నారాయణీయము/దశమ స్కంధము/37వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||

దశమ స్కంధము[మార్చు]

37వ దశకము -శ్రీకృష్ణావతారప్రసంగము

37-1
సాంద్రానందతనో। హరే। నను పురా దైవాసురే సంగరే
త్వత్కృత్తా అపి కర్మ శేషవశతో యే తే న యాతా గతిమ్।
తేషాం భూతల జన్మనాం దితిభువాం భారేణ దురార్దితా
భూమిః ప్రాప విరించమాశ్రితపదం దేవైః పురైవాగతైః
1వ భావము:-
పరమానందస్వరూపా! హరీ! పూర్వము జరిగిన దేవదానవ యుద్ధమున నీవు దానవులను తుదముట్టించితివి. నీ చేతిలో మరణించిననూ - వారికి వారి కర్మఫలశేషముచే ముక్తిలభించలేదు; తిరిగి భూతలమున జన్మించిరి. వారుచేయు దుశ్చేష్టలు భారమగుటచే, భూదేవి బ్రహ్మదేవునితో మొరపెట్టుకొనెను. అదే సమయమున దేవతలుకూడా బ్రహ్మస్థానమునకు వెళ్ళిరి; దానవులుచేయు దురాగాతములను వివరించి ఆ బ్రహ్మదేవునిని శరణువేడిరి.

37-2
హా హా దుర్జన భూరి భారమథితాం పాథోనిధౌ పాతుకామ్
ఏతాం పాలయ హంత మే వివశతాం సంపృచ్ఛ దేవానిమాన్।
ఇత్యాది ప్రచుర ప్రలాప వివశామాలోక్య ధాతా మహీం
దేవానాం వదనాని వీక్ష్య పరితో దధ్యౌ భవంతం హరే।॥
2వ భావము:-
ప్రభూ! హరీ! భూదేవి - బ్రహ్మతో- "దానవులు చేయుచున్న అకృత్యములకు అరాచకము పెరిగి - భారము పెరిగిపోవుచున్నది; ఆ భారమును మోయలేక నేను సముద్రమున మునిగిపోవుచుంటిని. నా ఈ దురవవస్థనుగూర్చి దేవతలనడుగుము", అని దీనముగా పలికెను. దేవతల వదనములను వీక్షించిన బ్రహ్మదేవుడు, ప్రభూ! అప్పుడు తన మనస్సున నిన్ను స్మరించెను.

37-3
ఊచే చాంబుజభూరమూనయి సురాః। సత్యం ధరిత్ర్యావచః
నన్వస్యా భవతాం చ రక్షణవిధౌ దక్షో హి లక్ష్మీపతిః।
సర్వే శర్వపురస్సరా వయమితో గత్వా పయోవారిధిం
నత్వా తం స్తుమహే జవాదితి యయుః సాకం తవాకేతనమ్॥
3వ భావము:-
బ్రహ్మ నిన్ను స్మరించి దేవతలతో ఇట్లనెను. "ఓ! దేవతలారా! ధరిత్రి పలికిన వాక్కులు సత్యము; మిమ్ములను, భూమిని రక్షించగలవాడు - లక్మీపతియగు విష్ణువు ఒక్కడే! మనమందరము శివుని తోడ్కొని పాలకడలి వద్దకు పోయి ఆ విష్ణువును స్తుతించెదము". అట్లు పలికిన బ్రహ్మపలుకులు ఆలకించి, దేవతలు ధరిత్రిని తోడ్కొని నీ స్థలమగు పాలకడలిని చేరిరి.

