నారాయణీయము/దశమ స్కంధము/57వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

57వ దశకము - ప్రలంబాసురవధ


57-1
రామసఖః క్వాపి దినే కామద। భగవన్।గతో భవాన్ విపినమ్।
సూనుభిరపి గోపానాం ధేనుభిరభిసంవృతో లసద్వేషః॥
1వ భావము
అభీష్టములు నెరవేర్చు భగవంతుడా! ఒకదినమున, నీవూ -నీ సోదరుడు బలరాముడు, మనోహర రూపములతో - గోపబాలకులు, గోగణములు వెంటరాగా బృందావన పరిసర అరణ్యమునకు బయలుదేరిరి.
 
57-2
సందర్శయన్ బలాయ స్వైరం బృందావనశ్రియం విమలామ్।
కాండీరైః సహా బాలైర్భాండీరకమాగతో వటంక్రీడన్॥
2వ భావము
భగవాన్! నిర్మలము, సుందరము అయిన ఆ బృందావన శోభను - నీవు బలరామాదులకు చూపుచూ ఆనందముగా వెడలసాగితివి. అరణ్యమును చేరి, ఆ పిమ్మట, చేతికోలను ధరించి గోవులను కాయు ఆ గోపబాలురతో కలిసి, 'భాండీరము' అను పేరుగల ఒక వటవృక్షము (మర్రిచెట్టు) వద్దకు వెళ్ళితివి.
 
57-3
తావత్తావకనిధనస్పృహయాలుర్గోపమూర్తిరదయాళుః
దైత్యః ప్రలంబనామా ప్రలంబబాహుం భవంతమాపేదే॥
3వ భావము
ఆ సమయమున నిర్దయుడగు 'ప్రలంబాసురుడు' అను ఒక రాక్షసుడు, ఓ దీర్ఘబాహువులుకల భగవాన్! నిన్ను హతమార్చవలెనని - గోపబాలుని రూపమున - మీలో ఒక గోపబాలునివలె అచ్చటకు వచ్చెను.
 
57-4
జానన్నప్యవిజానన్నివ తేన సమం నిబద్ధసౌహార్ధః।
వటనికటే పటుపశుపవ్యాబద్దం ద్వంద్వయుద్ధమారబ్ధాః॥
4వ భావము
ఆ వచ్చినవాడు అసురుడు - అని తెలిసియూ, ప్రభూ! నీవు ఏమియు తెలియనివానివలె, వానితో స్నేహము చేసి, ఆ వటవృక్షముచెంతనే - మల్లయుద్ధ నేర్పరులగు - గోపాలురమధ్య - ద్వందయుద్ధ (ఒకరితోనొకరు పోటీపడు) క్రీడను ప్రారంభించితివి.
 
57-5
గోపాన్ విభజ్య తన్వన్ సంఘం బలభద్రకం భవత్కమపి।
త్వద్బలభీరుం దైత్యం త్వద్బలగతమన్వమన్యథా భగవన్॥
5వ భావము
"ఈ పోటీ ఆటకు, ఒక గుంపుకు బలరాముడు - ఇంకొక గుంపునకు నేను - నాయకులము " అని చెప్పి ఆ గోపబాలకులను రెండు పక్షములు చేసితివి. అప్పుడు, భగవాన్! గోపబాలుని రూపమున ఉన్న ఆ 'ప్రలంబాసురుడు' నీ శక్తికి భయపడెనోఏమో! నీ పక్షమును కోరగా - అట్లే అనుమతించితివి.
 
57-6
కల్పితవిజేతృవహనే సమరే పరయూథగం స్వదయితతరమ్।
శ్రీదామానమధత్థాః పరాజితో భక్తదాసతాం ప్రథయన్॥
6వ భావము
'ఆటలో ఓడినవారు విజేతను తమ భుజములపై ఎక్కించుకొని మోయవలెను' అనునది ఆట నియమము. అప్పుడు 'బలరాముని' పక్షమున ఆడుచున్న నీ భక్తుడు- నీ ప్రియమిత్రుడు అగు 'శ్రీదాముని' చేతిలో నీవు పరాజితుడవైతివి; 'శ్రీదామునిని' నీ భుజములపై మోసి, భగవాన్! నీవు భక్తులకు దాసుడవు! అని విశదపరిచితివి.
 
