నారాయణీయము/దశమ స్కంధము/55వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

55వ దశకము - కాళీయమర్ధనము


55-1
అథ వారిణీ ఘోరతరం ఫణినం ప్రతివారయితుం కృతధీర్భగవన్।
ద్రుతమారిథ తీరగనీపతరుం విషమారుతశోషితపర్ణచయమ్॥
1వ భావము. :-
భగవాన్! (నీవట్లు గోవులను - గోపాలురును రక్షించిన) పిదప, విషసర్పమగు ఆ కాళీయుడిని, యమునా (కాళిందీ) నదీ జలములనుండి తరిమివేయుటకు కృతనిశ్చయుడవైతివి. వెనువెంటనే ఆ నదీతీరమునగల ఒక కదంబవృక్షము చెంతకు వెళ్ళితివి. కాళీయుని విషపుగాలులకు ఆ వృక్షము బాగా కృశించియున్నది. నీవు వేగముగా ఆ చెట్టును అధిరోహించితివి.

55-2
అధిరుహ్య పదాంబురుహేణ చ తం నవపల్లవతుల్యమనోజ్ఞరుచా।
హ్రదవారిణి దూరతరం న్యపతః పరిఘూర్ణితఘోరతరంగగణే॥
2వ భావము. :-
బాలుని రూపమున ఉన్న ఓ! భగవాన్! చిగురుటాకులవలెనున్న నీ చిరుపాదములతో ఆ వృక్షమును అధిరోహించి, వృక్షాగ్రమును చేరితివి. అచ్చటినుండి, నీవు తరంగములతో ఎగిసిపడుచూ ఉధృతముగా ప్రవహించుచున్న యమునానదీ జలములలోనికి దుమికితివి; వెనువెంటనే ఆ నదీగర్భమున ప్రవేశించితివి.
 
55-3
భువనత్రయభారభృతో భవతో గురుభారవికంపివిజృంభిజలా।
పరిమజ్జయతి స్మ ధనుశ్శతకం తటినీ ఝటితి స్ఫుటఘోషవతీ॥
3 వ భావము. :-
ముల్లోకములను నీలో ధరించిన భగవంతుడా! నీవు ఆ యమునానదిలోనికి అట్లు దుమకగనే నీ భారమునకు ఆ జలము మిక్కిలి కంపించినది; అల్లకల్లోలమయినది; పెద్దధ్వనితో ఉప్పొంగి - నూరు గజముల దూరమువరకూ తీరమును ముంచివేసినది.
 
55-4
అథ దిక్షు విదిక్షు పరిక్షుభిత భ్రమితోదరవారినినాదభరైః ।
ఉదకాదుదగాదురగాధిపతిస్త్వదుపాంతమశాంతరుషాంధమనాః॥
4వ భావము. :-
భగవాన్! అట్లు ఆ యమునానది కల్లోలభరితము కాగా - అన్నిదిక్కులలోనూ భయంకర శబ్ధములు కలిగెను. ఆ ధ్వనులకు సర్పాధిపతియగు కాళీయుడు అశాంతికి లోనయ్యెను; నీటిమడుగునుంచి క్రోధముతో పైకిలేచి నిన్ను సమీపించెను.
 
55-5
ఫణశృంగసహస్రవినిఃసృమరజ్వలదగ్నికణోగ్రనిషాంబుధరమ్।
పురతః ఫణినం సమలోకయథా బహుశృంగిణమంజనశైలమివ॥
5వ భావము. :-
ఆ సర్పరాజగు కాళీయుడు వేయిపడగలు కలిగియుండెను. ఆ పడగల కోరలనుండి విషాగ్నులుతో -మంటలు విరజిమ్ముచుండెను. ప్రభూ! అప్పుడు ఆ ఫణిరాజు అనేక శిఖరములు కలిగిన ఒక పెద్ద నల్లని కొండవలెనుండెను.