37-4
తే ముగ్దానిలశాలి దుగ్ధజలధేస్తీరం గతాస్సంగతాః
యావత్ త్వత్పద చింతనైకమనసస్తావత్ స పాథోజభూః।
త్వద్వాచం హృదయే నిశమ్య సకలానానందయన్నూచివాన్
ఆఖ్యాతః పరమాత్మానా స్వయమహం వాక్యం తదాకర్ణ్యతామ్॥
4వ భావము:-
హరీ! క్షీరసాగర తీరమున చల్లని గాలులు ఆహ్లాదకరముగా వీచుచుండెను. భూదేవిని తోడ్కొని ఆ క్షీరసాగరతీరమునకు వచ్చిన దేవతలు మరియు బ్రహ్మ మహేశ్వరులు తమ చిత్తమున నీ పాదపద్మములను నిలుపుకొని నిన్నే స్మరించుచు నిలిచిరి. అప్పుడు బ్రహ్మదేవుని హృదయమున - ప్రభూ! నీ వాక్కు వినబడెను; వారందరికి ఆనందము కలిగించుచు బ్రహ్మ ఇట్లనెను. "స్వయముగా ఆ పరమాత్మయే నాతో పలికిన పలుకులు మీకు తెలిపెదను. వినుడు" పిమ్మట.

37-5
జానే దీనదశామహం దివిషదాం భూమేశ్చ భీమైర్నృపైః
తత్ క్షేపాయ భవామి యాదవకులే సో౾హం సమగ్రాత్మనా।
దేవా వృష్ణికులే భవంతు కలయా దేవాంగనాశ్చావనౌ
మత్సేవార్థమితి త్వదీయవచనం పాథోజభూరూచివాన్॥
5వ భావము:-
హరీ! "క్రూరులగు పరిపాలకులతో భూదేవికిని, దేవతలకును కలుగుచున్న దుస్థితిని నేను గ్రహించితిని. వారి క్షేమమునకై నేను భూమిపై అవతరించెదను; యాదవ కులమున సమస్త శక్తులతో జన్మించెదను. ఆ అవతారమున నాకు సహకరించుటకు (సేవించుటకు), దేవదేవాంగనలు సహితము యాదవ కులమున జన్మింతురు". అని పలికిన నీ పలుకులను బ్రహ్మదేవుడు భూదేవికిని, దేవతలకును తెలిపెను.

37-6
శ్రుత్వా కర్ణరసాయనం తవ వచః సర్వేషు నిర్వాపిత-
స్వాంతేష్వీశ। గతేషు తావక కృపాపీయూష తృప్తాత్మసు।
విఖ్యాతే మధురాపురే కిల భవత్సాన్నిధ్యపుణ్యోత్తరే
ధన్యాం దేవకనందనాముదవహాత్ రాజా స శూరాత్మజః॥
6వ భావము:-
హరీ! దేవతలును భూదేవియూ - మధురమైన ఈ నీ వాక్కులను విని మిక్కిలి ఆనందించిరి. నీ కరుణామృతము వారిని సంతృప్తులను చేసెను. నీ సాన్నిధ్యముతో మిక్కిలి పుణ్యప్రదేశమగు – మధురానగరిలో- శూరసేనుని పుత్రుడు 'వసుదేవుడు’ - దేవకుని పుత్రిక 'దేవకిని' వివాహమాడెను.

37-7
ఉద్వాహవసితౌ తదీయసహజఃకంసో౾థ సమ్మానయన్
ఏతౌ సూతతయా గతః పధిరథే వ్యోమోత్థయా త్వద్గిరా।
అస్యాస్త్వామతిదుష్టమష్టమదిసుతో హంతేతి హంతేరితః
సంత్రాసాత్ స తు హంతుమంతికగతాం తన్వీం కృపాణీమధాత్॥
7వ భావము:-
హరీ! దేవకీ వసుదేవుల వివాహానంతరము - దేవకి సోదరుడగు 'కంసుడు' వారిని సన్మానించి తానే స్వయముగా రథమును నడుపుచూ దేవకీ వసుదేవులను వారి గృహమునకు తోడ్కొని పోవుచుండెను. ప్రభూ! మార్గమధ్యమున ఆ 'కంసునికి' ఆకాశమునుండి ఇట్లు వినిపించెను." ఈమె (దేవకి) ఎనిమిదవ సంతానమగు పుత్రుడు - దుష్టుడవగు నిన్ను వధించును". అది వినిన కంసుడు (క్రోధముతో) ఆకంపితుడై తన సమీపముననే యున్న దేవకిని వధించవలెనని ఖడ్గమును పట్టెను.

