Jump to content

నారాయణీయము/నవమ స్కంధము/36వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
నవమ స్కంధము

36వ దశకము - పరశురామావతార వర్ణనము

36-1-శ్లో.
అత్రేః పుత్రతయా పురా త్వమనసూయాయాం హి దత్తాభిధో
జాతశ్శిష్యనిబంధతంద్రితమనాః స్వస్థశ్చరన్ కాంతయా।
దృష్టో భక్తతమేన హైహాయమహీపాలేన తస్మై వరాన్
అష్టైశ్వర్యముఖాన్ ప్రదాయ దదిథ స్వేనైవ చాంతే వధమ్॥
1వ భావము:-
నారాయణమూర్తీ! పూర్వము నీవు 'అత్రిమహర్షికి' భార్య 'అనసూయాదేవికి' యందు పుత్రునిగా జన్మించితివి. అప్పుడు నీవు త్రిమూర్త్యాత్మకమైన (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపము) అవతారమవు. దత్తాత్రేయనామమున జన్మించిన యోగీశ్వరుడవు; ఆత్మానందానుభూతిలో నిరంతరము నిమగ్నుడైయుండు జితేంద్రియుడవు; విఘ్నము కలిగించు భక్త శిష్యగణములను దూరముగా నుంచ నెంచి, నీవు పత్నీసమేతుడవై విహరించుచున్నట్లు భ్రమింపజేసితివి. నీ భక్తుడైన, 'హైహేయ' మహారాజగు- 'కార్తవీర్యార్జునునికి' అష్టఐశ్వర్యములను ప్రసాదించుటయేకాక, వానికి మరణము కూడా నీచేతనే కలుగునట్లు అనుగ్రహించితివి.

36-2-శ్లో.
సత్యం కర్తుమథార్జునస్య చ వరం తచ్ఛక్తి మాత్రానతం
బ్రహ్మద్వేషి తదాఖిలం నృపకులం హంతుం చ భూమేర్భరమ్।
సంజాతో జమదగ్నితో భృగుకులే త్వం రేణుకాయాం హరే।
రామో నామ తదాత్మజేష్వవరజః పిత్రోరధాస్సమ్మదమ్॥
2వ భావము:-
హరీ! ఆ కాలమున క్షత్రియులు (రాజ్యపాలకులు) 'బ్రహ్మ' ద్వేషులై ప్రజాకంటకులుగా నుండిరి; వారు (శక్తిమంతుడైన) 'కార్తవీర్యార్జునికి' మాత్రము విధేయులు. భూమికి భారమయిన ఆ క్షత్రియులను శిక్షించుటకు, ప్రభూ! అప్పుడు నీవు 'కార్తవీర్యార్జునునికి' ఇచ్చిన వరము నిజముచేయుటకై 'జమదగ్నిముని-రేణుకలకు' కనిష్ఠ పుత్రుడవై "రామ" నామమున 'పరశురామునిగా' అవతరించితివి, వారికి ఆనందము కలిగించితివి.

36-3-శ్లో.
లబ్ధామ్నాయగణశ్చతుర్ధశవయా గంధర్వరాజే మనాక్
ఆసక్తాం కిల మాతరం ప్రతి పితుః క్రోధాకులస్యాజ్ఞయా।
తాతాజ్ఞాతిగసోదరైః సమమిమాం ఛిత్త్వా౾థ శాంతాత్పితుః
తేషాం జీవనయోగమాపిథ వరం మాతా చ తే౾దాద్వరాన్॥
3వ భావము:-
నారాయణమూర్తీ! 'పరశురాముని' రూపమున జన్మించిన నీవు - పదునాలుగు సంవత్సరముల ప్రాయముననే సకలవేదములను అభ్యసించితివి. గంధర్వరాజగు 'చిత్రరధుని'చూచి నీ తల్లి రేణుక మనసు చలించెను. అది గ్రహించిన నీ తండ్రి జమదగ్ని, ఆగ్రహావేశుడై నీ తల్లిని వధించమని మీ సోదరులను ఆజ్ఞాపించెను. నీ సోదరులు ఆ ఆజ్ఞను తిరస్కరించిరి. ప్రభూ! అప్పుడు నీవు (తండ్రి ఆజ్ఞను పరిపాలించి) తల్లిని, సోదరులను వధించితివి. శాంతించి - అనుగ్రహించిన నీ తండ్రి వరము వేడమనగా - నీ సోదరులను, తల్లిని తిరిగి బ్రతికించమని కోరి బ్రతికించుకొంటివి. నీ తల్లి నీ కప్పుడు వరములనిచ్చెను.

