నారాయణీయము/దశమ స్కంధము/51వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

51వ దశకము - అఘాసుర వధ


51-1
కదాచన వ్రజశిశుభిః సమం భవాన్
వనాశనే విహితమతిః ప్రగేతరామ్।
సమావృతో బహుతరవత్సమండలైః
సతేమనైర్నిరగమదీశ। జేమనైః॥
1వ భావము:-
బాలకృష్ణా! ఒకనాడు నీవు వనభోజనమునకు వెళ్ళవలెనని సంకల్పించితివి. వేకువజాముననే భోజనపదార్ధములను మూటగట్టుకొని తమతమ ఆవుల మందలతో ఆ గోపబాలకులు నీ వెంట వనమునకు బయలుదేరిరి.

51-2
వినిర్యతస్తవ చరణాంబుజద్వయాదుదంచితం త్రిభువనపావనం రజః।
మహర్షయః పులకధరైః కళేబరైః ఉదూహిరే ధృతభవదీక్షణోత్సవాః॥
2వ భావము:-
భగవాన్! గోపబాలకులు, వారి గోమందలు నీ వెంటరాగా నీవు వనమునకు పయనమైతివి. అట్లు నడిచి వెళ్ళుaచున్న నిన్ను దర్శించిన మహర్షుల శరీరములు ఆనందముతో గగుర్పాటుచెందినవి. త్రిలోకములను పావనముచేయు నీపాద పద్మముల - స్పర్శతో వెలువడుతున్న ధూళికణములను ఆ మునివరులు తమశరీరములపై ధరించి పులకాంకితులయిరి.

51-3
ప్రచారయత్య విరళశాద్వలే తలే
పశూన్ విభో । భవతి సమం కుమారకైః ।
అఘాసురో న్యరుణదఘాయ వర్తనీం।
భయానకస్సపది శయానకాకృతిః॥
3వ భావము:-
ప్రభూ! గోమందలను లేతపచ్చికబయళ్ళులో మేపుచూ, నీవు - గోపబాలకులతో కలిసి అచ్చటచ్చట తిరుగుచుంటివి. అప్పుడు 'అఘాసురుడు' అను ఒక రాక్షసుడు, నీకు హానికలిగించవలెనను దుష్టతలంపుతో ఒక కొండచిలువ రూపముపొంది - భయంకర ఆకారముతో మార్గమధ్యమున (మీరాకకై) వేచియుండెను.

51-4
మహాచలప్రతిమతనోర్గుహానిభ-
ప్రసారితప్రథితముఖస్య కాననే।
ముఖోదరం విహారణకౌతుకాత్ గతాః
కుమారకాః కిమపి విదూరగే త్వయి॥
4వ భావము:-
ప్రభూ! ఆ అరణ్యమున, మహాపర్వతమువంటి కొండచిలువ రూపముతో ఆ 'అఘాసురుడు' తననోటిని పెద్ద కొండగుహవలె తెరుచుకొనియుండెను. నీవు దూరముగానున్న సమయమున, నీతోటి గోపబాలురు ఆటలాడుకొనుచు తమ గోమందలతో ( అప్రయత్నముగా) ఆ కొండచిలువ నోటిలోనికి ప్రవేశించిరి.

51-5
ప్రమాదతః ప్రవిశతి పన్నగోధరం
క్వథత్తనౌ పశుపకులే సవాత్సకే।
విదన్నిదం త్వమపి వివేశిథ ప్రభో।
సుహృజ్జనం విశరణమాశు రక్షితుమ్॥
5వ భావము:-
ప్రమాదమెరుగని ఆ గోపబాలురు, గోమందలూ ఆ మహా సర్పమునోటిలోనికి ప్రవేశించిరి; కాని, ఆ సర్పఉదరములోని వేడిని భరంచలేక ఉడికిపోవసాగిరి. వారి నిస్సహాయత నెరిగిన ప్రభూ! వారిని రక్షించుటకై తృటిలో నీవునూ ఆ సర్పము నోటిలోనికి ప్రవేశించితివి.

