Jump to content

నారాయణీయము/దశమ స్కంధము/41వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

41వ దశకము - గోపికల ఆనందహేల


41-1
వ్రజేశ్వరః శౌరివచో నిశమ్య సమావ్రజన్నధ్వని భీతచేతాః।
నిష్పిష్టనిశ్సేషతరుం నిరీక్ష్య కంచిత్ పదార్థం శరణం గతస్త్వామ్॥
1వ భావము:-
వ్రజ (గొల్ల) నాయకుడగు నందుడు మధురనుండి తిరిగివచ్చుచు, మార్గమధ్యమున కూలిన వృక్షములను, మరణించి నేలపైపడియున్న ఒక అస్పష్ట భీకరరూపమును చూచెను. వసుదేవుని హెచ్చరికను వినియుండుటచే మనసున కీడుశంకించి, భీతిచెందినవాడై, అప్పుడు ఆ నందుడు పరమాత్మా! తనపుత్రుని రక్షించమని నిన్ను శరణుకోరెను.

41-2
నిశమ్య గోపీవచనాదుదంతం సర్వే౾పి గోపా భయవిస్మయాంధాః।
త్వత్పాతితం ఘోరపిశాచదేహం దేహుర్విదూరే౾థ కుఠారకృత్తమ్॥
2వ భావము:-
భయమును, విస్మయమును కలిగించు పూతన ఉదంతమునంతను - గోపికలు, గోపాలురు - నందునకు సవివరముగా తెలిపిరి. అనంతరము నందుని అనుజ్ఞగైకొని ఆ గోపాలురు - ఆ ఘోరపిశాచి పూతన దేహమును గొడ్డళ్ళతో ముక్కలుముక్కలుగా నరికిరి; ఊరికి దూరముగా తీసుకువెళ్ళి కాల్చి వేసిరి.

41-3
త్వత్పీతపూతస్తనతచ్చరీరాత్ సముచ్చలన్నుచ్చతరో హి ధూమః।
శంకామధాదాగరవః కిమేష కిం?చాందనో గౌగ్గులవోఖీథవేతి॥
3వ భావము:-
ప్రభూ! పూతన క్షీరమును నీవు త్రాగుటచే - (పునీతమైన) ఆ పూతన శరీరము దహనమగునపుడు, ఆ కాష్టమునుండి ఎగజిమ్ముచున్న ధూమము( పొగ) సుగంధభరితమయ్యెను. వ్రజములోని ప్రజలు - ఆ వెలువడు సువాసన - అగరుధూపమా! లేక చందనపు చెక్క కాలిన వాసనా! లేక గుగ్గిలపు పొగయా యని ఊహించుకొనసాగిరి.

41-4
మదంగసంగస్య ఫలం న దూరే క్షణేన తావద్బవతామపి స్యాత్।
ఇత్యుల్లపన్ వల్లవతల్లజేభ్యస్త్వం పూతనామాతనుథాః సుగంధిమ్॥
4వ భావము:-
ప్రభూ! నీ స్పర్శవలన కలుగు పుణ్యఫలము ఎంతోకాలము వేచియుండకనే తత్క్షణమే దొరుకునని - అది మీకుకూడా లభించునని ఆ ప్రజలకు తెలియజేయుటకే - పలుకులతో పలుకకనే - ఆ పూతన శరీరమును సుగంధభరితము చేసితివి. (ప్రభూ! అదినీకుకాక వేరెవరికి సాధ్యము!).

41-5
చిత్రం పిశాచ్యా న హతః కుమారశ్చిత్రం పురైవాకథి శౌరిణేదమ్।
ఇతి ప్రశంసన్ కిల గోపలోకో భవన్ముఖాలోకరసే న్యమాంక్షీత్॥
5వ భావము:-
ఆశ్చర్యముగా వసుదేవుడు హెచ్చరించినట్లుగనే ప్రమాదము సంభవించెను! ఇంకనూ ఆశ్చర్యముగా - పూతన రాక్షసి - నందుని కుమారుని హతమార్చ లేదు!" - అని, ప్రభూ! ఆ గోకులవాసులు పదేపదే నిన్ను ప్రశంసించుచూ నీ పసిపాపడి రూపమును మాటిమాటికి చూచుచూ ఆనందసాగరమున మునిగిపోయిరి.

