నారాయణీయము/దశమ స్కంధము/45వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

45వ దశకము - గోపికల ఆనందహేల శ్రీకృష్ణునిబాల్యక్రీడలు


45-1
అయి। సబలమురారే। పాణిజానుప్రచారైః
కిమపి భవనభాగాన్ భూషయంతౌ భవంతౌ।
చలితచరణకంజౌ మంజుమంజీరశింజా-
శ్రవణకుతకభాజౌ చేరతుశ్చారువేగాత్॥
1వ భావము:-
మురారీ! నీవూ నీ అన్న బలరాముడు - మీ మోకాళ్ళతో - చేతులతో ప్రాకుట ప్రారంభించిరి; ప్రాకుచూ నందుని గృహమంతటనూ ప్రకాశవంతము చేయుచుండిరి. పద్మముల వంటి మీ చిరు పాదములకు అందెలు కట్టిరి. ఆ అందెల సందడికి ఆకర్షితులై - మీరు ఇంకనూ వేగముగా తిరుగసాగిరి.

45-2
మృదు మృదు విహసంతావున్మిషద్దంతవంతౌ
వదనపతితకేశౌ దృశ్యపాదాబ్జదేశౌ।
భుజగలితకరాంతవ్యాలగత్కంకణాంకౌ
మతిమహరతముచ్చైః పశ్యతాం విశ్వనౄణామ్॥
2వ భావము:-
చిరునవ్వులు చిందించుచు మీరట్లు వేగముగా తిరుగుచుండగా మీమోమున ముంగురులు పడి సోయగముగా కదలాడుచుండెను; అప్పుడే వచ్చుచున్న మీ దంతములు తళుక్కున మెరయుచుండెను; మీ చేతులకు అలంకరించిన మురుగులు పైకి పోవుచు ముంజేతుల వరకు జారిపడుచు చూడముచ్చటగానుండెను. ప్రభూ! ఆ మీ సుందర బాల్య రూపము - గోకులవాసులకేకాక సకలజగత్తునకు సమ్మోహితము.

45-3
అనుసరతి జనౌఘే కౌతుకవ్యాకులాక్షే
కిమపి కృతనినాదం వ్యాహసంతౌ ద్రవంతౌ।
వలితవదనపద్మం పృష్ఠతో దత్తదృష్టీ
కిమివ న విదధాథే కౌతుకం వాసుదేవ।
3వ భావము:-
వాసుదేవా! నీవు నీ సోదరుడు బలరామునితో కలిసి చేయు బాల్యచేష్టలను - ఆ గోపజనులు ఆసక్తిగా గమనించుచు, ఆనందించుచూ, మీ వెంటపడి వచ్చుచుండెడివారు. వారట్లు వచ్చుచుండగా - మీరు ఇంకనూ వేగముగా ప్రాకుచూ - నోటితో వింతవింత శబ్ధములు చేయుచు - నవ్వుచూ - మీ ముఖములను వెనకకు త్రిప్పి వారిని చూచుచు- ఆ గోపజనులకు మిక్కిలి వేడుక కలిగించుచుండిరి.

45-4
దృతగతిషు పతంతావుత్థితౌ లిప్కపంకౌ
దివి మునిభిరపంకైః సస్మితం వంద్యమానౌ।
ద్రుతమథ జననీభ్యాం సానుకంపం గృహీతౌ
ముహురపి పరిరబ్ధౌ ద్రాగ్యువాం చుంబితౌ చ॥
4వ భావము:-
వాసుదేవా! మీరు వేగముగా అట్లు ప్రాకుచూ - నడుచుటకు ప్రయత్నించుచూ ఒకొక్కప్పుడు నేలపై పడిపోవుచుండిరి. అప్పుడు, శరీరములకు దుమ్ము,ధూళి అంటుకొనిన మీరూపములను చూచి- దేవతలు మరియు పాపపంకిలమే లేని మునులు నవ్వుచూ మీకు నమస్కరించుచుండిరి. మీరు పడిపోవుట చూచిన మీ తల్లులు ఆతృతతో బిరబిరావచ్చి మిమ్ములను ఎత్తుకొని కౌగలించుకొని ముద్దాడుచుండిరి.


45-5
 స్నుతకుచభరమంకే ధారయంతీ భవంతం
తరలమతి యశోదా స్తన్యదా ధన్యధన్యా।
కపటపశుప।మధ్యే ముగ్దహాసాంకురం తే
దశనముకుళహృద్యం వీక్ష్య వక్త్రం జహర్ష॥
5వ భావము:-
దేవదేవా! యశోదాదేవి నిన్ను చూచినప్పుడు ఆమెకు చిరునవ్వులొలకించు నీ ముగ్ధమనోహర రూపమే కనిపించుచుండెను. ఆ నీ రూపమును చూడగనే పుత్రవాత్సల్యము ఉప్పొంగి ఆమెస్థనములు పాలతో నిండి పోవుచుండెను. నిన్ను ఒడిలోనికి తీసుకొని పాలు కుడిపించు ఆ యశోద, ప్రభూ! ఎంతటి భాగ్యశాలియో కదా! పాలు తాగుటకు విచ్చిన నీ నోరు (విచ్చిన) పువ్వువలెను నోటిలోని దంతములు తెల్లని మొగ్గలవలెను కనిపించుచుండెను.


