Jump to content

నారాయణీయము/దశమ స్కంధము/40వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

40వ దశకము - పూతన వధ


40-1
తదను నందమమందశుభాస్పదం నృపపురీం కరదానకృతే గతమ్।
సమవలోక్య జగాద భవత్పితా విదితకంససహాయజనోద్యమః॥
1వ భావము:-
భగవాన్! నీవు జన్మించిన తదనంతరము, ఒకానొకనాడు సకలశుభప్రదానుడగు నందుడు రాజు అగు కంసునికి కప్పము చెల్లించుటకై రాజధానియగు మధురానగరికి వెళ్ళెను. అచ్చట నందుడు - నీ జనకుడగు వసుదేవునిని కలిసెను. కంసుని అనుచరులు చేయుచున్న దురాగతములు ఎరిగిన వసుదేవుడు - నందునితో ముందుగా ఇట్లనెను.

40-2
అయి।సఖే। తవ బాలకజన్మ మాం సుఖయ౾ద్య నిజాత్మజజన్మవత్।
ఇతి భవత్పితృతాం వజ్రనాయకే సమధిరోప్య శశంస తమాదరాత్॥
2వ భావము:-
"మిత్రుడా! నీకు పుత్ర జననమయినదని - వినిన నాకు - నాకే పుత్రుడు జన్మించినంత సంతోషము కలుగుచున్నది" - అని, ప్రభూ! వసుదేవుడు - నందుడే నీకు తండ్రి యనునట్లు అతనికి పితృత్వము ఆపాదించి సాదరముగా పలికెను.

40-3
ఇహ చ సంత్యనిమిత్తశతాని తే కటకసీమ్ని తతో లఘు గమ్యతామ్॥
ఇతి చ తద్వచసా వ్రజనాయకో భవదపాయభియా ద్రుతమాయయౌ॥
3వ భావము:-.
భగవాన్! వసుదేవుడు నందునితో ఇంకనూ ఇట్లనెను. "నందా! నీ స్థానమున (గోకులమున) ఉత్పాతములకు (ఆకస్మిక విపత్తులుకు) అవకాశములు హెచ్చుగా నున్నవి; నీవు త్వరగా నీగృహమును చేరుము". ఆమాటలు వినిన నందుడు, ప్రభూ! నీకు కీడు కలుగునేమోనను భయముతో త్వరితగతిని గోకులమునకు పయనమయ్యెను.

40-4
అవసరే ఖిలు తత్ర చ కాచన వ్రజపదే మధురాకృతిరంగనా।
తరల షట్పదలాలితకుంతలా కపట పోతక। తే నికటం గతా॥
4వ భావము:-
సర్వజ్ఞుడవయిననూ పసిబాలుని రూపమున గోకులవాసులను అలరించుచున్న భగవాన్! అదే సమయమున గోకులమునకు ఒక సుందరాంగి యగు స్త్రీ వచ్చెను. ఆమె తన శిరోజములను మనోహరముగా అలంకరించుకొని, మందగమనముతో - భ్రమరము మకరందము కొరకు - పుష్పమును చేరుచున్న విధముగా నీ వద్దకు వచ్చుచుండెను.

40-5
సపది సా హృతబాలకచేతనా నిశిచరాన్వయజా కిల పూతనా।
వ్రజవధూషిహ్వ కేయమితి క్షణం విమృశతీషు భవంతముపాదదే॥
5వ భావము:-
భగవాన్! ఆ సుందరి మరి ఎవరో కాదు! ఆమె శిశుప్రాణములను హరించుటకు కంసునిచే పంపబడిన 'పూతన' అను రాక్షసి! గోపస్త్రీజనులు ఆశ్చర్యముతో "ఈమె ఎవరు!" అని ఆలోచించుకొనుచు యుండగనే, (ఆ దుష్టరాక్షసి) 'పూతన' అతివేగముగా వచ్చి, ప్రభూ! నిన్ను తన చేతులలోనికి తీసుకొని ఎత్తుకొనెను.

