నారాయణీయము/దశమ స్కంధము/44వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

44వ దశకము - శ్రీకృష్ణునకు జాతకర్మాది సంస్కారములు


44-1
గూఢంవసుదేవగిరా కర్తుం తే నిష్క్రియస్య సంస్కారాన్।
హృద్గతహోరాతత్త్వో గర్గమునిస్త్వద్గృహం విభో। గతవాన్॥
1వ భావము:-
ప్రభూ! గోకులములో నందుని గృహమున పసిబాలుని రూపమున ఉన్న నీకు - భవిష్యత్తులో రాబోవు అరిష్టములనుండి నిన్ను కాపాడకొనవలెనని, వసుదేవుడు రహస్యముగా జ్యోతిష్యశాస్త్రములో నిష్ణాతుడగు 'గర్గమునిని' కలిసెను; నీకు (జన్మ-నామ) సంస్కార కర్మలు చేయమని వేడుకొనెను. భగవాన్! నీవు బంధములు లేనివాడవు. కర్మఫలములకు అతీతుడవు. నీకు సంస్కారము అవసరము లేదు. అయిననూ (భూ) లోక సంప్రదాయము ననుసరించి - నీకు సంస్కారము జరిపించుటకై 'గర్గముని' నందుని ఇంటికి వెళ్ళెను.

44-2
నందో౾థ నందితాత్మా వృందిష్టం మానయన్నముం యమినామ్।
మందస్మితార్ధ్రమూచే త్వత్సంస్కారాన్ విధాతుముత్సుకథీః॥
2వ భావము:-
తనగృహమునకు వచ్చిన ఆ గర్గమునిని చూచి నందుడు మిక్కిలి ఆనందించెను. మునిశ్రేష్టుడగు ఆ 'మునిని', నందుడు తగు రీతిని గౌరవించెను. వినమ్రుడై మందహాసముతో, ప్రభూ! నీకు తగిన సంస్కారములను జరిపించమని ఆ నందుడు తన అభీష్టమును తెలిపి ఆ గర్గమునిని అభ్యర్ధించెను.

44-3
యదువంశాచార్యత్వాత్ సునిభృతమిదమార్య। కార్యమితి కథయన్।
గర్గో నిర్గతపులకశ్చక్రే తవ సాగ్రజస్య నామాని॥
3వ భావము:-
నందుని అభ్యర్ధనను స్వీకరించి - గర్గముని నందునితో - గౌరవము ఉట్టిపడునట్లుగా ఇట్లు పలికెను. "అయ్యా ! నేను మీ యదువంశ పురోహితుడను. ఈ బాలుని సంస్కార కర్మలు జరిపించుట నావిధి. కాని దానిని గోప్యముగా నిర్వర్తించవలెను", అని పలికి, ప్రభూ! ఆ గర్గముని తన శరీరము పులకించుచుండగా నీకును ,నీ సోదరునకును నామకరణసంస్కారము గావించి - మీకు నామకరణము చేయదలచెను.

44-4
కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనంతనామ్నో వా।
ఇతి నూనం గర్గమునిశ్చక్రే తవ నామనామ రహసివిభో।
4వ భావము:-
విభూ! 'నీకు నామము నిర్ణయించుట ఎట్లు? సహస్రనామములు - అంతకంటెను అధికమగు అనంత నామములు కలవాడవు నీవు! అట్టి నీకు నామము ఏర్పరుచుట సులభసాధ్యముకాదు'; అని భావించి గర్గముని నీ నామకరణ సంస్కారము రహస్యముగా జరపవలెనని నిశ్చయించియుండవచ్చును.

44-5
కృషి ధాతుణకారాభ్యాం సత్తానందాత్మతాం కిలాభిలపత్।
జగదఘకర్షిత్వం వా కథయదృషిః కృష్ణ నామ తే వ్యతనోత్॥
5వ భావము:-
ప్రభూ! గర్గముని నీకు " కృష్ణ" నామమును నిర్ణయించెను. 'కృష్' అను ధాతువుకు 'ణ' ప్రత్యయము చేరుటవలన "కృష్ణ"అయ్యెను. సచ్చిదానందరూప మనియు, జగత్తులో జీవులుచేయు పాపములను హరించువాడనియు అర్ధము వచ్చు ఈ 'కృష్ణనామమును' గర్గముని నీకు నిర్ధారించెను.

