నారాయణీయము/దశమ స్కంధము/50వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

50వ దశకము - వత్సాసుర బకాసుర సంహారము


50-1
తరలమధుకృద్బృందే బృందావన౾థ మనోహరే
పశుపశిశుభిః సాకం వత్సానుపాలనలోలుపః।
హాలధరసఖోదేవ।శ్రీమన్। విచేరిథ ధారయన్
గవలమురళీనేత్రం నేత్రాభిరామతనుద్యుతిః॥
1వ భావము:-
భగవాన్! మిక్కిలి రమణీయముగా ఉన్న ఆ బృందావనములో - తుమ్మెదలు పువ్వులపై వ్రాలుచూ ఎగురుచూ చేయు ఝుంకారములతో - ఆ ప్రదేశమంతయు మనోహరముగానుండెను. శ్రీపతీ! నీవు కొమ్ముబూరను, కోలను ధరించి , మురళిని చేతబట్టి ఆ గోపబాలురతోనూ నీ అన్న బలరామునితోను కలిసి గోవత్సములను కాయుచు విహరించు నీరూపము - నేత్రములకు పరమ ఆనందదాయకము.

50-2
విహితజగతీరక్షం లక్ష్మీకరాంబుజలాలితం
దదతి చరణద్వంద్వం బృందావనే త్వయి పావనే।క
కిమివ న బభౌ సంవత్సంపూరితం తరువల్లరీ
సలిలధరణీగోత్రక్షేత్రాదికం కమలాపతే।
2వ భావము:-
కమలాపతీ! జగత్తును రక్షించునవి, లక్మీదేవి తన పద్మములవంటి హస్తములతో సేవించునవి అగు నీ పాదములు - ఆ బృందావనమును ప్రవేశించగనే ఆ వనము పవిత్రమై - అచ్చటి వృక్షములు, లతలు, జలములు, కొండలు, భూమియు అంతయూ సర్వసమృద్ధిగా శోభిల్లినవి.

50-3
విలసదులపే కాంతారాంతే సమీరణశీతలే
విపులయమునాతీరే గోవర్ధనాచలమూర్ధసు।
లలితమురళీనాదః సంచారయన్ ఖలు వాత్సకం
క్వచన దివసే దైత్యం వత్సాకృతిం త్వముదైక్షథాః ॥
3వ భావము:-
భగవాన్! ఆ బృందావనములో గోవులను కాయుచు నీవు మురళీ గానము చేయుచుంటివి. అప్పుడు మధురమగు నీ మురళీనాదము ఆ పరిసర అరణ్య ప్రాంతములలోను, యమునానదీతీరములోను, విశాలమగు పచ్చని పచ్చికబయలులలోను, గోవర్ధనపర్వత సానువులలోను - వీచు పిల్లగాలులతో కలిసి పయనించుచూ ఆ బృందావన ప్రజలను అలరించుచుండెను. ఒకరోజున - గోవత్స (ఆవుదూడ) రూపమున ఆ గోమందలో దాగి ఉన్న ఒక రాక్షసుని నీవు చూచితివి.

50-4
రభసవిలసత్పుచ్ఛం విచ్ఛాయతో౾స్య విలోకయన్
కిమపి వలితస్కంధం రంధ్రప్రతీక్షముదీక్షితమ్।
తమథ చరణే బిభ్రత్ విభ్రామయన్ ముహురుచ్చకైః
కుహచన మహావృక్షే చిక్షేపిథ క్షతజీవితమ్॥
4వ భావము:-
ప్రభూ! లేగదూడరూపమున ఉన్న ఆ రాక్షసుడు తన తోకను వేగముగా త్రిప్పుచు దేనికొరకో వెతుకుచున్నట్లు గా తనమెడను పదేపదే వెనకకు ముందుకు త్రిప్పుచు, ఏదో ఒక అవకాశముకొఱకు ఎదురుచూచుచున్నదా అనునట్లు ఉండుట చూచితివి. నీవు తక్షణమే గోవత్సరూపమున ఉన్న ఆ రాక్షసుని వెనుక కాళ్ళను పట్టుకొని గిరగిరా వేగముగా త్రిప్పుచు - అచ్చటనే ఉన్న ఒక మహావృక్షము పైకి విసరివేసితివి. అంతటితో ఆ రాక్షసుడు విగతజీవుడై పడిపోయెను.

50-5
నిపతతి మహాదైత్యే జాత్యా దురాత్మని తత్ క్షణం
నిపతనజవక్షుణ్ణక్షోణీరుహక్షతకాననే
దివి పరిమిలద్బృందారకాః కుసుమోత్కరైః।
శిరసి భవతో హర్షాత్ వర్షంతి నామ తదా హరే॥
5వ భావము:-
ఆ రాక్షసుడు - వత్సాసురుడు - జన్మతః క్రూరుడు; బలవంతుడు. అతడు వృక్షములపై బలముగా పడుటచే అతని బలమునకు మరెన్నెన్నో వృక్షముల కొమ్మలు విరిగిపడి ఆ అరణ్యము కొంతమేర ఛిద్రమయ్యెను. వత్సాసురుడు అట్లు మరణించగా - ఆకాశమునుండి దేవతాసమూహము, శ్రీహరీ! నీ శిరమున ఆనందముతో పుష్పవర్షము కురిపించిరి.