51-6
గళోదరే విపులితవర్ష్మణా త్వయా
మహోరగే లుఠతి నిరుద్ధమారుతే।
దృతం భవాన్ విదలిత కంఠమండలో
విమోచయన్ పశుప పశూన్ వినిర్యయౌ॥
6వ భావము:-
ప్రభూ! ఆ సర్పము కంఠములోనికి ప్రవేశించి నీవు నీశరీరమును విస్తరింపజేసితివి. దానితో ఊపిరి స్తంభించి భాధతో ఆ సర్పము పొర్లసాగెను. తక్షణమే నీవు ఆ సర్పముయొక్క కంఠమును చీల్చి ఆ గోవులను గోపాలురును రక్షించితివి. నీవునూ వెలుపలకు వచ్చితివి.

51-7
క్షణం దివి త్వదుపగమార్థమాస్థితం
మహాసురప్రభవమహో మహో మహత్।
వినిర్గతే త్వయి తు నిలీనమంజసా
సభః స్థలే ననృతరథో జగుస్సురాః॥
7వ భావము:-
ప్రభూ! నీవు సర్పరూపమున ఉన్న ఆ 'అఘాసురుని' నోటిలోనికి ప్రవేశించగనే, ఆ సర్ప శరీరమునుండి ప్రకాశవంతమయిన ఒక వెలుగు రేఖ వెలుపలికి వచ్చినిలిచియుండెను. నీవు వెలుపలికి రాగానే ఆ వెలుగురేఖ నీ శరీరములో లీనమయ్యెను. అదిచూచిన దేవతలు ఆకాశమున నృత్యములు చేసిరి; స్తుతులను ఆలాపించిరి.

51-8
సవిస్మయైః కమలభవాదిభిస్సురైః
అనుద్రుతస్తదనుగతః కుమారకైః ।
దినే పునస్తరుణదశాముపేయుషి
స్వకైర్భవానతనుత భోజనోత్సవమ్॥
8వ భావము:-
బ్రహ్మదేముడు మొదలగు దేవతలు ఆశ్చర్యముతో నిన్ను వీక్షించసాగిరి. ప్రభూ! అప్పుడు మధ్యాహ్న సమయమయ్యెను. గోపబాలురు నీవెంటరాగా అప్పుడు మీరు వనభోజనోత్సవమును జరుపుకొనిరి.

51-9
విషాణికామపి మురళిం నితంబకే
నివేశయన్ కవలధరః కరాంబుజే।
ప్రహాసయన్ కలవచనైః కుమారకాన్
బుభోజిథ త్రిదశగణైర్ముదానుతః॥
9వ భావము:-
అప్పుడు నీవు కొమ్ముబూరను, వేణువును నీ నడుముకు అమర్చుకొని ఉంటివి. పద్మములవంటి హస్తములతో భోజనపదార్ధములను చేతపట్టుకొని, హాస్యవచనములతో ఆ గోపబాలురను అలరించుచు, నవ్వుచూ, పైనుండి దేవతలు నిన్ను స్తుతించుచుండగా, ప్రభూ! నీవునూ భుజించితివి.

51-10
సుఖాశనం త్విహ తవ గోపమండలే
మఖాశనాత్ప్రియమివ దేవమండలే।
ఇతి స్తుతస్త్రిదశవరైర్జగత్పతే।
మరుత్పురీనిలయ గదాత్ ప్రపాహి మామ్॥
10వ భావము:-
ప్రభూ! యజ్ఞయాగాదులలో నీకు సమర్పించు హవిస్సులకంటెను, ఆ గోపబాలుర నడుమ నీవు చేయుచున్న భోజనము నీకు మిక్కిలి ఆనందము కలిగించుచున్నది - అని దేవతలు నిన్ను స్తుతించిరి. గురవాయూరులో వెలసిన అట్టి జగత్ప్రభూ! నారోగమునుండి నన్ను రక్షించుము.

దశమ స్కంధము
51వ దశకము సమాప్తము.
-x-