41-6
దినే దినే౾ థ ప్రతివృద్థలక్ష్మీరక్షీణ మాంగళ్య శతో వ్రజో౾యమ్।
భవన్నివాసాదయి వాసుదేవ।ప్రమోదసాంద్రః పరితో విరేజే॥
6వ భావము:-
వాసుదేవా! ఆ గోకులము నీ నివాసమగుటచే - లక్ష్మీదేవి అనుగ్రహముతో ఆ పల్లె దినదినప్రవర్ధమానముగా వెలుగొందుచుండెను. శుభములచ్చట అక్షయమయ్యెను. వేరేల? ఆ గోకులమంతటను ఆనందము వెల్లివిరిసి తాండవించుచుండెను.

41-7
గృహేషు తే కోమలరూపహాసమిథః కథాసంకులితాః కమన్యః।
వృత్తేషు కృత్యేషు భవన్నిరీక్షాసమాగతాః ప్రత్యహమత్యనందన్॥
7వ భావము:-
ప్రభూ! గోకులమున గోపకాంతలు - తమతమ దినకృత్యములందు నిమగ్నులయి నిర్వర్తించుచూ కూడా, వాసుదేవా! చిరునవ్వులొలకించు నీ కోమల రూపమును పదేపదే తలచుకొనుచూ ఒకరికొకరు చెప్పుకొనుచుండిరి. తమ తమ పనులను త్వరితగతిని ముగించుకొని నీ వద్దకు చేరి - నిన్ను చూచుచు ఆనందించుచుండిరి.

41-8
అహో। కుమారో మయి దత్తదృష్టిః స్మితం కృతం మాం ప్రతి వత్సకేన।
ఏహ్యేహి మామిత్యుపసార్య పాణిం త్వయీశ। కిం కిం న కృతం వధూభిః॥
8వ భావము:-
"ఆహా! ఆ బాలుడు నన్ను చూచెను! నన్ను చూచి నవ్వెను!" - అని ఒకరితోనొకరు చెప్పుకొనుచు ఆ గోకుల కాంతలు ఆనందించుచుండిరి. వారు తమ హస్తములను నీవైపుకు చాచి - "రా! రా!" రమ్మని నిన్ను పిలచుచు, పసివాడివైన నిన్ను లాలించుటకు ప్రభూ! ఆ గోకులస్త్రీలు చేయని కార్యమేదియు లేదు గదా!

41-9
భవద్వపుఃస్పర్శనకౌతుకేన కరాత్ కరం గోపవధూజనేన।
నీతస్త్వమాతామ్రసరోజమాలావ్యాలంబిలోలంబతులామలాసీః॥
9వ భావము:-
వాసుదేవా! పసిబాలుని రూపముననున్న - నీ దేహమును తమహస్తములతో స్ప్రుశించుచు - ఆ గోపకాంతలు ఎవరికి వారే నిన్ను ఎత్తుకొని లాలింపవలెనని - ఒకరి హస్తములనుండి మరియొకరు ఆతృతతో అందుకొనుటలో ఉద్యుక్తులయిరి. ప్రభూ! అప్పుడు నీవు - ఎఱ్ఱని పద్మముల హారములో తేనిటీగ - ఒకపద్మమునుండి మరియొక పద్మమునకు కదులుచున్నదా! అను నట్లు మెరిసితివి.

41-10
నిపాయయంతీ స్తనమంకగం త్వాం విలోకయంతీ వదనం హసంతీ।
దశాం యశోదా కతమాం న భేజే స తాదృశః పాహిహరే గదాన్మామ్॥
10 వ భావము:-
పసిబాలుని రూపమున యశోద ఒడిలో ఉన్న ఓ! శ్రీహరీ! నీకు పాలు కుడిపించుచూ - చిరునవ్వుతో కూడిన నీ ముఖమును పదేపదే చూచుచూ ఆ యశోదాదేవి తన్మయత్వముతో ఎనలేని ఆనందమును పొందెను. అటువంటి కటాక్షమును ప్రభూ! నాపైకూడా నీవు ప్రసరింపజేయుము; నా వ్యాధినుండి నన్ను రక్షింపుము.

దశమ స్కంధము
41వ దశకము సమాప్తము.
-x-