37-8
గృహ్ణానశ్చికురేషు తాం ఖలమతిః శౌరేశ్చిరం సాంత్వనైః
నో ముంచన్ పునరాత్మజార్పణగిరా ప్రీతో౾థ యాతో గృహాన్।
ఆద్యం త్వత్సహజం తథార్పితమపి స్నేహేన నాహన్నసా
దుష్టానామపి దేవ। పుష్టకరుణావదుష్టా హి ధీరేకదా॥
8వ భావము:-
హరీ! అంతట దుష్టుడయిన 'కంసుడు' తన సోదరి కేశములను పట్టుకొనెను. వసుదేవుని అనునయ వాక్యములు కఠినాత్ముడైన 'కంసుని' హృదయమును కరిగించలేకపోయెను. వసుదేవు డప్పుడు తమ సంతానమును వానికి ఇచ్చివేసెద నని వాగ్ధానము చేసెను; 'కంసుడు' తృప్తిచెంది దేవకి కేశములను విడిచిపెట్టెను. 'కంసునకు' చేసిన వాగ్ధానము ప్రకారము వసుదేవుడు తమ తొలిసంతానమును 'కంసునకు' అర్పించిననూ 'కంసుడు' ఆ శిశువును వధించలేదు. దేవా! ఒక్కొక్క సమయమున దుష్టులలోకూడా దయ కనిపించును కదా!

37-9
తావత్ త్వన్మనసైవ నారదమునిః ప్రోచే స భోజేశ్వరం
యూయం నన్వసురాః సురాశ్చ యదవో జానాసి కిం న ప్రభో।
మాయావీ స హరిర్ భవద్వధకృతే భావీ సుర ప్రార్థనాత్
ఇత్యాకర్ణ్య యదూనదూధునదసౌ శౌరేశ్చ సూనూనహన్॥
9వ భావము:-
హరీ! అదేసమయమున నీ ప్రేరణచే నారదముని భోజరాజు (కంసుని) వద్దకు వచ్చి "మీరు అసురులు. యాదవులు దేవతలు. ఆ మాయావియైన "శ్రీహరి", వారి ప్రార్ధనతో నిన్ను వధించుటకై జన్మించును" అని చెప్పెను. నారదుని మాటలను వినిన 'కంసుడు' యాదవులనందరినీ తన రాజ్యమునుండి తరిమివేసెను; దేవకీ వసుదేవుల పుత్రులను హతమార్చసాగెను.

37-10
ప్రాప్తే సప్తమగర్బతామహిపతౌ త్వత్ప్రేరణాన్మాయయా
నీతే మాధవ।రోహిణీం త్వమపి భోః। సచ్చిత్సుఖైకాత్మకః।
దేవక్యా జఠరం వివేశిథ విభో। సంస్తూయమానస్సురైః
స త్వం కృష్ణ విధూయ రోగపటలీం భక్తిం పరాం దేహి మే॥
10వ భావము:-
హరీ! దేవకి ఏడవగర్భమున 'ఆదిశేషుడు' ప్రవేశించెను. నీ ప్రేరణచే యోగమాయ ఆ గర్భస్తపిండమును, రోహిణి' గర్భమునకు చేర్చెను. సచ్చిదానందస్వరూపుడవగు నీవు 'దేవకికి' ఎనిమిదవ సంతానముగా ఆమె గర్భమున ప్రవేశించితివి. అది తెలిసి దేవతలు నిన్ను స్తుతించిరి. ప్రభూ! కృష్ణా! నా రోగమును నివారించుము. నీ యందు నాకు ఉత్తమ భక్తిని ప్రసాదించుము అని ప్రార్థించుచున్నాను.

దశమ స్కంధము
37వ దశకము సమాప్తము.
-x-