నారాయణీయము/దశమ స్కంధము/46వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

46వ దశకము - గోపికల ఆనందహేల -విశ్వరూపదర్శనము


46-1
అయి।దేవ।పురా కిల త్వయి।స్వయముత్తానశయే స్తనంధయే।
పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్వమచష్ట పల్లవీ॥
1వ భావము:-
ఓ! వాసుదేవా! చాలాకాలము క్రితము నీవు శిశువుగా ఉన్నప్పుడు - ఒకానొక సమయమున నీ తల్లి యశోద ఒడిలో పడుకొని నీవు పాలు త్రావుచుంటివి. మధ్యలో నోరుతెరిచి ఆవులించితివి. అప్పుడు ప్రభూ! ఆ గోపనందుని పత్ని- యశోదకు నీ నోటిలో సమస్త జగత్తు (లీలగా) కనిపించెను.

46-2
పునరప్యథ బాలకైః సమం త్వయి లీలానిరతే జగత్పతే।
ఫలసంచయవంచనక్రుధా తవ మృద్భోజనమూచురర్భకాః॥
2వ భావము:-
జగన్నాధా! మరియొకమారు నీవు నీ తోటిబాలురుతో కలిసి ఆడుచుంటివి. మీరందరునుచేరి కొన్ని పండ్లను సేకరించితిరి. ప్రభూ! అప్పుడు నీవు వారిని మాయచేసి ఆపండ్లనన్నింటినీ నీవే సంగ్రహించితివి. దానితో ఆ బాలురు నీపై కినుక వహించి, నీ తల్లి యశోదకు - మన్నుతింటివి అని - నీపై నేరము చెప్పిరి.

46-3
అయి। తే ప్రళయావధౌ విభోః క్షితితోయాదిసమస్తభక్షిణః।
మృదుపాశనతో రుజా భవేదితి భీతా జననీ చుకోప సా॥
3వ భావము:-
ఓ జగన్నాధా! ప్రళయకాలమున - భూమిని, నీరును, సమస్తజగత్తును భక్షించి - నీవు నీలోనే లయము చేసుకొందువు. విభూ! అట్టి పరమాత్మవు నీవు! అది తెలియని నీ తల్లి యశోద - మన్నుతినినచో నీకు అనారోగ్యము కలుగునని భీతిచెంది నీపై కోపించెను.

46-4
అయి। దుర్వినయాత్మకా। త్వయా కిము మృత్స్నాబత। వత్స।భక్షితా।
తి మాతృగిరం చిరం విభో। వితథాం త్వం ప్రతిజజ్ఞిషే హసన్॥
4వ భావము:-
వాసుదేవా! అప్పుడు నీతల్లి యశోద (కడు ఆతృతతో) - " ఎంతటి అల్లరి వాడవు నీవు! మట్టి తింటివా?" - అని గద్దించి నిన్ను ప్రశ్నించెను. దానికి నీవు నవ్వుచూ, "ఆ బాలురు అసత్యము చెప్పిరి; నేను మన్ను తినలేదు" - అని మరీ మరీ పలికితివి.

46-5
అయి। తే సకలైర్వినిశ్చితే విమతిశ్చేత్ వదనం విదార్యతామ్।
ఇతి మాతృవిభర్త్సితో ముఖం వికసత్పద్మనిభం వ్యదారయః ॥
5వ భావము:-
ఆ బాలురి పలుకులు యదార్ధము ఏమో! అని తలచిన నీ తల్లి యశోద (కోపము నటించుచు) నీతో- "నీ సహచరులు నీవు మన్ను తింటివి అని గట్టిగా చెప్పుచుంటిరి. వారి మాటలు అసత్యములే అయినచో ఏదీ! నీ నోరు తెరిచి నాకు చూపుము? " - అని గద్దించెను. అప్పుడు ప్రభూ! నీవు వికసించిన పద్మము వంటి నీ నోరును తెరిచి నీ తల్లి యశోదకు చూపితివి.