40-6
లలితభావవిలాసహృతాత్మభిర్యువతిభిః ప్రతిరోద్దుమపారితా।
స్తనమసౌ భవనాంతనిషేదుషీ ప్రదదుషీ భవతే కపటాత్మనే॥
6వ భావము:-
అన్నియు తెలిసియూ ఏమీ తెలియనట్లు - పసిబాలుని రూపమున అలరారుచున్న ఓ! నారాయణమూర్తీ! సుందరిరూపమున నున్న ఆ ' పూతన' రూపలావణ్యవిలాసములకు ఆ గోపవనితలు అచేతునులై ఆమెను ప్రతఘటించలేకపోయిరి. నందుని గృహమున ప్రవేశించిన పూతన, ప్రభూ! అచ్చటే కూర్చొని తన క్షీరమును నీకు కుడిపించ మొదలిడెను.

40-7
సమధిరుహ్య తదంకమశంకితస్త్వమథ బాలకలోపనరోషితః।
మహదివామ్రఫలం కుచమండలం ప్రతిచుచూషిథ దుర్విషదూషితమ్॥
7వ భావము:-
భగవాన్! నీకు క్షీరమిచ్చునది శిశువులను చంపు 'పూతన' అని నీవు ఎరిగియు ఏమియూ సంశయింపక- నీ రోషమును వెలువరింపకయే ఆమె వడిని చేరితివి; విషపూరితములగు ఆమె కుచమండలములను - మామిడిపండునుండి రసమును గ్రోలిన విధముగా పీల్చుచూ త్రాగనారంభించితివి.

40-8
అసుభిరేవ సమం ధయతి త్వయి స్తనమసౌ స్తనితోపమనిస్స్వనా।
నిరపతద్భయదాయి నిజం వపుః ప్రతిగతా ప్రవిసార్య భుజావుభౌ॥
8వ భావము:-
భగవాన్! నీవు పూతన ఇచ్చు విషపూరిత క్షీరమును త్రాగుచూ - ఆ పూతన ప్రాణములను సైతము హరించివేసితివి. అంతట ఆ పూతన ఉరుముల వంటి పెద్దధ్వని చేయుచు తనభయంకర నిజస్వరూపమును పొంది, చేతులు చాచుకొని నేలపైపడి మరణించినది.

40-9
భయదఘోషణభీషణవిగ్రహశ్రవణదర్శనమోహితవల్లవే।
వ్రజపదే తదురస్థ్సలఖేలనాన్యను భవంతమగృహ్ణత గోపికాః ॥
9వ భావము:-
భగవాన్! పూతనచేసిన భయంకరధ్వనిని విని, ఆమె భీకర రాక్షసస్వరూపమును చూసి గోకులవాసులు భయముతో నిశ్చేష్టితులయిరి. కాని, ప్రభూ! నీవు మాత్రము (చిద్విలాసముగా) ఆ రాక్షసి వక్షస్థలమున ఆడుకొనుచుంటివి. భీతిల్లిన గోపకాంతలు నిన్ను ఎత్తుకొని, శీఘ్రమే అచటనుండి నిన్ను తీసుకొని వెడలిపోయిరి.

40-10
భువనమంగళ। నామభిరేవ తే యువతిభిర్బహుధా కృతరక్షణః ।
త్వమయి వాతనికేతనాథ। మామగదయన్ కురు తావకసేవకమ్॥
10వ భావము:-
భగవాన్! అప్పుడు నీ తల్లి యశోద మరియు ఇతర గోపస్త్రీలు - లోకమున శుభము కలిగించు నీ సకలనామములతో - నీకు 'రక్షను' కట్టిరి. మహిమాన్వితుడవయిన ఓ! గురవాయూరు పురవాసా! నా రోగమును హరించుము. నిన్ను సేవించు భాగ్యమును ప్రసాదించుము.

దశమ స్కంధము
40వ దశకము సమాప్తము.
-x-