? అని ఎదురు చూచుచుంటివి. అట్టి గురవాయూరు పురాధీశా! ఓ మురారీ! ఈ రుగ్మతలనుండి నన్ను కాపాడుము, అని నిన్ను ప్రార్ధించుచున్నాను.
 
దశమ స్కంధము
62వ దశకము సమాప్తము.
-x-