Jump to content

నారాయణీయము/దశమ స్కంధము/54వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

54వ దశకము - కాళియోపాఖ్యానము


54-1
త్వత్సేవోత్కః సౌభరిర్నామ పూర్వం కాళింద్యంతర్ద్వాదశాబ్దం తపస్యన్।
మీనవ్రాతే స్నేహవాన్ భోగలోలే తార్ క్ష్యం సాక్షాదైక్షతాగ్రే కదాచిత్॥
1వ భావము:-
భగవాన్! ఒకానొక సమయమున, 'సౌభరి' అను మునీశ్వరుడు కాళిందీ (యమునా) నదీ జలములలో పన్నెండు సంవత్సరముల కాలము, నిన్ను భక్తితో సేవించుచు తపస్సుచేయుచుండెను. ఆసమయమున, ఆ మునికి ఆ జలములలో ఉన్న మత్స్యములపట్ల అప్రయత్నముగా ఆసక్తి - అభిమానములు కలిగెను. ఇట్లుండగా, ఆ మత్స్యములకొఱకు, 'గరుడుడు' వచ్చియుండుటను, ఒకనాడు, 'సౌభరి'ముని చూచెను.

54-2
త్వద్వాహం తం సక్షుధం తృక్షసూనుం మీనం కంచిజ్జక్షతం లక్షయన్ సః।
తప్తశ్చిత్తే శప్తవానత్ర చేత్త్వం జంతూన్ భోక్తా జీవితం చాపి మోక్తా॥
2వ భావము:-
ప్రభూ! ఆ కలితో నీ వాహనమగు ఆ 'గరుత్మంతుడు' ఆ జలములోని చేపలనుపట్టి తినసాగెను. అదిచూచిన 'సౌభరి'ముని మనస్సులో మిక్కిలి చింతించినవాడై - " ఈ నదీజలములలోని జలచరములను భక్షించినచో నీవు ప్రాణములు కోల్పోయెదవుగాక!", అని గరుత్మంతుడు శాపమిచ్చెను.

54-3
తస్మిన్ కాలే కాళియః క్ష్వేలదర్పాత్ సర్పారాతేః కల్పితం భాగమశ్నన్।
తేన క్రోధాత్ త్వత్పదాంభోజభాజా పక్షక్షిప్తస్తద్దురాపం పయో౾గాత్॥
3వ భావము:-
ఆసమయముననే, శక్తివంతమయిన విషముకలిగిన 'కాళీయుడు' అను ఒకసర్పము ఉండెను. గర్వితుడైన ఆ 'కాళీయుడు' - సర్పములకు విరోధియగు 'గరుడుని' కొరకు ఉంచిన ఆహారమును భుజించెను. నీ పాదపద్మములను సేవించు 'గరుడుడు' అదిచూచి, ఆగ్రహముతో ఆ సర్పమును తనరెక్కలతో పట్టి బలముగా విసిరివేసెను. అప్పుడు 'కాళీయుడు' - సౌభరిముని శాపకారణముగా గరుడుడు ప్రవేశింపజాలని యమునానదిలోని ఒక మడుగులో చేరి నివాసమేర్పరుచుకొనెను.

54-4
ఘోరే తస్మిన్ సూరజానీరవాసే తీరే వృక్షా విక్షతాః క్ష్వేలవేగాత్।
పక్షివ్రాతాః పేతురభ్రే పతంతః కారుణ్యార్ధ్రం త్వన్మనస్తేన జాతమ్॥
4వ భావము:-
ఆ సర్పవిష ప్రభావముతో, సూర్యపుత్రియగు యమునానదీ తీరమునగల వృక్షములు ఎండిపోవుచుండెను; ఆకాశమున విహరించు పక్షులు ఆ విషగాలులకు చనిపోయి పడిపోవుచుండెను. ఇది అంతయూచూచి, ప్రభూ! నీ హృదయము జాలితో ద్రవించిపోయెను.

54-5
కాలే తస్మిన్నేకదా సీరపాణిం ముక్త్యా యాతే యామునం కాననాంతమ్।
త్వయ్యుద్ధామగ్రీష్మభీష్మోష్మతప్తా గోగోపాలా వ్యాపిబన్ క్ష్వేలతోయమ్॥
5వ భావము:-
ఒకనాడు బలరాముడిని వదలి, నీవు ఒక్కడివే గోవులు-గోపాలురతో కలిసి యమునానదీ తీరమునగల అరణ్యమునకు వెళ్ళితివి. అది వేసవికాలము అగుటచే ఎండప్రభావము తీవ్రముగానుండెను. ఆ సూర్యతాపమునకు - దప్పికయై, గోవులు - గోపాలురు విషతుల్యమయిన యమునానదిలోని నీరును త్రాగిరి.

