Jump to content

నారాయణీయము/దశమ స్కంధము/49వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

49వ దశకము - బృందావనవిహారము


49-1
భవత్ప్రభావావిదురా హి గోపాస్తరుప్రపాతాదికమత్ర గోష్ఠే।
ఆహేతుముత్పాతగణం విశంక్య ప్రయాతుమన్యత్ర మనో వితేనుః॥
1వ భావము: -
భగవాన్! అకారణముగా చెట్లువిరిగిపోవుట -మొదలగు ఉత్పాతములు అరిష్ట ములను సూచించుచున్నవని వ్రేపల్లె లోని గోపాలురు శంకించిరి. నీ మహిమ తెలియని ఆ ప్రజలు ఆప్రదేశమును (వ్రజమును) విడిచి వెళ్ళుట క్షేమకరమని భావించిరి.

49-2
తత్రోపనందాభిధగోపవర్యో జగౌ భవత్ప్రేరణయైవ నూనమ్।
ఇతః ప్రతీచ్యామ్ విపినం మనోజ్ఞం బృందావనం నామవిరాజతీతి॥
2వ భావము: -
గోకులములోని ముఖ్యులలో ఉపనందుడు అను ఒక వృద్ధుడు కలడు. భగవాన్! నీ ప్రేరణ చేతనే ఆ వృద్ధుడు - అచ్చటకు పశ్చిమమున "బృందావనము" అను రమణీయమగు ప్రదేశము కలదు అని - ఆ గోకులవాసులకు చెప్పెను.

49-3
బృహద్వనం తత్ఖలు నందముఖ్యాః విధాయ గౌష్ఠీనమథ క్షణేన।
త్వదన్వితత్వజ్జననీనివిష్టగరిష్ఠయానానుగతా విచేలుః॥
3వ భావము: -
భగవాన్! అంతట, ఆ గోకులము అంతయూ - నీవు, నీ తల్లి యశోద కూర్చొనియున్న బండిని అనుసరించుచు ఆ స్థలమును (గోకులమును) వీడి బృందావనమునకు పయనమయి వెళ్ళిరి. నందుడు మొదలగువారు శీఘ్రముగా ఆ వనమునకు వెళ్ళి - గోవులకు మరియు గోకులవాసులకు ఆ వనమును వాసయోగ్యము చేసిరి.

49-4
అనోమనోజ్ఞధ్వనిధేనుపాలీఖురప్రణాదాంతరతో వధూభిః।
భవద్వినోదాలపితాక్షరాణి ప్రపీయ నాజ్ఞాయత మార్గదైర్ఘ్యమ్॥
4వ భావము: -
ఆ ప్రయాణములో - శకటములు ముందుకు పోవుచున్నప్పుడు వినవచ్చుచున్న శబ్ధము - గోవుల మందల కాలిగిట్టల ధ్వనితో కలిసి - మనోహరముగా వినిపించుచుండెను. గోపకాంతలు - నీ లీలలను వినోదముగా చెప్పుకొనుచు, దానిలోని మాధుర్యమును ఆస్వాదించుచు మార్గాయాసము తెలియకుండా పయనించిరి.

49-5
నిరీక్ష్య బృందావనమీశ।నందత్ ప్రసూనకుందప్రముఖద్రుమౌఘమ్।
అమోదథాః శాద్వలసాంద్రలక్ష్మ్యా హరిన్మణీకుట్టిమపుష్టశోభమ్॥
5వ భావము: -
ప్రభూ! బృందావనమును చేరి - అచ్చట నీవు వికసించుచున్న పుష్పములతో కూడిన పలు పూలతీగలను, వృక్షములను, ఆ వృక్షములకు చుట్టుకొని ఉన్న కుంద తీగలను (బొడ్డుమల్లె పూతీగలను) చూచితివి; దట్టముగా పరచుకొనిన లేత పచ్చని పచ్చిక బయళ్ళతో ఆ ప్రదేశము పచ్చని మణులు పొదిగిన భూమియా! అనునట్లు విలసిల్లుచుండెను.