50-6
సురభిలతమామూర్ధన్యూర్ధ్వం కుతః కుసుమావలీ
నిపతతి తవేత్యుక్తో బాలైః సహేలముదైరయః।
ఝటితి దనుజక్షేపేణోర్ధ్వం గతస్తరుమండలాత్
కుసుమనికరః సో౾యం నూనం సమేతి శనైరితి॥
6వ భావము:-
ప్రభూ! అట్లు పూలవాన కురియుటచూచిన గోపాలకులు, "సువాసన భరితమయిన పుష్పములు నీ తలపై కురియుటకు కారణమేమి?" అని అడుగగా, నీవు వినోదముగా - "ఆ రాక్షసుని పైకి విసిరి వేయగా ఆ రాక్షసుడు వృక్షములపై పడెను. ఆ ధాటికి వికసించుచున్న పుష్పములు పైకి ఎగజిమ్మి నిదానముగా క్రిందపడుచున్నవి", అని పలికితివి.

50-7
క్వచన దివసే భూయో భూయస్తరే పరుషాతపే
తపనతనయాపాథః పాతుం గతా భవదాదయః।
చలితగరుతం ప్రేక్షామాసుర్బకం ఖలు విస్మృతం
క్షితిధరగరుచ్ఛేదే కైలాసశైలమివాపరమ్॥
7 వ భావము:-
బాలకృష్ణా! వేసవికాలములో, మరియొక దినమున వేడిగాలులు వీచుచుండెను. నీవు నీతోటి బాలురతో కలిసి యమునానదిలో నీరుత్రాగుటకు వెళ్ళితివి. అచ్చట మీకు అతిపెద్ద శరీరము కలిగిన ఒక కొంగ తన విశాలమగు రెక్కలను కదుపుచు కనిపించెను. ఆ తెల్లని కొంగ మరయొక కైలాసపర్వతమా! అనునట్లు ఉండెను; దేవేంద్రుడు రెక్కలను ఛేదించుట మరచి వదలివేసిన పర్వతము వలె ఉండెను.

50-8
పిబతి సలిలం గోపవ్రాతే భవంతమభిద్రుతః
స కిల నిగిలన్నగ్నిప్రఖ్యం పునర్ద్రుతముద్వమన్।
దలయితుమగాత్ త్రోట్యాః కోట్యా తదాశు భవాన్ విభో।
ఖలజనభిదాచుంచుశ్చంచూ ప్రగృహ్య దదారతమ్॥
8 వ భావము:-
నీతోకలిసి అచ్చటకు వచ్చిన గోపబాలకులు ఆ నదిలో నీరు త్రాగుచుండగా, ఆ బకము (కొంగ) నీ వద్దకువచ్చి నిన్ను మ్రింగివేయుటకు ప్రయత్నించెను. ప్రభూ! నిన్ను నోటితో పట్టుకొనగనే, అగ్నిగోళముగా నీవు ఆ బకమునకు అనిపించితివి. తక్షణమే ఆ బకము నిన్ను వదిలివేసెను. ఆ బకము మరల నిన్ను వాడియైన తనముక్కుతో పట్టుకొని చీల్చివేయుటకు ప్రయత్నించెను. దుష్టజనులను చీల్చివేయుటలో ప్రవీణుడవగు ప్రభూ! నీవు, అంతట, ఆ బకముయొక్క రెండు ముక్కుడిప్పలను పట్టుకొని (ఆ బకాసుర రాక్షసుని) చీల్చివేసితివి.

50-9
సపది సహజాం సందృష్టుం వా మృతాం ఖలు పూతనామ్
అనుజమఘమప్యగ్రే గత్వా ప్రతీక్షితుమేవ వా।
శమననిలయం యాతే తస్మిన్ బకే సుమనోగణే
కిరతి సుమనోబృందం బృందావనాత్ గృహమైయథాః॥
9వ భావము:-
ఆ బకాసురుడు తనకంటె ముందుగా మరణించిన తన సోదరి, పూతనను కలియుటకో లేదా తను మరణించిన అనంతరము మరణించబోవు తన సోదరుడగు ఆఘాసురుని కొఱకు వేచియుండుటకో! అనునట్లు తక్షణమే యమలోకమునకు పోయెను. బకాసుర వధ జరుగగనే దేవతలు నీపై పుష్పరాసులు కురిపించుచుండగా, ప్రభూ! నీవు బృందావనమునుండి నీ గృహమునకేగితివి.

50-10
లలిత మురళీ నాదం దురాన్నిశమ్య వధూ జనైః
త్వరితముపగమ్యారాదారూఢమోదముదీక్షితః।
జనితజననీ నందా నందః సమీరణ మందిర-
ప్రథిత వసతే। శౌరే। దూరీకురుష్వ మమామయాన్॥
10వ భావము:-
ప్రభూ! శౌరీ! నీవు గృహమునకు వచ్చుచుండగా, దూరమునుండి వినవచ్చుచున్న నీ మృదుమధుర వేణుగానము విని, గోపికలు, వేగముగా నీగృహమును చేరి అత్యంత ఆనందమును పొందిరి. నిన్ను చూచిన నీ తల్లిదండ్రులు ఆనందభరితులయ్యిరి. గురవాయూరు పుర మందిరమున కొలవైయుండిన హరీ! రోగములనుండి నన్ను దూరము చేయుము.

దశమ స్కంధము
50వ దశకము సమాప్తము.
-x-