54-6
నశ్యజ్జీవాన్ విచ్యుతాన్ క్ష్మాతలే తాన్ విశ్వాన్ పశ్యన్నచ్యుత।త్వం దయార్ధ్రః।
ప్రాప్యోపాంతం జీవయామాసిథ ద్రాక్ పీయూషాంభోవర్షిభిః శ్రీకటాక్షైః॥
6వ భావము:-
విషపూరితమైన ఆ యమునానదీ జలములను త్రాగగానే, గోవులు-గోపాలురు అందరూ మృతిచెందిరి. అదిచూచి, ప్రభూ! నీ హృదయము దయార్ధ్రమయ్యెను. నీవు వారిపై నీ కరుణా కటాక్ష వీక్షణములను ప్రసరింపజేసితివి; అమృతవర్షమును కురిపించి వారినెల్లరును పునర్జీవితులను చేసితివి.

54-7
కింకిం జాతో హర్షవర్షాతిరేకః సర్వాంగేష్విత్యుత్థితా గోపసంఘాః।
దృష్ట్వా౾గ్రే త్వాం త్వత్కృతం తద్విదంతస్త్వామాలింగన్ దృష్టనానాప్రభావాః॥
7వ భావము:-
భగవాన్! దానితో (అమృత వర్షముతో) ఆ గోపాలుర సర్వావయవములు చైతన్యవంతమయ్యెను. అవ్యక్తానందానుభూతితో వారెల్లరూ లేచివచ్చిరి. "ఏమి జరిగినది!" అను అనుచూ సంభ్రమాశ్చర్యములకు లోనయిరి. ఎదుటనున్న నిన్నుచూచి, నీ మహిమలను ఎరిగిన వారగుటచే, దీనికంతటకూ నీవేకారణమని గ్రహించి ఆనందముతో నిన్ను కౌగలించుకొనిరి.

54-8
గావశ్చైవం లబ్ధజీవాః క్షణేన స్ఫీతానందాస్త్వాం చ దృష్ట్వా పురస్తాత్।
ద్రాగానవ్రుః సర్వతో హర్షబాష్పం వ్యాముంచంత్యో మందముద్యన్నినాదాః॥
8వ భావము:-
భగవాన్! పునర్జీవులైన గోవులు సహితము నీ ఎదుటకు వచ్చి, నిలచి, భక్తితో నిన్నే చూచుచూ ఆనందాశృవులను రాల్చినవి. నీవంకనే చూచుచూ, మృదు మధురమయిన శబ్దములు చేయుచు నీ చుట్టునూ నిలబడినవి.

54-9
రోమాంచో౾యం సర్వతో నశ్శరీరే భూయస్యంతః కాచిదానందమూర్ఛాః।
ఆశ్చర్యో౾యం క్ష్వేలవేగో ముకుందేత్యుక్తో గోపైర్నందితో వందితో౾భూః॥
9వ భావము:-
"ముకుందా! మాశరీరములలో వ్యాపించిన విషప్రభావమును నీవు తక్షణమే తొలగించితివి. సంభ్రమాశ్చర్యములతో మాశరీరములు గగుర్పాటుచెందుచున్నవి; మా అంతరంగములు ఎంతో పారవశ్యమునొందినవి". అని గోపాలురు, ప్రభూ! నిన్ను ప్రశంసించుచూ నీకు నమస్కరించిరి.

54-10
ఏవం భక్తాన్ ముక్తజీవానపి త్వం ముగ్దాపాంగైరస్తరోగాంస్తనోషి।
తాదృగ్భూతస్ఫీతకారుణ్యభూమా రోగాత్ పాయా వాయుగేహాధివాస॥
10వ భావము:-
భగవాన్! నీవు నీ భక్తుల బాధలను నిర్మూలించెదవు. వారు ప్రాణములు కోల్పోయినను నీవు కటాక్షించి నీ కృపావీక్షణములతో వారిని పునర్జీవులను చేసెదవు. అట్టి కారణ్యరూపా! గురవాయూరు పురాధీశా! నా రోగమును హరించి నన్ను రక్షింపుము.

దశమ స్కంధము
54వ దశకము సమాప్తము.
-x-