36-4-శ్లో.
పిత్రా మాతృముదేస్తవాహృత వియద్దేనోర్నిజాదాశ్రమాత్
ప్రస్థాయాథ భృగోర్గిరా హిమగిరావారాధ్య గౌరీపతిమ్।
లబ్ద్వా తత్పరశుం తదుక్తదనుజచ్చేదీ మహాస్త్రాదికం
ప్రాప్తో మిత్రమథాకృతవ్రణమునిం ప్రాప్యాగమస్స్వాశ్రమమ్॥
4వ భావము:-
'పరశురాముని' రూపమును ధరించిన నారాయణమూర్తీ! నీ తల్లిని ఆనందింపజేయుటకు నీ తండ్రి జమదగ్ని - స్తుతులతో మెప్పించి, కామధేనువును దేవలోకమునుండి తన ఆశ్రమమునకు తెచ్చెను. నీ తండ్రి మాటననుసరించి నీవు హిమాలయములకు వెళ్ళి 'గౌరీపతిని' ఆరాధించితివి. పరమశివుని నుండి 'పరశువును' ఆయుధముగా పొంది, ఆ పరమశివుడు చూపిన అసురునిని చంపితివి; ఇతర మహాస్త్రములను పొందితివి. 'ఆకృతవ్రణుడు' అను మునితో మిత్రుత్వమును పొందితివి; నీ తండ్రి ఆశ్రమమునకు తిరిగి వచ్చితివి.

36-5-శ్లో.
ఆఖేటోపగతో౾ర్జునః సురగవీసంప్రాప్తసంపద్గణైః।
త్వత్పిత్రా పరిపూజితః పురగతో దుర్మంత్రివాచా పునః।
గాం క్రేతుం సచివం న్యయుంక్త కుధియా తేనాపి రుంధన్ముని-
ప్రాణక్షేపసరోషగోహతచమూచక్రేణ వత్సో హృతః ॥
5వ భావము:-
'పరశురామావతారమును' ధరించిన నారాయణమూర్తీ! ఒకనాడు 'కార్తవీర్యార్జునుడు' వేటకై అడవికి వెళ్ళి, యాదృచ్ఛికముగా నీ తండ్రి ఆశ్రమమునకు వచ్చెను. నీ తండ్రి ఆ రాజునకు, అతని సైన్యమునకు - తనవద్దనున్న 'కామధేనవుచే' ప్రాప్తించిన సంపదతో (షడ్రశోపేత భోజనాదులతో) అతిధి సత్కార్యములు జరిపెను. కార్తవీర్యార్జునుడు తన నగరమునకు (మహీష్మతికి) తిరిగివెళ్ళెను. పిమ్మట, దుర్భుద్ధి కల మంత్రి మాటలతో 'ఆ కామధేనువుకు' ఆశపడెను. కావలిసినంత ధనము జమదగ్నికి ఇచ్చి ఆ కామధేనువును తీసుకురమ్మని అతనిని నియోగించెను. నీ తండ్రి అనుమతిలేకనే, ఆ దుర్భుర్ధిగల మంత్రి సైన్యము - ఆ కామధేనువును, ఆమె తనయ 'నందినిని' తోలుకొని పోసాగిరి. నీ తండ్రి అడ్డగించగా నీ తండ్రిని వారు వధించిరి. అప్పుడు ఆ కామధేనువు కోపించి, రోషముతో సైన్యమును సృష్టించి - ఆ కార్తవీర్యార్జునిని సైన్యమును పరిమార్చసాగెను. అప్పుడు ఆ సైనికులు గోవత్సమును (నందినిని) తోడ్కొని పారిపోయిరి.