55-6
జ్వలదక్షి పరిక్షరదుగ్రవిషశ్వసనోష్మభరః స మహాభుజగః ।
పరిదశ్య భవంతమనంతబలం సమవేష్టయదస్ఫుటచేష్టమహో॥
6వ భావము. :-
ఆ సర్పము కన్నులు అగ్నికణములవలెనుండెను. వేడి ఉచ్ఛ్వాస నిశ్వాశములను విడుచుచూ - కోరలనుండి విషధారలు స్రవించుచుండగా - పెనురూపముతో, అహో! భగవాన్! ఆ సర్పము అతిబలశాలివయిన నిన్ను పట్టుకొని నీ శరీరమునంతనూ చుట్టివేసెను; నీ రూపమెవరికీ కనబడకుండునట్లు చేసెను.
 
55-7
అవిలోక్య భవంతమథాకులితే తటగామిని బాలకధేనుగణే।
వ్రజగేహతలే౾ప్యనిమిత్తశతం సముదీక్ష్య గతా యమునాం పశుపాః ॥
7వ భావము. :-
భగవాన్! నీవు కనబడక గోవులు - గోపాలురు కలవరపడసాగిరి. అదే సమయమున వ్రజమునందు గృహములలోనున్న ప్రజలకు సహితము అనేక దుశ్శకునములు కనిపించెను. భీతిచెందిన ఆ ప్రజలు, గోపాలురు - గోవులూ (ఆందోళనతో - ఆతృతతో) ఆ యమునానదీ తీరమును చేరిరి.
 
55-8
అఖిలేషు। విభో। భవదీయదశామవలోక్య జిహసుషు జీవభరమ్।
ఫణిబంధనమాశు విముచ్య జనాదుదగమ్యత హాసజుషా భవతా॥
8వ భావము. :-
ప్రభూ! ఆ స్తితిలో నిన్ను చూచి - వారందరూ చలించిపోయిరి. నిన్ను రక్షించుటకు తమ ప్రాణములను సహితము ఫణముగా పెట్టుటకు సిద్ధపడిరి. (అది గ్రహించితివో ఏమో!) నీవు తక్షణమే ఆ సర్పరాజు బంధమునుండివిడివడి చిరునవ్వుతో వారికి కనిపించితివి.
 
55-9
అధిరుహ్య తతః ఫణిరాజఫణాన్ నవృతే భవతా మృదుపాదరుచా।
కలశింజితనూపురమంజుమిలత్కరకంకణసంకులసంక్వణితమ్॥
9వ భావము. :-
తృటిలో నీవు ఆ ఫణిరాజు పడగలనధిరోహించితివి. నీ కాలియందియలు గలగల ధ్వనులు చేయుచుండగా; నీకరకంకణ ధ్వనులు ఆ ధ్వనులతో కలిసి మృదుమధురమై - వీనులవిందు చేయుచుండగా ప్రభూ! నీవా కాళీందుని పడగలపై ప్రకాశవంతమైన నీ చిరు పాదములతో నృత్యముచేయనారంభించితివి.
 
55-10
జహృషుః పశుపాస్తుషుర్మునయో వవృషుః కుసుమాని సురేంద్రగణాః।
త్వయి నృత్యతి మారుతగేహపతే।పరిపాహి స మాం త్వమదాంతగదాత్॥
10వ భావము. :-
ప్రభూ! నీవట్లు నృత్యము చేయుచుండగా చూచి - ఆ వ్రేపల్లె ప్రజలు మిక్కిలి ఆనందించిరి. మునులు స్తుతించిరి. దేవతలు పుష్పములు కురిపించిరి. అటువంటి శ్రీకృష్ణా! గురవాయూరు పురాధీశా! నా రోగ తీవ్రతను తగ్గించుము - నన్ను రక్షించుము అని ప్రార్ధించుచున్నాను.

 
దశమ స్కంధము
55వ దశకము సమాప్తము.
-x-