57-7
ఏవం బహుషు విభూమన్। బాలేషు వహత్సు వాహ్యమానేషు।
రామవిజితః ప్రలంబో జహార తం దూరతో భవద్భీత్యా॥
7వ భావము
భగవాన్! గెలిచినవారు - ఓడినవారి భుజములపై ఎక్కుచూ; ఓడిన వారు - గెలిచిన వారిని తమ భుజములపై ఎక్కించుకొని మోయుచూ - తిరుగుచూ ఆడుకొనుచుండిరి. ఆ ఆటలో ఒకమారు 'ప్రలంబుడు' 'బలరాముని' చేతిలో ఓడిపోయెను. అపరిమిత శక్తివంతుడవగు ఓ! విభూమా! ఆ ప్రలంబుడు నీకు భయపడి, ఆ బలరాముని తన భుజములపై మోయుచూ - చాలాదూరమునకు తీసుకొనిపోసాగెను.
 
57-8
త్వద్దూరం గమయంతం తం దృష్ట్వాహాలిని విహితగరిమభరే।
దైత్యఃస్వరూపమాగాద్యద్రూపాత్ స హి బలో౾పి చకితో౾భూత్॥
8 వ భావము
ప్రభూ! ఇది గ్రహించిన బలరాముడు తన శరీర బరువును పెంచుచు అధికముచేయసాగెను. దానితో గోపబాలుని రూపమున ఉన్న ఆ దైత్యుడు బలరాముని భారమును మోయలేక తన నిజరూపమును పొందెను. ఆ దైత్యుని రూపము భీకరముగానుండెను; బలరామునికి సహితము (రవ్వంత) భీతిని కలిగించెను.
 
57-9
ఉచ్చతయా దైత్యతనోస్త్వన్ముఖమాలోక్య దూరతో రామః।
విగతభయో దృఢముష్ట్యా భృశదుష్టం సపది పిష్టవానేనమ్॥
9వ భావము
ప్రభూ! ఆ రాక్షసుని శరీరము చాలా ఎత్తుగానుండెను. వాని భుజములపై నున్న బలరామునికి దూరముగా ఉన్న నీ ముఖము కనబడెను. నిన్ను చూచి, బలరాముడు నిర్భయుడై, ఆ దుష్ట 'ప్రలంబరాక్షసుని' తనపిడికిళ్ళతో బలముగామోది - పిండిజేసి, వానిని హతమార్చెను.
 
57-10
హత్వా దానవీరం ప్రాప్తం బలమాలిలింగథ ప్రేమ్ణా।
తావన్మిలతోర్యువయోః శిరసి కృతా పుష్పవృష్టిరమరగణైః॥
10వ భావము
భగవాన్! దుష్టుడయిన ఆ ప్రలంబాసురుని వధించి వచ్చిన - నీ అన్న బలరామునిని నీవు ప్రేమతో ఆలింగనము చేసుకొంటివి. ఇది చూచిన దేవతలు మీ శిరస్సులపై పూలవర్షము కురిపించిరి; స్తుతించిరి.
 
57-11
ఆలంబో భువనానాం ప్రాలంబం నిధనమేవమారచయన్।
కాలం విహయ సద్యో లోలంబరుచే హరే హరే క్లేశాన్॥
11వ భావము
విశ్వమంతటకు ఆధారభూతుడా! శ్రీహరీ! బలరామునిచేత ఆ ప్రలంబాసురుని నీవే చంపించితివి. నల్లతుమ్మెద మేనిఛాయతో ప్రకాశించు ఓ! నల్లనయ్యా! ఆలస్యముచేయక - తక్షణమే - నా రుగ్మతను హరించుము. నన్ను రక్షించుము.
          
దశమ స్కంధము
57వ దశకము సమాప్తము.