36-6-శ్లో.
శుక్రోజ్జీవితతావాక్యచలితక్రోధో౾థ సఖ్యా సమం
బిభ్రద్ద్యాతమహోదరోపనిహితం చాపం కుఠారం శరాన్।
ఆరూఢస్సహవాహా యంతృకరథం మహిష్మతీమావిశన్
వాగ్భిర్వత్సమదాశుషి క్షితిపతౌ సంప్రాస్తుథాః సంగరమ్॥
6వ భావము:-
పరశురాముని రూపమున అవతరించిన నారాయణమూర్తీ! శుక్రాచార్యుడు నీ తండ్రి జమదగ్నిని పునర్జీవితుని చేసెను. నీ తండ్రి మాటలతో (జరిగిన వృత్తాంతము విని ) నీవు క్రోధావేశముతో చలించితివి; మహోదరుని (శివుని భృత్యుని) ధ్యానించి - పరశువును, బాణము అస్త్రములను ధరించితివి. నీ మిత్రుడు 'ఆకృతవ్రణుడు' తోడురాగా అశ్వములు పూనిన రధమునధిరోహించి మహీష్మతీపురమును చేరి, గోవత్సమును తిరిగి ఇమ్మని కార్తవీర్యార్జునితో పలికితివి. అందుకు ఆ మహారాజు అంగీకరించకపోవుటతో యుద్ధమును ప్రారంభించితివి.

36-7-శ్లో.
పుత్రాణామయుతేన సప్తదశభిశ్చాక్షౌహిణీభిర్మహా-
సేనానీబిరనేకమిత్ర నివహైర్వ్యాజృంభితాయోధనః।
సద్యస్త్వత్కకుఠారబాణవిదలన్నిశ్శేషసైన్యోత్కరో
భీతిప్రదృతనష్టశిష్టతనయాస్త్వామాపతద్దైహయః॥
7వ భావము:-
ప్రభూ! నారాయణమూర్తీ! పరశురామావతార రూపమున నీవు కార్తవీర్యార్జునునితో యుద్ధము ప్రారంభించితివి; ఆ హైహేయ రాజు తన పదివేలమంది పుత్రులతో, పదిహేడు అక్షౌహిణుల సైన్యములతో, మహాసేనాధిపతులతోను , అనేక మిత్రసమూహములతోను - యుద్ధరంగమున నీతో తలపడి విజృంభించెను. కొద్దిసమయముననే నీవు నీ పరశువుతోను, అస్త్రములతోను ఆ కార్తవీర్యార్జుని సేననంతనూ నిశ్శేషముగా హతమార్చితివి. మరణించగా మిగిలిన పుత్రులు పారిపోగా - కార్తవీర్యార్జునుడు స్వయముగా నీతో యుద్ధమునకు తలబడెను.

36-8-శ్లో.
లీలావారితనర్మదాజలవలల్లంకేశగర్వాపహ-
శ్రీమద్భాహుసహస్రముక్తబహుశస్త్రాస్త్రం నిరుంధన్నముమ్।
చక్రే త్వయథవైష్ణవ ౾పి విఫలే బుద్ద్వావహరిం త్వాం ముదా
ధ్యాయంతం ఛితసర్వదోషమవధీః సో-గాత్ పరం తే పదమ్॥
8వ భావము:-
పరశురామావతారము దాల్చిన నారాయణమూర్తీ ! నర్మదానదీ జలములను అడ్డగించి - లంకేశుడగు 'రావణుని' దర్పము అణచిన* ఆ కార్తవీర్యార్జునుడు- వేయి చేతులుతో వేసిన అస్త్రశస్త్రములు - ఎంతమాత్రమూ నీ పరాక్రమమును అడ్డగించలేకపోయెను; ఆ హైహేయరాజు నిన్ను పరాజితుని చేయలేకపోయెను; ఆ రాజు ప్రయోగించిన విష్ణుచక్రము సహితము విఫలమయ్యెను. తుదకు, ఆ కార్తవీర్యార్జునుడు నీవు సాక్షాత్తు "హరియే" అని గ్రహించి, సంతోషముగా నిన్ను ధ్యానించసాగెను. ప్రభూ! నీ అనుగ్రహముతో అతడు ఛిత సర్వదోషుడయ్యెను ( సర్వదోషములు ఖండించబడిన వాడు). అతని కోరిక మేరకు కార్తవీర్యార్జునుని మరణము నీ వలననే సంభవించి - తుదకు అతడు ముక్తిని పొందెను; వైకుంఠమును చేరెను. (* కార్తవీర్యార్జునుడు ఒకనాడు నర్మదానదిలో జలక్రీడలాడుచు తన వేయి హస్తములతో ఆ నదీప్రవాహమును అడ్డగించెను. అంతట ఆ నదీప్రవాహము వెనకకు మరలి ఉప్పొంగి 'రావణుడు' శివపూజ చేయుచున్న ప్రదేశమును ముంచివేసెను. దానికి కోపించి రావణుడు - కార్తవీర్యార్జునునితో యుద్ధమునకు తలపడెను; పరాజితుడయ్యెను).

