నారాయణీయము/దశమ స్కంధము/56వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

56వ దశకము - శ్రీకృష్ణుడు కాళియుని అనుగ్రహించుట


56-1
రుచిరకంపితకుండలమండలః సుచిరమీశ। ననర్తిథ పన్నగే।
అమరతాడితదుందుభిసుందరం వియతి గాయతి దైవతయౌవతే॥
1వ భావము :-
ప్రభూ! కాళీయుని పడగలపై నీవట్లు నృత్యముచేయుచుండగా నీ పాదముల - అడుగులకు అనుగుణముగా, నీకర్ణకుండలములు రమణీయముగా కదులుచు సుందరముగా కనిపించుచుండెను. అప్పుడు దేవతలు దుంధుభులు మ్రోగించిరి; దేవతాస్త్రీలు గానముచేసిరి.

56-2
నమతి యద్యదముష్య శిరోహరే। పరివిహాయ తదున్నతమున్నతమ్॥
పరిమథన్ పదపంకరుహా చిరం వ్యహరథాః కరతాళమనోహరమ్॥
2వ భావము :-
హరీ! అనేకపడగలు కలిగిన ఆ సర్పరాజు శిరస్సుపై నీవు తాండవము చేయునప్పుడు - వంగిపోయిన ఆ సర్పపు పడగలను వదిలివేయుచూ -పైకిలేచుచున్న పడగలపై నీ పాదపద్మములను మోపుచూ - వాటిని అణచివేయుచూ - నీ రెండుహస్తములతో చప్పట్లు చరుచుచూ - ప్రభూ! నీవు చాలాసమయము మనోహరముగా నర్తించితివి.
 
56-3
త్వదవభగ్నవిభుగ్నఫణాగణే గళితశోణితపాథసి।
ఫణిపతావవసీదతి సన్నతాస్తదబలాస్తవ మాధవ। పాదయోః॥
3వ భావము :-
మాధవా! నీవట్లు నర్తించుచు - ఆ సర్పరాజు పడగలనన్నింటినీ ఛిద్రముచేసివేసితివి. ఛిద్రమై కిందకు వాలిన అతని శిరస్సులనుండి రక్తధారలు ప్రవహించసాగెను. ఆ రక్తధారలతో యమునానది అరుణవర్ణమయ్యెను. కాళీయుడు పూర్తిగా అలసిపోయెను; అతని ప్రాణములు కడబట్టెను. ఆ దుస్థితిని చూచి - సర్పరాజు భార్యలు, ప్రభూ! నిన్ను శరణుజొచ్చిరి.
 
56-4
అయి। పురైవ చిరాయ పరిశృతత్వదనుభావవిలీనహృదో హి తాః ।
మునిభిరప్యనవాప్యపథైః స్తవైర్నునుపురీశ। భవంతమయంత్రితమ్॥
4వ భావము :-
ప్రభూ! ఆ కాళీయుని పత్నులు చాలాకాలము వెనకనే నీ మహిమలను వినియుండిరి. భక్తితో వారి హృదయములు నీయందు లగ్నమయియున్నవి. వారు నిన్నిప్పుడు శరణుకోరిరి; మునీశ్వరులకుకూడా అలవికాని విధముగా, భగవాన్! వారు నిన్ను - ఆపశక్యముగాని ఉద్వేగముతో - స్తుతించిరి.
 
56-5
ఫణివధూగణభక్తివిలోకనప్రవికసత్కరుణాకులచేతసా।
ఫణిపతిర్భవతాచ్యుత। జీవితస్త్వయి సమర్పితమూర్తిరవానమత్॥
5వ భావము :-
భగవాన్! కాళీయుని పత్నులు అట్లు భక్తిగా నిన్ను కొలువగా - నీవు వారిపట్ల దయార్ధ్రహృదయుడవైతివి; ఆ సర్పరాజును చంపక వదలివేసితివి. అంతటితో ఆ సర్పరాజు (గర్వమణిగినవాడై - వినమృడై ), తన జీవితమును నీకు అర్పణచేయుచూ ప్రభూ! నీకు నమస్కరించెను.
 