44-6
అన్యాంశ్చ నామభేదాన్ వ్యాకుర్వన్నగ్రజే చ రామాదీన్।
అతిమానుషానుభావం న్యగదత్ త్వామప్రకాశయన్ పిత్రే॥
6వ భావము:-
భగవాన్! గర్గముని నీకు "కృష్ణా" అను నామమేకాక, ఇతరనామములను కూడా తెలిపెను. నీ సోదరునికి "బలరామ" అను నామమును నిర్ధారించెను. ఆ గర్గముని నీ తండ్రి నందునికి నీవు మానవాతీతుడవనియు, మహిమాన్వితుడవనియు మరియు శక్తివంతుడవనియు తెలుపుచూ ప్రభూ! నీవు "భగవంతుడవని' నందునికి తెలుపకయే తెలిపెను.

44-7
స్నిహ్యతి యస్తవ పుత్రే ముహ్యతి స న మాయికైః పునశ్శోకైః।
ద్రుహ్యతి య స్స తు నశ్యేదిత్యవదత్తే మహత్వమృషివర్యః॥
7వ భావము:-
"నీ కుమారునితో మిత్రుత్వము కలిగి యుండువారు మాయాతీతులై మాయవలన కలుగు క్లేశమునకు దూరమగుదురు. శతృత్వము వహించువారు నాశనము పొందుదురు". అని గర్గముని నీ మహిమాన్విత మహత్యమును నందునికి తెలిపెను.

44-8
జేష్యతి బహుతర దైత్యాన్ నేష్యతి నిజబంధులోకమమలపదమ్।
శ్రోష్యతి సువిమలకీర్తీరస్యేతి భవద్విభూతిమృషిరూచే॥
8వ భావము:-
భగవాన్! ఆ గర్గముని నీతండ్రి నందునికి, నీ మహిమలు గురించి ఇంకనూ ఇట్లు చెప్పెను. "ఇతడు అనేకమంది దైత్యులను జయించువాడు. తనను నమ్మినవారిని పుణ్యలోకములకు చేర్చువాడు. నిర్మల కీర్తిని పొందువాడు". అని తెలిపెను. "భవిష్యత్తులో ఇది నీవు వినెదవు" అని గర్గముని (నీ భవిష్యత్ జాతకమును) నీ తండ్రి నందునికి తెలిపెను.

44-9
అమునైవ సర్వదుర్గం తరితాస్థ కృతాస్థమత్ర తిష్ఠధ్వమ్।
హరిరేవేత్యనభిలపన్నిత్యాది త్వామవర్ణయేత్ స మునిః॥
9వ భావము:-
భగవాన్! గర్గముని నీ తండ్రి నందునితో ఇంకనూ ఇట్లనెను. "ఇతని వలన నీ సకల కష్టములు తొలగిపోవును. ఇతనియెడ విశ్వాసము కలిగి యుండుము". అని చెప్పి ప్రభూ! ఆ గర్గముని నీవు "హరియే"! అని సూటిగా చెప్పకయే అన్యాపదేశముగా నందునికి సూచించెను.

44-10
గర్గే౾థ నిర్గతే౾స్మిన్ నందితనందాదినంద్యమానస్త్వమ్।
మద్గదముద్గతకరుణో నిర్గమయ శ్రీమరుత్పురాధీశ॥
10వ భావము:-
గర్గముని నీగురించి అట్లుచెప్పి నిష్క్రమించెను. గర్గముని మాటలను విని నందుడు మొదలగు వారు మిక్కిలి ఆనందించిరి; నీయందు అత్యంత ప్రేమాభిమానములను కలిగి ఉండసాగిరి. అట్టి ఓ! గురవాయూరుపురాధీశా! నాయందు దయచూపుము; నావ్యధలను తొలగించుము, అని నిన్ను నేను ప్రార్ధించుచున్నాను.

దశమ స్కంధము
44వ దశకము సమాప్తము.
-x-