46-6
అపి మృల్లవదర్శనోత్సుకాం జననీం తాం బహు తర్పయన్నివ।
పృథివీం నిఖిలాం న కేవలం భువనాన్యప్యఖిలాన్యదీదృశః॥
6వ భావము:-
వాసుదేవా! నీ తల్లి యశోద నీ నోటిలో మట్టికణములుండునని భావించి - నీ నోటిలోనికి ఆతృతగా చూచెను. కాని, ప్రభూ! ఆమెను తృప్తి పరుచుటకు తెరిచిన నీ నోటిలో - ఆమెకు మన్నుకు బదులు - నీవు భూమినంతటినీ చూపించితివి. అంతియేకాక సకల భువనములతో కూడిన విశ్వమునంతటనూ కూడా ఆమెకు కనబరచితివి.

46-7
కుహచిత్ వనమంబుధిఃక్వచిత్ క్వచిదభ్రం కుహచిద్రసాతలమ్।
మనుజా దనుజాః క్వచిత్ సురా దదృశే కిం న తదా త్వదాననే॥
7వ భావము:-
వాసుదేవా! ఆ విశ్వములో ఆమెకు - ఒకచోట అరణ్యము, మరియెకచోట సముద్రములు; మేఘములు, ఇంకొకచోట రసాతలము, మానవులు, దానవులు, ఇంకనూ దేవతలు - సమస్తము కనిపించెను. ప్రభూ! నీ నోటిలో లేనిది ఏమియును లేదు.

46-8
కలసాంభుధిశాయినం పునః పరవైకుంఠపదాధివాసనమ్।
స్వపురశ్చ నిజార్భకాత్మకం కతిధా త్వాం న దదర్శ సా ముఖే॥
8వ భావము:-
వాసుదేవా! నీవు ఆమెకు క్షీరసముద్రమున (శేషునిపై) శయించిన విష్ణుమూర్తిగా కనిపించితివి. పరలోకమగు నీ వైకుంఠ పధమును ఆమెకు కనిపింపజేసితివి. అప్పుడు నీవు పసిబాలుడవగు తన కుమారునిగనే ఆమెకు కనిపించితివి. ఇట్లు ఎన్నోవిధములుగా ఆ యశోద నిన్ను చూచెను.

46-9
వికసద్భువనే ముఖోదరే నను భూయో౾పి తథావిధాననః।
అనయాస్పుటమీక్షితో భవాననవస్థాం జగతాం బతాతనోత్॥
9వ భావము:-
వాసుదేవా! అట్లు తెరిచిన నీ నోటిలో సకల లోకములే కాక- ఆ నోటిలో- నోటిని తెరిచి చూపుచున్న నీరూపమునుకూడా ఆమెచూచెను. సకల విశ్వమును ఆమె కన్నులకు గోచరింపజేసి - ప్రభూ! ఎల్లెడలా వ్యాపించియున్న- నీ అనంత తత్వమును - నీ తల్లికి ఆవిష్కరించితివి.

46-10
ధృతతత్త్వధియం తదా క్షణం జననీం తాం ప్రణయేన మోహయాన్।
స్తనమంబ దిశేత్యుపాసజన్ భగవన్నద్భుతబాల। పాహిమామ్॥
10వ భావము:-
వాసుదేవా! ఆ క్షణమున ఆమెకు పరతత్వజ్ఞానమును కలిగించితివి. మరుక్షణముననే ఇహలోకమునకు వచ్చునట్లు - ఆమెను నీవు- "అమ్మా! నాకు పాలు కావలెను" - అని అడిగి ఆమెకు నీ పట్ల పుత్రవాత్సల్యమను మోహమును కలిగించితివి. అద్భుతమయిన బాలుని రూపమును ధరించిన భగవాన్! గురవాయూరుపురవాసా ! నన్ను రక్షింపుము.

దశమ స్కంధము
46వ దశకము సమాప్తము.
-x-