49-6
నవాకనిర్వ్యూఢ నివాసభేదేష్వశేషగోపేషు సుఖాసితేషు।
వనశ్రియం గోపకిశోరపాలీవిమిశ్రితః పర్యవలోకథాస్త్వమ్॥
6వ భావము: -
బృందావనమను పేరుగల ఆ ప్రదేశమున - గోపాలురు - పలురకముల గృహములను ఏర్పరుచుకొని నివసించసాగిరి. ప్రభూ! నీవు ఆ బృందావన శోభను ఆస్వాదించుచు ఆ గోపబాలురతో కలిసి ఆనందముగా విహరించుచుంటివి.

49-7
అరాళమార్గాగతనిర్మలాపాం మరాలకూజాకృతనర్మలాపామ్।
నిరంతరస్మేరసరోజవక్త్రాం కళిందకన్యాం సమలోకయస్త్వమ్॥
7వ భావము: -
ప్రభూ! ఆ బృందావనమునకు సమీపమున వంపులుతిరుగచూ నిర్మలముగా ప్రవహించుచున్నట్టి యమునానదిని - నీవు చూచితివి. ఆ నదీప్రవాహములో విహరించు హంసలు చేయు శబ్దములు యమనానది చేయుచున్న హర్షధ్వనివలె వినిపించుచుండెను. ఆ నదిలో విచ్చుకొని ఉన్న పద్మములు ఆ కళిందకన్య (యమున) మధుర ధరహాసమా! అనునట్లు శోభిల్లుచుండెను.

49-8
మయూరకేకాశతలోభనీయం మయూఖమాలాశబలం మణీనామ్।
విరించలోకస్పృశముచ్చశృంగైర్గిరిం చ గోవర్ధనమైక్షథాస్త్వమ్॥
8వ భావము: -
భగవాన్! నీవు బృందావనమునకు అతిసమీపమున – బ్రహ్మలోకమును తాకుచున్నట్లున్న - ఉన్నత శిఖరములతోగల గోవర్ధనపర్వతమును చూచితివి. ఆ పర్వతములో ఉన్న మయూరములుచేయు ధ్వనులు (వేయు కేకలు) ఆసక్తికరముగా వినిపించుచుండెను. అందలి మణులు తమ కాంతులతో ఆగోవర్ధనగిరిని ప్రకాశవంతము చేయుచుండెను.

49-9
సమం తతో గోపకుమారకైస్త్వం సమంతతో యత్ర వనాంతమాగాః।
తతస్తతస్తాం కుటిలామపశ్యః కళిందజాం రాగవతీమివైకామ్॥
9వ భావము: -
ప్రభూ! వంపులుతిరుగుచూ ప్రవహించుచున్న ఆ యమునానది - గోపబాలురతోకలిసి నీవు బృందావనములో ఎచ్చటకు వెళ్ళినను - ఆ కళిందకన్య, అనురాగముతో మీ వెను వెంటనే వచ్చుచున్నదా అనునట్లు ప్రవహించుచూ కనిపించుచుండెను.

49-10
తథావిధే౾స్మిన్ విపినే పశవ్యే సముత్సుకో వత్సగణప్రచారే।
చరన్ సరామో౾థ కుమారకైస్త్వం సమీరగేహాధిప పాహి రోగాత్॥
10వ భావము: -
భగవాన్! గోవులకు అనుకూలముగాఉన్న ఆ బృందావనములో, బలరాముడు మరియు ఇతర గోపబాలకులతో కలిసి నీవు గోవత్సములను మేపుచూ ఉత్సాహముగా విహరించసాగితివి. అట్టి గురవాయూరుపురనాధా! రోగమునుండి నన్ను రక్షింపుము.

దశమ స్కంధము
49వ దశకము సమాప్తము.
-x-