Jump to content

నారాయణీయము/దశమ స్కంధము/60వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

60వ దశకము - గోపికావస్త్రాపహరణము


60-1
మదనాతురచేతసో౾న్వహం భవదంఘ్రిద్వయదాస్యకామ్యయా।
యమునాతటసీమ్ని సైకతం తరళాక్ష్యో గిరిజాం సమార్చిచన్॥
1వ భావము. :-
భగవాన్! నీ వేణుగానమునకు ఆకర్షితులయిన బృందావనములోని గోపికలు - మదనోద్వేగముతో - నీ పాదములను సేవించు భాగ్యమును - పదేపదే కోరుకొనుచూ - ఆ యమునానదీతీరమున - ఇసుకతో గిరిజాదేవి ప్రతిమను ప్రతిష్టించి - ఆ మూర్తిని అర్చించసాగిరి.

61-2
తవ నామకథారతాః సమం సుదృశః ప్రాతరుపాగతా నదీమ్।
ఉపహారశతైరపూజయన్ దయితో నందసుతో భవేదితి॥
 2వ భావము. :-
భగవాన్! ఆ గోపికలు - నీ నామమును (ఆర్తితో) ఉచ్చరించుచు - నీ లీలలను ఒకరితోనొకరు చెప్పుకొనుచూ - ఆనందించుచు - ప్రతిదినము - ఉదయముననే ఆ యమునానదీ తీరమును చేరుకొని - నందుని కుమారుడయినట్టి శ్రీకృష్ణునినే - తమకు భర్తగా అనుగ్రహించమని - ఆ గిరిజాదేవిని కోరుకొనుచు – పూజించుచూ - వందలకొలదీ నైవేద్యములను -ఆ దేవికి సమర్పించుచుండిరి.
 
61-3
ఇతి మాసముపాహితవ్రతాస్తరలాక్షీరభివీక్ష్య తా భవాన్।
కరుణామృదులో నదీతటం సమయాసీత్ తదనుగ్రహేచ్ఛయా॥
3వ భావము. :-
ప్రభూ! ఈ విధముగా ఆ గోపికలు - కాత్యాయని (గిరిజాదేవి) వ్రతమును భక్తి నియమములతో పాటించుచు - ఒక మాసకాలము ఉపాసించిరి. వారి భక్తిప్రపత్తులనుచూచి - భగవాన్! నీహృదయము కరుణార్ద్రమయ్యెను; వారిని అనుగ్రహించవలెనని తలచితివి; ఆ గోపికలు పూజలు చేయు ప్రాతఃకాల సమయమునకు వారివద్దకు పయనమయితివి.
 
60-4
నియమావసితౌ నిజాంబరం తటసీ మన్యవముచ్య తాస్తదా।
యమునాజలఖేలనాకులాః పురతస్త్వామవలోక్య లజ్జితాః॥
4వ భావము. :-
ప్రభూ! ఆ గోపికలు - నియమనిష్టలతో - కాత్యాయని (గిరిజాదేవి) వ్రతమును చేసుకొనుచుండిరి; ఆ దినము వ్రతమునకు ఆఖరి దినము. వారు - వారి వారి వస్త్రములను గట్టున విడిచి - యమునానదీ జలములలో - జలక్రీడలయందు మునిగియుండిరి. ఆ సమయమున (నీవు అచ్చటకు చేరితివి) వారి ఎదుట నీవు కనిపించుటతో - ఆ గోపికలు సిగ్గుతో తడబాటుచెందిరి.
 
60-5
త్రపయా నమితాననాస్వథో వనితాస్వంబరజాలమంతికే।
నిహితం పరిగృహ్య భూరుహో విటపం త్వం తరసా౾ధిరూఢవాన్॥
5వ భావము. :-
ప్రభూ! నీవట్లు ఆకస్మికముగా కనిపించగనే - ఆ గోపకాంతలు - సిగ్గుతో - తలదించుకొనిరి. (వారిని అనుగ్రహించుటకే వచ్చిన ఓ! భగవాన్!) నీవు వెనువెంటనే వారు చూచుచుండగా - గట్టున ఉన్న వారి వస్త్రములను తీసుకొని - అచ్చటకు చేరువలోనే ఉన్న - ఒక వృక్షభాగమును అధిరోహించితివి.
 