36-9-శ్లో.
భూయో మర్షితహైహయాత్మజగణైస్తాతే హతే రేణుకాం
ఆఘ్ననాం హృదయం నిరీక్ష్య బహుశో ఘోరాం ప్రతిజ్ఞాం వహన్।
ధ్యానానీతరథాయుధస్త్వమకృథా విప్రద్రుహః క్షత్రియాన్
దిక్చక్రేషు కుఠారయన్ విశిఖయన్ నిః క్షత్రియాం మేదినీమ్॥
9వ భావము:-
'పరశురాముని' రూపమును ధరించిన నారాయణమూర్తీ! నీవట్లు కార్తవీర్యార్జునుని వధించగనే ఆ హైహేయరాజు పుత్రులు ఆగ్రహముతో నీ తండ్రి జమదగ్నిని చంపివేసిరి. నీ తల్లి రేణుక గుండెలు బాదుకొని విలపించసాగెను. అదిచూచి - నీవు( రోషముతో) ,క్షత్రియులను వధింతునని' ఘోరప్రతిజ్ఞ చేసితివి. ధ్యానముచేసి రధమును పొందితివి; ఆయుధములను ధరించితివి; విప్రద్రోహులగు క్షత్రియులందరిని నీ పరశువుతోను (గొడ్డలితో) బాణములతోను - హతమార్చితివి; భూమిపై క్షత్రియ క్షయము గావించితివి.

36-10-శ్లో.
 తాతోజ్జీవనకృన్నృపాలకకులం త్రిః సప్తకృత్వో జయన్
సంతర్ప్యాథ సమంతపంచకమహారక్తహ్రదౌఘే పితౄన్
యజ్ఞే క్ష్మామపి కాశ్యపాధిషు దిశన్ సాల్వేన యుధ్యన్ పున
కృష్ణో౾ముం నిహనిష్యతీతి శమితో యుద్ధాత్ కుమరైర్భవాన్॥
10వ భావము:-
'పరశురామావతారము ధరించిన నారాయణమూర్తీ! నీవు నీ తండ్రిని సజీవుడిని చేసితివి. క్షత్రియ సమూహములను ఇరువదియొక్కపర్యాయములు జయించితివి. శమంతకపంచకమున తొమ్మిది రక్తపు మడుగులలో నీ పిత్రుదేవతలకు తర్పణముగావించితివి. యజ్ఞముచేసి నీవు సంపాదించిన భూమిని కశ్యపాదులకు దానము చేసితివి. అనంతరము 'సాల్వునితో' యుద్ధము తలపెట్టితివి. సనత్కుమారులు మొదలగువారు - భవిష్యత్కాలములో 'సాల్వుని' - కృష్ణుడు సంహరింపగలడని తెలుపగా నీవు యుద్ధమును విరమించితివి.

36-11-శ్లో.
న్యస్యాస్త్రాణి మహేంద్ర భూభృతి తపస్తన్వన్ పునర్మజ్జితాం
గోకర్ణావధిసాగరేణ ధరణీం దృష్ట్వా౾ర్థితస్తాపసైః।
ధ్యాతేష్వాసథృతానలాస్త్రచకితం సింధుం స్రువక్షేపణా-
దుత్సార్యోద్ధృతకేరళో భృగుపతే। వాతేశ। సంరక్ష మామ్॥
11వ భావము:-
'పరశురామావతారము ధరించిన ఓ! నారాయణమూర్తీ! పిమ్మట నీవు అస్త్రములను, ఆయుధములను త్యజించితివి; సన్యసించి మహేంద్రగిరిపై తపస్సుజేసితివి. ఆ సమయమున గోకర్ణమువరకు గల భూమి సముద్రమున మునిగియుండెను. తాపసులు ఆ భూమిని ఉద్దరించమని నిన్ను ప్రార్ధించగా, నీవు నీ ధ్యానశక్తితో ధనువును, ఆగ్నేయాస్త్రమును పొందితివి. నీ ఆగ్నేయాస్త్రమునకు సముద్రుడు భీతిచెందెను. నీవప్పుడు 'స్రువమును'( యజ్నోపకరణమును) విసిరి - సముద్రుని వెళ్ళగొట్టి - కేరళను ఉద్ధరించితివి. భృగుపతీ! పరశురామా! గురవాయూరు పురాధీశా! నన్ను రక్షింపమని నిన్ను ప్రార్ధించుచున్నాను.

నవమస్కందం పరిపూర్ణం
36వ దశకము సమాప్తము.