45-6
తదనుచరణచారీ దారకైస్సాకమారాత్
నిలయతతిషు ఖేలన్ బాలచాపల్యశాలీ।
భవనశుకబిడాలాన్ వత్సకాంశ్చానుధావన్
కథమపి కృతహాసైర్గోపకైర్వారితో౾ భూః ॥
6వ భావము:-
వాసుదేవా! మరికొంత కాలమునకు నీవు అడగులు వేయుచు నడుచుట మొదలుపెట్టితివి; తోటిపిల్లలతో కలిసి ఆటలు ఆడుచు ఇతరుల గృహములకు వెళ్ళసాగితివి; వెళ్ళి- పసితనపు చంచల స్వభావముతో అచట ఉండు పెంపుడు చిలుకలు, లేగదూడలు, పిల్లులు మొదలగు వాటి వెంట పరిగెత్తుచుంటివి. అది చూచిన గోపాలురు నవ్వుచూ - వలదని నిన్ను వారించుచుండిరి.


45-7
హలధరసహితస్త్వం యత్ర యత్రోపయాతో
వివశపతితనేత్రాస్తత్ర తత్త్రైవ గోప్యః।
విగలితగృహకృత్యా విస్మృతాపత్యభృత్యాః
మురహర। ముహురత్యంతాకులా నిత్యమాసన్॥
7వ భావము:-
మురహరా! నీవు - బలరామునితో కలిసి ఎక్కడకు వెళ్ళినను అక్కడ - గోపికలు నీయందు అనురక్తులై నీ దరికే చేరుచుండిరి; గృహకృత్యములను, పనివారినీ, తమ పిల్లలను సహితము మరిచి, ప్రభూ! ఆ గోపికలు తన్మయులై దృష్టినంతనూ నీపైననే నిలిపి నిన్నే చూచుచుండిరి. ఏమి విచిత్రమో ఇది ! ప్రభూ! ఇది పదేపదే జరుగుచుండెను.

45-8
ప్రతినవనవనీతం గోపికాదత్తమిచ్చన్
కలపదముపగాయన్ కోమలం క్వాపి నృత్యన్
సదయయువతిలోకైరర్పితం సర్పిరశ్నన్
క్వచన నవవిపక్వం దుగ్ధమప్యాపిబస్త్వమ్॥
8వ భావము:-
కృష్ణా! గోకులములో గోపకాంతలు పెరుగు చిలికి వెన్నచేయుట చూచి నీవు ఆ వెన్నకొఱకు పాటలు పాడుచు -నృత్యము చేయుచు - వారిని అలరించుచుంటివి. వారిలో కొందరు నీకు వెన్న ఇచ్చుచుండగా కొందరు కాచిన నేయి ఇచ్చుచుండిరి. మరికొందరు అప్పుడే కాచిన పాలను ఇచ్చుచుండిరి. వాటిని నీవు ప్రీతిగా స్వీకరించు చుంటివి.


45-9
మమ ఖలు బలిగేహే యాచనం జాతమాస్తామ్
ఇహ పునరబలానామగ్రతో నైవ కుర్వే।
ఇతి విహితమతిః కిం దేవ। సంత్యజ్య యాచ్ఞాం
దధిఘృతమహరస్త్వం చారుణా చోరణేన॥
9 వ భావము:-
ప్రభూ! ఒకమారు ( పూర్వావతారము బలిచక్రవర్తి గృహమునకు వెళ్ళి యాచించునప్పడు - గౌరవ భంగము కలిగినది - అని తలచితివో ఏమో! - నీవు ఆ గొల్లభామలను- వెన్న, పాలు, పెరుగు, నేయి అడుగుటమాని వేసితివి; స్వయముగా నీవే (వారికి చెప్పకనే) స్వీకరించుట ప్రారంభించితివి.

45-10
తవ దధిఘృతమోషే ఘోషయోషాజనానామ్
అభజత హృది రోషో నావకాశం న శోకః।
హృదయమపి ముషిత్వా హర్షసింధౌ న్యధాస్త్వం
స మమ శమయ రోగాన్ వాతగేహాధినాథ।
10వ భావము:-
కృష్ణా! నీవే గోకులములో ఆ గోపకాంతల గృహములనుండి పాలు, పెరుగు, వెన్న - తస్కరించుచుంటివని తెలిసినను - ఆ గోపకాంతలకు కోపము గాని, శోకము కాని కలుగలేదు. పాలు, నేయి. పెరుగులనే కాక ప్రభూ! నీవు వారిహృదయములను సహితము తస్కరించితివి; వారి హృదయములను ఆనందసాగరమున ముంచితివి. అట్టి గురవాయూరుపురవాసా! నా రోగమును హరించుము. నన్ను రక్షింపుము.


దశమ స్కంధము
45వ దశకము సమాప్తము.
-x-