56-6
రమణకం వ్రజవారిధిమధ్యగం ఫణిరిపుర్న కరోతి విరోధితామ్।
ఇతి భవద్వచనాన్యతిమానయన్ ఫణిపతిర్నిరగాదురగైః సమమ్॥
6వ భావము :-
అప్పుడు, నీవు ఆ కాళీయునిని - సముద్రమధ్యమునకల 'రమణకము' అను ద్వీపమునకు వెళ్ళి నివసించమని చెప్పితివి. అచ్చట గరుడుడు విరోధము కలిగిఉండడు అని కూడా పలికితివి. నీ మాటలననుసరించి, ప్రభూ! ఆ సర్పరాజు, విధేయుడై, (తన భార్యలతో), ఇతర సర్పములతో కలిసి యమునానదినుండి నిష్క్రమించెను.
 
56-7
ఫణివధూజనదత్తమణివ్రజజ్వలితహారదుకూలవిభూషితః।
తటగతైః ప్రమదాశ్రువిమిశ్రితైః సమగథాః స్వజనైర్దివసావధౌ॥
7వ భావము :-
భగవాన్! ఆ సమయమున నాగపత్నులు నీకు మణిహారములను, దుకూలములు (సన్నని వస్త్రములు) అను వస్త్రవిశేషములు మొదలగువానిని బహుకరించిరి. ప్రభూ! నీవు వాటిని ధరించి, సూర్యాస్తమయ సమయమునకు -యమునానదీతీరమున, నీకొఱకు - ఆనందాశృవులతో ఎదురుచూచుచున్న నీ బృందావన ప్రజలను చేరితివి.
 
56-8
నిశి పునస్తమసా వ్రజమందిరం వ్రజితుమక్షమ ఏవ జనోత్కరే।
స్వపతి తత్ర భవచ్ఛరణాశ్రయే దవకృశానురరుంధ సమంతతః ॥
8వ భావము :-
ప్రభూ! అప్పుడు రాత్రివేళ అగుచుండెను. ఆ వ్రేపల్లె జనులు బృందావనమునకు తిరిగి వెళ్ళలేక, ( నీ అనుమతితో) ఆ రాత్రి , ఆ యమునానదీతీరమున విశ్రమించుటకు నిశ్చయించుకొనిరి; నీ చరణములను ఆశ్రయించి వారు అచ్చటనే నిదురించిరి. ఆ సమయమున దావానలము రగుల్కొని, కార్చిచ్చు ఆ ప్రదేశమును చుట్టుముట్టెను.
 
56-9
ప్రబుధితానథ పాలయ పాలయేత్యుదయదార్తరవాన్ పశుపాలకాన్।
అవితుమాశు పపాథ మహానలం కిమిహ చిత్రమయం ఖిలు తే ముఖమ్॥
9వ భావము :-
ఆ దావానలము వేడికి, గోపజనులందరూ మేల్కొనిరి. భయముతో, "రక్షింపుము, రక్షింపుము.. కృష్ణా! " అని వారు ఆర్తనాదములు చేసిరి. అప్పుడు నీవు ఆ ప్రజలను రక్షించవలెనని ఆ అగ్నిని త్రాగివేసితివి. నీవు అట్లుచేయుటలో ఆశ్చర్యమేమున్నది? ప్రభూ! నీ నోరు విచిత్రమయినది; మహిమాన్వితమయినది.
 
56-10
శిఖిని వర్ణత ఏవ హి పీతతా పరిలసత్యధునా క్రియయాప్య౾సౌ।
ఇతి నుతః పశుపైర్ముదితైర్విభో హర హరే। దురితైః సహ మే గదాన్॥
10వ భావము :-
విభో! పరమాత్మా! ఆ అగ్ని, నీవు త్రాగుటకు పూర్వము పీతవర్ణముగనే తెలియును; త్రాగుట అనునది అసాధ్యము. కాని ఆ అగ్నిని త్రాగి (పీతము చేసి) ఆ అసాధ్యమును నీవు సుసాధ్యము చేసితివి. భగవాన్! అది నీకు మాత్రమే సాధ్యము!" అని ఆ గోపాలురు కీర్తించిరి. వారి స్తుతులకు ఆనందించిన శ్రీహరీ! నాపాపములను, రోగమునూ హరించుము అని నిన్ను ప్రార్ధించుచున్నాను.

దశమ స్కంధము
56వ దశకము సమాప్తము.
-x-