60-6
ఇహ తావదుపేత్య నీయతాం వసనం వః సుదృశో। యథాయథామ్।
ఇతి నర్మమృదుస్మితే త్వయి బ్రువతి వ్యముముహే వధూజనైః॥
6వ భావము. :-
భగవాన్! పిమ్మట నీవు ఆ గోపవనితలతో ఇట్లంటివి. " ఓ! సుందర యువతులారా! వలసినచో - మీరు - ఒక్కరొక్కరుగా - నా వద్దకు వచ్చి - మీ మీ వస్త్రములను తీసుకొనుడు" - అని మృదు - దరహాసముతో పలికితివి. ఆ నీ పలుకులను ఆలకించిన గోపికలు (సిగ్గుతో) - ఏమిచేయవలయునో - తోచని స్థితికి లోనయిరి.
 
60-7
అయి జీవ చిరం కిశోర। నస్తవ దాసీరవశీకరోషి కిమ్।
ప్రదిశాంబరమంబుజేక్షణేత్యుదితస్త్వం స్మితమేవ దత్తవాన్॥
7వ భావము. :-
భగవాన్! అప్పుడు వారు నీతో ఇట్లనిరి. "ఓ! పిల్లవాడా! నీవు చిరంజీవివి అవుగాక! మేము నీకు దాసులము - విధేయులము. మమ్ము భాదించనేల? పద్మనేత్రా! మా వస్త్రములను మాకు ఇచ్చివేయుము".
 అని, నిన్ను పరిపరి విధములుగా వేడుకొనిరి. ప్రభూ! నీవు వారి మాటలకు బదులు పలకక చిరునవ్వుతో ఊరుకుంటివి.
 
60-8
అధిరుహ్య తటం కృతాంజలీః పరిశుద్ధాః స్వగతీర్నిరీక్ష్య తాః।
వసనాన్యఖిలాన్యనుగ్రహం పునరేవం గిరమప్యదా ముదా॥
8వ భావము. :-
భగవాన్! (పరిపూర్ణమయిన భక్తికి - జీవుడు లోనయినప్పుడు - తన దేహాభిమానమును వీడి - ఆ పరమాత్మనే శరణుజొచ్చును కదా!) నీవు బదులు పలుకకపోవుటతో ఆ గోపికలు - ఒడ్డును చేరి - తమ చేతులు జోడించి - ప్రభూ! నీకు నమస్కరించిరి; నిష్కల్మముగా ఆత్మార్పణగావించిరి; నిన్ను శరణువేడిరి. అది చూచిన నీవు - తక్షణమే వారి వస్త్రములను వారికి ఇచ్చివేసితివి; వారిని ప్రమాణపూర్వకముగా అనుగ్రహించితివి.
 
60-9
విదితం నను వో మనీషితం వదితారస్త్విహ యోగ్యముత్తరమ్।
యమునాపులినే సచంద్రికాః క్షణదా ఇత్యబలాస్త్వమూచివాన్॥
9వ భావము. :-
భగవాన్! పిమ్మట - ఆ గోపికలతో నీవు ప్రేమపూర్వకముగా ఇట్లంటివి. "మీ మనసులలోని కోరికలు నాకు తెలియును - మీ కోరిక వెన్నెలరాత్రులలో - యమునానదీ తీరమున నెరవేరగలదు", అని పలికి వారిని అనుగ్రహించితివి.
 
60-10
ఉపకర్ణ్య భవన్ముఖచ్యుతం మధునిష్యంది వచో మృగీదృశః॥
ప్రణయాదయి వీక్ష్య వీక్ష్య తే వదనాబ్జం శనకైర్గృహం గతాః॥
10వ భావము. :-
భగవాన్! నీ నోటినుండి వెలువడిన ఆ తేనెలొలుకు పలుకులను విని - లేడికన్నులనుబోలిన నేత్రములుగల ఆ గోపవనితలు - పదే పదే నీ ముఖారవిందమును తిలకించుచూ - తమ తమ గృహములకు వెడలిరి.
 
60-11
ఇతి నన్వనుగృహ్య వల్లవీర్విపినాంతేషు పురేవ సంచరన్।
కరుణాశిశిరో హరే। హర త్వరయా మే సకలామయావళిమ్॥
11వ భావము. :-
ప్రభూ! ఈ విధముగా గోపికలను అనుగ్రహించి -ముందువలె - నీవు ఆ యమునానదీ తీరమున విహరించుచుంటివి. అట్టి దయార్ధ్రహృదయుడవగు ఓ! శ్రీహరీ! నా సమస్తరోగములను హరించుము. నన్ను రక్షించుము - అని నిన్ను ప్రార్ధించుచున్నాను.
 
దశమ స్కంధము
60వ దశకము సమాప్తము.